కళ్ళల్లో జీవం పోయి, బుగ్గలు పీక్కుపోయి, పళ్ళు పాడయిపోయి, ఒళ్ళు చిక్కిపోయి, చలాకీతనం లేకుండా బెడ్ మీద ఉండి నిస్తేజంగా సీలింగ్ వైపు చూస్తున్న మనువణ్ణి చూసి ఆ తాతకు కన్నీళ్ళు ఆగలేదు. పద్నాలుగేళ్ల వయసుకే ముసలితనం వచ్చినట్టు అయిపోయాడు. ఎప్పుడు ఫొటోల్లో, టీవీల్లో చూడటమే తప్ప మనవణ్ణి ప్రత్యక్షంగా అప్పటిదాకా చూసే అదృష్టానికి కూడా నోచు కోలేదు ఆ తాత. మనవణ్ణి కనులారా చూస్తున్నందుకు ఆనందిం చాలో, ఆ దుస్థితిలో చూస్తున్నందుకు దుఃఖించాలో అర్ధం కాలేదు ఆ తాతకు.
'నువ్వు మా తాతవి కదూ...' అని కూడా అనలేనంత అంతరం తనకు, తన రక్తానికి మధ్య ఏర్పడటం ఆ తాత మనస్సును ఒక్కసారిగా కుదిపేసింది. 'ఏం నువ్వు కూడా ఈ పిచ్చోడు ఎలా ఉన్నాడో చూసి నవ్వుకుని ...తర్వాత నీ స్పీచులు ఇవ్వడానికి వచ్చవా? నాకేం అక్కర్లేదు. అయినా నా మీద మీరందరూ ఏమీ ఖర్చు పెట్టలేదు. రియాలిటీ షోలో నేనే బోలెడు సంపాదించాను ...నయమైపోయాక ఇంకా సంపాదిస్తాను...' ఆపకుండా ఏదో చెబుతున్న మనువడి వంక చూస్తుంటే ఆ తాతకు ఛిద్రమైపోతున్న ఈ తరం చిత్రం కళ్ళముందు కదలాడుతుంది.
'తాతలు వృద్ధాశ్రమాల్లోనూ ...మనవళ్ళు రిహేబిలిటేషన్ సెంటర్లలోనూ ...'
భావోద్వేగాల బడలికతో నవతరం రూపం కుచించుకుపోతుంది ...
గెలుపును మధురజ్ఞాపకంగా మలిచేవారు లేరు ...
ఓటమి ఊబిలో నుంచి బయటకు లాగే వారు లేరు ...
స్వేచ్చకు, జీవితాన్ని అనుభవించడానికి మధ్య అనురాగంతో హద్దులు పెట్టేవారు లేరు ...
రియల్ లైఫ్‌ను రీల్లో చూసుకుని పొంగిపోవడం...
ఆనందాన్ని జనాల చప్పట్లలో వెతుక్కోవడం...
సెలబ్రేషన్‌ను షాంపేన్ బాటిళ్ళల్లో నింపుకోవడం...
ఒంటరితనాన్ని వికృతంగా మార్చుకోవడం ...'
మనువడి గురించి తెలిసిన ఆ తాత మనసు ద్రవిస్తూ కళ్ళు వర్శిస్తున్నాయి.
'నర్సమ్మా! ఇక్కడ జగదీష్ ...నా మనువడు ఉన్నాడు... రూమ్ నంబర్ చెప్పు తల్లీ...'
నడుం వంగిపోయి, కళ్ళు లోతుకుపోయి అస్థిపంజరంలా ఉన్న ఆ వృద్ధుడిని ఎగాడిగా చూసింది ఆ నర్సు.
'ఓ ..ఆ పిచ్చోడా ...ముందుకు వెళ్ళి కుడి వైపుకు తిరిగితే ఎదురుగా ఉంటుంది రూమ్ నంబర్ 405. అక్కడ ఉంటాడు.'
మనవణ్ణి పిచ్చోడు అనేసరికి ఆ తాత గుండె కలుక్కుమంది.
'థ్యాంక్స్ తల్లి' అని చెప్పి ముందుకు కదిలాడు తాత కర్ర సాయంతో.
'ఛీ ..ఛీ ..ఈ ముసలాయన్ని ఎందుకు రమ్మన్నారు? వీడి రోగం తోడు ఈయనకు సేవలు చేయాలా?' కోడలి ఛీత్కారంతో స్వాగతం దక్కింది ఆ తాతకు.
'లేదమ్మా...నేను జగ్గును చూసి వెళ్ళిపోతాను ..ఇంటికి రాను ...'
ఆ తాత కళ్ళల్లో కోడలి ఛీత్కారపు విషాదం కన్నా కొడుకును, కోడల్ని చాలా రోజుల తర్వాత చూసుకుంటున్నానన్న ఆనందమే మెరిసింది.
ఆయన మాటల్తో ఊపిరి పీల్చుకుంది ఆ కోడలు.
కొడుకు, కోడలు ఓ పక్కకు చేరి ఏదో మాట్లాడుకుంటుంటే ఆ తాత స్ప్రింగ్ డోర్ తోసుకుని మనువడి గదిలోకి వెళ్ళాడు.
కళ్ళల్లో జీవం పోయి, బుగ్గలు పీక్కుపోయి, పళ్ళు పాడయిపోయి, ఒళ్ళు చిక్కిపోయి, చలాకీతనం లేకుండా బెడ్ మీద ఉండి నిస్తేజంగా సీలింగ్ వైపు చూస్తున్న మనువణ్ణి చూసి ఆ తాతకు కన్నీళ్ళు ఆగలేదు. పద్నాలుగేళ్ల వయసుకే ముసలితనం వచ్చినట్టు అయిపోయాడు. ఎప్పుడు ఫొటోల్లో, టీవీల్లో చూడటమే తప్ప మనవణ్ణి ప్రత్యక్షంగా అప్పటిదాకా చూసే అదృష్టానికి కూడా నోచుకోలేదు ఆ తాత. మనవణ్ణి కనులారా చూస్తున్నందుకు ఆనందించాలో, ఆ దుస్థితిలో చూస్తు న్నందుకు దుఃఖించాలో అర్ధం కాలేదు ఆ తాతకు.
మెల్లగా అతని బెడ్ దగ్గరకు వెళ్ళి, 'జగ్గూ ..' అని ఆ పిల్లాడి తల మీద చేయి వేశాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆ వృద్ధుడి వైపు చూశాడు జగదీష్.
కిందికి వాలిపోతున్న కళ్ళను బలవంతంగా పైకి నిలిపి ...
'నువ్వు ...మా డాడ్ వాళ్ళ డాడ్వి కదూ...ఆల్బమ్స్‌లో చూసా ...'
'నువ్వు మా తాతవి కదూ...' అని కూడా అనలేనంత అంతరం తనకు, తన రక్తానికి మధ్య ఏర్పడటం ఆ తాత మనస్సును ఒక్కసారిగా కుదిపేసింది.
'ఏం నువ్వు కూడా ఈ పిచ్చోడు ఎలా ఉన్నాడో చూసి నవ్వుకుని ...తర్వాత నీ స్పీచులు ఇవ్వడానికి వచ్చవా? నాకేం అక్కర్లేదు. అయినా నా మీద మీరందరూ ఏమీ ఖర్చు పెట్టలేదు. రియాలిటీ షోలో నేనే బోలెడు సంపాదించాను ...నయమైపోయాక ఇంకా సంపాదిస్తాను...'
ఆపకుండా ఏదో చెబుతున్న మనువడి వంక చూస్తుంటే ఆ తాతకు ఛిద్రమైపోతున్న ఈ తరం చిత్రం కళ్ళముందు కదలాడుతుంది.
'లేదు జగ్గూ... నేను అందుకు రాలేదు... మనిద్దరం కలిసి ఎక్కడికైనా బయటికెళ్దాం...'
'బయటికా? నన్ను బయటికి కూడా వెళ్ళనిస్తారా? మామ్, డాడ్ ఒప్పుకుంటారా? నువ్వు నన్ను బయటకు తీసుకువెళ్తావా? 'అని బేలగా అడుగుతున్న మనవణ్ణి చూస్తే ఆ తాత గుండె తరుక్కుపోతుంది.
'నేను తీసుకువెళ్తాగా....' అని చెప్పి బయట ఉన్న కొడుకు, కోడలి దగ్గరకు వచ్చాడు.
'ఏంటీ వాణ్ణి మీతో తీసుకువెళ్తారా? మీకు మతి ఉండే మాట్లాడుతున్నారా? ఈ పరిస్థితుల్లో అందుల్లోనూ ...' మాట్లాడుతున్న కోడలి మాటలకు మధ్యలోనే అడ్డుపడ్డాడు ఆమె భర్త.
'సరే నాన్నా ... నువ్వు తీసుకువెళ్ళు... కానీ వాడి పరిస్థితి నీకు తెలుసు కదా ..జాగ్రత్త...'
'సరేరా ...' అని చెప్పి కదిలాడు.
'చూడు డార్లింగ్ ... ఇప్పటికే వీడి వల్ల నెల్లాళ్ళు సెలవు పెట్టాము. ఇంకా పొడిగిస్తే మన ఉద్యోగాలు ఊడటం ఖాయం. వాడి వల్ల సొసైటీలో మన పరువు కూడా పోయింది. ఇంకా వాడిని ఎన్నాళ్ళు ఇలా ఉంచుతాము? ఎలాగూ ఆయన తీసుకు వెళ్తానంటున్నారు కదా ... వెళ్లనిద్దాం ... '
భర్త సమాధానంతో సంతృప్తి పడింది ఆమె.
ఆ మాటలు తాత చెవిన పడ్డాయి.
'కన్నకొడుకు కన్నా ఉద్యోగాలు, స్టేటస్ ముఖ్యం అనుకుంటున్న ఆ మధ్యతరం మనుషుల అంతరాలు ఆయనను మరోసారి సందిగ్దంలోకి నెట్టేసాయి.
తన తరువాతి రెండు తరాల్లో కూలిపోతున్న విలువల్ని దర్శిస్తూ మనువడితో బయటకు నడిచాడు ఆ తాత.
మురమల్ల ...గోదావరి జిల్లాలోని ఓ పల్లెటూరు ...
ఎనిమిది గంటల ప్రయాణం.
ప్రయాణం మొత్తంలో మనువడు ఏమీ మాట్లాడలేదు. తనలో తానే నవ్వుకున్నాడు.... తనలో తానే ఏడ్చుకున్నాడు ...తనలో తానే మాట్లాడుకున్నాడు.
'మనుషుల మీద వాడికెంతలా నమ్మకం సడలి పోయింది !' అనుకున్నాడు ఆ తాత.
రోడ్డుకు చుట్టుపక్కలా ఉన్న పచ్చటి చెట్లను చూస్తున్న జగదీష్ తనదైన లోకం నుండి బయటపడి వాటినే చూస్తున్నాడు. తాత ఏమి మాట్లాడకుండా మనువడినే చూస్తున్నాడు.
'నమస్తే బాబాయిగారు ...మన ఊరు వస్తున్నట్టు కనీసం చెప్పనే లేదు ...'
'ఒరేరు సోములు ...బాబారు వచ్చాడు... బండి కట్టరోరు ...' అని అరిచాడు ఆ ఊరి సర్పంచ్ గిరి.
'అదేం లేదు గిరి ...అనుకోకుండా వచ్చాం...'
'ఈ బాబు ఎవరూ? చాలాసార్లు చూసినట్టు ఉందే ?'
ఒక్కసారిగా సర్పంచ్ మాటలు వినేసరికి జగదీష్ కళ్ళల్లోకి జీవం వచ్చింది. అది తాత దృష్టిని దాటిపోలేదు.
'నా మనువడు జగదీష్ ...'జింగ్ జింగ్' టీవీలో ఓ రియాలిటీ షో చేశాడు.'
'ఓహ్ ...అదా సంగతి...ఏదైతేనేం మా బాబాయి ఇన్నాళ్ళకు ఊరొచ్చాడు. అదే పెద్ద విశేషం. అందులోనూ వారసుడితో ... తాతమనువళ్ళు ఇక మా ఇంట్లోనే ఉండాలి. ఇక మీరు నా మాట కాదనుకూడదు బాబాయి' అని అంటూనే లగేజ్ అందుకుని బండిలో పెట్టి చేయి అందించాడు గిరి వాళ్ళిద్దరు లోపలికి ఎక్కడానికి.
ఓ క్షణకాలం పాటు మనువడి కళ్ళల్లో మెరిసిన మెరుపు వెంటనే మాయమైపోవడం గమనించాడు తాత. మనవడి మనసు అర్ధం అయ్యింది.
గోరుముద్దలు తినడం ...
ఆటలు ఆదుకోవడం ...
చెరువులో ఈత కొట్టడం ...
తాటిముంజేలు తినడం ...
ఊరంతా తిరగడం ...
ఊళ్ళో వాళ్ళంతా తనను పిచ్చోడిలా కాకుండా బిడ్డలా చూసుకోవడం....
ఇవన్నీ కొత్త అనుభూతులుగా అనిపించాయి జగదీష్ కు. తాత అంటే నడుం వంగిపోయిన ముసలివాడు అనుకున్నాడు కానీ... తన తాత రిటైర్డ్ ఐఏఎస్ అని, ఆయన తన ఊరికి చేసిన సేవల వల్ల ఊళ్ళో అందరూ ఆయనంటే ప్రాణమిస్తారని అర్ధం అయ్యింది జగదీష్‌కి. ఇంత గొప్ప తాతను వృద్ధాశ్రమానికి ఎందుకు అమ్మనాన్నా పంపేశారో అని అనుకున్నాడు జగదీష్.
జగదీష్ నా మనవడు మాత్రమే కాదు .... శిథిలమవ్వబోతున్న అనుబంధాలకు, మానవత్వానికి, విలువలకు ఓ హెచ్చరిక కూడా. ఇది నా మనువడి కథ మాత్రమే కాదు.
నాయనమ్మ, తాతల ఒడిలో కథలు వినకుండా క్రచ్లలో పెరుగుతూ...
బాబాయి, పిన్ని, అత్తామామల సందడిలో కాకుండా టీవీల గోలలో మమేకమౌతూ...
స్నేహితులతో కాకుండా వీడియో గేమ్‌లలో గడిపేస్తూ....
అక్కాచెల్లెళ్ళు, అన్నాదమ్ములు లేక ఒంటరితనంతో వ్యసనాలను తోబుట్టువులా చేసుకుంటూ సాగుతున్న ఈ తరం కథ ఇది.
నా భార్య ఒక్క కొడుకు పుట్టగానే మరణించింది. అందుకే వాడు నా ఒక్క కొడుకుగానే మిగిలిపోయాడు. భార్యలేని నేను... ఐఏఎస్నైన నేను ఇంకొకర్ని దత్తత తీసుకున్నా పెంచలేనేమోనన్న భయంతో ఆ ఒక్కడినే నా వారసుడు అనుకున్నాను.
వాడు ఇదే పల్లెటూరిలో పెరిగాడు. కానీ ఇంట్లో అమ్మ లేకపోవడం వల్ల అన్ని విషయాలు చెప్పుకోవడానికి ఎవరూ లేకపోయారు. అక్కడ వాడికి, నాకు మధ్య ఏర్పడ్డ 'గ్యాప్' అన్నది ఇద్దరు వ్యక్తులకు మధ్య ఏర్పడ్డ యాంత్రికత కాదు. రెండు తరాల మధ్య ఏర్పడ్డ గ్యాప్ అది.
తర్వాత వాడు మరింత సెల్ఫిష్‌గా మారిపోయాడు. అన్ని విషయాల్లో వాడికి నేను స్వేచ్చ ఇచ్చాను. ఆ స్వేచ్చతోనే వాడు డేటింగ్ చేసి ఎప్పటికో పెళ్ళి చేసుకున్నాడు. చిన్నప్పటి నుండే మా ఇద్దరి మధ్య ఏర్పడ్డ గ్యాప్ వల్ల వాడితో నా మానసిక బంధం ధృడపడలేదు. వృత్తిపరంగా విజయాలు సాధించినా తండ్రిగా ఓడిపోయాను. నా ఓటమి మళ్ళీ నా కొడుకును కూడా మళ్ళీ తండ్రిలా ఓడిపోయేలా చేసింది. ఇక ఇప్పుడు అదే ఓటమి పరంపర నా మనవడి దాకా సాగుతుంది.
గెలుపు అంటే కీర్తికండువాలు, సర్టిఫికెట్లు, జనాల చప్పట్లు అని అనుకున్న నా కొడుకు, కోడలు నా మనవణ్ణి అలానే తయారు చేశారు.
చిన్నప్పుడే వాడిని 'రియాలిటీ షో' తో రీల్ స్టార్‌ను చేశారు. స్క్రీన్ మీద ఎవరికి ఎక్కువకాలం జీవితం ఉండదు. అది చిన్న వయసులోనే ఉన్న నా మనవడు అర్ధం చేసుకోలేడు. నా కొడుకు,కోడలకు అర్ధం చేసుకునే స్థాయి ఉన్నా కుచించుపోతూనే ఉన్నారు. కొదుకంటే స్టేటస్ సింబల్ గా మారిపోయే స్థితికి వారు ...ఏమనాలో మరి...
ఈ రోజు నా మనువడి స్టార్ స్టేజ్ అయిపోయింది. వాడి స్థానంలో ఇంకొకరు వచ్చారు. ఫోటోలు,ఫ్యాన్ లు ...ఇదే ప్రపంచం అనుకున్న వాడు ఈ మార్పును తట్టుకోలేకపోయాడు. దానికితోడు ఇంట్లో అమ్మానాన్నల ఆప్యాయత కూడా కరువైంది. డ్రగ్స్ ను తాత్కాలిక ఆనందంగా చేసుకున్నాడు. ఏ రీహేబిలిటేషన్ సెంటర్ కూడా వాడికి నిజమైన సంతోషాన్ని ఇవ్వలేకపోయింది.
తాతలు వృద్ధాశ్రమాలకు, మనువళ్ళు రీహేబిలిటేషన్ సెంటర్లకు పోతే.... ఇంకెక్కడ నిలబడతాయి అనుబంధాల గట్టుతో సాగే కుటుంబ బంధాలు!నా కొడుకు నన్ను వృద్ధాశ్రమానికి పంపడానికి...తన కొడుకును రీహేబిలిటేషన్ సెంటర్ కు పంపడానికి కారణం నేనే!
విత్తనం బట్టే వృక్షం
వృక్షం బట్టే ఫలాలు
నేను నా కొడుకుకు అనుబంధాల మాధుర్యాన్ని వారసత్వంగా ఇవ్వలేదు. కనుక వాడికి జీవితం గురించి ఏం అర్ధం అయ్యిందో అదే వాడు తన తరువాతి తరానికి అందించాడు. నా వల్ల జరిగిన తప్పును నేను సరిదిద్దుకోవాలనుకుంటున్నాను. నేను చేసిన తప్పులాంటిది మీలో కూడా చాలామంది చేసే ఉండవచ్చు. ఇది మనం దిద్దవలసిన తప్పే. లేకపోతే ఈ మచ్చ మానవాళికే ప్రశ్నగా మిగిలిపోతుంది.
తాతలందరూ కలిస్తే మనవళ్ళకు మంచి జీవితాన్ని అందించవచ్చు. వాళ్ళు మనం ఆశించినవి చేయకపోవచ్చు. మనమందరం అరవైల్లో ఉన్నాం. రేపో, మాపో రాలిపోయేవాళ్ళము. మనవాళ్ళు మనతో ఉంటే బావుండు అనుకునేవాళ్ళము.
కానీ మన పిల్లలు నలభైల్లో ఉన్నవాళ్ళు. వాళ్ళకు పిల్లలు, బాధ్యతలు అనే టెన్షన్లు ఎప్పుడూ ఉంటాయి. మన ఆలోచనలను వారు చాదస్తాలుగా భావించవచ్చు. కానీ కాస్త మనమే వారి దారిలోకి వెళ్ళి మనం ఏ ప్రేమకై తపిస్తున్నామో అదే ప్రేమను మన తరువాతి తరాల వారికి అందిద్దాము. వాళ్ళు విసుక్కోవడాలు,మన మనసు చివుక్కుమనడాలు సాధారణమే కానీ...రోజంతా అలసిపోయే వారిని మనమే అర్ధం చేసుకుంటే సరిపోతుంది.
మన తరం వాళ్ళు ఎక్కడో చేసిన చిన్న తప్పే మన పిల్లలు బంధాలకు దూరం కావడానికి కారణం అవుతుంది. అది అర్ధం చేసుకునే స్థాయి మనం తండ్రులుగా ఉన్నప్పుడూ లేకపోవచ్చు. కానీ తాతలుగా మారిన తర్వాత కూడా ఆ తప్పు దిద్దకపోతే ...ఇక ఎప్పటికీ 'తాతకు తగ్గ మనువడు' అనే నానుడి కూడా ఉండదేమో!
అందుకే నేనో నిర్ణయం తీసుకున్నాను. నేను నా కొడుకు దగ్గరకు వెళ్ళిపోవాలని. నన్ను వారు ఆదరించకపోవచ్చు... కానీ నేను వారికి భారం కాకుండా చూసుకుంటాను. నేను చేసిన తప్పులు నా కొడుకు ముందర ఒప్పుకుంటాను. నా మనువడి బాధ్యత తీసుకుంటాను.
ఇది పట్టణాల్లో పరిస్థితే కాదు... పల్లెటూరిగా ఉన్న ఊళ్ళోనే ఎన్నో వేర్వేరు కుంపట్లు. పెళ్ళయిన తర్వాత భార్యాభర్తలు ఏకాంతాన్ని కోరుకోవడం తప్పు కాదు. కానీ పిల్లలు పుట్టాక మన తరం వారితో లేకపోతే ఒంటరితనం,న్యూనత వారసత్వ పరంపరగా ముందుకు సాగుతుంది. క్లాస్ ఫస్ట్ మార్కులు, ఎంసెట్ ర్యాంకుల్లో ఆనందాన్ని వెతుక్కుంటూ,అవి సాధించలేకపోతే వ్యసనాల్లో వాటి వెలితిని పూడ్చుకునే తరాన్ని అంతమొందిద్దాం. ఇది తల్లిదండ్రులు, నాయనమ్మ-తాతయ్యలు పిల్లలకు నేర్పాల్సిన పాఠాలు.
నా నిర్ణయం గురించి మీకు చెప్పడానికి కారణం... మీరందరూ నన్ను అన్ని విషయాల్లో ఆదర్శంగా తీసుకుని, ఎంతో గౌరవం ఇస్తారు. నా వయసు,నా ఆత్మాభిమానం నా తప్పును పెంచి పోషించేలా చేశాయి ఇన్నాళ్ళు. అందుకే దాన్ని దిద్దుకోవడానికి నేను వెళ్తున్నాను. మీరు కూడా మీ వ్యక్తిగత మనోభావాల్ని ప్రక్కన పెట్టి మనువల కోసం ముందడుగు వేస్తారనే ఆశతో ...'ముగించాడు ఆ తాత.
పడమటికి ఒరిగిన సూర్యుడు తూర్పుకు మళ్ళాడు... అక్కడి తాతలందరి ఏకాభిప్రాయానికి చిహ్నంగా ....ముందుకు సాగుతామంటూ....
- శృంగవరపు రచన, 8790739123
Sun 26 Dec 04:06:15.048989 2021