లేలేత ఉషోదయ కిరణాలను తాకిన గాలి కిటికీలోంచి వచ్చి హిరోయిన్ వెంట్రుకలను తాకుతుంటే... గాలికి ఎగురుతున్న వెంట్రుకలను టేల్ కోంబ్‌తో ఆపి హెయిర్ డ్రెస్సర్ జడ వేస్తుంది. మేకప్ మ్యాన్ హ్యాండ్ మ్యాచ్ చేసేసి రూమ్‌లో నుంచి బయటకు వెళ్తున్నాడు. తలుపు తెరుచుకొని హీరోయిన్ అసిస్టెంట్ రాకేష్ ఫ్రూట్ బాక్స్ పట్టుకొని రూవమ్లోకి వచ్చాడు. అదే సీరియల్లో తల్లి క్యారెక్టర్ చేసే నాగమణి
అతన్ని హ్యాండ్ మిరర్లో నుంచి చూసి ''రాకేష్... రేపు నా అసిస్టెంట్ అనిత రావడం లేదు. ఎవరైనా అసిస్టెంట్‌గా వెళ్ళే అమ్మాయి ఖాళీగా ఉంటే చెప్పూ..''
''సరే మేడం... ఫ్రెండ్‌కి ఫోన్ చేసి ఎవరైనా ఖాళీగా ఉన్నారేమో తెలుసుకుంటాను.'' ఫ్రూట్ బాక్స్ హిరోయిన్‌కు ఇస్తూ మదర్ క్యారెక్టర్ నాగమణితో చెప్పాడు.
ఫోన్ తీసి ఫ్రెండ్‌కు ఫోన్ చేసే లోపే అసిస్టెంట్ డైరెక్టర్ కిరణ్మయి వచ్చి హీరోయిన్ని చూస్తూ ''గుడ్ మార్నింగ్ మేడం.. మీరు రెడీ అవడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది.''
''వెరీ వెరీ గుడ్ మార్నింగ్.. ఓ పది నిమిషాలు పట్టొచ్చు..''
''అవునా మేడం... మీరు వస్తే సీన్ స్టార్ట్ చేద్దాం. తొందరగా రెడీ అయి థార్డ్ ఫ్లోర్ బాల్కనీలోకి రండి.'' అని చెప్పి సీన్ పేపర్స్ చూసుకుంటూ అసిస్టెంట్ డైరెక్టర్ రూంలో నుంచి బయటకు వెళ్లిపోయింది.
రాకేష్‌ని చూసి హీరోయిన్ ''నిన్నటి కంటిన్యూటీ చెవి కమ్మలు ఎక్కడ పెట్టావ్ కనబడటం లేదు.''
''జ్యూవెలరీ బ్యాగ్‌లోనే పెట్టాను చూశారా మేడం.''
''చూశాను రాకేష్... నీకు ఎన్నిసార్లు చెప్పినా అంతే ఎక్కడైనా ఒక దగ్గర పెట్టు మారుస్తూ ఉంటే కన్ఫ్యూజ్ అవుతుంది. ఒక్కోసారి నీకు దొరకవు నాకు దొరకవు'' చిరాగ్గా చెప్పింది.
జ్యూవెలరీ బ్యాగ్‌లో నుంచే తీసి అద్దంలో చూసుకుంటూ ముస్తాబ్ అవుతున్న హీరోయిన్‌కి చెవి కమ్మలు ఇచ్చాడు.
''జాకెట్ త్రెడ్స్ ముడివేయి'' బొట్టు పెట్టుకుంటూ రాకేష్‌కు చెప్పడంతో ముడివేసి ''మేడం కాఫీ గానీ టీ గాని తెమ్మంటారా..'' అని అడిగాడు.
''నాకు ఇప్పుడేం వద్దు. ముందు షాట్లోకి వెళ్లాలి. నావల్లే లేట్ అయినట్టు బిల్డప్ ఇస్తూ డైరెక్టర్ సెటైర్స్ వేస్తాడు. అన్నీ సర్దేసి టచ్అప్ బ్యాగ్ వేసుకొని తొందరగా సీన్ జరిగే దగ్గరకు రా... ఫ్రూట్ బాస్కెట్లో జ్యూస్ ఉంది వచ్చేటప్పుడు తీసుకురా'' అని చెప్పి గదిలో నుంచి సీన్ జరిగే స్పాట్‌కి హీరోయిన్ వెళ్ళిపోయింది. అన్నీ సర్దేసి జ్యూస్ బాటిల్ పట్టుకొని టచ్అప్ బ్యాగ్ భుజాల మీద వేసుకొని హీరోయిన్ వెళ్లిన మూడు నిమిషాలకు షూటింగ్ జరిగే చోటుకి వెళ్ళాడు. హీరో హీరోయిన్‌కు అసిస్టెంట్ డైరెక్టర్ సీన్ ఎక్స్‌ప్లేన్ చేస్తుంది. అప్పుడే బాల్కనీలోకి వచ్చిన రాకేష్ డైరెక్టర్ కుర్చీ వెనకాల రెండు అడుగుల దూరంలో నిలబడి జ్యూస్ ఇవ్వాలా అని తన వైపు చూసే హీరోయిన్‌కి సైగ చేశాడు. వద్దని చేతితో చెప్పింది. ''ఎండకు మేకప్ ట్యాన్ అవుద్ది గొడుగు పట్టు రాకేష్'' అని చెప్పగానే టచ్అప్ బ్యాగ్ కుర్చీ మీద పెట్టి గొడుగు తేవడానికి రూమ్ వైపు కదిలాడు. అంతలోనే డైరెక్టర్ షాట్ రెడీ అనగానే అసిస్టెంట్ డైరెక్టర్ బ్యాక్‌గ్రౌండ్ క్లియర్ అని చెప్తూ డైరెక్టర్ కూర్చున్న చోటికి వచ్చి నిలబడింది. కెమెరామెన్ రోలింగ్ అనగానే డైరెక్టర్ రెడీ అన్నాడు సీన్ జరుగుతుంది. ప్రామ్టర్ ప్రామ్టింగ్ ఇస్తున్నాడు. హీరో డైలాగ్ చెప్తున్నాడు. రాకేష్ గొడుగు పట్టుకుని థర్డ్ ఫ్లోర్ బాల్కనీలోకి వచ్చాడు. అప్పుడే కట్ అని డైరెక్టర్ చెప్పడంతో జ్యూస్, గొడుగు పట్టుకుని హీరోయిన్ దగ్గరకు వచ్చి నిలబడి హీరోయిన్‌కి జ్యూస్ ఇచ్చి ఎండ తగలకుండా గొడుగు ఓపెన్ చేసి పట్టుకున్నాడు.
''హీరో మదర్ క్యారెక్టర్ ఎక్కడా?'' అని డైరెక్టర్ అడిగిన ప్రశ్నకు అసిస్టెంట్ డైరెక్టర్ ''చెప్పాను సార్, వస్తున్నట్టున్నారు.'' అని సమాధానం చెప్పేలోపే ''వచ్చేసా....!!'' అని ఎనర్జిటిక్‌గా ఎంట్రీ ఇచ్చింది మదర్ క్యారెక్టర్ నాగమణి.
అసిస్టెంట్ డైరెక్టర్ సీన్ ఎక్స్‌ప్లేన్ చేసి వెనక్కి వచ్చింది. జ్యూస్ బాటిల్ తీసుకొని రాకేష్ ఇంతకుముందు నిలుచున్న దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. ''రోలింగ్ సార్'' అని కెమెరామెన్ అనగానే ''రెడీ'' అని డైరెక్టర్ అనడంతో సీన్ స్టార్ట్ అయింది. తన వెనకాల నిలబడి ఉన్న లైట్ మ్యాన్స్, అసిస్టెంట్స్ మాట్లాడుకుంటుంటే సైలెంట్ అని డైరెక్టర్ అనడంతో అంతా నిశ్శబ్ధం... కేవలం ఆర్టిస్టుల డైలాగులు మాత్రమే వినిపిస్తున్నాయి. సీన్ అంతా అయిపోయిన తర్వాత కట్ చెప్పాడు. అసిస్టెంట్ డైరెక్టర్ని పిలిచి ''తర్వాతి సీన్ హీరోకు హీరో మదర్‌కు ఇంకా విలన్ క్యారెక్టర్‌కు ఎక్స్టీరియల్ ఉంది. వాళ్లకు డ్రస్ చేంజ్ చెప్పు'' అని డైరెక్టర్ అన్నాడు. సీన్ అయిపోయిన తర్వాత రూమ్‌లోకి వెళ్ళిన ఆర్టిస్టుల దగ్గరకు వచ్చి ''మీ ఇద్దరికి డ్రెస్ చేంజ్'' అని అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పింది.
''ఫ్రెష్ కాస్ట్యూమా లేక కంటిన్యూటీనా..'' నాగమణి డౌట్ ఫుల్ గా అడగడంతో, ''కంటిన్యూటి సీన్స్ లేవు ఈరోజంత మీకు ఫ్రెష్ కాస్ట్యూమ్సే ఉంటాయి.''
''నాకు ఇప్పుడు సీన్ లేదా?'' అని హీరోయిన్ అడిగినదానికి
''ప్రెసెంట్ ఎక్స్టీరియల్ సీన్ ఉంది. అది అయిపోయిన తర్వాత మీకు ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు.. నేను వచ్చి చెప్తాను.'' అనేసి అసిస్టెంట్ డైరెక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
''మేడం తొమ్మిది నలభై అవుతుంది. టిఫిన్ చేసేసి రానా..'' అని రాకేష్ అడిగితే ''అయ్యో..!! ఇంకా తినలేదా తొందరగా తినేసి వచ్చేటప్పుడు టీ పట్టుకొని రా...''
''సరే మేడం'' అనేసి టిఫిన్ చేయడానికి వెళ్ళాడు.
రాకేష్ టిఫిన్ వడ్డించే చోటుకి వెళ్లిన తర్వాత అక్కడ నలభై సంవత్సరాలు పైబడిన వ్యక్తి అతన్ని చూసి ''ఏంటి ఇవాళ ఆలస్యమైనట్టుంది.''
''ఈ రోజు హీరోయిన్ ఫస్ట్ సీన్లోనే ఉండడం వల్ల ఆ సీన్ అయిపోయి కట్ చెప్పేసరికి ఇంత టైం అయింది.'' ప్లేట్లోకి ఇడ్లీ వేసుకుంటూ చెప్పాడు.
''అవునా... పదవడానికి వచ్చింది. ఈ టైం వరకు టిఫిన్ ఉండడం కష్టం. నీ అదృష్టమాని ఈరోజు టిఫిన్ ఉంది. ఎప్పుడైనా తొందరగా రావడానికి ప్రయత్నించు.'' అని చెప్పేసి మధ్యాహ్నం కోసం సాంబార్‌లోకి సోరకాయ కట్ చేయడం మొదలుపెట్టాడు. ''సరే బాబాయ్..'' అని వడ, చట్నీ వేసుకొని కుర్చీలో కూర్చోని తింటూ మదర్ క్యారెక్టర్ నాగమణి చెప్పిన మాట గుర్తొచ్చేసరికి ఫోన్ తీసి తన ఫ్రెండ్ వరుణ్‌కి ఫోన్ చేశాడు. ఫోన్ లిఫ్ట్ అవడంతో ''హలో వరుణ్ రేపు షూటింగ్ ఉంది. ఎవరైనా అమ్మాయి అసిస్టెంట్‌గా ఉంటే చెప్పు.. నేను ఈ రోజు వచ్చిన షూటింగ్లో మదర్ క్యారెక్టర్ చేసే మేడంకు వచ్చిన అసిస్టెంట్ రేపు రావడం లేదు. సో రేపటి కోసం కావాలి.'' అని అన్నాడు.
''సరే రాకేష్.. మాలిని అనే అమ్మాయి అసిస్టెంట్‌గా వెళ్తూంటుంది. ఆ అమ్మాయి మార్నింగ్ ఫోన్ చేసి అడిగింది. ఖాళీగా ఉంటున్నాను అన్న, ఏదైనా షూటింగ్ ఉంటే చెప్పండని.. నేను నీ నెంబర్ తనకు ఫార్వర్డ్ చేస్తాను. ఆ అమ్మాయే నీకు ఫోన్ చేస్తుంది.'' అని ఫోన్ పెట్టేసాడు. రాకేష్ టిఫిన్ చేసేసి టీ పట్టుకొని హీరోయిన్‌కి తీసుకెళ్లాడు...
రూంలోకి అడుగుపెడుతూనే మేకప్ రిమూవ్ చేస్తున్న హిరోయిన్ని చూసి ''ఏంటి మేడం, మేకప్ రిమూవ్ చేస్తున్నారు. షూటింగ్ అయిపోయిందా...!!'' టీ కుర్చీ మీద పెడుతూ అడిగాడు.
''హా... రాకేష్ ఇంతకుముందే అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి ఈ రోజు మీరున్న సీన్స్ అయిపోయాయి. ఇంకా రైటర్ గారు సీన్స్ పంపించలేదు. మీకు మాత్రమే షూటింగ్ అయిపోయిందని చెప్పి వెళ్ళింది. క్యాబ్ బుక్ చేశాను. అది వచ్చేలోపు తొందరగా అన్నీ సర్దేసి బ్యాగ్‌లో పెట్టు... చెప్పడం మర్చిపోయాను రేపు మనకు షూటింగ్ లేదు. కేవలం హీరో, హీరో మదర్, విలన్ క్యారెక్టర్స్‌కి మాత్రమే ఉందట.... నీకు రేపు ఏదైనా షూటింగ్ వస్తే ఒప్పుకో సరేనా...'' మేకప్ రిమూవ్ చేయడం అయిపోయిన తరువాత టీ తాగుతూ హీరోయిన్ తన అసిస్టెంట్‌కి చెప్పింది.
అంతా వింటూ లగేజ్ సర్దుతున్న రాకేష్ ''సరే మేడం..'' అన్నాడు.
''క్యాబ్ వచ్చినట్టుంది. లగేజ్ తీసుకెళ్లి క్యాబ్‌లో పెట్టు..'' అని జడ ముడి వేసుకొని హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని హీరోయిన్ బయటకి వచ్చింది.
రేపు ఏదైనా షూటింగ్ దొరుకుతుందా లేక జూనియర్ ఆర్టిస్ట్‌గా వెళ్ళనా అని ఆలోచిస్తూ రాకేష్ లగేజ్ పట్టుకొని క్యాబ్ దగ్గరికి వచ్చి డ్రైవర్‌తో డిక్కీ ఓపెన్ చేయించి అందులో లగేజ్ పెట్టి డ్రైవర్ పక్కన ఉన్న సీట్లో కూర్చుంటే వెనకాల సీట్లో హీరోయిన్ కూర్చోని ఫోన్ మాట్లాడుతుంది. డ్రైవర్ కార్ స్టార్ట్ చేశాడు.
వర్తమానంలో ఉండి రేపటి గురించి ఆలోచిస్తున్న రాకేష్‌కు తెలియకుండానే కాలం గడిచిపోయింది. కాలంతో పాటుగా కిలోమీటర్లు తగ్గిపోయి తాను దిగే స్టాప్ వచ్చేసింది. తాను దిగే స్టాప్ వచ్చిందని చూసి తెలుసుకొని, క్యాబ్ డ్రైవర్ని పక్కన ఆపమని చెప్పాడు. కారు దిగుతున్న సమయంలో హిరోయిన్ ఫోన్ మాట్లాడడం ఆపి ''రాకేష్ నేను నీకు అమౌంట్ ఫోన్ పే చేస్తాను.'' అని చెప్పేసి మళ్లీ ఫోన్ మాట్లాడడం మొదలు పెట్టింది. క్యాబ్ అక్కడ నుంచి మొబైల్లో చూపించే లొకేషన్ వైపుగా కదిలింది. రాకేష్ కృష్ణానగర్ దగ్గర దిగి నడుచుకుంటూ తన రూమ్ పైపుగా వెళుతుంటే ఫోన్ రింగ్ అయింది. చూసేసరికి కొత్త నెంబర్... ఫోన్ లిఫ్ట్ చేసి ''హలో ఎవరూ...??'' అని అడిగితే ఎదుటి వైపు నుంచి '' హాయ్... నా పేరు మాలిని, రేపు షూటింగ్ ఉందని చెప్పి వరుణ్ అన్న మీ నెంబర్ ఇచ్చారు. ఆ కారణంతో ఫోన్ చేసాను.''
''హా... 9:50 కి ఫోన్ చేసి వరుణ్‌కి చెప్పాను. నేను నీకు నాగమణి గారి నెంబర్ ఫార్వర్డ్ చేస్తాను. ఫోన్ చెయ్.''
''సరే...'' అని చెప్పి ఫోన్ పెట్టేసింది.
******
మదర్ క్యారెక్టర్ నాగమణి నెంబర్ రాకేష్ మాలినికి పంపిన తర్వాత మాలిని ఫోన్ చేసి ''నమస్కారం మేడం నా పేరు మాలిని మీ నెంబర్ రాకేష్ ఇచ్చాడు''.
''హా.. రేపు షూటింగ్ ఉంది. నువ్వు ఉండేది ఎక్కడా?''
''కష్ణా నగర్లో ఉంటాను...''
''రేపు లొకేషన్ ఫిలింనగర్, నువ్వు ఇంద్రానగర్ గడ్డమీద మార్నింగ్ ఏడు గంటల వరకు ఉండు. నేను అదే దారి నుండి వస్తాను కాబట్టి నిన్ను పికప్ చేసుకుంటాను.''
''సరే మేడం..''
సూర్యోదయం అవుతుందని తెలియగానే మనుషులతో పాటుగా సహజీవనం చేసే పశుపక్షాదులు ఎలా కూటికోసం తమ అస్తిత్వం కోసం ఆహార వేటకు వెళ్తాయో అదే మాదిరి ఉదయం ఇంద్రానగర్ గడ్డమీద కూటికోసం తమ అస్తిత్వం కోసం తమ పిల్లల భవిష్యత్తు కోసం తమ అస్తిత్వాన్ని ప్రపంచానికి చాటే ఆశయంతో ఈ ప్రపంచంలో మార్పు తేవాలనే కోరికతో రంగురంగుల కలల ప్రపంచంలో తమ కళా ప్రదర్శనకు వెళ్లే ఆ సమూహంలో మాలిని కూడా నిలబడింది.
కారు కోసం ఎదురు చూసే మాలినిని చూసి నాగమణి డ్రైవర్‌కు పక్కన ఆపమని చెప్పింది. ఫోన్ చేసి నీ ముందున్న కారు దగ్గరికి వచ్చి డ్రైవర్ పక్క సీట్లో కూర్చోమని చెప్పడంతో అలానే వచ్చి కూర్చుంది. కారు బయలుదేరి కొద్ది సేపట్లోనే లొకేషన్లో ఆగిన తర్వాత లగేజ్ అంతా దించుకుని ప్రొడక్షన్ మేనేజర్ చెప్పడంతో ఆర్టిస్టులకు కేటాయించిన రూంలో లగేజ్ పెట్టి టచ్అప్ క్లాత్ క్లీన్ చేసి నాగమణికి ఇచ్చి నాగమణి టిఫిన్ చేయమని మాలినికి చెప్పడంతో టిఫిన్ చేయడానికి వెళ్ళింది.
బయట నుంచి చూస్తే ఎవరికైనా అందమైన అద్దాల మేడనే కనబడుతుంది. లోపలికి వెళ్లి చూస్తేనే అర్థమవుతుంది. శారీరక శ్రమతో పాటు ఏసీ గదుల్లో మానసిక శ్రమ చేసేవాళ్ళు కూడా ఉంటారని... అద్దాలమేడ కట్టడానికి ఎంత మంది శ్రామికులు శ్రమ చేశారో ఆ భవనాన్ని పరిశీలిస్తే అర్థమవుతుంది. సినీ ప్రపంచం కూడా అంతే...
మాలిని దోస వేసుకునేటప్పుడు ప్రొడక్షన్ అతను చూసి ''ఆర్టిస్టా అమ్మ... ఆర్టిస్టులకు అక్కడ టిఫిన్ పెడుతున్నారు. అక్కడికి వెళ్లి కూర్చో వాళ్ళే వడ్డిస్తారు.'' అని ఆ వ్యక్తి చెప్పడంతో
''ఆర్టిస్ట్ కాదండి... మదర్ క్యారెక్టర్ చేసే నాగమణి గారి అసిస్టెంట్‌ని'' చట్నీ వేసుకొని వెళ్లి కుర్చీలో కూర్చుంది.
''అవునా... ఆర్టిస్ట్‌గా కనబడితేను అక్కడ టిఫిన్ చేయమని చెప్పా..''
''ఆర్టిస్ట్‌ని కాదు.. అలా అనుకున్నందుకు థాంక్యూ..'' అని చెప్పి టిఫిన్ తినేసి ఆర్టిస్ట్‌లు కూర్చున్న రూం వైపు వెళ్ళిపోయింది.
''టిఫిన్ చేసావా మాలిని..'' మేకప్ వేసుకుంటూ నాగమణి అడగడంతో చేశానని చెప్పింది.
''మీకు టిఫిన్ కానీ టీగాని తెమ్మంటారా మేడం''
''నేను ఇంట్లోనే టిఫిన్ చేసేసాను. నాకు ఇప్పుడు టిఫిన్ ఏం వద్దు. బాస్కెట్లో రాగి జావ ఉంది. ఎనిమిదిన్నర వరకు అలా ఇవ్వు... హెయిర్ డ్రెస్సర్ హెయిర్ డ్రెస్సింగ్ చేసేలోపు బెడ్ మీద ఉంచిన కంటిన్యూటి సారీని ఐరన్ చేయించుకుని రా...''
''సరే.. మేడం.'' అనేసి అక్కడి నుంచి వెళ్లి కాస్ట్యూమర్తో ఐరన్ చేయించి తెచ్చి నాగమణికి ఇవ్వడంతో డ్రెస్ చేంజ్ చేసుకొని షార్ట్‌లోకి వెళ్ళింది. వరుసగా సీన్లు ఉండటంతో ఆఫ్టర్నూన్ వితౌట్ బ్రేక్తోనే షూటింగ్ చేశారు. ఖాళీగా ఉన్నవాళ్లు లంచ్ చేసేసుకొని మళ్లీ వర్క్ స్టార్ట్ చేశారు.
రాత్రి 9గంటల సమయంలో సీన్లన్నీ అయిపోయిన తర్వాత డైరెక్టర్ ప్యాకప్ చెప్పడంతో ఆరోజు షూటింగ్ అయిపోయింది. ప్యాకప్ చెప్పిన పదిహేను నిమిషాల తర్వాత డైరెక్టర్ నేరుగా నాగమణి దగ్గరికి వచ్చి ''ఇలాంటి అసిస్టెంట్లని తెచ్చుకుంటారేంటండి... రేపటి నుంచి ఇవాళ వచ్చిన మీ అసిస్టెంట్‌ని అసిస్టెంట్‌గా అసలు తేవద్దు.'' చిరు కోపాన్ని నటిస్తూ అన్నాడు.
ఒకటే సారి షాక్‌కు గురై మాలిని ఏమైనా తప్పు చేసిందాని ఆలోచిస్తూనే కంగారు పడుతూ ''ఎందుకు... ఏమయింది ఆ అమ్మాయి ఏమైనా తప్పు చేసిందా..!!!'' అని అడగడంతో... చిన్నగా నవ్వి ''మన సీరియల్లో న్యూ జనరేషన్ మొదలవబోతుంది. అందులో హీరోయిన్గా చేయడానికి 18 సంవత్సరాల అమ్మాయి కావాలి.. నిన్నటి వరకు ఆడిషన్స్ జరిగాయి. ఎవరూ దొరకలేదు. మీ అసిస్టెంట్‌లో హీరోయిన్ లక్షణాలు ఉన్నాయి. ఈ అమ్మాయి ఆ పాత్రకు సరిపోతుంది కాబట్టి ఆర్టిస్ట్‌గా తీసుకుందామని అనుకుంటున్నాము. ప్రొడ్యూసర్‌తో కూడా మాట్లాడాను. ఆయన కూడా సరేనని అన్నారు.''
''ఏదో ఆ అమ్మాయి తప్పు చేసినట్టుగా ఇలాంటి అసిస్టెంట్లని తెస్తారేంటని అనేసరికి భయపడిపోయాను. ఆ అమ్మాయి ఆర్టిస్ట్ అవుతుందంటే చాలా సంతోషం... ఇండైరెక్ట్లీ నా వల్ల ఆ అమ్మాయి మంచి స్థాయికి వస్తుందంటే నేనెందుకు రేపటి నుంచి ఆ అమ్మాయిని అసిస్టెంట్‌గా తెచ్చుకుంటాను. ఆ అమ్మాయికి ఈ విషయం చెప్తాను.'' అని చిరుజల్లు లాంటి చిరుమందహాసంతో డైరెక్టర్‌కి చెప్పింది.
డైరెక్టర్ వెళ్లిన మూడు నిమిషాలకు మాలిని నాగమణి దగ్గరికి వచ్చి ''క్యాబ్‌లో లగేజ్ పెట్టేసాను మేడం...''
''గుడ్... పద వెళ్దాం...'' అని ఇద్దరు వెళ్లి క్యాబ్‌లో కూర్చున్నారు. క్యాబ్ స్టార్ట్ అయింది.
''కంగ్రాట్స్ మాలిని... ఈ తెలుగు ప్రపంచం త్వరలో నిన్ను హీరోయిన్గా చూడబోతుంది.''
''మీరు చెప్పేది అర్థం కాలేదు.''
''డైరెక్టర్ గారు వచ్చి రేపటి నుంచి నిన్ను అసిస్టెంట్‌గా తీసుకు రావద్దని అన్నారు. ఎందుకని అడిగితే సీరియల్లో నెక్స్ట్ జనరేషన్ స్టార్ట్ అవుతుందటా అందులో నిన్ను హీరోయిన్గా తీసుకుంటున్నామని అన్నారు.''
పైకి కనబడకుండా సంతోషాన్ని హృదయంలోనే ఉంచుకొని ''అవునా... మేడం.''
''అవును... మాలిని. ఆల్ ది బెస్ట్... కొందరు ఎప్పుడూ ఎదుటి వ్యక్తిలలో తప్పులనే చూస్తుంటారు. ఆ తప్పులను వెలెత్తి చూపుతూ ట్రోల్ చేస్తూ మానసికంగా బాధ పెడుతుంటారు. ఇంకొందరు ఎలాగైనా ఒక వ్యక్తిని అన్ని విధాలుగా మభ్యపెట్టి లోబరుచుకోవాలని గుంట నక్కల్లా ఎదురు చూస్తుంటారు. సినీ పరిశ్రమలో కెరీర్ బిగినింగప్పుడు కొందరు హీరోయిన్స్ ఎక్కువగా ఇటువంటి ఇబ్బందులకు గురవుతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండు. పొగడ్తలకు పొంగిపోయి అవమానాలకు బాధపడకు.. ప్రతీదానికి ముగింపు ఉంటుంది. ఆ ముగింపు కొత్త ఆరంభానికి పునాది వేస్తుంది. నీకు డైరెక్టర్ నెంబర్ డైరెక్టర్‌కు నీ నెంబర్ ఫార్వర్డ్ చేస్తాను. అమౌంట్ నీ అకౌంట్లో వేస్తాను.''
''సరే మేడం, థాంక్యూ...'' అని చెప్పి తన లొకేషన్ రావడంతో కారు దిగింది.
ఆర్టిస్ట్ నాగమణి ఇంటివైపు కారు కదిలింది.
- సయ్యద్ ముజాహిద్ అలీ
Sun 18 Sep 04:38:22.990866 2022