Sun 23 Oct 05:21:45.16806 2022
Authorization
అడవిలో ఒక మామిడి చెట్టు విరగకాసింది. ఆ మామిడిపండ్ల కోసం ఆశతో కోతి అక్కడికి వెళ్లి వెంటనే ఆగిపోయింది. అందుకు కారణం ఆ చెట్టు మీద ఒక చిరుత పులి ఉంది. వెంటనే కోతి ప్రాణభయంతో కిందకు దూకి ఒక ముళ్లకంప మధ్యలో దూకి ఆగింది. ఆ చిరుత పులి వెంటనే కిందకు దూకి కాలి గాయం వల్ల అది ముళ్లకంప మధ్య లోనికి దూకలేక ఆగిపోయింది. అప్పుడు ఆ చిరుతపులి ''నేను కోతిపై దాడికి సిద్ధపడితే అంతదూరం దూకలేక ఆ ముళ్ళకంపలో పడి ముళ్ళు గుచ్చుకుని మరింతగా గాయపడడం ఖాయం'' అని అనుకొంది. ''కోతి ఎప్పుడు ముళ్లకంప నుండి బయటకు వస్తుందా!'' అని చిరుతపులి ఎదురుచూడ సాగింది. ''ఆ చిరుత పులి ఎప్పుడు వెళుతుందా! ఎప్పుడు మామిడి పళ్ళు తిందామా!'' అని కోతి ఎదురుచూస్తున్నది.
ఆ మామిడి చెట్టు పక్కనే కొద్ది దూరంలో ఒక మర్రిచెట్టు ఉంది. ఆ చెట్టు పైన ఒక కాకి తన పిల్లలతో నివసిస్తోంది. ''కాకి ఆహారం కొరకు ఎప్పుడు వెళ్తుందా! ఎప్పుడు దాని పిల్లలను తిందామా!'' అని ఆ మర్రి చెట్టు కింద పుట్టలోని ఒక పాము ఎదురు చూస్తుంది. ఇంతలో ఆ కాకి అక్కడి నుండి ఆహారం కొరకు వెళ్ళిపోయింది. పాము సంతోషంతో ఆ చెట్టును ఎక్కడానికి పుట్ట బయటకు వచ్చింది. ఇంతలో ఎక్కడి నుంచో ఒక ముంగీస అక్కడికి వచ్చింది. దాన్ని చూసిన పాము భయపడి ముంగీసను తిట్టుకుంటూ తిరిగి పుట్టలోనికి వెళ్లిపోయింది. ఆ ముంగీస అక్కడనే పాము కోసం కదలకుండా ఉంది. అప్పుడే అక్కడికి ఒక కుందేలు వచ్చింది. ఏది దేనిపైన దాడి చేస్తుందో తెలుసు కోవాలని ఆసక్తిగా ఆ కుందేలు ఎదురుచూస్తూంది. ఇంతలో ఆకాశం మబ్బు పట్టి గాలి మొదలైంది. ఆ గాలిని, మబ్బును చూసిన ముంగీస ఇక పాము రాదని అక్కడి నుండి నిరాశతో వెళ్ళిపోయింది. ఆ కుందేలు ఇవన్నీ చూసి ''ఓ చిరుత మామా! కోతి కోసమే నీవు ఎదురు తచూస్తున్నావు. ఆ మామిడి పండ్లు తినాలని అది ఇచటనే ఎదురు చూస్తుంది. మీరు ఇద్దరు ఎక్కడికైనా వెళ్లి వేరే ఆహారం చూసుకొంటే బాగుంటుంది కదా!'' అని అంది. ఆ మాటలు విని చిరుత పులి, కోతి మౌనంగా ఉండిపోయాయి. చిరుతపులి వెంటనే వెళ్లి ఆ మామిడి పండ్లున్న చెట్టును తిరిగి ఎక్కింది.
ఆ తర్వాత కుందేలు ఆ పాము పుట్ట వద్దకు స్వయంగా వచ్చి గట్టిగా ''ఓ సర్పమా! ఇక కాకి పిల్లలను ఇక నీవు తినవచ్చులే ! ముంగీస ఇప్పుడే వెళ్లిపోయింది'' అని అంది. వెంటనే పాము పుట్ట బయటకు వచ్చింది. కానీ అంతలోనే అక్కడకు ఆ కాకి ఆహారంతో పాటు తన నేస్తమైన ఒక గ్రద్దతో ఆ చెట్టు పైకి చేరింది. అప్పుడు పాము వాటిని చూసి భయపడి తిరిగి పుట్టలోనికి వెళ్లింది.
ఇంతలో వర్షం మొదలైంది. వెంటనే ఒక పిడుగు చిరుత పులి ఉన్న చెట్టు పక్కన 'ఢాం' అంటూ పడింది. ఆ పిడుగు ధ్వనికి భయపడిన చిరుత అక్కడి నుండి వేగంగా దూకి ప్రాణభయంతో పారిపోయింది. కోతిని తిందామనుకున్న చిరుతకు ఆశ నిరాశైంది. ఆ తర్వాత మరొక పిడుగు ఆ చిరుత పులి ఉన్న మామిడి పండ్ల చెట్టుపై పడి ఆ చెట్టు కాలి బూడిద అయిపోయింది. ఆ మామిడి పండ్లను తిందామన్న కోతి ఆశ కూడా తీరలేదు. కానీ ప్రకృతి దేవత పిడుగుల నుండి చిరుతపులికి, కోతికి సాయం చేసి వాటి ప్రాణాలను కాపాడింది. తర్వాత కోతి కూడా బాధతో అక్కడి నుండి వెళ్ళిపోయింది.
కానీ కాకి దాని పిల్లలు ఉన్న చెట్టుకు మాత్రం ఏమీ కాలేదు. కాకి ఎంతో సంతోషంతో తన మిత్రుడైన గద్దతో ''మిత్రమా! నీ పుణ్యమా అని నా పిల్లలకు తాత్కాలికంగా పాము బాధ తప్పింది. కానీ దాని బాధ శాశ్వతంగా నివారణ కావాలంటే నీవు ఇక్కడకు ప్రతిరోజూ రా ! అలాగే నా మిత్రుడైన ముంగీసను కూడా ప్రతిరోజు రమ్మంటాను'' అని అంది. ఆ మాటలు విన్న పాము ఇక అక్కడ తనకు ఉండడం క్షేమకరం కాదని అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోయింది. కాకి సంతోషంతో గద్దతో ''మిత్రమా! నిన్ను చూసి నా మాటలు విని ఆ పాము వెళ్ళిపోయింది ''అని అంది. అప్పుడు ఎటో వెళ్లి తిరిగి వచ్చిన కుందేలు కాకి ద్వారా అంతా విని ''అందుకే అదే కావాలని కోరుకోకూడదు. ఆశపడితే నిరాశ తప్పదు. పండ్ల కొరకు కోతి, కోతి కొరకు చిరుత పులి, కాకి పిల్లల కోసం పాము, పాము కోసం ముంగీస ఆశ పెట్టుకుని అవి లభించక పోవడంతో నిరాశతో వెను తిరిగాయి'' అని అంది.
- సంగనభట్ల చిన్న రామకిష్టయ్య
9908554535