నాయిన్నీ శానాసార్లడిగిన. ఎన్ని సార్లడిగిన సుతా గదే సమాధానం.
''పెద్ద బతుకమ్మదే ముందిరా? పెద్ద బతుకమ్మా? కాదా? అని కాదు. పెద్ద మనసుతో పేర్చిన చిన్న బతుకమ్మయినా ఆ గౌరమ్మ తల్లి దీవెనలుంటాయి''. కల్లు ముంతకు ఉగ్గం కట్టుకుంట అన్నడు నాయిన.
బతుకమ్మ పేర్చుతున్న అమ్మ సుతా ''అయినా మనసుంటోళ్లు గంత పెద్దబతుకమ్మ పేర్సితే హెచ్చులను కుంటర్రా ఊళ్లే. పెద్దోళ్లకే పెద్ద బతుకమ్మ పేర్చే అర్హతలుంటరు'' అన్నది.
అసలు విషయం అర్థంకాక మనసు మరింత కలుక్కుమన్నది. తంగేడు పూలను గుత్తులు గుత్తులుగా కూర్చి అమ్మ చేతికందిస్తున్న సుజాతక్క కూడా అదే మాటకు వంత పాడుతున్నది. లోపలమాత్రం గంత పెద్ద బతుకమ్మను ఎత్తుకుని వీధుల్లో బయలుదేరి పోతుంటే ఊరంతా ఆ బతుకమ్మ వైపు ఒకింత ఆశ్చర్యంగా, అద్భుతంగా చూస్తుంటే కట్టుకున్న కొత్త పట్టు చీర అందాన్ని పొగుడుతున్నప్పటి కన్నా ఎంతో గర్వంగా వుంటదిరా తమ్ముడూ'' పొద్దున్నే నాయిన నేను పూల కోసం అడవికెళ్లేటపుడు అన్న మాటలు గుర్తొచ్చి అక్కకేసి చూసిన.
చటుక్కున కళ్లు దించుకుని ఇంకో పూల గుచ్ఛం అమ్మకందిస్తూ చూడనట్లు నటించింది. కల్లు పటువకు ఉగ్గం కట్టటం పూర్తయింది. తలెత్తి అమ్మ పేర్చుతున్న బతుకమ్మకేసి తదేకంగా చూస్తుండు నాయిన. నేను కూడా మోకాళ్ల మీద ఈతాకు చాప మీద గొంతుక్కూర్చుకుని సోంపూలను గిన్నెలో వున్న రకరకాల రంగుల్లో ముంచి పక్కన ఒద్దికగా పెడుతున్న.
''గునుగు పూలు కొద్దిగ తగ్గినట్టున్నయి కదయ్యా'' అంటూ గోనె సంచి బోర్లా వేసింది అమ్మ.
''నేనూ గూడా తెచ్చిన కదా. అయి సుతా ఐపోయినయా?'' అంటూ అటూ ఇటూ చూసిన.
''ఆ బల్లపీట కింది సంచోటి కనిపిస్తుంది సూడు. తీసుక రాపోయే సుజీ'' అమ్మనేసరికి అక్కెళ్లి సంచి తెచ్చిచ్చింది.
అమ్మ కుమ్మరించి, ''నాయిన దెచ్చినయి, తమ్ముడి దెచ్చినయి కలిపితే సరిపోతయిలే'' అంటూ గునుగు పూలను పేర్చి ''నువ్వా రంగు డబ్బాలో వీటిని ముంచి నా చేతికియ్యవే సుజీ'' అన్నది.
తంగేడు పూలవరుస పేర్చడం అయింతర్వాత ఒక వరుస సోంపుల రంగుల వరుస అయింతరువాత, గునుగుపూలను వరుసల్లో సర్దుతోంది అమ్మ. పొద్దున్నే మా దోస్తులతో కలిసి అడవిల తంగేడు పూలతో కలిపి రకరకాల పూలను సేకరిస్తున్నపుడు కలిగిన ఆనందం కంటే అమ్మ బతుకమ్మ పేరుస్తున్నపుడు చూస్తుంటే కలిగే ఆనందం ఎన్నో రెట్లు గొప్పగా వుంటది. బతుకమ్మ క్రమక్రమంగా రకరకాల పూలను అలంకరించుకుంటూ శంఖాకారంలో అమ్మ చేతుల్లో ప్రాణం పోసుకుని పెద్దదవుతోంది. మేమేదో పిల్లలం సరదాకొద్దీ అదో ఇదో పువ్వు దొరికినకాడికి సేకరించుకొచ్చినం గానీ అంత పెద్ద బతుకమ్మను అంతందంగా అమ్మ తీర్చిదిద్దుతుందంటే దాని వెనుక ముడి సరుకు సేకరణ కష్టమంతా నాయినదే.
ఏగిలివారంగ నాలుగ్గంటలకో ఏమో నాయిన ఒక ఖాళీ యూరియా సంచి తీసుకుని అడవి బాట పట్టిండు. కలవరంతో నిద్ర లేచిన నాకు పక్కనే బల్ల పీఠ మీద నాయిన కనిపించకపోయేసరికి అమ్మనడిగిన.
''వనంలోకి పొద్దుగాల పోతెనే పూలు దొరుకుతయిరా. నీలెక్క తీరుబాటుగ నాయిన కూడా పొద్దెక్కిందాక పడుకుంటే ఇగ బతుకమ్మ పేర్చినట్టే!'' చేతులతో పూలను కుదురుగా అన్ని వైపులా తడుతూ మెల్లగా నవ్వుతోంది అమ్మ.
అంతెత్తు లేచి నిలబడి గోపురంలా హాయిగా నవ్వుతున్న పసుపు పచ్చని అలలా వుంది బతుకమ్మ. రంగు రంగుల పగడాలు నీళ్ల మీద తరలి వచ్చి అలల ఆసరాతో ఒడ్డున పేరుకుపోయినట్టు నిలువెత్తు పసుప్పూల గుట్ట చుట్టూ అంచుల్లో రకరకాల రంగు పూలు కనిపిస్తూ ఆకాశంలోని ఇంద్రధనుస్సును చుట్టూ చుట్టలు చుట్టినట్టుగా బతుకమ్మ అందం మరింత మెరుపులీనుతోంది. చూస్తున్న నాయిన కళ్లల్లో పసుప్పూల వెలుగు పరుచుకుంది.
''ఏదేమైనా బతుకమ్మ పేర్వాలంటే నీ తరువాతేనా ఎవరైనా.'' నాయిన మాటతో అమ్మ ముఖం అందంగా ముస్తాబైన అచ్చ తెనుగు బతుకమ్మలా వెలిగిపోయింది.
సుజాతక్క కళ్లలోనూ అదే పసుపు మెరుపు. సాయంత్రం తన చేతుల మీదేగా బతుకమ్మనూరేగించేది అన్న గర్వం కించిత్తు తొంగి చూస్తూ. అంతలోనే సన్నని కన్నీటి పొరేదో కళ్లల్లో తంగేడు పుప్పొడిలా గోచరించగానే కళ్లు తుడుస్తూ మరో చేత్తో కాంవంచ పూల కట్టను అమ్మ చేతికందిస్తోంది సుజాతక్క. అక్క దిగులు తాలూకూ సన్నని పొరేదో నా ముఖంలోనూ ప్రతిఫలించినట్టుంది.
''నువ్వెందుకురా దిగులు పడుతున్నవ్. బతుకమ్మ ఎంతుంటె నీకేందిరా? నువ్వేమైనా ఆడపిల్లవా? బతుకమ్మను మోసుకెళతవా? నువ్వు పెద్దయినంక పేద్ద బతుకమ్మ పేరిపిద్దువులే అదీ అమ్మతోనే. పేర్చి, మీ ఆవిడ చేతులతో ఊరేగిద్దువుగానీ.'' నాయిన అన్న మాటలతో బతుకమ్మ కేసి చూసిన. బతుకమ్మను చాలా అందంగా పేర్చింది అమ్మ. గంత పెద్ద బతుకమ్మ సుజాతక్క చేతిలో పట్టుకుని వీధిలో నడుస్తుంటే ఎంత గొప్పగా వుంటది. ప్చ్! అదృష్టం లేదాయే. ఎప్పటిలాగనె అక్క చేతిలో గా చిన్న బతుకమ్మే వుంటది. అందుకే అక్క కళ్లల్లోనూ ఆ నీటి పొర. నాకైతే నీటి పొరకన్నా ఎర్ర జీర పొడుచుకొస్తోంది కళ్లల్లో. పాపం అమ్మేం చేస్తది. అందంగా అంతెత్తున బతుకమ్మను పేర్చటం వరకే తన పని. నాయినేం చేస్తాడు మా ఊరి తంగెడమ్మ గుట్టంత పెద్ద బతుకమ్మను పేర్చటానికి కావలసినంత పువ్వును గొడ్డోలే చాకిరీ చెసి సేకరించి తెస్తడు. కానీ ఆ బతుకమ్మ మాత్రం మా చేతుల్ల వుండదు. నా మనసులో మాట అర్థం చేసుకుందనుకుంట అమ్మ.
''నాయినన్నట్లు నువ్వు పెద్దోడివై ఉద్యోగం సంపాదించినపుడు పెద్ద బతుకమ్మ పేర్పిద్దువులేరా. అక్కను ఆనందపెడుదువులే. ఇప్పుడు ఈ చిన్న బతుకమ్మతోనే సరిపెట్టుకోవాలే తప్పదు.''
ఆ రోజు సాయంత్రం ఊళ్లో నుంచి బతుకమ్మలు ఆ ఇంద్రధనుస్సు నేలకు దిగొచ్చి ఊరి బయటికి బాట పట్టిందాన్నట్లు తీరొక్క పూలతో రకరకాల సైజుల్లో పేర్చిన రంగు రంగుల బతుకమ్మలు చేత్తో పట్టుకుని పట్టు చీరల్లో పరువాల అమ్మలు వీధుల్లోంచి బారులు తీరి వెళుతుంటే కళ్ల పండుగగా వుంది. కానీ అక్క కళ్లల్లో మాత్రం కన్నీటి పొర అడ్డుపడి తోవ మసమసగ్గా తోచింది. నా కళ్లల్లో ఎర్ర జీర అడ్డుపడి కోపం బతుకమ్మల మీద ముట్టించిన ఊదు కడ్డీల చివర మెరుస్తున్న నిప్పు కణికలా వుండి అగరు ధూపంలా వ్యాపిస్తోంది. మిగతా అమ్మలక్కలతో ముచ్చట్లలో మునిగి అమ్మ నడిచొస్తోంది. నేనూ నాయిన ఆడపిల్లలకు దారి చూపిస్తూ డప్పు చప్పుళ్లతోటి ఆటాడే బతుకమ్మ బండకాడికి చేరుకున్నం. దారి పొడవునా ఊరోళ్ల కళ్లన్నీ పటేలమ్మ చేతులున్న బతుకమ్మ నీదనే వాలినయి. మెరుపులీనే రంగులతో నిలువెత్తు గుడి గోపురంలా దర్శనమిస్తోంది. ఊరంతా పటేలమ్మ చేతిలోని బతుకమ్మను ప్రశంసలతో ముంచెత్తుతుంటే పటేలమ్మ ముఖం పున్నమి చంద్రుడిలా వెలిగిపోతోంది. ప్రతియేటా ఊళ్లోకల్లా పెద్ద బతుకమ్మ పటేలమ్మదే. ఎట్లా పేర్చుతారో ఎవరితోనైనా పేర్పిస్తారో తెలియదుగానీ, బతుకమ్మంటే పటేలమ్మదే ఆ దర్పం ఆ అందం ఆ పూల అమరిక ఓహ్! పటేలమ్మ చేతుల్లోని ఆ బతుకమ్మను చూస్తే జన్మ తరించినట్టే.
''మన సూదరోళ్లమూ వున్నామెందుకూ? ఎప్పుడన్నా గంత పెద్ద బతుకమ్మ పేర్చి గర్వంగా తలెత్తగలమా? ఆ మాటకొస్తే ఇక మా వాడ బతుకమ్మలైతే అసలే ఆ భాగ్యంలేదు. బతుకమ్మలే మార్చుకోలేనోళ్లం, ఇక మన బతుకులేం మారుతరు?'' పక్కనే నడుస్తున్న నా స్నేహితుడు యాదగిరిగాని మాటలు మా అక్క చెవిలో కూడా పడ్డట్టున్నాయి. ఆ మాటలకు దూరంగా వడి వడిగా అడుగులేస్తూ సూదరోళ్ల బండకాడికి చేరిపోయింది. మా వాడకట్టు బతుకమ్మలతో నడుస్తున్నానన్న మాటే కానీ నా కళ్లు కూడా పటేలమ్మ బతుకమ్మ చుట్టే తిరుగుతున్నాయి. ఎట్లాగైనా ఈ ఏడాదయినా అమ్మతో అంత పెద్ద బతుకమ్మ పేర్పించి అక్క చేతుల మీద ఊరేగుతుంటే చూద్దామన్న ఆశ నీరు గారిపోయింది.
మా కులపోళ్లంతా ప్రతి ఏటా మేమాడే బండ మీద బతుకమ్మలు పెట్టి నిరీక్షిస్తున్నరు. నాయిన చెరువులోంచి కొంత బంక మట్టి తెచ్చి బండ మీద పెట్టి దానిలో వెంపలి చెట్టును గుచ్చి అమర్చాడు. ఆ తరువాత పడచులంతా తమ చేతుల్లోని బతుకమ్మలని ఆ వెంపలి చెట్టు చుట్టూతా బండ మీద పొందికగా పెట్టిండ్రు.
సుజాతక్క బతుకమ్మ పాటందుకుంది. ''ఒక్కేసి పువ్వేసి చందమామ, ఒక్క జామూ ఆయే చందమామ. రెండేసి పూలేసి చందమామ, రెండు జామూలాయే చందమామ.'' అక్క గొంతుతో శృతి కలుపుతూ మిగతా ఆడపడచులందరూ పాడుకుంటూ చప్పట్లతో బతుకమ్మల చుట్టూ చుట్టు కాముడేస్తున్నరు.
నా మనసంతా పటేండ్ల బతుకమ్మల మీదనే వుంది. ముఖ్యంగా మా పక్కింటి పటేలమ్మ చేతుల్లోని పెద్ద బతుకమ్మ మీదనే వుంది. అందుకే నేను పటేలమ్మలాడుతున్న బతుకమ్మలకాడికి పోయి చూస్తున్నా. నాతో పాటు యాదగిరిగాడు, ఇంకొందరు దోస్తులు చేరి పటేలమ్మల బతుకమ్మల వైభోగాన్ని కళ్లార్పకుండా చూస్తున్నం. బండ మీద బతుకమ్మలతో పోటెత్తిన రంగుల సముద్రంలా వుంది. చుట్టూ ఎగురుతున్న రంగురంగుల సీతాకోకల్లా పట్టు చీరల్లో పటేలమ్మలు బతుకమ్మాడుతుంటే ఆ దివి నుంచి దేవతలు దిగొచ్చి ఆడుతున్నట్టే వుంది. సుమారు ఓ అరవైదాకా కొలుదీరిన ఆ బతుకమ్మలన్నిటిలోకల్లా అమ్మ పేర్చిన పటేలమ్మ బతుకమ్మే గుడి గోపురంలా తలెత్తుకుని గర్వంగా నిలబడినట్టు కనిపిస్తోంది. మా కులపోళ్ల బండ మీద దర్పాన్ని ఒలక బోయాల్సిన బతుకమ్మ పటేండ్ల బండ మీద వుండటమే నా బాధకైనా మా అక్క బాధకైనా అసలు కారణం.
ప్రతి ఏటా జరిగే తంతే ఇది. నాయినేమో చెమటోడ్చి బండెడుపూలు సేకరించి తెస్తాడు. అమ్మేమో అలుపెరుగకుండా అంత పెద్ద బతుకమ్మను శ్రమ తెలియకుండా ఇష్టంగా పేర్చుతుంది. పెద్ద బతుకమ్మ పెద్ద పటేలమ్మ చేతుల్లో వాలిపోతుంది. శ్రమంతా మాది బతుకమ్మ దర్పంతో వచ్చిన ప్రశంసలన్నీ పటేండ్లయి. దీనికి స్వస్తి చెప్పాలనని నేను తలుచుకోని పండుగ రోజు లేదు. సంవత్సరాలు గడిచి పోతూనే వున్నాయి.
బతుకమ్మ పండగొచ్చిన ప్రతిసారి, నాయిన పూలు తేవటం, అమ్మ బతుకమ్మను పేరవటం పటేలమ్మదే పెద్ద బతుకమ్మని ఊరంతా ప్రశంసలతో ముంచెత్తి సంబరపడటం పరిపాటైంది. ఈ ఏడాదెలాగైనా మా ఊళ్లోకల్లా పెద్ద బతుకమ్మ మాదే కావాలని నేను కాయుష్షు పడటం, నిరాశ చెందటమూ అలవాటైంది.
పూలు తెచ్చేది మేము, అందంగా బతుకమ్మను పేర్చేది మేము. అయినా మా బతుకుల్లాగే మా బతుకమ్మలెప్పుడూ చిన్నవే. దీనికి స్వస్తి పలకి తీరాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. ఈ సంవత్సరమెట్లాగైనా మా బతుకమ్మే పెద్దగుండాలె. ఊళ్లో అందరూ ముఖ్యంగా పటేండ్లందరూ మా బతుకమ్మను చూసి ''సూదరోళ్లు ఎదిగిపోయిండ్రా'' అని ముక్కు మీద వేలేసుకుని చూడాలె అనుకున్నా.
ఎప్పటిలాగే పెద్ద బతుకమ్మ కోసం నేను కన్న కలలన్నీ కాలి బూడిదైనరు. ఈ సంవత్సరం పండుగే లేకుంటా పోయింది. ఊళ్లోనే అంత పెద్ద బతుకమ్మను అందంగా పేర్చిచ్చే అమ్మే లేకుండా పోయింది. కానీ పోతూపోతూ అమ్మ సుజాతక్కకిచ్చిన కళ ఆమె చేతుల్లో బతికే వుంది. ఈసారి చిన్న బతుకమ్మ కూడా పేర్చుకోలేని బతుకులైనయి మావి.
అక్క ఎప్పటిలాగే అమ్మ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని పక్కింటి పటేలమ్మకు పెద్ద బతుకమ్మను పేర్చి ఇచ్చింది. మల్లా ఊళ్లకల్లా పెద్ద బతుకమ్మ పేరు పటేండ్లకే మిగిలిపోయింది.
మరుసటేడాది మళ్లీ పండగ దగ్గరపడుతోంది. ఈసారి పండగ జరుపుకునే అవకాశం వస్తుంది. అమ్మ కోరుకున్నట్లు గానే నాకు ఉద్యోగమొచ్చింది. పిల్లాపాపలతో పట్నంలో మంచి జీతంతో మంచి జీవితమే. ఊరుతో పాటూ ఊళ్లోని పద్ధతులూ మారినయి. ముఖ్యంగా బతుకమ్మ రూపం మరింత మారిపోయింది. రకరకాల రంగులు, కొత్త కొత్త పువ్వులు, కృత్రిమ రంగులతో అవే పూలు సరికొత్త అందాలను సంతరించుకుని బతుకమ్మలు గడిచిన రోజులకంటే మరింత అందంగా కొలువుదీరుతున్నాయి. ఎప్పుడూ లేనిది బతుకమ్మ పండుగ అభివృద్ధి చెందిన మీడియా వల్ల ప్రపంచానికే పరిచయమైంది. అనేక పాటలు ఆటలు పెరిగిన సాంకేతికత వల్ల బతుకమ్మ పండుగకు మరింత శోభను చేకూర్చాయి. మా పటేండ్ల బతుకమ్మ రూపంతో పాటూ ఎత్తునూ మరింత పెంచుకుంది. మా వాడకట్టు బతుకమ్మలు మాత్రం మా బతుకుల్లాగే ఎదుగూబొదుగూ లేక అంతే పరిమాణంలో వుండిపోయినయి.
అందుకే దృఢంగా నిశ్చయించుకున్నాను. ఈసారెలాగైనా మా బతుకమ్మను మేమే ఊరేగించాలి. మా బతుకమ్మే పటేండ్ల బతుకమ్మ కంటే దర్పంగా మా బండమీదే కొలువు దీరాలి. మా పూలు మేమే తెచ్చుకుంటాం, మా బతుకమ్మను మేమే పేర్చుకుంటాం, మా బతుకమ్మే పెద్దదనే పేరు మేమే సాధించుకుంటాం. కాలంతో పాటు మా బతుకులు మారాలె. మా బతుకమ్మ మారాలె. మారాలె. మారాలె. మారాలె.''
''ఏమండీ! ఏమిటా కలవరింతలు. ఎప్పుడూ సమాజం మారాలె, సమాజం మారాలె. అంటూ వుంటారు. మీకీ మధ్య చాదస్తమెక్కువైనట్టుంది. సమాజం మారాలె అంటూ నిద్రలో కూడా కలవరిస్తున్నరు. లెగండి! ఏమైంది?'' శ్రీమతి మాటలతో దిగ్గున లేచి కూర్చున్నాను.
''ఏం లేదు జానూ! ఈసారి పండక్కి ఊళ్లో మన బతుకమ్మే పెద్దగా వుండాలి. మన బతుకమ్మ మారాలె. మన బతుకులు మారాలె.'' అని ఆలోచిస్తూ పడుకున్న.
మనోళ్లతో ఊళ్లే ఎంత పువ్వయినా తెప్పించి సుజాతక్కతో పెద్ద బతుకమ్మను పేర్పిస్తా. అమ్మా నాయిన బతికుండగా ఎన్నటికీ ఎదగని మన పుట్టంత బతుకమ్మను, మన ఊరి తంగేడు గుట్టంత పెంచేస్తా. సూదరోళ్ల బతుకులూ పటేండ్ల బతుకుల్లెక్క బాగానే ఎదిగినయని నిరూపిస్తా. ఊళ్లకల్లి మన బతుకమ్మను చూసి అందరూ కుళ్లు కోవాలి. పెద్ద బతుకమ్మ పేర్చి సంబరపడాలనే నా కోరిక ఈ పండుగతో తప్పక నెరవేరుతుందనే నా ఆశ. కాలం మారుతుంది జానూ. కాలంతో పాటూ మన బతుకులూమారుతయి. మారాలె.'' కాస్త గట్టిగానే అన్నాను
''బాగానే వుంది సంబరం. మీ కల నెరవేరినట్టే ఇక. మర్చిపోయారా? ఈ సారి కరోనా కరాళ నృత్యం వల్ల పండుగలన్నీ అటకెక్కినయన్న విషయం పూర్తిగా మర్చే పోయినట్టున్నారు. అందుకే పగటి కలలు కంటూ గడిపేస్తున్నారు. ఇంకెక్కడి పండుగండీ! ఇంకెక్కడి పెద్ద బతుకమ్మండీ ఊళ్లకు ఊళ్లు, నగరాలకు నగరాలుగా పెద్ద రోగమొచ్చి బతుకులే విలవిల్లాడిపోతుంటే మన బతుకులకిక బతుకమ్మలెక్కడివి. మన ఊరి ఆడపడుచులంతా ఆడి పాడి చెరువుల వేయక ముందే, గుండె చెరువులోనే గల్లంతయి పోయినయి. మీ పెద్ద బతుకమ్మ ఒక పెద్ద కలగానే మిగిలి పోతుందండీ.'' జానూ మాటలతో అసలు విషయమర్థమై ముఖానికి పట్టిన చెమటలు తుడుచుకున్నాను.
- చిత్తలూరి, 8247432521
Sun 02 Oct 00:25:15.735143 2022