Sat 22 Apr 21:54:36.058333 2023
Authorization
''మంచి పుస్తకం దగ్గరుంటే మనకు మంచి మిత్రులు వెంటలేని లోటు కనిపించదు''
- మహాత్మా గాంధీ
మహాత్మా గాంధీ పుస్తకాన్ని మంచి స్నేహితులతో పోలిస్తే 'చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో' అంటారు కందుకూరి వీరేశలింగం పంతులు. పాపిరస్ ప్లేట్లు, తాళపత్రాలు, తోలు పత్రాలు, సిల్కు, నూలు గుడ్డలపైన రాతలు, చెక్క పలకలపైన రాతలు, రాళ్లపైన రాతలు, వెదురు బొంగులపై రాతలు, శాసనాలు మనం చరిత్ర అధ్యయన సమయంలో చూస్తున్నాం. తాళపత్రాల పరిణామ రూపమే నేటి మన పుస్తకం. కాగితం, అచ్చు యంత్రం గొప్ప విప్లవావిష్కరణలు. గూటెన్ బర్గ్ రూపొందించిన అచ్చు యంత్రం చరిత్ర గతి తిప్పిన నూతన ఆవిష్కరణల్లో ఒకటి. విజ్ఞానం సామాన్యుని చేతుల్లోకి ప్రసరించేందుకు ఇది మూల బిందువు అయ్యింది.
ప్రపంచ వ్యాప్తంగా వందలాది భాషల్లో కోట్లాది పుస్తకాలు ప్రతియేడు అచ్చవుతున్నాయి. ఇక మన దేశం విషయానికి వస్తే ఆంగ్ల పుస్తకాల ప్రచురణలో మనం ప్రపంచంలో నాలుగవ స్థానంలో ఉన్నాం. భారతదేశ భాషల విషయానికి వస్తే తెలుగు ప్రచురణలో మనం ముందువరసలోనే ఉన్నాం. మనకు అన్ని సమయ సందర్భాలకు ప్రత్యేకమైన రోజు ఉన్నట్టే పుస్తకాలకు కూడా ఒక ప్రత్యేకమైన రోజు ఉంది. అది 23 ఏప్రిల్. ఈ రోజును 'విశ్వ పుస్తక మరియు కాపీరైట్ దినోత్సవం'గా ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నాం. పుస్తకాన్ని, ఆ పుస్తకాల రచయితల గౌరవార్థం ఐక్యరాజ్య సమితి ఏప్రిల్ 23ను విశ్వ పుస్తక మరియు కాపీరైట్ దినోత్సవంగా ప్రకటించింది. 1995లో ప్యారిస్‌లో ఐక్యరాజ్య సమితి మొదటిసారి పుస్తక, కాపీరైట్ దినోత్సవాన్ని నిర్వహించింది. 1611లో ఇదే రోజున ప్రఖ్యాత రచయితలు విలియం షేక్స్పియర్, గార్సిలాసో డె లా వెగాలు మరణించారు. అంతేకాక మరికొంతమంది రచయితలు మౌరిస్ డ్రూన్, హల్డర్ కె. లాక్స్‌నెస్, వ్లదిమీర్ నబకోవ్, జోసెప్ ప్లా, మాన్యుయెల్ మెజ్ఫా వల్లెజో వంటివారి జన్మదినాలు, వర్దంతులు కూడా అదే రోజు కావడం విశేషం. నిజానికి పుస్తకాలు, రచయితలకు ఏప్రిల్ 23తో గల సంబంధం మొదట ఇదే రోజు 1923 సంవత్సరంలో మొదలైంది. స్పెయిన్‌లోని పుస్తక ప్రచురణకర్తలు అదే రోజు మరణించిన ప్రఖ్యాత రచయిత మిగుయెల్ డె కార్వాంటెస్ గౌరవార్థం వేడుకను నిర్వహించారు. యునెస్కో ప్రతియేడు దీనిని జరుపుతోంది. విశ్వవ్యాప్తంగా ఉన్న రచయితలు, ప్రచురణకర్తలు, గ్రంథాలయాలు, పుసక విక్రేతలు ఆ యేడాదంతా 23 ఏప్రిల్ నుండి మొదలయ్యే సంవత్సర కాలానికి విశ్వ పుస్తక రాజధానిని వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎంపికచేస్తాయి.
ప్రపంచ దేశాల్లో ఈ గౌరవాన్ని రెండుసార్లు దక్కించుకున్న ఏకైక దేశం మన భారత దేశం కావడం విశేషం. మొదటిసారి ఈ గౌరవం 1986లో దక్కగా, రెండవసారి 2006లో లభించింది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో నగరాలు విశ్వ పుస్తక నగరం గౌరవాన్ని దక్కించుకున్నాయి. గతంలో మాడ్రిడ్, అలెక్జాండ్రియా, అన్వర్స్, మాంట్రియల్, తురిన్, బొగోటా, ఆమ్స్టర్డామ్, బెయిరుట్, ల్జుబింజా, బ్యూనస్ ఎయిరిస్, ఎర్వన్, బ్యాంగ్‌కాక్, పోర్ట్ హార్కోర్ట్, ఇంచేలోన్, రోక్లో, కాంక్రీ, సిటీ ఆఫ్ ఎథెన్స్, షార్జా నగరాలు విశ్వ పుస్తక రాజధానులుగా ఎంపిక కాబడ్డాయి. 2018 సంవత్సరానికి గాను సిటీ ఆఫ్ ఎథెన్స్ విశ్వ పుస్తక రాజధానిగా ఎంపికయ్యింది. 2019 లో షార్జా ఎంపిక కాగా, 2020కి గాను మలేషియా రాజధాని కౌలాలంపూర్ ఈ గౌరవాన్ని దక్కించుకుంది. ఈ విషయాన్ని యునెస్కో డైరక్టర్ జనరల్ సలహా సంఘం సిఫారసు మేరకు ప్రకటించారు. 2021లో ట్సిల్సి, జారిజయా, 2022లో గౌదలహర, మెక్సికో, 2023లో అక్రా, ఘనా దేశాలు ఎంపిక అయ్యాయి. జ్ఞానవంతమైన సమాజం దిశగా అభివృద్ది, విద్య ప్రమాణాల వికాసం వంటి అంశాల్లో చేసిన విశేష కృషికి ఈ దేశాలకు ఈ అవకాశం లభించింది.
ఇవ్వాళ్ళ మనం సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందాం. ఎంతగా అభివృద్ధి చెందినా ఇప్పటికీ పుస్తకానికే పెద్దపీట. గతంతో పోల్చి చూస్తే తెలుగునాట పుస్తకమేళాల సంస్కృతి బాగా పెరిగింది. కోవిడ్‌కు ముందు నాలుగైదు నెలల గడువులోనే దాదాపు నాలుగు పెద్ద పుస్తకమేళాలు మన హైదరాబాదులో జరిగాయంటే పుస్తకానికి ఉన్న ఆదరణ తెలుస్తోంది. తెలుగు మహాసభల సందర్భంగా ఏర్పాటు చేసిన పుస్తక మేళా కూడా ఈ సందర్భంగా పేర్కొనాలి. విశ్వ పుస్తక మరియు కాపీరైట్ దినోత్సవం సందర్భంగా మళ్ళొక్కసారి మనం నడిచివచ్చిన పుస్తకాల దారిని తిరిగి చూసుకోవాల్సిన అవసరం వుంది. సాంకేతికంగా ఎంతగా అభివృద్ధి చెందినా, ఈ బుక్స్, కిండెల్, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్ల వంటివి ఎంతగా అభివృద్ధి చెందినా పుస్తకం స్థానం పుస్తకానిదే. ప్రపంచ వ్యాప్తంగా వందలాది భాషల్లో కోట్లాది పుస్తకాలు ప్రతియేడు అచ్చవుతున్నాయి. దీనికి తోడు నేడు విస్తృతంగా ఆడియో పుస్తకాలు, వీడియో పుస్తకాలు కూడా పిల్లల చెంతకు చేరుతున్నాయి. అయితే యివి సామాన్యులు అందరికి అందుతున్నాయని యెప్పలేం. ప్రచురణల విషయానికి వస్తే భారతీయ భాషల సరసన మనం మొదటి వరుసలోనే ఉన్నాం. కానీ పుస్తకాన్ని సామాన్యునికి చేరువగా తేవడం విషయంలో మాత్రం వెనుకబడి ఉన్నాం. పాశ్చాత్య దేశాలు గ్రంథాలయాలకు పెద్దపీట వేసి పుస్తకాలను అందుబాటులోకి తెస్తున్నాయి. వేల సంవత్సరాల విజ్ఞాన, వైజ్ఞానిక చరిత్ర కలిగిన మనం అక్షరాస్యతను పూర్తిగా సాధించలేకపోగా, పుస్తకాలను మారుమూల పల్లెల్లోకి ఇంకా తీసుకెళ్ళలేక పోతున్నాం.
మన దేశంలో గ్రంథాయోద్యమాలు నిర్వహించిన పాత్ర గణనీయమైంది. నిజానికి స్వాతంత్య్రోధ్యమానికి మూల భూమికను ఇచ్చిన ఉధ్యమాల్లో గ్రంథాలయోధ్యమం ఒకటి. అయినప్పటికీ దేశవ్యాప్తంగా గ్రంథాలయాలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసుకోవడంలో ఇప్పటికీ వెనుకబడిపోయాం. ఒకవేళ అక్కడక్కడ గ్రంథాలయాలున్నా మానవ వనరులు మొదలుకుని వివిధ కొరతలు వాటిని పూర్తిగా నిర్వీర్యం చేశాయి. స్థానిక సంస్థలు గ్రంథాలయాల నిర్వహణ కోసం పన్నులు వసూలు చేస్తున్నప్పటికీ ఆ దిశగా జరిగిన ఉపయోగం తక్కువేనని చెప్పాలి.
ఎక్కడైనా పుస్తకం సామాన్యునికి అందించేందుకు ఏకైక సాధనం పౌరగ్రంథాలయాలు. వాటిని మళ్ళీ పూర్తిస్థాయిలో పునర్నిర్మించుకుని ఉపయోగించుకున్నప్పుడే పుస్తకం జండాలాగా ఎగురుతుంది. యేడాదికి ఒకటి రెండుసార్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న విజయవాడ పుస్తక మహోత్సవం, హైదరాబాద్ పుస్తక మహోత్సవం, నేషనల్ బుక్ ట్రస్ట్ వంటి సంస్థలు రెండు రాష్ట్రాల్లో జరుపుతున్న పుస్తకాల పండుగలు, సాహిత్య అకాడమి, ఇటీవల కొత్తగా తెలంగాణ బుక్ ట్రస్ట్ వంటివి కొంత వరకు ఈ లోటును తీరుస్తుండొచ్చు కానీ పూర్తి స్థాయిలో పుసకాలను ప్రజలకు అందించేవి మాత్రం గ్రంథాలయాలే.
గ్రంథాలయాల్లో ప్రతియేడు అన్ని వయోవర్గాల వారు చదివే అన్ని విషయాలకు సంబంధించిన కొత్త కొత్త పుస్తకాలు చేరేట్టు చూడాలి. ఇతర విషయాలకు సంబంధించిన పుస్తకాలతో పాటు సాహిత్యం ఉండాలి. వాటిలో కనీసం 20 శాతం వరకయినా బాల సాహిత్యం ఉండాలి. అప్పుడే అన్ని వయసులవారు గ్రంథాలయాలకు వస్తారు. కేవలం పౌర, సమూహ గ్రంథాలయాలే కాక ప్రతి పాఠశాలలో గ్రంథాలయం తప్పనిసరిగా ఉండేట్టు ప్రభుత్వాలు చర్య తీసుకోవాలి. వీలయితే ప్రతి తరగతిలో ఆయా తరగతుల స్థాయిలో విద్యార్థులు స్వయంగా గ్రాంథాలయం నిర్వహించుకునేట్టుగా వారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. చాలామందికి తెలియని విషయం ఒకటుంది. అభివృద్ధి చెందిన దేశాల్లోని పాఠశాలలో పిల్లలకు ఇచ్చే పుస్తకాలను సంవత్సరాంతంలో తిరిగి తీసుకుని వారిని తరువాత వచ్చే విద్యార్థులకు అందజేస్తారు. మన ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పుస్తకాలను ఉచితంగా అందిస్తున్నాం. వాటిని తిరిగి తప్పక ఇవ్వాల్సి ఉంటుదన్న విషయం విద్యార్థులకు తెలిపితే పుస్తకాల నిర్వహణ పట్ల పిల్లలకు బాధ్యత పెరుగుతుంది.
పుస్తకం గొప్పదనం పిల్లలకు తెలిపేందుకు ప్రతి సందర్భంలో బహుమతులుగా, ప్రోత్సాహకాలుగా పుస్తకాలు ఇచ్చే సంప్రదాయాన్ని కాపాడుకోవాలి. విద్యాలయాల్లో జరిగే ఉత్సవాల్లో బహుమతులుగా పుస్తకాలు ఇవ్వడమే కాక గ్రామంలోని పుస్తకాల విక్రేత చేత లేదా ఇతరుల చేత పుస్తక ప్రదర్శనలు ఏర్పాటు చేయాలి. సంచార పుస్తక ప్రదర్శనశాలల్ని పిలిపించి పిల్లలకు పుస్తకాలు అందేట్టు చూడాలి.
నా తరం వారికి లేదా ముందు తరం వారికి గుర్తుండే ఉంటుంది, యేడాదికి ఒకటి రెండుసార్లు విశాలాంధ్ర వారి సంచార గ్రంథాలయం తప్పని సరిగా వచ్చేది. అప్పుడప్పుడు నేషనల్ బుక్ ట్రస్ట్ బుక్ వ్యాన్ వచ్చేది. ఆ వ్యాన్లు వచ్చిన వారం రోజులు పాఠశాల పండుగులా అనిపించేది. ఒకరి పుస్తకాన్ని ఒకరం తీసుకుని చదువుకోవడం, మాట్లాడుకోవడం వంటివి యిప్పటికీ స్మృతిపథంలో పదిలంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని కాదు, అందుకు అనువైన వాతావరణాన్ని మనం బడుల్లో ఏమేరకు కల్పించగలుగుతున్నాం? పోటీ ప్రపంచం దారులు మన పిల్లల్ని ఆ దిశగా ఎంత మేరకు వెళ్ళనిస్తున్నాయో చూసుకుంటే 'కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుద్ది' అన్న సామెత జ్ఞాపకం రాకతప్పదు. జ్ఞానవంతమైన, స్ఫూర్తివంతమైన, విజ్ఞానవంతమైన, చైతన్యవంతమైన రేపటి సమాజాన్ని మనం కాంక్షించినట్టయితే తప్పని సరిగా బడుల్లో గ్రంథాలయ పీరియడ్ పాఠశాల ప్రణాళికలో ఉండేటట్టు చర్యలు చూడాల్సిందే. ఇప్పుడు లేవని కాదు, కానీ అన్ని పాఠశాలలల్లో విధిగా ఉన్నప్పుడు మనం ఆశించినదాన్ని కొంతైనా సాధిస్తాం. వనరులను బట్టి పాఠశాలల స్థాయిలో బాలల పత్రికలు, గ్రంథాలయాల్లో అన్ని రకాల పత్రికలు అందుబాటులో ఉంచినట్లయితే పుస్తకం పట్ల పాఠకునికి ప్రేమ కలుగుతుంది. ఏదైనా బడి నుండి మొదలు కావాల్సిందే. అందుకోసం వివిధ బహుమతులు, పురస్కారాలు పొందిన పుస్తకాలు పిల్లలకు అందుబాటులో ఉండే విధంగా వారి స్థాయిలో వాటిని సంక్షిప్తీకరించి ముద్రించి, వాటిని తక్కువ ధరలకు అందేట్టుగా చూడాలి. వీటితో పాటు ప్రపంచ ప్రసిద్ధి పొందిన రచయితలు, పుస్తకాలను క్లుప్తీకరించి ప్రచురించాలి. లలిత కళలు వంటివి తామే స్వయంగా పుస్తకాల ద్వారా చదువుకుని నేర్చుకునే విధంగా పుస్తకాలను ప్రచురించాలి. తద్వారా పుస్తకాలంటే ప్రజలకు ఆసక్తి అభిరుచి కలుగుతుంది. కేవలం సంగీతం, సాహిత్యమే కాకా వివిధ సామాజిక సమస్యలు, ఆ దిశగా జరిగన ఉద్యమాలు, పరిష్కార మార్గాలకు సంబంధించిన పుస్తకాలు, రాజకీయ, సినిమా వంటి అంశాలకు సంబంధించిన పుస్తకాలు అచ్చులోకి వచ్చి ప్రజలకు అందుబాటులోకి రావాలి. అప్పుడే పుస్తకం సామాన్యుని చెంతకు చేరగలుగుతుంది. ఇక్కడ ఒక విషయం చెబుతాను... ఈ దిశగా మంచి పుస్తకం పనిచేస్తోంది. ఇటీవల బాల చెలిమి తెలంగాణ బడిపిల్లల కథలు, పిల్లల కోసం పెద్దల కథలను చిన్న చిన్న పుస్తకాలుగా అందించింది. తెలంగాణ సాహిత్య అకాడమి రాష్ట్ర స్థాయిలో కథా యజ్ఞం నిర్వహించి ప్రచురణ చేస్తోంది. వీటికి తోడు మాడభూషి రంగాచార్య స్మారక సమితి, రంగినేని ట్రస్టు, జహిరాబాద్ మన లైబ్రరితో పాటు మరికొన్ని సంస్థలు ఈ దిశగా పనిచేస్తున్నాయి. ఇక విక్రేతలైన ప్రచురణకర్తల గురించి చెప్పనవసరం లేదు, ఒక్క నవ తెలంగాణనే యిటీవల డజనుకు పైగా పిల్లల పుస్తకాలు ప్రచురించింది. తెలంగాణ బాలల రచయితల సంఘం కూడా ఇటీవల రెండు చిన్న పుస్తకాలను తెచ్చింది. పుస్తకం సామాన్యుని చెంతకు చేరినప్పుడు, బడిలో, గుడిలో, చర్చిలో, మసీదులో యిలా ప్రతి ప్రార్థనా మందిరంలో వెలిసినప్పుడు పుస్తకం వర్ధిల్లుతుంది... పుస్తక సంస్కృతి వర్దిల్లుతుంది. జయహో! బాల సాహిత్యం.
(ఏప్రిల్ 23, విశ్వ పుస్తక మరియు కాపీరైట్ దినోత్సవం)
- డా|| పత్తిపాక మోహన్, 9966229548