Sat 15 May 22:23:29.135164 2021
Authorization
ఒకరోజు ఈగ విచారంగా కూర్చుని కనిపించింది.
అది చూసిన తల్లి ఈగ 'ఏమైంది?' అంటూ బుజ్జగింపుగా అడిగింది.
అప్పుడు ఈగ బాధపడుతూ 'ఈ మధ్య ఎంత చదివినా బుర్రకు ఎక్కటం లేదని, అందువల్ల పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తున్నారు' అంటూ అసలు విషయం చెప్పింది.
తల్లి ఈగ వెంటనే పరిస్థితి అర్థం చేసుకుని, ఇప్పుడు గనుక తాను కోపంగా గొంతు పెంచి 'అందుకే పొద్దస్తమానం మీ నాన్నగారి స్మార్ట్ ఫోన్ లోనూ, ట్యాబ్ లోనూ ఆడుకోవద్దని చెప్పేదీ అంటూ కేకలు వేస్తే మొదటికే మోసం వచ్చి 'నేనంతే...పో' అంటూ మొండికేయవచ్చని అనుకుంది.
'ఓస్... ఇంతే కదా. ఈ సమస్య మన పూర్వీకుల్లో కూడా వుండేదట. అదేమిటో చెబితే నవ్వుతావు. మన జేజి జేజి జేజవ్వ ఒకావిడ ఇల్లు అలుకుతూ తన పేరే మరిచిపోయిందట. తెలుసా? నీదేమంత పెద్ద సమస్య కాదు' అంది తేలిగ్గా.
అప్పుడు ఈగ చాలా ఆశ్చర్యపోతూ 'అవునా... తరువాత ఆవిడ మతిమరుపు తగ్గిందా లేదా?' అని ఆసక్తిగా అడిగింది.
'పోయింది. చాలా తేలికైన పద్ధతిలోనే' అంది.
'అదేమిటో చెప్పవా?' అంటూ ఉత్సాహపడిపోయిది పిల్ల ఈగ.
'ఏముంది... తనకు గుర్తుండదు అనుకున్న విషయాన్ని పదేపదే మనసులో మననం చేసుకోవటం, లేదంటే తన స్నేహితులదగ్గరో, ఇంట్లోవాళ్ళ దగ్గరో మళ్ళీ మళ్ళీ అప్పజెప్పినట్టు గుర్తు చేసుకోవటం, అప్పటికీ గుర్తుంచుకోలేని విషయాలను కొన్ని గుడ్డి గుర్తులతో జ్ఞాపకం పెట్టుకోవటం' చెప్పింది తల్లి.
'అప్పజెప్పటమైతే నీకు చెబుతాను, స్నేహితుల దగ్గర పాఠాల గురించి పదే పదే చర్చిస్తాననుకో, కానీ... గుడ్డి గుర్తులెలా పెట్టుకోవాలి?' అంది పిల్ల ఈగ.
'ఉదాహరణకి ఢిల్లీ గుర్తుండదనుకో, ఢ కొడితే ఢిల్లీ అని, హైదరాబాద్ అనుకో, హైదర్ ఎవరినో బాదితే హైదరాబాద్ అనీ చెప్పింది తల్లి.
'మరి... ఊళ్ళు సరే, మరి పళ్ళు?' అంది పిల్ల ఈగ.
'చాలా సులభం. ఆంగ్లంలో మాం అంటే అమ్మ కదా మాం తినిపిస్తే మామిడిపండు, డాడ్ తినిపిస్తే ద్రాక్షాపండు...అలా'
'వావ్... చాలా బాగుందే... ఇప్పుడు నన్ను ఏదైనా అడుగు ఇప్పుడే చెప్పేస్తా' అంది ఈగ.
'ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న జబ్బు పేరేమిటి?' అడిగింది తల్లి.
'జలుబు చేసినపుడు గొంతులో కరకరలాడుతుంది కదా... అలాంటి పేరున్న కరోనా' చెప్పింది ఈగ.
'ఇప్పుడు చివరి పరీక్ష... మన జేజవ్వ మరిచిపోయిన మన జాతి పేరేమిటి?' అడిగింది తల్లి.
సకిలిస్తూ గుర్రం తాతయ్య చెప్పిన 'హిహిహి ఈగా' అంది పిల్ల ఈగ. హాయిగా నవ్వుకుని పిల్ల ఈగ చదువుకోడానికి, తల్లి ఈగ వంట చేయటానికి లేచాయి.
- డేగల అనితాసూరి,
9247500819