ఒక పక్క దేశ దేశాల యువరాజులు, వారి తల్లిదండ్రులు కొలువుతీరి ఉన్నారు. మరొక ప్రక్క వీరవర్మ, రాగమాలిక, పెళ్లికూతురు యువరాణి అయిన మధుమాలిని పట్టువస్త్రాలతో ధగధగా మెరిసిపోతూ కొలువులో కూర్చుంది. అందరూ కన్నార్పకుండా ఆమెనే చూస్తున్నారు. ''ఏమా అందం, ఏమా కళ! ఇంతటి అందగతే ఈ ప్రపంచంలోనే లేదేమో?'' అని ఎవరికి వారే అనుకోసాగారు. కానీ మధుమాలిని
దృష్టి మాత్రం కోమల దేశ యువరాజైన మణికాంతుడిపై పడింది. ఎలాగైనా ఆ యువరాజునే జీవిత భాగస్వామిగా చేపట్టాలనుకొంది. మణికాంతుడు కూడా మధు మాలినినే కన్నార్పకుండా చూస్తున్నాడు. ఇంతలో రాజు తాను పెట్టబోయే పరీక్ష గురించి వివరించాడు, ''మహా జనులారా! ఎవరైతే నేను ఈ సభా మధ్యలో పెట్టిన పెద్ద రాయిని నేను ఇచ్చిన అయిదు బాణాలతో ఛేదిస్తారో వారికి నేను ఇంకొక పరీక్ష పెడతాను. ఆ పరీక్షలో కూడా నెగ్గిన వారికి నా రాజ్యంలో అర్ధభాగం ఇచ్చి, నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను'' అంటాడు.
కుంతల దేశానికి రాజు రంగ వర్మ. అతను ప్రజలను కన్న బిడ్డల్లా చూసుకునే వాడు. అతని సమక్షంలో రాజ్యము ఎప్పుడు రామరాజ్యంలాగా కళకళలాడుతూ ఉండేది. అందరూ రంగ వర్మను ఒక దేవుడు లాగా కొలిచేవారు. రంగ వర్మకు ఒక్కడే కొడుకు వీర వర్మ. ఇతను పుట్టిన కొద్దికాలానికే తల్లి పరమ పదించింది. దాంతో రాజు వీరవర్మని ఎంతో అల్లారుముద్దుగా పెంచసాగాడు. అంత అల్లారుముద్దుగా పెరిగిన కూడా వీరవర్మ అన్ని విద్యల్లో ఆరితేరాడు. యుక్త వయస్సు వచ్చేటప్పటికి యువరాజు ఎంతో అందంగా తయారయ్యాడు. అతని అందం చూసి అనేక దేశాల రాకుమార్తెలు వివాహమాడాలని కలలు కనేవారు. రాజు రంగ వర్మ మాత్రం తన పొరుగు దేశమైన పాంచాల దేశ రాకుమార్తె రాగమాలికనే తన కోడలిగా చేసుకున్నాడు.
రాగమాలిక కూడా ఎంతో నెమ్మదస్తురాలు. మామగారిని, భర్తని ఎంత ప్రేమతో చూసేది. అప్పుడప్పుడు రాజ్య వ్యవహారాల్లో మామగారికి సలహాలిస్తుండేది. రంగ వర్మ కోడలి వినయశీలతకి, గొప్పతనానికి ఎంతో పొంగిపోయేవాడు. ఇట్లా కొన్నాళ్లు సాగేటప్పటికీ రాజుకు అవసాన కాలం సమీపించింది. రాజు తన కొడుకుకు పట్టాభిషేకం చేయదలచి కొడుకు, కోడల్ని దగ్గరకు పిలిచి ''నాయనా నాకు అవసాన కాలం సమీపించింది. నేను ఎంతో కాలం బ్రతకను. కాబట్టి మీరే ఈ రాజ్యాన్ని ఏలండి. నా లాగా మీరు కూడా ఈ రాజ్యానికి ఎనలేని పేరు తేవాలి, అప్పుడే నా మనసుకు శాంతి లభిస్తుంది. కానీ నా చివరి కోరిక తీరకముందే నేను చనిపోతానేమో అనిపిస్తుంది'' అని అన్నాడు రాజు. కొడుకు ''ఏమిటి నాన్న మీ చివరి కోరిక'' అని ఆత్రంగా అడిగాడు. ''ఏమీ లేదు నాయనా రాగమాలిక కడుపున ఒక బిడ్డ పుడితే చూడాలని ఉంది'' అని అన్నాడు. ఆ కోరిక తీరక ముందే రాజు రంగ వర్మ కాలం చేశాడు. రంగవర్మ మృతి కొడుకు, కోడలు ఇద్దర్ని ఎంతో క్రుంగదీసింది. ప్రజలే తమకున్న అభిమానంతో ఇద్దరికీ ఎంతో ధైర్యం చెప్పారు. దాంతో ఇద్దరూ మామూలు పరిస్థితికి రాగలిగారు. క్రమక్రమంగా వీరవర్మ తండ్రి లాగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నాడు వీరవర్మ.
ఎన్ని విధాలుగా సంతోష పడుతున్నా కూడా సంతానం లేదన్న బాధ ఇద్దరినీ బాగా క్రుంగదీసింది.సంతానం కోసం ఎన్నో నోములు, వ్రతాలు చేశారు, అయినా కూడా సంతానం కలగలేదు. ఆ సమయంలో రాజ్యానికి ఒక సాధువు వచ్చాడు. సంతానం లేని వారికి సంతానం కలుగజేయడమే ఈ సాధువు విధి. ఇద్దరికీ తమ రాజ్యానికి సాధువు వచ్చిన విషయం తెలిసి తమ కొలువుకు ఆహ్వానించి సకల మర్యాదలు చేసి సంతానం కలిగేట్లు చెయ్యమని ప్రార్థించారు.ఆ సాదువు రాణికి మంత్రించిన గుళికలు ఏడు ఇచ్చి దేవి తమరు ఈ గుళికలు రోజు రాత్రిపూట ఒకటి చొప్పున వేసుకున్నారంటే మీకు పది నెలలు నిండేటప్పటికి పండంటి పాప పడుతుందని ఏడు గుళికలు ఇచ్చాడు సాధువు. రాణి సాధువు ఇచ్చిన గుళికలు సంతోషంతో తీసుకుని సాధువుకి అధిక ధనమిచ్చి సత్కరించి పంపారు. సాధువు వాటిని సంతోషంతో స్వీకరించి వారికి నమస్కరించి వెళ్ళాడు. రాణి సాధువు ఇచ్చిన గుళికలు ఏడు రోజుల పాటు వేసుకోవడంతో క్రమంగా ఒక నెల రోజుల్లో గర్భం దాల్చింది. ప్రజలంతా కూడా ఎంతో సంతోషించారు, మన దేశానికి ఒక మహాపురుషుడు ఉద్భవిస్తున్నాడు అంటూ నినాదాలు చేశారు.
మరల సంవత్సరం తిరిగేటప్పటికల్లా రాణి పండంటి కూతుర్ని కన్నది. రాజు, రాణి ఆ బిడ్డకు మధుమాలిని అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచసాగారు. ఈమె క్రమక్రమంగా పెద్దవ్వసాగింది. లేక లేక పుట్టిన బిడ్డ కావటంతో ఎంతో గారాబంగా పెంచిన్నప్పటికీ ఐదు సంవత్సరాలు వచ్చేటప్పటికి ఎంతో తెలివితేటలతో మెలగసాగింది. మధుమాలినికి ఆరు సంవత్సరాలు రాగానే తమ కొలువులోనే ఒక గురువును పెట్టి విద్యలు నేర్పించసాగారు. పది సంవత్సరాలు నిండేటప్పటికీ మెల్లమెల్లగా విద్యలలో మెళుకువలన్ని తెలుసుకోసాగింది. దానికి తోడు యుక్తవయసు వచ్చేటప్పటికే ఎంతో అందంగా తయారవసాగింది. అప్సరసల్ని తలదన్నే అందగత్తెగా తయార యింది కానీ ఇన్ని విద్యలు నేర్చుకుని అంత అందంగా ఉన్నా కూడా ఏమాత్రం గర్వపడేది కాదు మధుమాలిని. రాజు, రాణి తమ కూతురు ప్రయోజకత్వం చూసి ఎంతో మురిసిపోయేవారు. అన్ని దేశాల యువరాజులు మధుమాలిని తెలివితేతలు గురించి ఎంతో గొప్పగా చెప్పుకోసాగారు. అనేక దేశాల యువరాజులు మధుమాలిని అందం చూసి మతులు పోగొట్టుకునేవారు. కొంతమంది యువరాజులు మదుమాలినికి ప్రేమ లేఖలు కూడా రాశారు. కానీ మధుమాలిని తండ్రి చాటు బిడ్డ కావటాన ఆ ప్రేమ లేఖలకు ఏమీ చెలించలేదు. రాజు వీరవర్మ తన కూతురికి రాజ్యపాలనలో మెలుకువలు నేర్పి తనకి కాబోయే అల్లుడికి కఠిన పరీక్ష పెట్టి ఆ పరీక్షలో నెగ్గిన యువరాజుకి తన కూతుర్నిచ్చి పెళ్ళి చేయతలచాడు. అందుకే తన కూతురికి రాజ్యపాలనలో మెళుకువలను ఎంతో జాగ్రత్తగా నేర్పించాడు. ఆమె సహజంగా ఎంతో తెలివైనది కావటాన రాజ్య పాలనలో మెలకువలు అన్ని ఇట్టే గ్రహించ గలిగింది. మధుమాలిని మెల్లిమెల్లిగా ఇరవయ్యో ప్రాయంలోకి అడుగుపెట్టింది. రాజు, రాణి కూడా తమ కూతురికి వివాహం చేయ దలచారు. అందుకు ఒక స్వయంవరం ఏర్పాటు చేశారు. దేశదేశాల యువ రాజులకు వర్తమానాలు పంపారు.
వారం రోజుల తర్వాత ఒక సభ ఏర్పాటు అయింది. ఒక పక్క దేశ దేశాల యువరాజులు, వారి తల్లిదండ్రులు కొలువుతీరి ఉన్నారు. మరొక ప్రక్క వీరవర్మ, రాగమాలిక, పెళ్లికూతురు యువరాణి అయిన మధుమాలిని పట్టువస్త్రాలతో ధగధగా మెరిసిపోతూ కొలువులో కూర్చుంది. అందరూ కన్నార్పకుండా ఆమెనే చూస్తున్నారు. ''ఏమా అందం, ఏమా కళ! ఇంతటి అందగతే ఈ ప్రపంచంలోనే లేదేమో?'' అని ఎవరికి వారే అనుకోసాగారు. కానీ మధుమాలిని దృష్టి మాత్రం కోమల దేశ యువరాజైన మణికాంతుడిపై పడింది. ఎలాగైనా ఆ యువరాజునే జీవిత భాగస్వామిగా చేపట్టాలనుకొంది. మణికాంతుడు కూడా మధు మాలినినే కన్నార్పకుండా చూస్తున్నాడు. ఇంతలో రాజు తాను పెట్టబోయే పరీక్ష గురించి వివరించాడు, ''మహా జనులారా! ఎవరైతే నేను ఈ సభా మధ్యలో పెట్టిన పెద్ద రాయిని నేను ఇచ్చిన అయిదు బాణాలతో ఛేదిస్తారో వారికి నేను ఇంకొక పరీక్ష పెడతాను. ఆ పరీక్షలో కూడా నెగ్గిన వారికి నా రాజ్యంలో అర్ధభాగం ఇచ్చి, నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను'' అంటాడు. సభాసదులందరూ ఎవరికి వారే ''నేను ఛేదించగలను అంటే నేను ఛేదించగలను'' అని అనుకుంటారు. ఒక్కొక్కరే వచ్చి బాణాలు వేయసాగారు. కానీ నాలుగు బాణాలు వేశాక రాయిలో కొద్దిగా చలనం కలిగింది. కాని ఐదవ బాణం గురి తప్పింది. నిరాశతో చాలామంది వెనుతిరిగి వెళ్ళిపోయారు.
ఇప్పుడు కోమల దేశ యువరాజైన మణికాంతుడి వంతు వచ్చింది. మణికాంతుడు బాణాలు అందుకని ఒక్కటే వెయ్య సాగాడు. మొదటి బాణం వేసే టప్పటికి రాయి కొద్దిగా పక్కకు ఒరిగింది. రెండవ బాణం వేసేటప్పటికి రాయి రెండు ముక్కలయింది. సభలో హర్షధ్వానాలు మిన్నుముట్టాయి. యువరాణి మనసులో ఒక్కసారి అమ్మయ్య నా చెలికాడు గెలిచాడు అనుకొంది. రాజు రాణి కూడా యువరాజుని పొగడ్తలతో ముంచెత్తారు. పరీక్షలో ఓడి పోయిన యువ రాజులందరూ వీరవర్మ దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. సభలో యువ రాజు మణికాంతుడు మాత్రమే మిగిలాడు. రాజు మణికాంతుడికి రెండవ పరీక్ష గురించి వివరించ సాగాడు. మణికాంతునితో ''నీకు గల ధైర్యం చూస్తుంటే రెండవ పరీక్ష కూడా తేలికగా నెగ్గుకు రాగలవనిపిస్తుంది. అయినా ఆ పరీక్ష ఏమిటో చెబుతాను విను'' అంటూ ఇలా చెప్పసాగాడు. ''హిమ పర్వతం వెనుక ఒక పెద్ద గుహ ఉంది. ఆ గుహలో ఒక భరిణలో ధగధగా మెరిసే కొన్ని కోట్ల విలువ చేసే వజ్రాలు ఉన్నాయి. అవి గనక మానవుల దగ్గర మాత్రమే ఎవరి దగ్గర ఉంటే వారికి చావు అనేది ఉండదు. కాని ఆ గుహకు అనేక దయ్యాలు, కాలకంఠుడనే భూతం వాటికి కాపలాగా ఉన్నాయి. వాటికి భయపడి ఇప్పటివరకు ఎవరూ ఆ ఆభరణ జోలికి పోలేదు. వెళ్లినా మళ్ళీ తిరిగి రాకుండా అక్కడే ప్రాణాలు పోగొట్టుకున్నారు'' అంటూ వివరించాడు. అప్పుడు యువరాజు ''ఆ వజ్రాల భరిణెను నేను తేగలను మహారాజా'' అన్నాడు. రాజు సంతోషంతో ''అలాగే వెళ్లిరా నాయనా'' అని దీవించాడు. రాణి కూడా ''క్షేమంగా తిరిగిరా నాయనా'' అని దీవించింది. యువరాజు కనుసైగతో మధు మాలినికి తన భావాలను వ్యక్తం చేశాడు. మధు మాలిని కూడా కనుసైగతోనే ''నీకు నా సహాయం ఎప్పుడూ ఉంటుంది'' అంది. మణికాంతుడు అందరి దీవెనలు అందుకుని కార్యసాధనకై బయలుదేరాడు.
యువరాజు మణికాంతుడు కార్యసాధనకు తన వెంట తాను చిన్న పిల్లవాడుగా మారడానికి ఉపయోగపడే ఉంగరాన్ని తీసుకువెళ్ళాడు. ఉంగరం వేలికి తొడుక్కుంటే చిన్నపిల్లవాడుగా మారవచ్చు. వద్దనుకుంటే తీసివేయవచ్చు ఆ విధంగా ఉపయోగపడుతుంది. యువరాజు నడుచుకుంటూ వెళుతుంటే మధ్యలో ఒక కాలువ అడ్డు వచ్చింది. ఆ కాలువలో ఒక పెద్ద తాబేలు ఉంది. దానికి చిన్న పిల్లలు అంటే చాలా ఇష్టం. పెద్ద వాళ్ళని చూస్తే దానికి కోపం ఒక్కోసారి మింగేస్తుంది కూడా. కానీ యువరాజుకు ఈ విషయం తెలియదు. మెల్లగా కాలువ దాటడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇంతలో ఎవరో రైతు అటుగా వెడుతూ యువరాజుతో ''నాయనా నువ్వు ఎవరూ నిన్ను చూస్తుంటే గొప్పింటి బిడ్డలా కనబడుతున్నావు. ఇక్కడ కాలువలో పెద్ద తాబేలు ఉంది. ఆ సంగతి నీకు తెలియనట్లు న్నది అందుకే కాలువ దాటడానికి ప్రయత్నిస్తున్నావు అవునా'' అని అడిగాడు., ''ఏమిటండి మీరు తాబేలు అని ఏదో అంటున్నారు అది మనుషులకు ఏమైనా హాని చేస్తుందా?'' అని అడిగాడు యువరాజు. ''అవును నాయనా దానికి చిన్న పిల్లలంటే మహా ఇష్టం. వాళ్లని ఏమీ చేయదు. దానికి పెద్దవాళ్ళంటే మహా కోపం ఒక్కొక్కసారి అది పెద్ద వాళ్ళని చంపడానికి కూడా ప్రయత్నిస్తుంది'' అన్నాడు. అప్పుడు యువరాజు ''చాలా కృతజ్ఞతలండి నన్ను అపాయం నుంచి తప్పించినందుకు''. ''దానిదేముంది నాయన ఇదేమి పెద్ద సహాయమా'' అని రాజు దగ్గర సెలవు తీసుకుని రైతు వెళ్లిపోయాడు. యువరాజు అప్పుడు ఏమి చేయడమా అని ఆలోచించాడు కొద్దిసేపు. వెంటనే మెరుపులాంటి ఆలోచన వచ్చింది. తన దగ్గర ఉన్న ఉంగరం తీసి వేలికి తొడుక్కున్నాడు. అంతే వెంటనే చిన్న పిల్లవాడుగా మారిపోయాడు. అప్పుడు కాలువ దాటడానికి ప్రయత్నించాడు. కాలువలో నుంచి తాబేలు బయటకు వచ్చి ఎవరా అని చూసింది, చూసి ఏమీ చెయ్యకుండా ఊరుకుంది. యువరాజు ''అమ్మయ్య తాబేలు ఏమి చెయ్యలేదు'' అని అనుకుని మెల్లగా కాలువ దాటాడు. కాలువ దాటి కొంత దూరం వచ్చాక యువరాజు వేలికి ఉన్న ఉంగరాన్ని తీసివేశాడు. మళ్ళీ నడక సాగించాడు. అట్లా కొంత దూరం నడిచాక దూరంగా ఎవరో బందిపోటు దొంగలు వస్తున్నట్లు కనబడింది. రానురాను దొంగలముఠా యువరాజుకు దగ్గరవసాగింది. దొంగల ముఠా నాయకుడు ''మన ముందుకు ఎవరో పిట్ట వస్తున్నట్లున్నాడు, మంచి ధనవంతుడిలా ఉన్నాడు. మన సంగతి వాడికి తెలియనట్లుంది'' అని గట్టిగా అరిచాడు. దాంతో యువరాజు కాస్త భయకంపితుడయ్యాడు. దొంగల ముఠా నేరుగా యువరాజు దగ్గరికి వచ్చారు. యువరాజు వారి ముందు ధైర్యంగా నిలబడ్డాడు. దొంగల ముఠా నాయకుడు ''ఒరేరు నీ దగ్గరున్న సొమ్ము తిరు'' అంటూ గర్జించాడు. అప్పుడు యువరాజు ''మీరు కాస్త జరగండి నా దగ్గర ఉన్న సొమ్ము మీకు ఇస్తాను'' అన్నాడు. అప్పుడు దొంగలముఠా కాస్త వెడంగా జరిగారు. వెంటనే యువరాజు తన దగ్గర ఉన్న ఉంగరం తీసి చేతి వేలికి తొడుక్కున్నాడు. అంతే వెంటనే చిన్న పిల్లవాడుగా మారిపోయాడు. దొంగలు అందరూ ఆశ్చర్యంతో నోళ్ళు వెళ్ళ బెట్టారు. ఇంతలో యువరాజు పక్కనే ఏవో పొలాలు ఉంటే తుర్రు మంటూ వాటిల్లోకి పారిపోయాడు. వాళ్లకి ఏమీ అర్థం కాక చుట్టూ కలయ చూశారు. యువరాజు కనపడలేదు నిరాశతో దొంగలు ముందుకు సాగిపోయారు. అప్పుడు యువరాజు వేలికి ఉన్న ఉంగరాన్ని తీసి భద్రంగా దాచుకున్నాడు. వెంటనే మామూలు యువరాజుగా మారిపోయాడు.
మళ్లీ యువరాజు తన ప్రయాణాన్ని కొనసాగించాడు. ఇట్లా నడుచుకుంటూ, నడుచుకుంటూ ఉంగరం సహాయంతో అనేక కాలువలు, నదులు దాటుకుంటూ తన ప్రయాణాన్ని కొనసాగించాడు. ఇలా ప్రయాణం చేస్తుండగా దారిలో ఒక అవ్వ కనబడింది. యువరాజుని చూడగానే ఒక్కసారిగా ఎగిరి గంతేసినంత పని చేసింది. ఎందుకంటే అతను తన వాళ్ళ దగ్గరికి వెడుతూ ఇలా దారితప్పి వచ్చింది. మధ్యలో ఒక కాలువ వచ్చింది. ఆ కాలువ దాటలేక ఎవరైనా మనుషులు కనపడతారేమో అడుగుదామనుకొంది అవ్వ. అందుకే యువరాజును చూడగానే సంతోషపడింది అవ్వ. యువరాజు అవ్వ దగ్గరికి వచ్చి అవ్వ నువ్వు ఎందుకు విచారంగా ఉన్నావు?'' అని అడిగాడు. అవ్వ తను వచ్చిన విషయం చెప్పి ''బాబు నిన్ను చూస్తుంటే గొప్పింటి బిడ్డలా ఉన్నావు. ఇంతటి ఎండలో ఎక్కడికి నాయనా నీ ప్రయాణం'' అని అడిగింది. అప్పుడు యువరాజు ''తాను పలానా దేశానికి కాబోయే యువరాజునని తాను ఎందుకు ఈ విధంగా వచ్చాడో అంత వివరంగా చెప్పాడు. అందుకు అవ్వ చాలా సంతోషించి ''నాయనా నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది, నువ్వు గనక నన్ను ఈ కాలువ దాటించావంటే నా దగ్గర ఉన్న గాజు సహాయంతో నువ్వు ఏ రూపం కావాలనుకుంటే రూపంలోకి మారవచ్చు. కాని గాజు యువకులకు మాత్రమే ఉపయోగపడుతుంది, ఆగాజు నీకు ఇస్తాను నన్ను ఈ కాలువ దాటించి పుణ్యం కట్టుకో నాయనా'' అంటూ ప్రార్ధించింది. అందుకు యువరాజు ''దానిదేముంది అవ్వ నేను దాటిస్తాను నిన్ను నా దగ్గర ఉన్న ఉంగరం సహాయంతో''. ''మా నాయనే! మా నాయనే!'' అంటూ మెచ్చుకుంది అవ్వ. ఈ ఉంగరం తీసి నీ వేలికి తొడుక్కో, అప్పుడు నువ్వు చిన్న పిల్లవై అవలీలగా కాలవ దాటగలవు. దాటగానే ఉంగరం తీసి నా దగ్గరకి విసిరెయ్యి. వెంటనే నువ్వు అవ్వగా మారిపోతావు'' అన్నాడు. అందుకు అవ్వ అంగీకరించి తన దగ్గర ఉన్న గాజు యువరాజుకిచ్చి ఉంగరం సహాయంతో కాలువ దాటి ఉంగరం తిరిగి యువరాజుకు ఇచ్చింది. యువరాజు ఉంగరం, గాజు తీసుకుని భద్రంగా దాచుకొని మళ్ళీ తన ప్రయాణాన్ని కొనసాగించాడు.
కొన్ని రోజులు ప్రయాణించగా ఒకచోట ఒక గ్రామం తగిలింది. యువరాజు ఆ గ్రామంలో అడుగు పెట్టగానే అందరూ భయకంపితులయ్యారు. యువరాజు ''నేను రాగానే మీరందరూ ఎందుకు భయపడ్డారు'' అని అడిగాడు. అప్పుడు ఆ గ్రామ ప్రజలు ''బాబు నిన్ను చూస్తుంటే చాలా ధైర్యవంతుడిలా ఉన్నావు. ఈ పట్టణంలో ఒక రాక్షసుడు ఉన్నాడు. అతడు ఎవరైనా మనుషులు కనపడితే చాలు వాళ్ళని చీల్చి చెండాడేస్తున్నాడు. అతన్ని పట్టుకోవడానికి ఇప్పటివరకు ఎవరి వల్లా కాలేదు. మా గ్రామ పెద్ద ఆ రాక్షసుని పట్టు చంపిన వాళ్లకి రెండు విచిత్ర పావురాల్ని, కొంత ధనం ఇస్తామన్నారు. కానీ ధైర్యంగా ఎవరు ముందుకు రాలేదు'' అన్నారు. అప్పుడు యువరాజు ''ఆ రాక్షసుణ్ణి నేను చంపుతాను'' అన్నాడు. గ్రామ పెద్దలు ఈ అవకాశం కూడా చూద్దామని అందుకు అంకరించారు.యువరాజు రాక్షసుడిని చంపటానికి బయలు దేరాడు. యువరాజు వెళ్ళేటప్పటికి రాక్షసుడు ఒక గుహలో కూర్చుని మానవ శరీరాన్ని కాల్చుకొని దానిని భుజిస్తున్నాడు. ఏదో అలికిడి అవ్వడంతో ఆ రాక్షసుడు బయటకి చూశాడు. అయితే యువరాజు మణికాంతుణ్ణి చూసి ''రేపటికి ఆహారం సులభంగా దొరికినట్లున్నదే'' అని మనసులో అనుకొని ''నా సంగతి నీకు ఇంకా తెలియనట్లున్నదే, ధైర్యంగా వచ్చినట్లున్నావు'' అన్నాడు రాక్షసుడు. యువరాజు ''అవును రాక్షసుడా నేను ధైర్యంగానే వచ్చాను నిన్ను చంపడానికి'' అన్నాడు. రాక్షసుడు ''అహహా!'' అని పెద్దగా నవ్వి ''నువ్వు నన్ను చంపడమా! ఇది వింతగా ఉన్నదే'' అన్నాడు. ''అవును నిన్ను చంపడానికే వచ్చాను. నాతో యుద్ధానికి వస్తావా?'' అని అడిగాడు యువరాజు. ''సరే వస్తాను'' అన్నాడు రాక్షసుడు.
ఇద్దరి మధ్య హోరాహోరీగా యుద్ధం మొదలైంది. ఇద్దరు సమాన బల పరాక్రమంతో ఉన్నారు. ఇంతలో యువరాజు అవ్వ ఇచ్చిన గాజులు తీసి చేతికి తొడుక్కొని ''నేను పులిలాగా మారాలి'' అని మనసులో అనుకున్నాడు. అంతే యువరాజు పెద్దపులిగా మారిపోయాడు. దాంతో రాక్షసుడు నోట మాట రాక నోరెళ్ల బెట్టాడు. మనిషి పెద్దపులిగా మారడం ఏమిటాని. ఆ రాక్షసుడుకి పులులన్నా, సింహాలన్నాచాలా భయం. అందుకే భయంతో వణికి పోయాడు. ఈ విషయం మణికాంతుడు తేలికగా గ్రహించాడు. ఇహ ఆ రాక్షసుడి మీదకు ఉరికింది యువరాజు పులి. ఇద్దరి మధ్య హోరాహోరీగా ఘర్షణ జరిగాక యువరాజు రాక్షసుణ్ణి రెండు భాగాలుగా చేసి చంపేసింది. చంపేసి ఆ రాక్షసుడి శవాన్ని నోటకరచుకొని పక్కనే ఉన్న ఒక సరస్సులో విసిరేసింది. రాక్షసుడి పీడ విరగడయింది అని తృప్తి చెందాక యువరాజు పులి గాజులు తీసివేసింది. వెంటనే అతను మామూలు మనిషిగా మారిపోయాడు. యువరాజు సంతోషానికి హద్దులు లేకుండా ఉన్నాయి. అందరూ అతన్ని కృతజ్ఞతలతో ముంచెత్తుతూ గ్రామపెద్ద దగ్గరికి తీసుకెళ్లారు. గ్రామ పెద్దకు యువరాజు రాక్షసుణ్ణి ఏవిధంగా చంపింది అంతా వివరంగా చెప్పారు. గ్రామపెద్ద సంతోషించి అతని ధైర్యానికి మెచ్చి రెండు విచిత్ర పావురాల్ని, కొంత ధనాన్ని ఇచ్చి సత్కరించారు. యువరాజు పావురాల్ని మాత్రమే తీసుకుని ధనం వద్దన్నాడు. గ్రామ పెద్దలు, ప్రజలు యువరాజు నిజాయితీకి మెచ్చుకుని అతన్ని సంతోషంగా సాగనంపారు. యువరాజు వారి వద్ద సెలవు తీసుకుని తిరిగి తన ప్రయాణాన్ని కొనసాగించాడు.
ఒక నెల రోజులు అనేక కొండలు, నదులు దాటి ప్రయాణం చేశాక హిమ పర్వతం దగ్గరికి వచ్చాడు. కానీ అక్కడ గుహ కనిపించలేదు. కొద్ది సేపటికి యువరాజుకి గుహ పర్వతం వెనుకగా ఉన్నట్లు కనిపించింది. కానీ పర్వతం వెనక్కి వెళ్లడానికి ఒక చిన్న సందులాంటిది అడ్డు వస్తుంది. ఆ సందులో చిన్నపిల్లల తప్పితే పెద్దవాళ్ళు పట్టరు. యువరాజు వెంటనే తన దగ్గర ఉన్న ఉంగరం తీసి చేతి వేలికి పెట్టుకున్నాడు. వెంటనే చిన్నపిల్లవాడుగా మారిపోయాడు. మెల్లిగా గుహ దగ్గరికి వెళ్ళాక ఉంగరం తీసి దాచుకున్నాడు. గుహ దగ్గరికి వెళ్ళగానే ద్వారం దగ్గర కొన్ని దెయ్యాలు, కాల కంఠుడనే భూతం ద్వారానికి అడ్డంగా ఉన్నాయి. యువరాజు వాటికి కనపడకుండా ఒక పక్కకు వెళ్లి గాజులు తీసి చేతికి తొడుక్కున్నాడు. గాజులు తొడుక్కొని ''నేను ఒక భూతంగా మారాలి'' అనుకున్నాడు. వెంటనే భూతంగా మారిపోయాడు. పావురాల్ని, ఉంగరాన్ని మాత్రం జాగ్రత్తగా కాపాడుకొన్నాడు. భూతం రూపంలో ఉన్న యువరాజు వాటి దగ్గరికి వెళ్లి నిలబడ్డాడు. అప్పుడు కాలకంఠ భూతం దయ్యాలతో ''మనతో స్నేహం చేయడానికి ఇంకొక భూతం అన్న వచ్చాడు'' అని ''ఏం భూతం అన్న ఇట్లా దారి తప్పి వచ్చావు'' అంది. ''లేదు నేను దారి తప్పలేదు మీ బలపరాక్రమాలు విని మీతో స్నేహం చేయడానికి వచ్చాను'' అంది. ''మాకు మాత్రం స్నేహం కంటే ఇంకేం కావాలి'' అన్నాయి దయ్యాలు, కలకంఠ భూతం. యువరాజు భూతం అందుకు సంతోషించి వాటితో స్నేహానికి ఒప్పుకున్నాడు. యువరాజు భూతాన్ని ఆరోజు అందరూ ఎంతో ప్రేమగా చూసి తమ దగ్గర ఉన్న మాంసాన్ని ఆహారంగా పెట్టాయి. యువరాజు భూతం వాటిని సంతోషంతో స్వీకరించాడు. మెల్లిగా వాటితో స్నేహం చేసి భరిణిలో ఉన్న వజ్రాలను రాబట్టాలి అనుకున్నాడు. కాలకంఠ భూతం, దయ్యాలు భరిణలో ఉన్న వజ్రాల సంగతి, వాటి ప్రతిభ గురించి చెప్పి ''చాలా మంది మానవులు వాటిని పొందడానికి మాతో యుద్ధం చేసి ఓడిపోయారు. వాటిని ఎవరికీ దక్కకుండా వాటికి కాపలాగా ఉంటూ కాలం వెళ్లబుచ్చుతున్నాము అన్నాయి. అయితే నేను కూడా మీతో పాటు వాటికి కాపలాగా ఉంటాను అన్నాడు యువరాజు భూతం. అవి సరేనని ఒప్పుకున్నాయి. కాలకంఠ భూతం యువరాజుతో ''అన్నా మాకు ఇక్కడికి కొద్ది దూరంలో వారం రోజుల నుంచి ఏవో మంత్రాలు వినిపిస్తున్నాయి. మాకు భయంగా ఉంది. మేము అక్కడికి వెళ్లి చూస్తే కొద్ది మంది బ్రాహ్మణులు వరుసగా కూర్చుని మంత్రాలు జపిస్తున్నారు. మేము వాళ్ళని అడుగగా ''మాకు కొంత ధనం కావాలి, అందుకే ఇలా రెండు నెలలపాటు మంత్రాలు జపిస్తే ధనం సమకూరుతుందని ఒక సాధువు చెప్పాడు. అందుకే మేము ఇలా మంత్రాలు జపిస్తున్నాము'' అన్నారు. మేము ఎక్కువ సేపు అక్కడ ఉండలేక వెంటనే తిరిగి వచ్చేసాము అంటూ తమకు గల భయాన్ని యువరాజు భూతానికి వ్యక్తం చేస్తే అప్పుడు యువరాజు భూతం ''వాళ్లకు కావాల్సిన ధనాన్ని నేను ఇస్తాను'' అన్నాడు. దయ్యాలు కాలకంఠ భూతం ఎంతో సంతోషించి ''మరి అయితే ఆ ధనం మాకు ఎప్పుడు ఇస్తావు'' అని అడిగాయి. ''రేపు రాత్రి కల్లా ఇస్తాను'' అన్నాడు యువరాజు భూతం. అందుకు భూతం, దెయ్యాలు ఎంతో సంతోషించి మెచ్చుకున్నాయి. ఆ రోజు రాత్రి అందరూ హాయిగా నిద్ర పోయారు.
మర్నాడు పొద్దున యువరాజు భూతం నేను బయటికి వెళ్లి వస్తానని చెప్పి పావురాల్ని, ఉంగరాన్ని, గాజును తీసుకుని జాగ్రత్తగా భద్రపరచుకొని కొంత దూరం వెళ్ళాక అక్కడ ఆగి తన చేతికి ఉన్న గాజు తీశాడు. అప్పుడు మొత్తం మామూలు యువరాజుగా మారాడు. ధనం కోసం తన ప్రియురాలికి ఒక లేఖ పంపాలనుకొన్నాడు. కాగితం మీద మధుమాలినికి తాను ఇక్కడ క్షేమంగా ఉన్నట్లు తాను ఇంకొక రెండు రోజుల్లో తిరిగి వస్తున్నట్లు, డబ్బు పంపవలసిందిగా ఒక లేఖ రాశాడు. పావురాలకి అనేక రకాల భాషలు, అన్ని దేశాలు తెలిసి ఉండటం వల్ల యువరాజు పావురాలకు తన ప్రియురాలి సంగతి చెప్పి పంపాడు. పావురాలు రెండు ''అట్లాగే తప్పకుండా నీ ప్రియురాలిని అడిగి ధనం తీసుకువస్తా''మని చెప్పి లేఖ తీసుకుని ఎగురుకుంటూ యువరాణి దగ్గరికి వెళ్ళాయి. అక్కడ యువరాణి మధు మాలిని యువరాజు గురించి ఎన్ని రోజులైనా తిరిగి రాకపోవడంతో కొంచెం కంగారు పడుతుంది. రాజు, రాణి కూడా మణికాంతుడి రాక కోసం ఎదురు చూడసాగారు. యువరాణి ఉధ్యానవనంలో కూర్చుని చెట్ల వైపు చూడసాగింది. ఇంతలో రెండు పావురాలు ఎగురుకుంటూ యువరాణి దగ్గరికి వచ్చి లేఖను యువరాణి వొడిలో వేశాయి. యువరాణి లేఖ ఏమిటాని ఆసక్తిగా చూడసాగింది. ఇంకొక రెండు రోజుల్లో ఘన విజయంతో తన చెలికాడు రాబోతున్నాడు అని సంతోషపడింది. తన దగ్గరున్న ధనంలో కొంత ధనం తండ్రికి తెలియకుండా ఒక సంచిలో వేసి జాగ్రత్తగా తన చెలికాడికి ఇవ్వమని చెప్పి పావురాలకి చెప్పి పంపింది. పావురాలు యువరాణి ఇచ్చిన ధనం తీసుకుని సంతోషంతో ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్లి యువరాజు దగ్గర వాలాయి. యువరాజు పావురాలు దగ్గర సంచీ సంతోషంతో తీసుకొని వాటిని ప్రేమగా నిమిరాడు. అవి కూడా యువరాజు ప్రేమకి మురిసిపోయాయి. మళ్లీ యువరాజు రాత్రికల్లా భూతం రూపం దాల్చి పావురాల్ని జాగ్రత్తగా భద్రపరుచుకొని గుహ దగ్గరకు వచ్చాడు. కాలకంఠ భూతం, దెయ్యాలు నువ్వు భోజనం చేయకుండా మా ధనం కోసం చాలా శ్రమించి నట్లున్నావు ''ముందు భోంచెయ్యి'' అంటూ కొంత మాంసం పెట్టాయి. యువరాజు భూతం సంతోషంతో భుజించాడు. .
కొద్ది సేపు విశ్రాంతి తీసుకున్నాక యువరాజు భూతం సంచీలో ధనం తీసి కాలకంఠ భూతానికి ఇచ్చాడు. కాలకంఠ భూతం, దయ్యాలు సంతోషంతో ధనాన్ని తీసుకొని యువరాజు భూతాన్ని చాలా గొప్పగా పొగిడాయి. మరునాడు ఉదయం భూతం, దయ్యాలు కలిసి ''మేము ఆ బ్రాహ్మణులకు నువ్వు తెచ్చిన ధనం ఇచ్చి మంత్రాల బెడద వదిలించుకుని వస్తాము, అంతవరకు నువ్వు ఎక్కడికి వెళ్లకుండా గుహకి కాపలాగా ఉండు మేము త్వరగా వస్తాము'' అని చెప్పి దనాన్ని తీసుకొని బ్రాహ్మణుల దగ్గరికి బయలు దేరాయి. యువరాజు భూతంవాళ్ళు వెళ్ళగానే భరిణ తీసుకోవచ్చని ''అట్లాగే మీరు క్షేమంగా వెళ్లి రండి గుహ గురించి మీకేం భయంలేదు నేను కాపలా ఉంటాను'' అని చెప్పాడు. దయ్యాలు, కాలకంఠ భూతం బ్రాహ్మణుల మంత్రాల బాధను వదిలించుకోవడానికి వెళ్లాయి. వాళ్ళు వెళ్లగానే యువరాజు భూతం మామూలు యువరాజుగా మారిపోయి వజ్రాల కోసం గృహంతా వెతకసాగాడు. చివరకు ఒక మూల గుహలో ఒక వజ్రాల భరిణె కనబడింది. యువరాజు సంతోషంతో ఎగిరి గంతేశాడు. ఆ భరిణె తీసుకొని ఒక్కసారిగా గుండెలకు హత్తుకున్నాడు. ఎప్పుడెప్పుడు యువరాణి ముందు వాలదామా అని ఊహల్లో తేలిపోయాడు కొద్దిసేపు. ఒక్కసారిగా భరిణె విప్పి చూశాడు. ఒక్కొక్క వజ్రం ధగధగా మెరిసిపోతూ కనబడింది. ఆ వజ్రాల భరిణను జాగ్రత్తగా భద్రపరుచుకొని కాలకంఠ భూతం, దెయ్యాలు రాకముందే ఈ ప్రదేశం నుండి పారిపోవాలి అని అనుకుని పావురాల్ని చంకన వేసుకొని సంచి చేత పట్టుకొని గాజులు తొడుక్కొని నాకు రెక్కలు రావాలి అనుకొన్నాడు. వెంటనే రెక్కలు వచ్చాయి. రెక్కల సహాయంతో త్వరగా ఆకాశంలో ఎదురుకుంటూ యువరాణి సభకు వెడతాడు. యువరాజు భూతం వెళ్ళిన రెండు గంటలకల్లా కాలకంఠ భూతం, దెయ్యాలు వచ్చాయి. గుహలో ఏమి అలికిడి లేక పోవడంతో అవి గుహ అంతా వెతికి చూశాయి. కానీ ఎక్కడ యువరాజు భూతం కనపడకపోవడంతో అట్లా వ్యాహ్యాళికి వెళ్లి ఉంటాడేమో అనుకుని చాలా సేపు అతని కోసం ఎదురు చూశాయి. కానీ ఎంతసేపటికి యువరాజు భూతం కనపడక పోవటంతో వాటికి అనుమానం వేసి భరిణె క్షేమంగా ఉందో లేదోనని చూశాయి. కానీ ఎక్కడ భరిణె లేదు, చాలాసేపు నెత్తీనోరూ బాదుకుని నిరోధించాయి. అనేక చోట్ల యువరాజు భూతం కోసం గాలించాయి. ఫలితం శూన్యం. ఇక చేసేది లేక గృహకు వచ్చి గుహలోనే నిరాశగా బ్రతుకసాగాయి.
సభలో రాజు, రాణి, యువరాణి మధుమాలిని కొలువుతీరి మణికాంతుడు ఎప్పుడు వస్తాడాని ఎదురు చూడసాగారు. ఇంతలో మణికాంతుడు ఎగురుకుంటూ వచ్చి సభ మధ్యలో వాలాడు. అందరూ ఆశ్చర్యంతో అతనినే చూడసాగారు. ఇక యువరాణి సంతోషానికి హద్దులు లేవు. యువరాజు మణికాంతుడు తాను తెచ్చిన భరిణను చూపించి తాను ఏవిధంగా రెక్కల సహాయంతో రావాల్సి వచ్చింది, ఏ విధంగా భరిణను సంపాదించింది అంతా వివరంగా సభ మధ్యలో నుంచి అందరికీ చెప్పి వెంటనే గాజు తీసి వేశాడు. యువరాజుకి రెక్కలు పోయాయి సభలో హర్షధ్వానాలు మిన్నుముట్టాయి. ''యువరాజుకి జై! యువరాజుకి జై!'' అంటూ నినాదాలు చేశారు సభికులంతా. రాజు, రాణి మణికాంతుని అఖండ ఖ్యాతిని ఎంతగానో కొనియాడి తన అల్లుడిగా అతనిని స్వీకరించి ఒక మంచి ముహూర్తాన మణికాంతుడికి తన కూతుర్నిచ్చి వైభవోపేతంగా వివాహం జరిపి తమ రాజ్యంలో సగభాగం మణికాంతుడికిచ్చారు. మధు లమాలిని కూడా మణికాంతుణ్ణి తన భర్తగా పొందినందుకు ఎంతగానో సంతోషించింది. మణికాంతుడు, మధుమాలిని పెద్దల దీవెనలు అందుకుని తమకు ఇచ్చిన రాజ్యాన్ని తల్లిదండ్రుల సలహాలు ఆచరించి ''వజ్రల భరిణె'' సహాయంతో చిరంజీవులుగా రాజ్యాన్ని పరిపాలిస్తూ అఖండ పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.
-పింగళి భాగ్యలక్ష్మి, 9704725609
Sun 06 Feb 01:28:36.848738 2022