''ఓ బూదవ్వా... కొమ్ములెన్నడు గొడ్తరె యెక్కడోల్లక్కడ సడ్డమాల్నట్టు గూకుంటర్రు యెన్కట్లెక్క నపరో పనంద్కున్తట్గ లేదాయె. పురాగద్వానం జేత్తర్రు. గింతన్నాల మేడ జూల్లేదవ్వ వోలుగాకుంటోలు ముంగటవడి యేగిరవెట్న సుత పిల్ల పిలగాడు పోలుమీన్కచ్చెటాల్లకు యేదోటితక్వై గావర్గావర సదుర్డే వుంటది. లగ్గమంటె లచ్చె పన్లుంటయి గుర్గులాటానె.. యివారకైతె సుట్టపోల్లంత దాపున్నే పల్లెల పొంటనే వుండేది. తీర్పాట మైనంకచ్చి యేదో సారిగంజేసేది. కూరాల్లసంది సాలైతె లగ్గం నాగెల్లై మల్రువెండ్లి నల్లవూసల్గుచ్చుడు వోడ్నింపెరాక పిల్లజెల్ల ముస్లిముత్క యింటింట్రాజు లంతగూడి నాత్తిరి పగలు పద్రోజుల్రాక కండ్లపండు గోలుండేది. యింట్లందరు మత్తు సంబ్రంగ రామసక్కదనంగ రిండు కుండోలుండేది. గిప్పుడొ యెవుసమిడ్సి పొట్టశేతవట్టి మెత్కులిస్రేసినట్గ ఆడో లాడోలుండ్రి ఆల్లందర్కి సువరాకలు వంచటాల్కే ఆరంపద్రోజులు వట్టుద్ది. పంతుల్నడిగి మంచి గడియెన్నడో జూశిజెప్పన పనుల్సురువు జెయ్యాలెగదనే''
''అగొ... నోర్నెత్తిల వెట్కోని మొత్కున్నాగని యెవలకినత్త లేదా వూ... లేదు ఉప్రాయి లేదు. గిట్ల గుడ్లెల్లవెట్టి బీరిపెయి కూకున్నవేంది. పెయికాకచ్చి పానంగిట్ట మంచ్గలేదాయే...''
సారక్క అల్కిడికి జెట్న సద్రుకున్నది బూమవ్వ.
''యెమ్మోనె సారక్క నాపానం పింజెం పింజెమంటంది. కాల్జెయ్యాడ్త లేదు. శెప్తినని మన్సులవట్కోని గుంజ్కచ్చుడు నాక్వశ మైతలేదు. కుక్కతోకవట్క గోదారీదుడు యెన్నేండ్లవ్వ... ఆబయేండ్లు దాట్నయింకా శిన్న మొల్లికాయోలె జేత్తెట్లగెల్తునే రాములా... కంటిమీన రెప్పవడ్తొట్టు వొగోపాలి గుండెల్ల కల్కుమంటంది. పిడాత. పానంబోద్దోమోని జల్లు మంటంది. నడ్జాంలేశి సర్వసాకిర్జేశి యింతు డ్కవెట్టాడ వారేశి బుక్కెడంత సల్లవడి పొల్లగాడు నీను యేగిల్వారం గావల్కెల్తె యిల్లు జేరెవారకు పొద్దూకి నాత్తిరైతంది. కుండకెగవడి బొందిల కచ్చెరాక గుదిచ్చుకున్డు మల్లాయిల్ల మేశ్టానికి సుత పిట్ట కెదిర్సూసుడు... గంజుల్లుంటె దిన్నట్టు లేకుంటెవన్నట్టు మాపనైతె అయ్యలపానం గుయ్యల కత్తందన్కొ''
కాలుకు బట్టకట్టకుంట పొద్దెల్ల నీల్లు నిప్పుల్లేక ఆపనీపని సక్కవెట్కోనచ్చి మల్లండి పెట్టుడంటె నియంగ పానం లీల్లైతంది. నమ్ము నమ్మపొ మత్తు దుక్కమత్తంది. పెయ్యంత పచ్చి పుండోలుంటంది గింత తట్లేశ్టోల్లుంటె మింగినీల్దాగి సప్డేకమల్తుం. మంది మాగున్నరుగని యేంపాయిద యిసంటి బేమాన్లని ఆల్లు గల్మ సుద్దాటరు. దేన్కైన బాకిసమందం గావాలెపటు.''
''అగొ... గిట్ల దైర్నంజెడ్తె నడ్తాది. దేవిన్మీన నమ్మికతోటి నువ్వు ముంగటనడ్తెనె పొలగాడెన్క సవరిచ్కత్తడుగనీ తిని కూకుంటోల్ల మాట వట్కుంటె మాగెల్గవెట్నట్టె. వొక్కపొల్ల... వున్నంతల సరన్తట్గజేశి ఆల్ల శేతుల్లవెడ్తె అటెంకెట్లై తట్లా యెపటు. ముప్పైయేండ్ల సుంది యెమ శెరలవడ్తానవు యింకాల్లు మార్తరని ఆశె పడ్తానావు. గల్మల్లకచ్చిన సమందం కండ్లకద్కోని కల్పుకోవాలెగని అడ్డగాలేశ్టోల్ల అర్కీసు నమ్మద్దెపొల్లా... యివారకే శెవ్లు వట్కోని బస్కీల్దీస్నట్గ కూకుండు మంటె కూకున్డి లెమ్మంటె లేస్కుంట అశెగతమైతన్నవు... యిగనన్న మేలుకోయే... లగ్గమంటె అట్టిగైద్దా సవాలచ్చె సద్రన్నాయె పెండ్లనంగ యిల్లనంగ పైసొపర్కో మావుట్టుద్దిగని పనుల్సానున్నయి పా...పా... జెప్పనవొయి మంచిరోజు అర్సుకద్దాం పా.... యింక సురువేకాలేదు గిట్ల గూల వడ్తెట్లనే... నీదే దీరెగావాలె గని మాదేమున్నది. సిన్నొసిత్కో మీది పనులంద్కుంటం గంతేకని యెవారమంత సక్కవెట్కునేదె నువ్వాయె. రందివెట్కోని మనాదిన వడ్తెట్లనె మనాద్కి మందేలేదు. వొక్కదానవు యెంత రెక్కగొట్కున్న పాయిదలేత్తీ. బగమంతుని రాతదప్తాది... కూకోవెట్టి సొదకున్నాగని కులంల మీమే గొప్పని సంకల్గుద్దుకుంట్రాయె. కరుమగా పోతేందిపటు. ఆడివిల్లను గన్నందుకు వొగయ్యకప్ప జెప్పెరాక ఆడోల్లకున్నంత రంది మొగోల్లకుండత్తియ్యే బూద... అన్బగించెటోల్లం సుమా ఆడిదాని కట్టంసుకం యిసారింపుసుత మనకేపటు. వొక్కశిత్తం జేస్కొ మాటల్తోటి కోటల్నిలువయి గని లే...లే...జెట్న వొయ్యద్దాంపాయే....''
''గట్లగాదె సరక్కా... పూల్పండ్లనాడు సూత్తివి గద యిజ్జతివొయ్యే కతైందా లేదా. యేదో శెప్పలేదనకుంట మా మ్యానమామ లైద్గురు ఆల్ల నాయిన తర్పోల్లంత గాను ఆబైర్వై మందన్కుంటె యిల్లెక్కి యిర్వై మందిని పంద్రెక్కి పదిమందిని మాకెర్క లేకుంటనే పిల్శె... అందమంది కంటల్జేపిత్తె నూర్నూటాబై మంది దిగిరి పాపమాల్లదేం పొర్పాటు గనీ.. అదోటిదోటి జేశి అవారకే అంటలోడావల వడె. అచ్చినోల్లకింత పప్పో పులుసోన్న వెట్టపోతెట్ల నగుబాట్ల పాలౌడాని యిజ్జతికి సచ్చిన. కుయ్యిమనకుంట దేవుడాంట ఆల్లనీల్ల బత్లాడి బామాడి మల్లండిత్తి. యెట్లెట్ల జేత్తరో యీల్లతమాశె జూత్తనని గూకుంటె నీనెట్లేగిత్తునే దేవుడ... యేడన్నవడి సావన్నా బత్కనే... పొల్ల మంకువడ్తె నన్నాడిపోస్కుంటారవ్వ. ఆడివిల్లన్నంక యియ్యల్ల గాపోతె రేపు యిదిగాపోతె యింకో సమందాన్కైన కాల్లుగడిగి దార వోసుడేనాయె. పొల్లగాడు ఆడీడవడి వుప్పో తొక్కోతిని మాబత్తడుగని ఆన్కి అప్పులెత్తద్దు శెల్లెరందుండద్దని తండ్లాటకు అంబాడ్తన్న నవ్వా...
తలదాస్కుంటాన్కి వోగూడైతున్నది యెట్నో సదుర్కోని జెల్లిన పొల్లన్దా టియ్యాలంటె శెంటెమింటెనా యిల్లోయిల్లోని పోరాయె నిందె ల్మోపుడాయె.. అయినోల్లు కానోల్ల ముంగట యిజ్జతికి సచ్చుకుంట ఇర్వైలచ్చెలప్పుజేసి సావునంల పాలు వొంగిత్తె దసర దివిలి వారకే సమందం గుదిరె, కొమ్మపున్నాన్కి లగ్గం రానేచ్చె శేత్ల సిల్లిగవ్వలేదాయె. బంగారమోలె అప్పులేకుంట మారాజ్గ పొల్లదాటపోనా యెంతకను ర్కుతునక్కా.. పుత్తెగట్న సంది పుట్కన పానంబోతెనె రంది వాసునే. యేమిట్కి తుర్తిలేని బత్కు బత్తేంది సత్తేంది పో... పోరగండ్ల బాజ్జితున్నదని జెరెన్కకు గుంజుకున్డు గంతేకని వో మాట సాయంలేదు మూటసాయం లేద్గని అంబట్లతుర్రోలె అన్నిట్లకచ్చుడు అడ్డగాలేసుడాయె యేందోత్తదీ యెట్లైద్దేవ్వ...
ఆల్లపున్నెమన్కొ కాటిక్కాల్జాపినసుత మా బాపు మన్వరాల్కు పుత్తెమట్టెలు, కాల్లుగడిగే శీరె నీకు, అల్లున్కి మన్వన్కిసుత బట్టల్వెడ్తన్నడా... బండక్బండ ఆబైవేల ముద్దదెచ్చి శేత్ల వెట్టిండు. పెద్దశెల్లె బోల్లుబొచ్చె వెడ్తనన్నది. శిన్నది గుండ్లు జేంచ్తనన్నది. గంతేసాలు యేన్నీల్లకు సల్లీల్లోల్గె.
యిగ నీయసంటి సోపతోల్ల సాయాన్కైతె అంతే లేదన్కొ. మాటసాయం మూటసాయం శేతికట్టం గిట్లెన్ననిజెప్పుడు. కూకుంటెలేత్తె మీలుర్కుడు నన్నుర్కిచ్చుడు... జనుమ జనుమాన మీ బాకిల వడ్డ... వొక్కతల్లి కడ్పుల పుట్టలేదన్నట్టే గనంతకన్న కోటొక్క పాలెక్వ....''
''అయ్యో... మా సాల్తీ యేమన్న మొద్దుల్మోత్తన్నమా యేంది వోలకోలం తోశింది జేత్తెనే పెద్దగొప్పానె... అగొ రానర్సక్కసుత రానేచ్చింది లే...''
''సారక్క యెప్పుడచ్చినవే శెప్పపోతివి. యిద్రంగూడత్తామని మీంటిక్వోతె అప్పుడే పెయింది పోశెల్లే... జెరైనంక నీన్సుతత్తగనని మాన్నన్నడు. యియ్యల్లీనెసుత యేంపన్లేదు మాత్తపోయేన్నడు. వుత్తగనే కూకున్నరు పన్దోత్తలేదాయె...''
''యే నీనచ్చి పొంటె జామైంది యిదిలేత్తలేదు పడ్తలేదు... పనిగానిత్తలేదు. గట్లగాదె నర్సక్క... బూదక్క బాదలు యెన్కట్సుంది మనకెర్కలేదా సూడె. సువకార్యం ముంగట వెట్కోని వొక్కటె పొగుల్కుంట యెక్కెక్కిపడి కండ్లలీల్దీత్తాంది యేంజేసుడు...''
''వో బూదా.. పిచ్చిగిట్ల లేశ్నాదె వూకుండు. మీయవ్వ గీపేరేమిట్కి వెట్టిందోకని తప్పదే... మెడక్వడ్డ పాం గర్వకిడ్వది పటు. యేమిట్ల కేమైంది కట్నాలా కానికలా పిలగానోల్లు శాన మంచోల్లన్కొ. లగ్గం జేశిత్తాడ్కే మారాజ్ల మన్నరు. కాల్లుగడిగి పిల్లనిచ్చే బాగ్గెమందర్కి దక్కుద్దాయె... నాకొక్క పొలగాడాయె నర్సవ్వకిద్దరు కొడ్కులేనైరి. అండ్లవడ్డనాడు అర్సుకున్తాన్కి దేవుడొక్క ఆడివిల్లనియ్యపాయెని మీమెంతేడ్తన్న మెర్కేనా... నీ బిడ్డకేందె బంగారమోలె మాగొప్పోల్లింట్ల వడ్తంది. అల్ల మరియాద సూత్తేర్పడలేదానె.. ఆల్లు దనాన్కి గాదుగని గునాన్కైతె సాన్నే గొప్పోల్లు. పాపం పొల్ల శిన్నప్పట్సుంది నీ కట్టం జూశే గిట్లొక్కశిత్తం జేస్కున్నది గాదె... నువ్వు దైర్నంగుంటెనె దానికి సంబ్రంగనీ లేకుంటె మన్సిర్గదాయే... ఆడివిల్లను యెన్నట్కైన వొగయ్యశేత్ల వెట్టుడేవుంటది. అచ్చిన సమందం గాదని అంతకంటె సక్కన సూస్కచ్చే దిక్కులేదు సేస్కచ్చేదాయింతలేదు. పరుమాత్తుడే తొవ్వజూపిండని ముంగట్కి నడ్వాలెగని యెన్కకు మల్రిసూత్తేమున్నదే యెప్పటిశిప్పె నుగుల్నే కాకుంటె... అయినగని నీకు తల్లెన్క తల్లంటవు వుసమ్మ మాటలాదిమర్సినవా. బగమంతున్మీన బరువేత్తె బాజ్జితంత ఆయినదేని లచ్చెనూర్మాట్ల జెప్పిందని లేత్తెకూకుంటె మత్కిజేత్తవు. గావ్వమాట అచ్చురం పొల్లువోకుంట అయితందన్కొ... నువ్వోమన్న సమందాన్కి యెదుర్సూశ్నవా... అసల్కు పొల్లదింక సద్వేగాపాయె లగ్గం జేత్తమన్కున్నవా దేవిన్దీవి నార్తులున్నయి, సువగడ్య లచ్నయి. పెద్దలమాట సద్దోలని అట్టిగన్లేపటు... నమ్మికతోటి గాల్లెదీపం బెట్న సుత మీదోన్దయన తప్పకెలుగుద్ది. కండ్లు దూడ్సుకోని జెట్న బైలెల్లుపా...''
పిల్లనైద్రోజులు పెండ్లిపిల్లన్జెయ్యల్నట... మూర్తబలం గాకుంటె పసుపు గొట్నంక వొక్కట ేనాడు బట్టబాత, బంగారం, బోడిబొక్క పన్లు మూడైనయి. ఆరంరోజుల్ల సువరాకలు వంచుడైంది. ఐతార్నాడు పందిట్ల మాడంటి ముత్తైదల్తోటి తలక్వోయించుడు ఆనాడే గాజులు మైదాక్సుత వెట్టిచ్చుడాట. సొమార్నాడు ఆయిల్ల కూరాల్లు. మంగ్లారం నాడే మైలపోలు ఐరేండ్ల పూజ్జేస్కోని పిలగాన్నెదుర్కోవల్నట. బుజారంగోలె లగ్గం నాగెల్లేనాయె. బేత్తారం ఆల్లింట్ల నోమాట సుక్కురారం లేదు. సనార్నాడు మనింట్ల. ఐతారం వోడ్రింపుడు అటెంక పదారు పండుగు. యింక గూకుంటయిద్దా... అంత బగమంతున్దయ. మన శేతుల్లేమిలేదు. ఆయినెట్ల నడిపిత్తెగట్నే అనుకున్నరా సోపతోల్లంత వొక్కటయ్యిర్రు... బూదక్కను దైర్నంగ లిలవెట్టిర్రు. మాడకేశ్నసంది నోమురాక అంటమన్సుల మాట్లాడిర్రు పొద్దటీలి టిపిన్లు శావోసుడు పగటీలి పప్పుశారు పాపుడాలు రొండుతీల్ర కాయగూరలు వో రకం తొక్కు యింత సల్లబొట్టు పొద్దూక్సుత శాయిచ్చుడు నాత్తిర్కింత బువ్వ కూర.
''శిక్కెంటికెల్ శిక్కేంటికేల్...
గిన్నెలు గిలాసలు గంటెలు శెంబులు పల్లాలు నూనె కాన్లిత్తమవ్వా... వున్నాయక్క యెంట్కెలు వో... బూమక్కా... శిన్న జెర గీ గంపదించువిడ్డ పున్నెముంటది నాయిన. అగ్గొరో... సాయితలు ముగ్గురు వొక్కకాడ జేరిర్రు. యియ్యల్ల నాకు బ్యారం మంచ్గనేయిగ. అంతమంచేనా అవ్వలాల....'' బోల్ల సరోజ్నంటె వూరంత సుట్టమె. ఓడలు బండ్లైనట్గ యాపారం దివాల్దీశి గిట్లయింది పాపం.
''సరోయినక్కా.. సాన్దినాల్సంది మా ఆడల నల్ల బూసైతివి, గిరాకి మంచిగైతందా...''
''అవ్వల్లో... వో రానర్సవ్వా నీకెర్కలేని కతా... మీ యాడలంత నిమాస్ల బొమ్మలేనయ్యె వొక్కలన్న మీవోలె ముద్దుగ జెడేస్కుంటోలున్నారు. పోంటైల్లో యేమోంట్రు గాదవ్వ గట్నేవుంటరు. యిగ మీయాడలకేం రమ్మన్నవు నాకోమొ బ్యారంలేన్ది ఐదేల్లు నోట్లెకువోవాయె. యేంజెయి మన్నవు గంద్కే అట్మొకాన సుత కన్నెత్తి సూత్తలేనవ్వా... అయితాయెతీ బత్కుదెర్వు కాపాడుకున్నదే లెక్కపటు...''
''అగొ గదేనవ్వ పొట్టతిప్పలకు పాత్లాట. కాలజేత ముగ్గురాడి పొలగన్లైరి. ఆల్లన్దాటిచ్చే కట్టం మొగోల్లకంటె ఆడిదాన్కే యెక్వ గాదవ్వ. యివారకే నరజిష్టి పాడుజెయ్య యేడ్శేడ్శి న్యాల వట్టిచ్చిరి. మీయసంటోల్లు బ్యారం జెయ్యకున్నాగని ఆకిట్లకు విల్సి యిన్నిసాబొట్లో నీల్లో నిప్పులో యిత్తరుగని లోకమంత గట్లలేదు. బగ్గ బత్కిన్నాడోర్వలె గిప్పుడ్సుత గట్నె... పూలమ్మి కట్టెలమ్ముడైతం దవ్వలాలా... అంత లోకాన్కే పట్టి.
''సోది రామెండం కట్టెగాల్రాకున్నదే కని బుజ్జవ్వ లగ్గం బెట్కున్నారవ్వ. పెండ్లి బోల్ల బ్యారమైతె నాకేమరి... కాయం జేస్కున్న కాడ్కెల్లి కాల్లర్గెతట్గ తిరగుతాన నామీనొట్టె మరి ఆ... ''
''సూశ్నావె సరక్కా.. అదురుట్టం గాపోతె యెట్లెదురత్తర్రో సూడు... వో బూదా... యిగనన్న దైర్నం జేస్కోయే. బత్కిశెడ్డ సరోయనక్క జూడు మొండిగ బత్తలేదానె... జెర నువ్వన్న మా బూదకు బుద్దిజెప్తావు సరోయనక్కా...''
''అబ్బర బిడ్డో... యీల్లింట్ల కత నాకు మాయెర్కే నవ్వలాల. యీల్లాయినె నడింట్ల గూకోని శెక్కురం దిప్తడు. అవ్వను శెల్లె నదుపాగ్యల్ల వెట్లేకని యీల్లనైతె కోతులాటాడిత్తడు. పటేల్కెక్వ జమిదార్కు తక్వ. కూట్కి గుడ్డకు లేకగాదు పాపం యిజ్జతికేడ్తర్రు. కట్కున్నందుకు కాట్నంగడ్డకే తప్పుద్దిపటు...
సక్కదనాల పొల్ల సిల్కోలె పొల్లగాడు వున్నరో లేరో పాపం బిడ్డలు. ఆల్లకోసాన్కే బూమవ్వ బత్తందన్కోర్రి. అయినగని యేంది బూమవ్వ కోట్లువోశ్న కొనరాని సమందం కొంగు బంగారమోలె నవ్కుంట తుల్కుంట జేస్కోవాలెగని గిట్నా... సూప్కు సుంగారం కులాన్కి గునాన్కి బంగారం.. యిగేంగావాలె. యిల్లుగట్టి పెండ్లిజేశి సూడంటరు. అరిగోసపడి యిల్లుగట్నవు, నిండ మున్గిన సల్లేదన్కొ గిదింకో సవాలన్కోని పొల్ల లగ్గం జెయ్యి... ఆ యాల్లకు యెవలెవలో బాకున్నోల్లు బాగ్గెమున్నోల్లు అచ్చి శేత్తనేవుంటరు. అడ్డగాలేశ్టోల్ల వట్టిచ్కుంటె అడుగు సుతెయ్యం. మీలక్కన సాన గ్యానం లేదుగని మత్తు గన్బగించిన... తోడ వుట్టకున్నా అక్కోలె జెప్తన్ననన్కో...''ని బోల్ల సరోయనక్క గద్వవట్కోని శెప్పింది.
మ్యాదరి సువాకరన్న సుక్కురారం నాడే పందిరేశిండు. కుమ్మరి సమ్మక్క కూరాండ్లు ఐరేండ్లు వెడ్తన్నది. రవన్న పొలగాడు లైట్లకొప్కున్నడు. పూలమ్మే సుదాకరు పూలజెడగిట్ట మాజేశిత్తన్నడు. పాల్పెరుగు, మంచిల్లు గిట్ల మ్యానమామ జూస్కున్నడు. అంటసామాను అంటలయ్యగారు అందరు గుదిరిర్రు.
యిద్గద్గనెవారకు ఐతారం రానేచ్చె. ఎనిమిది గొట్టెవరకే పవీన్తమ్మి దేవక్క శెల్లచ్చిర్రు. శెవ్లకమ్మలు పాపెట్లబిల్ల పూలదండ గాజులు కంకునాలు గున్నాలు గుత్తులు జిగినీలు వొడ్డాలం... అన్ని శాబంతి పూలతోటేనుల్ల దేవక్కెంత ముద్దుగ పిల్లన్తయారు జేసిందన్కున్నరు యెన్కట సెకుంతలమ్మ బొమ్మ లక్కన్నే... తొమ్మిదైటాల్లకు వోలెన్కోలు అందరచ్చిన్లు.
మాపటీలి నాలుగ్గొట్రాక పనులైనయి. పొల్లకు పెండ్లి బొట్టు వెట్టి అందరు గాజులేయించ్కున్నరు. గా లెక్కంత రానర్సక్కే సూస్కున్నది. శిన్నశెల్లె సాయిత తుర్కోల్ల పొల్ల ఐద్గురుగాను ముద్దుగ మైదాకు వెట్టింది. అందర్కి కండ్ల పండుగ్గని అత్త ఆడిబిడ్డలకోమొ కండ్లమంట కడుప్మంట గావట్టె. అన్నం తింటురమ్మని అత్తను, గాజులు వెట్కుంటు రమ్మని ఆడిబిడ్డను బూదవ్వవొయి యెన్నిమాట్ల విల్సిన బత్లాడిన సుత రాలేదవ్వ.
''నాకు మొగల్లేడు నాబిడ్డకు లేడు నాకు నా బిడ్డకు గాజు లద్దన్న మద్దని.'' వొక్కటే సోకంబెట్టింది అత్త''
''పాపం.... దాన్నేం జెయ్యిమన్న వవ్వ ముసలోడై నీ మొగడువాయె రొండు మన్వులు జేశ్నసుత శెంకినేశమేశి నీ బిడ్డే తెంప్కోనచ్చి నీ దగ్గరజేరె. యింటి కెజుమాన్రాలై యెల్గియ్యవట్టె... నువ్వెంటేంది నీశాట్టలేందవ్వ, పెద్దమన్షివి గిట్నేన రిండింట్ల యేడ్సుడు తూడ్సుడు. యేమన్న సక్కదనమానవ్వ. మా సాలుగన్తీ... వూకుండు. అయ్యో దేవుడో... రాములా దాన్రాతే గట్లుండె యీ పొల్లకన్న సక్కదనముండల్నన్కోవా... అందర్నన్నట్గనే సుండినోరు వెట్కోని గాకొత్త పొలగాన్సుత పాసున్నదా బంకున్నదా యేమున్నదని మొకంబట్కో నంటివి... యేం గావాల్నవ్వ గునం మంచైతె సాలదా. నీకు బొచ్చెడ్రూపాలుండి యేం పాయిద. కోట్లకున్నవు యెవ్వలకన్న యెన్నడన్న బుక్కెడు కూడు వెట్నావు. ఆముదానెంద్కవ్వ అగ్గి వెట్కోను. ఆయిమన్న గునం గావాలెగని. యేంగొంటవోతవు ముసల్తనాన్కచ్చినవు గింత వుచ్చిల్తనమెంద్కవ్వ. పూలుపండ్లనాడ్సుత కడుప్మసిలిచ్కోని కండ్లలీల్దీత్తివి. యెప్పట్కిదే కతానవ్వ. మంది మేలోర్తెనె దేవుడు మనమేలోర్త డన్కోవాలె. మందానవ్వ మన్వరాలేనాయె. కార్యం నిమ్మలంగ వొడ్డెక్కన్నని మొక్కు పో...''ని మందే తుప్పున తూర్పాలవట్టిర్రు. అదినె వర్సైద్ది సాంబక్కైతె బొమ్మానంగ గద్దరిచ్కుంట వొక్కటె గెదుముడన్కోర్రి... యిగ బూదవ్వ మొగన్కైతె పట్టపగ్గాలె లెవ్వు. అంకల్వెట్కుంటనే మారాజ్గ ముప్పొద్దులు మేసుడు ఆయిల్ల గాంగనే అవ్వసాయిత పోసుడు...
కూరాల్లనాడైతె గింత యిరాముంటొట్టు... యింట్ల కూరాడు పుదిచ్చుకున్డూ, అన్ని దేవుతలకు బొట్లువెట్టి కాయల్గొట్టుడూ, ఆను గుంజల్కి ముగ్గేసుడు, పందిట్ల దోర్నపాకు వెట్టుడూ వోటారొండా బొచ్చెడు పని... బూమవ్వ తల్లున్ను మ్యానత్తే పాపం పోసవ్వ కాడ్కి బోనం నైద్దెమండి పిల్లపిలగాని లగ్గంబట్టలు గొంచవొయి మొక్కుడు... పుట్టమన్ను దెచ్చి కూరాటి కుండలకు గాడిపొయ్యిలేశి జాజల్కి పచ్చవిండి గోటిముగ్గు లేసుడు... కుండల పుదిచ్చి కూరాల్లువట్టి తల్వాలు గల్పుడు నడ్జామ్రాక పనేపని.
నడ్జాంనాత్తిరి రొండు గొట్టంగ పొల్లన్లేపి మాడక్సమరంటి మైల పోల్దీయించి తలక్వోసిర్రు. ఐరేండ్ల పూజ గాంగనె మంటపాని కురికిండ్లు.
దూరబారమాయె పసుబ్బట్టల్తోటి గంగదాటి రావద్దని లగ్గాన్కోనాడు మొదుగాలే పిలగానోల్లు వూల్రెదిగిర్రు.
''అరె పెద్దోడ నడిపోడ మీల్వొయి బావనర్సుకోర్ర, శిన్నోడ నువ్వు మండుపంకాడ మొగపిలగాని సుట్టాలతోటి మాట రాకుంట సూస్కోర్రని'' రానర్సక్క ఆల్లకు పనప్పజెప్పింది. బూదక్క కొడ్కులు ముగ్గురు పిలగానోల్లకు ఉడ్కులీల్లంటె టిపిన్లు శాలంటె వురుక్కుంటనే అర్సుకుంటర్రు. పతాకం సీన్మల్ల లక్కన్నే మూడంత్రాల మీనికెక్కుకుంట దిక్కుంట ముగ్గురు పొలగన్లు పనికెగవడ్డరవ్వ... యెదుర్కోల్లనాడు పగటీలి అంటోడు అట్కాయించ్తె పాపమాల్ల కడ్పుసల్లగుండ బూమవ్వ మర్దులిద్దరున్ను తమ్మునర్సకైతడు రాజన్న పొల్లగాడే పది కిలల బియ్యమారవోసి యింత పాలకూర పప్పండి పచ్చి పుల్సు పాపడాల్తొటి వొడ్డెక్కిచ్చిర్రు. యిగ పటేలోమొ పిలగానోల్ల సర్దంట గూకోని వకీలు ముచ్చెట్లు వెట్కుంట, యీల్లను రార్రపోర్రన్కుంట, పోత్తాంటె కాపీలు శాలు లోటెడు లోటెడు దాక్కుంట బాతాల్గొట్టుడు. గప్పట్సందె బూదవ్వ బండోలయింది గుండె శెరువైంది ముంగటి కార్యమెట్ల గట్టెక్కుద్దోని అగుల్బుగు లైతంది. సల్లజెమ్టలు వెట్నయిగని గుడ్ల లీల్రావద్దాయె. పెద్దశెల్లె పిలగానోల్లకాడ శిన్నశెల్లె పిల్లతోటి బూదక్క పెండ్లిమంట్పంకాడ ముగ్గురు మూడు జాగల్ల.... ఆమె సాయితలంత యెవ్వల పనుల్లాల్లు పక్కపొంట సూశెతట్టు సుతలేరు. అంతట్లకె ఆయినె కడ్పు సల్లగుండ లచ్మనన్న సుత ఆల్లన్నకొడ్కును యెంట వెట్కోనచ్చిండు. అర్దగంటల్నె అనిలన్న, యెంకన్న, పవీను, సీదరు, మయేందరన్న అందరు సుట్రంగ గిరేస్క లిలవడి అక్కయేంపని, శెల్లే పనేందనడ్గుతాంటె గప్పుడు జెరంత తెప్పరిల్లి బూమక్కకు కొండంత దైర్నమచ్చింది.
పిలగానోల్లు దిన్నంక బుక్కెడువెట్టిర్రా... ''యీడ మీం మా సూస్కుంటంగని జెట్నవొయి యింటికాడన్ని సదుర్కోని పిల్లన్దీస్కరమ్మని.'' తోలిన్రు. యీడజూత్తె పిల్లకు శెల్లెకు బువ్వలేదు బుగ్గిలేదు. అయ్యో రాములాన్కుంట ఆపనీపనంద్కోని సందకద్దీసి సప్పుడోల్ల విల్సుకునె వరకు పెద్దశెల్లె అందచ్చింది. శిన్నమర్ది ఒస్కుదిప్పిండు, పెద్దమర్ది కార్దోల్కుంట, ఆల్లిద్దరు మీం ముగ్రక్కజెల్లెండ్లం ఐదుగురంగాను పిల్లన్దీస్కపైనం.
'' వో బూదా... ఆయెంక బీరిపోతూగని జెప్పన పా.''న్కుంట సారక్క, రానర్సక్క సైలోజక్క, దేవక్క, అర్ణక్క గిట్ల యెదురుంగచ్చి పొల్లశెయ్యి వట్కోని తీస్కపొయ్యి దాన్నో అర్రల గూకోవెట్టిన్లు. ఆల్లే బూదక్కకింత పసువుగుంకుమ వెట్టి నెత్తిల పూలదండవెట్టి టేజిమీన్కి దీస్కపెయిర్రు. అడుగులేత్తెనె మోకాల్నొప్పులంటది రానర్సక్క. వుర్కుంట పన్జేత్తాంటె సాయితలంత సంబ్రంగ వొక్కటే కిల్లకిల్ల నవ్వుడు...
పిలగానోల్లంత టేజిమీన, కుర్శీల్లల్ల మ్యానమామ లైద్గురు అత్తలు ఆల్ల పిల్లజెల్లలు సోపత్ల కుటింబాలు సుట్టపోల్లందరు ఓ వందమందిగాను మత్తు సంబ్రంగ కూకున్నరు. బూదక్కవ్వ నాయినలైతె మత్తు కుశిమీనున్నరు. పెండ్లంటె గింత కండ్ల పండ్గని మన్సుల జెర నిమ్మలపడ్డది బూద...
''ఆల్మొగలు పీటల మీన గూకోని యియ్యంపు లోల్లకు బొట్టు వెట్టుండ్లమ్మా...''ని అయ్యగారు మైకుల విల్తండు. సట్నవొయి కూకోంగనే బొట్టువెట్టి బుక్కగులాలు సల్లి నోరు తీపిజేసి పాన్కమిప్పిచ్చి ఆల్లండ్ల పెద్దోల్లందర్కి పూలదండ లేయించి బట్టలు వెట్టిచ్చిండు. సొన్నాయి సప్పుడుగాంగ పిలగాని కాల్లుగడిగిర్రు. ఆల్లుసుత బూమవ్వ తర్పున పెద్దోల్లందర్కి తువ్వాలలు రైకబట్టలు మాపెట్టిర్రు. అత్తగారి వందునం అప్పాలసారె సుత అప్పజెప్పిన్లు. పోట్వల్దిగినంక బంతిల గూకోని అందరు అంటల్మంచిగున్న యన్కుంట కడుప్రిండదిన్నరు. అందరి మొకాల్ల నవ్వులెల్గుతంటె బూదవ్వకాడికే నిండైంది.
తెల్లార్తె లగ్గమాయె. యిండ్లముంగట వూడ్సల్లి ముగ్గులు వెట్కోందెట్లని పొల్లను సాయితల కిడ్శిపెట్టి ముగ్గురక్కజెల్లెండ్లు పేద్ద నాత్తిరింటికచ్చి నడ్జాం దాటంగనే పనుల్జేస్కొని తల్వాల బియ్యం, ఐరేండ్ల కుడ్క, గర్గెబుడ్డీ, శెక్కబొమ్మ గిట్ల వట్కోని యేగిల్వారంగనే సన్నాయితోటి మంటుపాన్కిజేరుకున్నరు.
పట్టుబట్టలు గట్టి పెనిమిటి పెద్దిర్క మెల్గవెడ్తండు. బూమక్క తల్దండ్రి బొట్టువెట్టి కాల్లుగడిగే బట్టల్వెట్టిన్లు. ఆర్గురు అయ్యగార్లు తెల్లారగట్ల ఆరీట్కి సురువుజేత్తె పొద్దూకి ఆరుగొట్టింది. పూల్పండ్లకె యిజ్జతికి పాట్లవడ్డమని బూదక్క శానతక్వమందికే శెప్పింది. పర్సాన్ పనుల్లవడి పానపానపోల్ల సుత ఆది మర్సింది. మల్లండ్ల శానమంది కర్నని బయపడవట్రి. ఆడికి నాల్గైదు వందలమంది మాగచ్చిన్రు. కొద్దిగ దూరమూల్రకెల్లి సుత పిల్లజెల్లతోటి కట్టపడ్కుంట కర్సువెట్కోని కాల్రల్లచ్చిన్లు. పాపం పిల్శినంద్కు మాట వోవద్దన్కున్నరు గావచ్చు. సల్లగ సలిల బగ్గనే గోస పడ్డరు.
పూలపందిరి సూశ్టాన్కి రొండుగండ్లు సాలలె పందిట్ల సరోయినక్క టీలిబోల్లే యెండోలె మెర్శినయి. లైట్లు సింగిడి రంగుల్ల యెల్గుతన్నయి. ఎంకటేస్పర్లు పద్దుమవ్వ దేవుల్లు అందర్కి సల్లగ దీవినార్తి వెడ్తర్రు. పిల్లపిలగాడు బొమ్మలోలె... సాయితలంత మొదాలె అన్కున్నరోమొ ముద్రాకు పచ్చ పట్శీరెలు గట్టి శిల్కలోలె దిరుగుడు. పిలగాని తర్పోల్లు, అచ్చిన అయ్యగార్లు, సుట్టాలు బందుగులందరు పద్దతి పకారం మంచ్గ జేత్తరవ్వాని సరేంటె సరేన్నరు. ముసలోల్ల ముచ్చెట్లు, కడ్పార గావలిచ్కున్డు, కాల్మొక్కెకాడ మొక్కుడు, సెకండిచ్చుడు.. శిన్న పిలగన్లు ఎగుర్డుదున్కుడు, కీకలేసుడు, డాన్సులు జేసుడు యెటుజూశ్న సంబ్రమే... సందడంత సాయితలదే... బూమక్కను కూకోవెట్టి లగ్గంల పైసపర్క పండ్లు పలాలు శిన్న పెద్ద అక్కెర్లు సక్కెర్లు సర్వమాల్లే సూస్కుంటర్రు. పిల్లకు యెండి మంగులార్తి తప్కు, మంగులార్తులు, కుంకుంబరిడి సుతాల్లే పెట్టిర్రు.
''మీయింట్ల పెండ్లేకని మాకైతె మాదే కార్యమోలున్నదని'' పతొక్కలు దగ్గర్కచ్చి బూదవ్వను కావలిచ్కుంటర్రు. సాయితలంత దాపు నుండి అచ్చిన దంటలందర్కి పిల్లపిలగాన్తోటి పండ్లవైన మందిత్తంటె బూదవ్వకు కండ్ల పండుగైతంది. పిలగానోల్లైతె తేపతేపకు మత్తుజేత్తర్రని సంబ్రపడ్కుంట జెప్పుడు. పూల గుమగుమాసన్లకు పోటిగ కమ్మగ పాలాసన... అంట్కాలాసన. లగ్గంనాగెల్లై అప్పగింతలు జేశి యిల్లు రింప్కోని వోడుబియ్యం బోసి కడ్పగడిగిచ్చి పిల్ల పిలగాన్ని సాగెదోల్డు పన్నెండర్ద నాత్తిరి... నిర్దేడిదిగ. మబ్బుల కోడిగుయ్యతల్కే మల్రువెండ్లి బైలెల్లిర్రు.
శేరెవరకు పొద్దూకింది. నోమ్మీన బట్టల్వెట్టి దేవిన్దండం బెట్టి తీర్తపసాదం దీస్కోని బుక్కెడంత సల్లవడి మల్లమల్రిండ్లు. పోంగరాంగ యెవ్వలేద్దింటె గట్నే టిపిన్లు కాపీలు శాయెలు రొట్టెలు... యిల్లుజేరెటల్లకు తెల్లారింది. ఆనాడు బరాబ్బరి నడ్జాం పన్నెండుగొట్టంగ పిల్లపిలగాడు ఆడిబిడ్డగిట్ల ఐద్గురుగానచ్చిన్లు.. తెల్లార్తె మల్ల నోముకున్డేనాయె. అక్కెర సక్కెర జూస్కుంట జెపజెప్ప పనులు జేస్కోని నోమ్మీన గూకునె వరకు గంట పదిగొట్టింది.
అసల్గింత సక్కదనంగ యెవ్వారం నడ్పిందెవలో యెర్కైతె మీలంత యిచ్చంత్రపెయి ముక్కుమీనే లేస్కున్డు కాయమే అన్కోర్రి. అంగబలం గాదు అర్తబలం గాదు ఆత్మకల్ల గునం... గింత గడ్డు రోజుల్ల సత్తెకాలప్మన్సులు... ఆల్ల కడ్పు సల్లగుండ కాల్లుగడిగి నెత్ల సల్లుకున్డు గాదుగదా ఆల్లకడ్పున వుట్టి అనేకమట్టు సేవల్జేశ్నసుత గోరంత బాకిదేరది. గాయినే బూదక్కకు దేవుడిచ్న అన్న రామన్న...
సార్ద కడ్పు సల్లగుండ అయ్యప్ప గుల్లె ఏయాల్లకు బూమక్కకు ఎర్కజేశిందో కని ఇర్వై యేండ్ల సుంది యివార్రాక అన్ననే విల్సుకున్నది గని వొక్క నాడ్సుత అయ్యగారన్లే.. ఆయిన మాటెన్నడు గుర్దప్పలె
గీశ్నగీటు దాటలే... గంత పాటిమరి.
అయగారంటె లగ్గమాల్లకచ్చి మంత్రాల్జదివి పెండ్లి తంతైనంక కట్నమ సూల్జేస్క పొయెటోల్లే కని గింతబరువు మీనేస్కోని మోశ్టోల్లుంటారవ్వ....
నయాన్నో బయాన్నో పొల్లకు నచ్చజెప్పుడు కాంచి సుర్వైతె పొల్లగాన్ని కాయం జేస్కచ్చుడు, పెండ్లి మంట్పం, పూలపందిరి, మైక్సట్టూ, కరంటు లైట్లు, రూములు పర్పుల మాట్లాడ్డు, అంటలయ్యగారు అడ్డనోల్లు అంటలు, యేన్నీల్లు కట్టెలు, అంట సమాన్లు, కాయగూరలు, సొన్నాయి సప్పుల్లు, అయ్యగార్ల మాట్లాడ్డూ... అబ్బో బొమ్మాన్నంగ కట్టపడ్డడు రామన్న... ఆయినె బిడ్డ లగ్గాన్కిసుత గింత సెమపడలేదంటె నమ్ముర్రి...
రామన్న బిడ్డాన్ను బూదక్క బిడ్డ సోపత్లు. ఆ పొల్ల దీన్కంటె యాడాది శిన్నైనా మంచి సమందమని రొండేండ్ల కిందనే లగ్గం జేశిండు, తాత సుతైండు... ఇద్దరు అమ్డాలోల్లు మన్వలకు మూన్నెల్లు వడ్డయి.
''అమ్మా... పీట పుదిచ్చుడైందా... పెద్దబాపు దప్ప అమ్మను, సిర్దేవిని, యిద్దరు బిడ్డల, మన్వల, పెద్ద కొడ్కును దీస్కోనత్తన్న తయార్గుండ...''ని అయగారు పోనిచ్చిండు. యిది కలా నియంగనేనా కర్నరోగం యిర్గత్తందని లోకమంత గజ్జ గజ్జన్కుతర్రు... గా పసి గుడ్లన్దీస్కత్త ననవట్టె సంబ్రపడుడా, బయపడ్డా... మల్ల గా పొల్ల బాలంత అత్తగారింట్కి ఒక్క మల్కనే నిర్దక్వొయచ్చింది గంతే...'' రామన్నా... నియంగ నువ్వు నాకు అరానదొర్కిన అన్నవే... సీతమ్మ సిర్దేవి. అరొక్క పని మీదేస్కోని నా బిడ్డ లగ్గంజేశి నన్ను దైర్నంగ లిలవెట్టిందే గాక నీ మన్వల... నీ బల్గమంత నాయిల్లు నింపి మాందర్కి దీవినార్తులు వెట్టి మాకర మిత్తానా వన్కున్నదా... యేనుగోలె బలమెట్లచ్చెనో గని ఆవుల్యాగలోలె అమ్డాల పిల్లల్తోటి ఆడివిల్ల లచ్చిందేవోలె అడుగు వెడ్తందని దబ్బదబ్బ యిల్లంత మల్లమల్ల సురువుజేశి కొత్త శెద్దర్లుదీసి రాయన్న బీమన్నలకు పక్కలేశింది. బోయినంబెట్టి తోశ్నట్టు కట్నం బెట్టి దండమల్ల వెట్టింది. కొడ్కులు కడ్పులవడ్డ కాడ్కెల్లి గీ దిక్మాల్ల రోగం జెయ్యవట్టి బిడ్డను జూల్లే... యేదిగింత జేస్కపొయి శేత్లెయ్యలే.
యియ్యల్ల యిద్దరు మన్వలెత్కోని మ్యానత్తోలె మత్తు కుసైంది బూద. దాన్కి బిడ్డ లగ్గం కంటెక్వ సంబ్ర మన్కోర్రవ్వలాల...
మట్టి శిప్పల్ల నవదాన్నాలు శిక్కగ మొల్కలచ్నయి. పదార్రోజుల పండ్గనాడు వోడిబియ్యమండి ఐద్గురు ముత్తైదల విల్శి పసువుగుంకుమ వెట్టి నల్లవూసలు గుచ్నంక ఆల్లకు శిప్పల్ల పెసరువప్పు బియ్యం, రొండు రైకబట్టలు ఆకుపోక కుడుక వైనమందిచ్చింది.
యిగొ గిట్ల శిన్నగమెల్లెంగ యెన్కట్లెక్కన బూమవ్వ బిడ్డ లగ్గం పదార్రోజులు పండుగోలైంది...
నూరవద్దాలాడి వోపెండ్లి జెయ్యన్నంటరు గని అవద్దమన్న ముచ్చెటేలేకుంట అంతగల్శి రంగరంగైబోగంగ సంబ్రంగ అచ్చంతలేశిర్రు. ఇట్కెవేర్శి గోడ వెట్నట్గ నపరో శెయ్యేశి పెండ్లికి ముంగట లిలవడ్డరు. పదిమంది పాట్లవడ్తెనె పండుగోలె గీ లగ్గమైంది. అటోయిటో అప్పు మాతేరుద్ది గని యీల్లరుడం దేరల్లంటె మట్కు మల్ల జెనుమెత్తుడే... గీ కర్నకాలంల అడుగు బైట వెడ్తెనె ఆగమైతరని యెర్కుండి సుత శాన దైర్నంజేశి సకులం సవరిచ్చిర్రు... మొదట్కే మోచ్చంగని మల్ల జనుమద్దుర దేవాని గీపుట్కల్నే ఆల్లందరి బాకి దేర్పుటాన్కి బలమియ్యిమని బూమక్క దేవిన్ని కోటిమొక్కులు మొక్తంది. లగ్గాన్కచ్చి రిండుగ పిల్లపిలగాన్కి దీవినార్తులు వెట్నందుకు ఆల్లకు రొండు శేత్లెత్తి పేర్పేర్న దండాల్వెట్టింది... దేవిన్పున్నాన బూమక్క బిడ్డ లగ్గాన్కచ్చిన పతొక్కలు పైలంగున్న రవ్వలాల... రానోల్లు రాపోతిమని మత్తు రందిపడ్డరు. అచ్చినోల్లంత ఆనందపడ్డరు...
- మదగాని విజయలక్ష్మి
సెల్: 9652854910
Sun 20 Jun 08:56:31.330322 2021