Sun 27 Nov 01:23:37.610663 2022
Authorization
ఒక మామిడి చెట్టు చాలా అహంకారం కలది. అది తన దరిదాపుల్లో ఉన్న ఒక బచ్చలి కూరను, ఒక బెండకాయ మొక్కను, ఒక గడ్డి పరకను చూసి ఎప్పుడూ అవమానకరంగా మాట్లాడేది. అయినా అవి ఒక్కనాడు కూడా దానిని ఏమీ అనలేదు.
ఒకరోజు బాగుగా గాలి వీచింది. ఆ గాలికి బచ్చలి భయంతో తన పందిరిని గట్టిగా చుట్టుకుంది. బెండ అటూ ఇటూ ఊగి ఉక్కిరిబిక్కిరయింది. ఇక గడ్డి పరక సంగతి చెప్పనక్కర్లేదు. అది ఆ గాలికి గజగజ వణక సాగింది. ఆ మామిడి చెట్టు ఆ గాలికి వణుకుతున్న బచ్చలి, బెండ, గడ్డిపరకను చూసి బిగ్గరగా నవ్వి ''అయ్యో! చిన్న మొక్కలైన బచ్చలీ, బెండల్లారా! ఓ గడ్డిపరకా! మిమ్మల్ని చూస్తే నాకు జాలేస్తుంది. మీ భయానికి నాకు నవ్వొస్తుంది. ఈ చిన్న గాలికే మీరు గజగజ వణుకుతున్నారే! రేపు ఎక్కువ వేగంతో సుడిగాలి వీస్తే మీ పరిస్థితి ఊహించుకుంటేనే నాకు నవ్వొస్తుంది'' అని అంది. అయినా అవి ఒక్క మాట మాట్లాడలేదు.
ఆ తర్వాత మరొకనాడు ఆ మామిడి ''చూడండీ! నన్ను పెద్ద చెట్టుగా పుట్టించినట్లు ఆ సృష్టికర్త పాపం మిమ్మల్ని నాలాగా పెద్దగా పుట్టించలేదు. మీరు ఏదో పాపం చేశారు. అందువల్లనే మీరు చిన్న చిన్న మొక్కలుగా జన్మించారు. ఎప్పటికైనా మీ జీవితం ప్రశ్నార్థకమే! అయ్యో పాపం!'' అని తెగ బాధపడింది.
అది విన్న బచ్చలి ''నేను ఏదో బతికినన్ని దినాలు ఇతరులకు మంచి చేయాలన్నా ఉద్దేశంతోనే ఆ సృష్టికర్త నాకు ఈ జన్మను ఇచ్చాడని అనుకుంటున్నాను'' అని అంది.
దానికి వత్తాసు పలికిన బెండ ''అవును బచ్చలీ! నీవు అన్నది నిజం. మనం పరోపకారం కొరకే జన్మించాము'' అని అంది. అది విని కస్సుమన్న మామిడి ''అబ్బో! పరోపకారం కొరకు ఒక్క మీరే జన్మించినట్లు చెబుతున్నారు. నేను మాత్రం పరోపకారం చేయడం లేదా ఏమిటి? నాకు కాసిన పెద్ద పెద్ద మామిడిపండ్లను చూడండి. వాటిని తినని వారు ఎవరూ ఉండరు. వేసవిలో నా పండ్ల వల్ల అందరికీ పుష్కలంగా విటమిన్లు, పోషకాలు అందుతున్నాయి.'' అని వాటిని వెక్కిరించింది.
అప్పుడు బచ్చలి ''అయ్యో! మేము నీ అంత గొప్పవారం కాకపోయినా ఏదో మా శక్తి కొలది విటమిన్లు, పోషకాలను మా జీవితాలను త్యాగం చేసే ఇస్తున్నాం. కదా బెండా'' అని అంది. అందుకు బెండ కూడా అవునని జవాబు చెప్పి ''నేను కూడా అందరికీ శాకాహారంగా ఉపయోగపడుతున్నాను. మేము ఇద్దరం ఏమీ తక్కువ కాదు'' అని అంది. వాటి జవాబులను విన్న మామిడి ''మీరు సరే ! మరి పాపం ఈ గడ్డిపరక అందరికంటే చిన్నగాను, ఎవరికి ఉపయోగకరం కాకుండా జన్మను ఎత్తిందే పాపం. దీనిని చూస్తే నాకు జాలేస్తుంది'' అని అంది. ఆ మాటలను విన్న గడ్డిపరక ''నేను మనుషులకు ఆహారంగా ఉపయోగపడకున్నా పశువులకు మాత్రం ఆహారంగా ఉపయోగపడుతున్నాను. ఈ జన్మకు నాకు ఇంతే చాలు'' అని అంది.
ఇంతలో చాలా తీవ్రంగా సుడిగాలి మొదలైంది. ఆ గాలికి మామిడి చెట్టు ఆ చోటనే భయపడుతూ ఉన్న బచ్చలీ, బెండ, గడ్డి పరకలను చూస్తూ బిగ్గరగా నవ్వసాగింది. కానీ ఇంతలో ఆ మామిడి కూకటివేళ్లతో సహా గడ్డిపరకపై కూలి దానిపై పడిపోయింది. దానిని చూసిన గడ్డిపరక ''అయ్యో! మామిడీ! నీవు నా పైననే పడ్డావు. ఫరవాలేదు లే! నేను నిన్ను తీసిన తర్వాత లేచి నిటారుగా నిలబడతాను. నాకు ఇది అలవాటే! నీలాంటి బరువు గల చెట్లను ఎన్నింటినో నేను నా భుజాలపై మోశాను. చిన్న, పెద్ద అనే జన్మ కన్నా మనం ఇతరులకు ఎంత సాయపడుతున్నామన్నది జీవితంలో చాలా ముఖ్యం అని తెలుసుకో! పాపం నీవు పడిపోయావని నాకు చాలా బాధగా ఉంది. ఇతరులను దెప్పిపొడవడం మానుకో''! అని హితవు పలికింది. మామిడి చెట్టు సిగ్గుపడి ''ఔను గడ్డిపరకా! మీరు అందరూ ఎంత మంచివారు. మీ గురించి చెడుగా మాట్లాడిన నాకు కూడా ఉపకారం చేస్తున్నారు. నేను పెద్దదాన్నని చాలా అహంకారంతో మాట్లాడాను.చిన్నవారైనా నాకు గర్వం పనికిరాదని తెలియజేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. అహంకారం ఎవరికీ మంచిది కాదు. మీకు ఇవే నా ధన్యవాదాలు'' అని పలికి వాటిని మన్నించమని కోరింది. ఆ తర్వాత మామిడి చెట్టును అక్కడ నుండి తరలిస్తుంటే ఆ మామిడి వీడ్కోలు చెబుతూ కన్నీళ్లు కారుస్తుంటే అవి కూడా దానిని చూస్తూ జలజలా కన్నీళ్లను కార్చాయి.
- సంగనభట్ల చిన్న రామకిష్టయ్య
9908554535