సఖీ.. ! నీలాకాశంలో విరబూసిన వెన్నెలవి నువ్వు నీ కలువ కనులు మూయకు.. కలలే అలలై చెలరేగుతాయి నాలో... నీ ఎర్రని పెదవులు కదిలించకూ.. వలపే పిలుపై నాలో రాగాలు పలికిస్తాయి.
నా కనుల వాకిలిలో... ఉషోదయానా వికసించిన తుషార బిందువువై.. నా హృదయ కోవెలలో.. వెలిసావు దేవతవై..!
కనిపించావు.. నా కనులకు అందని అందానివై, పరిమళించావు.. నాలో ఎప్పటికి వాడని కుసుమానివై, ప్రవహించావు.. నా ఎదపై గలగల పారే సెలయేరువై, చిగురించావు.. నా మనసుకు మాయని మమతవై.!
అందుకే చెలి! ఒక క్షణం నీ గుండె చప్పుడు విన్నా చాలనిపిస్తుంది..! ఒక క్షణం ఈ ప్రపంచాన్ని మరచి.., నా ప్రపంచం అయిన నీతో.. మనసు విప్పి మాట్లాడాలని, ఆ పారవశ్యంలో ఓలలాడాలని..!
ఎడారిలో పడి ఉన్న ఇసుక రేణువు లాంటి నా జీవితాన్ని వజ్రతుల్యంగా మార్చి.. నిండు జీవితం మనదేనంటూ.. మనస్పూర్తిగా అలంబనవై నిలిచి, నా ప్రతీ అణువణువులో ప్రణయ సంగీతమై... ఉదయించావు.. ప్రేమకు ప్రతి రూపమై.!
జీవితం ఎంత పెద్దదైనా నీతో గడిపే.. ఒక క్షణం ఈ జీవితానికే చాలనిపిస్తుంది. మిగిలిన జీవితం ఇక అవసరం లేదనిపిస్తుంది..! నీ జీవితం లోకి నేను రాలేకపోయినా.. నా ప్రేమ జీవితపు ఆశవి నీవని, కలలెన్నో కంటున్నా.. ఆశలు.. ఉచ్ఛ్వాసలుగా.. నిరాశలు.. నిశ్చ్వాసలుగా .. మౌనరాగం అలపిస్తూ...! - పొన్నం రవిచంద్ర, 9440077499