Sun 25 Sep 00:23:50.055393 2022
Authorization
చట్టాలు, కోర్టులు, న్యాయాలు మొదలైనవన్నీ ప్రజలందరికీ సంబంధించిన వైనపుడు ప్రజా భాషను ఎందుకు వాడరు? ఇది ఎప్పటి నుండో వున్న సమస్య. ఇపుడేమో ప్రపంచీకరణ వచ్చాక బతుకుతెరువు గ్లోబల్ అయిపోయాక ఆంగ్లభాష ప్రపంచ ప్రజలందరికీ మాధ్యమంగా మారిపోయింది. నేటి యువత బతుకుతెరువు భాషగా ఆంగ్లమే చెలామణి అవుతోంది. ఇదొక అనివార్యపు పరిస్థితి. అయితే ప్రపంచీకరణలో ఉపాధి వెతుకులాట గ్లోబల్గా మారినా అసలు దాని లక్ష్యం అన్ని ప్రాంతాలను అన్ని దేశాలను వ్యాపార లాభాల కేంద్రంగా మార్చుకోవటమే, దోచుకోవటమే. ఈ దోచుకోవటంలో సాంస్కృతిక ఉనికిని కూడా కోల్పోతున్నాము. భాష, సంస్కృతి, మానవ సంబంధాలు కోల్పోవడమంటే మానవీయ ఉనికినే కోల్పోవటం. అందుకనే ప్రాంతీయ సాంస్కృతిక అస్తిత్వ వేదన ఒక వైపు పెరిగింది.
'అన్య భాషలు నేర్చి ఆంధ్రమ్ము రాదంచు, సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా!'' అని మన తెలంగాణ జన గొంతుక కాళోజీ నారాయణ రావు చాలా నిష్టూరంగానే తిట్టిపోశాడు. గురజాడ అప్పారావు గారు తెలుగు భాషను ప్రజాస్వామ్యీకరించే ప్రయత్నం చేశారు. గిడుగు రామ్మూర్తి పంతులుగారు వ్యవహారికి భాషోద్యమానికే నాయకత్వం వహించారు. ఈ నెలలోనే ఈ ముగ్గురినీ వారి జయంతుల సందర్భంగా స్మరించుకున్నాము కూడా. స్మరించుకోవడమే ప్రతిసారీ చేస్తున్నాము. చేయాల్సింది అనసరించడమూ, కొనసాగించడము. నేడు భాషా సమస్య దేశ వ్యాపితంగానే ఒక చర్చనీయాంశంగా మారింది. హిందీ భాషను తప్పనిసరి చేసే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఒక భాషను నేర్చుకోమని, ప్రజలకు తెలిసి ఉండాలని కోరుకోవడం తప్పుకాదు. కానీ దాని వెనకాల వున్న ఆధిపత్య రాజకీయ వ్యూహాలు చాలా ప్రమాదకరంగా వున్నాయి.
ఈ సందర్భంలోనే ఇటీవల కర్ణాటక రాష్ట్ర మంత్రి మండలి ఒక కీలక నిర్ణయం చేసింది. రాష్ట్ర పరిపాలనలో అన్ని దశల్లోనూ కన్నడ భాషను తప్పనిసరి చేయాలని తీర్మానం చేసింది. భాషా పర్యవేక్షక అధారిటీని కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలియ వచ్చింది. జిల్లా స్థాయిలో కలెక్టర్లు అధ్యక్షతన ఇది కొనసాగుంతుందని, అమలులో లోపాలు జరిగితే శిక్షలు విధించడమూ, జైలుకు పంపడమూ ఉండే విధంగా చట్టం తేనున్నట్లు తెలిసింది. ఇదొక ప్రయత్నం. ప్రభుత్వాలు, రాజ్యాలు భాషా సాహిత్యాలను తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం సర్వసాధారణ విషయం. కాని భాష ప్రజల మధ్య వారధి. అదొక అనుసంధానకర్త. ప్రజలు ప్రజలకు సేవ చేస్తున్నామని చెప్పుకునే ప్రభుత్వాలు మాత్రం ప్రజల భాషలో పరిపాలనా విషయాలను ఉంచాలన్న కనీస ప్రజాస్వామిక దృక్పథం కలిగి వుండవు. ఎందుకంటే ఆ ప్రభుత్వాలు ప్రజల కోసం పని చేస్తున్నామంటూ అంటారు తప్ప, వాస్తవికంగా వారి కోసం పనిచేయరు.
చట్టాలు, కోర్టులు, న్యాయాలు మొదలైనవన్నీ ప్రజలందరికీ సంబంధించిన వైనపుడు ప్రజా భాషను ఎందుకు వాడరు? ఇది ఎప్పటి నుండో వున్న సమస్య. ఇపుడేమో ప్రపంచీకరణ వచ్చాక బతుకుతెరువు గ్లోబల్ అయిపోయాక ఆంగ్లభాష ప్రపంచ ప్రజలందరికీ మాధ్యమంగా మారిపోయింది. నేటి యువత బతుకుతెరువు భాషగా ఆంగ్లమే చెలామణి అవుతోంది. ఇదొక అనివార్యపు పరిస్థితి. అయితే ప్రపంచీకరణలో ఉపాధి వెతుకులాట గ్లోబల్గా మారినా అసలు దాని లక్ష్యం అన్ని ప్రాంతాలను అన్ని దేశాలను వ్యాపార లాభాల కేంద్రంగా మార్చుకోవటమే, దోచుకోవటమే. ఈ దోచుకోవటంలో సాంస్కృతిక ఉనికిని కూడా కోల్పోతున్నాము. భాష, సంస్కృతి, మానవ సంబంధాలు కోల్పోవడమంటే మానవీయ ఉనికినే కోల్పోవటం. అందుకనే ప్రాంతీయ సాంస్కృతిక అస్తిత్వ వేదన ఒక వైపు పెరిగింది. అంతేకాక మన దేశంలోని సామాజిక విలక్షణత ఏమంటే, బహుళత్వం, భిన్న సంస్కృతుల సమ్మేళనంగా వుండటం. అనేక భాషా సమూహాల సమాహారంగా కొనసాగటం. దీన్ని రక్షించుకుంటూనే ఆధునిక అవసరాలకనుగుణంగా భాషాభివృద్ధికి కృషి చేయాలి.
తెలంగాణ రాష్ట్రంలో కూడా సాంస్కృతిక ప్రత్యేకతల ఆత్మాభిమానాల పేరుతో ఉద్యమం జరిగినప్పటికీ ఇంకా ఇప్పటికీ ప్రజల భాషలో పరిపాలన అందించే దిశగా అడుగులు పడలేదు. విద్యావ్యవస్థలోనూ అన్ని విషయాలనూ తెలుగు భాషలో నేర్చుకునే విధంగా తీర్చిదిద్దుకోవడమూ ఆరంభమవలేదు. ప్రజాస్వామ్యానికి ప్రజల భాషలో పరిపాలన ప్రాథమిక షరతు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో చేస్తున్న ప్రయత్నాలలాగా ఇక్కడ కూడా జరగాలి. అయితే రాష్ట్రాల అస్తిత్వాలను తుడిచేసే విధంగా భాషాస్వామ్యం అమలు చేయటానికి కేంద్రం ప్రయత్నించటాన్ని ప్రజలందరూ కలిసి ప్రతిఘటించాలి.