''అబ్బబ్బా! ఇంకా పనవలేదు. ఐదు గంటలకే లేచాను. ఎనిమిది అవుతోంది. తొమ్మిదిన్నరకల్లా ఆఫీసుకి బయలు దేరాలి. బండి స్టార్ట్ చేసానంటే కరెక్ట్‌గా పది గంటలకు ఆఫీస్ లో ఉంటాను. ఇవ్వాళ ఫైల్స్ అన్నీ క్లియర్ చేసేసి కలెక్టర్ గారి సంతకాలు తీసుకోవాలి. ఇక మధ్యాహ్నం లంచ్ అవర్‌లో కాస్త టైమ్ చూసుకొని శ్రీశ్రీ గారి మహాప్రస్థానం పుస్తకం చదవాలి''. అని తనలో తాను మాట్లాడుకుంటుంది సాహితి.
''ఏమిటి నీ గోల సాహితీ?'' ఒక్కటే గొణుగుతున్నావు. నీకీ పుస్తకాల పిచ్చేమిటో? శ్రీశ్రీ అంటావు. ఓల్గా అంటావు. ఎవరెవరి పుస్తకాలో! రోజుకో పుస్తకం నీ చేతిలో ఉండాల్సిందే. పైగా ఈ మధ్య రచనలు కూడా మొదలు పెట్టావు. సాహితి అని మీ అమ్మానాన్నలు పెట్టిన పేరుకు న్యాయం చేయాలనుకుంటున్నావా ఏమిటి? ముందు పని కానిచ్చి ఆఫీసుకు తయారవ్వు. నాక్కూడా కంపెనీకి వెళ్లే టైమవుతోంది త్వరగా బాక్సు పెట్టు'' అని భర్త రమేష్ అరుపులు.
''ఇదిగో అయిపోతుం దండి. వంట పూర్తయింది. మీకు, నాకు, పిల్లలకు బాక్సులు సర్దితే పని అయిపోతుంది. టిఫిన్ వేడి వేడిగా ఉంది మీరు తినండి. కార్తీక్! రమ్యా! రండి మీరు కూడా తినండి. స్కూల్ బస్సు వచ్చే టైమయింది''.
''అబ్బ ఆగమ్మా! చెల్లి నా పెన్నులు తీసుకొని ఇవ్వడం లేదమ్మా!''
''రమ్యా! రోజురోజుకీ నీ అల్లరి ఎక్కువైపోతుంది. అన్నయ్య పెన్నులు నువ్వెందుకు తీసుకున్నావు? ఇటివ్వు. కార్తీక్ తీసుకో. టిఫిన్ తిందురు గాని రండి ఇద్దరూ''.
''నాక్కూడా అన్నయ్య లాంటి పెన్నులే కావాలమ్మా. డాడీ అన్నయ్యకు కొత్త పెన్నులు తెచ్చి ఇచ్చాడు. మరి నాకు''.
''నేను సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు తెస్తాను రమ్యా! అల్లరి చేయకు పద''.
''సరేనమ్మా''.
''తినండి ఇక. ఏమిటండీ మీరు? అబ్బాయి కోసం అడక్కుం డానే అన్నీ తెస్తారు. దీనికి తేవా లంటే పది సార్లు ఆలోచిస్తారు. వీళ్ళ గొడవలు తీర్చలేక నేను చస్తున్నాను'' అని చిన్నగా పిల్లలకు వినపడకుండా భర్త రమేష్‌తో అంటూనే సాహితి ఓ పక్క ఆఫీస్‌కు రెడీ అవుతోంది.
సాహితి ఏది మాట్లాడినా రమేష్ ఈ చెవిన విని ఆ చెవితో వదిలేస్తాడు. భార్య అన్నా, ఆడవాళ్ళన్నా కాస్త చిన్నచూపు అతనికి.
సాహితి భర్తలో మార్పు కోసం ప్రయత్నిస్తూ, పిల్లల మనసుల్లో ఆడ, మగ హెచ్చుతగ్గుల భావనలు ఊపిరి పోసుకోకుండా జాగ్రత్తపడుతుంటుంది.
పిల్లలను స్కూలుకు, రమేష్‌ను కంపెనీకి సాగనంపి ఇంటి పని ముగించుకొని ఆఫీసుకు బయలుదేరింది సాహితి. కలెక్టర్ గారి కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగం తనది. పది మంది పురుషుల మధ్య ఏకైక మహిళా ఉద్యోగిని.
''హమ్మయ్య. ఆఫీస్ వచ్చేసింది. సమయానికి ఆఫీసుకు రావడానికి సర్కస్ ఫీట్స్ చేయాల్సి వస్తోంది'' అని తనలో తాను అనుకుంటూనే చకచకా ఆఫీసు రూము వైపు అడుగులు వేస్తూ కనిపించిన వారందరికీ నమస్తేలు చెబుతూ చిరునవ్వుతో పలకరిస్తూ తన సీట్లో కూర్చుంది.
ఎదురు సీట్లో ఉన్న ఈశ్వరరావు సాహితిని ఎగాదిగా చూశాడు.
''నమస్కారం సార్'' అన్నది సాహితీ.
''ఆ ఆ నమస్కారం'' అని వెటకారంగా సాహితికి ప్రతి నమస్కారం చేశాడు ఈశ్వరరావు. అసూయకు ఆకతి కల్పిస్తే అది ఈశ్వర్రావే. ఎదుటివారి గొప్పదనాన్ని ఏమాత్రం సహించని వ్యక్తిత్వం తనది. సహజంగానే మహిళలంటే మరింత చులకన. ఈశ్వర్రావు ప్రతినమస్కారంలో ఇవన్నీ ప్రస్ఫుటించాయి. సాహితీ ఆఫీస్ పనిలో లీనమయింది. చూస్తూండగానే లంచ్ టైం అయింది.
సాహితి అన్నం తినేసింది.
''కాస్త తీరిక దొరికింది బాబోరు. శ్రీశ్రీ మహా ప్రస్థానం సంగతి చూస్తాను'' అనుకుంటూ పుస్తకంలో తల పెట్టేసింది.
దూరంగా ఉండి ఇదంతా పసిగట్టిన ఈశ్వరరావు మనసులో ''ఈవిడ పుస్తకాలు తెగ చదివేస్తుంది. అడపాదడపా పత్రికల్లో కూడా ఈవిడ రాసిన కవితలు కనిపిస్తున్నాయి. ఇన్నాళ్ళు ఈ ఆఫీసులో నేను మాత్రమే కవితలు, కథలు రాసేవాన్ని. ఇప్పుడు ఈవిడ కూడా తయారయిందా? ఈమె మొహానికి ఉద్యోగం చాలదన్నట్టు సాహిత్యం వైపు పరుగులు పెడుతుందా?'' అని కుళ్ళుకుంటూ మిగతా కొలీగ్స్ అయిన కష్ణ, భాస్కర్, వేణులను ''పదండి పదండి మేడం గారు ఏదో చదువుతుంది కాస్త చూద్దాం పదండి'' అని వాళ్ళను కూడా వెంటబెట్టుకొని సాహితికి వినబడేటంత దగ్గర్లోకి వచ్చి నిలబడ్డారు.
''కష్ణ సార్! నీకు శ్రీశ్రీ గురించి ఏం తెలుసు?'' అన్నాడు ఈశ్వరరావు.
''కష్ణ సార్నే అడిగారూ! మీ నోట సాహిత్యాంశాలు వినడమే గాని ఒక్క ముక్క కూడా అతనికి తెలియదు'' అని భాస్కర్ అంటుండగానే
''అయితే గియితే ఈ మధ్య రాతలు మొదలు పెట్టిన మహిళామణులను అడగాలి గాని కష్ణసార్ని అడుగుతారేమిటి ఈశ్వర్ సార'' అన్నాడు వేణు.
''ఇదిగో మీరిలా మాట్లాడొద్దు భాస్కర్. వేణు నువ్వు కూడా. నేను కవిని కానన్న వాణ్ణి కత్తితో చంపేస్తాను జాగ్రత్త'' అని సాహితి వైపు చూసాడు కష్ణ.
ఒక్కసారిగా నలుగురూ పగలబడి నవ్వారు.
''ఏం చెప్పావు కష్ణ. ఓ రెండు కవితలు అచ్చవగానే కవులయిపోతరా ఏమిటి? ఇప్పటికే నేను వంద కవితలు రెండు వందల కథలు రాశాను. ఒకటీ రెండు రాసి బిల్డప్పుల మీద బిల్డప్పులు ఇచ్చేస్తుంటారు కొందరు. అంట్లు తోముకొని ఇంట్లో ఉండక ఉద్యోగాల పేరుతో ఊరేగుతూ చాలదన్నట్టు రచిస్తారట. అయినా నిన్ను కవి కాదని ఎవరన్నారు కష్ణా! రచించు రచించు'' వ్యంగ్యం, హేళన ధ్వనిస్తున్నట్లు అన్నాడు ఈశ్వర్ రావు.
''ఎవరెన్ని రచించినా అవన్నీ మీ ముందు కుప్పిగంతులే ఈశ్వర్ రావు సార్!'' అని కష్ణ అంటుండగానే లంచ్ టైం పూర్తయిపోయిందని తెలిపే హారన్ మోగింది.
వీళ్లంతా సాహితిని ఒక్కసారి చూసి ముసి ముసి వంకర నవ్వులు నవ్వుకుంటూ తమ సీట్లలోకి వెళ్ళిపోయారు.
పుస్తకం చదువుతున్న సాహితికి ఈశ్వర్ రావు, కష్ణ, వేణు, భాస్కర్ల మాటలన్నీ వినపడుతూనే ఉన్నాయి. అయినా సాహితి ఏ మాత్రం ఆవేశపడలేదు. బాధ పడలేదు. సగం పుస్తకాన్ని చదివేసింది కూడా. హారన్ చప్పుడుతో మళ్ళీ ఆఫీసు పనిలో నిమగమైంది. ఫైల్స్ అన్నీ క్లియర్ చేసేసి కలెక్టర్ గారి సంతకాల కోసం అటెండర్ చేతికిచ్చి పంపించింది.
సమయం ఐదు అయిపోవడంతో సాహితి ఇంటి బాట పట్టింది.
''అమ్మో! రమ్యకు పెన్నులు కొనుక్కెళ్లాలి'' అని మధ్యలో షాపు దగ్గర ఆగి పెన్నులు కొనుక్కొని సరాసరి ఇంటికి వెళ్ళింది.
భర్త రమేష్, పిల్లలు కూడా ఇంటికి చేరుకున్నారు.
''సాహితీ కాఫీ!'' అని అరవడం మొదలెట్టాడు రమేష్. సాహితి గబగబా కాళ్ళు చేతులు కడుక్కొని భర్తకు కాఫీ పిల్లలకు పాలు అందించింది. ఇంకా రాత్రికి వంట, పిల్లల చేత హౌం వర్కులు పూర్తి చేయించడం తదితర పనుల జాబితా సాహితికి కొత్తేమీ కాదు.
అన్ని పనులు పూర్తయ్యాయి. సమయం తొమ్మిది అయింది. ఈ ప్రపంచంలోని విశ్రాంతి అంతా తనదేనన్నట్లు బెడ్‌పై ఒరిగింది.
''ఇంకా మహాప్రస్థానం పుస్తకం సగభాగం మిగిలే ఉంది. ఒక గంట సేపు చదివి తర్వాత పడుకుంటాను. నిద్రలో మంచి తలపులు ఏమైనా వస్తే తెల్లవారుజామున కవిత కూడా రాయాలి'' అనుకుంటూ పుస్తకం మొత్తం చదివేసి నిద్రకు ఉపక్రమించింది సాహితి.
తెల్లవారుజామునే లేచి ఓ కవిత కూడా రాసింది. పత్రికకు మెయిల్ పెట్టేసి యథావిధిగా తన పనుల్లో మునిగిపోయింది. ఇంటి పనులు ముగించుకుని ఆఫీసుకి వెళ్ళింది.
ఈశ్వర్ రావు, కష్ణలు పిచ్చాపాటీ మాట్లాడు తున్నారు. సాహితి వచ్చేది కూడా వారు గమనించలేదు.
''ఆమె గారి సాహిత్యం తొక్కా.. తోలు. రోజుకో పుస్తక మంట కష్ణా!''
''అవునవును ఈశ్వర్రావు సార్. నిజంగా అచ్చయిన రెండు మూడు రచనలు కూడా ఆమెనే రాసిందంటారా? ఏమో నాకైతే డౌటే సార్''.
''అంతే అంతే అని ఇద్దరూ నవ్వుకుంటూ పక్కకు చూసే సరికి సాహితి అక్కడే నిలబడి ఉంది. వెంటనే ఈశ్వరరావు, కష్ణ వాళ్ళ సీట్ల దగ్గరికి వెళ్ళిపోయారు.
సాహితి నిశ్శబ్దంగా తన సీట్ దగ్గరికి వెళ్లిపోయింది. ఇటువంటి పనికిమాలిన కామెంట్స్ ఏవీ పెద్దగా లెక్కచేయని సాహితి మనసు ఒక్కసారిగా బాధకు గురైంది. పేరుకు ఆఫీస్ పని చేస్తుంది. కానీ తన మెదడు సహకరించడం లేదు.
''నేను ఎప్పుడూ ఎవరినీ ఒక్క మాట కూడా అనను. ఒక చిన్న పలకరింపు వీలైతే రెండు మాటలు అంతే. అయినా అసలు ఈ మగవాళ్ళకు ఆడవాళ్లంటే ఎప్పుడూ ఎందుకు ఇంత చిన్నచూపు? ఇంట్లో ఆడవాళ్లను గౌరవించరు సరికదా బయటి వాళ్లంటే మరీ చులకన చేస్తారు. అనాదిగా పేరుకుపోయిన జాడ్యం ఇది. కాలాలు మారినా చదువులు పెరిగినా నాగరికత కొత్త పుంతలు తొక్కుతున్నా సమాజంలో మాత్రం మార్పు రావట్లేదు. మనిషి మనిషిగా మసలుకోవడం లేదు. అందుకేనా! నా కలం ఏదో రాయమని ఏదో మార్పుకై ప్రయత్నించమని ప్రేరేపిస్తోంది. ఈ ఊకదంపుడు వ్యంగ్యపు మాటలకు అదిరి పోకూడదు. మరింత ఉత్సాహన్ని కూడదీసుకొని కలాన్ని ఝుళిపించాలి. నేను కుంగి పోకూడదు. నాలాంటి వాళ్లెందరికో నేను ధైర్యం కావాలి'' అని తనను తాను ప్రేరేపించుకుంది. ఇక ఆ రోజు ఆఫీస్ పనులు కష్టంగా పూర్తి చేసి ఇంటికి వెళ్ళింది.
కొన్ని రోజులు గడిచాయి.
సాహితి పేరు సాహిత్య ప్రపంచంలో విరివిగా వినిపించటం మొదలైంది. అనతికాలంలోనే అనేకానేక కవితలు, కథలు వివిధ దిన, వార, మాస పత్రికల్లో చోటు చేసుకున్నాయి.రాష్ట్ర స్థాయి సాహితీవేత్తల ప్రశంసలూ అందుకున్నాయి. అయినా కూడా ఇవేవి సాహితి పెద్దగా ప్రచారం చేసుకునేది కాదు. ప్రశంసలకు పొంగిపోవడం గాని అవహేళనలకు కుంగి పోవడం కానీ తనకు తెలియదు.
అనుకోకుండా ఒకరోజు పొద్దున్నే పేపర్ చదువుతున్న రమేష్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. తన భార్య సాహితి పేరు ఫ్రంట్ పేజ్‌లో తాటికాయంత అక్షరాలతో వేసారు.
ఈ ఏడాది తెలంగాణ రాష్ట్ర ఉత్తమ సాహితీ పురస్కార గ్రహీత సాహితి అని ఉంది.
రమేష్ విషయం చదవడం మొదలు పెట్టాడు.
''సమాజ హితాన్ని కోరి మంచి రచనలు చేస్తున్న కవయిత్రి సాహితి. ఆమె సాహిత్య సేవను గుర్తించిన ప్రభుత్వం రాష్ట్ర స్థాయి పురస్కారంతో పాటు సాహిత్య అంబాసిడర్‌గా జీవో జారీ చేసింది''. రమేష్ చదవడం పూర్తయింది. తనలో తనకు తెలియకుండానే ఏదో పశ్చాత్తాపం. సాహితిని తక్కువగా చూసాననే భావన.
''సాహితీ! నీకు అవార్డు వచ్చింది. చూసావా? తొందరగా రా..'' అని ఆశ్చర్యం, ఆనందం కలగలసిన స్వరంతో పిలిచాడు.
''వస్తున్నానండి...''
''సాహితీ! ఇదిగో చూడు. నీ పేరు పేపర్లో చూడడం నాకెంతో సంతోషంగా ఉంది''.
''నిజమా ఏదీ ఇటివ్వండి. నేను అస్సలు అనుకోలేదు. నాకే ఈ అవార్డు వస్తుందని''.
''సరే సరే సాహితీ! పద స్వీట్స్ కొనిపిచ్చి నిన్ను ఇవ్వాళ ఒక్కరోజైనా నేనే ఆఫీస్ దగ్గర దిగబెడతాను. ఇన్ని రోజులు నిన్ను, నీ సాహిత్యాన్ని తక్కువ చేసినందుకు నన్ను క్షమించు''.
''అలా మాట్లాడకండి. మీరు పెరిగిన పరిస్థితులు అలాంటివి. ఇప్పటికైనా ఆడవాళ్లు తక్కువ కాదని తెలుసు కున్నారు.నాకది చాలండి. పదండి. ఇవ్వాళ మీరే డ్రాప్ చేద్దురు''
రమేష్, సాహితీ బయల్దేరారు.
పొద్దు పొద్దున్నే పేపర్ చదివే అలవాటున్న ఈశ్వర్ రావు, కష్ణ, భాస్కర్, వేణులు వార్త చదివి అవాక్కయ్యారు. మరీ తొందరగా ఆఫీసుకు చేరుకున్నారు. ఒకళ్ళ మొహాలు ఇంకొకరు చూసుకున్నారు. ఇంతలోనే సాహితి ఆఫీస్ రూమ్‌లోకి వచ్చేసింది. తనను చూసిన వాళ్ళకెవ్వరికీ నోట మాట రాలేదు. సిగ్గుతో తలదించుకున్నారు.
సాహితి వాళ్ళకు దగ్గరగా వచ్చింది.
''ఈశ్వర్ రావు సార్, కష్ణ సార్, భాస్కర్ సార్, వేణు సార్ స్వీట్స్ తీసుకోండి''.
''అమ్మా సాహితీ! నన్ను క్షమించు. నువ్వు రచనలు చేయడం నేను జీర్ణించుకోలేకపోయాను. ఆ అక్కసంతా ఇదిగో వీళ్ళతో కల్సి అనరాని మాటలతో తీర్చుకున్నాను. నువ్వు మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా ఈ రోజు ఈ స్థాయికి వచ్చావు'' అని ఈశ్వర్రావు అనడం ఒక్కసారిగా కష్ణ, భాస్కర్, వేణులు కూడా క్షమాపణలు వేడుకోవడం జరిగిపోయాయి.
''మీరంతా నా అన్నదమ్ములలాంటి వారు. మీ మాటలే నా ప్రగతికి పెట్టుబడిలా మారాయి. నిజానికి ఈ విజయంలో మీరు కూడా భాగస్థులు. ఇక నుంచైనా మహిళల్ని గౌరవించనక్కర కూడా లేదు. కనీసం మనుషుల్లా చూడండి చాలు అన్నయ్యలూ'' అంటుండగానే కలెక్టర్ గారు అక్కడికి వచ్చి సాహితిని అభినందించి అభినందన సభ ఏర్పాటు చేశామని, అంబాసిడర్ తదితర అంశాలు చర్చించాల్సి ఉంది. ఛాంబర్‌కు రమ్మని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయారు.
సాహితిలో ఆత్మ విశ్వాసం అంతకంతకు రెట్టింపు అయింది. తన బాధ్యత మరింత పెరిగిందని గుర్తు చేసుకుంటూ, ఆకాశమే హద్దుగా అడుగులు వేస్తూ కలెక్టర్ ఛాంబర్ వైపుగా కదిలింది.
- ఉప్పల పద్మ
9959126682, 8340933244