అంజలిని కలిసిన రోజే సంధ్యకు చెప్పి ఉంటే, ఈరోజు ఇంత దూరం వచ్చేది కాదు. సంధ్య నన్ను హద్దుల్లో పెట్టేది. నా వల్ల అంజలి ఇప్పుడు చాలా బాధపడుతోంది. ఆమె కన్నీళ్లకు నేనే కారణం అనుకుంటూ భారమైన బాధతో బస్సు ఎక్కాడు అరుణ్. బయట వర్షం పడుతోంది. అరుణ్‌కి తెలియకుండానే కన్నీళ్ళు వచ్చాయి.
*********
అరుణ్‌కి పొద్దున్నే లేచి చారు తాగడం అలవాటు. తర్వాత కాసేపు పేపర్ స్క్రోల్ చేసి, వంట బాగా రాకపోయినా ఏదో ఒకటి చేస్తుంటాడు. ఈ పనులపై రాహుల్ పెద్దగా శ్రద్ధ చూపడు. కాకపోతే అరుణ్‌కి ఏ కష్టం వచ్చినా రాహుల్ సాయం చేస్తాడు. టీ తాగి సంధ్యకి గుడ్ మార్నింగ్ మెసేజ్ చేస్తాడు అరుణ్. సంధ్య రిప్లరు ఇచ్చేదాకా ఫోన్ వైపు చూస్తూనే ఉంటాడు. కొన్నిసార్లు రిప్లరు లేదంటే ఆమె నిద్రపోతోందని అర్థం. అందుకే డైరెక్ట్‌గా ఫోన్ చేసి గుడ్ మార్నింగ్ చెప్తాడు.
'అరుణ్ వెళ్ళి స్నానం చెయ్యి. నేను కూడా చేయాలి' అన్నాడు రాహుల్.
'ఒక్క నిమిషం ఆగు. సంధ్య మెసేజ్‌కి రిప్లరు ఇవ్వలేదు'
'అయితే ఫోన్ చెయ్యి'
'నేను చేశాను. కానీ లిఫ్ట్ చేయలేదు'
'ఆమె నిద్రపోతుందేమో. పొద్దున్నే లేచి గుడ్ మార్నింగ్ చెప్పమని అడగడం సరికాదు'
'ప్రేమ గురించి నీకు తెలియదులే'
సంధ్య నుంచి రిప్లరు వచ్చేవరకు అరుణ్ కదలడు. తాను ప్రపంచంలోనే గొప్ప ప్రేమికుడినని నిరూపించుకోవాల నుకుంటాడు. రిప్లరు రాగానే.. 'రిప్లరు వచ్చింది' అని రాహుల్‌ను వెనక్కి లాగి, వాష్ రూంలోకి దూరిపోతాడు అరుణ్.
అరుణ్ పారిశ్రామిక కార్యాలయంలో కాంట్రాక్ట్ ఉద్యోగి. అతను పది గంటలలోపు ఆఫీసుకు వెళ్లాలి. ఇంట్లో ఖాళీగా కూర్చోవడం కంటే పని అనుభవం సంపాదించడంలో తప్పు లేదని భావించి ఈ ఉద్యోగంలో చేరాడు అరుణ్. రాహుల్‌కి కన్సల్టెన్సీ ఉంది.
'అరుణ్ నువ్వు ఈ జాబ్ మానేసి, ఏదైనా ఉద్యోగానికి ప్రిపేర్ అవ్వు' ఫోన్లో అంది సంధ్య.
'నేను బిటెక్ చేసినా సరైన ఉద్యోగం రాలేదు. చిన్న శ్రమతో సంపాదిం చిన ఈ ఉద్యోగం నా నుండి జారి పోకూడదనుకుం టున్నాను.'
'ఇందులోనే ఉంటే ఎలా?'
'సమయం దొరికినప్పుడు మరో ఉద్యోగానికి కూడా సిద్ధమవుతున్నాను'
'సరే బాబు నీ ఇష్టం'
'సరే పెళ్లి ఎప్పుడు చేసుకుందాం?'
'నేను జాబ్ చేసి ఏడాది కూడా కాలేదు. నాకు మరో ఏడాది టైం కావాలి' అంది సంధ్య.
అరుణ్ జవాబు తిరిగి ఇవ్వలేదు. అతని అంగీకారానికి విరుద్ధంగా సమాధానం చెప్పానని ఆమె గ్రహించింది. భవిష్యత్తులో డబ్బు విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ప్రతిక్షణం జాగ్రత్తగా ఉండాలని సంధ్య కొంత సమయం కోరింది.
కొన్ని రోజుల తర్వాత రాహుల్ తన కన్సల్టెన్సీని వేరే చోటికి మార్చాడు. అది ప్రస్తుతం ఉన్న అద్దె ఇంటికి దూరంగా ఉంది. కాబట్టి కన్సల్టెన్సీ దగ్గర రూం ఉంటే బాగుంటుందని రాహుల్ భావించాడు. అరుణ్‌తో చర్చించి తన కన్సల్టెన్సీకి ఐదు కిలోమీటర్ల దూరంలో, అరుణ్ ఆఫీసుకు ఆరు కిలోమీటర్ల దూరంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఈ విషయాన్ని సంధ్యకు చెప్పాడు అరుణ్.
'రూం బాగుందా?' అంది సంధ్య.
'బాగుంది'
'ఇంట్లో ఓనర్స్ ఎవరు ఉంటారు?'
'అంకుల్, ఆంటీ, వారి ఇద్దరు కుమార్తెలు'
'అయితే ఆ రూంలో నువ్వు అద్దెకు ఉండకూడదు'
'ఎందుకు?'
'నాకు నచ్చలేదు. మరే రూం మీకు దొరకలేదా?'
'అసలు బ్యాచిలర్స్కి రూం ఇవ్వరు. బుద్దిగా ఉంటానని చెప్పి ఈ రూం తీసుకున్నాడు రాహుల్'
'అయినా సరే. వేరే రూం చూసుకోండి'
'ఇప్పటికే అడ్వాన్స్ ఇచ్చాం'
'కావాలంటే ఆ డబ్బు నేనిస్తాను. మీరు అక్కడ అద్దెకు తీసుకోకూడదు' అంది సంధ్య. అరుణ్‌కి కోపం వచ్చి ఫోన్ పెట్టేశాడు. సంధ్య ప్రతి క్షణం అరుణ్ భద్రత గురించే ఆలోచిస్తుంది. ప్రేమించే ప్రతి అమ్మాయికి ఇది సహజం. తర్వాత ఇంటి ఓనర్ వాళ్ల కూతుళ్లకు పెళ్లి నిశ్చయమైందని చెప్పడంతో సమస్యకు బ్రేక్ పడింది.
అరుణ్, సంధ్య బిటెక్ క్లాస్మేట్స్. ఇద్దరూ మూడో ఏడాది నుంచి ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ ఉత్తీర్ణులయ్యాక ఉద్యోగం కోసం వేట మొదలుపెట్టారు. అరుణ్ చాలా ఉద్యోగాలు ప్రయత్నించాడు. కానీ, వర్కవుట్ కాలేదు. సంధ్య ఏడాది క్రితం సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరింది.
అరుణ్ తన కొత్త గది నుంచి ఆఫీసుకు వెళ్లే ముందు బస్టాప్ దగ్గర చారు తాగేవాడు. ఆ బస్టాప్‌లో రోజూ ఒక అమ్మాయి తనవైపు చూస్తూ ఉండడం గమనించాడు. చారు తాగి తాను వెళ్లేదాకా ఆమె అదే స్టాప్‌లో ఉంటుందని అరుణ్‌కి అర్థమైంది.
'హే రాహుల్, ఆ బస్టాప్‌లో చుడీదార్లో ఉన్న అమ్మాయి నా వైపే చూస్తోంది' అన్నాడు అరుణ్.
'ఆ అమ్మాయి నీవైపు చూడటం లేదు' అన్నాడు రాహుల్.
'మనం చూస్తే ఆమె చూడదు. సడెన్‌గా చూడు తెలుస్తోంది నీకే'. అరుణ్ చెప్పినట్లే రాహుల్ చేశాడు. ఆమె చూసింది.
'ఆమె ఎందుకు చూసింది? అయినా ఆమె చూస్తే ఏంటి, చూడకపోతే ఏంటి? ఈ విషయం సంధ్యకు చెప్పాలా?'అరుణ్‌ని ఆటపట్టించాడు రాహుల్.
'వద్దురా బాబూ. ఏదో నన్ను చూస్తున్నట్లు అనిపించిందని చెప్పాను. ఇక ఆ అమ్మాయి గురించి మాట్లాడను' అన్నాడు అరుణ్.
ఆ తర్వాత కూడా ఆమె అరుణ్‌ని రోజూ చూడటం మానలేదు. అరుణ్ కూడా ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. ఒకరోజు బస్టాప్‌లో ఆమె కనిపించకపోయే సరికి ఆమె గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. చాలా సేపు వెతికినా ఆమె కనిపించలేదు.
మరుసటి రోజు అరుణ్ టీ తాగడానికి వెళ్లాడు. ఇంతలో గొడుగు పట్టుకుని ఉన్న అమ్మాయిని చూశాడు. అరుణ్‌కి చారు ఇచ్చి ముందుకు కదిలింది. తర్వాత ఆమె గొడుగును పైకి నెట్టి తన అందమైన చిరునవ్వుతో అరుణ్ వైపు చూసింది. అరుణ్ ఆమె చిరునవ్వుకి మైమరచిపోయాడు.
రాహుల్ చిన్న పని కారణంగా వేరే ఊరికెళ్లాడు. మరుసటి రోజు అరుణ్ ఆఫీస్‌కి వెళ్లడానికి బైక్ స్టార్ట్ చేస్తే అది స్టార్ట్ కాలేదు. నడుస్తూ చారు వద్దకు వచ్చాడు. ఆమె కనిపించలేదు. బైక్ లేదు కాబట్టి బస్టాప్‌కి వెళ్లాడు. ఈ రోజు బస్టాప్‌కి వచ్చానంటే, తన కోసమే అని అనుకుంటుందా, ఆమె పేరు ఏంటి? తనలో తానే వాదించుకున్నాడు అరుణ్. ఇంతలో అరుణ్‌కి సంధ్య ఫోన్ చేసింది.
'అరుణ్ ఎక్కడున్నావు? ఆఫీసుకు వెళ్లలేదా?'
'బైక్ పాడైంది. బస్సులో వెళ్తాను'
'బైక్ ఎలా పాడవుతుంది?'
'రాత్రి వర్షం కురిసింది. స్టార్ట్ కాలేదు'
'వర్షంలో ఎవరైన బైక్ పెడతారా?'
'చాలాసార్లు వర్షంలో తడిసినా ఏం కాలేదు. ఈసారి ఇలా అవుతే నేనేమి చేయాలి?' అని అంటూ ఉండగా ఆమె నేరుగా వచ్చి అరుణ్ పక్కనే నిలబడింది.
'సంధ్య బస్సు వచ్చింది. నేను మళ్ళీ చేస్తాను' అబద్ధం చెప్పి ఫోన్ కట్ చేశాడు అరుణ్.
అరుణ్‌తో ఆమె ఏదో చెప్పాలనుకుంది. కొన్ని క్షణాల మౌనం తర్వాత ధైర్యం తెచ్చుకుని అతడిని అడిగింది.
'బస్ స్టాప్‌లో మీరు... బైక్ ఉంది కదా మీకు?'
'అది కాస్త పాడైంది. అందుకే ఇలా' అన్నాడు. ఆమె తనతో మాట్లాడుతుందని అరుణ్ ఊహించలేదు.
'సరే మీరు ఎక్కడికి వెళ్లాలి?'
'పారిశ్రామిక కార్యాలయానికి వెళ్లాలి'
'నేను అటే వెళ్తున్నాను. అటు వెళ్లే బస్సు రావడానికి మరో ఐదు నిమిషాలు ఉంది' అంది ఆమె.
బస్సు వచ్చింది. ఇద్దరు ఎక్కారు. ఆమె కూర్చుంది. అతను నిలబడ్డాడు. అతన్ని ఆమె పిలిచింది.
'మీరు ఇక్కడ కూర్చోండి'
'లేడీస్ సీట్ కదా'
'వాళ్లు వస్తే లేవొచ్చు. కూర్చోండి' అంది. కానీ అరుణ్ కూర్చోలేదు.
'సరే మీరు నా పక్కన కూర్చోవడానికి సంకోచిస్తున్నారు' అంది.
'అయ్యో అదేం లేదు. నాకు బస్సులో నిలబడటం ఇష్టం' అన్నాడు. అతని జవాబు ఆమెకు నవ్వు తెప్పించింది. అతను నిలబడితే ఆమెకు కూర్చోవాలనిపించలేదు. అందుకే నిలబడింది.
'మీరు ఎందుకు నిల్చున్నారు?'
'మీరు నిలబడితే నాకు ఏదోలా అనిపించింది' అంది. ఆమె సమాధానానికి అతను ఏదో చెప్పాలనుకున్నాడు. కానీ, నవ్వునే జవాబుగా ఇచ్చాడు. ఆమె కూడా నవ్వింది.
దిగాల్సిన ప్రదేశానికి చేరుకున్నాడు. దిగి ఆమె వైపు చూశాడు. బస్సు కిటికీలోంచి అతన్ని చూసింది. బస్సు ముందుకు కదిలిన తర్వాత ఆమెకు కృతజ్ఞతలు చెప్పలేదని గుర్తు చేసుకుని బాధపడ్డాడు.
మరుసటి రోజు, ఆమెకు అరుణ్ కృతజ్ఞతలు చెప్పడానికి ప్రయత్నించాడు. కానీ, ఆమె కనిపించలేదు. ఇంతలో ఊరు నుంచి రాహుల్ వచ్చాడు. రాహుల్‌కి అరుణ్ జరిగిందంతా చెప్పాలనుకున్నాడు. కానీ, ఏదో అతన్ని ఆపింది.
రాహుల్ తన స్నేహితులతో కలిసి ఎగ్జిబిషన్ ప్లాన్ చేశాడు. అరుణ్‌ని కూడా వెంట తీసుకెళ్లాడు. అక్కడ చాలా మంది ఉన్నారు. ఫోన్ సైలెంట్‌గా ఉండడంతో సంధ్య నుంచి వచ్చిన మిస్డ్ కాల్స్ చూసుకోలేదు అరుణ్. వెంటనే ఫోన్ చేశాడు. సంధ్య లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ చేశాడు.
'ఏంటి కాల్ చేశావు?' కోపంగా అంది.
'ఎగ్జిబిషన్‌కి వచ్చాను. నా ఫోన్ సైలెంట్‌గా ఉంది. చూసుకోలేదు'
'అవునా నాకు చెప్పొచ్చు కదా... రూంకి ఎప్పుడు వెళ్తున్నావు?'
'వెళ్తాను. కాసేపు ఆగి'
'చాలా ఆలస్యం అయింది. నీతో ఎవరున్నారు?'
'నాతో రాహుల్, అతని స్నేహితురాలు ఉన్నారు'
'అమ్మాయిలా?'
'అవును'
'అయితే వెంటనే నువ్వు నీ బైక్‌పై రూంకి వెళ్లు'
'ఎందుకలా?'
'ఈ రాత్రి నువ్వు అలా వెళ్ళడం నాకు నచ్చలేదు. ప్లీజ్ నా కోసం నేను చెప్పేది చెయ్యి' అంది సంధ్య. అరుణ్ సరే అని ఫోన్ కట్ చేశాడు. రాహుల్‌కి చెప్పి బైక్ స్టార్ట్ చేసి కదిలాడు. కొంచెం దూరం వెళ్ళాక ఆ బస్టాప్ అమ్మాయిని చూశాడు.
'ఈ రాత్రి ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నారు?' అరుణ్ ఆమెను అడిగాడు.
'ఆఫీసు పని వల్ల ఆలస్యమైంది. ఆటో కోసం చూస్తున్నాను'
'మీకు అభ్యంతరం లేకపోతే మీ ఇంట్లో దింపుతాను'
'పర్లేదు. ఆటోలో వెళ్తాను'
'సరే ఇబ్బంది పడకండి. ఆటో వచ్చేదాకా ఇక్కడే ఉంటాను' అన్నాడు అరుణ్. కొద్దిసేపటికి వచ్చిన ఆటోలోకి ఆమె భయంగా ఎక్కింది. అరుణ్ ఆమె దగ్గరకు వెళ్లి, 'భయపడకండి, నేను ఆటో ఫాలో అవుతాను' అన్నాడు. ఆమె నవ్వింది. ఆటో ఆమె అద్దె ఇంటికి చేరింది. ఆమె అతన్ని చూసి నవ్వి లోపలికి వెళ్ళింది. అతనికి కృతజ్ఞతలు చెప్పడానికి మళ్లీ బయటకు వచ్చింది. కానీ అరుణ్ అప్పటికే వెళ్లిపోయాడు.
ఆ తర్వాత అరుణ్‌కి వెంటనే నిద్ర పట్టలేదు. నేను థాంక్స్ చెప్పడం మరిచిపోయినట్లే, ఆమె కూడా థాంక్స్ చెప్పడం మర్చిపోయిందా, కానీ సహాయం చేసినందుకు కృతజ్ఞతలు చెప్పించుకోవడం సరికాదు అనుకున్నాడు.
సంధ్య ఉదయాన్నే అరుణ్‌కి ఫోన్ చేసింది. 'రాత్రి ఫోన్ చేశాను. స్విచ్ ఆఫ్ వచ్చింది?' అడిగింది.
'రాత్రి వచ్చేసరికి ఆలస్యమైంది. ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది' అన్నాడు.
'మరి నువ్వు నాకు పొద్దున్నే ఫోన్ కూడా చేయలేదు. ప్రతి రోజూ గుడ్ మార్నింగ్ మెసేజ్ పంపుతావు. ఈరోజు చేయలేదు' కోపంగా అంటూ ఫోన్ పెట్టేసింది. ఆ తర్వాత అరుణ్ చాలాసార్లు చేశాడు. ఆమె లిఫ్ట్ చేయలేదు. సంధ్య మాట్లాడలేదని అరుణ్ మనసు బాధగా ఉంది. కాకపోతే, అంతకు మించి ఇంకేదో అతన్ని ఇబ్బంది పెడుతుంది.
రాహుల్ తన స్నేహితులతో కలిసి రాజమండ్రి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నాడు. అరుణ్ రానని చెప్పినా తీసుకెళ్లాడు. ఆ రోజు మధ్యాహ్నం సంధ్యే అరుణ్‌కి ఫోన్ చేసింది.
'నాకు కోపం వస్తే కాసేపు ఫోన్ చేసి ఆపుతావా? మళ్ళీ చేయవా?' అంది.
'సరే ఏం చేస్తున్నావు?' అన్నాడు.
'నువ్వు ఎక్కడ ఉన్నావు?'
'నేను కార్లో ఉన్నాను?'
'ఎక్కడికి వెళ్తున్నావు?'
'నేను రాజమండ్రి వెళ్తున్నాను'
'ఎందుకు అక్కడికి? ఏంటి పని?'
'మాములుగానే వెళ్తున్నాను'
'నాకు చెప్పకూడని పని ఏంటి?'
'ఇప్పుడు నువ్వేదో అని నా మూడ్ ఆఫ్ చేయకు. కాస్త రిలాక్స్ కోసం వెళ్తున్నాను' అన్నాడు అరుణ్. 'సరే నీ ఇష్టం' అంటూ సంధ్య ఫోన్ పెట్టేసింది. లాంగ్ రిలేషన్ షిప్లో ఇవన్నీ కామనే అని అరుణ్‌ని రాహుల్ ఓదార్చాడు. రాజమండ్రి చేరుకున్న రెండు రోజుల తర్వాత అరుణ్ రిసార్ట్‌లో చారు తాగుతూ రిలాక్స్ అవుతున్న టైంలో అకస్మాత్తుగా అతనికి ఒక అందమైన స్వరం వినిపించింది. వెంటనే లేచి చుట్టూ కళ్ళు తిప్పాడు. ఆమె కనిపించింది.
'మీరేం చేస్తున్నారు ఇక్కడీ' ఆమెను అరుణ్ అడిగాడు. ఆమె కాసేపు మౌనంగా ఉంది. వెళ్లి కుర్చీలో కూర్చుంది. ఆమె కోసం అరుణ్ చారు తెచ్చాడు. ఆమె ఒక సిప్ తీసుకుంది.
'రెండు రోజుల్నుంచి మీరు కనిపించలేదు?'
'అందుకని తెలుసుకోని నా కోసం వచ్చారా?'
'మీరు ఎక్కడ ఉన్నారో కనిపెట్టాను'
'ఇది నాకు ఆనందాన్ని ఇస్తుంది'
'నాకు తెలుసు' అని ఆమె నవ్వింది. కాసేపు ఇద్దరూ కబుర్లు చెప్పుకున్నారు.
తన పేరు అంజలి అని అరుణ్‌కి చెప్పింది. తన పేరు చెప్పబోయిన అరుణ్‌ను ఆపింది. ''నీ పేరు తెలియకుండా నిన్ను వెతుక్కుంటూ రాలేనుగా'' అంది. అరుణ్ మళ్ళీ సిగ్గుపడ్డాడు.
'రిపేషన్షిప్ గురించి మీ అభిప్రాయం ఏమిటి?' ఆమెను అడిగాడు.
ప్రతి బంధమూ మంచిదే, అయితే ఆ బంధంలో ఎవరూ నిర్బంధించబడకూడదు. చాలా మందికి ఈ విషయం అర్థం కావడం లేదని, అందుకే సంబంధాలు తెగిపోతున్నాయని చెప్పింది. అందుకు ఆమెను అరుణ్ మెచ్చుకుని చాలా గొప్పగా చెప్పావు అన్నాడు. ఆమె నవ్వింది. కాసేపు కబుర్ల తర్వాత ఆమె వెళ్లిపోయింది. అరుణ్‌కి రోజురోజుకీ ఆమె కొత్తగా కనిపిస్తోంది. అయితే ఆమెకు కతజ్ఞతలు చెప్పడం మాత్రం మళ్లీ మర్చిపోయాడు. ఇంతలో రాహుల్ వచ్చాడు. 'ఆ అమ్మాయి నిన్ను వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చిందా?' అని అడిగాడు.
'వచ్చింది'
'ఆమె నిన్ను ప్రేమిస్తుందేమో?'
'ఆమె అలా చెప్పలేదు'
'అమ్మాయిలు అన్ని చెప్పరు. మనమే అర్థం చేసుకోవాలి' అన్నాడు రాహుల్. ఆ రాత్రి అరుణ్‌కి నిద్ర పట్టలేదు. ఉదయం అరుణ్‌కి ఫోన్ చేసింది అతని తల్లి.
'చెప్పు అమ్మ'
'ఒక అమ్మాయి ఫోటో పంపాను చూశావా?'
'నాకు ఇప్పుడే పెళ్లి వద్దని చెప్పాను కదా'
'ఈసారి నా మాట వినకపోతే నాతో మాట్లాడకు... నన్ను చూడడానికి రాకు' అంటూ కోపంగా ఫోన్ కట్ చేసింది అరుణ్ తల్లి.
అరుణ్‌కి ఏం చేయాలో తోచలేదు. సంధ్య, అంజలి, ఇప్పుడు మరో అమ్మాయి అంటూ ఆలోచించడం మొదలు పెట్టాడు.
రాహుల్, అరుణ్ రాజమండ్రి నుండి రూంకి తిరిగి వచ్చారు. సంధ్యను కలిసి తనకు ఒక అమ్మాయి పరిచమైందని అరుణ్ చెప్పాలనుకున్నాడు. కానీ ఆమె దగ్గరికి వెళ్లలేదు. అరుణ్‌కి సంధ్యే ఫోన్ చేసింది.
'ఎక్కడ ఉన్నావు అరుణ్?' ప్రేమగా అడిగింది.
'నేను రూంలోనే ఉన్నాను'
'అయిపోయిందా నీ టూర్?'
'హా, అయిపోయింది'
'నేను కూడా ఆఫీస్ వాళ్ళతో టూర్‌కి వచ్చాను. ఇక్కడే రెండు రోజులు ఉంటాను. నువ్వు కూడా నాతో ఉంటే బాగుండేది'
'నేనిప్పుడు రాలేను కదా... నువ్వు ఎంజారు చెయ్యి'
'సరే. తర్వాత కాల్ చేస్తాను' అంది.
తర్వాతి రోజు అరుణ్ అలా రోడ్డు మీద నడుస్తుండగా అంజలిని చూశాడు. ఆమె ఏడుస్తుంది. అరుణ్‌కి అది నచ్చలేదు. ఆమెను అనుసరించాడు. ఆమె బస్సు ఎక్కింది. అరుణ్ కూడా ఎక్కాడు.
'ఏంటి ఏడుస్తున్నారు? ఏమైంది?' అడిగాడు. ఆమె జవాబు ఇవ్వలేదు. ఆమె పక్కన సీట్లో కూర్చున్నాడు. ఆమె తన బ్యాగులో నుంచి డబ్బులు తీసి వైజాగ్‌కి రెండు టికెట్లు తీసుకుంది. బస్సు ప్రయాణిస్తుంది. కొద్ది దూరం వెళ్లాక ఏడుపు ఆపేసింది. తర్వాత అతని భూజంపై తలపెట్టి నిద్రపోయింది. కొన్ని గంటల తర్వాత బస్సు వైజాగ్ చేరుకుంది. బయట చినుకులు పడుతున్నాయి.
'మీకు ఇక్కడ ఎవరైనా తెలుసా?' అడిగాడు. ఆమె లేదని తల ఊపింది.
'నీకు వర్షం అంటే ఇష్టం లేదా?' అంది.
'ఇష్టమే'
'అయితే నాతోరా' అంటూ అతన్ని ఎవరూ లేని చోటుకి తీసుకెళ్లింది. అక్కడ అతనికి అంతులేని పచ్చటి విస్తీర్ణం, మేఘాలతో నిండిన నీలి ఆకాశం కనిపించింది. ఈ వర్షపు చినుకులు మీ శరీరంపై పడుతుంటే, మీరు ఈ ప్రదేశంలో ప్రపంచాన్ని మరచిపోవచ్చని అతనికి ఆమె చెప్పింది. అక్కడి వాతావరణం చూసిన అరుణ్‌కి ఆమె చెప్పింది నిజమేనని అర్థమైంది. అన్నీ మర్చిపోయి బాధలు లేని కొత్త ప్రపంచాన్ని చూడండి. నీతో మాట్లాడుతుంటే నాకు తెలియకుండానే కవితలు వస్తున్నాయంటూ నవ్వేసింది. అరుణ్ కూడా నవ్వాడు. ఇక్కడికి వస్తే నా కష్టాలన్నీ మర్చిపోతానని చెప్పింది. మీ సమస్య ఏంటి అని అడిగాడు. ఆమె చెప్పలేదు.
అరుణ్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఆమె చెప్పినట్లు ప్రకృతిని అనుసరించి ముందుకు సాగాడు. అకస్మాత్తుగా ఆమె అదృశ్యమైంది. ఆమె తన వద్దకు తిరిగి వస్తుందని అతనికి తెలుసు కాబట్టి అతను వెతకలేదు.
కాసేపటి తర్వాత వచ్చింది.
'మీరు నా కోసం ఎదురు చూస్తున్నారా?' ఆమె అడిగింది.
'అవును' అన్నాడు. ఆమె నవ్వింది.
'నాకు ఎన్నో విషయాలు మీరు నేర్పించారు. ప్రతి విషయంపై కొత్తగా ఆలోచించేలా చేశారు. నీ ప్రపంచం బాగుంది' అని మెచ్చుకున్నాడు.
'మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి' అంది ఆమె. అతను నవ్వాడు. కొద్ది క్షణాల తర్వాత వారి మధ్య ప్రశాంతత నెలకొంది.
'మీరు నన్ను క్షమించాలి. మీరు నా కోసం ఇంత దూరం వచ్చారు' అంది.
'అయ్యో పర్లేదండి'
'మీరు, సంధ్యగారు హ్యాపీగా ఉండాలి. ఇక మీరు బస్సు ఎక్కి వెళ్లిపోండి' అని అతని చేతికి పర్సు ఇచ్చింది.
'ఈ పర్సు మీ దగ్గర ఎలా?'
'రాత్రి బస్సులో పడింది. నా దగ్గరే ఉంచుకున్నాను. ఇందాకే తెరిచి చూసాను. ఇక నిన్నెప్పుడూ కలవకుండా ఇది చేస్తుందని నేను ఊహించలేదు'' అంటూ ఏడుస్తూ వెళ్లిపోయింది. మొదటి సారి ఆమె ప్రేమలో పడింది అరుణ్తోనే.
లిలిలి
అంజలిని చూసిన రోజే సంధ్యకి ఈ విషయం చెప్పి ఉంటే నన్ను లిమిట్లో పెట్టేది. ఈరోజు అంజలిని ఏడిపించేవాడ్ని కాదు. సంధ్య నాతో చాలా నిజాయితీగా ఉంది. నన్ను ఎల్లవేళలా కాపాడుకుంటూ వచ్చింది. నా దగ్గర ఏమీ దాచలేదు. కానీ నేను ఇప్పుడు ఇలా చేయడం నాకే నచ్చడం లేదని బాధపడుతూ బస్టాప్‌కి వచ్చాడు అరుణ్. సంధ్యకు ఫోన్ చేశాడు.
'హే అరుణ్, నాకు వర్క్ ఫ్రమ్ హోం ఇచ్చేశారు. నేను నీ దగ్గరకు వచ్చేస్తాను'
'సంధ్య'
'నేను శుభవార్త చెబితే, నువ్వు డల్‌గా ఉన్నావేంటి?'
'సారీ సంధ్య'
'ఎందుకోరు?'
'చెప్పాలనిపించింది'
'సరేలే బాబు. ఇవన్నీ ఎందుకు. నేను ఎల్లుండి వస్తాను'
'సరే' అని ఫోన్ పెట్టేశాడు.
బస్సు ఎక్కి కిటికీలోంచి బయటకు చూశాడు. అంజలి కనిపించింది. బస్సు దిగాడు. వర్షం పడుతుంది. ఆమె అతని దగ్గరకు వచ్చింది.
'మీరు నా కోసమే ఇంత దూరం వచ్చారు. నాకు ధైర్యాన్నిచ్చారు. మీరు జాగ్రత్తగా వెళ్లండి. మీకు ఒకటి చెప్పాలి'
'చెప్పు అంజలి'
'థాంక్యూ అరుణ్' అంటూ కన్నీళ్లు తుడుచుకుంది.
'థాంక్యూ. అలానే నన్ను క్షమించు' అన్నాడు అరుణ్.
'ఉంటాను అరుణ్. గుడ్ బై' అంటూ దూరంగా వర్షంలో తడుస్తూ వెళ్లిపోయింది అంజలి. అరుణ్ గొడుగు పక్కకు విసిరాడు. తడిసిపోయాడు. బరువైన బాధతో బస్సు ఎక్కి వెళ్లిపోయాడు.
- రాపోలు రమేష్
Sun 13 Nov 05:24:44.479203 2022