Wed 01 Mar 23:17:19.242387 2023
Authorization
వాళ్ళిద్దరివికూడా పాలుగారే మొహాలే!
ఉజ్వల భవిష్యత్తు, వాళ్ళకే గాదు
ఈ దేశానికి, సమాజానికి,
ప్రపంచానికి, యావత్ మానవాళికి
అందించాల్సినవాళ్ళే!
ముందు మందుతో స్నేహం కుదిరింది
గంజాయి దమ్ముకూడా తోడయినట్టుంది
ఓ అమ్మాయి జత కలిసింది! ఇంకేముంది!
వాళ్ళు వాళ్ళ వయసును మరిచారు!
కుటుంబాన్ని మరిచారు!
సమాజాన్ని మరిచారు!
చదువుల తల్లిని మరిచారు!
సమస్త ప్రపంచాన్ని మరిచారు!
మైమరిచిన బుద్ధి వక్రీకరించింది!
మానవుడు దానవుడయ్యాడు!
ఒకడు హతుడయ్యాడు!
మరొకడు హంతకుడయ్యాడు!
నిష్కారణంగా
ఓ నిండు ప్రాణాన్ని కోల్పోయిన
ఆ కుటుంబం గర్భ శోకంతో తల్లడిల్లిపోయింది!
సమాజం నివ్వెర పోయింది!
చట్టాలు చుట్టుముట్టాయి!
ఎవరిది తప్పు! ఎవరిదీ నేరం!
గంజాయి దమ్ముదా! మందుదా!
హతుడిదా! హంతకుడిదా!
ఆ అమ్మాయిదా! మిత్ర బృందానిదా!
యుక్తాయుక్త విచక్షణ
నేర్పని చదువులదా!
ప్రేమామృతంలో విషాన్ని నింపి
కల్తీ కల్లులా సరఫరా చేస్తోన్న
వినోద మాధ్యమాలదా!
చోద్యం చూస్తోన్న ప్రభుత్వానిదా!
ఎవరిది! ఎవరిది తప్పు!
ప్రేమ ముసుగులో చలామణిఅవుతోన్న
పాశ్చాత్య విలువలు, కృత్రిమ పోకడలు,
వాటి వలలో చిక్కి
నేల విడిచి సాము చేస్తూ
లవ్ ఎఫైర్లలో జీవితాలను
బ్రేక్ అప్ చేసుకొంటున్న
యువతీ, యువకులు!
ఈ విష వలయాన్ని ఛేదించి
మన ముందు తరాలను కాపాడుకునే
ప్రత్యామ్నాయ ప్రజా సంస్కృతికోసం
సమాజం ఎదురుచూస్తోంది!
అందించేదెవరో!!