Sun 29 Jan 02:16:22.755122 2023
Authorization
ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రతియేటా నిర్వహించే ఈ ఉత్సవాల్లో దేశ సమగ్రాభివృద్ధికి ప్రతీకగా సైన్యం విన్యాసాలు, ప్రజా సంక్షేమ పథకాలు, వివిధ రంగాల్లో పెరిగిన అభివృద్ధికి సంకేతాలుగా శకటాలను ప్రదర్శిస్తారు. ఈ సారీ నారీశక్తి నినాదంతో నిర్వహించిన కార్యక్రమంలో వారి ప్రతిభాపాటవల్ని కనబర్చారు. మంచిదే.. కానీ మహిళల రక్షణకు ఏ చర్యలు తీసుకుంటున్నారు? వారికి దేశంలో భద్రత అనేది ఉందా, అడుగడుగునా అఘాయిత్యాలు, లైంగికదాడులతో మహిళాలోకం కంటతడిపెడుతున్నది. ఇది ఆత్మనిర్భార్ కాదు ఆత్మరక్షణ కోసం చేసే సంఘర్షణే. మరో ప్రధాన విషయం పరేడ్‌లో ఈ సారి కర్తవ్యపథ్‌లో భాగంగా కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి రథసారథిగా ఉన్న కృష్ణుడి శకటాన్ని, వనవాస అనంతరం సీతారాములను ఆయోధ్య ప్రజలు ఆహ్వానిసున్నట్టుగా రూపొందించిన శకటాలను ప్రదర్శించారు. ఇవి దేనికి సంకేతం? ఇది దేశాన్ని ఆధ్యాత్మిక భావనలో ముంచే ప్రయత్నం కాదా!
'నా శరీరం చచ్చిపోయినా రాజ్యాంగం రూపంలో నేను బతికే ఉంటాను. దాన్ని చంపినప్పుడు మాత్రమే నేను శాశ్వతంగా కన్నుమూస్తాను' అన్నాడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్. ఆయన ఏనాడో సందర్భోచితంగా చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తుతం ఒక్కసారి మననం చేసుకుంటే గనుక దాని అవసరం, ఔన్నత్యం తెలుస్తుంది. ఎందుకంటే దేశంలో ఓవైపు ఆజాదీకా అమృత మహోత్సవ్ పేరుతో ఉత్సవాలు జరుగుతున్నాయి. మరోవైపు డెబ్బయి నాలుగవ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. రెండింటిలోనూ ఏకాభిప్రాయంగా కనిపించే సందేశం ఒక్కటే. దేశ చరిత్ర, విశిష్టత తెలియ జేయడంతోపాటు నేటి తరానికి దేశభక్తి స్ఫూర్తి నింపడం. మనదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా చెప్పుకుని గర్వపడతాం. భిన్నత్వంలో ఏకత్వంగా ముందుకు సాగుతాం. కానీ దేశానికి మార్గదర్శకమైన రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేయించడంలో విఫలమవుతున్నాం. చట్ట సభల్లో ఉన్నవారు అందులోని మౌలిక సూత్రాలను తప్పక అమలు చేయాల్సిందే. కానీ దానికి భిన్నంగా వ్యవహరించడమే కాకుండా తమకు అడ్డుగా ఉందని సెక్యులరిజం అనే పదం రాజ్యాంగం నుంచి తీసేయాలనే కుట్ర చేయడం సహేతుకమేనా? ఇది అఖండ భారతావని ఆలోచించాల్సిన లోతైన అంశం.
రాజ్యాంగం ప్రజలకు ప్రాథమిక హక్కులే కాదు అధికారగణాలనూ కల్పించింది. ఇందులో సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం ముఖ్యమైనవి. సామాజికంగా వెనుకబడిన దళిత, గిరిజన బతుకుల్లో పురోగతి సాధించేందుకు దోహదం చేసే ఈ హక్కు అసలు అమల్లో ఉందా అనే ప్రశ్న వేసుకోవాల్సిన పరిస్థితి. దేశంలో దళితవాడలన్నీ వెలివాడలకు చిహ్నాలుగా మిగిలాయి. రెండు పూటల కడుపునిండా తిండిలేని అభాగ్యులు జీవచ్ఛవల్లా మన మధ్యే ఉన్నారు. గిరిజనులైతే వారు నివాసముంటున్న అడవిలోనే అనాథలయ్యారు. కనీసం అక్కడ పూచికపుల్ల కూడా ముట్టుకునే అధికారం లేదు. తరాలు మారినా వారి బతుకులు మాత్రం మారలేదు. ఆర్థికంగా ఎవరైనా నిలదొక్కుకున్నారా అంటే అవి కాగితాల్లోని పథకాలకే పరిమితం. ఇవిచాలవు అన్నట్టుగా సామా జిక, ప్రాంతీయ అసమానతలు పెరగడం ఆందోళనాకరం. రాజకీయ న్యాయమైతే శరణు అంటే తప్ప దొరకని దుస్థితి. కుర్చీలో కూర్చుండేవాడు ఒకడైతే వాడిని నడిపించే వాడు మరొకడు. ఇది అమలు చేస్తున్నట్టుగానే అనిపించే సామాజిక అన్యాయం. ఇంతటి దౌర్భగ్యకరంగా ఉంటే ఇది సర్వసత్తాక దేశమని ఎలా చెప్పగలం? ఈ అసమానతలు రూపుమాపినప్పుడే కదా అసలు రాజ్యాంగం అమలయ్యేది.
'జనగణమన అధినాయక జయహే.. భారత భాగ్య విధాత.. పంజాబసింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కల వంగ.' ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన జాతీయ గీతం. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరూ ఆలపించే ఈ పాట అర్థాన్నే మార్చేసినట్టుంది పాలకగణం. రాష్ట్రాల హక్కులు హరించడం, సంపూర్ణ మెజార్టీతో పాలన సాగిస్తున్న ప్రభుత్వా లను కూల్చడం, కులమతాల పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టడం. ఇవి దేనికి సంకేతం?. రోజు రోజుకూ మానవ వ్యవస్థను ఉద్దేశపూర్వకంగా పతనం చేయడం రాజ్యాంగ స్వరూపాన్ని దెబ్బ తీయడమే. ద్వంద్వ విధానంతో ఏకీకృత ప్రజాస్వామ్యంలో ద్విగుణ సిద్ధాంతాల్ని అమలు చేయడం శోచనీయం.ఇది సమున్నత రాజ్యాంగంలో ఏ హక్కు కింద పరిగణిస్తారో కనీసం చెప్పగలరా? ఏ పేజీలో ఉందో వివరించగలరా? కులం కుంపట్లు, మతం మంటలతో రాజ్యాన్ని ధ్వంసం చేస్తున్న నీతి మాలిన, దారి తప్పిన, రాజకీయ దుష్టసంహారమే ఈ ప్రశ్నలకు బదులివ్వాలి.
ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రతియేటా నిర్వహించే ఈ ఉత్సవాల్లో దేశ సమగ్రాభివృద్ధికి ప్రతీకగా సైన్యం విన్యాసాలు, ప్రజా సంక్షేమ పథకాలు, వివిధ రంగాల్లో పెరిగిన అభివృద్ధికి సంకేతాలుగా శకటాలను ప్రదర్శిస్తారు. ఈ సారీ నారీశక్తి నినాదంతో నిర్వహించిన కార్యక్రమంలో వారి ప్రతిభాపాటవల్ని కనబర్చారు. మంచిదే.. కానీ మహిళల రక్షణకు ఏ చర్యలు తీసుకుంటున్నారు? వారికి దేశంలో భద్రత అనేది ఉందా, అడుగడుగునా అఘాయిత్యాలు, లైంగికదాడులతో మహిళాలోకం కంటతడిపెడుతున్నది. ఇది ఆత్మనిర్భార్ కాదు ఆత్మరక్షణ కోసం చేసే సంఘర్షణే. మరో ప్రధాన విషయం పరేడ్‌లో ఈ సారి కర్తవ్యపథ్‌లో భాగంగా కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి రథసారథిగా ఉన్న కృష్ణుడి శకటాన్ని, వనవాస అనంతరం సీతారాములను ఆయోధ్య ప్రజలు ఆహ్వానిసున్నట్టుగా రూపొందించిన శకటాలను ప్రదర్శించారు. ఇవి దేనికి సంకేతం? ఇది దేశాన్ని ఆధ్యాత్మిక భావనలో ముంచే ప్రయత్నం కాదా! ప్రపంచ దేశాల్లోనే అతి పెద్ద రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నామనే పేరుతో మనువాదం, మూఢత్వం, మత ఛాందసం, కాషాయికీకరణను విస్తరించడం చూసి రాజ్యంగమే శోకిస్తుంది. ఈ ధోరణి మారాలి.. అది మారనంత వరకూ సమాజం మారదు.