రైయ్యిమంటు బుల్లెట్ వేగంతో వచ్చి బైక్ పక్కగా ఆపి ముందుకు రెండడుగులు కదలి కుడిచేతి పైకెత్తి సెల్యూట్ చేస్తూ ''గుడ్ మార్నింగ్ సార్'' అంటూ పలకరించిండు.
''ఆ.. రావయ్యా హెడ్డు.. రా నీకోసమే చూస్తున్నా, నువ్వు వచ్చావు సరే మీ సార్ ఎక్కడా'' అంటూ పలకరించిండు సర్కిల్ ఇనస్పెక్టర్.
''సార్ అతను వచ్చాడనుకొన్నా, వస్తు వున్నాలే సార్ మీ కాల్ వచ్చిందంటే సాకు చూపి తప్పించుకుంటామా సార్. మీ వల్లనే మేము ఈ స్థాయిలో వున్నది మీరు ఓ మెట్టు ఎక్కితే మీ వెనకాల మేము ఓ మెట్టు ఎక్కుతూ వచ్చాం సార్.'' వినయం నటిస్తూ పలికిండు హెడ్ కానిస్టేబుల్ అబ్బయ.
సరిగ్గా అప్పుడే సబ్ ఇన్స్పెక్టర్ నాగులు వచ్చి వాలిండు సెల్యూట్ కొడుతూ నంగాడుతున్నడు.
''ఇంత లేటా'' అడిగిండు.
''సార్ దారిలో ట్రాఫిక్ జామ్ అందుకే కాస్తా ఆలస్యం అయ్యింది.'' సావధానంగా పలికిండు.
''అరే ఇదిగో అబ్బన్న టీ చెప్పు తాగుతూ మాట్లాడుదాం.''
''అలాగే సార్, చిటికెలో'' అంటూ ''అరే మల్లేశన్న స్పెషల్ చారు పట్కరా సార్కూ''
''తెస్తున్న సార్ రెండు నిమిషాలు ఆగండి గరం చేస్తున్నా'' అన్నడు.
''ఏంది నాగన్నా ఆ ఒక్కటి ఎంతవరకు వచ్చింది ఏమన్నా కదలిక వుందా''
''సార్ నేను మన అబ్బనా అదే పనిలో మునిగి వున్నం సార్ క్షణం తీరిక లేకుండా''
''చూడు మనం ఎన్నో కేసులు చూసిన అనుభవం మనది కానీ ఆ ఒక్కటి కొరకరాని కొయ్యగా తయారయ్యింది నన్ను పైనుంచి ఒకటే దొబ్బుల పెడుతున్నరు జల్ది పినిషింగ్ టచ్ ఇస్తే పోలా, ఇంకెందుకు ఆలస్యం అవుతుంది.'' ఇంతలేశి కండ్లు పెద్దవి చేసి వారివైపు చూస్తూ పలికిండు.
''సార్ ఆ వొక్కడు చానా డిస్ట్రబ్ చేస్తున్నడు, కాలికేస్తే ఏలుకు, ఏలుకేస్తే కాలుకు, చుట్టుకుంటుంది. శతవిధాల ప్రయత్నించినా బురదమట్ట లెక్క జారిపోతుండు, మీరు చెప్పినట్టు ఆ ఒక్కదాన్ని వదిలించుకోవాలని పడరాని పాట్లు పడుతున్నం. ఇంతవరకు వాని ఉసు లేదు అనుపు లేదు. అంతా వొట్టిదై పోయింది''
''మనం ఎన్ని చూడలేదు అది నీకు తెలుసు నాకూ తెలుసు ఏమంటావ్ అబ్బులు. ఇది మన ముగ్గురికే కాదు ఎంటైర్ మనకే ఇదో సవాల్ ! మనకెన్ని తెల్వవు! వాటి లింకుల మతలబు ఏమిటో నీకు నాకే కాదు జనమందరికీ తెలిసిందే. మనమే తిమ్మిని బమ్మిని చేసి కొన్నింటికి షో చూపుతున్నం. కానీ పై నుంచి ఇంత వొత్తిడి వస్తదనుకొలేదు. మీరే ఏదో ఆలోచించండి'' తిన్నగా పలికిండు అతను.
''ఎవడన్నా బకరా వుండేమో చూడు''
''మనం సృష్టించింది చిన్నది కాదు దీనికి బకరా సరిపోడు''
''అవును సార్ పులి చారాలాంటి పిల్లి కావాలి, వున్నదానికి వాత పెట్టాలి, ఎందరికి ఎన్ని పెట్టినం, ఈ కుర్చీ పవరు తెలియనిది కాదు. ఏదో అశ్కలు బుష్కలు చేయాలి మనం చెప్పిందే వేదం. కాదంటోడు ఎవడు. మనం ఎంత అంటే అంతా నిజమా కాదా''
''అవుననుకోండి మీ అంత ధైర్యం మాకెక్కడిది సార్''
''నీ అసొంటి వానికి ఈ కొలువెందుకు రాజీనామా చేసి వేరేది చూసుకో''
''అంత మాట ఎందుకు సార్ ఏదో ఒకటి చేద్దాం''
''చేద్దాం, చూద్దాం అంటే కుదురదు. బరిలోకి దిగినమంటే దెబ్బకు టా అన్నట్టు వుండాలే''
''సార్ ముందు చారు తాగండి చల్లారి పోతుంది'' అన్నడు అబ్బన్న.
''ముగ్గురు కూడిండ్రు ఎవనిళ్లు ముంచుతారో పో'' చారు బండి అతను వారివైపు వారగా చూస్తు లోలోన సనిగిండు.
''ఒకడుండు సార్ వానికి ఎనకా ముందు ఎవడు లేడు, వాడిని మనం ఏమయినా చెయ్యొచ్చు, ఎంతయినా ఆడుకోవచ్చు. వాడిని మభ్య పెట్టి ఏదోలా ముగ్గులోకి దింపి ఇరికిస్తే సరి. మన పని కతం అయిపొద్ది'' ఉషారుగా పలికిండు అబ్బన్నా....
...
''మీరు దీనికి శ్రీకారం చుట్టి చెక్ పెట్టండి జింక పిల్ల ఎక్కడికి తప్పించుకోలేదు. మన ఎత్తుకు కొండయిన చిత్తు కావలసిందే మనం బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే, వాడిని అష్ట దిగ్బంధనం చేస్తే ఊపిరి మెస్లక ఉక్కిరబిక్కిరై సావాలే కొడుకు''
''చేతిని మన్నంటకుండ కావాలి, పోయినోడు పొయినా ఆ పీడా మనకు చుట్టుకోవద్దు.''
''పీడా గిడా ఏం మాట్లాడుతున్నవు నీతులు వల్లిస్తే పప్పు ఉడకదు ఊకనే కొరుగుతున్నావు''
''అంటే అదీ అదీ''
''నీళ్లు మింగకుర బై, మనకు అక్కా చెల్లి అంటూ మీన మేశాలు లెక్కిస్తే కుదురదు అయ్యగారు వొచ్చిన దాంక అమాస ఆగుతదా చెల్ నడు ఇంతకు ఎవడు''
******
''వాడే అదిగో వాడే''
''వాడి వంక చూస్తూ ఎవడో ఒకడు పట్టూ''
''అంతా సిద్ధం చెసే వున్నావ్ అబ్బన్నా''
''సార్ మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తున్న''
''వెరీగుడ్ పైకి వస్తావ్ కిపిట్ అప్ ఇప్పుడు థ్రిల్లింగా వుంది రుచి పాకం అమోఘం''
''సార్ అది ఈ రోజుల్లో గడ్డి గాలికి పోతెంది వోడ్లు వాగుల పోతేంది. నూకలు పెడితే మేకల జాడ మస్తుమంది చెపుతరు. వీని ఇంటి అటిటు పక్కొల్లే చాలు ఒక్క ఫుల్లు బాటిల్ మనది కాదంటే''
''అవునవును నిజమే, ఎని హౌ మన పని మరింత సులువు చేశినy''
''సార్ నన్ను కనిపెట్టండి''
''కొనేది చారానా కొసరేది బారానా అన్నట్టు ఆశ కానీ నిన్ను కనిపెట్టకుంటే ఎట్టా. నెక్స్ట్ ప్రమోషన్ నీదే''
''అంతా మీ దయ''
''ఆపరేషన్ యాత్ర శ్రీశైలమా, శ్రీకాకుళమా లేక భద్రాచలమా ఎక్కడ ముగిద్దాం.''
''వీని ఓపికను బట్టి చెరువు తగలబెడితే చాపలు చెట్లు ఎక్కుతయ, చూద్దాం''
'' ఏజెంటు రవిక సిద్ధమేనా అడపడచు లెక్క ముస్తాబు చేయండి మన రుచి చూపండి.''
******
''ఏం పేరు రా''
''అయ్యా నా పేరు జే భీములు''
''అచ్చ అట్లన సందకం పెట్టు''
''దేనికి సారు''
''అరే సొత్తు చోరీ చేసింది నువ్వే ఒప్పుకో లేదంటే మక్కిలిరుగుతరు''
''నాకేం తెల్వదు సార్''
''అరే చల్ నక్రాలు చెయ్యకు సక్కురంగ ఒప్పుకొని సంతకం పెట్టు'' గుడ్లురిమి చూసి కసరుతు పలికిండు డిఎస్పి, పక్కంగ సిఐ చూస్తూ
''ఒక్కసారి ఒప్పుకొరా వదిలి పెడుతం'' అంటూ పలికిండు కనుబొమ్మలు ఎగరేస్తూ.
సార్ నేను ఏం చేయకుండా ఎలా వొప్పుకోవాలి నేను అమాయకున్ని సార్, నేను చేయని నేరానికి నన్ను బలి పశువును చేస్తున్నారు. మీకిది న్యాయం కాదు సార్. నన్ను వదిలి పెట్టండి సార్. నేనే దొరికిన్నా నేను ఎక్కడికి పొతే అక్కడిక వచ్చి నాకు ఎరేసి ఇరికిస్తున్నరు, గుడిసెలో వుంటే నమ్మించి ఎత్తుకొచ్చి నన్ను బెదిరించి నింద నా మీద ఏస్తారు. మీరు సంపినా సరే నేను సంతకం పెట్టను
హెడ్డు ఎక్కడ దొరికిండు వీడు.. ఒప్పుకున్న దాంకా వుతుకు కొడ్కుని
''సార్ ఎప్పటి లెక్కనే గస్తికి వెళ్లిన, నిన్న రాత్రి వీడు ఇంట్లోకి తొంగి చూసిండని బస్తి కాలనిలో అనుకుంటున్నరు వీడు అక్కరోస్తడని వాని గుడిసె దగ్గరికి వెళ్లి చూసిన వాడు వాని పెండ్లాం కుషిమిద వున్నరు వాడు పాట పాడుతింటే అది వంత పాడింది ....
''నల్ల నల్లని దాన చెంచితా ఓ నవ్వు మొకం దాన చెంచితా....
కోరింత పువ్వోలె చెంచితా నీ కొప్పులో దాగుంట చెంచితా...
కొప్పు తిప్పి కొడితే ఓ మావ మళ్ళప్పుడెడుంటవుర నా మావ..
దిర్సన పువ్వోలే చెంచితా నీ దాపునా నేనుంట చెంచితా...
దాపున నివుంటే ఓ మావ దాసి గా నేనుంట ఓ మావ
నీ దాసిగా నేనుంట ఓ మావ...
పొద్దు తిరుగుడు పువ్వోలే చెంచితా పొద్దంత చూస్తాను
చెంచితా... నిన్ను పోద్దంత కాస్తాను చెంచిత...
''అబ్బా పాటతో సంపకు మావ'' అంటూ కిల కిలా నవ్వుతూ మిలమిల మెరిసే కళ్ళతో విపరి చూసింది.
''ఏమ్రో మాంచి జోరుమీదున్నారు సరసాలు చాలు గాని నడువు'' అని నేను అనాగానే ''ఎక్కడికి సారు'' అంటూ బెదురుగా చూసిండు భీములు.
''చెబితే గాని రావారా, ఎదురు అడుగుతున్నావు నడువు సార్ రమ్మంటోండు చెల్ నడువు'' అని నేను అనంగనే ''ఎందుకు రమ్మంటోండు మేమేటి చేసినం సారు, నా మావను రమ్మంటున్నవు'' అంది. నాకు కోపం నషాళానికి ఎక్కి ''అశే ఇద్దరు నడవండి'' అని వాని దండ రెట్ట పట్టి జీపెక్కించా.''
ఏం జరుగుతుందో తెలియక అయోమయంలో అమాయకంగా వారి వైపు చూస్తూ ''అమ్మా అయ్యా నన్ను ఇడువండి సారూ నన్ను వోదులండి సార్...'' అనేలోపు ''ఏయ్యి ఎత్తి కొట్టు ఎయ్యి గట్టిగ ఎయ్యి ఏంది అబ్బన్నా ఇలాగేనా దంచేది దెబ్బకు దేవుడు దిగిరావాలే ఇగ్గొ ఆడోళ్ళకు గుండెల ధైర్యం వుండాలే- మోగోళ్ళకు పిక్కన పట్టు వుండాలే అప్పుడు తాకత్ తెలుసుద్ది ఎర్కేన''
'' అమ్మా అయ్యా... నీ కాల్మొక్కుత..
''వదిలే ముచ్చట లేదు కొడుకుని మూడు చెరువుల నీళ్లు తాపాలి కొడుకుని వెలాడదియ్యిర.. ఎయ్యి''
పెడి పెడి...... ''ఎనకమర్ల రెక్కలు విరిసి కట్టు, అరే కాళ్ళు ఎనక్కి మల్చు , అరికాళ్ళ మీద సర్సు....''
''వీపు మీద ఎక్కి సర్సుర ఎయ్యి సావనియ్యి''
''సార్ సస్తడు సార్''
''సావానియ్యి కొట్టు పెడి పెడి.. ఎయ్యి సర్సు''
''రక్తం గక్కుతుండు సార్''
''అరే ఐసు పెట్టారా''
''అబా అబ్బా వొదులు సా..ర్''
''అరే కారం సల్లురా''
''మంట మంట మంట''
''ఉప్పు నీళ్లు సళ్లురా ఆ హా హ హ...''
''ఆ... అబ్బా''
''కొట్టి కొట్టి నాకే విసుగు పుడుతుంది ఒప్పుకోర..''
''ఇచ్చి పుచ్చుకున్నోడు అసుంట పోయినట్టుపొతే ఎట్టర.. పెట్టిపోయినోడు పెయ్యంత గిల్లి చూసినట్టు కానిరు కానీరు.. కారం ముద్ద పెట్టారా...''
.....
''ఆయిన్ని ఇడువుండ్రి సార్ మాకేం తెలువదు సార్''
అరే దీన్నీ ఎక్కురా ఈడ్సుకరారా! చెప్పు వానికి ఒప్పుకోమని''
''చేయని తప్పుకు సార్ ఒక్కసారి ఒప్పుకుంటే బతుకంతా నింద మోయ్యాలే సార్ మేము మోయ్యం''
''సంపుతరా సంపుండ్రి. నువ్వేం డుటి చేస్తున్నావురా మంది ఉసురు తీసుకుంటూ రూపాలకు ఆశపడి ఇట్లా చేస్తున్నావు. నేను రెక్కల కట్టం జేసి తెస్తరా, ఆ సొమ్ము తిని బత్కర, కడిగి పోస్త గిన్నె తెచ్చుకో నా కండలు కర్గ బెడుత. జీతం సాలలేదురా, కావాలి కుసో కొడుతవ కడుపుల తంతావు రారా నీకు లేని సిగ్గు మాకెందుకు నువ్వు బట్ట కట్టినావు నీకు పెండ్లాం పిల్లలు లేర్రా అల్లకు మా ఆసొంటి వొళ్ల ఉసురు తాకదా''
''దెబ్బకు గెక్కున గునుపూ ఓయామ్మ సంపెనే ఇట్లా తెగబడ్డారు''
''నోటిలో గుడ్డలు కుక్కిరే సెలిమెల పొంట నెత్తురు కారుతుందే ... ఓయామ్మో ఒదేవుడో బావో బావా మనం ఏం తప్పు చేస్తిమి బావా. మనం ఏం నేరం చెస్తిమి. యమునోల్ల లెక్క యెంట పడ్డరు.. తల్లికి పిల్లకు ఎడబాపే కొడుకులు.. అగ్గిపెట్టి పకపక నవ్వుతున్నరా.. కయ్యం లేనికాడ కయ్యం బెట్టే కొడుకులు.. తమాషా సుస్తున్నరా.. వీళ్ల ఇంట్ల పీనుగెళ్ళ.. తప్పు చేసిన వాడు తల ఎత్తి తిరుగుతుంది.. మందిని ముంచినొడు మంచోడు అంట.. బొడ్రాయి సాచ్చిగ.. అబద్ధాలు ఆడేవారు... సంసారులు ఆయిపాయే.. నరానికి పుండు పెట్టీ నడమంత్రపు సిరి తొనీ కులుకుతున్నరు.. వాళ్ళు నాటకము ఆడుకుంటూ మనాయి నాటకాలు అంటూర్రు.. కడుపు కాలి మనముంటే పక పక నవ్వుతున్నారు. మట్టి కరువాలే.. ఇంతకి ఇంతకు గోస తియ్యాలే...
రేపు ఎస్పీ, డిఎస్పి విజిటింగ్ వుంది పట్కరాపో వాన్ని
******
అరే నీ కేసేంది
నాకేం తెల్వదు సార్
ఎవరు పట్టుకొచ్చిర్రి
అగో ఆ సార్ నీతో పనుంది రా అన్నడు వొచ్చిన
అట్లా కూసో
....
ఆరేరు బెంచీమీద కూర్చుంటావు లే బెంచి మీద నుంచి లే కింద కుసొ అరే ఆ సెళ్లు పక్కన కుషో.. నేల చూపులు చూస్తావు దొంగ గాడిదా!''
అయ్యా నా పెనిమిటి చూపే అంత అయ్య మమ్ముల ఎందుకు తీసుకొచ్చారు మా తప్పెందో చెప్పండి...
అసే నువ్వు ముయి నోరు ముయ్యి ఇది ఎదురు మాట్లాడుతుంది...
ఇదిగో హెడ్డు అక్కడ అదేమో చెబుతావుంది వాళ్లు సినిమా చూసినట్టు చూస్తున్నారు ...
నిజమైంది
అది
అదికూడా మనం అల్లింది
అవును సార్
అరే అబద్దం ఆడితే అతికినట్టు వుండాలే
ఎఫ్ఐఆర్ వుందా లేదా
లేదు
ఏం పీకుతున్నరు
ఆ పది మంది బయట ఇంకో పది మందికి చెప్పరా....
మన పని చేతికి పచ్చ బొట్టు ముద్దరేసినట్టు వుండాలే అది సచ్చిందాక పోతదా...
పోదు కానీ.... కానీ ఏంది
ప్లాస్టిక్ సర్జరీ ద్వారా తియ్యొచ్చు
వానికి తింటందుకు నూకలు గతి లేవు కదా ఇంగా ప్లాస్టిక్ సర్జరీ చేపించుకుంటడ వానికి అంత సీను లేదు
.....ఇంతకీ మనకు ప్రమోషన్ వచ్చినట్టేనా
ఇది అయితే వస్తది
నక్కను తొక్కినవూ పట్టు....
- భూతం ముత్యాలు
Sun 12 Feb 05:38:36.754607 2023