Sat 10 Sep 22:24:52.574758 2022
Authorization
అదుపు, అజమాయిషి, ఆధిపత్యం, వెక్కిరింత, ఎత్తిపొడుపు, తిట్లు, దూషణ, దండన మొదలైనవన్నీ రాజ్యము ప్రజలపై ఏ విధంగా ప్రయోగిస్తుందో తల్లిదండ్రుల మనకునే మనమూ, ఒడిలో గురువులనుకునే వాళ్లు, పెద్దలైన వాళ్లు- పిల్లలపై ప్రయోగిస్తూనే వున్నారు. నిజంగా ఎంత నరకం అనుభవిస్తుంటారో కొందరు పిల్లలు! మనం అనుభవించిన అన్ని రకాల ఇబ్బందులను, నిర్బంధాలను, శిక్షలను పిల్లలపై ప్రయోగిస్తుంటాము. ఇది రాజ్యము నుంచి సంక్రమించే సంప్రదాయము. దీనిని గమనించి నడుచుకోవటం, మార్చుకోవటం మనముందు వున్న కర్తవ్యం.
పిల్లలు, పాపలు, చిన్నారులు, పిల్లకాయలు, బుడుతలు, చంటోళ్లు, బచ్చేగాళ్లు, ఇంకా అనేకరకాలుగా చిన్న పిల్లల్ని పిలుస్తుంటాం. ఆ పిలుపుల్లో కొంత తేలిక భావమూ, చులకనా, చిన్న చూపు గోచరిస్తూ వుంటుంది. చిన్నోళ్లకు ఏమీ తెలియదనే దృఢ నిశ్చయమూ పెద్దవాళ్లకుంటుంది. నిజంగానే పెద్ద వాళ్లకు తెలిసిన అనేక కుళ్లు, కుతంత్రాలు, దురాలోచనలు, తరతమ బేధాలు, చెడులు, మోసాలు, వేషాలు, ద్వేషాలు పిల్లలకు తెలవవు. అవన్నీ తెలియవు కాబట్టే వాళ్లు స్వచ్ఛంగా వుంటారు. అయితే ఏమీ తెలియదని అనుకోవటం సరికాదు. తనను ప్రేమించేది, చేరదీసేది, సేవ చేసేది, ఆదరించేది ఎవరనే విషయం మాటలు రాని పసిపాపకూ తెలుసు. నవ్వు తెలుసు. ఏడుపు తెలుసు. దు:ఖం తెలుసు. కన్నీళ్లు తెలుసు. ఫక్కున నవ్వడం తెలుసు. మనం నవ్వకపోయినా నవ్వుతూ పలకరించడమూ తెలుసు. వెలుగు తెలుసు. చీకటి తెలుసు. అలుపు తెలుసు. ఆకలి తెలుసు. పాట తెలుసు. గొంతెవరిదో తెలుసు. రాగం తెలుసు. రాగానికి ప్రతిస్పందించటమూ తెలుసు. అమ్మ తెలుసు, అమ్మ కోసం వెతుకులాట తెలుసు. అమ్మ స్పర్శ, అమ్మ ఒడి కమ్మదనమూ తెలుసు. కోపం తెలుసు, భయమూ తెలుసు. తెలుసుకోవాల్సినవి చాలా వున్నా ఏమీ తెలియకుండా వాళ్లుండరు.
ఇవన్నీ మీకు తెలిసినా మరో మారు గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే పిల్లల్ని మరో మారు మన మునపటి భావాలను తీసేసుకుని చూడాలని. పిల్లలంటే తేలికగా తీసుకోవద్దని, భావి తరాల చివురు చూపులలోని తేజస్సును మరింత స్పష్టంగా ఇష్టంగా దర్శించండని చెబుతున్నాను. ఎందుకంటే స్వచ్ఛమైన గాలిగల వాతావరణంలోకి వెళితే మనం ఎంత ఆరోగ్యం పొందుతామో, పిల్లలతో మాట్లాడినా, గడిపినా, చూసినా మన మనస్సు అంతే ఆరోగ్యాన్ని పొందుతుందని నా అభిప్రాయం. పెద్దలు చాలా వరకు ఫిక్స్ అయిపోయిన పనుల్లో, ఆలోచనల్లో, అభిప్రాయాల్లో మునిగి పోయి వుంటారు. పిల్లలు నిత్యనూతనావిష్కర్తలు. ఆ నవ్వులు వేలవేల విద్యుత్ దీపాలకాంతి కన్నా మహోన్నత తేజస్సును అందిస్తాయి. అతిశయోక్తిగా చెబుతున్న విషయాలు కావివి. మీరు రోజులో ఒకసారైనా పిల్లలతో మాట్లాడండి లేదా గడపండి. ఆడండి వారితో, పాడండి కాసేపు. మీ బాల్యంలోకి మీరే వెళతారు.
పిల్లల్ని మేము పెంచుతున్నాము. విద్యాబుద్ధులు నేర్పుతున్నాము అనే బలమైన అభిప్రాయం మనకుంటుంది. పిల్లలు వాళ్లే పెరుగుతారు. మనం కేవలం సహకరిస్తాం అంతే. పెద్దలే అన్నీ నేర్పుతారనే భ్రమ కూడా మనకుంటుంది. కానీ పిల్లల నుంచి నేర్చుకునేది ఎంతో వుంటుంది. మనం ఆ వైపుగా అసలు దృష్టే పెట్టము. కొత్త ప్రపంచాన్ని గురించి ఎన్ని కలలు కంటుంటాం మనం. మనముందన బోసి నవ్వులు వొలికిస్తున్న ఆ చిన్నారులే కొత్త ప్రపంచమని అనుకోము. అనేకానేక విషయాల పట్ల సమగ్ర అవగాహన, దృష్టి కోణం లేని విధంగానే పిల్లలపై కూడా పూర్తి అవగాహన వారిని చేసే సమగ్ర చూపు మనకవడలేదు. అందుకే బిడ్డల గురించిన శిక్షణ ఎలా వుండాలో చలం నెత్తీనోరు కొట్టుకుని చెప్పాడు. ఎంతమంది పట్టించుకున్నారు!
అదుపు, అజమాయిషి, ఆధిపత్యం, వెక్కిరింత, ఎత్తిపొడుపు, తిట్లు, దూషణ, దండన మొదలైనవన్నీ రాజ్యము ప్రజలపై ఏ విధంగా ప్రయోగిస్తుందో తల్లిదండ్రుల మనకునే మనమూ, ఒడిలో గురువులనుకునే వాళ్లు, పెద్దలైన వాళ్లు- పిల్లలపై ప్రయోగిస్తూనే వున్నారు. నిజంగా ఎంత నరకం అనుభవిస్తుంటారో కొందరు పిల్లలు! మనం అనుభవించిన అన్ని రకాల ఇబ్బందులను, నిర్బంధాలను, శిక్షలను పిల్లలపై ప్రయోగిస్తుంటాము. ఇది రాజ్యము నుంచి సంక్రమించే సంప్రదాయము. దీనిని గమనించి నడుచుకోవటం, మార్చుకోవటం మనముందు వున్న కర్తవ్యం.
ప్రేమకు, ఆప్యాయతకు, స్వచ్ఛమైన మానవీయ స్పర్శకు రూపాలైన పిల్లల ప్రాధాన్యతను ఎరిగి వారి పట్ల ప్రేమ పూర్వకమైన సంబంధాన్ని, సంభాషణను సాగించాలి. వారి చేతలకు, మాటలకు ప్రాముఖ్యతనివ్వాలి. పెద్దలలో వున్న జ్ఞానాన్ని, సమాచారాన్ని, తెలివిని ఒకేసారి వారిపై కుమ్మరించాలనే ప్రయత్నం చేయకూడదు. తరానికి తరానికి మధ్య వున్న అంతరాన్ని అర్థం చేసుకోవాలి. పిల్లల అభిప్రాయాలను గౌరవించాలి. ఎంత వీలుంటే అంత ప్రేమను పంచండి. తిరిగి ప్రేమను వాళ్లే పంచుతారు. పిల్లలతో మాట్లాడండి, మీకు పునర్జీవన శక్తి పుష్కలంగా లభిస్తుంది.