Sun 30 Apr 00:08:03.058378 2023
Authorization
భూపతి అనే వర్తకుడివద్ద వ్యాపార విషయాలు చూస్తూ పనిచేసే వాడు చలమయ్య. వాడికి ఒకేసారి ధనవంతుడు కావాలనే దురాశ కలిగింది. వాడు పరంధామయ్య అనే వర్తకుడితో చేతులు కలిపి పథకం ప్రకారం ఓడలో సరుకు పరంధామయ్యకు అమ్మాడు. ఖాళీ ఓడను నీటముంచి సరుకు నీటిలో మునిగిపోయిందని ఏడుస్తూ, నకిలీ సాక్ష్యాలతో భూపతిని నమ్మించాడు. తర్వాత చలమయ్య ఊరొదిలి భువనపురం చేరాడు. ఏమీ లేనివాడిలా నటిస్తూ, చిన్న వ్యాపారం ప్రారంభించాడు.
భూపతి పరిస్థితి తారుమారవడంతో లంకంత ఇల్లు అమ్మి అప్పులు కట్టి, అద్దె ఇంటిలో ఉండసాగాడు.
ఓరోజు భూపతి భార్యకు జబ్బు చేసింది. వైద్యానికి చాలా ధనం అవసరమయింది. చలమయ్య మంచి స్థితిలో ఉన్నాడని వినటంవల్ల వాడి వద్దకు వెళ్లి, పరిస్థితి వివరించి అప్పు అడిగాడు. అంత ధనం తనవద్ద లేదని అబద్దమాడి చలమయ్య తప్పుకున్నాడు. నిరాశతో వెనుదిరిగి వస్తున్న భూపతికి కాలిబాటలో స్పృహతప్పి ఉన్న మనిషి కనిపించాడు. అతని పక్కన ఒక చిన్న మూట పడిఉండటం చూసి, విప్పి చూశాడు. అందులో వజ్రాలున్నాయి. దాన్ని నడుమున దోపుకున్నాడు. ఆ మనిషిని వైద్యుడి వద్దకు తీసుకెళ్లి వైద్యం చేయించాడు. అతను కోలుకున్నాక అతను వజ్రాలవ్యాపారి అని, గుర్రంబగ్గీ చెడిపోవ డంవల్ల నడిచి వస్తూ మూర్చతో పడిపోయాడని తెలుసుకున్నాడు. తనకు దొరికిన మూటను అతనికిచ్చాడు. వజ్రాల వ్యాపారి భూపతి నిజాయితీకి, దయాగుణానికి ఆశ్చర్యపడ్డాడు.
''నన్ను వైద్యశాలకు చేర్చి ప్రాణం కాపాడావు. నాకు చాలా సంపద ఉంది. ఈమూట నీవే ఉంచుకో'' అని బలవంతంగా ఇచ్చి వెళ్లిపోయాడు. వజ్రాలు అమ్మగా వచ్చిన ధనంతో భూపతి భార్య జబ్బు నయం చేయించాడు. వ్యాపారం ప్రారంభించి ధనవంతుడయ్యాడు. భూపతి దయాగుణం, నిజాయితీ మంచిస్థితిని తెచ్చాయని, భార్యా పిల్లలు ప్రశంసించారు.
ఒకరోజు చలమయ్యతో పరంధామయ్యకు తగాదా రావడంతో అతను భూపతి వద్దకు వచ్చి, చలమయ్య తనకు సరుకు అమ్మి, ఖాళీ ఓడను ముంచి చేసిన మోసాన్ని చెప్పాడు.
భూపతి చలమయ్యకు బుద్ది చెప్పాలని వాడి గురించి విచారించాడు. చలమయ్య వ్యాపారంలో బాగా నష్టపోయి ఉన్నాడని తెలిసింది.
ఒకరోజు సిద్దయ్య అనేవాడు చలమయ్య దగ్గరకు వచ్చి తన ఊరు చంద్రగిరి అని, తన వద్ద పుష్పగిరి వజ్రముందని తప్పనిసరి పరిస్థితుల్లో అమ్మడానికి వచ్చానని లక్ష వరహాలకే ఇస్తానన్నాడు. తాను వజ్రాల వ్యాపారిని కానని వద్దన్నాడు చలమయ్య. మరునాడు భూపతి భువనపురం వెళ్లాడు. చలమయ్య ఇంటిముందు వెళ్తూ చలమయ్య కంటపడ్డాడు. క్షేమసమాచారాలు అడిగాడు. తాను పుష్పగిరి వజ్రంకోసం తిరుగుతున్నానని, ఆ వజ్రాన్ని మూడు లక్షల వరహాలిచ్చి కొనడానికి ఓవర్తకుడు సిద్దంగా ఉన్నాడని, ఆ వజ్రం కనిపిస్తే తాను రెండు లక్షల వరహాలకు కొనాలనుకుంటున్నానని మాటల మధ్యన చెప్పి వెళ్లిపోయాడు. ఆ వజ్రాన్ని సిద్దయ్య దగ్గర లక్ష వరహాలకు కొని భూపతికి అమ్మితే మంచిలాభం వస్తుందని ఆశపడ్డాడు చలమయ్య. ఉన్న ఆస్థిని అమ్మి లక్షవరహాలు తీసుకుని సిద్దయ్యకోసం చంద్రగిరి వెళ్లాడు. ఊరి మొదట్లోనే సిద్దయ్య కనిపించాడు. తాను వజ్రంకోసం వచ్చానని చెప్పాడు చలమయ్య. లక్షవరహాలు తీసుకుని తన నడుమున ఉన్న సంచిలోని వజ్రాన్ని ఇచ్చాడు సిద్దయ్య. దాన్ని తీసుకుని చలమయ్య భూపతి వద్దకు వెళ్లాడు
''వజ్రాన్ని కొంటానన్న వర్తకుడు ఆచూకీ లేడు. దాన్ని తీసుకొని నేనేం చేయాలి. ఎవరికైనా అమ్ముకో'' అన్నాడు భూపతి. వాడు దాన్ని అమ్మాలని ప్రయత్నించగా నకిలీదని తేలింది. చలమయ్య నెత్తీనోరు బాదుకుంటూ సిద్దయ్య కోసం చంద్రగిరి వెళ్లాడు. అక్కడ ఆపేరుగల వాడెవ్వడూ లేడని తెలిసింది. చలమయ్యకు పూట గడవడమే కష్టమయింది. ఒకప్పుడు దురాశతో తాను మోసం చేసినప్పుడు భూపతి ఇలాంటి దుస్థితినే ఎదుర్కొని ఉంటాడని చలమయ్యకు అర్థమయింది. ఇంకెప్పుడూ దురాశకు పోరాదని, ఎవరినీ మోసం చేయరాదని అనుకుంటూ పని కోసం బయలుదేరాడు.
సిద్దయ్య భూపతి నియమించిన మనిషి అని, మోసం చేసిన తనకు బుద్ది చెప్పడానికి భూపతి పుష్పగిరి వజ్రం పేరుతో నాటకం ఆడాడనే విషయం చలమయ్యకు తెలియదు.
- డి.కె.చదువుల బాబు, 9440703716