Sun 01 May 00:16:53.886368 2022
Authorization
''యాదగిరి భారు'' వాకిట్లోనించి అరిచిండు కరీముల్లా సాయిబు.
బాపు బయటకు వెళ్ళగానే ''యాదగిరి భాయ్.. ఈ సారికి నీకు రెండు నెల్ల కిరాయి పైసలు
ఇస్తున్నాను. ఐదు నెల్ల కిరాయి నీకు బాకీ ఉందని తెల్సు. ఈ మధ్యనే నా రెండో భేటీ అఫ్రోజ్కి
నిఖా అయింది. నీకు తెల్సు కదా. దుబారు సంబంధం. చాల ఖర్చు లెక్క తేలింది. ఈ సారికి
బాకీవడ్డ మూడు నెల్ల కిరాయి ఇచ్చేస్తాను'' నాన్న చేతులు పట్టుకుని చెప్పిండు కరీముల్లా సాయిబు.
''అరే భారు.. బిడ్డ పెళ్ళి అంటే ఎన్ని ఖర్చులు ఉంటాయో నాకు తెల్వదనుకున్నవ. నువ్వేమి ఫీకర్
గాకు. నీ దగ్గర పైసలు ఉన్నప్పుడే ఇస్తువులే''అనిండు బాపు అతనిచ్చిన పైసలు జేబులవెట్టుకుంటూ.
నిమ్మకాయ, ఉప్పు వేసి కలిపిన మజ్జిగ ఇచ్చింది అమ్మ కరీముల్లా సాయిబుకి.
మజ్జిగ తాగి ''ఎండ వేళ చల్లటి సల్ల ఇచ్చినవ్. అల్లాV్‌ా నిన్ను చల్లగా చూడాలే చెల్లె'' అని దీవిస్తా
నవ్వుకుంటూ సైకిల్ షాపులోకి పోయిండతను.
అమీర్‌పేటలో ఉన్న ఓ బట్టల దుకాణంలో బాపు అకౌంట్స్ రాసేపని చేస్తుండు. దాంతోని మంచిగా పైసలు రావని, చాల కష్టం చేసి, పొదుపు జేసిన పైసలతో మేము ఉండే పాతకాలపు దంతుల ఇల్లు చిన్నదే అయినా ఇంటి ముంగడ ఉన్న పెరట్లో మంచిగా జాగా ఉందని అక్కడ రెండు గదులు కట్టించిండు. ఒక షట్టర్లో టైలర్ సుబ్రహ్మణ్యం బట్టలు కుడుతుండే. రెండో షట్టరులో కరీముల్లా భారు సైకిల్ షాప్ నడుపుతా ఉండే.
ఏప్రిల్ నెల మొదలైంది. ఇంకొద్ది దినాల్లో ముసల్మాన్ల పవిత్ర రంజాన్ మాసం కూడా మొదలౌతుంది. నాలుగు దినాల సంది శ్రీకాంత్ అన్నకి బీమారి. నాన్న దవాఖానకి తోల్కపోతే మామూలు జరమే అని పారాసెటమాల్ మందు గోలీలు ఇచ్చి, నాలుగు దినాలు విశ్రాంతి తీసుకోమని ఇంటికి పంపింర్రు. మందు గోలీలు మింగిచ్చినా అన్నకి జరం తగ్గుతలేదు.
రహ్మత్‌నగర్ మూడో గల్లీలో ఉండే హనుమాన్ గుడిలో పూజ చేపిచ్చిన ఎర్రటి రంగు దారపు దండ తెచ్చి శ్రీకాంత్ అన్న మెడలో వేసింది అమ్మ. అన్న నీరసంగా పండిండు. ఇన్ని రోజులైనా జరం ఎందుకు తగ్గుతాలేదో మాకు సమజైత లేదు. అందరికి గుబులు గుబులుగా ఉండే.
''పిలగాడు నిద్రలో కూడా ఉలిక్కి పడుతుండే. దేనికో భయపడినాడు అనిపిస్తోంది. ఏవో దిష్టి కళ్ళు తగిలినట్లుండే'' గుబులుగా అనింది అమ్మ.
''చక్కంగా ఉండేటోడు, ఇట్లెందుకు అయిందో'' అనిండు బాపు ఏదో సోచాయిస్తా.
అమ్మకి ఏదో గుర్తుకి వచ్చి ''యూసుఫ్‌గూడ బస్తి దగ్గర మసీద్ ముంగడ కరీమ్ తాత అల్లాV్‌ా మంత్రం చెప్పి తాయత్తు కడతాడు కదా. నువ్వు కరీముల్లా అన్నకి చెప్పు. ఎవరి హస్తవాసి ఎలా ఉందో. పిలగాడు బాగుపడితే చాలు కదా'' అనింది బాపు తిననీకి సుషీల పెడుతూ.
ఈ దిష్టి లాంటి వాటి మీద నాకు నమ్మకం లేకుండే. కానీ పిలగాడు బాగుపడితే అదే పదివేలు. ఇప్పుడే కరీముల్లాని అడుగుతా'' అంటూ ఇంటి ముంగడ ఉన్న సైకిల్ షాప్‌కి పోయిండు నాన్న. నాన్నతోని నేను కూడా పోయినా.
సైకిల్ షాప్ లోపల ఓ మూల గుడ్డ పరచుకుని మోకాళ్ళ మీద వంగి చేతులు పైకెత్తి నమాజ్ చేస్తున్నాడు కరీముల్లా సాయిబు, షాప్‌లో పనిచేసే ఇస్మాయిల్ భారు కూడా నమాజ్ చేస్తున్నాడు. ఇద్దరూ తెల్లటి టోపీలు పెట్టుకున్నరు. వాళ్ళ నమాజ్ అయినంత వరకు నాన్న, నేను షట్టర్ ముంగడ నిల్చుకోని ఉన్నాం.
నమాజ్ పూర్తయి చేతులతో కళ్ళు తుడుచుకుని కళ్ళు తెరిచాడు కరీముల్లా బాబారు.
ఎదురుగా కనపడిన మమ్మల్ని చూస్తానే ''యాదగిరి భారు..ఏందీ గిట్లొచ్చినవ్..!'' అనిండు.
''కరీముల్లా భారు. ఇప్పుడు రంజాన్ మాసం అని, నువ్వు రోజలు ఉంటావని, నీకు చాల పని ఉంటుందని నాకు తెలుసు. అయినా ఓ సాయం అడగనికి నీ తావు కొచ్చిన'' అనిండు బాపు.
''అరే.. ఏందో చెప్పరాదు. ఎందుకు ఫికరవుతావ్. నేను చేయగలిగిన సాయం తప్పకుండ చేస్తాను'' అనిండు కరీముల్లా సాయిబు.
శ్రీకాంత్ అన్న బీమారి ముచ్చటంతా చెప్పిండు బాపు. అంతా విని కరీముల్లా సాయిబు ''యాదగిరి భారు.. ఇక శ్రీకాంత్ బేటా సంగతి నువ్వు మర్చిపో. నీకు తెల్సు కదా భారు, 'ఎంతచెట్టుకు అంత గాలి' అని. నేను ఒక గంట బయటకు వెళ్ళి పేదలకు ఈ గోధుమలు, కొన్ని పైసలు ఈదుల్ ఫిత్వా దానం, జకాత్లు చేసివస్తాను. తర్వాత శ్రీకాంత్‌ని కరీం తాత దగ్గరకి తోల్కొనిపోతా. నువ్వు పారేశాను గాకు'' అంటూ గోధుమలు ఉన్న పెద్ద సంచిని నెత్తిన బెట్టుకుని బయటకు పోయిండు.
నేను, బాపు ఇంటికి వచ్చినం. జకాత్ దానాలు ముగించుకుని కరీముల్లా సాయిబు మా ఇంటికి వచ్చి, శ్రీకాంత్ అన్నని మసీద్ దగ్గరకి తోల్కపోయిండు. అక్కడ కరీం తాత శ్రీకాంత్ అన్న కాలికి నల్లతాడు కట్టి చెవులో గాలి ఊది, ఏవో ఉర్దూలో మంత్రాలు చదివిందంట. క్రమంగా శ్రీకాంత్ అన్న మంచిగా కోలుకొని స్కూల్‌కి పోతుండు.
ఆ రోజు నా దోస్తీ రజియా భాను స్కూలుకి లేటుగా వచ్చింది. తెలుపు, గోల్డ్ కలర్ కుందన్స్, అద్దాలు కుట్టిన పింక్ రంగు బుట్ట గౌను వేసుకొని, ముఖమ్మీద, బుగ్గలకి మెరుపులు అడ్డుకుని, రంగురంగులతో జిగేల్ మనే గాజులు వేసుకుని వచ్చింది. ఆ ముందురోజు రాత్రి వాళ్ళ ఇంటి దగ్గర ''షబ్-ఎ-ఖాదర్'' ఉత్సవము జరిగిందట. వాళ్ళ బంధువులు, స్నేహితులు అంతా ఒకచోట చేరి రాత్రంతా జాగారం చేసి నమాజ్ చదవడం, పొద్దున ఇఫ్తార్ విందు తినడం అన్ని ముచ్చట్లు కథలు, కథలుగా చెప్పింది మాకు.
రెండో పీరియడ్ అయినాక ఇంటర్వెల్ అప్పుడు రజియా సంచిలోనించి పెద్ద మెరుపుల చెక్కపెట్టె తెరిచింది. దాంట్లో పిస్తా, దుబారు నుంచి తెచ్చిన రుచికరమైన ఖర్జురాలు అందరికి ఇచ్చింది. మెత్తగా, తియ్యగా ఇంత లావున ఉన్న ఒక్క ఖర్జురమ్ పండు తినేతలికి నాకు కడుపు నిండిపోయింది. ఆ రోజు నేను, గాయత్రీ, సురేఖ, కతిజా, మేరిజోన్స్ అందరం రజియా చుట్టూ చేరి రజియా భానుని మెచ్చుకున్నాం.
ఇంకో నాలుగు దినాల్లో రంజాన్ పండుగ వస్తుంది. ఆ రోజు రజియా భాను స్కూల్ కి ''షిర్ ఖుర్మా'' తెచ్చింది. ఆ రోజు తర్వాత ఇక రంజాన్ పండుగ రోజు వరకు స్కూల్‌కి రాను అనింది. సరిగ్గా ఇంటర్వెల్ టైం లో నన్ను లలితమ్మ టీచర్ పిలిచి తొమ్మిదో తరగతి పరీక్ష పేపర్లు పక్క భవనంలో ఉండే రహీమున్నీసా టీచర్ దగ్గర యిచ్చిరమ్మని పంపింది.
''టీచర్ ఇప్పుడే నాకు ఈ పని చెప్పాలే అని నా మనసు ఆగమాగం అయింది.'' మా క్లాస్ ఏడో తరగతి నుంచి, అక్కడికి పోవాలంటే కాస్త దూరం. నేను వచ్చే సరికి లోపలి గంట కొట్టేస్తారు. పరిగెత్తుకుంటూ పోయి రహీమున్నీసా టీచర్స్‌కి పేపర్లు ఇచ్చేసి జల్దీ మా తరగతికి వచ్చిన. అప్పటికే రజియా బాను అందరికి షీర్ కుర్మా తిననికి ఇచ్చేసింది.
నన్ను చూసి ''అరే చిట్టీ.. ఎట్ల బోయినవ్. అందరికీ షిర్ ఖుర్మా ఇచ్చాను. ఇప్పుడే అయిపోయింది'' అనే.
నేను ఓ వెర్రి నవ్వు నవ్వి ఊరుకున్న. లోపల ఏడుపు వస్తోంది. లలితమ్మ టీచర్ మీద పట్టరానంత కోపం వచ్చింది . షిర్ ఖుర్మా అంటే నాకు చాల ఇష్టం. అమ్మ ఎప్పుడో కానీ చేయదు. ఇక రజియా కూడా రంజాన్ పండుగ దాకా బడికి రాదు. చాలా నిరాశగా నన్ను నేను తిట్టుకుంటూ ఇంటికి వచ్చేసాను. కానీ షిర్ ఖుర్మా తినాలని ఆశ మాత్రం నాలో ఎక్కువవుతుండే.
ఆ రోజు సాయంత్రం చంద్రవంక కనిపించింది. పక్కరోజే రంజాన్ పండుగ. ముఖ్యంగా ఆ రోజు కోసం నేను ఎదురు చేస్తుండే.
ప్రతి సంవత్సరం అమ్మ బోనాలప్పుడు, దసరా పండుగకి సకినాలు, సర్వ పిండి, బొబ్బట్లు చేసి అందరికీ పంచు తుంది. పోయిన బోనాలప్పుడు కరీముల్లా బాబారు వాళ్ళకి బొబ్బట్లు, సకినాలు నేనే ఇచ్చివచ్చాను. షిర్ ఖుర్మా చేయమంటే దానికి చాల పైసలు అవుతయి ఇప్పుడు చేయను అనింది. ఇప్పుడు నాకు ఒక ఆశ.
రంజాన్ పండుగ దినం రానే వచ్చింది. రహ్మత్‌నగర్‌లో ఉండే మా ఇంటికి కాస్త దగ్గరలోనే మసీద్ ఉండే. ముస్లిం సోదరులు అందరు కొత్త బట్టలు వేసుకుని, మంచి టోపీలు పెట్టుకుని మసీదుకి సామూహికంగా కలిసి వెళుతూ కనిపించిర్రు. ఆ దశ్యం చూడనీకి చాల ముచ్చటగా ఉండే. మైకు నుంచి ''బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్'' అంటూ ఖురాన్ పవిత్ర వాఖ్యాలు వినిపిస్తూ ఉండే. నేను సాయంత్రం ఎప్పుడెప్పుడు అవుతుందా అని ఎదురు చేస్తుండే.
సాయంత్రం అయింది. ఇంట్లో దీపాలు వెలిగిచ్చినం. కరీముల్లా సాయిబు, ఆయన భార్య ముంతాజ్ మహల్ తళ తళ మెరిసే కొత్త బట్టలు కట్టుకొని మా ఇంటికి వచ్చిన్రు. బాపు, అమ్మ వాళ్ళని నవ్వుతూ ఇంట్లోకి పిలిచిండ్రు. బాపు కరీముల్లా సాయిబు కి ''ఈద్ ముబారక్'' చెప్పి ఆలింగనం చేసుకునె. ముంతాజ్ మహల్ పిన్ని, అమ్మ కూడా ఒకరినొకరు హత్తుకునిండ్రు.
కరిముల్లా బాబారు నన్ను చూసి ''చిట్టెమ్మా.. నీ కోసం ఏం తెచ్చానో చూడు'' అంటూ సంచిలో నుంచి కొత్త స్టీల్ బాక్స్ తీసి నా చేతికి ఇచ్చాడు. నేను బాక్స్ మూత తీసి చూసాను. కమ్మటి సుగంధం వాసన నా ముక్కు పుటలను తాకింది. సేమియాలు, బాదంలు, డేట్స్ , జీడిపప్పు, కిస్మిస్, లవంగాలు, ఏలకుల పొడి, పాలు, నెయ్యి వేసి చేసిన ''షిర్ ఖుర్మా''. నాకు చాల చాల ఇష్టమైన షిర్ ఖుర్మా .
ఇన్ని రోజులు రంజాన్ పండుగ ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురు చూసింది ఈ క్షణం కోసమే.
షిర్ ఖుర్మాని చూడంగనే నా కళ్ళల్లో మెరుపులు. ముంతాజ్ పిన్ని చొరవగా మా వంట గదిలోకి వెళ్ళి గ్లాసు తెచ్చి గ్లాసులో పోసి తాగమని మొదట నాకే ఇచ్చింది. గ్లాసులోని షిర్ ఖుర్మా నోటిలోకి వెళుతుంటే నాకు స్వర్గంలోకి వెళ్లుతున్నట్లే ఉండే.
బాపు, అమ్మ, శ్రీకాంత్ అన్న, ముంతాజ్ పిన్ని, కరీముల్లా బాబారు అందరు గలగల నవ్వుకుంటూ ముచ్చట్లు చెప్పుకుంటుండె.
ఎక్కడ నుంచో మైకులో ''నీవెవరయ్యా.. నేనెవరయ్యా.. నువ్వు నేను ఒకటేనయ్యా'' పాట లీలగా వినిపిస్తుండే.
- రోహిణి వంజరి, 9000594630