రమ్యకి సాయంగా ఉంటుందని సుచిత్రని పంపి
పొరపాటు చేసింది తన అక్క మానస. సుచిత్ర బావని
తల్చుకుంటే మనసంతా చెడ్డ చికాకుగా ఉంది.
హీ ఈజ్ ఏ క్రూకెడ్ పర్సన్.
నిశ్శబ్దంలోనించి హదయ విదారకంగా వినిపించిందా అరుపు. అడవిలో అప్పుడప్పుడే తల్లిచాటు నుంచి బయటకు వచ్చి ఒంటరిగా తిరగడం నేర్చుకుంటున్న లేడి కూన తొలిసారి మగపు పంజా దెబ్బ తగిలి చిగురుటాకులా వణికిపోతోంది.
తలుపు తెరుచుకుని లోపలకు వెళ్ళిన నాకు సుచిత్ర గడగడా వణకుతూ కనిపించింది. నన్ను చూస్తూనే ''పిన్నీ'' అంటూ చుట్టేసింది.
''ఏమైంది సుచీ.. ! ఒంటి నిండా ఆ చెమటలేంటి..? ఆ ఒణుకు ఎందుకు..?'' ఆ పిల్లను పొదివి పట్టుకుంటూనే అడిగాను.
'' మరి..మరి..బావ.. నన్ను'' సుచిత్ర కళ్ళ నిండా భయం, బెదురు స్పష్టంగా కనిపించాయి నాకు. ఆ మాటతో సుచి కళ్ళల్లో బెదురు చూస్తేనే ఏం జరిగిందో గ్రహింపుకు వచ్చింది నాకు. తనని వదిలి ఇల్లంతా కలయదిరిగాను. ఇంట్లో ఎవరు కనిపించలేదు నాకు.
''మీ అక్క ఏది సుచీ'' అడిగాను మరోసారి చుట్టూ చూస్తూ.
''అక్కని, బాబుని తీసుకుని బావ హాస్పిటల్లోచెకప్ చేయించడానికి వెళ్ళారు''.
''మరి నీకెందుకు భయం'' అన్నాను సుచి వంక సంశయముగా చూస్తూ
''మరి.. మరి.. పిన్నీ.. ఇందాక బావ వచ్చి.. నన్ను పట్టుకుని'' మళ్ళీ ఆ కళ్ళల్లో మగ పంజా దెబ్బ తిన్న లేడికూన బెదురు కనిపించింది.
''నాకు అర్ధం అయింది సుచీ. నాకు ఇక్కడ ఏం బాగాలేదు. నేను సిద్దిపేటకు వచ్చేస్తాను అని మీ అమ్మకు ఫోన్ చేసి చెప్పు. అంతగా అవసరం ఐతే మీ బాలింత అక్కకి తోడుగా ఉండడానికి మీ అమ్మను ఇక్కడకి వచ్చి ఉండమని చెప్పు. ధైర్యంగా చెప్పు. సాయంత్రం నేను వచ్చి నిన్ను సిద్దిపేటకు తీసుకువెళ్ళుతాను. సరేనా.'' అన్న నా మాటలతో సుచిత్ర కళ్ళల్లో నిశ్చింతతో కూడిన మెరుపు కనిపించింది.
''నాకు పని ఉంది. సాయంత్రం వస్తాను సుచీ. నువ్వు రెడీగా ఉండు. మీ అక్కకి ఏం చెప్పాలో అది నేను చెప్తాను. నేను వచ్చి వెళ్ళానని మీ అక్క రమ్యకి చెప్పు. ధైర్యంగా ఉండు'' అంటూ తన భుజం తట్టి రమ్య వాళ్ళ ఇంటి నుంచి బయట పడ్డాను. ఆటో ఎక్కి ఎర్రగడ్డ మెట్రో స్టేషన్‌కి పొమ్మన్నాను.
రమ్యకి డెలివరీ అయి నెల కూడా కాలేదు. రమ్యకి సాయంగా ఉంటుందని సుచిత్రని పంపి పొరపాటు చేసింది తన అక్క మానస. సుచిత్ర బావని తల్చుకుంటే మనసంతా చెడ్డ చికాకుగా ఉంది. హీ ఈజ్ ఏ క్రూకెడ్ పర్సన్.
ఆటో ముందుకు దూసుకుపోతోంది. నాకు తెలియకుండానే నా మనసు నా చిన్నప్పటి రోజుల్లోకి వెళ్ళింది. నేను ఎనిమిదవ తరగతి చదివేటప్పుడనుకుంటా నా ఫ్రెండ్ కరుణ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను వాళ్ళ లోపలి గదిలోకి వెళ్లబోతుంటే
''మీనా..వద్దు..లోపలకు వెళ్ళొద్దు'' అంది.
''ఎందుకు కరుణ '' అంటే ''లోపల మా పెద్ద నాన్న ఉన్నాడు'' అని భయంగా చెప్పింది.
''ఉంటే ఏం కరుణ..? ఆయన కూడా మీ నాన్నలాగానే కదా. మన చదువు గురించి, ఆరోగ్యం గురించి చక్కని సలహాలు ఇస్తాడు కదా'' అన్నాను కాస్త అమాయకంగా.
'' కాదు. మా పెద్ద నాన్న మా నాన్నలా కాదు. దగ్గరకి పిలిచి ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. భుజాలు, మెడ, మెడ కింద తడుముతాడు. ఆయన అలా చేస్తే నాకు చాల కోపం, అసహ్యం కలుగుతాయి. ఆయన దగ్గర చాల చెడ్డ వాసనా కూడా వస్తుంది'' అంది వికారంగా ముఖం పెట్టి.
''అవునా '' అన్నాను నేను కళ్ళు పెద్దవి చేస్తూ
''నువ్వు లోపలకు వెళితే నిన్ను కూడా దగ్గరకి రమ్మంటాడు. అందుకే పోవద్దు అన్నాను'' అంది తోడేలు నోటికి చిక్కిన కుందేలు పిల్లలా బెదురు చూపు చూస్తూ.
''మరి ఆ విషయం మీ అమ్మకి చెప్పలేకపోయావా'' అన్నాను
''ఆమ్మో. చెప్తే అమ్మ అసలు నమ్మదు. పెద్దనాన్న చాల మంచివాడు అంటూ అమ్మ నన్నే తిడుతుంది. తనకి అర్ధం కాదు. నువ్వు వెళితే లోపలకి వెళ్ళితే నిన్ను కూడా ఎక్కడంటే అక్కడ తడుముతాడు. వద్దు మీనా '' కరుణ కళ్ళల్లో అసహ్యం, చీదరతో కూడిన బెదురు అప్పుడు నాకు అర్ధం కాలేదు.
'' కరుణ పెద్దనాన్న అలా చేస్తాడా..! అప్పటి కరుణ కళ్ళల్లో బెదురు, అసహ్యమే ఇప్పటి సుచిత్ర కళ్ళల్లో కూడా కనిపించింది నాకు. ఛీ..ఛీ..ఎంత వక్ర బుద్ధి ఈ మగాళ్ళకి. కరుణ పెద్దనాన్న క్రూకెడ్ పర్సన్.
ఎర్రగడ్డ మెట్రో స్టేషన్లో ఎస్కలేటర్ ఎక్కాను. సికింద్రాబాద్ ఈస్ట్ స్టేషన్‌కి టికెట్ తీసుకుని చెకింగ్ కౌంటర్లో బ్యాగ్ పెట్టాను. సెక్యూరిటీ చెకింగ్ అయినాక బ్యాగ్ తీసుకుని మెట్లు ఎక్కి ప్లాట్ఫారం మీదకి వెళ్ళాను. ట్రైన్ వచ్చేదానికి ఇంక ఐదు నిముషాల టైం మాత్రమే ఉంది.
ప్లాట్ఫారం మీద జనాలు గుంపులు గుంపులుగా ఉన్నారు. గబగబా లేడీస్ కంపార్ట్మెంట్ దగ్గరకు వచ్చి నిలుచున్నా. కాస్త దూరం నుంచి మెట్రో ట్రైన్ మెలికలు తిరుగుతున్న పాములాగా వస్తూ ఉంది. ట్రైన్ తలుపులు తెరుచుకున్న వెంటనే అందరు తోసుకుంటూ ఎక్కేసారు. అందరితో పాటు నేను ఎక్కాను ఇక తప్పదన్నట్లు. తలుపులు ఇక మూసుకోబోతుండగా హడావిడిగా ఓ పెద్దాయన లేడీస్ కంపార్ట్మెంట్లోకి ఎక్కేసాడు. అందరు ఆడవాళ్ళ మధ్యన ఆ పెద్దాయన. కొందరు ఆయన వంక విసుగ్గా చూస్తే, ఇంకొందరు కాస్త జాలిగా చూసారు.
చీరలు, ట్రెడిషనల్ డ్రెస్సులు, మోడరన్ డ్రెస్సులు ఎవరి అభిరుచికి తగ్గట్లు వారు ధరించి ఉన్నారు. అందరిచేతుల్లో కామన్‌గా ఉన్నది మాత్రం సెల్ ఫోన్. మరి ఎవరి ఇష్టం వారిది. ఎవరికి నచ్చిన డ్రెస్ వాళ్ళు వేసుకోవాలి. అమ్మాయిలు ఇలాంటి డ్రెస్సే వేసుకోవాలి అనే ఆంక్షలు ఏమి చట్టపరంగా లేవు. కాలేజీలకు, ఉద్యోగాలకి తిరిగే ఆడవాళ్ళూ వాళ్ళకి సౌకర్యం కలిగించే డ్రెస్సులు వేసుకుంటారు. ఈ కాలం నలుగురిలో తిరిగే ఆడవాళ్ళకి హద్దులు మీరకుండా, వల్గర్ లేకుండా ఎలాంటి దుస్తులు వేసుకోవాలో బాగా తెలుసు.
ట్రైన్ కదిలింది. ''తరువాతి స్టేషన్ ఈ.ఎస్.ఐ. హాస్పిటల్. తలుపులు ఎడమవైపుకు తెరుచుకుంటాయి. తలుపులకు కాస్త దూరంగా నిలబడండి'' తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అనౌన్స్మెంట్ వస్తూనే ఉంది. ట్రైన్ కాస్త ముందుకి కదలాగానే ముందు మసీదు, ఆ తర్వాత ఎర్రగడ్డ రైతుబజార్కి ఎదురుగా ఉండే చర్చి పైన రెండుచేతులు చాచి పిలుస్తున్నట్టు ఉండే యేసు ప్రభువు బొమ్మని చూడగానే అప్రయత్నంగా నా చెయ్యి నా భుజాలమీద, నుదుటిమీద సిలువ గుర్తు వేసాయి. మనసులోనే ప్రభువుకి మొక్కాను.
సీనియర్ సిటిజెన్. అతనికి ఆరవై పైనే ఉండవచ్చు. పైన ఉన్న రాడ్ పట్టుకుని నిలబడలేక పోతున్నాడు. ఓ అమ్మాయి జాలిపడి తను లేచి అతనికి సీట్ ఇచ్చింది. అతను థాంక్స్ కూడా చెప్పకుండా అది ఆమె భాద్యత అన్నట్టు ఆ పెద్దాయన దర్జాగా కూర్చున్నాడు సీట్లో.
సెల్ ఫోన్ చూసుకుంటూ, ఇయర్ ఫోన్లో మాట్లాడుకుంటూ, పాటలు వింటూ ఎవరి లోకంలో వాళ్ళు ఉన్నారు. నాకేమో ఎక్కడ ఉన్నా పరిసరాలను, అందరిని గమనించడం అలవాటాయే. ఈ.ఎస్.ఐ. హాస్పిటల్ స్టేషన్లో మరికొందరు అమ్మాయిలు ఎక్కారు. తరువాతి స్టేషన్ ఎస్.ఆర్. నగర్. తలుపులు ఎడమవైపుకు తెరుచుకుంటాయి. రెడ్డొచ్చె మొదలెట్టు అన్నట్టు అనౌన్స్మెంట్ ఆగకుండా వస్తూనే ఉంది.
ఒక్క క్షణం ఆ పక్కకి తలతిప్పి బిత్తరపోయాను. పెద్దాయన అనుకున్న ఆయన ఎదురుగా ఉన్న అమ్మాయిని తినేసేలా, చొంగ కార్చుకుంటూ చూస్తున్నాడు.
ఆ పిల్ల మొబైల్ ఫోన్లో నెట్ సర్ఫింగ్‌లో యమా బిజీగా ఉన్నట్టు ఉంది బాహ్య ప్రపంచంతో నాకేం పని అన్నట్లు. అయినా అది లేడీస్ కంపార్ట్మెంట్ అనే భరోసా కూడా ఉందేమో మరి. బ్లూ జీన్స్ మీద వైట్ టీ షర్ట్ వేసుకుని ఉంది. ఈ ముసలాడు ఆ పిల్లకేసి ఆబగా చూస్తూ ఉన్నాడు. కాస్త లోక జ్ఞానం ఉన్న ఎవరికైనా అతని చూపులు ఎక్కడ ఉన్నాయో ఇట్టే చెప్పగలరు.
ఇంతలో ఆ అమ్మాయి పక్కన ఉన్న ఆమె, బహుశా ఆ పిల్ల తల్లి ఏమో మరి , మెరుపులా హఠాత్తుగా ఆ పిల్ల రెక్క పట్టి లాగి నాలుగు సీట్ల అవతల ఖాళీగా ఉన్న సీట్లోకి ఆ అమ్మాయిని విసురుగా లాక్కుపోయింది.
ఆ ముసలాడి దుర్భుద్ధి, వక్ర ద్రుష్టి ఆ తల్లి గ్రహించిందేమో మరి. ఛీ..ఛీ.. ఈ ముసలాడు ఆ అమ్మాయి దుస్తుల వెనుక ఉన్న ఆమె ఆడతనాన్ని రంద్రాన్వేషణ చేస్తూ, చూస్తున్నాడన్నమాట. ఎంత పెద్ద వయసు అయితేఏం. బుద్ధి వక్రం అయినాక. ఇలా ఎంత మంది క్రూకెడ్ మైండ్స్ ఉన్న వాళ్ళు ఎన్ని రకాలుగా వారి కామపు చూపులతోనే ఆడవాళ్ళని అనునిత్యం బలాత్కారం చేస్తున్నారో. మనసంతా చేదు మింగినట్లు అయిపోయింది నాకు.
అమీర్‌పేట్‌లో మెట్రోట్రైన్ దిగేసాను. సికింద్రాబాద్ స్టేషన్‌కి వెళ్లాలంటే పైన ఉన్న సెకండ్ ప్లాట్ఫారంకి వెళ్లి నాగోల్ సైడ్ వెళ్లే మరో ట్రైన్ ఎక్కాలి. మెట్రో రైలు ప్రారంభం అయి కొన్ని రోజులే అయింది. అందుకే ఇలాంటి ఏర్పాట్లు
అమీర్‌పేట్ మెట్రోస్టేషన్ జనాలతో కిటకిటలాడుతోంది. చదువు, వ్యాపారం, ఉద్యోగం, రకరకాల కోచింగ్ సెంటర్లకి ప్రధాన కేంద్రం అమీర్‌పేట్ కావడంతో అక్కడి నుండి వేలాదిమంది రోజు ప్రయాణిస్తుంటారు.
పొద్దున సుచిత్ర దగ్గరకి వెళ్ళినప్పటి నుండి మనసంతా చాల చికాకుగా ఉంది. ఇప్పుడు ఈ ముసలాడి వెధవ చూపులు తల్చుకుంటే దబ్బనం పెట్టి అతని కళ్ళు గుచ్చి వేయాలన్నంత కోపం వస్తోంది. ఆ గుంపుల మధ్యలోనే నిలబడుకున్నాను. ట్రైన్ వచ్చేదానికి ఇంకా పదినిముషాల టైం ఉంది.
నా వెనుక ఓ పెద్ద మిత్ర బందం వచ్చి చేరింది. అందరు కాలేజీ ఈడు అబ్బాయిలే ఉన్నట్లు ఉన్నారు. సెటైర్లు పేల్చడం. పగలబడి నవ్వడం. కంటికి కనపడిన అమ్మాయిల మీద కామెంట్లు చేయడం.
అయినా ఆవన్నీ నాకెందుకు. ట్రైన్ వస్తే సికింద్రాబాద్ వెళ్లి త్వరగా కాలేజీలో నా సర్టిఫికెట్స్ ని సబ్మిట్ చేయాలి. బ్యాగ్‌లో సర్టిఫికెట్స్ ఉన్నాయి. ఇంకో వారంలో నేను కాలేజీలో లెక్చరర్‌గా చేరబోతున్నాను. ఆలోచిస్తూ ఉన్నాను. నా ఆలోచనలను చీలుస్తూ వెనుక నుంచి మాటలు.
''అబ్బా.. ఎంత మంది జనం ఉన్నారో చూడరా. మెట్రోలో వెళ్ళే వాళ్ళకు రోజు పండగే '' అన్నాడు ఒకడు.
''అవును రా. తోటల్లో తిరిగే సీతాకోక చిలుకలన్నీ ఈ మెట్రో స్టేషన్ కి వచ్చి వాలినట్లు ఉంది'' అన్నాడు ఇంకోడు. మళ్ళీ పగలబడి నవ్వులు.
ట్రైన్ దూరం నుంచి వస్తూ కనపడింది. సెక్యూరిటీ వాళ్ళు ఎంత కంట్రోల్ చేస్తున్న జనాలు ట్రైన్ తొందరగా ఎక్కాలని తోసుకుంటున్నారు.
నా వెనుక కాస్త పొట్టిగా ఉన్నవాడు నన్ను గట్టిగా నెట్టడంతో కాస్త ముందుకు తూలాను నేను. అయినా తమాయించుకున్నాను. విద్యార్థులకు పాఠాలు, బుద్ధులు చెప్పే పవిత్రమైన అధ్యాపకురాలి వత్తిలో చేరబోతున్నాను. ఎంత సహనం ఉంటే అంత మంచిది నాకు.
''అయినా ఇంత మంది జనం ఉన్నారు. నెట్టుకుంటుంటే భలే తమాషాగా ఉంది రా '' అన్నాడు వాళ్లలో ఒకడు. నా వెనుక ఉన్న పొట్టి వాడు ఇంత పెద్ద గొంతుతో ఆరుస్తున్నట్లు'' ఆఆ..మన ముందు వెనుక అమ్మాయిలు ఉంటే చాల బాగా, తమాషాగానే ఉంటుంది రా. ఎటొచ్చి అవ్వ ఉంటేనే బాధ రా'' అన్నాడు.
'' నీ అక్కుంటే'' రెప్పపాటు వేగంతో వెనక్కి తిరిగి వాడి చెంప చెళ్లుమనిపించాను.
వాడన్న ఆ మాటతో నాలో సహనం నశించి నేనేం చేస్తున్నానో నాకే తెలియలేదు ఆ క్షణం. ఊహించని హఠాత్పరిణామానికి బిత్తర పోయిన వాడు తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక అక్కడ నుంచి జారుకున్నాడు.. వెనక మిత్రబందం అంతా అపరాధభావంతో తలవంచేశారు.
ఛీ..ఛీ..కాలం ఎంత మారినా ఈ క్రూకెడ్ మైండ్స్ మాత్రం ఎప్పటికీ మారవు.
మెట్రో రైలు దగ్గరకు వచ్చేసింది.
- రోహిణి వంజరి,9000594630
Sun 10 Oct 04:14:17.882985 2021