Sun 14 Aug 00:24:13.647318 2022
Authorization
ఈ దేశంలో నిరక్షరాస్యత వుంది. ఆకలి, దారిద్య్రం వుంది.. గూడు లేని వాళ్లూ కోకొల్లలు. చేయటానికి పని దొరకక తినడానికి తిండి లేక కునారిల్లుతున్న జనం కోట్ల సంఖ్యలో ఇప్పటికీ వున్నారు. ఇంకో వైపు కోట్ల రూపాయల ఆస్తులు పోగేసుకుంటున్నవాళ్లు మరింత కుబేరులుగా రూపెత్తుతున్నారు. ఇదీ నేటి స్వాతంత్య్ర ఫలంగా వుంది. అంతేకాకుండా హక్కుల కోసం, సమస్యలు పరిష్కరించాలని కోరితే, గళమెత్తితే అనేక రీతులూ నిర్బంధాలు, అణచివేతలు కొనసాగుతున్నాయి. హక్కులు, స్వేచ్ఛ అన్నీ కాగితంపై రాతలుగానే మిగిలిపోతున్నాయి. ప్రశ్నించిన గొంతులన్నీ నేడు జైళ్లలో మగ్గుతున్నాయి. లక్షలాది, హక్కుల గళమెత్తిన కంఠాలు నిర్బంధించబడి వున్నాయి.
ఉత్సవం అంటే సంబురం చేసుకోవడం, కోరికలు నెరవేరిన సందర్భంగా సంతోషాలను పంచుకోవడం. ఆనందం కలిగితే, అంతకంటె పండుగ మరేమి వుంది! ఉత్సవం అనగానే సమూహ దృశ్యం కళ్ల ముందుకొస్తుంది. ఏ సంతోషానికైనా, సంబరానికైనా ప్రయోజనపూరిత కారణాలుంటాయి. అవి మిక్కిలి ఎక్కువగా వుంటే ఉత్సవమై వెల్లువెత్తుతుంది. రెండు వందల యేండ్లు మన దేశాన్ని పరిపాలించిన ఆంగ్లేయులు, మన సంపదను, శ్రమనూ దోచుకుని అనేక కష్టాలకు గురిచేశారు. వారికి వ్యతిరేకంగా స్వాతంత్య్రం కోసం ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి పోరాడి సాధించుకున్నదే ఈ స్వాతంత్య్రం. మనల్ని మనం, స్వేచ్ఛగా గాలి పీలిస్తూ పరిపాలించుకుంటూ సాగిన కాలం డెబ్బయి అయిదేండ్లు. ఈ 75 ఏండ్లు పూర్తి అవుతున్న సందర్భంగా జాతీయోద్యమ స్ఫూర్తిని స్మరించుకుంటూ అమృతోత్సవాలను జరుపుకుంటున్నాము. ఈ ఉత్సవాల సందర్భంగా నే మన భావి తరాల వారికి మన స్వాతంత్య్ర ప్రాధాన్యతనూ, ఆనాటి ఉద్యమ వీరుల త్యాగధనుల చరితనూ అందించాల్సి వుంది.
మనల్ని మనమే పాలించుకుని, అభివృద్ధి చేసుకోగలిగే అవకాశం స్వాతంత్య్రం వల్ల మనకొచ్చింది. ఇపుడు మనకు మనమే పాలించుకుంటున్నాం. అభివృద్ధి జరుగుతూ వుంది. కానీ వాటి ఫలాలు ప్రజలందరికీ అందుతున్నాయా? అని ప్రశ్న వేసుకుంటే లేదనే జవాబు వస్తుంది. పోనీ అంబేద్కర్ మహాశయుని ఆధ్వర్యంలో లిఖించుకున్న రాజ్యాంగంలోని హక్కులు, ఆశయాలు నెరవేరుతున్నాయా? అన్నదానికీ ప్రతికూల సమాధానమే వస్తుంది. సమాజంలో సగం మందిగా వున్న మహిళలు, పురుషులతో సమానంగా వున్నారా? మహాత్ముడన్నట్లు 'అర్థరాత్రి ఒంటరిగా స్త్రీ తిరగగలిగిన నాడే నిజమైన స్వాతంత్య్రం', ఇప్పుడున్నదా? దీనికీ కాదనే స్పష్టంగా చెప్పవచ్చు. సామాజిక వివక్షతకు, తరతరాలుగా గురవుతున్న దళితులు, ఆదివాసీలు, అణగారిన వర్గాల పట్ల వివక్షత తొలిగిందా? లేనే లేదు. ఇవన్నీ జరగలేదంటే, ఏమీ జరగలేదా? జరిగింది. అంతో ఇంతో ముందడుగు పడింది. అభివృద్ధి అంతా ఒక వైపు, దారిద్య్రం, బాధలు, వివక్షతలు, అణచివేత మరో వైపు. ఇలా రెండు దేశాలు ఆవిష్కృతమయ్యాయి. ఇంకా ఈ దేశంలో నిరక్షరాస్యత వుంది. ఆకలి, దారిద్య్రం వుంది.. గూడు లేని వాళ్లూ కోకొల్లలు. చేయటానికి పని దొరకక తినడానికి తిండి లేక కునారిల్లుతున్న జనం కోట్ల సంఖ్యలో ఇప్పటికీ వున్నారు. ఇంకో వైపు కోట్ల రూపాయల ఆస్తులు పోగేసుకుంటున్నవాళ్లు మరింత కుబేరులుగా రూపెత్తుతున్నారు. ఇదీ నేటి స్వాతంత్య్ర ఫలంగా వుంది. అంతేకాకుండా హక్కుల కోసం, సమస్యలు పరిష్కరించాలని కోరితే, గళమెత్తితే అనేక రీతులూ నిర్బంధాలు, అణచివేతలు కొనసాగుతున్నాయి. హక్కులు, స్వేచ్ఛ అన్నీ కాగితంపై రాతలుగానే మిగిలిపోతున్నాయి. ప్రశ్నించిన గొంతులన్నీ నేడు జైళ్లలో మగ్గుతున్నాయి. లక్షలాది, హక్కుల గళమెత్తిన కంఠాలు నిర్బంధించబడి వున్నాయి.
ఇవిగాక, జాతి జాతంతా ఏకమై ఒక్కతాటిపై ఉద్యమాన్ని నడిపి స్వాతంత్య్రాన్ని సంపాదిస్తే, నేడు కులం, మతం పేరుతో విబేధాలు, విభజనలు సృష్టించి ఐక్యతను దెబ్బతీస్తున్నారు. ఇక మతానికి ఇంకో మతాన్ని ప్రతిగా నిలబెట్టి వైషమ్యాలను పెంచి పోషిస్తున్నారు. ఈ 75 యేండ్ల స్వాతంత్య్రం తర్వాత హక్కులూ లేక, అన్నమూ లేక అక్షరమూ దరిచేరక ఆందోళన చెందుతున్న అశేష ప్రజానీకపు అలజడి ఉత్సవాల్లో పడి కనుమరుగవుతుందా! పండుగ వాతావరణం నేటి రైతుకుందా? కార్మిక సోదరులు సంతోషంతో మునిగి వున్నారా? యువత, భవితపై బెంగ లేకుండా వున్నారా? ఇవన్నీ జరిగిన నాడు ఉత్సవానికి నిజమైన అర్థం వస్తుంది. స్వాతంత్య్రోద్యమ త్యాగధనులు ఆశించిన లక్ష్యమూ నెరవేరుతుంది. అందుకు కృషి చేయడమే నేటి మన కర్తవ్యం. ఏ ఉత్సవాలకైనా సార్థకత.