Sat 08 May 22:54:53.188386 2021
Authorization
ఆ రోజు ఆదివారం. ఊరి బయటున్న గవర్నమెంటు బడిలో పిల్లల్లంతా ఓచోటజేరి కేరింతలతో పొద్దట్నుంచి బువ్వ బుగ్గి లేక ఆటలాడుకుంటుండ్రు. సర్కారు బడిలో ఓ మూల పెద్ద మర్రి చెట్టుంది. దాని వూడలు పట్టి యేలాడుతూ కొందరు ఉయ్యాలలూగుతుండ్రు, మరికొంత మంది పిలగాండ్లు గుట్టగా పోసిన ఇసుకలో ముక్కుపుల్లలాటాడుతుండ్రు, కొంత మంది పోరగండ్లు జిల్లగోన, పిచ్చిబంతి, గోటీలు, దాగుడుమూతలు, దొంగ పోలీసు ఆడుతుండ్రు.
అప్పటిదాంక పిల్లలతో సందడిగున్న ఆ చోటు ఒక్కపాలి నిశ్శబ్దంగా మారిపోయింది. ఆరోతర్గతి చదువుతున్న రాముడు మర్రిచెట్టు ఊడబట్టి ఉయ్యాలూగుతుండు. ఊడ పట్టుకున్న చేతులు చెమటపట్టి జారి ,ఆడ్నేఉన్న బండరాయి మీద పడి తలపగిలింది. ఆగకుండా నెత్తురు కారుతుంది. రాముడు మూసిన కండ్లు తెరుస్తల్లేడు. దోస్తుగాళ్ళకు ఏం చేయాల్నో తెల్వక ఆటలన్నీ ఆడికాడ్నే ఆపేసి, భయంతో పెద్దగ ఏడవడం మొదలు పెట్టిండ్రు.
రాముడుకు అమ్మఅయ్య లేరు. అన్నీ నాయనమ్మే. పుట్టిన పిలగానికి ఏడాది తిరక్కముందే అమ్మానాయిన రాముడిని నాయినమ్మకాడ వదిలేసి బత్కుదెరువుకు కాలువ కిందికి పోయిండ్రు. లారి టక్కరయి ఆడ్నే జీవిడిశిండ్రు. వూల్లె ఇల్లు లేదు, వూరి బయట చేను లేదు, ఉన్నొక్క కొడుకు బోయిండని కడుపు తీపికి, ముసల్ది ఎంకమ్మ ఏడ్చి యేడ్చి, ఉన్నకండ్లను కాస్త పోగొట్టుకుంది, కొడుకు మీద దిగుల్తోటి ఇంటాయన పచ్చవాతమొచ్చి మంచం పట్టిండు. ఆయనకిప్పుడన్నీ మంచంలోనే, ఏ దిక్కూ లేని ఎంకమ్మకు నా అన్నవారంత, ఎవరు నువ్వు అనేశిండ్రు.
గిప్పుడు ఎంకమ్మకు కండ్లు మస్కలైనయి. ఊరు దూరమైతంది కాడు దగ్గరైతంది, వంట్లో ఆశ తప్ప, సత్తువ లేదు. ఎప్పుడు పోతదో జీవి తెల్వదు. కన్నపేగుబంధం గుర్తుగా వున్న గా నలసు కోసం బతుకునీడుస్తూ, బడి బయట పిలగాల్లకు రేగుబళ్ళు, జామపళ్ళు, ఇంటికాడజేసిన మడుగుబూలు, అప్పలు అమ్ముతూ, కాలాన్ని ఎల్లదీస్తుంది. రాముడు సదువుల మహా సురుకని రాఘవయ్య సారు ఎప్పుడూ జెప్తడు. అంగట్లో అరువు తల మీద బరువు అన్నట్టు బతుకీడిస్తూ ఎంకవ్వ, రాముడిని పనికి పంపకుండ సర్కారు బడిల సదివిస్తుంది.
ఆదివారం కావడంతో ఇంటికాడ ఎంకవ్వ అప్పలు చేస్తుంది, ఎవలో బయట ''ఎంకమ్మమ్మో .... ఓ ఎంకమ్మమ్మ'' అని ఆగకుండా పిలుస్తుండ్రు. ''ముసల్దానికి వయసుమీద పడ్డది, ఇనబడట్లేనట్టుందని'', విసుక్కుంటు తడక తీసుకుని గుడిసెలకొచ్చి, రాముడికి దెబ్బతగిలిన సంగతి చెప్పిండు శంకరయ్య. ఆ ముచ్చట చెప్పంగనే ఎంకమ్మకు గుండె సెరువయింది. దుఖం ఒక్కసారిగ కట్టలుదెంచుకొని, ఓ కొడుకా.. అని గుండెలు బాదుకుంట, ఏడ్పు బజారంతా పరుస్కుంటూ ఆయాసంతో బడిదాంక ఉరుక్కుంట బడిదాంక బోయింది. ఎంకమ్మతోటి శంకరయ్య సుత బోయిండు. ఆడ రాముడు లేడు. ఆడ్నించి ఎవలో పుణ్యాత్ముడు ఎడ్లబండిల రాముడును పండబెట్టి ధర్మాసుపత్రి తీసుకెల్లిండ్రు. గది తెలిసి లబోదిబోమనుకుంటున్న ఎంకవ్వను దవాఖానాకు తీసుకుబోయిండు శంకరయ్య.
రాముడి తలకాయకు దెబ్బ బలంగా తగిలింది, నెత్తురు చానా పోయింది, దాంతో మనసోయిలో లేడు, బడికాడ మూసిన కండ్లు ఇప్పటిదాంక తెరవలే. మనుమడిని చూసి తట్టుకోలేక కుప్పకూలింది. గుండెలు బాదుకుంటూ ఎంకమ్మ ఏడ్చి ఏడ్చి ఆయాసంతో రొప్పుకుంట కండ్లు తుడుసుకుంటుంది. ఆమె నిర్గుండె పడ్డది. వయసుడిగినాంక బాధల్ని తట్టుకోలేకపోతుంది. మాసిన చీర కొంగంత తడిసి ముద్దయింది. మధ్యమధ్యలో ''భగవంతుడా! నా పాణం తీసుకోనన్నా నా మనుమడిని బతికియ్యమని'' కంటికి పుట్టెడు ఏడుస్తుంది. బిడ్డ బతికి బయటకొస్తే ముడుపు కడతనని గుర్తుకొచ్చిన దేవుల్లందర్కి మొక్కుతుంది. యెంటోచ్చిన మనుషులు ఒక్కొక్కరుగా ఆనుంచి జారుకున్నరు. అవ్వ ఎంట శంకరొక్కడే మిగిలిండు. డాక్టరొచ్చిండు అమ్మమ్మా..'' అన్నడు శంకరయ్య.
ఆ మాటకు ప్రాణం లేచొచ్చింది, వెంకమ్మకు చూపు ఆనలే, దగ్గరకు బోయింది, ఒక్కసారిగ డాక్టరు కాళ్ళమీద కూలిపోయింది, బోరున తన గోడుతో ఆయన పాదాలను తడిపింది. చలించి పోయిండు డాక్టరు, ఆయన మనిషే కదా. కాని మెరుపు దీపమవుతుందాన్నట్టు ఆ ధర్మాసుపత్రిలో పెద్ద వైద్యం చేయడానికి సౌకర్యాలు లేవాయే, ఏం చేయాల్నో శంకరయ్యకు వివరంగా చెప్పిండు, ముసల్దానికి ఇనబడదని శంకరయ్యే చొరవ చూపిండు. ఆ తరువాత డాక్టరు వినపడేట్టుగా అవ్వకు చెప్పిండు. ''ఈడ ఉన్న పరీక్షలన్నీ చేసిన, నెత్తురు కారకుండ తలకాయకు పెద్దకట్టు కూడా కట్టిన, మీరు వెంటనే పెద్దాసుపత్రికి తీసుకపొకపోతే బిడ్డ ప్రాణానికి ప్రమాదం'' అని చెప్పడంతో అట్నించటే పట్నానికి పెద్దాసుపత్రికి రాముడిని తీసుకెల్లిండు శంకరయ్య. వద్దంటున్నా వినకుండా అవ్వ ఎంబడొచ్చింది.
శంకరయ్య ఇరవయ్యేళ్ళ యువకుడు. కూలి నాలికి పోతడు. ఉంటే తినాలి లేకపోతె ఎండాలి. వాని బతుకు చెట్టు లేని చేను, చుట్టం లేని వూరయినా అందరితో తలలో నాలుకలెక్కుంటడు. ప్రేమగా శంకరి అని పిలుస్తే ఏ పనయినా తన పనిలాగే చేస్తడు. పైసకాశపడడు. మంచి పేరుంది.
శంకరయ్య దురదష్టవంతుడు. పుట్టుకల్నే తల్లి బాలింత రోగమొచ్చిబోయింది. సక్కని తల్లి. పిలగాన్ని ఒదిలి చిన్నప్పుడే నాయిన ఏడనో దేశాలు బట్టుకబోయిండు. ఆడ్నించి శంకరికి అమ్మలెక్క ఎంకమ్మవ్వ సొంత బిడ్డలా ఆకలికి, ఆపతికి ఆదుకునేది. అందుకే శంకరయ్యకు ఎంకవ్వ మీద నెనరుంది. ఆ పిలగాడు బతకపోతే రెండు ముసలి ప్రాణాలు నిల్వవని తెలుసు. ఎట్నైన పిలగాడ్ని కాపాడాలని కన్నగల్లోల్ల కాళ్ళు పట్టుకొని అడుగుతుండు. ఏడ అడిగిచూసినా అప్పు బుడ్తల్లేదు. శంకరయ్య కాడ ఏముందని జూసి అప్పిస్తరెవరైన. ఆడ ఈడ అడిగి కొన్ని పైసలు జేసి ఎంకవ్వకు దైర్నం జెప్పి పిలగాడ్ని పెద్దాసుపత్రిల షరీక జేసిండు.
పెద్దాసుపత్రిల డాక్టరు వైద్యపరీక్షలు జేసిండు, ''తలకాయకు దెబ్బపెద్దగా తగిలి మెదడులో నెత్తురు గడ్డకట్టింది''. వెంటనే ఆపరేషన్‌కు లక్షరూపాయలను తయారు జేసుకోమని చెప్పిండు. ''ఎంకమ్మతో బాటు శంకరయ్యకు ఏం జేయాల్నో తోచక కాళ్ళుచేతులు ఆడతలేవు. ఎంకమ్మ అల్లడం తల్లడం అయితుంది. ఎట్లైనా తన మనుమడిని బతికించమని, కళ్ళు కనబడక ఆడికొచ్చేటోల్లందరినీ డాక్టరనుకుని కాళ్ళు మొక్కుతుంది.
కాలం గడిచింది. రాముడు సదువు కోసం ఊరొదిలి పదిహేనేళ్ళు దాటింది. చదువైయిపోయి సొంత జిల్లాలనే ఉద్యోగంమొచ్చింది. పట్నం నుంచి సొంతూరుకు కారుల బయలుదేరిండు. ఎమ్మటి శంకరన్న ఉండు. ఉద్యోగంలో జేరటానికి ముందు గురువు రాఘవయ్య సారుకు పాదాభివందనం జేసి ఆశీస్సులు తీసుకుందామని బయలు దేరిండు. ఊరు దగ్గరికి వచ్చింది. బడి దాటుతుండగా జ్ఞాపకాలు కదిలాయి. ఇంతలోనే కారు రాఘవయ్య సారింటి ముందాగింది, డ్రైవరు రాముడు కంటే ముందే కారు దిగి, కారుడోరు తీసిండు, రాముడు వినయంతో కారు దిగి పూలదండ తీసుకొని సంతోషంతో రాఘవయ్యసారు ఇంట్లోకి నడిసిండు.
పాదాల కింద భూమి కదిలినట్టయింది. రాముడు కంటే ముందే అతని దురదష్టం రాఘవయ్య సారింటి కాడ ఎదురైంది. నేలమీదేసిన గడ్డిమీద సారున్నడు. తన ప్రపంచమంతా మబ్బులు పట్టి మసకబారింది, అంధకారంలో పడిపోయిండు. దుఃఖం కట్టలు తెంచుకుంది. కన్నీటి వరద తన్నుకొస్తుంది. గుండెచెరువయ్యింది. ''రాఘవయ్య సారు రాత్రి భోజనం చేశాక నిద్రలోనే గుండెపోటొచ్చి నిద్రలోనే కన్ను మూశారని'' అక్కడెవరో వివరం చెబుతుండ్రు.
పెద్ద ఉద్యోగంతో వచ్చి కన్నతండ్రిలాంటి రాఘవయ్య సారును ఇక మీద సుఖంగా చూసుకుందామనుకున్న రాముడుకు మరోసారి భగవంతుడు అన్యాయం జేసిండు. గురువు కాళ్ళ మీద పడి కన్నీరు మున్నీరుగ ఏడ్చిండు. రాముడు భుజంతట్టి, నిమ్మలపరిశిండు శంకరన్న. రాముడు రాఘవయ్య సారుకు కన్నకొడుకులాగ దగ్గరుండి అంత్యక్రియలను పూర్తిచేశిండు. సారు ఓ ప్రమాదంల అయిన వాళ్ళందరిని పోగొట్టుకుండు. తనను సొంతబిడ్డలా చూసుకుండు. రేయంతా ఆ జ్ఞాపకాలతో చీకట్ల తనివితీరా ఏడుస్తూనే ఉన్నడు. మర్నాడు పొద్దున్నే పయనమవుదామని అనుకుంటుండగనే, ఆ ఇంట్లో పన్జేసే వెంకయ్య పిలిసిండు. సారు గదిలో వున్న డైరీని తెచ్చిచ్చిండు. రాముడు డైరీని ఆత్రంగా చదవడం మొదలుపెట్టిండు.
'నా జీవితంలో గెలిచిన జ్ఞాపకం రాముడు. ఏకాకిగున్న నాకు విధిని జయించి, ప్రయోజకుడయి వస్తున్న రాముడి గెలుపులో నా గెలుపు దాగుంది'' అని సంతోషంగా రాసుకున్న విషయం చివరిపేజిలో ఉంది. ముందు పేజీలను తిప్పేస్తున్నప్పుడు అసలు విషయం అర్ధం అయింది. ఈ మధ్యే వివిధ కారణాలతో అనాధలయిన ముగ్గురు పిల్లలను చేరదీసిండు. వారి ఆలనాపాలనకు తన పెన్షన్ డబ్బులు సరిపోతల్లేవని బాధపడ్తూ, పెన్షన్ డబ్బులు సరిపోక వైద్యాన్ని కూడా వాయిదా వేసుకున్నట్టు అందులో రాసుంది. తనకు ప్రాణాపాయం ఉందని తెలిసినా, ఆరోగ్యాన్ని లెక్కజేయకుండా ఆ పిల్లల భవిష్యత్తుకు ప్రాధాన్యత ఇచ్చిండు.
వెంటనే రాముడుకు గతం గుర్తుకొచ్చింది, ఆ రోజు ఆసుపత్రిలో తలకు దెబ్బతగిలి ఇంకాసేపట్లో చచ్చిపోయేట్టున్న తనతో బాటు, ఏడ్చి ఏడ్చి ఆసుపత్రిలోనే నాయనమ్మ జీవిడిశింది. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు ముసల్దాని శవంతో ఏం జేయాలో తెల్వని దిక్కుతోచని స్థితిలో శంకరన్న వుండు. అదే సమయానికి రోడ్డు ప్రమాదంలో బార్యను, బిడ్డల్నిద్దరిని కోల్పోయి, పుట్టెడు దుఃఖం, ఒంటినిండా గాయాలతో రాఘవయ్యసారు అంబులెన్సులో అదే ఆసుపత్రికి వచ్చిండు, అంత బాధలో గూడా ఆడ శంకరయ్యను జూసి, సంగతి అడిగి తెలుసుకుండు. అప్పటికప్పుడు తన ప్రాణాలు కాపాడడానికి డబ్బిచ్చి, నేనున్నానని చేరదీసి, కన్నబిడ్డలా జూసుకొని వద్దిలోకి తెచ్చిండు. తన జీవితానికి ఒక విలువనిచ్చి, కన్నతండ్రిలా ఉన్న గురువుగారి ఆఖరిచూపుకు నోచుకోని తన దురదష్టానికి బాధ పడ్తూ, ఆ డైరీ మొత్తం చదవడం పూర్తి జేసిండు.
డైరీ తిరగేస్తుంటే కదిలే ప్రతి పేజీల వారు నడిచిన త్యాగపు గుర్తుల అడ్గుల జాడ ఉంది. పీట మీద పెట్టిన రాఘవయ్యసారు దండేసి వున్న ఫోటో ముందు దీపం ఎలుగుతుంది. ఆ దీపపు కాంతిలో రాఘవయ్యసారు నవ్వులలో నిస్వార్ధ అడుగుల ఎలుగులున్నట్టనిపించింది. ఆ ఎలుగులల్ల తన చుట్టూ వున్న అందరి కర్తవ్యం మనసుల మెదిలింది. నాయనమ్మ పెంపకం, శంకరయ్య సామజిక బాధ్యత, గురువుకు శిష్యుల ఎదుగుదల మీదున్న గురుతర బాధ్యత, ఉద్యోగంలో తన భావికర్తవ్యంను ప్రభోదించినట్టుగా అన్పించింది. ఆ ఎలుగుదారిలో పోవాలని నిశ్చయానికొచ్చి రాముడు పిల్లలను తీసుకొని కర్తవ్య నిష్టతో కారెక్కిండు.
- శీలం భద్రయ్య 9885838288