Sat 22 May 22:38:04.335018 2021
Authorization
మూడు గుండ్లల్లా.. నా ముద్దు లింగా..
పల్ల జడలోడా.. పదివేల శరణు...
తల్లి పార్వాతీ... నీకు శరనమ్మా...
అహ అహ హౌ.. అహ అహ హౌ..
గజ్జెల లాగు, పూసల కుల్ల, బండారు బొట్టు, చేతిలో వీర గోల, మెడలో రుద్రాక్షలతో పూనకంతో ఊగిపోతున్నడు వీరయ్య.
'శరణు శరణు సామి పదివేల శనార్తి. ఉన్నది ఉన్నట్టు చెప్పాలె. నా మనసులున్న మాట చెప్పాలె'. రెండు చేతుల తోటి పబ్బతి బట్టి గద్దెకు మొక్కుతుంది మల్లమ్మ. అది మునుగోడు పక్కన పల్లెటూరు. వీరయ్య కొలుపు చెప్తడు. చుట్టు పదూర్ల జనం వీరయ్య దగ్గరకు వస్తుంటరు. ఆరోగ్యం బాగ లేక కొందరు, ఆర్థిక పరిస్థితి అనుకూలించక కొందరు, గొడ్డు గోదా తప్పిపోయినవని కొందరు ఇలా అనేక సమస్యలకు పరిష్కార కేంద్రం వీరయ్య.
వీరయ్య ఇంతకుముందు గొర్ల గాసేటోడు. ప్రతి మంగళ వారం కొలుపు చెప్తడు. మొదట ఒకరిద్దరు వచ్చేటోళ్లు. ఆ నోటా ఈ నోటా పాకి ఇప్పుడు ప్రతి మంగళవారం జాతర సాగుతున్నది. గుడిసెల ఉన్న వీరయ్య ఇప్పుడు చిన్నపాటి బంగ్ల కట్టుకున్నడు. కొలుపు చెప్తందుకు ప్రత్యేకంగా గుడి కట్టుకున్నడు. చిన్న కారు గూడ కొనుక్కున్నడు. మంగళవారం మాత్రమే ఇంటిపట్టున ఉంటడు. మిగిలిన రోజుల్ల బాగ చేసెతందుకు భక్తుల ఇళ్లకు పోతడు. కొమురెల్లి, అయినవోలు, ఏడుపాయల దుర్గమ్మ, కొరివి వీరభద్రుడు, చెరువుగట్టు జాతరలకు పోతడు. తనతో పాటు ఊర్లో కొంతమంది మహిళలను ఉచితంగా ప్రత్యేక ఆటోలో ఆ జాతర్లకు తీసుకుని వెళ్తడు. ఖర్చులేకుండ జాతరలకు తీసుకపోతున్నడని వాళ్లకు కూడ వీరయ్య అంటే ఎంతో గౌరవం. అక్కడ ఈయన శిగం ఊగుతుంటె ఇతని మహిమల గురించి వెంట వెళ్లిన భక్త మహిళలు ప్రచారం చేస్తరు. అడిగిన వాళ్లకు తన విజిటింగ్ కార్డులు ఇస్తరు. ఇట్ల ఇప్పుడు వీరయ్య ఇంటికి ప్రతి మంగళవారం రంగారెడ్డి హైదరాబాద్ వరంగల్ వంటి ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తున్నరు. తన వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలైతున్నది.
'నీకు నరదిష్టి ఉన్నది చెల్లె
నన్ను లెక్క చేస్తలేవు కదనే'... శిగం ఊగుతూనే చెప్తున్నడు వీరయ్య.
'ఏం లెక్కచేయలేదు సామి....? నిన్నే నమ్ముకున్న... నీట ముంచినా నువ్వే పాల ముంచినా నువ్వే....' పట్టిన పబ్బతి విడువకుండ అంటున్నది మల్లమ్మ.
నువ్వు రెక్కలు ముక్కలు చేసుకున్నా బర్కతి ఉంటలేదు. లోకులు మాత్రం నీకేం తక్కువ అనుకుంటున్నరు. నిజమేనా? నిజమైతే నిజమను. లేకుంటే అబద్ధమను అన్నడు వీరయ్య. సాధారణంగా తన దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ మొదట ఇట్లనే అంటడు. ప్రతి పేదింటి పరిస్థితి కూడా గిట్లనే ఉంటది కాబట్టి 'నిజమే స్వామి... నువ్వు చెప్పింది నిజమే' అన్నది మల్లమ్మ అందరి లెక్కనే.
'ఎట్లా చేయమంటవ్ స్వామి... నన్ను నలుగుర్లో కలిపే బాధ్యత నీదే... నువ్వు ఎట్ల చెప్తే అట్ల చేస్తా...' అన్నది.
'నీ ఇంట్ల తాతల నాటి నుంచి ఎల్లమ్మ ఉన్నది. మీ మామ కాలం నుంచే లెక్క చేస్తలేరు. నాకు పండగ చేస్తేనే నిన్ను చల్లగ చూస్త' అన్నడు వీరయ్య. వీరయ్యకు ఎల్లమ్మ దేవత ఆవహిస్తదట. అందుకే తానే ఎల్లమ్మ లెక్క మాట్లాడుతడు.
కౌలుకు తీసుకుని చేసిన భూమిల పత్తి పంట వేస్తే దీపావళి వానలకు అంతా ఆగమయింది. పెట్టుబడి కూడ ఎల్లక ఇప్పటికే అప్పులపాలు అయిన్రు మల్లమ్మ దంపతులు. ఇప్పుడు పండుగ చేయాలంటే ఎట్ట లేదన్న లక్ష రూపాయలు కావాలె.
'కడుపుల పేగులు లేనిదాన్ని. అంత ఖర్చు నా వల్ల అయితదా? నువ్వే చెప్పాలె స్వామి...' మళ్లీ వేడుకుంది మల్లమ్మ.
'పోతుల గోసి బోనం పెట్టమన్ననా? మీ ఇంట్ల ఉన్నది బాపన ఎల్లమ్మ. గుమ్మడికాయ తోటి పండుగ చేయాలె. ఎన్నటికైనా నీకు ఇది తప్పదు.' తేల్చి చెప్పిండు వీరయ్య.
'గద్దె దిగిన తర్వాత కలువు. దాని ఇగురం చెప్తా' అన్నడు. వీరయ్య రెండు కాళ్లకు దండం పెట్టి బయటకు వచ్చి కూర్చుంది మల్లమ్మ.
వచ్చిన భక్తులలో కాస్త ఆర్థికంగా స్థితిమంతులై ఉండి పండుగ చేయాలని ఇష్టపడే వారికి మీ ఇంట్ల సూదరి ఎల్లమ్మ ఉన్నది యాటలు కోసి ఘనంగా పండుగ చేయాలని చెప్తడు. అట్లా లేని మల్లమ్మసొంటి పేదలు వచ్చినప్పుడు బాపని ఎల్లమ్మ ఉన్నదని చెప్తడు. ఇట్లా గిరాకి పెంచుకోవడానికి వీరయ్య దగ్గర చానా సవరణలుంటయి.
వీరయ్య శిగం చాలించినంక మల్లమ్మను లోపలికి పిలిచిన్రు. 'దేవుడు ఏం చెప్పిండు?' అని అడిగిండు వీరయ్య. తాను శిగంలో ఏమి చెప్పాడో తనకు గుర్తు లేదన్నట్టు నటిస్తూ.
'పండుగ చేయాలంట. ఇప్పటివరకైతే ఎన్నడు చేయలే. ఎట్లనో ఏమో' అన్నది మల్లమ్మ.
'నేను చూసుకుంట కదా! ఒగ్గు వాళ్ళు, పూజారి బాధ్యత నాది. పండుగ సమాను రాసిస్త తెచ్చుకో. నీ బుద్ధిల గలిగినంత కట్నం ఇయ్యి.' అన్నడు వీరయ్య.
'ఎంత ఖర్చు వస్తది స్వామి...?'
'దేవుని లగ్గం కాడ పూజారి నేనే... నాకు నువ్వు ఇచ్చినా చేస్త ఈయకున్నా చేస్త. ఒగ్గోళ్ళు ఉత్తగ రారు గదా! మామూలుగ నలభై వేల దాకా తీసుకుంటరు. నీ పరిస్థితి బాగలేదు కాబట్టి ముప్పై ఐదు వేలు ఇయ్యి.' అన్నడు వీరయ్య.
అంత ఇచ్చుకోలేనని బతిలాడి ముప్పై వేలకు ఖరారు చేసుకుని ఐదు వేలు బయాన ఇచ్చింది.
'దేవుని లగ్గం కంటే ముందు మీ ఇంట్ల పిందార చేయాలె. అది చేసినంక నాకు చెప్పు. లగ్గం పెట్టి మైలలు తీస్తం.'అన్నడు వీరయ్య.
'మా మామ చచ్చిపోయినప్పుడు పిందార పెట్టినం స్వామి. మల్ల పెట్టాల్నా...?'
'అది సావు పిందార. ఇప్పుడు ఏడిక పిందార. తప్పకుండా పెట్టాలె. అదే నీకు బర్కతి.' అన్నడు వీరయ్య.
'ఒక గొర్రెను బలి ఇచ్చి పిందార చెయ్యాలె' అన్నడు.
'ఇంట్లో బాపన ఎల్లమ్మ ఉంది కదా! యాటలు ఎక్కుతయా మరి?' అడిగింది మల్లమ్మ.
'పిందార కాడ తప్పు ఉండదు. పిండమ్మకు గొర్రె కోయాల్సిందే' అన్నడు వీరయ్య.
పిందార పనులు చకచకా సాగుతున్నయి. ఇంట్ల బర్కతి బయటకు పోవద్దని ఇంటి లోపలనే పెద్ద గుంట తీసిన్రు. ఆ రోజు వచ్చిన వాళ్ళు తిన్న విస్తర్లు అందులోనే వేయాలె. చేతులు కూడా అక్కడే కడగాలె. పక్కనే కట్టిన గుడ్డకే చేతులు తూడ్సుకోవాలె. పాలోళ్ళందరు బలి చల్లుకోవాలె. చాకలి రాములు, కుమ్మరి బిక్షం, మంగలి నరసింహ సాయంత్రమే వచ్చిండ్రు. పిందారలో పూజారి కుమ్మరి. ఆవుపేడతో అలికి ముగ్గు పెట్టి పిండి బొమ్మను చేసి అందులో పెట్టి పసుపు కుంకుమలు జల్లి కల్లు ఆరబోసిండు. జొన్నల బువ్వ నైవేద్యంగా పెట్టిండు. రాములు గొర్రెను జల్త పట్టి దేవత ముందల బలి ఇచ్చిండు. గొర్రె రక్తంలో జొన్న బువ్వ కలిపిండు. పాలోళ్లు మగవాళ్ళందరూ దేవత ముందు గుంపుగా నిలబడ్డరు. చాకలి, మంగలి, కుమ్మరి ముగ్గురు కొత్త చాటలో రక్తం కలిపిన జొన్న బువ్వ తీసుకుని అందరిపై బలి చల్లిండ్రు. వేప మండలతో కల్లు చిలకరిస్తూ కోబలి... చల్లని బలి అంటూ చుట్టూ తిరిగిన్రు. ఇలా చేస్తే బర్కతి ఉంటుందని నమ్మకం. అందరూ స్నానాలు చేసి వచ్చిన తర్వాత గొర్రెను కోసి భోజనాలు పెట్టిన్రు. తెల్లవారి పిందార గుంటను పూడ్చిన్రు. ఈ కార్యక్రమానికి సుమారు పదిహేను వేలు ఖర్చు అయినయి.
ఎల్లమ్మ పండుగ పనులు ప్రారంభమైనరు. ఇంటికి సున్నం వేసిండ్రు. ఎల్లమ్మ బాండువలు, పండుగ సామాను తెచ్చిన్రు. చుట్టాలందరికి పండుగకు రావాలని ఫోన్ చేసి చెప్పిన్రు. తెల్లారితే మైలలు తీసుడు.. ఒగ్గు వాళ్ళు వచ్చిండ్రు. వడ్ల తోటి మైల పోలు రాసిండ్రు దేవతల విగ్రహాలు ఫోటోలు అక్కడ పెట్టి మైలలు తీసిండ్రు. అందరికీ బండారు బొట్టు పెట్టి ఒగ్గు కథ చెప్పిన్రు. ఆరోజు కూడా పాలోళ్ళందరూ వచ్చిండ్రు. మైలలు తీసినందుకు ప్రత్యేకంగా మరో మూడు వేలు తీసుకున్నరు.
మైలలు తీసిన మూడో రోజు పండుగ మొదలైంది. డోలు తాళాలు గజ్జెల లాగుల మోతలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. పుట్ట బంగారం తెచ్చిన్రు. దేవుని గదిలో గద్దె వేసిండ్రు. ఆ గద్దె పయి బాండువలు పెట్టిండ్రు. తరువాత గంగ స్నానానికి సమీపంలోని బావి వద్దకు వెళ్ళిన్రు.
ఒక్కొక్క డప్పంట - ఒక్క శివ సత్తంట
కాలు కదిలించమ్మో - మావురాల ఎల్లమ్మ...
గద్దె కదిలించమ్మో - మావురాల ఎల్లమ్మ...
ఒగ్గు బీరయ్య ఆవేశంగా కథ చెబుతూ ఉంటే చాలా మంది మహిళలకు పూనకాలు వచ్చినై.
తర్వాత ఇంట్ల పటం వేసి ఎల్లమ్మ మునిరాజు లగ్గం ఘనంగ జరిపించిన్రు. పుస్తె మట్టెలు, ఎల్లమ్మ మునిరాజు రెండు జతల ఎండి కండ్లు, మునిరాజు ఎండి కోరమీసాలు చేపించింది మల్లమ్మ.
అల్లో నేరెడల్లో - అల్లో నేరెడల్లో
ఎల్లమ్మ మునిరాజు పెళ్లిళ్ల నాడుఅల్లో నేరెడల్లో
అల్లో నేరెడల్లో - అల్లో నేరెడల్లో
రాలేటి చుక్కలు రంభ తలవాలు అల్లో నేరెడల్లో
అల్లో నేరెడల్లో - అల్లో నేరెడల్లో
పొడిచేటి చుక్కలు పోలు ముంతాలు అల్లో నేరెడల్లో
దేవుని లగ్గం పేరుమీద కట్నాలు వచ్చిన చుట్టాల నుండి బాగానే వసూలు చేసుకున్నడు వీరయ్య. ఈ కార్యక్రమం అంతా వీరయ్య పర్యవేక్షణలోనే జరిగింది. తనకు రావాల్సిన కట్నం వెంటనే వసూలు చేసుకున్నడు. తొలుత పండుగ కాబట్టి డోలు తాళం మీద వెయ్యి నూట పదహార్లు, లగ్గం కోటు మీద వెయ్యి నూట పదహార్లు, ఒగ్గు వాళ్లకు దూప దీర్పుతందుకు మరో వెయ్యి నూట పదహార్లు అదనంగా వసూలు చేసుకున్నడు.
వచ్చిన చుట్టాలు ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళి పోయిన్రు. అనుకున్నట్టు దేవుని లగ్గం కూడ చేసిన ఇక నా బతుకు బాగయితది. మన్ను పట్టుకుంటే బంగారం అయితదని మురిసిపోయింది మల్లమ్మ.
రెండు నెలలు గడిచినరు. పండుగకు దొరికిన కాడల్ల యాభై వేల దాక చేతి బదులు తెచ్చింది. షావుకారి నర్సయ్య శేటు కాడ యాభై వేల రూపాయలు రెండు రూపాయల మిత్తి కాడికి తెచ్చింది. మల్లమ్మ నోటి లెక్క చూసుకుంటే లక్ష రూపాయలకు పైనే అప్పు అయింది. అప్పులు ఇచ్చినోళ్ళు ఇంటి చుట్టు తిరుగుతున్నరు. మల్లమ్మ భర్త మారయ్య గొడ్డు కష్టం చేస్తడు. సంసారం మంచి చెడ్డ, ఒకరికి ఇచ్చుడయినా, ఒకరి కాడ తెచ్చుడయినా మల్లమ్మే చూస్తది. ఇప్పుడు చేతి బదులు ఇచ్చిన అప్పులోల్లు ఇంటి చుట్టు తిరుగుతుంటే ఆలుమగల మధ్య కూడ అప్పుడప్పుడు పంచాదులైతున్నరు. ఎల్లిఎల్లని సంసారాలల్ల ఇది మామూలే.
'బర్కతి కలుగుతదంటివి. ఇంకింత అప్పులపాలైతిమి' అని గులుగుతున్నడు మారయ్య. ఎంత కష్టం చేసినా అప్పులు తీరుత లేవని దేవుని దగ్గరకు పోతే ఇంకో లక్ష ఎక్కువ అప్పు అయింది. మరి బర్కతి సంగతి ఏమిటో అర్థం కాక తల పట్టుకుంది మల్లమ్మ.
- సాగర్ల సత్తయ్య, 7989117415