Sun 31 Oct 02:20:48.175867 2021
Authorization
రెడ్డప్ప మెత్తని సీటులో కూచున్నాడు. చేతిలో వెలుగుతున్న సిగరెట్
పొగలు కక్కుతావుంది. శంభులింగం మెడలో జిగేలుమంటూ మెరుస్తున్న
కొత్త బంగారు గొలుసునూ, అతని చేతివేళ్ళకున్న మూడు బంగారపు
ఉంగరాలనూ మార్చి మార్చి చూస్తూ ''చూడు వెంకటాచలం డాక్టరేటంటే
మరీ అంత సులభం కాదయ్యా... ప్రతి ఒక్కరికీ దొరకడానికి. దానికి
కాస్త ఓపిక, డబ్బు వుండాల. ఈయన్ని చూస్తే ఎదుటోని దాంట్లో చూసి
కాపీకొట్టి రాసినా పాసయ్యేరకం కాదనిపిస్తోంది. కాబట్టి ఒక పని చెరు.
ఒక లక్ష మీది కాదని కళ్ళు మూసుకోండి. డాక్టరేట్ పట్టా దానంతటదే
నడిచినీ ఇంటికొచ్చి తలుపు కొడతాది'' అన్నాడు.
పొద్దున్నే లేచీలేవగానే పళ్ళుకూడా తోముకోకుండా మబ్బుకళ్ళతోనే అందరి లాగా అలవాటుగా వాట్సప్ తెరిచిన శంభులింగం అదిరిపడ్డాడు. కళ్ళు ఆశ్చర్యంతో పెద్దగయ్యాయి. ముక్కు పుటలు కోపంతో అదిరిపడ్డాయి. పళ్ళు పటపట ఒకదానితో ఒకటి అక్కసుతో ఢ కొట్టుకున్నాయి. అన్నింటిలోనూ తన రాజకీయ ప్రత్యర్థి పక్కవీధి బజారప్ప ఫోటోనే. నిమిషాననికి పది చప్పట్ల గుర్తులతో, పొగడ్తలతో, రకరకాల ఫోటోలతో అన్ని గ్రూపులలోనూ అభినం దనల జాతర జరుగుతూ వుంది. ఎందుకీ అభినందనలు అనుకుంటూ ఒక గ్రూపులో వేగంగా వెనక్కి అపరాధ పరిశోధకునిలా పోసాగాడు. అప్పుడు కనిపించింది ఒక వార్త.
''బజారప్ప పెద్ద బజారులో కరోనా సమయంలో క్యాలీఫ్లవర్లు అతి తక్కువ ధరకు ఇంటింటికీ సరఫరా చేసి కర్నూలు ప్రజానీకానికి ఎనలేని సేవ చేశాడనీ, అతని నిస్వార్థ సామాజిక సేవకు పిచ్చిపిచ్చిగా మెచ్చుకొని అమెరికాలోని అరిజోనా యూనివర్శిటీ వచ్చే నెల 15వ తేదీన జూం మీటింగ్‌లో గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయబోతుందని'' అందులో వుంది.
అంటే... నిన్నటిదాకా గల్లీ బజారప్ప ఇకపై డాక్టర్ బజారప్ప కాబోతున్నాడు. అందుకే ఆ పొగడ్తలు. అవి అంతటితో ఆగవు. కొందరు తెలిసిన పత్రికా విలేఖరులను పిలిచి నాలుగు ముక్కలు, రెండు బాటిళ్ళు అందిస్తాడు. దాంతో తరువాత రోజు ఏ పత్రిక చూసినా బజారప్ప ఫోటోనే పళ్ళికిలిస్తా కనబడుతుంది. అంతటితో ఆగుతాడా... లేదు. కుల సంఘాన్ని పిలిచి ఒకొక్క రోజు ఒకొక్క వీధిలో సొంత డబ్బులతో సభలు పెట్టించి దండేయించుకుని... వాటి ఫోటోలు మరలా వాట్సప్ గ్రూపుల్లోకి ఎత్తి పోస్తాడు. ఇదంతా నెల రోజుల కార్యక్రమం. బజారప్ప కీర్తి ఈ బజారే కాకుండా అన్ని బజార్లలోనూ వ్యాప్తి చెందుతుంది. త్వరలోనే కార్పొరేషన్ ఎన్నికలున్నాయి. అవి అయిపోయేదాకా ఈ జీడిపాకం సీరియల్ ఆగదు.
శంభులింగం తల వేడెక్కిపోతూ వుంది. ఈసారి ఎన్నికల్లో పోటీ చాలా తీవ్రంగా వుండబోతుంది. ఒక్క ఓటు అటూ ఇటూ అయినా మరలా ఐదు సంవత్సరాల వరకూ ఈగలు జోపుకోవాల్సిందే. బజారప్పను ఓడించాలి అంటే తనకు కూడా అర్జంటుగా ఓ డాక్టరేట్ కావాలి. ఏం చేయాలా అని కిందామీదాపడి ఆలోచిస్తూ తన మిత్రుడైన ప్రయివేట్ కాలేజీ లెక్చరర్ వెంకటాచలంకు ఫోన్ కొట్టాడు.
వెంకటాచలం గంట కంతా శంభులింగం ఇంటిలో వాలి పోయాడు. శంభులింగం వెంకటాచలంకు జరిగిందంతా చెప్పి ''ఎలాగైనా సరే... నాకూ అర్జంటుగా డాక్టరేట్ వచ్చే మార్గం ఏదన్నావుంటే చెప్పు. నీ ఋణం వుంచుకోనులే. నీవు ఆరునెల్ల కింద తీసుకున్న ఆరువేల ఋణం ఇప్పటికఫ్ఫుడే మాఫీ చేసేస్తా'' అంటూ ఆశ చూపించాడు. వెంకటాచలం నున్నని బట్టతలమీద కాసేపు గీరుకొని ''ప్రఖ్యాతి చెందిన మన గప్ చుప్ యూనివర్శిటిలో మా ఊరి రెడ్డప్ప ప్రొఫెసర్‌గా పని చేస్తా వున్నాడు. ఆయన దగ్గర చానామంది పొట్టెగాళ్ళు మెరుపు వేగంతో డాక్టరేట్లు సంపాదించి ఉద్యోగాలకోసం, ప్రమోషన్ల కోసం వేటకుక్కల్లా దేశం మీద పడ్డారు. మనమూ పోదాంపా... ఏదో ఒక దారి దొరుకుతుంది'' అన్నాడు. ఇద్దరూ కలసి రెడ్డప్ప దగ్గరికి బైలుదేరారు.
787878
రెడ్డప్ప మెత్తని సీటులో కూచున్నాడు. చేతిలో వెలుగుతున్న సిగరెట్ పొగలు కక్కుతావుంది. శంభులింగం మెడలో జిగేలుమంటూ మెరుస్తున్న కొత్త బంగారు గొలుసునూ, అతని చేతివేళ్ళకున్న మూడు బంగారపు ఉంగరాలనూ మార్చి మార్చి చూస్తూ ''చూడు వెంకటాచలం డాక్టరేటంటే మరీ అంత సులభం కాదయ్యా... ప్రతి ఒక్కరికీ దొరకడానికి. దానికి కాస్త ఓపిక, డబ్బు వుండాల. ఈయన్ని చూస్తే ఎదుటోని దాంట్లో చూసి కాపీకొట్టి రాసినా పాసయ్యేరకం కాదనిపిస్తోంది. కాబట్టి ఒక పని చెరు. ఒక లక్ష మీది కాదని కళ్ళు మూసుకోండి. డాక్టరేట్ పట్టా దానంతటదే నడిచినీ ఇంటికొచ్చి తలుపు కొడతాది'' అన్నాడు.
''లచ్చా... మరీ ఎక్కువ కాదా'' అన్నాడు వెంకటాచలం నోరు వెళ్ళబెట్టి.
రెడ్డప్ప చిరునవ్వు నవ్వి ''చూడు వెంకటాచలం... డాక్టరేటు అంటే రైతు బజారులో తక్కువ ధరకు దొరికే కూరగాయలు కాదుగదా... అత్యున్నతమైన సర్టిఫికెట్. డాక్టర్ శంభులింగ అని పిలుస్తా వుంటే ఎంత దర్జా... ఎంత మజా. పనిని బట్టి రేటుంటాది. నీవు నీ గైడ్‌తో మాట్లాడుకొని సబ్జెక్ట్ ఎన్నుకున్నాక మా వాళ్ళే కిందా మీదా పడి అంతా చేసి పెడితే లచ్చ. ఇది చాలా కష్టమైన పని. అలాగాక మేము చెప్పే సబ్జెక్టే నువ్వు పరిశోధనాశంగా తీసుకుంటే అందులో సగం అంటే యాభై వేలకే సులభంగా ఐపోతాది. అలాగాక సమాచారంతా మీరే సేకరించుకోనొచ్చి ముందుపెడితే దానిని పద్ధతిగా రాయడానికయితే ముప్పయి వేలు. ఇందులో మీకు ఏది ఇష్టమో చెప్పు. డబ్బు చేతిలో పడడం ఆలస్యం మా శిష్యుల్లో పనీ పాటా లేని ఎవడో ఒకడు మీ పని మొదలుపెడతాడు. వైవా పూర్తయి డాక్టరేట్ అందేంతవరకూ నాదీ పూచీ'' అన్నాడు .
''సరే ఐతే... రెండోరకం ఖరారు చేసి నా కోసం పది పర్సంటన్నా డిస్కౌంట్ ఇవ్వండి. త్వరలోనే మా బంధువుల్లో ఇంకొకర్ని పట్టుకొస్తా'' అన్నాడు వెంకటాచలం.
''తెల్సినోనినివి. రోజూ ఒకరి మొగం ఒకరం చూసుకోవాల. సరే... అట్లాగే కానీ. మా కులపోడు, జంకుజమా యూనివర్శిటీ ఫ్రొఫెసర్ పిచ్చి పుల్లన్న రాసిన 'ఆరు కుక్కలు అరవై నక్కలూ అనే నవల మీద ఎవరితోనన్నా పరిశోధన చేపియ్యమని జోరీగలాగా ఒకటే వెంట పడుతున్నాడు. వాళ్ళ యూనివర్శిటీలో ఏ సెమినార్ జరిగినా ఎవ్వరినీ పిలవకుండా నన్నే పిలిచి దండేస్తాడు. ఆ నవల మీద చేయిద్దాం. ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్టు వాని ముచ్చటా తీరుతాది. నీ పరిశోధనా పూర్తయి మూడు సంవత్సరాల్లోనే పట్టా చేతికొస్తాది'' అన్నాడు.
''మూడు సంవత్సరాలా... అంతలోపు ఎన్నికలయిపోవడం, వాడు గెలవటం, నేను నెత్తిన గుడ్డేసుకోవడం అన్నీ పూర్తయిపోతాయి. ఈ నెలాఖరుకళ్ళా కావాల'' అన్నాడు శంభులింగం.
''ఏందీ ఒక్క నెలలోనా... ప్రపంచంలోని ఏ యూనివర్శిటీలోనూ, ఎంత డబ్బు ధారపోసినా ఇంత వేగంగా డాక్టరేట్ రాదు'' అన్నాడు రెడ్డప్ప చేతులు ఎత్తి దండం పెడుతూ.
''మరి పదో తరగతి కూడా పాసుగాని బజారప్పకు ఒక్క నెలలోనే వచ్చిందే. అదెట్లా?''ఆశ్చర్యంగా అడిగాడు శంభులింగం.
''అవా... అవి గౌరవ డాక్టరేట్లు. ఆంధ్రా అమెరికా యూనివర్సిటీ, బెంగాల్ బ్రెజిల్ యూనివర్సిటీ... ఇలా వాటి చిరునామా ఎక్కడుంటుందో ఆ శనిదేవునికి గూడా అంతుబట్టని కొన్ని యూనివర్సిటీలు తలా ఇరవయ్యో, ముప్పయ్యో తీసుకొని... నీలో ఏ కళ వుంటే ఆ కళలో... ఏవీ లేకపోతే ప్రజాసేవ కేటగిరీలో గౌరవ డాక్టరేట్లు ఇస్తుంటాయి. కానీ అవి కూడా ఈ సంవత్సరానికి అన్నీ ప్రకటించేశాయి. మరలా వచ్చే సంవత్సరం వరకు ఆగాల్సిందే'' అన్నాడు
ఆ మాటలకు బజారప్ప గాలి పోయిన బెలూనులా తుస్సుమంటూ నీరసపడ్డాడు. లేచి నీరసంగా అడుగులు బైటకేశాడు. నోటి కందిన ముక్క చేజారిన కుక్కలాగా రెడ్డప్ప విలవిలలాడిపోయాడు.
వెంకటాచలం ఏం చేయాలా అని కొంచం సేపు కిందామీదాపడి ఆలోచించి ''డాక్టరేట్ రాకపోతేనేం. అద్భుతమైన బిరుదు ఒకటి సంపాదిద్దాం. మన నంద్యాలలో తిక్కారెడ్డి అనే ఒకాయన వున్నాడులే. ఆయనకు 'ఇచ్చుకో పుచ్చుకో' అనే ఒక సేవా సంస్థ వుంది. ఏ బిరుదు కావాలంటే ఆ బిరుదు అంగరంగ వైభోగంగా అందరిముందూ నెత్తిన పూల కిరీటం పెట్టి, రాజ సింహాసనం మీద కూర్చోబెట్టి, పండితుల ఆశీర్వాదాలతో, పట్టుచీరల తళతళల మధ్య ఇచ్చేస్తాడు. పెద్ద సన్మాన పత్రం మీ తాత ముత్తాతలనుంచీ ప్రంపంచంలోనే మీ అంత పోటుగాళ్ళు లేరని పొగుడుతూ రాసిస్తాడు. మనకు ఖర్చు పెట్టుకునే శక్తి వుంటే మత్రుల్నీ, ఎమ్మెల్యేలను, పెద్ద పెద్ద కవులనూ పిలిపిస్తాడు. ఈమధ్యనే ఒకనికి కాకినాడ పద్మశ్రీ అనీ, మరొకరికి హైదరాబాద్ రత్న అనీ బిరుదులు ఇచ్చేశాడు. ఎక్కడెక్కడనుంచో వస్తుంటారు బిరుదుల కోసం. కాకపోతే బిరుదుకు ఇరవై వేలు ఇచ్చి సభ ఖర్చు మొత్తం మనమే పెట్టుకోవాల. అంత ఖర్చు వద్దనుకుంటే కేవలం ఐదు వేలకే సంవత్సరానికి ఒకసారి వందమందికి సన్మానం చేస్తుంటాడు. అందులో పేరు రాపిచ్చుకోవాల. ఆ ఫోటోలు తెచ్చి ఇక్కడి పత్రికల్లో పబ్లిసిటీ చేయించుకోవాల'' అన్నాడు.
''మనకు అంత ఎదురు చూసే సమయం ఎక్కడుంది కానీ ఇరవై వేలకే మాట్లాడు. వానికంటే ముందే పది రోజుల్లోనే మనకు సన్మానం జరిగిపోవాల. ఇంతకూ ఏం బిరుదు బాగుంటుంది''
ఇద్దరూ ఆలోచనలో పడ్డారు.
భారత ముత్యం, యువశ్రీ రత్న, పద్మశ్రీకా రాజా, రాష్ట్రపుత్ర, కొండారెడ్డి బురుజు కా షేర్ , కర్నూల్ పిత... ఇలా వరుసగ చెప్పసాగాడు వెంకటాచలం.
''ఇవన్నీ ఎందుకు 'డాక్టర్' అని బిరుదు పుచ్చుకుంటే సరిపోదా'' అన్నాడు శంభులింగం ముఖం ఆన్మదంతో వెలిగిపోతుండగా.
''ఆహా... అద్భుతమైన ఆలోచన. రెండు తెలుగు రాస్ట్రాల్లో ఇంతవరకూ ఎవరికీ రాని అమొఘమైన ఆలోచన. ఈ కొత్త ఆలోచనకే డాక్టరేట్ ఇచ్చేయొచ్చు. ఇప్పుడే ఫోన్ చేసి కన్ ఫర్మ్ చేస్తా. ముందొక పదివేలు ఫోన్ పే చేద్దాం.'' అన్నాడు సెల్ ఫోన్ జేబులోంచి బైటకు తీస్తూ.
అంతే... తరువాత రోజు ఏ పత్రిక చూసినా ఒకటే వార్త.
''శంభులింగానికి ఈ ఆదివారం ప్రపంచంలోనే అత్యంత ప్రఖ్యాతి గాంచిన 'ఇచ్చుకో పుచ్చుకో అంతర్జాతీయ సేవా సంస్థ డాక్టర్ బిరుదు ప్రధానం చేయబోతుంది. అతను ఒక కుక్కపిల్ల మురికి గుంతలో పడి ఊపిరి ఆడక గిలగిలా కొట్టుకుంటూ చనిపోతుంటే, ఆ గుంతలోకి అత్యంత ధైర్యంగా ఎగిరి దుంకి, ఆ కుక్క పిల్ల నోటిలో నోరు పెట్టి కత్రిమ శ్వాస అందించి... ఏ వైద్యుడూ చేయని సాహసం చేసి దాని ప్రాణాలు కాపాడినాడు. అందుకే ఈ బిరుదు. దీనికి రెండు రాష్ట్రాల ప్రముఖులు అనేకమంది రాబోతున్నారు'' అని వుంది.
అంతే... మరుక్షణమే...
అభినందనలతో వాట్సప్ గ్రూపులు మోగిపోసాగాయి.
ఫేస్ బుక్కులు అదిరిపోసాగాయి.
ట్విట్టర్లు పగిలిపోసాగాయి.
తన ప్లాన్ దెబ్బతిన్నందుకు బజారప్ప మొహం ఎండిపోయిన అరటి తొక్కలా నల్లగా వాడిపోగా, డాక్టర్ బజారప్ప మొహం వేయి వాల్టుల బల్బులా వెలిగిపోయింది.
- డా.ఎం.హరికిషన్, 94410 32212