Sun 07 May 05:31:20.93249 2023
Authorization
ఎదురు చూపులో ఇంత మాధుర్యం ఉంటుందా అనిపిస్తుంది ప్రవళికను చూస్తుంటే. రాసిన పదం మళ్ళీ రాయకుండ తన ప్రేమను లేఖల రూపంలో శతకం రాసింది. ఒక్కత్తే రూంలో ఉంటుంది. తనకు నచ్చిన పని చేస్తుంది. ఒక పని నచ్చలేదంటే దాన్ని అసలు ముట్టుకోదు. మందిలో ఎక్కువ కలువదు. సిగ్గు బిడియం అలాంటివి కావు కాని తను అంతే. అందులో అందంగానూ ఉంటుంది. ఎవరైన చుట్టాలు చూస్తే పెళ్ళెప్పుడు అనో, లేక పెద్దవాళ్ళు అయితే మా అబ్బాయి ఉన్నాడు చేసుకుంటావా? అనడం, లేదా ఒకవేళ అబ్బాయే చూస్తే ఇలాంటి అమ్మాయే నాకు భార్యగా వస్తే బాగుండు అన్నట్టు తననే చూడటం జరుగుతూ ఉంటుంది. వీటితో విసిగిపోయిన ప్రవళిక స్కార్ఫ్ లేనిదే బయటకు వెళ్ళదు. వెళ్ళినా మళ్ళీ ఎవరి కంట్లో పడొద్దు. చదివింది ఆర్ట్స్ అయిన మనుషుల సైకాలజీ బాగా ఒంటబట్టించుకుంది. తను మాస్టర్స్ చదివేటప్పుడు తనకు ఇష్టమైన నానమ్మ చనిపోతే ఊరెళ్ళి వచ్చిందంతే. మళ్ళీ సంవత్సరం కావొస్తుంది ఇంకా ఆ ఊరి మొకం చూడలేదు. తను ఇప్పుడు సివిల్స్ మెయిన్స్ రాసి ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తోంది. పెద్ద పొజిషన్లో ఉండాలని తన నానమ్మ చెప్పిన మాటలు తనను ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి. కాని వయసు ప్రభావం రోహన్ ప్రేమలో పడేటట్టు చేసింది. ప్రేమలో పడ్డంత మాత్రాన తన చదువును పాడుచేసుకోలేదు. దేని ప్రియారిటి దానికే అంటుంది. తన రూంలో రెండు గోడలకు సివిల్స్ సర్వీసెస్ సిలబస్ కు సంబంధించిన మ్యాపులు, పేపర్ కట్టింగ్స్ అట్టించి ఉంటె మరో గోడకు ప్రేమ కొటేషన్లు పేపర్ మీద రాసి అంటిస్తుంది. ఇంకో గోడకు తన నానమ్మతో దిగిన చిన్నప్పటి ఫొటో ఫ్రేమ్ ఒక్కటే ఉంటుంది. తన కంటే రోహన్ రెండు సంవత్సరాలు పెద్ద. తను ఆల్రెడీ ఆర్మీలో మంచి పొజిషన్ లో ఉన్నాడు. తనని డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడే ఇష్టపడటం మొదలు పెట్టింది. కాని మాస్టర్స్ అయిపోయినా ఇంకా ఆ విషయం చెప్పలేదు. ఇద్దరిది ఒకే ఊరు. ప్రవళిక సిటీ నుంచి ఊరెళ్ళినప్పుడు రోహన్ డ్యూటిలో ఎక్కడో ఉంటాడు. రోహన్ ఊరికి వచ్చినప్పుడు ఈమె సిటీలో ఉంటుంది. వచ్చిన ఇన్ఫర్మేషన్ ఎవరైన ఇవ్వడానికి ప్రవళిక ప్రేమ విషయం ఎవరికీ తెలియదు. కాలం ఏదో ఒకరోజు మమ్మల్ని కచ్చితంగా కలుపుతుందని గట్టిగా నమ్ముతుంది. అందుకే ఏదో ఒకరోజు కలుస్తాం అన్న నమ్మకంతోనే తను తన ప్రేమను అక్షరాల్లో రాసిపెడుతుంది. ఆ రోజు కోసం ప్రేమగా ఎదురు చూస్తోంది. తనలో ఈ షేడ్ ఉందంటే ఎవ్వరూ నమ్మరు. ఎందుకంటే తను ఇంటర్, డిగ్రీ, మాస్టర్స్ చదివే రోజుల్లో చాలమంది ప్రపోజ్ చేసి కాలేజీల నుంచి టీసీలు తీస్కున్నారు. ఆమె జోలికి వెళ్ళాలన్నా కొంత భయపడతారు. హార్ట్ లేని అమ్మాయి అని కామెంట్స్ చేస్తారు. కాని ఆ హార్ట్ లో ఒకరు ఉన్నారన్న సంగతి తనకు తప్ప మరెవరికి తెలియదు. తను తినే ప్రతిసారి రోహన్ కోసం అని ఒక ముద్ద ప్లేట్లోనే పక్కకు పెట్టి తనొక ముద్ద తింటుంది. తనది మొత్తం తిని 'నువ్వు నేను పెడితే తినట్లేదు నీది కూడా నేనే తింట పో' అని ప్రేమగా రోహన్‌తో మాట్లాడినట్టు తనతో తానే మాట్లాడుకొని తినేస్తుంది ప్రవళిక. ఇలా చాలాసార్లే చేసింది. పక్కనే రోహన్ ఉన్నట్టు, తనతో పోట్లాడినట్టు అప్పుడప్పుడు కల వస్తే లేచి టీ పెట్టుకొని తాగుతూ నా హీరో ఇప్పుడు ఎక్కడున్నాడో అన్నట్టే ఫీల్ అవుతూ ఉంటుంది. పుస్తకాలు, రోహన్ ఇవి తప్ప తన మెదడులో ఇంకేవి లేవు. ఎప్పుడైన వాళ్ళమ్మ ఫోన్ చేస్తే ఏ పెళ్లి సంబంధం గురించి చెప్తుందోనని ఇంటి నుంచి ఫోన్ వస్తే కూడా లిఫ్ట్ చేయదు. తన జీవితం రోహన్ కేనని మనసులో వీలునామా రాసుకున్నది. అటువంటిది మరొకరిని తన పక్కన ఎలా ఊహించుకుంటుంది?
ఇంటర్వ్యూ కోసమని ఢిల్లీ బయలుదేరింది. మళ్ళీ రూంలో ఒక్కతే ఉంది. ఎటువంటి టెన్షన్ పడటం లేదు. అలసిపోయి పడుకుంది. నిద్రలోకి జారుకుంది. సడన్‌గా ఉలిక్కిపడి లేచి నవ్వుకున్నది. కలలో రోహన్ వచ్చాడు.
''ఏ దిక్కున నువ్వున్నా
చందమామవై నన్నే చూస్తున్నట్టు ఉంది
నువ్వో సంద్రం అయితే
నిన్ను చేరే నదిలా
నేను పారుతూ ఉన్నాను...
చలిలో నువ్వుంటే
వెచ్చని దుప్పటినై నేనుంట...
ప్రియమైన సఖుడా!
నువ్వో కాంతివి
మనస్సును కుదురుగా
ఉండనివ్వని అశాంతివి...
కనులకు నీ రూపం తప్ప
ఈ ప్రపంచం తెలియడం లేదు...
నేను
వెన్నెలకై
ఎదురు చూస్తున్న చీకటిని...
ఎదపై మురిపెంగా కురుస్తావుగా!
అంటూ మధ్య రాత్రి మెలకువ వస్తే కవితలో తన భావాన్ని కూర్చి మళ్ళీ పడుకున్నది ప్రవళిక. తెల్లారితే ఇంటర్వ్యూ ఉంది. కాని నిద్ర పట్టడం లేదు. ఫోన్ పట్టుకొని ఏవో న్యూస్ చూస్తుండగానే తెల్లారింది. రెడీ అయి ఇంటర్వ్యూకు బయలుదేరింది. సాయంత్రం మళ్ళీ సంతోషంగా రూంకు వచ్చి బ్యాగ్ సదురుకొని హైదరాబాద్‌కు బయలుదేరింది.
కొన్నాళ్ళు గడిచాయి. సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న సంగతి ఇంట్లో కాని ఫ్రెండ్స్‌కు కాని ఎప్పుడూ చెప్పలేదు. కారణం తనది చిన్న పల్లెటూరు. దాని గురించి చెబితే ఎంకరేజ్ చేసేదానికంటే ఎగతాళి చేసేదే ఎక్కువ ఉంటుందని తనకి తెలుసు. సివిల్స్ రిజల్ట్స్ వచ్చిన రోజే ఇంట్లో రోహన్ గురించి చెప్పాలని ఫిక్స్ అయ్యింది.
ఆ రోజుకు ఒక రోజు ముందే తన ప్రేమ లేఖలు తీస్కోని ఊరికి బయలుదేరింది. మనసులో తెలియని సంతోషం ఉప్పొంగుతోంది. తనకు ఇష్టమైన మ్యూజిక్ వింటూ బస్సులో కూర్చున్నది.
ఇంటికి రాగానే వాళ్ళమ్మ షాక్ అవుతూనే సంతోషపడింది. బిడ్డ ఆరోగ్యం గురించి ఆర్తిగా అడిగింది. తను బాగానే ఉన్నానని చెప్పింది. ఫ్రెషప్ అయి బయటకు వచ్చి రోహన్ వాళ్ళ ఇంటివైపు చూసింది. ఎవరూ కనబడలేదు. రాత్రికి తిని రేపు రాబోయే రిజల్ట్స్ గురించి తలుచుకొని నిద్రలోకి జారుకున్నది. ఉదయం లేవగానే తీవ్రవాదుల కాల్పుల్లో భారత జవాన్లు మృతి అని టీవీలో వార్తలు. జవాన్లు అనే పదం చెవిలో పడగానే టీవీ ముందు నుంచి కదలలేదు తను. అందులో ఎవరెవరు ఎక్కడి వారో క్లియర్‌గా ఒక్కొక్కరి పేర్లు ఇస్తున్నారు. నలుగురు జవాన్ల పేర్ల తర్వాత రోహన్ డెడ్ బాడితోపాటు పేరు చెప్పారు. ప్రవళికకు షాక్ తగిలినట్టు అయ్యింది. నిలబడి ఉన్న చోటే కూలబడిపోయింది. కన్నీళ్లు జారుతూ ఉన్నాయి. వాళ్ళమ్మ చూసి ఏమైందని అడిగితే కూడా ఏమీ చెప్పలేదు. మాట్లాడటం లేదు. ఆ న్యూస్ తల్లి చూడలేదు. తనకు ఇష్టమైన నానమ్మ చనిపోతే కూడా ఒక్క కన్నీటి చుక్క రాల్చలేదు. అటువంటిది వెక్కిళ్ళు పట్టినా ఏడవటం ఆపడం లేదు. వాళ్ళమ్మ టీవీ బందు పెట్టింది. ప్రవళిక బెడ్ రూంలోకి వెళ్లి డోర్ పెట్టుకున్నది. తన ప్రేమ లేఖలను బెడ్ పై పరిచి వాటిపై పడుకొని ఏడుస్తూ ఉంది. వాళ్ళమ్మ డోర్ కొడితే చాలాసేపటికి తెరిచింది. వాళ్ళమ్మ లోపలికెళ్తే ప్రవళిక బయటకు వచ్చి టీవీ ఆన్ చేసింది. బెడ్ పైనున్న ప్రేమలేఖలు చదివి వాళ్ళమ్మ షాక్ అయ్యింది. రోహన్ మంచివాడని సంతోషపడింది. అవ్వి తీస్కోని హాల్లో ఉన్న ప్రవళిక దగ్గరకు వచ్చింది. టీవీలో రోహన్ మరణ వార్తా చూసి ఇంకా షాక్ అయ్యింది. కాసేపు అయ్యాక సివిల్స్ రిజల్ట్స్ వార్తలు. ప్రవళికకు ఐఏఎస్ క్యాడర్ ర్యాంక్ వచ్చింది. తల్లీబిడ్డలకు ఏమీ అర్థం కావడం లేదు. ఒకటి బాధ. మరోటి సంతోషం. సంతోషం కంటే బాధే ఎక్కువ కలవరపెట్టింది వాళ్ళను. మరుసటిరోజు రోహన్ డెడ్‌బాడీని ఊరేగింపుగా తీసుకొచ్చారు. ప్రవళికకు అభినందనలు చెప్పడానికి చాలామంది ఉన్నతాధికారులు వస్తున్నారు. ఒకవైపు రోహన్ అంత్యక్రియలు జరుగుతున్నాయి. గుండెలో బాధను దిగమింగుతూ వచ్చిన వారితో మాట్లాడింది ప్రవళిక. రోహన్ అంత్యక్రియలు అయిపోయాయి. సాయంత్రం అయ్యింది. అందరూ వెళ్లారు. ప్రవళిక రాసుకున్న ప్రేమ లేఖలను తీస్కోని వాళ్ళమ్మను వెంటబెట్టుకొని రోహన్ సమాధి దగ్గరకు వెళ్ళింది. మోకాళ్ళపై కూర్చొని ఒక్కో ప్రేమ లేఖను సమాధిపై పెడుతుంటే కన్నీళ్లు ఆగకుండా వస్తూనే ఉన్నాయి. బిడ్డ బాధను చూసి తల్లికి కూడా ఏడుపు ఆగలేదు. అన్ని లేఖలు పెట్టి మెల్లగా లేచి ఇంటికి బయలుదేరింది.
కొన్నిరోజుల తర్వాత ఐఏఎస్ ట్రైనింగ్‌కు రావాలని పిలుపొచ్చింది. ప్రవళిక ముస్సోరికి బయలుదేరింది.
- కె.పి.లక్ష్మీనరసింహ,
9010645470