Sun 20 Nov 02:57:28.842648 2022
Authorization
బాత్రూం గోడమీద సెల్‌ఫోన్ మోగుతుంది. గప్పుడే స్నానం జేసి ఇంట్లకు బోయిండు రమేశ్. రప్పున వొచ్చి ఫోన్ ఎత్తిండు..
అవతల అతని భార్య శ్రీలేఖ మాట్లాడుతూ ''ఏం లేదు! కాని పాలమూరుకు వొస్తుండ నీవు వన్ టౌన్ పోలీసు స్టేషన్ కాడ్కి మన చిన్నోని తీస్కోనిరా! నేను జెడ్చర్ల కాడ ఆట్వ ఎక్కుతుండా... వోన్కి కటింగ్ జేస్కోని పోదాం. రేపు సాలెకు పోతడుకదా'' అని ఫోన్ బంద్ జేసింది.
రమేష్ వాళ్ళ ఇంటి ముంగిట కమిటిహాల్ పై అంతస్తు కట్టడాన్కి ఏస్కున్న ఇస్కలో ఆటాడ్తున్న కొడ్కును రమేశ్ పిల్సెట్యాలకు ఉర్రితన ఉరుకొచ్చిండు.
''బిడ్డ అమ్మ ఫోన్ జేసింది. కటింగ్ చేసుకొత్తం పా పాలమూరికి'' అనెట్యాలకు తమ్ముడి కొడ్కు నేనొస్తానని ఒకటే ఏడ్పు. మారం జేయవట్టే. ''గట్లైతే పాండ్రి పోదాం'' అని ఆట్వ కోసం సడక్ కాడ్కి నడ్సుకుంట ముగ్గురు పోతుంటే పోరగాలిద్దరు నన్నెత్కో నన్నెత్కో అని ఒకటే మారం జేయవట్టిండ్రు. అంతలోనే ఆటో ముందలొచ్చి ఆగింది. పాలమూరికి పదిహేను నిమి షాల్లో జేరిండ్రు.వాళ్ళు వన్‌టౌన్ కాడ దిగినదాడే మంగల్ షాప్ కాడ్కి పోయిండ్రు. గాడ్కి పోంగనే షాప్లా ఎవ్వరు లేకుండ ఉండేసరికి పెద్దోడికి ముందు కటింగ్ జేసి, చిన్నోడికి తర్వాత కట్టింగ్ అయ్యింది. మంగలి యాదగిరి మాటల ముచ్చట్లలో పడేసి ఇద్దరు పిల్లల కట్టింగ్ జెప్పున జేసిండు. కట్టింగ్ జేస్కోని షాప్లకెళ్ళి కాళ్ళు బయట వెట్టిండ్రో లేదో పిల్లలిద్దరూ నాయినా ఆకలైతుంది ఎమన్న తినవెట్టవా అనెసరికి, రమేశ్‌కు గుండెజారినంత పనైంది.
''పాండ్రి బిడ్డ గీడనే దగ్గెర వెల్కమ్ హోటల్‌కు పోయి ఏమని తిందురుగానీ'' అనుకుంట నడ్సుకుంట పోయిండ్రు.
పిల్లలిద్దరేమో చారు బిస్కట్ గావాలండ్రి. తెచ్చిన రెండు బిస్కోట్లు పెద్దోడే వట్కునే. చిన్నోడు ఒక పెట్టున ఏడ్వవట్టే. గుంజుకొని చిన్నోడికిచ్చెలోపే సెంపపేటి లాగి గొట్టిండు చిన్నోడు. పెద్దోడు వల వల ఏడ్వవట్టే. గంతలోనే రమేశ్‌కు ఎదురుగా గూసున్న ముసలవ్వ సూపులు చిన్నబడినా, సూదిలా దారమెక్కించెంతా ఆత్మవిశ్వాసం నిండినదానిలాగ, చెర్మం ముడ్తలు వడినా మనస్సు త్యాట మంచినీళ్ళలా, సీర పాతది గట్టుకున్న కొత్తదైనా సూపులతో ... ''గా పిల్లలిద్దరెవ్వరు కొడ్కా?'' అని రమేశ్‌తో మాట గల్పింది ముసలవ్వ.
''అవ్వ ఒక్కడు నా కొడ్కు. ఇంకొక్కడు నా తమ్ముని కొడుక''ని జెప్పిండు రమేశ్.
''ఏ ఊరు కొడ్క మీది ..?'' అన్నది అవ్వ.
''మాది గీ పాలమూరు పక్కల ధర్మాపూర్'' అని జెప్పిండు రమేశ్
''ఎవ్వలి కొడ్కవు బిడ్డా నీవు ..?'' అన్నది అవ్వ
''తెల్గు అంజిలమ్మ కొడ్కును అవ్వ'' అనంగనే... ''బిడ్డా మీయమ్మ మంచిగుందా?'' అని అడిగే సరికి, రమేశ్ .. ''లేదవ్వ! మా అమ్మ కాలమై ఎనిమిదేండ్ల పొద్దాయే. నాయిన కాలమై మూడెండ్ల దినమాయే''నని కూలవడ్డ గొంతుతోన జెప్పిండు.
''గట్లనా కొడ్క. మీయమ్మ నేను గల్సి కన్నబావులు మోస్తిమి బిడ్డ. గా నర్సపురం కాలేజి కాడి బాయి, అల్లీపురం అంచునా బోట్కొల్లది, కటికొలది మస్తు బావులు తొవ్వితిమి బిడ్డ. కన్నమ్మ కష్టం జేసి పిల్లలను సాదుకుంటిమి. మీయమ్మ ఆకలికి కొంగు ముడేసుకొని పనిజేస్తుండే బిడ్డ. నాకు దెల్వక అడ్గుతున్న గా సాకలి జక్కన్న బాగుండడా కొడ్క..?'' అన్నది అవ్వ..
''లేడవ్వ గా తాత సచ్చిపోయి శాన ఏండ్లాయే. గాని గాళ్ళ కొడ్కులు, మనుమండ్లు అందరుండ్రూ...'' అని రమేష్ అనేసరికి అవ్వ కల్పించుకొని ''గా జక్కన్న లేనోళ్ళకు శాతనైన కాడ్కి పెట్టిండు బిడ్డ. శాన మంచోడుండే'' ఇట్లా అనుకుంటనే కిందవడ్డ చేతికట్టెను తీస్కుంటా.... ''గా కోడూరు కుర్మన్న, కోడూరు కిష్టప్ప, బక్కి హన్మన్న, బోల పెద్ద కిష్టప్ప ఉండరా కొడ్క. గాళ్ళు బాయి తోగెటప్పుడు గడ్డపార వడ్తే, భూమి తనంతకు తానే లోత్లకు పోయేది. గట్ల పనిజేసేటొళ్ళు బిడ్డ గాలందరూ....''
''అవ్వ గాలందరూ శానాలైంది కాలమై. ఇంగెవ్వరు దెల్సవ్వ మా ఊర్ల నీకు?'' అని రమేష్ రెట్టింపైనా ఉత్సాహంతో అడ్గిండు...
అవ్వ.. భుజంమీదికెళ్ళి జారిపోతున్న కుల్లను సర్దుకుంటా .. ''గూరకొండ ఎంకటయ్య, వావిళ్ళ కురుమన్న, టప్ప రాములు, టప్ప పెంటయ్య, కుర్వ మైబు ఈలంతా ఇంగా శానమంది దెల్సు కొడ్క అనే''.
''అవ్వ మీదింతకు యా ఊరు? మా గేర్ల అందరి పేర్లు చెప్తుండవు'' అని రమేష్ అనేసరికి..... నొసటితోన అవ్వ చిన్న నవ్వు నవ్వి... ''బిడ్డా మా ఊరు గూడా గదే. నేను ఊరిడ్సి ముప్పై ఏండ్లైంది. గా ఊర్ల ఆంజనేయసామి గుడి ముందర బొడ్రాయికాడ మాదిగి గేరికి మళ్ళిపోతే గా సీను గాని ఇంటిపక్కలా గానొచ్చె పెంకుటిల్లు నాదే కొడ్క. గా గొడ్డొడు బిగిచ్చుకున్నడు. గాని నోట్ల మన్నువడ'' అంటూ ఎన్కటి ఎతనంత జెప్పుకుంటా శాపనార్థాలు పెట్టవట్టె అవ్వ..
''అరే అవ్వ గట్లెట్లైతది..? నీ ఇంటిని గాలెట్ల గుంజు కుంటరు ..? పంచాది గిట్ల పెట్టలేవా?'' అని రమేష్ అన్నంగనే... ''పోనిలే బిడ్డ. గీడికొచ్చినంకనే నాలుగు వందల గజాల జాగ గొన్న. ఇల్లు గట్టిన. ముగ్గురు బిడ్డల పెండ్లిళ్ళు జేసినా. ఉన్న ఒక కొడ్కుకు గా సపాయి దాంట్ల కొల్వు దొర్కె. గీడికొచ్చినంకనే చెయిదిర్గే బిడ్డ. కాలం సార్దార్ ఇచ్చె. గా పాడు కొంపల ఉంటే గంజి వోటు కెడ్సెటొల్లం'' అనుకుంట సెక్కుడు సంచిల కెళ్ళి ఆకుసున్నం దీసి నోట్లేసుకునే అవ్వ.
రమేశ్ అవ్వ జెప్తున్న మాటలకు పానం ఉండబట్టలేక ''అవ్వ గప్పుడు గా బావుల మన్ను మోస్తే రోజుకూలెంత ఇస్తుండ్రి నీకు?''
''హా.. ఎంతబిడ్డ... అందరికీ రోజుకి రూపాయి ఇస్తుండ్రి గానీ... కాపొళ్ళు గాళ్ళ ఇండ్లముందర వోకిలి ఊడుస్తమని, కల్లంకాడ శాట పొతం జేస్కుంటమని... మాదిగొళ్ళమని అందరికి రూపాయి ఇస్తే మాకు ఆటనా ఇచ్చెటొళ్ళు. మా కట్టానంతా సొమ్ము జెస్కుంటుండ్రి. కొడ్కులు మాదిగొల్లమంటే ఇండ్ల ఆకిట్లకు రానీయకుండ్రి. నిండు ఎండల దూప ఉడ్తే నీళ్ళవోటు పొయ్యకుండ్రి బిడ్డ మైలవడ్తమని. మొన్నోచ్చినప్పుడు జూసిన కొడ్క. మీసాలు మెలేసేటొళ్ళంతా బొందలగడ్డల గల్సిండ్రు. మాదిగొళ్ళమని వోళ్ళు ముట్టుడు గాదు కొడ్క... మేమే గసోంటోళ్ళను మా ఆకిట్లకు రానియం. గాళ్ళకన్న సింగారంగా నా మనుమండ్లు, మనుమరాండ్లు ఉండరు చూపిస్త రా కొడ్క. గాళ్ళ నోట్ల మన్నువడ. కొడ్కులకు కష్టంజేయ శాతకాదు. మందిమీద దిప్పుతుండ్రి ముదనష్టపు కొడ్కుల''ని గతకాలపు సుద్దులని ఒడుస్తుండగానే వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ముందర ఆటో దిగింది శ్రీలేఖ.
పిల్లలిద్దరేమో అవ్వ జెప్పిన సుద్దిని చాలా ఇష్టంగా విన్నరు. చారు బిస్కెట్ పైసలు రమేశ్ తనవి తాను కట్టి ''అవ్వ నీ ఇడ్లి పైసలు నేను కడ్త'' అంటే ''వొద్దు కొడ్క నా దుడ్లు నేనే కడ్తా'' అని రెండు పది రూపాల నోట్లు ఒక ఐదు రూపాల చిక్క ఇచ్చింది. మాట వడని తల్లి. ఇమానంగా బత్కిన పల్లె బతుకమ్మ లెక్కుంది అవ్వ. అవ్వతో ముచ్చటాడినంత సేపు రమేష్ కు ఊరి చరిత్రనంత ఎత్తి దోసిట్ల పోసినట్లైంది. పిల్లలిద్దరూ శ్రీలేఖను జూసి ఉర్రితన ఉరికి సంకల జేరిండ్రు. అవ్వ రమేష్ ఎంబడే నడ్సుకుంట వొచ్చి, శ్రీలేఖను జూసి చిన్న నవ్వు నవ్వి, ఇద్దరు పిల్లల బుగ్గలను నిమిరి పాత పాలమూరు వైపు కొత్త చరిత్రకు సాక వోసుకుంట నడుస్తూ వెళ్ళింది.
- బోల యాదయ్య, 9912206427