ఆ తెల్లవారి జామున వీచిన చల్లని గాలులు అతని వెక్కిళ్లనూ కన్నీళ్లనూ శ్వాసించి అక్కడే సుళ్లు తిరుగుతోంది. కొన్నాళ్లుగా యథాప్రకారం కాపలా కాయటమో, టార్చిలైట్ కాంతిని ప్రసరింప చేయటమో చెయ్యలేని అతని కాపలాలో నిద్రిస్తున్న పక్షులు, ఆ దినం అతని కన్నీళ్లు కార్చే ముఖాన్ని చూసి తమ అరుపులను ఆపుకున్నాయి. ఎత్తయిన యూకలిప్టస్, అశోక చెట్ల నుండి మామూలుగా కన్నా ఎక్కువ ఆకులు ఆ రోజుటి ఉదయం వీచిన గాలులకు నేలరాలి దొర్లాయి.
మణి చూపులను తప్పించుకుని ఆ ప్రాంతంలో ఏదీ లోపలికి రావటానికో బయటికి వెళ్లటానికో వీలుకాదు. పదునైన చూపులతో, చేతిలో పొడవైన టార్చిలైట్‌తో అతను తిరుగుతూ రాత్రి కాపలాలో విసిగి పోకుండా మేల్కొని ఉన్నాడు.
గడచిన రెండు నెలల్లో ఆ కార్యాలయంలో రాత్రి కాపలా కోసం వచ్చిన నలుగురు వ్యక్తులు, ఒకట్రెండు రాత్రులతోనే బయటికి పంపించి వెయ్యబడ్డారు. అందరినీ బహిర్గతపరిచింది నిఘా కెమెరా. రాత్రి కాపలాదారుల గురకలు, మద్యం బాటిళ్లతో మత్తులో ఆడిన ఆటలు, ఆండ్రాయిడ్ ఫోన్లలో సెక్స్ సినిమాలు చూసి అస్తవ్యస్తంగా పడున్న దృశ్యాలు... అంటూ అన్నింటినీ వేసి చూపించగానే తాముగా కొందరు పారిపోయారు.
సుబ్రమణికి ముందు ఒకవ్యక్తి ఉండేవాడు. అతని పేరు రత్నం. అతను ఎలాగో ఒకవారం రోజులు నిలదొక్కుకో గలిగాడు. తన కాపలాలోని వీర సాహసాల గురించి తానుగా గొప్పలు చెప్పుకున్నాడు. ఎనిమిదవ రోజున అతని నిద్ర కారణంగా నిఘా కెమెరానే దొంగతనానికి గురి కావటంతో, అతనూ బయటికి వెళ్లాల్సి వచ్చింది.
పట్టించటానికి ఏదీలేని స్థితిలో, డ్యూటీ సమయంలో తాగకూడదు, ఆండ్రాయిడ్ ఫోన్ ఉపయోగించకూడదన్న నిబంధనలను అంగీకరించి, సెక్యూరిటీ కంపెనీ పంపిన తుది నమ్మకంగా ఆ కార్యాలయానికి రాత్రి కాపలాదారుడిగా వచ్చి చేరాడు మణి అనబడే సుబ్రమణి.
'ఊ... ఇతనెన్ని దినాలుంటాడో?' అన్ని నోళ్లూ ఇలాగే గుసగుసలాడాయి. మొదటి రెండు రోజులు ఎవరో ఏమిటో తెలియక డ్యూటీ ముగించుకుని బయటికెళ్లే ప్రతి ఒక్కరికీ అటెన్షన్లో నిలబడి గంభీరంగా సెల్యూట్ చేశాడు మణి. చాలా మంది ఆశ్చర్యపోయారు, ముఖ్యంగా మహిళా ఉద్యోగినులు.
రాత్రంతా కాళ్లకు బూట్లతో తలకు కుళ్లాయి తగిలించుకొని ఆ ప్రాంతాన్నంతా కాపలా కాశాడు. చెట్ల నుండి నీడల్లా రాలి విస్తరించే రాత్రితోనూ, చీకట్లో జారిపడే ఎన్నో ఆకారాలలోని పండుటాకులతోనూ మాట్లాడుతూ తిరుగాడాడు. ఏ మూలన ఉన్నా అతని కళ్లు అక్కడి పూర్తి ప్రాంతాన్ని పరిశీలించేవి.
సాయంత్రం ఆరు గంటల నుండి తెల్లవారి ఏడుగంటల దాకా అతని డ్యూటీ సమయం. ఎప్పుడూ రాత్రిపూట పనే. అందులోనూ కాపలా పనే. కావాలనే మొండికేసి పనిలోకి చేరిన ప్రత్యేకమైన స్వభావం కలిగినవాడు అతను. రోజూ నైవేలి నుండి బస్సులో వచ్చి వెళ్లేవాడు. రానూ పోనూ మొత్తం ఆరుగంటలసేపు ప్రయాణం. వారంలో అన్ని దినాలూ పని. విశ్రాంతి లేకుండా రోజూ పదమూడు గంటల కాపలా ఉద్యోగం. ఇలాంటి స్థితిలో అతనెప్పుడు నిద్రపోతాడన్నది తెలుసుకోలేని రహస్యం.
ఎవరితోనూ ఎక్కువ మాట్లాడకుండా, అడిగిన వాళ్లకు ఒకట్రెండు మాటలతో జవాబిచ్చి తమాషాగా నవ్వేవాడు. ఆ చిరు సంభాషణల్లో ఓ ప్రత్యేకమైన స్పష్టత ఉండేది. అతను బి.ఎస్సీ మాథ్స్, తిరుచ్చి సెయింట్ జోసెఫ్ కళాశాల విద్యార్థి.
అతని స్వచ్ఛమైన ఇంగ్లీషు పరిజ్ఞానానికి ఎన్నో ఉద్యోగాలు వచ్చాయి. అయినా, ఐదు రోజులకు మించి అతని వల్ల ఆ ఉద్యోగాలలో స్థిరంగా ఉండటానికి వీలుకాలేక పోయింది. నవ నాగరీక మగువల చుట్టూ ఎగురుతూ వచ్చే చెన్నై బిబిఓ కాల్ సెంటర్లలో పనికి కుదిరినా కొన్నాళ్లకే ఇల్లు చేరుకోవటం జరిగింది.
అన్నింటినీ కాదని ఎందుకో అతను ఈ సెక్యూరిటీ ఉద్యోగాన్ని ఎన్నుకున్నాడు. సెక్యూరిటీ ఆఫీసులో అతని సర్టిఫికెట్లను పరిశీలించారు. మొదట అతని అధిక అర్హతను చూసి ఈ ఉద్యోగం ఇవ్వటానికి నిరాకరించారు. అయితే వదిలి పెట్టకుండా అతను ఎన్నో రోజులు ఈ సెక్యూరిటీ ఆఫీసుకు తిరుగుతూనే ఉన్నాడు. 'మాజీ సైనికులకు మాత్రమే ఈ ఉద్యోగమని' చెప్పి అతణ్ణి బయటికి పంపించేశారు. అయినప్పటికీ రోజూ వచ్చి మొండికేసి కూర్చున్నాడు. చివరకు అతను చదివిన చదువుకూ ఇంగ్లీషు పరిజ్ఞానానికీ ఆఫీసులో వేరే ఉద్యోగం ఇస్తామని చెప్పారు. కానీ దాన్ని నిరాకరించి రాత్రి పూట కాపలాదారుడు పనే కావాలని మొండికేసి ఈ ఉద్యోగాన్ని స్వీకరించాడు.
కాపలాదారుడి పనిలో అతను ఒక రాత్రికి ఇరవై ఏడు కిలోమీటర్ల దూరాన్ని సైకిల్‌పై తిరుగుతూ, పలుచోట్ల పనిచేసే ఆ సెక్యూరిటీ కంపెనీ రాత్రిపూట కాపలాదారులను పరిశీలించాలి. అర్థరాత్రి మొదలయ్యే అతని ఉద్యోగం, తెల్లవారాకే ముగుస్తుంది. ఒక్క సెకను నిద్రో చిన్న కునుకో కుదరదు. అయినప్పటికీ ఎంతో ఆసక్తితో రాత్రి దట్టంగా పరుచుకున్న ఒంటరి బాటపై అతను ఆయాసంతో సైకిల్‌ను తొక్కుకుంటూ వెళ్లేవాడు.
అతను వెళ్లే దారిలో రోడ్డు పక్కనుండే స్మశానంలో ఒక్కోరోజు శవాలు కాలుతూండేవి. ఆ మంట వెలుగు అంధకారం కన్నా మిక్కిలి భయం గొలుపుతుండేది. చితిలో నుండి బయలుదేరే అగ్గిరవ్వలు మెరిసి గాల్లో ఎగురుతూ ఆరిపోయేవి. దారంతా అంతిమ యాత్ర చామంతి పువ్వుల పరిమళం, కళ్లు తెరవని కుక్కపిల్లల అరుపులలాగా అతని వెంబడే వచ్చేది.
అక్కడక్కడా ఉన్న కాపలాదారులను వెతుక్కుంటూ అడ్డదిడ్డమైన దారులలో ఒక సర్కస్ వీరుడిలా సైకిల్ చక్రాలపై విరామం లేకుండా నడుపుతూ చీకటిని దూరం చేసేవాడు. జంటను పిలుస్తూ అదేపనిగా అరుస్తూ పరుగులు తీసే ఉడుతలా ఆయిల్లేని అతని సైకిల్... శబ్దం చేస్తూ వచ్చేది. అదే అతనికి మాటల తోడు.
రోజూ ఆ కార్యాలయానికి వచ్చే రెండు దినపత్రికలను అతనే తీసుకునేవాడు. కమ్ముకుంటున్న చీకటిని చూస్తూ వేగంగా పచ్చగడ్డిని మేసే ఆకలి పశువు ఆర్తిలా, మారు మనిషి వచ్చేలోపు ఆ రెండు పత్రికలనూ వీలైనంతవరకూ అతని కనులు మేసేవి. తర్వాత మడత నలగకుండా విజిటింగ్ హాల్లో పెట్టేసి ఇంటికి బయలుదేరేవాడు. సాయంత్రం తిరిగొచ్చినప్పుడు తమిళ దినపత్రిక మడతలుపడి చిరిగి నలిగి పడుండేది. అయితే ఇంగ్లీషు దినపత్రిక చాలా సందర్భాలలో అతను పెట్టిన మడత నలగకుండా అలాగే ఉండేది. ఆ రాత్రికి అదే అతనికి తోడు.
ఇంట్లోనూ అతనికి దగ్గరగా ఉన్న స్నేహితుడూ బంధువూ పుస్తకమే. కనుకనే అతని గదంతా పుస్తకాలతో నిండి ఉండేవి. అందులో ఇంగ్లీషు పుస్తకాలే ఎక్కువ స్థలాన్ని ఆక్రమించాయి. ఎవరితోనూ కలిసి ఉండటాన్ని ఇష్టపడక ఒంటరితనాన్ని వెతకటానికి పుస్తకాలూ ఒక కారణంగా ఉన్నాయి. ఇంట్లో అతనొక్కడే కొడుకు. పరాయివాళ్లతో మాట్లాడేలా ఒకట్రెండు మాటలు అదీ అతని తల్లితో మాత్రమే మాట్లాడేవాడు. తండ్రితో అదీ లేదు. దాంతో ఇంటి పైగదికి వెళ్లిపోయేవాడు. ఎవరూ అర్థం చేసుకోలేని పొడుపుకథ లాగానే ఉన్నాడతను.
తమిళ పుస్తకాలను అతను ఇష్టంగా చదవటమంటూ మొదలైంది అతని కళాశాల జీవితంలోనే. అక్కడి గ్రంథాలయం అతనికి మరో ప్రపంచాన్ని పరిచయం చేసింది. ఎక్కువగా ఇష్టపడి చదివింది... 'ఈలం సాహిత్యం.' శివతంబి, జయపాలన్, చేరన్, అవ్వై, డేనియల్ వంటివాళ్ల రచనలు అతని మనసుకు ఎంతో దగ్గరైనటువంటివి. డొమినిక్ జీవా 'మల్లిగై' సంచిక ఆ గ్రంథాలయానికి వచ్చేది. దాన్నీ అతను ఎంతో ఆసక్తితో చదివేవాడు.
ఈలం విముక్తి, విడుదల పులులు, ప్రభాకరన్, దిలీపన్, వంటి ఈలం వార్తలపై కాలేజీ రోజులలో అత్యంత తీవ్రమైన ఆకర్షణ ఏర్పడింది. కాలేజీ విద్యార్థుల సంఘాలతో పదేపదే సమావేశాలు జరిపి ఈలం పోరాటాల గురించీ, విడుదల పులుల గురించీ, తమిళ ఈలం అవసరాన్ని గురించీ ఎన్నో విషయాలను ప్రొఫెసర్లూ, ఫాదర్లూ స్పష్టపరిచేవాళ్లు. ఆ చారిత్రక సంఘటనలు అతనిలో చిత్రాలుగా పొంగుకు వచ్చాయి.
ఎనభైలలో శ్రీలంక రణరంగ అకృత్యాలను తెలిపే వెదురు తడికెల చిత్రాలు తిరుచ్చిలోని పలుచోట్ల ప్రదర్శించారు. అందులో ఎక్కువ భాగం మణి వేసిన చిత్రాలే. రేడియో వార్తలలో విన్నవీ, పత్రికలలో చదివినవీ అలాగే కళ్లముందు నిలిపిన చిత్రాలతో అందరికీ పరిచయస్థుడయ్యాడు మణి. ఇవ్వాళ కాకపోయినా ఏదో ఒకరోజు ఈలం భూమి చరిత్ర ఆనవాళ్లను వెళ్లి చూద్దాం అని అతను ఎంతగానో నమ్మాడు. అందుకు అతని స్వాభావికంలోనే ఉన్న తమిళ ఈలం వర్గపు స్పృహ ఒక కారణం. తర్వాత రోజులలో అతని తరగతిలో చదివిన ఈలం తమిళ అమ్మాయి 'డార్తి' పట్ల ఉన్న అతని సాన్నిహిత్యమూ జత కలిశాయి.
ఆ అమ్మాయి కూడా అతని చిత్రాల ద్వారా అతనితో పరిచయమైన వ్యక్తే. ఎవరినీ పరిశీలనగా చూడని అలవాటును కొనసాగిస్తూ వచ్చిన మణి మొట్టమొదటిసారిగా డార్తిని సమీపంలో చూడగానే మైమరిచి పోయాడు. ఆ అమ్మాయి రూపంలో అచ్చు అతని నిమ్మి టీచర్లాగానే ఉంది. మెరిసే నల్లటి రంగు, అలంకారం ఇష్టపడని స్వచ్ఛమైన అందం, మిల మిల మెరిసే చురుకుగా చూసే కనులు, ఎప్పుడూ అందులో వుండే ఆమె ఎంతగానో మరిచిపోవాలని ప్రయత్నించే పెను దిగులు.
డార్తి అతనితో స్వాభావికంగానే మెలిగేది. ఆమే అతని కలను అధిగమించి ప్రత్యక్షంగా ఆస్వాదించటానికి ప్రేరేపించిన మొదటి అమ్మాయిగా జ్ఞాపకాలలో మొలకెత్తి వృద్ధి చెందింది. దాన్ని అతను ఆమెకు చెప్పలేదు. ఒకరోజు అతను తన తరగతి మిత్రులు కొందరితో కలిసి డ్యామ్‌ను చూడ్డానికి వెళ్లాడు. డార్తి కూడా అక్కడికి వచ్చింది. అక్కడ గేట్ల నుండి నీరు కిందికి దుముకుతూ ఉంది.
''మణీ, మీ బళ్లో మీకు నచ్చిన టీచరు ఎవరు?'' డార్తీనే మొదట అడిగింది.
''నిమ్మి టీచర్.'' చప్పున బదులిచ్చాడు మణి.
''ఎందుకూ?''
''అందంగా ఉంటారు. నీట్‌గా బట్టలు వేసుకుంటారు. చక్కగా పాఠం చెబుతారు. ఆమె సంపూర్ణమైన ఒక కవితలాంటి వారు. అయితే ఆమె అసహ్యించుకున్న విద్యార్థిని నేను మాత్రమే'' స్పష్టమైన ఉచ్ఛారణతో చెప్పాడు మణి.
ఏదో చెప్పి గలగలమని నవ్వుతూ తలను ఆడిస్తూ, ''ఎందుకూ ఎందుకూ మిమ్మల్ని మాత్రం ఆమెకు నచ్చలేదు మణీ?'' అంది. అప్పుడు ఆమెకు అతను నిజాలను చెప్పటానికి వీలుకాలేకపోయింది.
''తెలియదు.'' అన్నాడు.
''అదెలా మీకు తెలియకుండా పోతుంది. దాచకుండా చెప్పండి మణీ!'' డార్తి నవ్వుతూ అడిగింది.
''తెలియదు. ఆమెకు నచ్చటం లేదని తెలియగానే నేను మధ్యలోనే ఆ బడి నుండి నిలిచిపోయాను. మరుసటి సంవత్సరం వేరే బళ్లో ఐదవ తరగతి నుండి చదివాను.''
డార్తి విడిచిపెట్టకుండా నిమ్మి టీచర్ గురించే అడగ సాగింది. చాలాకాలం తర్వాత మణి తన ప్రాథమిక రోజులలో మునిగిపోయాడు.
ఆ రాత్రి కాలేజీ హాస్టల్‌కు రాగానే నిమ్మి టీచర్ జ్ఞాపకాలు అతనిని చుట్టుముట్టాయి.
అప్పుడు అతను న్యూ టౌన్ ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్నాడు. ఆ రోజు నిమ్మి టీచర్ తరగతిలో, అటుఇటు నడుస్తూ కథ చెబుతూ వుంది. అందరూ కళ్లను విశాలంగా పెట్టి తలలను ఊపుతూ టీచర్ పెదవులనే చూస్తూ ఉన్నారు. నిర్మలకుమారి ఆమె పూర్తి పేరు. అయితే ముద్దుగా నిమ్మి టీచర్ అని అందరిచేతా పిలవబడ్డారు. కొందరు 'పొట్టి టీచర్' అని కూడా చెప్పేవారు. బళ్లోనే చాలా నీట్‌గా దుస్తులను ధరించి అందరినీ వెనక్కు తిరిగి చూసే లాంటి బుట్ట బొమ్మ అందం కలిగినవారు నిమ్మి టీచర్. నలుపు లోని ఆకర్షణ ఆమె ప్రతి కదలికలోనూ మాటలోనూ కనిపించి మైమరిచేలా చేసేది. రోజూ కట్టుకొచ్చే చీరలో ఎన్నో రంగుల చిత్రాల రెక్కలతో నడిచివెళ్లే నల్లటి సీతాకోకచిలుకలా కనిపించే వారు. ఎక్కడెక్కడి నుండో మగవాళ్లు, ఆడవాళ్లు, విద్యార్థులు అంటూ గుంపుగా ఆమెను వెంబడించేవి కళ్లు. టీచర్ కను మరుగు కాగానే ఆమె అందాన్ని నెమరువేసుకుంటూ ఆస్వాదించే వారు. ఇది ఆ బళ్లో రోజూ నూతనంగా జరిగే దృశ్యం.
మణి జ్ఞాపకాల దొంతర్లలో ఎప్పుడూ మోహాన్ని రేకెత్తించని పగుళ్లులేని నేలబొగ్గు ముక్కలా నిమ్మి టీచర్ ముద్రితమై ఉన్నారు.
నిమ్మి టీచర్ మగపిల్లల్ని 'కన్నా' అనీ, అమ్మాయిల్ని 'కన్నమ్మా' అనీ పిలుస్తారు. ఉపాధ్యాయులందరూ కుక్కా, దున్నపోతా, గడ్డితినే పశువా, గాడిదా అంటూ పిలిచే అదే పాఠశాలలో... నిమ్మి టీచర్ మాత్రం ముద్దుగా పిలవటం అందరికీ ఎంతగానో నచ్చింది. అయితే తప్పు చేస్తే మిగతా ఉపాధ్యాయులందరికన్నా ఎక్కువ దెబ్బలతో కందిపోయేలా కొట్టేదీ ఆమే.
ఆ దినం నిమ్మి టీచర్ సైగలతో కథ చెబుతోంది. అందరూ ఆమెనే చూస్తున్నారు. మణి మాత్రం అప్పుడప్పుడూ కిందికి వంగటం, ఏదో రాయటమూ చేస్తున్నాడు. టీచర్ దాన్ని చూసీ చూడనట్టుగా కథ చెప్పటం పూర్తిచేసింది. పూర్తయిన పాఠం ఎంతవరకూ ఏమర్థమైందో తెలుసుకోవాలన్న కోరికతో ప్రశ్నలు అడగటం ఆమె అలవాటు. ఆ దినమూ అలాగే చేసింది. అయితే ఆ దినం మొదటి ప్రశ్నే మణిని అడిగింది. మణి తన పేరును చెప్పి టీచర్ ప్రశ్న అడగటం గమనించకుండా కిందికి వంగొని ఉన్నాడు. అప్పుడు టీచర్ వాడినే చూడటం గమనించిన విద్యార్థులు గట్టిగా నవ్వారు. ''ఏరు సుబ్రమణీ, ఏరు సుబ్రమణీ'' నిద్రపోతున్నవాణ్ణి లేపుతున్నట్టుగా అరిచింది. అయితే వాడు నిద్రపోవటం లేదని నిమ్మి టీచర్ గ్రహించింది. టీచర్ చేతిసైగతో తరగతి గదంతా ఉన్నట్టుండి నిశ్శబ్దమై పోయింది. మణి తలపైకెత్తాడు. మొత్తం తరగతి గదంతా అతనినే చూస్తోంది.
''ఏం రాస్తున్నావు? ఏదీ దాన్ని ఇటివ్వు!''
గుడ్డు లోపల నుండి పిల్లను బలంగా బయటికి లాగినట్టుగా వాడి దగ్గర నుండి ఆ నోటు పుస్తకాన్ని బలంగా లాగి తీసుకుంది నిమ్మి టీచర్. అతను ఇవ్వటానికి నిరాకరిస్తూ మొండికేసిన ఆత్రంతో బెత్తంతో కాళ్లూ చేతులమీద వాతలు తేలేలా కొట్టింది. టీచర్‌తో కలిసి ఒకరిద్దరు బలమైన విద్యార్థులూ ఆ నోటు పుస్తకాన్ని అతని చేతినుండి లాక్కున్నారు. ఒంట్లో నుండి ఏదో ఒకటి ఖండించి ఇచ్చిన ప్రాణిలా అతను ఆ నోటు పుస్తకంలో నుండి విడివడి మౌనమై పోయాడు. అతని చేతికి అంటుకొని ఉన్న నేలబొగ్గు రంగు చాలామంది ఒంటికీ బట్టలకూ మరకలుగా అంటుకుంది.
ఇప్పుడు అందరూ టీచర్నే చూస్తున్నారు. మణి నిట్టూరుస్తూ కిందికి వంగొని ఉన్నాడు. గబగబా మణి నోటు పుస్తకంలోని పేపర్లను చింపిన నిమ్మి టీచర్ ముఖం ఆదుర్దాతో కందిపోయి అలాగే కుర్చీలో కూర్చుండిపోయింది. దాన్ని దాచటానికి అటెండెన్స్ రిజిష్టర్‌ను తిప్పుతూ పేర్లను పిలవటం మొదలుపెట్టింది. అప్పుడు ఏ భావాన్నీ ఆమె బహిర్గత పరచలేకపోయింది.
లోతైన చూపులతో, తలకు రాసుకున్న నూనెతో కలిసిన చెమట ముఖంలో కారుతుండగా స్టాఫ్‌రూమ్ బయట అతను నిలబడి ఉన్నాడు. వస్తూ పోతూ ఉన్న ఉపాధ్యాయులందరూ అతణ్ణి విచారించి వెళ్లసాగారు. పక్కన నిలబడటానికి వచ్చిన తన తరగతి విద్యార్థులను తరిమికొట్టాడు మణి. అతని తరగతిలోని వాళ్లందరికీ ఆ నోటు పుస్తకాన్ని చూడాలని ఆసక్తిగా ఉంది. అందుకని చాలామంది విద్యార్థులు అటు ఇటు పరుగెత్తారు.
గది లోపల నిమ్మి టీచర్ వాడి నోటు పుస్తకంలోని పేజీలను తిప్పి చూస్తూ ఉంది. అందులో ప్రతి పేజీ చక్కటి చిత్రాలతో నిండిపోయి ఉంది. ఒక పదేళ్ళ పిల్లవాడి వ్యవహారానికి మించిన నైపుణ్యం అది. వయసును మించిన మానసిక స్థితిలోని చిత్రాలను చూసి ఇంకెవరో చిత్రీకరించారన్న అనుమానాన్ని అధిగమించాలనుకుంది. అయితే ఆ దినం పాఠం చెబుతున్న తీరులో, తాను ధరించిన చీరలోని పూల ఆకృతులు ఏమాత్రం చెదరనీయకుండా తనను చిత్రీకరించటమే ఆమెకు కలవరాన్ని కలిగించింది.
'తనకన్నా ముందు ఈ నోటు పుస్తకాన్ని మగ ఉపాధ్యాయులెవరైనా చూసుంటే?' అన్న ఆలోచన వచ్చి ఆదుర్దాగా మంచినీళ్లను ముంచుకొని తాగింది. గబగబ తన చేతిసంచి అడుగున ఆ నోటు పుస్తకాన్ని పెట్టి పైన టర్కీ టవల్‌ను మూసి మిగతా వస్తువులను అడ్డుపెట్టింది. వాడు బయట ఎదురుచూస్తుంటాడన్న ఆలోచనతో బడి సమయం ముగిసి విద్యార్థులు బయటికి వెళుతున్న సందడి తగ్గాకే గది బయటికొచ్చింది. అప్పుడు మణి అక్కడ లేడు.
మరుసటి దినం నుండి బడికి వెళ్లేందుకు నిరాకరించాడు మణి. ఇంట్లో అమ్మ ఎంత చెప్పినప్పటికీ అతను బడికి వెళ్లటానికి ఇష్టపడలేదు. దాంతో అమ్మే ఎక్కువగా దిగులు పడింది. నాన్న ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. విచారించేందుకు బడికి వెళ్లిన నాన్న చేతికి, అతని అర్థవార్షిక పరీక్షల మార్కుల జాబితాను ఇచ్చారు. నాన్న, నిమ్మి టీచర్ 'మణిని బడికి రమ్మని చెప్పినట్టుగా' చెప్పాడు. ''నేను యేరే బడికి ఎల్తాను. ఆ బడి వొద్దు.'' అని చెప్పి ఏడ్చాడు మణి. అమ్మ చెప్పే ఏ మాటలూ బెదిరింపులూ ఫలితాన్నివ్వలేదు. చివరి వరకూ ఆ నోటు పుస్తకం అతని చేతికి రానేలేదు.
కొన్నాళ్లకు పెద్దమ్మ వాళ్లింటి పిల్లలతో కలిసి నేలబొగ్గు ముక్కలు ఏరుకొచ్చి అమ్మటమూ, సాయంకాలాల్లో టెన్నిస్ ఆడే అధికారులకు బంతుల్ని చేరవేసే సాయం చేస్తూ తెల్లవారి నుండి రాత్రి వరకూ బడులు లేనిచోట్ల తిరుగుతూ ఉండేవాడు. అప్పుడూ అతని నడుమువద్ద ఒక నోటు పుస్తకం ఎప్పుడూ దోపుకొని ఉండేవాడు. ఏ పనులూ లేని విరామ సమయాలలో ఆ నోటు పుస్తకం పేజీలలో అతని దృష్టి నిలిచి ఉండేది. మణి మానసిక స్థితిలాగానే అతని నోటు పుస్తకం పేజీలలోనూ రహస్య రూపాలు కొత్త కొత్తగా చేరేవి.
మరుసటి ఏడాది వేరే కొత్త బడిలో చేర్చబడ్డాడు మణి. ఏ తరగతి పాఠాలూ అతనికి కఠినంగా అనిపించలేదు. ఒకసారి చదవగానే మనసులో గుర్తుండిపోయేవి. జవాబు పత్రాలలో రంగురంగుల గీతలతో ప్రత్యేకంగా అలంకరించి అందులో వాడి గుండ్రటి చేతిరాతతో రాసేవాడు. ఏ టీచరూ వాటిని చదవటానికి సాహసించేవారు కారు. తర్వాత్తర్వాత తరగతు లను సులభంగా అధిగమిస్తూ పై తరగతికి వచ్చేశాడు. పాఠ్య పుస్తకాల లాగానే అతని ప్రత్యేకమైన నోటు పుస్తకాలూ ఇంటి మూలలో నిండిపోయాయి. నిమ్మి టీచర్ అనుభవం తర్వాత మణి చాలా జాగ్రత్తగా నడుచుకున్నాడు.
అయినప్పటికీ తరగతులు పెరిగేకొద్దీ అతనిలో వచ్చే మార్పులు అతనిని ఇంకా ఇంకా ప్రత్యేకతలను వెతికి వేశారేేలా చేశాయి. మునుపటిలా అందరి ముందూ ఏదైనా చేసే భావన మారిపోయి ఒక ఆంతరంగిక స్పృహ అతనిలో మంటలా చెలరేగి వేదనలా పాకింది. చిరుప్రాయంలో గీసిన చిత్రాల రూపాల నగత్వము వాడి శరీర అంతరంగానికి అప్పుడు స్ఫురణకు రాలేదు. అయితే ఇప్పుడు వాటివల్ల అతని శరీరము దహించసాగింది. అతని జ్ఞాపకాలలో రకరకాల రూపాలను అతను దర్శించసాగాడు. వాటిని అలాగే కాగితాలపై చిత్రీకరించేస్తున్నాడు. అప్పటిలా ఇప్పుడూ వాటిని ఎవరికీ చూపించకుండా దాచటం యాదృచ్ఛికమేమీ కాదు.
కళ్ల ముందర కనబడే ఆడవాళ్లను అచ్చుగుద్దినట్టుగా అలాగే గీసే అలవాటుండేది అతనికి. ఆ విధంగానే అమ్మ, పెద్దమ్మ, అత్త, వీళ్లనూ... బళ్లో ఉపాధ్యాయినులను, విద్యార్థినులను ఎవరూ లేని స్థితిలో లోలోన కనిపించే ఆకారాలను మార్చి మార్చి గీసేవాడు. వాళ్లందరూ ఆడవాళ్లై ఉండేవాళ్లు. చాలామటుకు నిజంగా చూసి గీసిన ఆకారాలు దుస్తులు ధరించి ఉన్నారు. అయితే అతని ఊహలలో కనిపించిన అన్ని ఆకారాలూ దుస్తులు లేకనే తిరిగేవారు. ఆ ఆకారాలు అతని చిత్రాలలో అలాగే ముద్రింపబడ్డాయి. ఈ అలవాటు మూడవ తరగతి నుండే ఎవరికీ తెలియకుండా మెల్లగా అతనిలోకి ప్రవహించింది.
అతనికి తెలిసి అమ్మానాన్నలు సహజంగా మాట్లాడు కుంటూ ఉండటాన్ని చూసిన జ్ఞాపకమే లేదు. ఒక రకమైన ప్రశాంతతో దూరదూరంగా ఉంటూ మనిషికొక గదిలో పరాయి వాళ్లల్లా ఉండేవారు. భోజనము, ఖర్చుకు డబ్బు తీసుకోవటమూ వంటి పనులు అలవాటుగా సహజంగా జరిగేవి. ప్రతి దినమూ మణి అమ్మతోనే పడుకుని నిద్రపోయేవాడు.
పెరిగేకొద్దీ మెల్లమెల్లగా అమ్మ నుండి దూరమై వేరేగా పడుకోవటం మొదలుపెట్టాడు. మేడపై ఒంటరి గదిలో అనుకున్నప్పుడు పడుకొని అర్థరాత్రి నిశిలో లేచి నోటు పుస్తకం పేజీలలో చిత్రీకరించేవాడు.
అతనిలో దృశ్యాలుగా ఉబికే కలల ప్రపంచపు ఆడవాళ్లు, ఒంటిని దాస్తున్న దీర్ఘమైన కేశాలతో మట్టి శిల్పల్లా నగంగా తిరిగేవాళ్లు. అతణ్ణీ దుస్తులను విప్పి తమతో విహరించటానికి సంజ్ఞలతోనూ, కనుసైగలతోనూ ఆహ్వానించేవారు. వాళ్ల చూపులు ధనుస్సుల్లా, చేపల్లా, నీటి కుళాయిల్లా ఆకలితో, తమకంతో, మైకంతో అతనిలో నిక్షిప్తమై పడుండేవాళ్లు. నగ దేహాలుగా అతనిలో ప్రవేశించి అతనిచేత చిత్రీకరింప చేసేవారు.
అయితే ఇప్పుడతను ఆ ప్రతిబింబాల ఛాయలను తన నిజ జీవితంలో వెతుకుతూ, వాటిని చిత్రీకరించటం పూర్తి చేశాక కూడా దాగక ఆకర్షించే ఆ రూపాలతో సంచరించటమూ మొదలుపెట్టాడు. ఎక్కడ తిరుగాడుతున్నా అతని కలలో చూసే అందగత్తెలలో ఏ ఒకరి లాగానూ కనిపించటం లేదు. ఆ ఆకారాలతో తమకంతో కలవటం మొదలుపెట్టాడు. రాత్రులలో వాళ్లతో మాట్లాడేవాడు. ఆ ప్రతిరూపాలను నేరుగా పిలిచేవాడు. ఎవరూ రాకపోవటంతో వేరే ఆలోచనలు లేక ఇంటిని వదిలిపెట్టి బయటికి వెళ్లేవాడు. రాత్రంతా ఊరంతా తిరిగి తెల్లవారుతుండగా ఇంటికొచ్చి పడుకునేవాడు. వెలుతురు చీకటిని తొలగించి ఎండ పైకొచ్చేకొద్దీ అతను నీరసంగా శవంలా పడి నిద్రలో కూరుకుపోయి ఉండేవాడు.
అది రోజూ జరిగే సంఘటనగానే, రెండుమూడు సార్లు అర్థరాత్రిపూట పోలీసులకు చిక్కాడు. చిరునామాను అడిగి తీసుకుని అతనిని హెచ్చరించి ఇంటికి పంపించారు. అలా ఇంటికి తిరిగొచ్చిన రాత్రులలో తనను తాను నియత్రించుకోలేక ఇబ్బందిపడ్డాడు. ఇంటి మేడమీది టాయిలెట్‌కు వెళ్లి తన శరీరాన్ని గోడకు రాసేవాడు. అప్పుడే మొలవటం ప్రారంభమైన రోమాలలో ఏర్పడ్డ హాయికి తోడు అతనిలో ప్రాణం పోసుకునే అందగత్తెలు అతనికి గిలిగింతలు పెట్టేవాళ్లు. వాళ్లను గియ్యటం పూర్తికాగానే వాళ్లతో కలిసి అతని శరీరం అతనిని మూర్ఖంగా రెచ్చగొట్టేది. రాత్రి కురిసే ఒక్కొక్క చుక్కలోనూ వాళ్లు అలసిపోకుండా పొంగే ప్రవర్తనతో అతనిని పూర్తిగా వశపరుచుకునేవాళ్లు.
అతని అంతరంగంలోని రంగులు చిత్రాలుగా రూపు దిద్దుకొని ఆకారాలుగా మారి అతని నోటు పుస్తకాల దాకా విస్తరించాయి. వాటి జ్ఞాపకాలు ఏకాంతంలో వాటంతట అవే అడవి నిప్పులా అతనిలోకి ప్రవహించాయి. ఆ చిత్రాల రూపాలు అతని శరీరంలోకి ప్రవేశించి విద్యుత్తును ప్రవహింపచేసి కుతకుతలాడే పాత్రలా దహించసాగింది. అతనికి వాటిని ఆర్పటానికి దారులూ తెలియలేదు, అణచటానికీ వీలు కాలేదు.
మధ్యాహ్నపు సమయాలలో పాత 'నంగోలి అమ్మ' గుడికి వెళ్లేవాడు. నగరాన్ని దాటి బయట ఎంతో దట్టమైన అడవిలోని చోళుల నాటి పురాతనమైన గుడి అది. ఆ గోపురాలపై చెక్కబడిన నగ శిల్పాలలో కొన్ని, తన ఊహలలో సదా పరిభ్రమించే రూపాలను పోలి ఉన్నాయి.
గుడికి వెనకనున్న వేపచెట్టు కింద అతను కూర్చుని అక్కడి అందాలరాశుల రూపాలను గీస్తూ ఉండేవాడు. అప్పుడు ఆ అవాంతరం లేని ఏకాంతపు నిశ్ణబ్దంచేత గుడి ముడుక్కొని ఉండేది. ఆ ఆకారాలను చిత్రీకరించటం పూర్తయ్యే లోపు మోహపు వీచికలు అతని ఒంట్లోని నరాలను ప్రేరేపించేవి. కుబుసం విడిచిన సర్పాల మధ్య చిక్కుకున్న చిరుప్రాణిలా అతనిని అటుఇటు స్పృశిస్తూ పెనవేసుకునేవి ఆ రూపాలు. అతను ఇంటా బయటా ఒంటరిగానే ఉండేవాడు. కానీ ఏ ఏకాంతంలోనైనా అతను ఒంటరిగా లేడు.
అతని తల్లే దీన్ని మొట్టమొదటగా గ్రహించింది. ఆ దినం అతనిని పొదువుకొని దు:ఖించింది. అతనిపై కురిసే ప్రేమతో అతనిని ఇంకా పదును తేలేలా చేసింది. అతనికి ఏమీ అర్థంగాక ఆమెకు దూరం జరిగి ఓదార్చాడు.
''ఏది జరక్కూడదని దేముళ్లనంతా మొక్కానో, అది జరిగిపోయిందే, అయ్యో దేముడా మీకెవరికీ కండ్లు లేవా? అయ్యో, అయ్యో?'' అని కడుపుమీదా తలపైనా కొట్టుకుంటూ పొర్లి పొర్లి ఏడ్చింది. ఇప్పటివరకూ తలమీదికి దిగి వున్న మంట ఇప్పుడు ఆమె కడుపులోకి దిగినట్టుగా పరితపించింది. ఇంటో నుండి బయటికొచ్చిన అతని తండ్రి వాళ్లను చూసి చలించ కుండా మళ్లీ లోపలికెళ్లిపోయాడు. ఆమె అతను ఉండే గదిని చూస్తూ గట్టిగట్టిగా అరిచింది. కుమిలిపోతూ చేతికి దొరికిన వాటిని తీసి విసిరింది. అక్కడి నుండి ఏ జవాబూ రాలేదు.
కొంతసేపటి తర్వాత మణి మెల్లగా కిటికీ గుండా తండ్రి గదిలోకి తొంగి చూశాడు. తండ్రి మంచంపై కూర్చొని ఉన్నాడు. గది మూలన ఆయన చూపులు నిలిచి ఉన్నాయి. మణి ఇంకా నిశితంగా గమనించాడు. తండ్రి ఏదో ఒక సినిమా సీన్‌ను చూస్తున్నట్టుగా ఒఠి గోడను చూస్తున్నాడని మణి గ్రహించాడు. ఇప్పుడు అతనిలో మొట్టమొదటిసారిగా ఒక సిగ్గు పిడుగులా పడింది.
మణి పుట్టిన కొంత కాలానికి వాడి తండ్రిలో ఇలాంటి మార్పు వచ్చింది. అతను మెల్లగా అందరి నుండీ ఒంటరి కావటం మొదలుపెట్టాడు. తనలో పులకింతలు పెరిగిపోయి తానుగా మోహపు భాషలను మాట్లాడుకుంటూ టాయిలెట్కేసి పరుగులు తీసి చాలాసేపటి వరకూ లోపలే ఉండేవాడు. నీరసించి బయటికొచ్చి మంచాన పడేవాడు. అతనిలో కలిగే మార్పులను గ్రహించటానికి కొంతకాలం పట్టింది అతని తల్లికి.
ఒకే ఇంట్లో భర్త ఉన్నప్పటికీ రాత్రిపూట బిడ్డతో సహా వేరుగా ఉంటూ పరితపించింది. సంజ్ఞలతోనూ, నేరుగానూ భర్తను సమీపించేది. అతను ఆమెను దగ్గరకు రానివ్వకుండా దూరమై పరుగుతీసి ఒంటరి గదిలో గెడియపెట్టుకోవటం మొదలుపెట్టాడు. రాత్రంతా మోహపు మూలుగులు అతని నుండి వస్తుండేవి. మెలకువగా ఉండి తన అసహాయతను శాపాలుగా మార్చుకుని అరిచి గీపెట్టి నీరసించి ప్రశాంతంగా ఉండిపోయేది ఆమె. మణి మాత్రమే ఆమెకు ఓదార్పు, జీవితంగా మారిపోయి తేరుకుంది.
మణి పైనా అదే వాసన రావటాన్ని గ్రహించిన రోజున తన ప్రాణం మండిపోయి తనలో తానే కుంచించుకుపోయింది అతని తల్లి. మెల్లగా అతనిని గమనించటం మొదలుపెట్టింది. అతను రాత్రులలో ఇష్టమొచ్చినట్టుగా తిరగటమూ, తెల్లవారాక వచ్చి నీరసించిపోయి నిద్రపోవటాన్నీ చూసి అతనిని మళ్లీ చదువుకోమని చెప్పి గొణగసాగింది. అప్పుడు అతను ఇంటర్మీడియెట్ పూర్తిచేసి కొన్ని సంవత్సరాలయ్యాయి.
తల్లి సణుగుడు కొనసాగటం వల్లే అతను తిరుచ్చి కాలేజీలో చేరాడు. రోజూ ఇంటికి వెళ్లి రావాలని అనుకున్నవాణ్ణి తల్లే బలవంతం పెట్టి హాస్టల్లో చేర్పించింది. విద్యార్థులతో కలిసి ఉంటే అతనిలో మార్పు వస్తుందన్న నమ్మకం ఆమెది.
సెలవులకు ఇంటికి వచ్చినవాణ్ణి చూసి తల్లికి దిగులు రెట్టింపైంది. మునుపటికన్నా ఎముకలగూడులా సన్నబడి పోయాడు. దగ్గరికి పిలిచి తలను నిమురుతూ ఏదేదో చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది. అతనికే తెలియదు తల్లి గుండెలు బాదుకుని ఏడవటానికి కారణం తననుండి వచ్చే దుర్గంధం అని.
డార్తి పరిచయమయ్యాక మణి ఎక్కువగా ఇంటికి రావటం లేదు. రెండుమూడు నెలలు కూడా పూర్తిగా హాస్టల్లోనే ఉండిపోయి ఎప్పుడో ఒకసారే వచ్చేవాడు. అలా రావటంతో తల్లి మునుపటిలా ఏడవటం లేదు. కొన్ని స్పష్టతలు తెలియటంలాంటి అతని ముఖ భావనలే అందుకు కారణం.
క్లాసులకు సమయం పోను మిగిలిన పగటి సమయమంతా అతనూ డార్తీ కలిసి మాట్లాడుకుంటూ తిరిగారు. తిరుచ్చిలోని అన్ని గ్రంథాలయాలకూ వెళ్లొచ్చారు. ఆదివారాలలో క్రమం తప్పకుండా ఆమె లూర్థుమాత కోవెలకు తెల్లవారే వెళ్లిపోయేది. ఆ కోవెలలోని ఎడమవైపు మూలలో మోకాళ్లపై కూర్చుని కళ్లు మూసుకుని శబ్దం రాకుండా దు:ఖించేది. ఆరాధన పూర్తయ్యాక ఇద్దరూ ఆ కోవెలను చుడుతూ దాని అందాన్ని ఆస్వాదిస్తూ చాలాసేపు అక్కడే ఉండేవారు. ఏటి వారధిపై, చెట్టుకింద, కొండకోటలో అంటూ ఎక్కడైనా పుస్తకాలు పెట్టుకుని చీకటి పడేంతవరకూ చదివే వారు. తర్వాత చర్చించుకున్నారు. రాత్రివల్ల దూరమయ్యేవారు.
రాత్రి సమయాలలో డార్తికి మణి గుర్తుకొచ్చేవాడో ఏమో కానీ, మణికి డార్తి గుర్తుకు రావటమే లేదు. అతని రాత్రులు రహస్యమైనవి.
అతని ఊహలు రాత్రులను దాటుకొని పగటిపూటా కొనసాగటం మొదలుపెట్టాయి. అతను కొన్ని వారాలుగా కాలేజీకి వెళ్లకుండా బయట తిరిగాడు. తాను దర్శించే రూపాలను తలచుకొని పగటిపూటా స్వీయ సుఖం అనుభవించటం మొదలుపెట్టాడు. అందుకని ఉదయాన్నే లేచి నగరంలోని ఎన్నో ప్రదేశాలకు వెళ్లి ఒంటరిగా కనుమరుగయ్యే వాడు. అందులో కొన్ని ప్రదేశాలు అతనికి డార్తిని గుర్తుకు తెచ్చాయి. ఆ ఊహలే కాలేజీకి వెళ్లకపోవటాన్ని గ్రహింప చేసింది.
మూడు వారాల తర్వాత అతను కాలేజీకి వెళ్లాడు. తెల్లవారి లేచి తొందరగానే క్లాసు రూములోకి వెళ్లి మొదటి వ్యక్తిగా కూర్చున్నాడు. అతని భావనలో డార్తి రాకకు సంబంధించిన ఆత్రుత మాత్రమే ఉన్నది. ఒక్కొక్కరు వస్తున్నప్పుడూ అతను వెనక్కు తిరిగి తిరిగి చూశాడు. మగపిల్లలు ఆడపిల్లలూ ఎందరో వచ్చారు. చివరి వరకూ డార్తి రాలేదు. ఒక్కో గంటా ముగుస్తున్నప్పుడూ తర్వాతి గంటసేపటిలో వచ్చేస్తుందన్న ఎదురుచూపులతో కిందికి వంగే కూర్చున్నాడు. చివరి గంట అటెండెన్స్‌లో పేర్లు పిలుస్తుంటే అతను జాగ్రత్తగా గమనించాడు. డార్తి పేరు పిలవనే లేదు.
విచారణ చేస్తే చెప్పారు, ఆమె కాలేజీకి నిలిచిపోయిందనీ, మళ్లీ శ్రీలంకకే తిరిగి వెళ్లిపోయిందనీ! అతను ఆ విషయాన్ని నమ్మలేకపోయాడు. అంగీకరించటానికీ మనసు రాలేదు. మరుసటిరోజు వస్తుందనే ప్రతిదినమూ ఎదురుచూసేవాడు. ఆమె రాలేదు. దేన్నీ నమ్మకుండా అతను డార్తిని ఎదురుచూస్తూ రోజూ కాలేజీకి వచ్చాడు.
కొన్నాళ్లకు పంపినవాళ్ల చిరునామా లేకుండా మణికి ఒక ఉత్తరం వచ్చింది. అతని కాలేజీ జీవితంలో అతనికి వచ్చిన మొదటి ఉత్తరమది.
'మిత్రుడు మణికి డార్తి రాయటం... కళ్లు చెమ్మగిల్లి కన్నీళ్లు చెంపలపై నుండి క్రిందికి జారాయి. శరీరం ఎందుకో వణికింది. ఆమె గబగబా రాయటంతో అదో చిరు చిత్రలేఖనంలా ఉంది. ఏవేవో జ్ఞాపకాలు ముసురుకున్నాయి. సాధారణ క్షేమసమాచారాల ఉత్తరమే అది. అయితే అతనికి అది వేరే రకమైన స్పందనలను కలిగించింది. కుడి పక్క చివరన 'మట్టై కళప్పు' (ఊరిపేరు) అని రాసి తేదీ వేసి ఉంది.
అతను ఆ రాత్రంతా మనోవీధిలో తిరిగాడు. పగల్లో డార్తి జ్ఞాపకాలతో విహరించాడు. ఆమె జ్ఞాపకంగానే చివరి ఏడాది పరీక్షలు రాసి పట్టానూ పొందాడు. 'ఈ పట్టాను డార్తి జ్ఞాపకాలే సంపాదించి పెట్టింది' అన్నదే అతని నమ్మకం. పట్టాను ఇచ్చి ఆ కాలేజీ అతనిని సాగనంపినప్పటికీ, డార్తి జ్ఞాపకాలను వెతుక్కుంటూ అతను రోజూ కాలేజీకి వచ్చేవాడు. లైబ్రరీ, చెట్టు నీడ, మెత్తని గడ్డి... అంటూ వాళ్లు మాట్లాడుకున్న ప్రదేశాలలో మళ్లీ మళ్లీ కూర్చుని రోజుల్ని గడిపేవాడు.
అతను అస్థిమితంగా తిరగటాన్ని చూడలేక తల్లి పరితపించింది. బంధువుల చావులకు మాత్రమే వెళ్లేది. దీర్ఘాలు తీస్తూ అరిచి ఏడ్చేది. అయితే ఏ చావులోనూ ఆమె చనిపోయిన వాళ్ల కోసం ఏడవలేదు. మణిని గురించి ఎవరితోనూ చెప్పుకో లేని సణుగుడును ఆ శవాలతోనే చెప్పి గీ పెట్టింది. ప్రాణమున్న బంధుత్వం కన్నా శవమై పోయిన బంధువులనే ఆమె నమ్మింది.
డార్తి జ్ఞాపకాలతో లైబ్రరీలలో గడిపేవాడు మణి. ఎవరూ తాకని పాత పత్రికలూ, గ్రంథాలూ అతను వెతికిపట్టి తీసుకొని చదవేందుకు ప్రయత్నించేవాడు. ఒకప్పుడు అక్కడ అతను డార్తితో కలిసి కిటికీ వెలుతురులో కూర్చుని ఇద్దరూ చాలాసేపటి వరకూ ఎన్నో పాత గ్రంథాలను చదివారు. ఆమెగా భావించి, అతను పుస్తకాల అక్షరాలపై చూపులతో నడిచాడు. ఆమె జ్ఞాపకాలతో అతనికి తల్లి ఏడ్చి కమిలిపోయిన ముఖం గుర్తుకొచ్చింది. డార్తి వచ్చేస్తే తల్లి కన్నీటిలోని వేడిమి చల్లారిపోతుందని భావించాడు. ఇప్పుడు అదే స్థలంలో అతను చీకటిని వెతుకుతూ అల్మైరాల నీడలలో దాగి ఆమెను ఊహించుకుంటున్నాడు.
తెల్లవాడి కాలంలో నిర్మించిన అందమైన పనితనం కలిగిన ఎర్రటి కట్టడం అది. పాత గ్రంథాలు కలిగిన అల్మైరాలు నిండిన పొడవాటి గదిని ఉదయం ఒక వ్యక్తి తెరిచేవాడు. ఆయనే సాయంత్రం దాన్ని మూసేవాడు. ఆ గదికి నిరంతర పాఠకుడిగా అతను మాత్రమే ఉన్నాడు. మరెవ్వరూ అక్కడికి రావటం లేదు.
వెల్లవేసిన గ్రంథాలయపు గోడలపై రోజుకొకటి చొప్పున ఆడవాళ్లను పలు కోణాలలో చిత్రీకరించాడు. ఆ బొగ్గు గీతల చిత్రాలను చూసి మోహించి పరవశించేవాడు. ఎన్నోసార్లు ఆ గ్రంథాల అల్మైరాల మరుగులో చీకటి నిండిన ప్రాంతంలో అతని హృదయంలో నిండిన కన్యలతో కలిసి కేకలు పెట్టి ఉన్నాడు. గ్రంథాలయపు ఏకాంతమూ అతనిని నీరసించేలా చేశాయి. లేచి నడవటానికే వీలుకాక తడబడుతూ అతను కిందికి దిగేవాడు.
తల్లి మేల్మలయనూర్, నాగూర్, వేలాంగణ్ణి అంటూ ఎన్నెన్నో నమ్మకాలతో అతణ్ణి వెంటబెట్టుకొని వెళ్లి మంత్రించు కొచ్చేది. అతని చేతికి ఎన్నో రంగులలోని తాయెత్తు దారాలు ఉన్నాయి. ఏదీ ఫలితమివ్వకపోయేసరికి సైకియాట్రిస్ట్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లింది. వాళ్లూ ప్రయత్నించి ఎన్నో రకాల మాత్రలూ మార్చి మార్చి రాసిచ్చేవారు. భర్తకు చెయ్యాలనుకుని అతని నిరాకరణతో తప్పిన వైద్యాలను అమ్మ ఇప్పుడు కొడుక్కు చేసింది. రోజూ డాక్టర్లను వెతుక్కుంటూ ఊర్లకు వెళ్లొస్తోంది.
తల్లి తపనను నివారించటానికీ, తన జ్ఞాపకాలను మర్చి పోవటానికీ అతను బలవంతంగా సెక్యూరిటీ గార్డుగా చేరాడు. అతను రాత్రంతా సైకిల్లో తిరిగాడు. తాత్కాలికమైన షిఫ్ట్ పర్సన్‌గా రాత్రి కాపలాకు వచ్చాక అతని రాత్రులు కొనసాగాయి.
గేటును తీసుకొని లోపలికి వచ్చాడు పగటి కాపలా దారుడు సింగారం. టాయిలెట్ మరుగున గబగబా యూనిఫామ్‌ను మార్చుకుంటూ ''ఏమయ్యా మణీ.'' అన్న పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాడు మణి. ఏమీ మాట్లాడకుండా ఆదుర్దాగా లేచి బయటికి నడిచాడు. అతని నడకలో ఏదో మార్పు ఉండటం సింగారం గమనించాడు. ప్రభుత్వ ఐ.టి.ఐ. కి ఎదురుగా ఉన్న కొట్లో తమిళం, ఇంగ్లీషు దినపత్రికలను కొని కొట్టుకు పక్కనే నిలబడి గబగబా తిప్పాడు. ఒక్కో పేజీలోనూ శ్రీలంక చర్చిపై బాంబు పేలిన ఫోటోలను అతని కళ్లు వెతికాయి. ఆదుర్దాతో వార్తాపత్రికలోని ఒక్కో పేజీని వేరుచేసి వెతికాడు. అతనిలో తపన మరింత అధికమైంది. ఐదవసారి చూసిన ఇంగ్లీషు దినపత్రికలో పది పేజీల నిండుగా రంగుల ఫోటోలు ప్రచురించారు.
ఏడవ పేజీని దీక్షగా చూడసాగాడు. సంచీని భుజమ్మీద నుండి తీసి పడేసి ఆ దినపత్రికతో రోడ్డుమీద అడ్డదిడ్డంగా పరుగెత్తసాగాడు. అతని చేతిసంచి చెదిరి పడింది. లక్ష్యంలేని అతని పరుగులో పిచ్చితనం కనిపించింది. ఎదురెదురుగా ఎన్నో వాహనాలు వేగంగా దూసుకెళ్లాయి. అతని చేతిలోని దినపత్రిక పేజీలు ఒక్కో పేజీగా దారంతా గాల్లోకి ఎగిరాయి. రోడ్డుమీద అందరూ అతనినే చూస్తుండగా నెల్లికుప్పం దాటుకొని పరుగుతీశాడు. కొందరు ఏమయ్యిందో ఏమోనని గట్టిగా అరిచారు.
అతను పరుగులు తీసిన దారంతా కొంతసేపటికి అతని గురించిన మాటలు అతని పాదాల ప్రకంపనల్లా రేగి చల్లారాయి.
ఏదో ఒక ఊరి బస్టాండుకు ఎదురుగా ఉన్న దేవాలయపు గోడపై మోకాళ్లపై ఆనుకొని చెమట కారుతుంటే అతను చిత్రీకరిస్తున్నాడు. సణుగుడు నిట్టూర్పులుగా మారుతున్నాయి. పెద్దదిగా చాలా పెద్దదిగా ఒక చిత్రాన్ని అతను తలెత్తకుండా గియ్యటం పూర్తిచేశాడు. ఆ ఉదయాన వ్యాపారులు కొందరు, ఉద్యోగాలకు వెళ్లేవాళ్లూ, బడి పిల్లలూ నిలబడి దాన్ని వింత చూశారు. అతనికి లోపలా బయటా జ్ఞాపకాలు నశించిన శూన్యం ఆవహించసాగింది. ఎవరో కొందరు నాణ్యాలను, కొందరు కరెన్సీ నోట్లను చిత్రం పైకి విసిరారు. కోపంతో ఊగిపోయిన అతనికి ఆత్రం తలకెక్కింది. వేగంగా అక్కడి నుండి బయటపడి వెళుతున్న బస్సు వెనకున్న నిచ్చెనపైకి ఎగిరి పట్టుకున్నాడు.
ఇప్పుడు రంగులంతా అతని జ్ఞాపకాలలో రాలిపోతూ కరుగుతూ నల్లటి రంగుగా మారిపోయింది. అతని అంతరంగంలో రెండు రూపాలు నీడలుగా నిలుచున్నాయి. ఒకటి నిమ్మి టీచర్, మరొకటి డార్తి. ఒక రూపాన్ని మాత్రమే మళ్లీ మళ్లీ వేర్వేరు ఊహల జ్ఞాపకాలుగా చిత్రీకరించాడు. ఆ రూపంతో తల్లీ నిమ్మీ టీచరూ ఉన్నారు. అతను ఏకాంతంలో ఆ చిత్రాలలో ఉన్న ఒక రూపంతో మాత్రమే మాట్లాడటం మొదలు పెట్టాడు. రాత్రులలో అతను గాఢంగా నిద్రపోతున్నాడు.
దేవాలయం బయట చిత్రీకరించిన చిత్రంలాగానే ఒక చిత్రం అతని డైరీలో ఉంది.
తమిళ మూలం : సారోన్
అనువాదం : జిల్లేళ్ళ బాలాజీ,
73820 08979
Sun 15 May 02:29:46.36605 2022