Sun 05 Mar 02:54:33.140269 2023
Authorization
పొద్దగాల ఆఫీసుకు బోయి ఫైళ్లు కేసులు హడావుడిగున్నపుడు నా కిటికీల నుంచి ఏందో లొల్లినవడ్తంది గానీ తేటగ లేదు మాట. నా దగ్గర పనిజేసే మీరతోని 'ఏందిలొల్లి' అని అడిగిన. లొల్లి మన గుడికాంచమ్మ, మన నల్ల పోచమ్మ గుడి ిపేరు తీసి పారేసి 'జయదుర్గ' అని మారుస్తున్నరట. గదిదెల్సి సీపర్లు, తోట మాలీలు, క్లీనర్లు, మా క్లాసు పోరొలంలంతా జమయి లొల్లి జేస్తుండ్రమ్మ అని చెప్పుతుంటే యింటున్న. యింతల మా దోస్తు హన్మకొండ నుంచి ఫోను- ''ఏంది మీ ఆఫీసుల గుడి గూడున్నదా, ఆఫీసులల్ల గుడేంది? గీ లొల్లేందే. టీవీలన్నీ లైవ్‌ల మొత్తుకుంటున్నయి. అందుకే ఫోన్ జేసిన ఏం సంగతోనని''. అరే పిల్ల ఒక్క గుడేందే, చర్చి, మసీదు గూడున్నయి మా ఆఫీసుల. ''అదేందే ఆఫీసులల్ల గుడులు, మసీదులు, చర్చీలెందుకే'' 'దాన్నే లౌకిక వాదమం టున్నరు ఏలినోల్లు' ఏం జేద్దాం అన్న ఫైలులో ఓ కన్నేస్తూ. ''అన్ని మతాలకు దూరంగా ఉండాలి, మతాలకు అతీతంగా వుండాలె గదా మరి గీల్లేంది గుడి, మసీదు, చెర్చి బెట్టి లౌకిక వాదం పాటిస్తన్నామ్ అంటరేందనీ మా దోస్తు కొంచెం ఆవేశంగానే మాట్టాడ్తాంటే నేను రెస్పాండ్ కాకుంటే, అసలు మీలాంటోల్లు, ఆఫీసులల్ల మద ప్రచారాలు, గుడులు, గోపురాలు వుండోద్దు తీసెయ్యాలని ఉద్యమాలు చెయ్యొచ్చుగదా మాట్టాడవేందే ఆఫీశ్వరమ్మా అని నిలదీస్తుంది.
మా దోస్తు నిలదీత నిజమైందే గానీ ప్రభుత్వాలే మతాలను యెగ దొయ్యబట్టే అయితే మా ఆఫీసుల 'గుడి' పేరు గురించే మా ఆఫీసు కింది తరగతి ఉద్యోగుల లొల్లి, మా ఆఫీసుల చిన్న రూమ్‌లో క్రైస్తవులొచ్చి ప్రార్థన చేస్కుంటుండిరి మసీదు ఒక హాలుండె, గుడి అనేది లేదు కానీ ప్రతి డిపార్టుమెంటుల సాయి భజనలు ప్రతి గురువారము జరుగుతుంటయి. ఆ రోజు సెక్షన్స్లల్ల అస్సలు పనులుకావు, తీర్థ ప్రసాదాలు, ఆఫీసర్లందరికి పంపుతుంటరు. ఏంటిది? ఏం జరుగుతుంది? అని ఒక్క ఆఫీసర్ అడుగరు, ఒక్క ఆఫీసరమ్మ అడగది ఆఫీసుల్లో పూజలు చేమొద్దు, మీకు భక్తి వుంటే మనసులో, యిండ్లల్ల వుంచుకోండి, గానీ యీ పబ్లిక్ ప్లేసుల్ల భజనలు లౌకికత్వానికి విరుద్దం అని మాట్టాడితే నేను భక్తులకు శత్రువునైన. పెద్దాఫీసర్లు గూడ గౌరవంగా గొప్పగానే చూస్తుంటరు. యిదేదో మంచిగానే వుందని ఆఫీసు పని ఎగ్గొట్టే వాల్లు భక్తి లేకున్నా భక్తులుగా నటిస్తూంటరు ఆఫీసర్ల కోసం. యిక క్రిస్టియన్స్, ముస్లిమ్‌లు, దేవున్ని నమ్మని వాల్లు ఆ హింస పడలేక పోతుంటరు. భజనలు, హారతులు, ప్రసాదాల పటాటోపాలు భరించటేక అటీటు తిరిగొస్తుంటారు, యీ తతంగాల కోసం చందాల వసూల్లు, గూడ బాగానే జరిగేయి. అయితే ఈ పూజా కార్యక్రమాల్లో మగవాల్లు, దళిత ఆడవాల్లు కనిపించరు ఓసీ, బీసీ ఆడవాల్లే యీ పూజా భక్తులు.
యీదో ఆఫీసనీ, దీట్లో అనేక మతాలోల్లు, వుద్యోగం జేస్తున్నరని, హిందూ మతమే మెజారిటీ మతమనీ యిష్టారాజ్యంగా ఆఫీసుల్ని భజన మందిరాలుగా మార్చే ఈ గురువార హింసను అడ్డుకునే మాలాంటి వాల్ల ప్రయత్నాలు పారలేదు. యీ పూజలు మాన్పించండి సార్ అని మా పెద్దాఫీసర్ని కోరితే, దానివల్ల మీకొచ్చే నష్టమేంటి? వీక్లీ జస్ట్ టూ అవర్స్, మీరెంత టైమ్ వేస్ట్ చేయట్లేదు పదిన్నర నుంచి అయిదున్నర దాకా పంజెస్తూనే వున్నారా, అని గదిమిండు వుల్టా, ఎట్లయినా ఆఫీసుల గీ దేవుని భజనలు మాన్పియ్యాలని ఆఫీసులో కొంతమంది ప్రగతిశీల ఉద్యోగులకు, మీడియా చానల్స్ వాల్లకు చెప్పినా వాల్లు సీరియస్‌గా తీసుకోలేదు.
మా ఆఫీసుల పనిజేసే స్వీపర్లు, తోటమాలీలు, స్కావెంజర్లు అటెండర్లుగా పంజేసేటోల్లు, ఆఫీసుమధ్యలో యాపసెట్టు కింద ఖాళీ జాగుంటే అక్కడ కూచొని మాట్టాడుకునేటోల్లు లంచ్ తినేటోల్లు ఆడోల్లల్ల పెద్దమనుషులు ముగ్గురునలుగురు కూడి చిన్నరాయి చుట్టు మూడు యిటికెలు సుట్టూబెట్టి మద్యల దీపం బెట్టి యింత పసుపు కుంకుమ బట్టి వుప్పుస దీర్సు కుందురు. అట్లా గుంపులు గుంపులు ఈ ఆడోల్లంత పనులైనంక మద్యానం లంచ్ మల్లా ఆఫీసు నుంచి పోయే ముందు జెరసేపు కూసోని పోయేటోల్లు. యిగ యింట్ల మంచి సెడ్డ జరిగినా, కొడుక్కు కొలువు రావాలని, బిడ్డకి పెండ్లి గావాలనీ, యింటైన ఆరోగ్యం బాగలేదనీ సల్లగ జూడు పోషవ్వా అసి మొక్కుకుని తుర్తిపడేది. యిక్కడే నాలుగో తరగతి మగ ఉద్యోగులు సైకిల్లు గూడ పెట్టుకొనేది. ఈ తావు క్లాసు ఫోరు ఆడ మగ కలవడం కోసం యిదో పెద్ద అడ్డా అయింది. క్లర్కులు, ఆఫీసర్లు, టైపిస్టులు ఎవ్వరు పోక పోదురు. తర్వాత రెండు ఫీట్ల మందం యిటికె లేపి సిమెంటు బూసిండ్రు సుట్టు సిమెంటు గోడ మద్యల దీపం వెలుగు తుండేది. మొదట్లో ఏందీ బుజ్జిగుడి అని అడిగితే ఓసారి ఎల్లమ్మ ని ఓ సారి పోషమ్మ, నల్ల పోషమ్మ అని చెప్పెటోల్లు ఎక్కువగా నాలుగో తరగతి ఉద్యోగినులు ఎక్కువగా ఈ స్థలంలో కూడేవాల్లు. వాల్లందరూ యిక్కడ కూడనీక ఆఫీసుల్లో అటెండర్లకు, తోటమాలీలకు, సీపర్లకు మెసెంజర్లకు ప్రత్యేకంగా సీట్లు వండవు కూచునే దానికి. స్వాతంత్ర అమృతోత్సవాలు చేసుకుంటున్నంగానీ యిప్పటికీ వీల్లకు ప్రత్యేకంగా సీట్లు లేవు ఈ ప్రభుత్వ ఉద్యోగులకు. ఆఫీసుల పంజేసుకొని చెట్ల కింద కూసుంటరు. అట్లా యాపచెట్టు కింద చిన్న యిటుకలు బెట్టి దీపం బెట్టిన తావుల వీల్లే శుభ్రం చేసుకొని కూచుందురు. అప్పుడప్పుడు ఏదైనా పండుగలొస్తే చానా మంది ఆడమగ క్లాస్ ఫోర్ ఉద్యోగులు కూడేవాల్లు. తర్వాత 'నల్ల పోచమ్మ' దేవరగుడి అని పేరు పెట్టుకున్నరు. అదే పేరున వేరే వాల్లకు తెల్సింది.
వీల్లు పొందిచ్చుకున్న గుడిని ఆ గుంపును చూసి ఆఫీసు కొచ్చే పైరవీ కారులు కూడా పని కావాలని మొక్కుకున్నారట. అట్లా నల్ల పోచమ్మను మొక్కుకున్న పైరవీ కార్ల పని జరిగిందని కొందరు పైరవీ కారులు, ఆగుడిని రెండు మీటర్ల ఎత్తుపెంచి పాలిష్ బండేయించిండ్రు. అట్లా యిట్లాయీ అమ్మ దేవర నల్ల పోచమ్మకు మొక్కుకుంటే మంచి జరుగుతుందనీ పెద్ద గుడిగా ఎస్టాబ్లిష్ చేసి ఒక పూజారిని గూడ నియమించిండ్రు. ఎమ్మెల్యేలు, మినిస్లర్లు రాజకీయ నాయకులంతా ఆఫీసులోకి మచ్చే ముందట గుడికి బోయి పూజారితోని పూజలు చేయించుకొని హెండీల పైసలు. యింకేమున్నది. మూడిటికెలతో మద్దెల రాయి బెట్టి యెలిగిచ్చిన దీపంతోని మొదలైన క్లాస్ ఫోర్ మహళా ఉద్యోగుల గుడి యిప్పుడు యిరువై గజాల పొడుగు యైటయాబై గజాలల్ల పాలిష్ బండలతోని విగ్రహాలతోని దూపదీప నైవేద్యాల తోని వెలుగుతుంది నిత్యమ్. యిగ ఆఫీసుల పంజేసే ఉద్యోగులు గూడ ఆఫీసుల రిజిష్టర్ల సంతకం బెట్టి గుడిల పూజా పునస్కారాలు చేసుడు ఎక్కువైంది. కానీ ఆ గుడిని పొందిచ్చిన ఆడవాల్లు ఆ పరిసరాలల్ల ఎప్పుడు కనపడలే.
క్లాస్ ఫోర్ మహిళా ఉద్యోగులు వుప్పసకోసం నలుగురు కూడుకునే జాగను పవిత్రమైన దేవుని గుడిజేసి వాల్లను ఆ గుడి సుట్టు పక్కల లేకుంట జేసిండ్రు యిప్పుడు వాల్లెక్కడ కూడుతుంద్రు అని మా ఆఫీసు సెట్లను యెతుక్కంటు బోతె అక్కడ ఓ సెట్టు కింద కూసుండ్రు కిద్దిమంది. వాల్లల్ల సోమేశ్వరి నాకు బాగా పరిచయం. ఆఫీసుల ఎవరేంటిది, మంచి సెడ్డలు బాగ మాట్లాడి బాగా అర్థం జేస్కునే పెద్దమనిషి.
ఏందిక్కడ మీరు అని అడిగిన వెంటనే ' అమ్మా మీ కండ్ల ముందట్నే గదా గా యాపసెట్టు కింద కూడుదుము. గింతంత దీపంబెట్టు కుంటిమి సల్లని తల్లి నల్ల పోషవ్వ. మంచిగుండె యిగ పెద్దోల్ల కన్నుబడి పెద్దగుడి గట్టిచ్చి గిప్పుడు మమ్ముల గండ్లకు గా పైజారైన రానిత్తలేడు. అయినా అమ్మా జెర నువ్వు జెప్పు దేవారనాయె నల్ల పోషమ్మ గీ మొగపూజారి ఏందో యెవ్వలకు తెలువని మంత్రాలు సదువుతడు, మన పూజగాదు, మన దీపం గాదు.. ఓ పది పదేనేండ్ల కింద యెట్లుండె గిప్పుడెట్లున్నది సూత్తన్నవుగదా ! గంత పెత్త నల్ల పోషమ్మ గుడిల గింత కోడిపిల్ల లేదు, మేక పిల్లం జెసుడు లేదు. దేవారవూకుంటదామ్మ''.
వూకుండక ఏంజేసింది మీరే దూరమైండ్రు గదా! మీరు యేర్పాటు జేస్కున్న దేవర మీగ్గాకుంట పోయినందుకు దేవార మీకు జేసిన మంచేంది ఆల్లకు జేసిన చెడేంది? ఆఖరికి మీరే ఆగమైతిరి గదా! మీ దేవర మిమ్మలనాదుకున్నదా ! ఆల్ల మొక్కులే తీరుస్తంది. ఆల్లకే అన్ని జేస్తంది గదా ! అంటే దేవర మీకు అన్యాయం యెట్లా జేసింది? మిమ్ముల గుడిలకు దానియ్యకుంటే 'ఆ అన్న పూజారికి నోరు పడి పోవాలె గదా న్యాయానికి కానట్ల జరగలే గదా ! మన నమ్మకాలు ఏమిలేదు '' అన్న జెర సమజ్జేస్తూ... యిట్లా వీల్లను కల్సిన నెల రోజుల్ల మల్లా గిప్పుడు పేరు మార్వాలి' లనే ఆలోచన మొదలైందని తెల్సి మొత్తం మా ఆఫీసుల పంజేసే క్లాస్ ఫోర్ ఆదమగ ఉద్యోగులంతా లొల్లిలొల్లి జేస్తున్నారు.
వాల్లు ఏర్పాటు జేస్తున్న కూడలిని, దీపాన్ని వుప్పుసల్పి దూరం జేసిన మంటలు, అవచానాలందరికి వుండినయి. తర్వాత ఈ లొల్లి ముదిరింది. స్వీపర్లు వూడ్సుడు మానిండ్రు. స్కాలెంజర్లు కక్కోసులు కడెగుడు బందు బెట్టిండ్రు, ఫైల్లు మోసే వాల్లు, యిచ్చేవాల్లు లేక సర్క్యులేషన్ ఆగిపోయింది. ఆఫీసర్ల దగ్గర అటెండర్లు లేక అల్లాడి పోయిండ్రు. రెండు రోజులు మొత్తం అడ్మినిస్ట్రేషన్ బందయింది. క్లాసు ఫోరోల్లు లేక పోతే ఆఫీసు నడువదని అర్థమైంది. అటుదిక్కు 'నల్ల పోషమ్మ పేరు మార్వద్దు' అని జాద్దుకు కూసుండ్రు గుడిముందట, లోపల చివరాఖరికి ఆఫీసర్లు మీటింగు బెట్టుకున్నరు, దిగొచ్చిండ్రు గుడి ముఖ్యం అది దూప దీప నైవేద్యాలతో, పూజాది కార్యక్రమాలు పూజారి సరిపించుడు ముఖ్యం. పేరేదైతేంటి అమ్మ దేవతలంతా దుర్గలే ప్రత్యేకంగా విజయదుర్గ అనే పెరెందుకు? వాల్లకు తెలవక అట్లా అల్లరి చేస్తున్నారు వొదిలేయండి న్యూసెన్స్ నల్ల పోషమ్మ పేరే వుండనివ్వండి వచ్చే నష్టమేముంది. నాటి గ్రామ దేవతలంతా నేటి విజయ దుర్గలు, కనక దుర్గలు, మార్చాల్సిన అవసరం లేదు, మార్చడంలేదనీ, మార్చే ప్రపోజల్ తీసేసి 'నల్ల పోషమ్మ' గుడిగానే పేరుంటదని ఆర్డర్స్ యివ్వక తప్పలేదు. యీ ఆర్డర్స్‌తో ఏనుగెక్కిన సంబురాలతోని మా నాలుగో తరగతి ఉద్యోగులు మా అడ్డదక్క కున్నా పేరైనా దక్కిందని ఖుష్గ దావత్ జేస్కుండ్రు. ఏ బిద్దా గిది మా అడ్డా అని పాటలు పాడుకుండ్రు.
- జూపాక సుభద్ర, 9441091305