చావో రేవో తేల్చుకుందాం.... బానిస సంకెళ్ళను తెంచుకుందాం..... అంటూ రెండు వందల సంవత్సరాల బ్రిటిష్ పరిపాలనకు చరమగీతం పాడిన నినాదం ''క్విట్ ఇండియా''. నినాదం ఉద్యమ నాదమై నాటి 40 కోట్ల మంది భారతీయులను ఉర్రూతలూగించింది. వలస పాలకులకు సవాలు విసిరింది. బ్రిటిషు సామ్రాజ్య వాదానికి అంతిమ హెచ్చరిక చేసింది.
'సైమన్ గో బ్యాక్' నినాదమిచ్చిన యువ సోషలిస్టు నాయకుడు, ముంబై నగర తొలి మేయర్ యూసఫ్ మోహతా ఇచ్చిన క్విట్ ఇండియా నినాదాన్ని గాంధీ జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ప్రకటించారు. ఆగస్టు 9 నుండి ఉద్యమం ప్రారంభమవుతుందని ప్రకటించాడు. గాంధీ పిలుపును అందుకొని దేశ ప్రజలంతా ఉద్యమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉద్యమం నగరాల నుండి గ్రామాలకు పాకింది. ప్రతి భారతీయుడిటవ గుండెను తాకింది. బ్రిటిషు పాలకులు దేశం విడిచి వెళ్ళి తీరాల్సిందేనని నినదించింది. కొన్ని చోట్ల సహనం కోల్పోయిన ప్రజలు బ్రిటిషు అధికారులపై దాడులు చేశారు. హింసాత్మక ఘటనలు జరిగాయి. దేశం నలుమూలల్లో అగ్గి రాజుకుంది. బ్రిటిషు పాలకులకు ముచ్చెమటలు పట్టాయి. దీంతో జాతీయ కాంగ్రెస్ ప్రధాన నాయకత్వాన్ని, ఇతర ప్రజాస్వామిక స్వాతంత్య్ర పిపాసకులను, బ్రిటిష్ పాలకులు నిర్బంధించారు. నాయకులు, ప్రజలతో జైళ్ళు కిక్కిరిసిపోయాయి. అనేక చోట్ల ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం జరిగింది. అరస్టులు, నిర్బంధాలు, లాఠీ చార్జీలతో ప్రజలను వెనక్కికొట్టాలని చూశారు. అయితే ప్రజలు మాత్రం ''డూ ఆర్ డై'' అంటూ అంతిమ పోరాటానికి సిద్ధపడి, క్విట్ ఇండియా ఉద్యమాన్ని ముందుకు నడిపారు. దేశానికి స్వాతంత్య్రం రావడానికి అవసరమైన ప్రాతిపదికను సృష్టించారు. కోట్లాది ప్రజల అసమాన త్యాగాలు, వేలాది జాతీయోద్యమ నాయకుల బలిదానాల ఫలితంగా క్విట్ ఇండియా ఉద్యమం విజయవంతం అయింది. బ్రిటిషు పాలకులు అనివార్యంగా దేశం విడిచి వెళ్ళాల్సి వచ్చింది. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం సిద్ధించింది. కోట్ల మంది భారతీయులు స్వేచ్ఛా గాలులను ఆస్వాదించారు.
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశమని స్వయం పరిపాలన అని ఆశించారు. తరాల నుండి తరుముతున్న పేదరికం నుండి విముక్తి చెందుతామని భావించారు. ఎన్నో.. ఎన్నెన్నో.. మరెన్నో కలలు. స్వతంత్య్ర దేశంలో బతుకులు బాగుపడతాయని కళ్ళ నిండా ఆశలు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తిని స్వదేశీ పాలకులు కొనసాగిస్తారని, దేశం సుభిక్షంగా ఉంటుందని నమ్మారు. అయితే 75 సంవత్సరాల అనుభవంలో ఈ కలలు కరిగిపోతున్నాయి. ఆశలు అడియాశలుగా మిగిలిపోతున్నాయి. స్వదేశీ పాలనలో విదేశీ సంస్థల జోక్యం పెరిగిపోయింది. ప్రజల అసమాన త్యాగాలను, జాతీయోద్యమ నాయకుల వీరత్వాలను వెక్కిరిస్తూ..మన పాలకులు దేశ ప్రజల సంపదను తిరిగి ప్రైవేటు కంపెనీల పరం చేసే కుట్రలు పన్నుతున్నారు. దేశాన్ని విదేశీ గుత్త పెట్టుబడిదారుల చేతుల్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నమ్మకాలను అమ్ముకొని లాభాలు పోగేసుకునే ప్రణాళికలు రచిస్తున్నారు.
స్వాతంత్య్రం తర్వాత ప్రణాళికలు
దేశానికి స్వాతంత్య్రం రాబోతున్న తరుణంలో, దేశాన్ని ఎలా అభివృద్ధి పరచాలి? ప్రజల జీవితాలను ఎలా బాగు చేయాలి? అనే విషయాలపై అనేక మంది, అనేక రకాల ప్రణాళికలను వారి వారి కోణాలలో రచించారు. వీటిలో మూడు ప్రణాళికలు కీలకమైనవి. టాటా, బిర్లా, సింఘానియా తదితర ఎనిమిది మంది భారత పెట్టుబడిదారులు రూపొందించిన ''బాంబే ప్లాన్'', (1944-45) దీనినే టాటా-బిర్లా ప్లాన్ అంటారు. ప్రజల విద్య, వైద్యం, ఆహారం, ఉపాధి, తాగునీరు, శానిటైజేషన్ వంటి మౌలిక విషయాలను తడుముతూనే, తమ లాభౄలను పెంచుకోవడానికి అవసరమైన విధానాలను ఈ ప్రణాళికలలో పొందుపరిచారు.తాము పెట్టుబడులు పెట్టలేని భారీ రంగాలైన రోడ్లు, రైల్వే, నౌకాయాన, విమానయాన, శాస్త్ర సాంకేతిక రంగాలు, విద్య, వైద్యం వంటి రంగాలలో ప్రభుత్వం పెట్టుబడులు పెట్టాలని కోరారు. తమకు మాత్రం లోహ, వస్త్ర తదిదర పరిశ్రమలను వదిలివేయాలని సూచించారు. ఒక ప్రణాళిక జయప్రకాష్ నారాయణ నాయకత్వంలో వినోబాబావే, ఎస్‌ఎన్ అగర్వాల్‌లు 1950లో రూపొందించిన సర్వోదయ ప్రణాళిక. సర్వోదయ ప్రణాళిక ప్రధానంగా వ్యవసాయ రంగంపైన, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మీద దృష్టి పెట్టింది. భూ సంస్కరణలను అమలు చేయాలని కోరినా, భూ పంపిణీ ఎలా జరపాలో,భూ స్వాముల పెత్తనాన్ని ఎలా తగ్గించాలో తెలపలేదు. గ్రామాలలోని భూస్వామ్య వర్గం స్వచ్ఛందంగా ప్రజలకు భూములు పంచాలని కోరింది. కానీ అది ఆచరణ సాధ్యం కాదని తేలిపోయింది. ఇక మూడో ప్రణాళికను నాటి ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు ఎంఎన్.రారు రూపొందించారు. ఈయన రచించిన ప్రణాళికను ''పీపుల్స్ ప్లాన్'' అంటారు. ఈ ప్రణాళికలో ప్రధానంగా ప్రజల ప్రాథమిక అవసరాలపైన దృష్టి పెట్టాడు. పది సంవత్సరాలలో దేశ ప్రజలందరికీ కనీస అవసరాలు తీర్చేలా ఆర్థిక రంగాన్ని అభివృద్ధి పరచాలని సూచించాడు. ఆహార, పారిశ్రామిక ఉత్పత్తులను పెంచి, అందరికీ సంపద సమానంగా పంపిణీ జరపాలని కోరాడు. వ్యవసాయ రంగంలో ప్రభుత్వం పెట్టుబడులు పెట్టి, గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తి వేగంగా పెరిగేలా చూడాలని తెలిపాడు. తద్వారా పారిశ్రామిక రంగం కూడా వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆశించాడు. రోడ్లు, రైల్వే, నౌకాయాన, విమాన, విద్య, వైద్యం వంటి రంగాలలో ప్రభుత్వ సంస్థలను అభివృద్ధి చేయాలన, అందుకోసం అవసరమైన పెట్టుబడులను ప్రభుత్వమే పెట్టాలని కోరాడు.ప్రణాళికా బద్దమైన ఆర్థిక విధానాలను అమలు పరచడం ద్వారా దేశం అభివృద్ధి చెందుతుందని అందులో తెలిపారు.
మొదటి ప్రభుత్వం - ఆర్థిక విధానాలు
భారత పెట్టుబడిదారి వర్గం రూపొందించిన బాంబే ప్లాన్, సర్వోదయ ప్రణాళిక, పీపుల్స్ ప్లాన్ ప్రణాళికలలో ఏ ప్రణాళికనూ ఏక పక్షంగా ఆనాటి పాలకులు అమలు చేయలేదు. అయితే 1947 నుండి 1990 వరకు పరిశీలిస్తే బాంబే ప్రణాళికలోని ఎక్కువ అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. మౌలిక, భారీ రంగాలలో ప్రభుత్వం పెట్టుబడులు పెడుతూ, కొన్ని కీలకమైన రంగాలలో స్వదేశీ పెట్టుబడిదారులను ప్రోత్సహిస్తూ వచ్చారు. ఈ విధమైన ఆర్థిక వ్యవస్థకు మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అని పేరు పెట్టుకున్నారు.
మిశ్రమ ఆర్థిక వ్యవస్థ- అలీన విధానం
నాటి సోషలిస్టు సోవియట్ యూనియన్ ప్రభావంతో ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పంచవర్ష ప్రణాళికను రూపొందించారు. 1950వ సం||లో ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేశారు. రెండు అగ్ర దేశాలైన సోవియట్ యూనియన్‌కు, అమెరికాకు సమ దూరం పాటిస్తామని అలీన విధానాన్ని రూపొందించారు. మిశ్రమ ఆర్థిక విధానాలను అవలంభిస్తూ వచ్చారు. భారీ రంగాలలో ప్రభుత్వం పెట్టుబడులు పెడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేసింది. మరో వైపు స్వదేశీ పెట్టుబడిదారీ వర్గం బలపడేందుకు సహకరించింది. గ్రామీణ భూస్వామ్య వర్గానికీ, పట్టణ పెట్టుబడిదారీ వర్గానికి తలవంచుతూ కాంగ్రెస్ పాలన సాగింది. కీలక రంగాలలో ప్రభుత్వ పెట్టుబడులు అనే సానుకూల అంశం తప్ప మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ప్రజలకు పెద్దగా జరిగిందేమీ లేదు. 1990 తర్వాత దేశంలో సరళీకరణ విధానాలతో దేశంలో విదేశీ పెట్టుబడులు వచ్చాయి. ప్రజల అవసరాలను తీర్చడం,మౌలిక సౌకర్యాలను కల్పించడం, కొనుగోలు శక్తి పెంచి వారి జీవితాలలో వెలుగులు నింపడం వంటి చర్చలు వెనక్కి వెళ్ళాయి. పారిశ్రామిక ఉత్పత్తులను పెంచడంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసే చర్యలకు బాటలు పడ్డాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పాలనలో సహజ వనరుల లూఠీకి చట్టాలు కూడా వచ్చాయి. ఇప్పుడు అనే విధానాలను బీజేపీ తమ భుజాలకెత్తుకుని అవలంభిస్తుంది. దేశ ప్రజల ఆస్థులుగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా ప్రైవేటు పెట్టుబడి దారులకు అప్ప చెబుతున్నారు. దేశ సంపదను వారి జేబుల్లోకి చేరుస్తున్నారు. ప్రజలకు మాత్రం పంగనామాలు పెడుతున్నారు.
పేరుకే స్వదేశీ - ఆచరణలో విదేశీ
స్వదేశీ సిద్ధాంతం పేరుతో అధికారంలోకి వచ్చిన నేటి ఎన్డీఏ, నాటి కాంగ్రెస్ ప్రైవేటీకరణ విధానాలను రెట్టింపు వేగంతో అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వేగం మరింత పెరిగింది. ముందూ వెనకా ఆలోచించకుండా, ప్రతిపక్ష పార్టీలను పరిగణలోకి తీసుకోకుండా ప్రైవేటు పెట్టుబడుదారులకు లాభం చేకూర్చే విధానాలను అమలు చేస్తున్నాయి. అందుకు అవసరమైన అర్డినెన్స్‌లను, చట్టాలను రూపొందిస్తున్నారు. అత్యంత కీలకమైన రక్షణ, అంతరిక్ష రంగాలో సైతం ప్రైవేటు పెట్టుబడుదారులకు ఆంక్షలు లేని ఆహ్వానాలు పలుకుతున్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ద్వారాలు తెరిచారు. ప్రభుత్వ పెట్టుబడులు సాయంతో అభివృద్ధి చెందిన ఈ రంగాలను ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పాలని ప్రణాళికలు రచించారు. ఇది చాలదన్నట్లు ఆర్థిక సంస్కరణల పేరుతో కరోనా కష్టకాలంలో ఎనిమిది కీలక రంగాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు. పేరుకు స్వదేశీ మంత్రాన్ని జపిస్తూ, ఆచరణలో విదేశీ పెట్టుబడుదారులకు లాభాలు చేకూర్చే పనులు చేస్తున్నారు.
కరోనా కష్టకాలం - అష్ట రంగాల వేలం
కరోనా మహమ్మారి దేశ ప్రజలను పట్టి పీడిస్తున్న వేళ, ప్రజలను ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌కు లాభం చేకూర్చే చర్చలు చేపట్టింది. ఆత్మ నిర్ధరే భారత్ పేరున 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించిన ప్రభుత్వం, ఆ పథకంలో భారగంగా ఎనిమిది కీలక రంగాలలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశ పెడుతున్నట్లు ప్రకటించింది. బొగ్గు, గనులు, రక్షణ ఉత్పత్తులు, విద్యుత్, అంతరిక్షం, అణు, విమాన యానం వంటి రంగాలలో ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపింది. దేశరక్షణ, భద్రత, దేశభక్తి గురించి ఎప్పుడూ జపం చేసే బీజేపీ, స్వదేశీ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకాలకు పెట్టింది. 1969లో మనం బ్యాంకులను , 1972లో బీమా కంపెనీలను, 1973లో బొగ్గు, చమురు కంపెనీలను జాతీయకరణ చేసి, ప్రజల సంపదగా మార్చుకున్నాం. కానీ ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ఈ కంపెనీలను ప్రైవేటు పరం చేస్తోంది. లాభాలలో ఉన్న ఈ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు అమ్మే ప్రయత్నంతో పాటు, నియంత్రణ లేని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను రక్షణ, అంతరిక్ష రంగాలలోకి ఆహ్వానించడం ప్రమాదకరం. గతంలో 49 శాతం ఉన్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 74 శాతం పెంచారంటేనే ప్రైవేటు కంపెనీల చేతుల్లో ఉంటుంది. ప్రభుత్వ రంగ పెట్టుబడులతోనే భారత అంతరిక్ష సంస్థ ఇస్రో అనేక విజయాలను సాధించింది. రాకెట్లను ప్రయోగించే అయిదు దేశాలలో భారత్ ఒకటి. అది మన స్వదేశీ పరిజ్ఞానంతో మన శాస్త్రవేత్తలు సాధించిన గొప్ప విజయం. ఇస్రో ఫలితాలు ప్రజలు అందుతున్నాయి. ఇలాంటి ప్రభుత్వ రంగ సంస్థలలో కూడా విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడం చాలా ప్రమాదకరమైన విషయం.
మరోవైపు బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం బొగు ్గరంగంలో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి ఇచ్చింది. బొగ్గు తవ్వకాలు, అనుబంధ మౌలిక వసతులు, కాంట్రాక్టు తయారీ విభాగాలలో ప్రైవేటుకు ఆహ్వానం పలికింది. 1774లో దేశంలో బొగ్గు తవ్వకాలు ప్రారంభ మయ్యాయి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత బొగ్గు ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు 1956లో జాతీయ బొగ్గు అభివృద్ధి కార్పొరేషన్ (ఎన్‌సీఏసీ) ను ఏర్పాటు చేసుకున్నాం. 1973లో బొగ్గు గనులను జాతీయం చేసి, ప్రజల సంపదగా మార్చుకున్నాం. దీనిలో భాగంగానే 1975 నవంబర్ 1న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థగా కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) ను స్థాపించాం. దీంతో బొగ్గు రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరిగాయి. వార్షిక బొగ్గు ఉత్పత్తిని పెంచుకుంటూ వచ్చాం. దీంతో 2008లో నవరత్న హౌదాను,2011లో మహారత్న హౌదాను కోల్ ఇండియా లిమిటెడ్ సంస్థ సాధించింది. ఇంతటి మంచి పెట్టుబడులను వంద శాతం ఆహ్వానించడం కార్మికులకు, దేశానికి నష్టం. వేలాది మంది కార్మికుల ఉపాధి ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. ప్రపంచంలో 5వ అతిపెద్ద బొగ్గు నిల్వలు కలిగి, బొగ్గు ఉత్పత్తిలో 4వ అతిపెద్ద దేశంగా మనం ఉన్నాం. 2018 నాటికి 1 లక్షా 86వేల మెగావాట్ల ధర్మల్ విద్యుత్‌ను ఉత్పత్తి చేసి, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాం. ఈ విధంగా దేశానికి ఆర్థిక, సామాజిక ప్రయోజనాలెన్నో చేకూరుస్తున్న బొగ్గు పరిశ్రమల్లో మోడీ ప్రభుత్వం 100శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆహ్వానించడం దారుణమైన విషయం. దీనిలో భాగంగా 500 బొగ్గు గనులను వేలం వేస్తామని ప్రకటించడం ప్రమాదకరం.
ఇలా రక్షణ, అంతరిక్ష, బొగ్గు, గనుల రంగాలతో పాటు విద్యుత్, విమానయాన వంటి రంగాలలో కూడా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసే ప్రయత్నం చేస్తోంది. విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కం) ప్రైవేటీకరణకు అనుమతులు ఇచ్చింది. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్దంగా రాష్ట్రాల విద్యుత్ రెగ్యులేటరీ కమిటీలను (ఈఆర్‌సీ) నిర్వీర్యం చేసే చర్యలు చేపట్టింది. ఉమ్మడి జాబితాలోని విద్యుత్ రంగాన్ని, తన ఆధీనంలోకి తీసుకొని ప్రైవేటు పెట్టుబడిదారులకు లాభం చేకూర్చే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ప్రీపెయిడ్ మీటర్లను బిగించి ప్రజల నుంచి అధిక మొత్తంలో విద్యుత్ బిల్లులను గుంజే చర్యలు చేపడుతుంది. సబ్సిడీలను రద్దు చేసి రైతులు, ఇతర అణగారిన సామాజిక ప్రజలకు విద్యుత్‌ను భారంగా మార్చాలని చూస్తోంది. ఇలా కేంద్ర ప్రభుత్వం అంతరిక్షం నుండి ఆకాశం దాకా అన్నీ ప్రైవేటు పరం చేస్తూ, విమానయాన రంగంలోకి కూడా ప్రైవేటీకరణ విధానాలను ప్రవేశపెట్టింది. ఆరు ఎయిర్‌పోర్టుల ప్రవేటీకరణకు అనుమతి ఇచ్చింది. వేలం ద్వారా ఎయిర్‌పోర్టుల ప్రవేటీకరణ ఉంటుందని తెలిపింది. 12 ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి ప్రైవేటు పెట్టుబడులకు అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ పోర్టుల అమ్మకాల ద్వారా పెట్టుబడుల ఆహ్వానం ద్వారా 12వేల కోట్ల రూపాయల ఆదాయం పొందుతున్నట్లు తెలిపింది. ప్రైవేటు విమానయాన రంగంలో జరిగే అవకతవకలను,రక్షణ రహిత విషయాలను పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టడం ప్రమాదకరం.
సేవ్ ఇండియా ఉద్యమం జరగాలి
నాడు క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో 200 సం||ల బ్రిటీషు పరిపాలకులను దేశం నుండి తరిమికొట్టాం. మనల్ని మనమే పరిపాలించుకుని, దేశాన్ని అభివృద్ధి చేసుకోగలం అని నినదించాలి. కానీ 75 సం||ల స్వతంత్ర భారతదేశంలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు దేశ సంపదగా ఉన్న ప్రభుత్వ రంగాన్ని అమ్మకాలకు పెడుతూ ప్రైవేటు వారికి అప్పజెప్పారు. బీజేపీ మరింత వేగంగా ఈ పని చేస్తోంది. కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ, ప్రజల్ని బిచ్చగాళ్ళుగా మారుస్తోంది. ప్రజల కొనుగోలు శక్తి పెద్దగా పెరగకపోగా, ముఖేష్ అంబానీ లాంటి కార్పొరేట్ వ్యక్తులు ప్రపంచంలోనే అయిదవ అత్యధిక సంపన్నుడుగా మారడమే దీనికి చక్కటి ఉదాహరణ. అందుకే ఇప్పుడు మనం క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో సేవ్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించాలి. దేశ సంపదను తెగనమ్ముతున్న స్వదేశీ పాలకుల నుంచి విముక్తి చేసుకోవాలి. జాతీయోద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తూ, దేశాన్ని, దేశ ప్రజలను కార్పొరేట్ శక్తుల నుండి రక్షించుకోవాలి.
బండారు రమేష్
9490008251
Sun 09 Aug 04:22:45.769326 2020