నా పేరు హైదరాబాద్ శతాబ్దాల ఘనచరిత నాది... విశ్వనగర స్థాయి నాది.... ఎందరో నిరుపేదలకు వలసపక్షులకు ఆశ్రయమిచ్చిన కల్పవృక్షాన్ని.
నా మొర ఆలకించకుండా చెరువులు, కుంటలు ఆక్రమించి ఆకాశహర్మ్యాలు నిర్మించేశారు.... ఈ కాంక్రీట్ జంగిల్స్ మోగించిన డేంజర్ బెల్స్తో నాకు నిద్ర కరువైయింది....
నా ఇలాకాలో ఈ రోజు వర్షం పడింది. ఉరుకుల పరుగుల జనసమూహాలను కొంత తడవు నిలవమనీ, నిలిచి పరిసరాలను పరికించమనీ, దడ దడ కురిసిన వర్షంతో కాలనీలు మునిగాయి... ఇళ్లలోకి నీరు చేరింది...
రెండేళ్ల క్రితం ఓ కాళ రాత్రి కురిసిన వర్షానికి వాహనాలు పడవలు కాగా ఆకాశహర్మ్యాలు అందాల కొలనులుగా మారిన సంఘటన నుంచి ఇంకా గుణపాఠం నేర్చుకోలేదు, నాకు రక్షణ కల్పించే ప్రయత్నం చేయలేదు. తప్పెవరిది చెప్పండి! బాధ్యత మరిచిన పౌరులదా...? ప్రణాళికలు లేని ప్రభుత్వాలదా...? చిత్తశుద్ధిలేని అధికారులదా...?