Sun 25 Sep 01:00:34.900638 2022
Authorization
బిజీబిజీ వడివడి నడకలు
గజీబిజి తడబడు పరుగుల మధ్య
కావలసిన సూర్యుడి కోసం
తెలుసుకోవాల్సిన చందమామ కోసం
అవగతం చేసుకోవాల్సిన అంతరిక్ష విన్యాసం కోసం
తిరిగి వెళ్లాల్సిన పూర్వీకుల ప్రపంచం కోసం
పర్యటించాల్సిన మానవ పరిణామ ప్రస్థానం కోసం
అన్వేషించాల్సిన రివాజుల కోసం
పెంచుకోవలసిన పారమార్థిక దర్శనం కోసం
సప్రయత్నంగా నిన్ను వెతుకుతూ
అప్రయత్నంగా నిన్ను చూస్తాను!
అడ్డంగా విస్తరించి నిలువుగా ఎదిగిన
పుస్తకాల దొంతరలలోంచి
నాకు కావాల్సిన అక్షరాన్ని నేను వెతుక్కుంటాను..!
అరుపులు కేకల సవ్వడులు
డప్పు - తపేలా - డీజే చప్పుళ్ళ నడుమ
ప్రేమపూర్వకంగా వెతుకులాడుతూ
అప్రమేయంగా నిన్ను కనుక్కుంటాను !
ఆదిమ ఆలోచనలతో
అనాది కాలంగా నేను ఎదురుచూస్తున్న వాక్యాన్ని
కోట్లాదిగా పొర్లుతున్న పదాల నడుమ
నేను పట్టుకుంటాను..!
నా కళ్ళు మెరుస్తాయి
నా పాదాలు నీ దిశగా నడుస్తాయి
నా చేతులు నీ వైపుగా సాచుకుంటాయి
నిశ్చలమై చూస్తున్న నీ ముఖాన్ని
అపురూపంగా నా రెండు చేతులలోకి తీసుకుంటాను
గుండెకి దగ్గరగా లాగి హత్తుకొని
చూపుల స్పర్శలతో నీ నుదుటన ముద్దు పెట్టుకుంటాను
ఇక నా ఏకాంతం తీరిపోతుంది
నీతో ప్రయాణం మొదలవుతుంది
కంటి పాపను చంటి పాపలాగా పట్టుకుని
నీ వెంట నన్ను తీసుకెళ్తావు
నీ దేహంపై నా వేళ్లను వేసుకొని
నీ ఎత్తుపల్లాల గుండా
నన్ను చూపులతో పరుగెత్తిస్తావు
పరవశమై మైమరిచి - చంచలమై సంచలించి
సంభ్రమాశ్చర్యమై సంతోష పడి
కుతూహలమై కన్ను తెరిచి
నువ్వు సృష్టించిన కాల్పనిక లోకంలో
భువన భవనాలను, భావ, భేదాలను వీక్షిస్తూ
రెక్కలు లేకుండానే ఎగిరి వెళుతుంటాను
నీతో గడిపిన క్షణాలు - ఆలోచనామృతాలు
నీ వెంట నడిచిన నిమిషాలు - మరుపురాని జ్ఞాపకాలు
నీతో పెనవేసుకున్న సందర్భాలు- సుహాస పరిమళాలు
నీలో ఉన్న సమయాలు - ఆపాతమధురాలు
నీతో పంచుకున్న ఆలోచనలు- జ్ఞాన సంగీతాలు
చూస్తూండగానే
పేజీల మధ్య నీ నవ్వులు
వెన్నెల పువ్వులుగా రాలి
నీ చేష్టలు మల్లెల నదులై ప్రవహించి
నీ మాటలు ఆసక్తి సూర్యుళ్లను వెలిగించాయి
కావ్యమా,
నీ లోని ప్రతి అక్షరం ఉత్తేజం
నువ్వు ఒలికించిన ప్రతి పదం ఉద్వేగం
నువ్వు ముద్రించిన ప్రతి వాక్యం ఉల్లాసం
నిన్ను చూడటం- భవ్యలోక సందర్శనం
నిన్ను తాకడం- నవోత్సాహ ప్రేరకం
నిన్ను చదవడం - అభ్యసనానుభవం
నిన్ను అర్థం చేసుకోవడం - జీవనాన్వేషణం
కావ్యమా నువ్వు
ఏ జన్మలోనో తప్పిపోయిన నా స్వర్గం
నిరంతరం నన్ను వెంటాడే స్వప్నం
నేను నిర్మించుకోవాలనుకుంటున్న సౌధం
నేను రాయాలనుకుంటున్న నిజం..!
- డా. మామిడి హరికృష్ణ 8008005231