Sun 21 Aug 00:05:40.3026 2022
Authorization
మన దేశంలో కులం మరింత దుర్మార్గంగా తన ప్రభావాన్ని చూపిస్తోంది. కుండలోనూ, తిండిలోనూ, బట్టలోనూ, మాటలోనూ, మనసులోనూ, మనువులోనూ కులం విశ్వరూపం చూపిస్తోంది. చదువు పెరిగిందని, బతుకులు మారాయని, వసతులు కలిగాయని, ఆదాయాలు పెరిగాయని ఎన్ని అంకెలు కాగితాలపై పరచుకుంటున్నా, అసలు అణచివేత, వివక్షత యథావిధిగానే వున్నది. ఇది మన జాతిని పట్టి పీడిస్తున్న చీడ. చదువుతో జ్ఞానం పెరుగుతుందని అనుకున్నాం కానీ కులం మాత్రం వెంటాడుతూనే వుంది. ఇప్పుడు కులపు కత్తి హత్య చేసింది ఒక విద్యా కేంద్రంలోనే. ఇదీ నేటి విషాద సందర్భం. 75 ఏండ్లలో దేశపు రూపురేఖలు మారొచ్చు. వికృత పూరితమైన కుల మనస్సు మారనే లేదు. హింసాధ్వంసంకాలేదు. మరింత పెరుగుతోంది.
మొన్ననే మనమంతా ఎంతో ఆడంబరంగా 75 ఏండ్లు నిండిన స్వాతంత్య్రం సందర్భంగా ఉత్సవాలు జరుపుకున్నాం. స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో పోరాటంలో పాల్గొని త్యాగాలు చేసిన నేతలను స్మరించుకున్నాం. ఎందుకు స్వాతంత్య్రం కావాలని ఆనాడు పోరాడామో, ఆ ఆశలు, ఆశయాలు ఎంత వరకు సాధించామో కూడా సమీక్ష చేసుకోవటం జరిగింది. మనం పేరుకు స్వేచ్ఛను పొందామనుకుంటున్నాం కాని, స్వేచ్ఛ లేని జనం, మన సమాజంలో కొందరి చేత ఊసడించబడుతున్న, వివక్షతలకు గురవుతున్న జనం చాలా మందే వున్నారు. తెల్ల దొరతనం పోయి, నల్ల దొరతనం వచ్చినట్లే కనిపిస్తున్నది. ఆనాడు స్వరాజ్య ఉద్యమంలోనూ స్వాతంత్య్రం వస్తే మా బతుకులు ఏమయినా మారుతాయా? అని ప్రశ్నించిన వాళ్లు కూడా వున్నారు. నిజంగానే తెల్లవాళ్లు వెళ్లిపోయారు కానీ, మన సమాజంలో వున్న అణచివేత మాత్రం 75 ఏండ్ల తరువాత కూడా కొనసాగుతూనే వున్నది.
దీనికి ఉదాహరణగా రాజస్థాన్ రాష్ట్రంలో ఒక పాఠశాలలో తొమ్మిది ఏండ్ల బాలుడిని కొట్టి చంపిన ఉదంతం నిలుస్తుంది. పాఠశాలలో దాహమేస్తున్న ఇందర్ మఘ్వాల్ అనే దళిత విద్యార్థి మంచినీళ్ళ కుండలోంచి నీళ్లు తీసుకుని తాగాడు. ఒక దళితుడు తమ మంచినీళ్ల కుండలోంచి నీళ్లు తీసుకుని తాగాడని అక్కడి ఉపాధ్యాయుడికి కోపం వచ్చి పిల్లోన్ని తీవ్రంగా కొట్టడంతో 20 రోజులు మృత్యువుతో పోరాడి ఇంద్రుడు మరణించాడు. ఇది ఆ ఒక్క ఉపాధ్యాయుడి క్రూరత్వమే కాదు. ఇది సమాజంలో తరతరాలుగా పేరుకుపోయిన క్రూరత్వం. అగ్రకులాల అహంకారాలు అణచివేతలు ఎంత అమానవీయంగా వుంటాయో అనేక ఉదంతాలున్నాయి. దళితుడు గుర్రమెక్కాడని కొట్టి చంపారు. దళితుడు బీఫ్ తిన్నాడని దాడి చేసి చంపారు. చెరువులో నీళ్లు తోడినందుకు, రాలిన మామిడి పళ్ళని ఏరుకున్నందుకు, ప్రేమించి పెండ్లి చేసుకున్నందుకు, మీసాలు పెంచినందుకు ఇలా ఎన్నో కారణాలతో ఇప్పటికీ దళితులపై పాశవికంగా దాడులు జరుగుతూనే వున్నవి.
మన దేశంలో కులం మరింత దుర్మార్గంగా తన ప్రభావాన్ని చూపిస్తోంది. కుండలోనూ, తిండిలోనూ, బట్టలోనూ, మాటలోనూ, మనసులోనూ, మనువులోనూ కులం విశ్వరూపం చూపిస్తోంది. చదువు పెరిగిందని, బతుకులు మారాయని, వసతులు కలిగాయని, ఆదాయాలు పెరిగాయని ఎన్ని అంకెలు కాగితాలపై పరచుకుంటున్నా, అసలు అణచివేత, వివక్షత యథావిధిగానే వున్నది. ఇది మన జాతిని పట్టి పీడిస్తున్న చీడ. చదువుతో జ్ఞానం పెరుగుతుందని అనుకున్నాం కానీ కులం మాత్రం వెంటాడుతూనే వుంది. ఇప్పుడు కులపు కత్తి హత్య చేసింది ఒక విద్యా కేంద్రంలోనే. ఇదీ నేటి విషాద సందర్భం. 75 ఏండ్లలో దేశపు రూపురేఖలు మారొచ్చు. వికృత పూరితమైన కుల మనస్సు మారనే లేదు. హింసాధ్వంసంకాలేదు. మరింత పెరుగుతోంది. లోకం పోకడ, సమాజంలోని బేధాలు, కుళ్లు కుతంత్రాలు ఏమీ తెలియని తొమ్మిదేళ్ల పసి బాల్యం, కులం కారణంగా అసువులు బాయటం, వజ్రోత్సవాలను కన్నీళ్లమయం చేస్తోంది. అవమానంతో దేశం తలదించుకునేలా చేసింది.
సామాజిక సమానతను, న్యాయాన్ని సాధించలేని స్వాతంత్య్రం వుండి ఫలమేమిటి? ఆత్మాభిమానాలను కాపాడలేని స్వేచ్ఛ, స్వేచ్ఛ ఎలా అవుతుంది! ఈ దుర్మార్గాలను నిర్మూలించటానికి ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు ఏమైనా వున్నాయా! అని పరిశీలిస్తే, వీటికి మరింత ఆజ్యం పోసేట్టు వ్యవహరించటం తప్ప మనకేమీ కనపడదు. చాతుర్వర్ణ వ్యవస్తను సమర్థిస్తూ, మత మౌఢ్యాన్ని ప్రోత్సహిస్తున్న పాలకవర్గాలు, కుల అంతరాలను అధికారిక వ్యవస్తలా మార్చేస్తున్నారు. అగ్రకుల దురహంకారాలను ప్రోత్సహిస్తూ వివక్షత సహజమైనదిగా సెలవిస్తున్నారు. ఇది అత్యంత బాధాకరమైన విషయం. మన సమాజంలో ఇలాంటి ధోరణులు పెరిగిపోతున్న తరుణంలో వివక్షతలపై, వాటిని బలపరుస్తున్న భావజాలంపై యుద్ధం చేయాల్సిన అవసరం పెరిగింది. స్వాతంత్య్రోత్సవాలు అందుకు ప్రతిజ్ఞ పూనాలి.