పోరంటే .. ఆయుధమే గాదు అడవంతటా పరివ్యాప్తమయ్యే మోదుగుపూల కాంతి కూడా !
నేను.. పోరు జేస్తూనే ఉంటాను అడవి కోసం.. ఆదివాసీ గర్భస్త శిశువు కోసం.. బతుకుపచ్చని నవ్వు కోసం.. నెగడై రగులుతూనే ఉంటాను ఏకమై.. అనేకమై.. దుఃఖమై.. దుర్భేద్య సమూహమై.. గెరిల్లా పోరు సాగిస్తూనే ఉంటాను !
ఈ పచ్చని లోగిలి మీద ఏ పాపిష్టినీడా పడకుండా.. నడచే యీ నెత్తుటి వనాలు నేల కూలిపోకుండా.. ఎక్కుపెట్టిన శిలకోల ఏ చేయీ దించకుండా.. ఆకుల నిఘానేత్రాలతో.. అడవి నలుచెరగులా నిత్యం పహారా కాస్తూనే ఉంటాను !
నేను.. పోరు జేస్తూనే ఉంటాను రేపటి పొద్దున యీ ఆకుపచ్చని ఆకాశం మీద ఓ వేకువ పువ్వు పూసేదాకా..!!