Sun 18 Apr 02:22:01.80743 2021
Authorization
కొబ్బరినీళ్లు తాగుతున్నప్పుడు... ''సింగార గుంట నీళ్లులా ఉన్నాయే'' అనీ, ''నైనార్ ఇంట్లో కట్టెలమోపు పడేసి మధ్యాహ్నం భోజనానికి రెండు చెంబుల సింగార గుంట నీళ్లు తాగాను. రెండ్రోజులు నా నోరు ఇంకేమీ అడగలేదు.'' లాంటి సింగార గుంటకు సంబంధించిన మాటలు కాలనీలో అప్పుడప్పుడూ వినబడుతుండేవి ఇప్పటిలా కాదు.
కాశి రాళ్లతో కూడిన ప్రహరీ గోడకు ఎప్పుడో వేసిన వెల్లకు పాచిపట్టి ఒకవిధమైన భయాన్ని కలిగిస్తూ ఉన్నది. బ్రహ్మాండమైన ఆ ప్రహరీ గోడకు వెనక భాగంలో ఎండిపోయి వేలాడుతున్న పనసకాయలూ, ఎన్నో సంవత్సరాలుగా జీవిస్తున్న గర్వంతో నిలబడున్న వృక్షాలూ, ఏ అపరిచితుడినైనా ఇట్టే భయపెడతాయి. కొండ చుట్టూ కట్టిన ప్రహరీగోడ కావటం ఆశ్చర్యపరిచే, భయపెట్టే విషయమే. ప్రహరీ గోడను దాటి బయటికి కనిపించే రెండు ప్రధానమైన విషయాలలో ఈ వృక్షాలు ఒకటి. వాటికి సమానంగా నిలబడున్నది గుడి. దాని లోపలే 'వెట్టవలం' జమీనో, గుర్రాలో, ధాన్యపు గిడ్డంగులో, దాని ఒంటరి రాజ్యమో ఉన్నట్టుగా ఎవరూ సులభంగా గుర్తించటానికి వీల్లేదు. నగరాన్నే మూసేసిన జమీన్ రాక్షస ఇనుప తలుపులను ఎవరూ ఐదు నిమిషాలు కూడా తెరిచి చూడలేదు.
దక్షిణ ప్రహరీ గోడకు పక్కగా, ఏ హంగూ లేకుండా.... కానీ, లోపలి భయంకరమైన జమీన్ లాగానే నిశ్చలంగా ఉన్నది సింగార గుంట. వాటిలో నీళ్లు ఎక్కణ్ణించి వస్తున్నాయి? కొండ నుండి గుంటకు దారేది? లేదూ పూర్తిగా భూమిలో నుండే పొంగుతున్న ఊటా?
సింగార గుంట గురించి ఒక్కొక్కరూ ఒక్కో విషయాన్ని తెలుసుకుని ఉన్నారు. దళితవాడ వాళ్లు తప్ప! కామరాజును చూశాను, ఇందిరాగాంధీ అమ్మను చూశాను లాంటి ఆ ఊరి వార్తల విచిత్రాలలో ఒకటి సింగార గుంటను చూసిన దళితవాడ వాళ్ల జనాల సంఖ్య.
కొబ్బరినీళ్లు తాగుతున్నప్పుడు... ''సింగార గుంట నీళ్లులా ఉన్నాయే'' అనీ, ''నైనార్ ఇంట్లో కట్టెలమోపు పడేసి మధ్యాహ్నం భోజనానికి రెండు చెంబుల సింగార గుంట నీళ్లు తాగాను. రెండ్రోజులు నా నోరు ఇంకేమీ అడగలేదు.'' లాంటి సింగార గుంటకు సంబంధించిన మాటలు కాలనీలో అప్పుడప్పుడూ వినబడుతుండేవి ఇప్పటిలా కాదు.
ఇప్పుడు దళిత వాడనే నాలుగు వీధులుగా విడదీసి, భారతీ, భారతిదాసన్ వీధులంటూ పేర్లు మార్చేశారు. అయితే ఎవడు దాన్ని పట్టించుకుంటున్నాడనీ? మిలట్రీకి వెళ్లిన యువకులు మాత్రం ఆ పేరు మీదనే చిరునామా రాసి పంపినా, అవి సరిగ్గా వచ్చి చేరకపోవటంతో, మళ్లీ మునుపటిలాగే 'వెట్టవలం కాలనీ' అనే రాస్తున్నారు. ప్రపంచానికి మాత్రం అవి భారతీ, భారతిదాసన్ వీధులని పళ్లికిలిస్తూ నిలబడుంటాయి.
అయితే ఇప్పుడు నాలుగు గుడిసెలకు మధ్యన ఒక సీమ పెంకుటిల్లూ, పదిండ్లకు ఒక మిద్దిల్లంటూ కట్టేశారు. టీచరు అయినవాడు, మిలట్రీకి వెళ్లినవాడు, గవర్నమెంటు ఉద్యోగం చేసేవాడూ అంటూ పూర్తిగా మిద్దెలనేవి పదిండ్లకు పైనే తేలుతాయి.
అప్పుడే వగైరాకు వగైరా అంటూ వేరుచేసి, అంత గొప్పగా దళితవాడకు మధ్యలో మారెమ్మ గుడి కట్టి, దానికి ఉత్తరాన నిలబడున్నదే ఆ మేడ, అది మా నాన్న కట్టిందే. ఇప్పుడు సాంఘిక నాటకాలూ, అంబేద్కర్ సంఘం అన్నీ అందులోనే. అయితే రాత్రుల్లో పడుకోవటానికి అనువైన చోటు అది! ఆరోజు రాత్రి నా తోటివాళ్లు కూడా చాలా సేపటి వరకూ మాట్లాడుతూ ఉండిపోయి, మిద్దెమీద పడుకున్నప్పుడే ఉన్నట్టుండి అతనికి సింగార గుంట గుర్తుకొచ్చింది.
ఎక్కడ గుర్తుకొచ్చింది? ముందూ వెనకా దాన్ని చూసుంటేనే కదా గుర్తుకు రావటానికి? దాని గురించి మాట్లాడిన మనుషుల గురించీ, కొండమీద బయలుదేరి జమీన్ దారి గుండా కిందికి దిగటం అన్న వార్త గురించీ, వచ్చే దార్లో జమీన్ ఆడవాళ్లు అందులోనే స్నానం చేసేవాళ్లట అని ఆశ్చర్య పడటం గురించీ, ఆ గుంటకు ఊళ్లోని వీధివాళ్లు మనుషుల్ని కాపలా పెట్టి... అంటూ, ముట్టూ, కల్తీ, కాలుష్యం జరగకుండా కాపాడుకుంటూ రావటాన్ని గురించీ, ఆ కాపలాదారులకు ఏ పనీ పెట్టకుండా, ఈ దళితవాడ పదీ పన్నెండు రకాలుగా ఇంతవరకూ ఆ గుంట నుండి ఒక్క దోసిలి నీటిని కూడా తీసుకుని తాగకపోవటాన్ని గురించీ... ఇది... ఇదే... దీని గురించిన ఆలోచనల్లో ఉన్నప్పుడే మనసులో ఏదో కొత్తగా తేలటాన్ని గ్రహించాడు.
తెల్లవారగానే అది కళ్ల నుండి బయటికొచ్చింది. కోపం... ఆవేశం...
ఆరోజు ఉదయాన్నే ప్రారంభమైన మాటలు. ఆగలేదు. వయస్సు, మనుషులు, వగైరా, తలపాగా ఏ తేడా అతనికి అడ్డు రాలేదు. అందరి దగ్గరా అతను సింగార గుంట గురించే మాట్లాడుతున్నాడు.
మాట్లాడుతున్నవాడు ఉన్నట్టుండి ఒకరోజు మాట్లాడటం ఆపేసి, మాట్లాడిన దాన్ని ఆలోచించటం మొదలు పెట్టగానే... ఇదే మారెమ్మ గుడి ముందర...
అదిరి పడ్డాడు.
సింగార గుంట మాటలు అతణ్ణుండి ఎందరినో వేరుచేసి ఉండటం ఇప్పటికి అర్థమైంది. అతణ్ణి చూసి ఆడవాళ్లు గుసగుస మాట్లాడుకోవటం, కొందరు మనుషులు అతణ్ణి పిచ్చివాడి లెక్కన చూడటమూ, అది పనికిమాలిన వ్యవహారమని ఊళ్లో వాళ్లు బుద్ది చెప్పటమూ, అన్నింటికీ కారణం, 'దళితవాడలోని వాళ్లూ సింగార గుంటలోకి దిగి ఒక దోసెడు నీళ్లు తాగి తీరాలి!' అన్న మాటలోని ప్రమాదమే అది. అయినా అదీ ఇదీ అంటూ దళితవాడలో యాభై, అరవై మంది, అతని మాటలకు రక్తాన్ని ఎక్కిస్తూ వచ్చారు.
ఆ బలమో, బలహీనమో, అతణ్ణి దళితవాడను దాటి ఊళ్లోకి కాలుపెట్టేందుకూ, సింగార గుంట గురించి మాట్లాడ్డానికీ వీలు కల్పించింది.
సింగార గుంట మాటలు ఊళ్లోని వీధుల్లోనూ భయాన్ని కలిగించినప్పటికీ దళితవాడకు పర్వాలేదన్నట్టుగా ఉండేది.
అతను అతనితో ముందుకెళుతూనే ఉన్నాడు. పరుగులు తీస్తూనే ఉన్నాడు. ఆ పరుగే మార్చి 12వ తేదీన దళితవాడ, ఊళ్లోని వీధిలో నుండి మొత్తం 15మంది ఆడవాళ్లు సింగార గుంటలోకి దిగి, నీళ్లు తీసుకురాబోతున్నారన్న విషయం దాకా వెళ్లింది.
ఆ తర్వాత మార్చి 12వ తేదీ నిర్ణయాన్ని జాతీయం చేశాడు. జరగబోయే రక్తప్రవాహం ఎప్పుడూ గుర్తుకొస్తున్నది. మొదట నమ్మకమున్న 15మంది ఆడవాళ్లును ఎన్నుకున్నాడు.
ఇక వాడు కాదు. వాళ్లు. ప్రచారం జోరందుకుంది.
ఊరి వీధిని దాటుకొని నీళ్లు ముంచటానికి వెళ్లబోయే ఆడ వాళ్లు, తోడుగా వెళ్లబోయే మగవాళ్లు, వాళ్లకు ఆయుధాలు, అన్నీ దళితవాడ, ఊళ్లోని వీధి సహాజత్వాన్ని దాటి జరుగుతున్న దాన్ని ఎవరూ గ్రహించలేకపొయ్యారు, ఒక్క చర్చి ఫాదరు తప్ప.
వాళ్లు, మారెమ్మ గుడి వేదికమీద పడుకోవటాన్ని తప్పించారు. రహస్యాలు పలచనై రక్తం పారొచ్చు. తలుపు తట్టే శబ్దంలో అదరకుండా, అయితే అన్ని జాగ్రత్తలతోనూ తలుపు గెడియను తీసి బయటికి చూశాడు.
అందరూ ఊరి వీధి మనుషులు. అందరి ముఖాలలోనూ భయం గూడుకట్టుకున్నాయి. ఒకట్రెండు ముఖాలలో మోస పోవటమూ, భయమూ తెలియటాన్ని చందమామ వెలుతురే చూపించింది. నేరుగా విషయంలోకి వచ్చేశారు.
''రేపు తెల్లారి జరపబోయే పనిలో ఊరి వీధి మనుషులు ఎవరూ కలుసుకోవటం లేదు. ఒక్క రక్తపు చుక్కను కూడా ఇష్టపడటం లేదు. మేము ఫాదర్ మాటను కాదనలేము. బతుకో చావో మానమో మర్యాదో అన్నీ మాకు ఆయనే.''
''మానం మర్యాదలకు కూడానా?''
ప్రశ్న పూర్తయ్యేలోపే కోపంతో విడిపొయ్యారు. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్లటానికీ మనసు కాలేదు. బీడీ... పొగతో మామిడి చెట్టు చుట్టూ నడవసాగాడు.
ఇదిఆగి పోతుం దా?
తరతరాలుగా వంగిన తలలు పైకెత్తటా నికే వీలుకాదా? వెన్నె ముక చక్కగా నిలబడ టానికే సాధ్యం కాదా?
ఒకవేళ గెలిస్తే చరిత్ర తారాస్థాయి. లేదు, లేదు. ఇందులో వెనుకంజ వెయ్యలేదు. ఇన్ని నెలల కష్టం, మాటలు, కోపం అన్నీ ఎల్లుండి నిరూపణై తీరాలి.
అయితే అతని దిగులంతా ఊరివాళ్ల చర్యలలో వెనుకంజ వేశారన్న వార్త దళితవాడ జనాలకు తెలియకూడదన్నదే.
అయితే తెల్లవారి ఇంటికొచ్చేలోపే దళితవాడ మొత్తం విషయం పాకిపోయింది.
అతని ''వాళ్లే...'' పెద్దగా భయపడి ఉన్నారు.
అతని ఏ మాటలూ పనిచెయ్యలేదు. ఆ రాత్రి వాళ్లల్లో కొందరు మళ్లీ మారెమ్మ గుడి వేదిక దగ్గరికి పడుకోవటానికి వచ్చారు. ఎవరితోనూ మాట్లాడటానికి అతనికి ఇష్టం లేదు.
''నా కొడుకైనా సింగార గుంట నీళ్లు ముంచుకుని తాగగలడా?''
ఇప్పటివరకూ ఏదీ జరగనట్టుగా... లేదూ జరగబోయే దాన్ని మారెమ్మ చూసి పక్కకు నెట్టేసినట్టుగా దీర్ఘనిద్రలో ఉన్నది ఊరు.
ఏవో అరుపులు వినే లేచాడు. గుంపులు గుంపులుగా మగవాళ్లు, ఆడవాళ్లు. ఊళ్లోని మనుషులూ బయలుదేరారు.
''మన ఆడపిల్లేరా.''
''దేన్ని బట్టి అలా చెబుతున్నావు?''
''వచ్చినవాడే స్పష్టంగా చెబుతున్నాడుగా!''
దిగులుతో కూడిన ముఖంతో సైకిల్‌మీదే కూర్చుని కాళ్లను నేల మీద ఆనించి నిలబడున్నాడు ఊళ్లోని మనిషి. దళితవాడ తర్వాతి అర్థగంటలో ఒక నిర్ణయానికి వచ్చేసింది. కర్రలు, కత్తులతో బయలుదేరిన వాళ్ల నడుముకు కొడవళ్లు జతకలిసి ఉన్నాయి.
ఆడవాళ్లను రావద్దని అడ్డగించింది గుంపు. దీన్ని ఆశించని వాడిలా గొప్ప ఆశ్చర్యంతో సైకిల్‌ను తొక్కాడు ఊరివాడు.
గుంపులో ఆడవాళ్లూ ఉండటాన్ని ఎవరూ నియత్రించలేక ముందుకు వెళ్లసాగారు. మొత్తం ఊరు ఊరే సింగార గుంట కట్టమీద నిలబడి ఉండటం దూరం నుండే కనిపిస్తోంది.
గుంపు దగ్గరికి వెళ్లినప్పుడు పెద్ద వణుకూ భయమూ గాల్లో కుమ్ములాడాయి. అంతవరకూ జీవితంలో వాళ్లు గ్రహించని దిగులు ఒక్కొక్కరినీ కమ్ముకుంది.
మగవాళ్లను పక్కకు నెట్టేసి ఆడవాళ్లే గుంటను చూశారు. ఈ జన్మలో ఆ గుంటను మొట్టమొదటిసారిగా చూస్తున్నారు.
గుంటలో తూర్పు మెట్ల పక్కన ఏ కదలికా లేకుండా లంగా వోణీతో ఒక అమ్మాయి శవం తేలుతోంది.
''మన కార్తవరాయుడి కూతురు మల్లికా రా,'' నిశ్శబ్దాన్ని చెదరగొడుతూ లేచిన గొంతులో వణుకు స్పష్టంగా కనిపించింది.
మొత్తం గుంపూ గొంతు వినిపించిన వైపుకు తిరగ్గా, అతనికి పొరబోయింది.
ఈరోజు తెల్లవారి గుంటలోకి దిగి నీళ్లు తాసుకురావటానికి పేరు ఇచ్చిన మల్లికా!
ఏడవ కూడదు. బద్దలై పోకూడదు.
చెప్పలేని మౌనంలోకి కూరుకుపోయాడు.
దళితవాడ గుంపు ఎవరికోసమూ ఎదురు చూడకుండా దబదబ మంటూ సింగార గుంట లోకి దిగి శవాన్ని పైకె త్తారు. ఒక తరం మొద్దుబారిపోయి శవాన్ని మోసింది.
- తమిళ మూలం : బవా చెల్లదురై
అనువాదం : జిల్లేళ్ళ బాలాజీ