Sun 24 Jul 00:01:02.141552 2022
Authorization
''ఒకపరి... ఒకపరి... వయ్యారమై, ముఖమున కళలెళ్ల మొలచీనట్లుండె'' ఇది అన్నమయ్య రాసిన కీర్తన. తాను ఎంతో భక్తితో, పరవశంతో, ఆరాధ్య దేవుని వయ్యారాన్ని, ముఖంలోని కళల మార్పులను, ఒక్కోసారి ఆయన ఎలా వుంటాడో పాడుకొంటున్నాడు అన్నమయ్య. మనందరికీ అన్నమయ్య తెలుసు. దాదాపు ముప్పయి రెండు వేల కీర్తనల్ని రాసాడు. వాటిల్లో భక్తిరస ప్రధానములైనవి, శృంగార భరితములైనవి, సామాజిక సంబంధమైనవీ అన్నీ కలగలసిన, వర్ణనలతో కూడినవెన్నో వున్నాయి. వాటిని మన బాలుగారు పాడితే మనము బాగా ఆదరించాము కూడా. శ్రీనివాసుడు ఇద్దరు ముద్దుల భార్యలతో సరసాలు ఆడటం, స్నానాలు చేయించటం, పడకగదిలో ఊయలలూపటం, గంధాల పరిమళాలనద్దిన సువాసనలన్నీ కవిత్వీకరించిన అన్నమయ్య కీర్తనల్లో తెలుగు పదగుంభన బహు ప్రౌఢమైనది. ''చిత్తడి, చిరు చెమటల చిందులు చిలికే, భామినులకు పన్నీటి స్నానం, ఘలంఘలన నడలవలన అలసిన నీ గగన జఘన సొగసులకు, నీ తహతహలకు, తపనలకు, తాకిళ్ళకు... నీ కొసరి కొసరి తాంబూలం, అంగరంగ భంగినులకు, సర్వాంగ చుంబనాల...'' అంటూ గానం చేశాడు. శృంగార వర్ణన కూడా భక్తిలో భాగమనే అనుకున్నారు ప్రజలు. మన అలవాట్లనీ, మోహాలనీ, రసాస్వాదనలనీ దేవుళ్లకు ఆపాదించి పాడుకోవటం, కావ్యీకరించటం, దాంతో ఆనందపరవశమొందటం సంప్రదాయకంగా వస్తున్నదే.
ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే! ఈ మధ్య సోషల్ మీడియాలో పైన పేర్కొన్న అన్నమయ్య కీర్తనకు, అభినయం జోడించి ఒక వీడియో వైరల్ అయింది. శ్రావణిభార్గవి అందులో సంప్రదాయకంగానే వయ్యారంగా ముఖంలో కళలను ప్రదర్శించింది. ఇక అంతే! అన్నమయ్య వంశస్థులు, భక్తులు కొందరు దేవునిపై కీర్తనకు అలా ఎలా వీడియో చేస్తారని, తొలగించమని విరుచుకుపడుతున్నారు. మనో భావాలు దెబ్బ తింటున్నాయని గగ్గోలు పెడుతున్నారు. అందులో అసలు అశ్లీల సమస్యే లేదు. అసలు నిజంగా అన్నమయ్య రాసిన శృంగార వర్ణనలకు పరిపోయే నటనతో వీడియో చేయనే లేదు. ఇంత దానికే మనోభావాలు దెబ్బతిన్నాయనే వాళ్లు, బయట ఎంత జరుగుతున్నా నోరు మెదపరు!
ఉదాహరణకు మొన్ననే నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థినులను పరీక్ష లోపలికి పంపించేందుకు, కేరళలోని ఒక కేంద్రం వద్ద లోదుస్తులు విప్పి గదిలో వేసి వెళ్ళమని, లేకుంటే పరీక్ష నాయనీయమని చెప్పడంతో, ఆడపిల్లలు అవమాన భారంతో కుంగి పోయి పరీక్ష రాసారు. కేరళ విద్యామంత్రి కేంద్రానికి ఫిర్యాదు చేయడంతో వార్త దేశం ముందుకొచ్చింది. ఇలాంటి సంఘటనలు ఇంతక్రితమూ అమ్మాయిలకు జరిగాయి.
అమ్మాయిలకు జరిగిన ఈ అవమానంపై ఈ మనోభావాల రక్షకులు మాట్లాడరు. స్పందించరు. వివక్షతల మీదా గొంతులు పెకలవు. ఇక మొన్ననే గుజరాత్ పాఠశాలలో దళిత గిరిజన విద్యార్థులను భోజన సమయంలో అందరితో సమానంగా కూర్చోనీయకుండా వేరే కూర్చోపెట్టిన సంఘటనా సోషల్ మీడియాలో వచ్చినప్పటికీ మనుషుల్ని కులం ఆధారంగా వివిక్షతతో చూడటాన్ని ఈ రక్షకులు ఖండించరు. కులమతాలు లేవని, అందరు సమానమని పాడుకున్న అన్నమయ్య పాటలోని భావాలను ఆకళింపు చేసుకునే ప్రయత్నం మాత్రం చాలా మటుకు చేయరు. సామాజికులంగా మనం దేనిపైన స్పందించాలో దేన్ని వ్యతిరేకించాలో స్పష్టంగా అవగాహన చేసుకోవాల్సి వుంది. అనవసరమైన వాటిపై రాద్ధాంతాలు చేస్తూ, అవసరమైన వాటి పట్ల ఉదాసీనంగా వ్యవహరించటం తగదు. ప్రతిస్పందనల్లోని ఈ ఆలోచనా ధోరణులను గమనిస్తే మనం ఎంత చైతన్యం కలిగి వున్నామో అర్థమవుతుంది. మనోభావాలు దెబ్బతింటున్నాయని అనే వాళ్ళకు మానవీయతనే దెబ్బ తీసే ఘటనలు పట్టవు.