'లంజోడుకులకు తగినశాత్తి జరిగింది'.. నోట్లో చుట్ట బయటకు తీసి తుపుక్కున ఉమ్మేస్తూ అన్నడు లాజరు..
'అవును మావా ఊకనేబోద్దా, తగలదూ మీ ఉసురు' .. చెంబులో మిగిలిన నీళ్ళు చేతి మీదకు ఇసురుకుంట అన్నడు వొడ్లోళ్ల చారి..
బోడు తుప్పల్లో నుంచి అలానే మాట్లాడుకుంట కొద్ది దూరం నడిచాక ఆ ఇద్దరూ ఇనుప కంచెకు చెరో వైపు అయ్యారు.
ఇనపకంచె ఊరిని, మాదిగ పల్లెని వేరు జేసింది.. ఇంతకు ముందు ఆ కంచె ఉండేది కాదు.. కానీ మాదిగ పల్లె మాత్రం ఊరి చివరనే ఉండేది.. మాదిగోళ్ళు ఊళ్ళోకి రాకుండా.. ఆరు నెలల కిందటే ఆ కంచె పడింది..
సుట్టు గుడిసెలో సిదుగుల పొయ్యి మీద టీ నీళ్ళు కాస్తోంది లూర్దు..
ప్రాన్సిస్ చెట్టు కిందకు ఎద్దువార్లు, గూటం, ఆరె, సదురుతున్నాడు. లాజరు గాబుకాడికొచ్చి కాళ్లు కడుక్కుంటూన్నాడు.. ఇంతలో.. వాళ్ళింట ముందు అలికిడయ్యింది.. ఆటో వచ్చి ఆగింది.
'బైలెల్లు బైలెల్లు' అని కేకేసుకుంటచ్చింది ఎస్తేరమ్మ. 'సదిరీ సదిరీ సట్టుగాళ్ల పిల్ల బుట్టిందని ఎంతకీ బైలెల్లరు ఈళ్ల జాగుకు నేను మాటలు బడతన్న ఏసయ్యా.. ఎందుకొప్పుకుంటినో ఈ ముటామేస్త్రి పని' అని విసుక్కుంటుండే సరికి 'ఆ.. దెంగట్లే ఉల్పాలు, బేటాలు ఊకనే వత్తయా' అని గునుక్కుంట సుట్టుగుడిసెల్నుంచి ఈకడికెళ్లింది లూర్దు..
చెప్పులు కుట్టుకుంట అపుడపుడూ కంచె వైపు చూస్తుంటడు ప్రాన్సిస్ చూపులు కంచె దాటినా కాళ్ళు మాత్రం అడుగు పెట్టలేకపోతున్నాయి. ప్రాన్సిస్ లాజరు కొడుకు.. ఇంటి ముందు వేపచెట్టు కింద కూర్చోని చెప్పులు, చెర్న కోలలు, ఎద్దు పట్టెలు తయారు జేస్తంటడు.. ఆ పనుల్లేని రోజుల్లో ఏదన్న కూలికి పోతడు..
నులక మంచం మీద కూర్చోని గోగునార పురిపెడతన్నడు లాజరు.. గిలాసలల్ల పోసుకొచ్చిన చాయి మొగుడికి, కొడుక్కి అందిస్తానే.. 'ఎస్తేరు కూలికి కేకేత్తంది ఇంగెంతసేపే' అనేసరికి సద్ది టిపిని పట్టుకొని బయటికొచ్చింది మరియమ్మ.. టిఫిని కిందబెట్టి గోసి పెట్టుకుంట 'నేను బోతన్న పిల్లోడ్ని బడికి పంపు'.. అని మొగుడికినపడేలా కేకేసింది.. అది విన్న లాజరు 'ఏం వాడుగాకపోతే నీను లేనా మీ అత్త లేదా తోలొత్తంలే' అన్నడు ..
ప్రాన్సిస్ టీ ఊదుకోని తాగుతుండగా 'వొరే.. ప్రాంచీసూ... ఇదిన్నావ్' అనన్నడు లాజరు ముతక బాడీ జేబులో నుంచి పొగచుట్ట బయటికి తీస్తూ..
'ఏందే..' అన్నట్టు చూసిండు ప్రాన్సిస్..
'రాత్రిళ్లు దొరోళ్ల బొందల్ని ఏమో తోడతన్నయంట' అంటుండగా 'నీకేమెరుక' అన్నట్టు చూసిండు ప్రాన్సిస్.. 'ఇందనక బైలికిబోయినకాడ వడ్లోళ్ల శారి చెప్పిండు'.. అని లాజరు చెపుతండగా 'ఏ నక్కలు తోడినయో, కుక్కలు తోడినయో మంచిగైంది మొద నట్టపు నా బట్టలకి' అంది లూర్దు.. ఏమో కోపం గుర్తొచ్చినట్టు..
కొద్ది దూరంలో పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు.. మోకాళ్ళదాక లాగు తొడుక్కోనున్న ప్రాన్సిస్ కొడుకు సామేల్ తుమ్మకంప నరుకుతున్నడు.. కొట్టిన షాట్‌కి వాళ్లబంతి డొల్లుకుంట వాని దగ్గరికచ్చింది.. దాన్ని వాళ్లకు అందిచ్చేందుకు చెయ్యి చాపుతండగా.. 'ముట్టుకోకు, ముట్టుకోకూ' అన్న అరుపు వినపడింది.. సామేల్ అటువైపు చూడగా 'చెప్పులు కుట్టుకునేటోడి కొడుకువి, డప్పు కొట్టుకొనేటోడి మనవడివి నువ్వు మా బాల్ ముడతవ్ రా' అని ఒక పిల్లోడు గద్దిచ్చాడు..
ఆ సాయంత్రం ప్రాన్సిస్ చెప్పు కుడుతుండగా, లాజరు డప్పుకు నిప్పు కాపుతున్నాడు.. దిగులుగా కూర్చున్న సామేల్‌ను చూస్తూ 'ఊకోరా.. కడ జాతోడివి కనుకే కంచీ కడున్నావ్ లేకుంటే ఆళ్లతోనే ఆడక పోదువా.. ఈ చెట్టును పీకి సూడు ఏర్లు ఈడనే ఉంటయా.. వో.. యాడికేడికో బోయుంటయి.. అట్లనే మన ఈ రాతలు ఇప్పటియి కాదులేరా... ఆ పోరగాండ్ల మీద పగపెట్టుకోబాక'.. అన్నడు ఓదార్పుగా..
తాత మాటలు పూర్తిగా అర్థం కానట్టు జూశిండు సామేలు.. 'కోడి, మేక సరాలు కోసినట్టు మన కుతికె కోసి ఆళ్ల కులాలకు బలిచ్చినట్టున్నార్రా మన తాతలు.. అందుకే మన తలలు కిందికేళాడుతున్నారు, తలల్ని తిట్టుకోటం కాదు తలరాతల్ని మార్సుకోవాలి.. అటొక చెప్పు ఇటొక చెప్పు కుతికెకి కుట్టుకోనైనా సరే.. తలల్ని ఎర్రజెండాల్లా ఎగరేయ్యాల్రా.. అన్నాడు.. తాత.
ఆదివారం చర్చికిపోయి అప్పుడే తిరిగొచ్చింది మరియమ్మ.. చేతిలో బైబులు అరుగు మీద పెట్టి కాళ్లు కడుక్కోటానికి గాబు కాడికి పోయింది .. 'మట్టలపండగ గనంగ జేయ్యాలన్నరు పాదిరి గారు.. బీటి బొత్తల్లోకిపోయి నాలుగు ఈత మట్టలు కోసకరా' అంది అక్కడి నుంచే ప్రాన్సిస్‌కు ఇనపడేలా..
ఇంతలో ఊర్లో గుడగుడ మొదలయ్యింది.. ఊరవతల గుట్టల వైపు అటు ఊరి జనం ఇటు కంచీకడి మాదిగపల్లె జెనం పరుగుదీశారు.. రొండు అస్తిపంజరాలు కుళ్లి గుర్త్పట్టకుండైనయి..' అయి రెండు డేవిడు, సరూప' యే అని పుకార్ లేశింది..
ఆ అస్థి పంజరాన్ని పోల్చుకుంటనే పెడబొబ్బ పెట్టిండు లాజరు.. ప్రాన్సిస్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.. ఎదురుగా కనపడుతున్న రాయిని కసితీరా చేతులోకి తీసుకుండు లాజరు..
అది జరిగి నాలుగు రోజుల తరువాత..
నల్లలాగు తొడుక్కోని గుడిసె ముందు దిగాలుగ కూర్చోనున్నడు సామేల్.. అతని తలకు తెల్లటి కట్టు ఉంది.. కంచె దగ్గర నల్ల గొడుగు దాని కింద చెప్పుల సరంజామా ఉంది.. మూడు రాళ్ల పొయ్యికాడ డప్పు కాపటానికి సిద్ధంగా ఉంది.. కొట్టంలో గేదె మేత కోసం తన్లాడుతాంది, సుట్టింట్లో పొయ్యెలగటంలేదు...
ఆ తెల్లారి తలకట్టు విప్పుకుంటూ కనపడిండు సామేల్.. కంచెకెల్లి కళ్ళిప్పిసూత్తండు.. ఇంతలో.. ఎవడో జీను పాయింటు తొడుక్కున్న కొంటెకారు పోరడు వాడిపక్క నుంచి గా కంప దూకేందుకు ఉరికురికి ఆగిపోయిండు.. అక్కడ్నుంచి నడిచొస్తున్నప్పుడు వాడి మొకం కనపడింది.. వాడు కొంచెం ప్రాన్సిస్లాగ, కొంచెం లాజరులాగ, ఇంకో సైడు సామేల్ లాగ అనిపించిండు... అలా వచ్చినోడు మరోసారి ఉరుక్కుంట కంచె దూకబోయిండు... కానీ వాడి వల్ల కాలేదు..
ఒకనాడు ఆ పోరడు శేనుగట్టు మీద నడుస్తుంటే వాడెనక శిన్న దొరబిడ్డె మాధవి నడుస్తోంది.. లంగాఓణిలో ఆమె ఎంతో అందంగా ఉంది.. అలా నడుస్తండగా వాడి కాలుకి కసుక్కున ముల్లు దిగింది.. దాన్ని తీసేందుకు వాడు ఒక కాలిపై నిలబడి ముల్లు దిగిన కాలెత్తంగనే.. ఎనక నడిచొస్తున్న మాధవి చూసి వాడి కాలికి దిగిన ముల్లుని చటుక్కున లాగి తన నోట్లె ఉమ్ముదీసి ఆ గాయం మీద రాసింది...
మరొక రోజు కాలేజికి పోతున్నప్పుడు ఆమె వెనుకనే సైకిల్ తొక్కుకుంటొస్తున్న అతన్ని వెనక్కెనక్కు చూసుకుంట తను సైకిల్ తొక్కుతంది మధవి.. ఇంతలో అతని టైర్ పంక్చర్ అయ్యేసరికి తన సైకిల్ ఎక్కమన్నట్టు కళ్లతో సైగ చేసింది.. కొద్దిసేపైనంక అతనే సైకిల్ తొక్కటం షురూజేశిండు..
మబ్బు పట్టింది.. లాజరు ఇంట్లో ఎవరూ కనపడట్లేరు.. చెప్పుల అడ్డ అట్లనే ఉంది డప్పు గోడకి తగిలిచ్చుంది.. సామేల్ ఇంటి ముందు మతి తప్పినోడిలా కనపడతున్నడు.. చూపు కంచెకెల్లి తిప్పంగనే అతను కంచెకాడ ప్రత్యక్షమయ్యిండు.. ఆ కంచె తెంపాలని చేతులతో బలంగ ప్రయత్నిస్తున్నాడు.. సామేల్ అట్లనే శూన్యంలోకి చూస్తున్నడు.. ఇంట్లో లూర్దు మాటలు, లాజరు సందడి, ప్రాన్సిస్ పని, మరియమ్మ అలికిడి ఏమీ కానొస్తలేవు.. ఇంతలో ఎవరో వచ్చి.. 'వారమాయె మెతుకు ముట్టక, పెద్ద కూరొండినం ఇయ్యాళనన్న తినురా' అని సామేల్ చేతికి అన్నం కూర ఉన్న సత్తుపళ్లెమిచ్చి పోయారు...
ఫెళఫెళమని ఉరిమి వాన మొదలయ్యింది... గొడుగేసుకొని మాధవి బైల్దేరింది.. అతను కంచెను నోటితో తెంపబోతుండటంతో నోరంతా రక్తం అవుతోంది. ఇంతలో ఆక్కడికొచ్చింది మాధవి. అతని నోటికంటిన రక్తాన్ని తన నోటితో తుడిచే ప్రయత్నం చేస్తోంది. కొంతసేపైనంక.. లాజర్ ఇంట్లో కూర్చోని సత్తుపళ్లెంలో అన్నం కలిపి ఆమెకు పెడతుంటె.. 'అరె.. ఎంత కమ్మగున్నది.. పెద్ద కూర పెద్దకూర అనంగ ఇనుడేగానీ ఇదే తినుడు.. కమ్మదనంల గూడ పెద్దదే' అంటన్నదామె..
ఒకనాడు సామేల్‌ని వెంటబెట్టుకొని శిన్న దొరింటికి పోయింది లూర్దు.. ఆ టయానికి శిన్నదొర ఒక్కగానొక్క బిడ్డతో మాట్లాడతన్నడు.. 'మాధవీ.. పట్నంబోయిపెద్ద సదువులు సదవాలి బిడ్డ' అని అంటుండగ.. 'ఈ యేడు పది పాసుగానీ అట్లనే బోతది' అని లోపలి నుంచొస్తూ ఆయినె భార్య అన్నది... ఇంతలో ఆక్కడికొచ్చిన లూర్దు.. 'అయ్యా' అని పిలవంగనే ఆమె వైపు చూశాడు చిన్న దొర..
'కరువొచ్చి ఇత్తనాలొడ్లుగూడ కాజేసుకున్నం... తవరి కాడ ఉన్నట్టు జాడ దొరికింది.. ఎన్నడడగలేదు గానీ ఈపాలి దప్పతంలేదు'.. అని నసిగిందో లేదో అంతెత్తున లేసిండు చిన్న దొర..
'నీయవ్వ.. ఎంత దైర్నమేనీకు.. మా వడ్లడుగుతావ్ బాడ్కావ్ దానా.. చల్ నడువ్..' అన్నడు కోపంతో ఊగిపోతూ..
'దండం బెడత బాంచెన్ కోపం దెచ్చుకోకురి ఎల్లిపోతం ఎల్లిపోతం' కండ్లనీళ్లు బెట్టుకుంది లూర్దు..
'మాయి నికార్సు ఇత్తనాలు ఆట్ని సంకరజాతి గానియ్యం' అని చేస్తన్న హెచ్చరిక వెనక్కు తిరిగి చూస్తూ ముందుకు నడుస్తన్న సామేల్కి వినపడుతోంది.. వాడి కళ్లకు చిన్నదొర బిడ్డ కనిపిస్తోంది.
ఇంటికొచ్చినంక జరిగిన విషయం లూర్దు చెప్పుతంటె.. 'మనయ్యేమో పొట్టొడ్లు, ఆళ్లయ్యేమో సాంబ, హంస సన్న రకాలు.. ఆళ్ల పొలాలు, ఇత్తనాలు యేరేలే' సుట్టెలిగిచ్చుకుంట అన్నడు ప్రాన్సీసు..
అప్పటికే తాగున్న లాజరు.. చిన్నదొర అట్లన్నడని తెలియగానే భగ్గుమన్నడు.. 'ఉంటే ఉండాయేమో ఈ వాళ్లకు ఎకరాలు.. వాళ్ళది పొలమే, మనదీ పొలమే.. ఆడా మట్టే ఈడా మట్టే.. అయినా.. వాళ్ళిత్తనాలు ఈడెందుకు మొలకెత్తవు.. మనిత్తనాలు ఆడెందుకు పండవు.. అన్నడు ఎవరినో నిలదీస్తున్నట్టు.. ఈ నేలంతా మట్టే అని రేగడో, గలసో మట్టంతా ఒకటేననీ డప్పు కొట్టి చెప్తా' అని కోపంగ లేచాడు.
ఒకనాడు జోరున వాన కురుస్తుండగా..ఆ వానలో ఎక్కడికో బైల్దేరిండు ఆ యువకుడు .. కొక్కెరన్న ఏసుకోకుండ ఇంత వానల యాడికి పోయేడిదీ పొయ్యికాడ సిదుగులిరుత్తా అడిగింది మాధవి..
'మనిత్తనాలన్న ఆళ్ల పొలంల పండాల, ఆళ్ల ఇత్తనాలన్న మన మన్నులో మొలకెత్తాల.. అప్పుడే ఈ నేలంతా ఒకటని రుజువైతది... దుక్కివాన కురుత్తాంది, ఇగ నేల పదునయిద్ది.. గౌండ్ల రాములు మామ పెద్దతాడెక్కి వాటం కొద్ది ఈ ఇత్తనాలిసురుతా.. నాయాల్లి గాదెబ్బకు నేలంతా ఏకం గావాల.. అనుకుంట గబుక్కున కంచె దూకిండు.. అట్ల దూకుతాంటె బలమైన కాలు దగిలి కంచె తెగిపోయింది... వాడి కాలు శీరకపోయిన సోట సంగపోళ్లు జెండా ఎగరేశినట్టు రక్తం ఉరికొస్తోంది.. తుమ్మ కంపలు నరికే ఆ మోటోడికి కాలు చీరకపోయిందన్న సోయిలేదు..
చినిగిన లాగుతోటే ఒకనాడు.. ఊళ్ళోకొచ్చి తిరుగుతన్నడు సామేల్.. మాధవి ఆ రోజు పూల గౌను తొడుక్కోనుంది. వీపుకు బ్యాగ్ తగిలిచ్చుకొని స్నేహితురాలితో కలిసి స్కూలుకు పోతోంది దార్లో కనిపించిన సామేల్‌ని చూస్తూ 'ఎవడే వీడు ఎక్కడో చూసినట్టుందీ' అని అనంగనే.. 'వాడు మన క్లాస్మేట్ సామేల్ గాడే'.. అంది మాధవి.. ఆమెకి గుర్తు రాకపోటంతో.. 'అదేనే ఆ కంచవతల ఉండేవాళ్లు గదా' అంది.. అలా అనగానే.. 'వో వాడా.. ఇదేంది ఇట్లయ్యిండు స్కూల్‌కి గూడ రావట్లేదుగదా అంది..' వీళ్లన్న డేవిడ్ గాడు మా పెద్దనాన బిడ్డ స్వరూపని లేవదీస్కపోయిండు' అని అనంగనే.. 'అవును అది తెలుసు..' అందా అమ్మాయి.. 'హా.. ఆ రోజు వాళ్ల అస్థి పంజరాలు బయటవడ్డ రోజు.. వీళ్ళ నాన తాత మా ఇళ్ల మీద రాళ్ళేసె సరికి మా పెద్దనానకు మానాయినకు మరింత మండింది.. మా వోళ్లంత గలిసి దాడిజేసి ఈళ్ళమ్మ, నాయిన, తాత, నాయినమ్మల్ని కొట్టారు.. ఆ దెబ్బలకు వాళ్లు చచ్చిపోయారు గివీడు దెబ్బలతో తప్పిచ్చుకున్నడు గానీ తలకు గట్టిదెబ్బ తగలటంతో కొంచెం మెంటల్ గాడయ్యండంటా.. అని అందామె.. అట్లా మాట్లాడుకుంట వాళ్లు బడి వైపు పోయారు, సామేల్ ఇంటివైపు కదిలిండు
సామేల్ నడుస్తుంటే దార్లో ముల్లు కసుక్కున దిగబడింది.. దాన్ని వాడే తీసుకొని నోట్లో నుంచి ఉమ్ము తీసి రాసుకున్నడు.. ఇంట్లో అద్దం చూసుకుంటూ నోటికంటిన రక్తం తుడుచుకొని కంచంలో అన్నం ముద్ద పిసుకుతన్నడు...
- శ్రీనివాస్ సూఫీ, 9346611455
Sun 27 Jun 02:49:04.057962 2021