Sat 30 Oct 22:29:34.963702 2021
Authorization
పురుడు సాని చేతిలో
మెత్తటి పూలపదునై
తల్లి బిడ్డల సష్టిలో
అమ్మ బొడ్డుతాడును కోసిన తొలి సాదనం !
కంపచెట్టును కాటు లేకుండా చెలిగి
సాళ్లల్ల మొక్కల వేరుకు
అసరు తగులకుండా కలుపుతీసి
చేలలో పంటకంకులు కోసి
కల్లంలో గింజల్ని రాసిచేసే రైతు చేతిలో పనిముట్టై
కొనాటి కొమ్మనున్న కాయపండును చేతికిచ్చిన రక్తబందువు
సేతానానికి ఇంటికి ఆత్మబందువు
ఎర్రజెండాపై నెలవంక
పోరు పతాకంపై చంద్రవంక
కార్మిక కర్షక శ్రామిక నమూనా
విప్లవానికి విజయానికి గుండె జెండ!
ఆదివాసి స్త్రీలు బొడ్లొనుంచి
కొడువలి తీస్తే పోరుకు పొద్దెక్కినట్లే
శ్రామిక స్త్రీలు
కొడువలి నడుముకు చుడ్తే
పొలంపై యుద్దానికి నగారనే
సమ్మక్క సారక్కలు
కాకతీయ రాజులపై యుద్దాని బరిగీసినట్లే !
చేదురుబావిలో
నాలుగు కొడవళ్ళతో తాడుకట్టిడ్సితే
అడుగునున్న బొక్కెనను
పైకి తెచ్చే పాతాల గరిగే
ఆపతికి అవసరానికి అక్కరొచ్చే కాస బందువు
కొడువలి
కాపురం చేయని ఇల్లుండదు
కొడువలి
చేత పట్టని కోడలుండదు
వొంపును పంపును సరిచేయాలన్నా
పచ్చికొమ్మను గొట్టి
పాలకొమ్మను తెస్తేనే
పెండ్లీలలో
అవిరేనుకూ అలంకారం
ఆకాశంపైనున్న చంద్రవంక
భూమిపైకి దిగిందో
భూమిపైనున్న కొడువలి
ఆకాశంమీద మొలిచిందో తెలుసుకోవడానికీ
కమ్మరివీరయ్యగూడ కాలంచేసే!
కొడువలి లేని కాపురం
కోడలు లేని సంసారమే
కొడువలి లేని కాపుదనం
కొడుకు లేని కన్నీళ్లే...
ఇంట్లో కొడువలిని పాతసామానుకు అమ్మినప్పుడు దుఃఖఃతో.....?
- వనపట్ల సుబ్బయ్య
9492765358