గోడలుగా గుంజలు, ప్రహరీలుగా కర్రలు... ఇళ్ళ కప్పుగా వాసాలు.. మట్టిలో పాతబడిన కలపతో మొలిచి నిలుచున్న మొగరాల్లా ఉంది ఆ గూడెం.. ఎటుచూసినా దట్టమైన పచ్చదనం.. మనుషులు మాత్రం మట్టిరంగులో ఉన్నారు. వేపచెట్టుకు దాని నీడచేరిన ఆ గూడెం జనాలకూ ఒకే పోలిక.. చెట్టు కొమ్మలన్నీ ఒకే కులం.. ఆ జనమంతా ఒకే తెగ.. ఏదో విషయం చర్చించేందుకు అక్కడ పోగయ్యారు.. వాళ్ళ తలలు అట్టలు కట్టి ఉన్నాయి.. పళ్ళు పొగాకు కాడల్లా ఉన్నాయి.. బస్తర్ గిరిజన మాండలికంలో వాళ్ళ సంభాషణ సాగుతోంది...
'పాములోడు పాముకి ముంగీసకి కొట్లాట బెట్టినట్టుంది పెతేడు ఈ లడాయి.. అసలు పాము ముంగిస కొట్లాడుడు.. జంగల్ల సూసినమా ఎన్నడన్నా.. ఆటికి దోస్తాన ల్యాకపాతె పాయె.. దుష్మన్ లేదుగదా.. మన సాయిన మనల్ని ఎగసాయం జేసుకోనిత్తే మనమెందుకు ఆళ్ళజోలికి పోతం.. ముందు ఆళ్ళే గద మనజోలికొచ్చింది.. పంటలు టాట్టర్లతో తొక్కిచ్చిన్రు, పసువుల్ని తోలకపోయిన్రు, కందకాలు కొట్టిచ్చిన్రు, బాయి బూడిపిచ్చిన్రు..' ఫారెస్టోళ్లతో లడాయికి కారణమేందో తమ పక్షాన చెప్పుకుపోతున్నడు కీమా.. తలగుడ్డ గట్టిగ చుట్టుకుంటూ.. తన ఆక్రోషం లోకానికంతటికీ అలా వినిపించాలని అతని ఆవేశం. కానీ అక్కడున్నది ఆ తెగకు చెందిన జనం మాత్రమే... 'పాములోడు అట్ట అనుడే గానీ పాపం వాడెన్నడు పెట్టిండు కొట్లాట.. ఆడేదో బతుకుదెరువుకు జెర్రిపోతులాడిపిచ్చుకునే గరీబోడు.. గానీ గవుర్మెంటోళ్లు మాత్రం లడారు పెట్టేసూత్తన్నరు.. ఏ పెభుత్వం అధికారంలో ఉన్నా సరే.. ఏటా ఈ గోలలు గొడవలు తప్పట్లే...' లుంగీ ఎగ్గట్టుకుంటూ అన్నాడు అండమ..
'అవ్వపెట్టదు.. అడక్కతిన్నియ్యదు అన్నట్టుంది గవుర్మెంట్ యవ్వారం. మనకి య్యాల్సిన బూము లేయో మనికిస్తే ఆట్లెనే సేసుకుందుం గద ఎగసాయం... అటవీ అక్కుల సట్టం అని పెద్ద గొప్పలు జెప్తరు. అమలు జేసుట్లో సిత్తసుద్దిలేదు.. ఏళ్ల తరబడి ఈ జంగల్ల జంగ్ జరగాల్సిందేనా... ఎందుకీ యుద్దం బుక్కెడు తిండిగింజలు పండిచ్చుకునే నేరానికేనా'.. ఆవేశంగా అడిగాడు ఇర్మయ్య..
పొరచుట్ట చేతిలోనే ఉంది.. వెలిగించుకునే సంగతి మరిచి పోయాడు ఆ తెగ పెద్ద సోనయ్య.. తన గుండె ల్లోంచి ఆక్రోషం మాటగా తన్నుకొస్తోంది.
'గాలికి కొట్టకొచ్చిన బతుకులురా మనయి. చిత్తు కాయితాలంత తేలిక.. మనమేమన్నా ఆస్థి కాయితాలమా.. డబ్బు కాయితాలమా.. పిచ్చి కాయి తాలం.. ఏ మూతి తుడుసుకున్నట్టు, ముడ్డి తుడుసుకున్నట్టు ఓట్లేయిచ్చు కుంటరు అగ్గో అందుకు తప్ప.. ఇంగెందుకూ పనికిరాం'.. తను దేని గురించి మాట్లాడుతున్నాడో అక్కడ జమైన ఆ గూడెపోళ్లకు తెలుసు.. అందుకే అందరూ అతనికి ట్యూన్ అవుతున్నారు.. 'గాల్లో పడేసిన ఇనుప కడ్డీ ఎంత గట్టిదైనా పొడుగు దైనా.. దానికి ఎక్కడో ఒకసోట తుప్పు పడితే.. దాని గట్టిదనానికి పొడుగుతనానికీ ఇలువుండదురా.. ఇరిగి ముక్కలైతది మనమూ గాల్లో ఇసిరేసినోళ్లమే గదా'.. చుట్ట నోట్లో పెట్టుకుంటూ అన్నాడు..
'జరిగింది తప్పో, పొరపాటో నేరమో.. మన ఒక్కళ్ళ వైపే జరిగిందా.. వాళ్ళెంత రెచ్చ గొట్టారు.. ఎంతకాలం నుంచి ఎంత వేధిస్తున్నారు.. గదిలోయేసి కొడితే పిల్లైనా ఎదురుతిరగదా'.. అదురుతున్న గొంతుతో అరిచాడు మారయ్య.. 'న్యారమే చేశారనుకుందాం. ఆ న్యారానికి దారి తీసిన పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకోరా.. సైకోడు పోడు జెయ్యనియ్యకపోతె ఎదురిచ్చురి అని ఓట్లక్కరప్పుడు జెప్పలేదా నాయకులు మేం గద్దెక్కంగానే భూములకు అక్కు పట్టాలిత్తం అనలేదా... బాణం పుల్లంత సూటిగా ప్రశ్నించింది జోగమ్మ..' అప్పట్లో కసబ్ అనెటోడు నేరంజేత్తె ఆడ్నొక్కడ్నే గదా ఉరి తీసింది.. వాడి దేశాన్నంత ఉరితీసిన్రా.. వాడి కులాన్నంత ఉరి తీసిన్రా.. ఇప్పుడు మన గూడెం అంతటినీ బలి చెయ్యటం ఏంటి'.. నిలదీస్తున్నట్టు అడిగాడు ఉంగయ్య.. 'వాళ్ళు పెమాద కరమైనోళ్లు వాళ్ళని ఎళ్లగొట్టాలనేలా గిరిజన శాఖ మంత్రి మాట్టాడ్డం.. అన్నాయంగాదా.. అనొచ్చునా అట్ట.. తల్లికో, తండ్రికో బిడ్డలందరి మీద ప్రేమ ఉండదా'.. కన్నీళ్ళ మయమవుతూ వాపోయింది సమ్మక్క..
పిట్టలు ఎక్కడెక్కడి నుంచో తెచ్చి ఇత్తనాలు పడేత్తే మొక్కలు మొలిశి ఈ అడివైంది.. మనమూ అంతే ఈజంగల్లో చెట్టులా ఏర్లు పాతక పోయున్నం.. సావైనా బతుకైనా ఈడ్నే.. ఈ నేల ఇడిసిపెట్టి పొయ్యేదేల్యా... తీర్మానించినట్టుగా అన్నరు అందరూ..
మనల్ని ఎలేసేందుకు ఇంత కుట్ర జరుగుతంటె.. ఏది ఎవరూ స్పందించరేం.. ఎటుపోయారు రాజకీయ పార్టీలోళ్ల్లు, మానవ హక్కులు, పౌర హక్కులోళ్లు.. అడిగాడు డిగ్రీ చదువుతున్న దూలయ్య..
'వొస్తరొస్తరు.. ఇది సలికాలం గద.. రాబోయేది ఓట్ల కాలం గద.. ఆచితూచి స్పందిస్తరు..' అన్నాడు బిక్కూ.. వీళ్ళందరిలో ఈ భయాలకు, ఆదుర్దాకు, ఆందోళనకు, ఆవేశానికి ఆక్రోషానికి కారణం కొద్దిరోజుల క్రితం జరిగిన అవాంచనీయ సంఘటన... దాని పర్యావసానాలు..
కాలి చల్లారుతున్న నెగడులా ఉంది ఆ ప్రాంతం... పైకి బూడిదలా కనిపిస్తున్నా లోలోపల లావాలా ప్రవహిస్తున్న అగ్గి తీరుగా ఉంది అక్కడున్నోళ్లలో కోపం.. 'వాళ్ళు మట్టిగొట్టింది బాయిలోనే గాదు.. మననోట్లె, మన బతుకుల్ల.. గంగమ్మ తల్లి నోట్లె బండెడు మట్టిబోశిండు ఆడు మట్టిగొట్టకపోతడు.. ఆడు సదనమైతడు'.. మట్టిమీద కూర్చోని గుండెలు బాదుకుంటున్న బొజ్జమ్మ తన రొండు చేతుల్ని కసిగా నేలమీద బాధగానే దుమ్ము ఇంతెత్తున లేచి ఆ అడవిలో సుడులు తిరిగింది..
'బాయిల మన్ను బోయొద్దు పోయొద్దని ఎంత మొత్తుకున్న ఇనలే.. ఒకళ్ళనిద్దరినైతె ఎట్లో ఎదురుకుందుం.. తెల్లారెపాటికి దండుపడ్డట్టు పడ్డరాయె మన భూముల మీద'... ఏడుపు గొంతు కలిపింది చాంప్లి... అక్కడున్న ఆడోళ్లల్లో ఎన్ని కన్నీళ్లున్నాయో కొలుస్తోంది అంతకు కొద్దిగంటల ముందు జరిగిన సంఘటన...
ఏజెన్సీ ప్రాంతంలోని మారుమూల గిరిజన గుంపు అది... ఛత్తీస్గడ్ రాష్ట్రానికి చెందిన యాభరుకి పైగా గొత్తి కుటుంబాలు ఆ ప్రాంతంలోని అడవి గుట్టల్లో చాలా ఏండ్లుగా నివసిస్తున్నాయి.. కానీ ఆ సమయంలో గుంపుగుంపులో లేదు పోడు భూముల్లో పొర్లిపొర్లి విలపిస్తోంది..
ఒకచోట కారుతున్న అందరి కన్నీళ్ళన్నీ ఒకచోట చేర్చితే పూడిన బావినే మించిన చెరువే అవుతుంది... రేగిన దుమ్ము కన్నీళ్ళపై పరుచుకుంటోంది.. ఆడోళ్ల ఏడుపు. ఎంతకూ ఆగేలా లేదు మొగోళ్లకళ్ళల్లో రగులుతున్న కసి అంతకన్నా...
అండమాన్ దీవుల్లో బోండ జాతిలా ఆటవీ ప్రాంతపు తెగల్లో కొన్ని ప్రమాదకర సమూహాలుంటారు... వీళ్ళు వాళ్ళంత ప్రమాదకారులు కాదు స్నేహం చేస్తే బాగానే ఉంటారు కానీ పగబడితే రాక్షసంగా ప్రవర్తిస్తారు... ఇంట్లోకి దూరి నక్కిన పామును వెతికిపట్టి హతమార్చందే కుదుట పడనట్టుగా శతవు అంతు చూడందే శాంతించని పగలక్షణం వాళ్ళది..
'అయ్యో... నీళ్ళలో నలక ఉందండీ.. గ్లాసులో ఉందేమో చూసుకోలేదు.. ఆ నీళ్ళు తాగకండి' అని వారిస్తుండగానే.. గటగటాతాగేశాడు రమేష్... గ్లాసు నీళ్లతో పాటు కొన్ని కన్నీళ్ళ చుక్కలూ మింగిన విషయం తనకొక్కడికే తెలుసు..
అన్నం తింటున్నప్పుడు తినటం పూర్తయ్యేదాక సాధారణంగా నీళ్ళు తాగడు కానీ ఈ రోజు కంచంలో ముద్ద కలపకుండానే గ్లాసుడు తాగాడేంటి అని ఆశ్చర్యపోతోంది అతని భార్య కమల...
'మళ్ళీ ఏమన్నా అన్నారా మీ ఆఫీసర్లు'.. అని మెల్లగా అడిగింది భర్త ముఖంలో విచారాన్ని గమనిస్తూ..
అటవీ శాఖలో జిల్లా స్థాయి అధికారిగా విధులు నిర్వహిస్తున్నాడు తను.. విధి నిర్వహణల్లో లక్ష్యాల సాధన, ఉత్తర్వుల అమలు వంటి విషయాల్లో ఎంత సమర్ధవంతంగా పని చేసినా అపుడపుడూ పై అధికారులకు సంజాయిషీ ఇచ్చుకోవలసి వస్తుంది.. అలాంటిదేదో జరిగుం టుందని ఆమె అనుకుంది..
' లేదు.. నేనే ఈరోజు కఠినంగా వ్యవహరించా.. గుట్టమీద కోయోళ్లు తవ్వుకున్న బావిని బలవంతంగా పూడ్పించా.. విధి నిర్వహణలో భాగంగా ఆ పని చేసినందుకు అధికారులు నన్ను మెచ్చుకున్నారు కానీ నాకే నేను చేసిన పని ఇవాళెందుకో నచ్చలేదు.. ఆ ఖాకీ బట్టలు వంటిపై ఎప్పుడూ ఉండవు కదా.. అవి తీసేస్తే నేనూ మానవత్వం ఉన్న మనిషినే... ఆటవికులకు వ్యతిరేకంగా నేను మరింత ఆటవికంగా వ్యవహరించానేమో అనిపిస్తుంది.. కానీ అది నా కర్తవ్యం.. ప్రభుత్వోద్యోగిగా అది నా బాధ్యత.. ప్రభుత్వ ఆదేశాలకు కట్టుబడి నేను పని చేశా, కానీ నన్ను మానవత్వం వెంటాడుతోంది.. వొంటిమీద ఎప్పుడూ డ్యూటీడ్రెస్ ఉంటే బావుండు మనిషితనం గుర్తు రానంతగా విధుల్లో మరింత కఠినత్వం చూపిద్దును అనిపిస్తోంది'.. ఎమోషనల్ అవుతున్న భర్తను ఓదార్చుతూ.. అతని భుజమ్మీద చెయ్యి వేస్తూ మెత్తగానొక్కింది ఆమె.. కన్నీళ్ళ తీగను కత్తిరించి నట్టు రొండు కన్నీటిబొట్లు అతని కళ్ళనుంచి రాలిపడ్డాయి..
'ఇంతకూ ఏమయ్యింది డాడీ' అంటూ హాల్ నుంచి డైనింగ్ వైపొచ్చింది అతని కూతురు..
'ఏంలేదమ్మా.. ఏదో చిన్న ఇష్యూ. అన్నయ్యా నువ్వెళ్ళి పడుకోండి గుడ్ నైట్' అని చెప్పగానే ' ఓకే డాడీ గుడ్ నైట్' అంటూ పిల్లలు అక్కడి నుంచి కదిలారు.
'ఇంకా ఎక్కువ ఆలోచించకండి ప్రశాంతంగా ఉండండి. అదిగో ఆ గోడమీద ఫొటోలను చూడండి. మీ ఉన్నతాధికారుల నుంచి ముఖ్యమంత్రుల నుంచి మీరందుకున్న ప్రశంశా పత్రాల ఫొటోలు చూడండి. వాటిల్లో ఎంత ఠీవీగా ఉన్నారు. మీ ఉద్యోగం తప్ప ఇంకేవీ ఆలోచించకండి' అంది. అతని ఆలోచనల్లో చీకటి మరింత ముసురుతోంది..
తెల్లారింది.. ఒకొకళ్ళుగా వేపచెట్టు వద్దకు చేరుతున్నారు గిరిజనులు.. అందరి చేతుల్లోనూ పొడవుగా వేటకొడవళ్ళు బుసకొడుతున్న తాచుపాముల్లా ఉన్నారు.. ప్రశ్నల్లా పదునుగా ఉన్నారు కొడవళ్ళు కానీ వాళ్లకు కావాల్సిన జవాబులు మాత్రం ఎంతకూ వాటి వేటుకు తెగిపడటం లేదు..
'మన పంటలు తొక్కించిన్రు, మన పసువుల్ని సీజ్ చేసిన్రు .. నీళ్ళబాయి పూడ్శిన్రు.. మెతుకు పండిచ్చుకునుడు కష్టం.. ఇగ తింటానికి బుక్కెడు బువ్వ దొరకదు.. అడివిల పుల్లలు ఏరుకుంటుంటె సూసిసూడనట్టుగ, మ్యాకలు, బర్రెల్ని మేపుకుంటుంటే ఊసి సూడనట్టుగ ఉండెటోళ్ళు నాలుగు బువ్వ మెతుకులు పండిచ్చుకుంటంటే ఇంత రాచ్చసంగ పెవర్తిస్తరా..
మనమేమన్న టేకు చెట్లు నరికి అమ్ముకుంటున్నమా, గంధం మొద్దులు అమ్ముకుంటున్నమా.. ల్యాకపోతె వందలె కరాలు, ఎయిలెకరాలు ఆక్రమించి భూములమ్ము కుంటన్నమా. పొట్టపోసుకోటానికి పోడు చేసుకుంటన్నం.. అదీ ల్యాకపోతే ఏమైపోవాలె.. ఈ అడివిల చెట్లుచేమలోలిగెనే పుట్టిపెరిగినం గదా.. అడివి బిడ్డలకు ఆ మాత్రం అక్కులేదా.. దున్నెటోనిదే భూమి అని ఎప్పుడో జెప్పిన్రు గదా... జల్, జంగల్, జమీన్ మనది గాదా'.. పొద్దెక్కుతున్న ఎండలా ఒకొకరి నోటి నుంచి ప్రశ్నల తీవ్రత పెరుగుతోంది... 'ఎన్ని సార్లు ఆళ్ళకు పుట్టతేనె, కుంకుడుగాయలు ఉసిరిగాయలు, తునిక్కాయలు తెచ్చియ్య లేదు మనం.. ఆళ్ళు, పాము తేలు కాట్లకు గురైతే ఎన్ని మాట్లు మనం మందియ్యలేదు.. నీళ్ళ దూపైతాందంటె సొరబుర్రల్ల నీళ్ళు తెచ్చిచినోళ్లం గదా.. పంటల కోసం వాడుకోకుండా మన నీళ్ళ బాయిలనే మట్టి బోయిస్తరా'.. వాళ్ళ ఆక్రోషం మరింత ఆగ్రహంగా వ్యక్తం అవుతోంది.. మనిషి ఆక్రోషభరిత ఆవేశంగా ఉన్నప్పుడు నోరు తుపాకీ అవుతుంది.. ఒకో మాట ఒకో తూటాగా పేలుతుంది..
కొద్ద్దిరోజులు సెలవుపెట్టండి ఎటన్నా టూర్ వెళదాం.. ఉద్రిక్త పరిస్థితులు తగ్గాక డ్యూటీకి వెళుదురు అంది కమల భర్త డ్యూటీకి బయలుదేరుతుండగా.. ఈ ఉద్రిక్త పరిస్థితులు ఏటా ఉండేవేగా.. అయినా ఇలాంటి పరిస్థితుల్లోనే గవర్నమెంట్‌కు సపోర్ట్‌గా ఉండాలి.. నీకు తెలియదా నా డ్యూటీ సిన్సియారిటీ.. అవసరమైన సమయంలో సెలవుపెట్టి తప్పించుకోలేను.. ప్రభుత్వం నా మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయలేను.. ఉద్యోగాల్లేక ఎందరు అల్లాడుతున్నారో తెలుసా.. ప్రభుత్వం నాకు ఉద్యోగం ఇచ్చి ఆధారం కల్పించింది.. నా సర్వీస్ అంతా తన సేవకే ధారపోస్తాను.. ఇవాళ మరింత మంది ఫోర్స్ తీసుకొని అడవికెళుతున్నాం.. ఈ రోజు పోడు భూముల్ని ఖాళీ చేయిస్తాం.. స్పష్టం చేస్తూ జీపెక్కాడు..
ఆ తరువాత పోడు భూముల్లో వేసిన పంటల్ని ధ్వంసం చేస్తూ గిరిజనుల్ని వెళ్ళగొట్టే చర్యలకు దిగగా.. వాళ్ళు తీవ్రంగా ప్రతిఘటించారు.. ఆ సందర్భంగా జరిగిన ఘర్షణలో తోపులాట.. తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.. ఫారెస్ట్ సిబ్బంది లాఠీలు ఝుళిపించటంతో గిరిజనులు తమ చేతుల్లోని వేట కొడవళ్లతో ఎదురుతిరిగారు... ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన రమేష్ మతి చెందాడు.. ప్రభుత్వ అధికారిని హత్య చేయటాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.. గిరిజనులను తమ పంచాయతీ నుంచి బహిష్కరించాలని స్థానిక గ్రామ పంచాయతీ తీర్మానించింది.. అడవిలో వేసుకున్న గుడిసెలు సైతం ఖాళీ చేయాలని ఆదేశిస్తూ ఫారెస్ట్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.. ఒకదాని వెంట ఒకటి జరుగుతున్న సంఘటనలకు గిరిజనులు బిక్కుబిక్కుమంటున్నారు..
తాము ఇతరులతో సమాన స్థానికులమే అని గతంలో కల్పించిన ఆధారాలు ఉన్నా తమను బలవంతంగా చోటు చేయించటం ఏమిటని, సంఘటన జరిగిన గూడెం వాసులతో పాటు ఏజెన్సీ ఏరియాలోని తోటి గిరిజనులు ప్రశ్నిస్తున్నారు.. తమ పక్షాన మద్దతు పలికే గొంతుకోసం నిరీక్షిస్తున్నారు.. అధికారి హత్యకు దారితీసిన పరిస్థితులేంటి, గిరిజనులకు స్థానికంగా నివసించే హక్కును సైతం నిరాకరిస్తున్న దుస్థితి కారణమెవరని అడవితల్లి నిలదీస్తోంది. జరిగింది సమర్ధించకూడని దుర్ఘటనే కానీ ప్రభుత్వం ఈ సాకుతో పోడు భూముల సమస్య పరిష్కారాన్ని తొక్కిపెడుతుందేమోనని వామపక్ష పార్టీలు ఆలోచిస్తున్నాయి..
బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం పరిహారం చెక్కు పంపింది.. ఆ రాత్రి.. అమ్మా.. ఆ పోడు భూముల సమ స్యేదో తీర్చేస్తే.. ఫారెస్టోళ్లకు, గిరిజనులకు అసలు గొడవే వొచ్చేది కాదు కదా.. నాన్న మనతోనే ఉండేవాడు కదా.. కూతురు ప్రశ్నిస్తుంటే దీర్ఘంగా ఆలోచిస్తోంది కమల.. చలికాలం కిటికీలు వేసి ఉన్నా.. లోనికెలా తోసుకొచ్చిందో అడవిగాలి.. టేబుల్ మీద పెట్టి ఉన్న చెక్ రెపరెపలాడుతోంది.. తనూ ఏదో చెబుతున్నట్టు..
- శ్రీనివాస్ సూఫీ, 9640311380
Sun 11 Dec 01:12:48.15022 2022