చారిత్రాత్మకమైన మేడేను కార్మికవర్గ సంఘీభావాన్ని తెలియచెప్పే అంతర్జాతీయ దినంగా యావత్ ప్రపంచమూ జరుపుకుంటున్నది. పెట్టుబడిదారీ దోపిడీకి వ్యతిరేకంగా ప్రపంచ కార్మికవర్గాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చింది మే డే అనటంలో ఎలాంటి సందేహము లేదు. ''ప్రపంచ కార్మికులారా ఏకం కండి'' అన్న సమర నినాదాన్ని ఆచరణలో నిజం చేయటంలో మహత్తరమైన శక్తిని ప్రదర్శించింది. 8 గంటల పని కోసం కార్మికవర్గం కదంతొక్కిన దినం మేడే. ప్రపంచ వ్యాప్తంగా గల కోట్లాది కార్మికులకు ఈనాటికీ మేడే స్ఫూర్తినిస్తూనే వున్నది.
రోజుకు ఎనిమిది గంటల పనిదినాన్ని అమలు జరపాలని కోరుతూ అమెరికాలోని కార్మికవర్గం అనేక ఆందోళనలు చేసింది. 1882-86 మధ్య కాలంలో షికాగోలో జరిగిన కార్మిక సమ్మెలను యాజమాన్యాలు నిర్ధాక్షిణ్యంగా అణచివేశాయి. అందుకు లాకౌట్లను ఒక సాధనంగా ఉపయోగించటంతో పాటు పోరాటాలలో పాల్గొనే కార్మికులు, నాయకులను పనిలో నుంచి తొలగించటం, వారి స్థానంలో తమ చెప్పుచేతుల్లో ఉండే కిరాయి పనివారిని నియమించుకోవటం మొదలైన చర్యలకు పాల్పడేవారు.
వాటిలో భాగంగా 1886 ఏప్రిల్‌లో అనేకచోట్ల సమ్మెలు, ప్రదర్శనలు జరిగాయి. చికాగో నగరంలో మే మూడవ తేదీన మెక్ కార్మిక హార్వెస్టింగ్ యంత్ర పరిశ్రమలోని కార్మికులు '8 గంటల పనిదినం' కోసం సమ్మె జరిపి, శాంతియుతంగా ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఆ ప్రదర్శనపై పోలీసులు దాడి చేసి కొందరు కార్మికనేతలను అరెస్టు చేశారు. అరెస్టులను ప్రతిఘటించిన కార్మికులపై పోలీసులు జరిపిన కాల్పులలో అనేకమంది కార్మికులు మరణించారు. గాయపడ్డారు. దీనిలో ఆగ్రహించిన కార్మికులు మే నాలుగవ తేదీన హే మార్కెట్ ప్రాంతంలో సభ జరిపేందుకు పిలుపునిచ్చారు.
పోలీసు యంత్రాంగం కుట్రలోభాగంగా పోలీసులపై వారి ఏజెంటుతో బాంబుదాడి చేయించారు. ఒక పోలీసు మరణించారు. దానిని సాకుగా చూపి పోలీసులు జరిపిన కాల్పుల్లో అనేకమంది కార్మికులు మరణించారు. రక్తం ఏరులై పారింది. అయినా కార్మికులు వెనక్కి తగ్గలేదు. బాంబుపేలుడుపై ఎనిమిది మంది కార్మికులపై తప్పుడు కేసులు బనాయించారు. వారిలో ఏడుగురికి దిగువ కోర్టు మరణ శిక్ష విధించింది. కార్మికులపై కోర్టులో అప్పీలు వేయగా శిక్షలను ఖరారు చేసింది. 1887 నవంబరు 10న ఒక కార్మికుడు జైలులో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. మరుసటి రోజు, అనగా 1887 నవంబరు 11న ఆగస్ట్ స్పైస్, అల్బర్ట్ పార్సన్స్, అడాల్ఫ్ ఫిషర్, జార్జి ఏంగెల్స్ నలుగురిని ఉరితీశారు. ఆ తరువాత ఆరు సంవత్సరాలకు మిగిలిన ఇద్దరికి ఐల్లినాయిస్ గవర్నర్ క్షమాభిక్షతో ఉరిశిక్షను రద్దు చేశారు.
1889 జులైలో పారిస్‌లో సమావేశమైన అంతర్జాతీయ సోషలిస్ట్ ప్రతినిధుల రెండవ ఇంటర్నేషనల్ సమావేశం షికాగో నగరంలో హే-మార్కెట్ అల్లర్లలో జరిగిన కాల్పుల్లో మరణించిన కార్మికుల త్యాగాన్ని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం మే ఒకటవ తేదీన కార్మికుల దీక్షాదినంగా పాటించాలని తీర్మానించింది. 1890 నుంచి ప్రపంచ వ్యాప్తంగా మేడే జరుగుతోంది.
ఈ సంవత్సరం, 2023 మేడే కు భారతదేశంలో ఒక ప్రత్యేకత ఉంది. సరిగ్గా వంద సంవత్సరాల క్రితం 1923లో అప్పటి మద్రాసు నగరంలో లేబర్ కిసాన్ పార్టీ ఆధ్వర్యంలో మే డే ను నిర్వహించారు. కామ్రేడ్ ఎం.సింగారవేలు చెట్టియార్ ట్రిప్లికేన్ బీచ్‌లో ఎర్ర జెండాను ఎగురవేశారు.
నేడు నయా ఉదారవాద విధానాలను అమలు చేస్తున్న అనేక ప్రభుత్వాలు తమ కార్పొరేట్ యజమానులను సంతృప్తి పరచటంలో పొదుపు పేరుతో, కార్మికుల వేతనాలు, పెన్షన్లు మరియు ఇతర చట్టపరమైన ప్రయోజనాలపై దాడి చేస్తున్నాయి. కోవిడ్ మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని భయకంపితుల్ని చేస్తున్న విషమ పరిస్థితుల్ని కూడా కార్పొరేట్ శక్తులు తమ స్వలాభాల కోసమే వాడుకున్నాయి. ఫ్రాన్స్, పోర్చుగల్ మొదలగు దేశాలతో పాటు భారతదేశంలో కూడ ప్రజల కదలికలపై ఆంక్షలు ఉన్న సమయంలో కార్మిక హక్కులను హరించి వేసే విధంగా కార్మిక చట్టాలను సవరించటానికి ప్రయత్నించాయి.
ఈ వాస్తవాన్ని కార్పొరేట్ అనుకూల, సామ్రాజ్యవాద సంస్కరణవాద సంస్థ అయిన ఇంటర్నేషనల్ ట్రేడ్ యూనియన్ కాన్ఫెడరేషన్ (ఐటియుసి). 2022 ప్రపంచ హక్కుల సూచికలో స్వయంగా పేర్కొనటం గమనార్హం. ఆ నివేదిక ప్రకారం 148 దేశాలకు గాను 113 దేశాలు కార్మికులకు ట్రేడ్ యూనియన్ను స్ధాపించే లేదా చేర్చుకునే హక్కు నుండి మినహాయించారు. 74% దేశాల్లోని అధికారులు యూనియన్ల నమోదుకు అడ్డుకున్నారు. 50% దేశాలలో కార్మికులు శారీరక హింసకు గురి చేయబడ్డారు. 129 దేశాల్లో సమ్మెలు పరిమితం చేయబడ్డాయి లేదా నిషేధించబడ్డాయి. ఈ సంఖ్య 2014లో 63% ఉండగా, 2022కి 87%కి పెరగటం ఆలోచింపచేేసే విషయం. 41% దేశాలు మాట్లాడే మరియు సమావేశమయ్యే స్వేచ్ఛను నిరాకరించాయి. 66% దేశాలలో కార్మికులు న్యాయం పొందకుండా అడ్డుకున్నాయి.
ఇది ప్రస్తుత పెట్టుబడిదారీ వ్యవస్థలో ప్రపంచ వ్యాప్తంగా కార్మికుల పట్ల పాలకవర్గాల వైఖరిని బహిర్గతం చేస్తోంది.
తొలగింపులు, ఉపసంహరణలు, మూసివేతలు : పైన చెప్పిన గణాంకాలకు ప్రత్యక్ష ఉదాహరణగా ప్రముఖ అమెరికన్ కంపెనీ స్టార్‌బక్స్ యాజమాన్యం కార్మికులు సంఘటితం కావటం సహించలేక భద్రతా కారణాలను సాకుగా చూపి 16 దుకాణాలను మూసివేసింది. అంతేకాదు, మున్ముందు మరిన్ని ఔట్లెట్లను మూసివేస్తామని బెదిరింపుతో కూడిన హెచ్చరిక చేసింది. దీనిలో ఒక మతలబు వుంది. కార్మికులు ఐక్యం కాకుండా నిలువరించటంతో పాటు మాంద్యం ముంచుకొస్తున్నందున, తమ ఖర్చులకు తగ్గించుకొని లాభాలను మరింత పెంచుకోడానికి ఉద్యోగులను పెద్దఎత్తున తగ్గించే ప్రక్రియ. ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నమాట.
యు.ఎస్. ఆధారిత బడా కార్పొరేట్ సంస్థలు తమ ఉద్యోగులలో దాదాపు 13% ఉద్యోగాల కోతలను ప్రకటించాయి. దాదాపు 20వేల మంది కార్మికులను తొలగించాలని అమెజాన్ నిర్ణయించింది. ఇప్పటికి 8000 మందిని తొలగించింది. ప్రపంచంలో అత్యధిక మంది ప్రజలు నిత్యం ఉపయోగించే సోషల్ మీడియా ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం మరియు వాట్సప్ ప్లాట్‌ఫారాలు వేదిక 'మెటా' తన వర్క్‌ఫోర్స్‌లో 11,000 మందిని తగ్గించినట్లు ప్రకటించింది.
2022 అక్టోబర్‌లో మైక్రోసాఫ్ట్ దాదాపు 1000 మంది ఉద్యోగులను తొలగించింది. రెండు సంవత్సరాల క్రితం ఊబర్ తన గ్లోబల్ వర్క్ఫోర్స్ల్ 13% మందిని తొలగించగా, ఓలా 35% ఉద్యోగులకు తొలగించింది. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, ట్విట్టర్ కొత్త యజమాని ఎలాన్ మస్క్ తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం తన ట్విట్టర్ సంస్థలో సగం మందికి పైగా సిబ్బందిని తొలగించటం. ఇప్పటికే దాదాపు 1200 మంది ఉద్యోగులు వెళ్ళిపోగా, మరికొంతమంది అదే బాటలో ఉన్నారు. మిగిలిన ఉద్యోగులతో అధిక పని గంటలు పనిచేయిస్తూ పొమ్మనకుండా పొగబెడుతున్నారు. తద్వారా వారికి చెల్లించాల్సిన బెనిఫిట్స్‌ను కూడా ఆదా చేసుకోవాలని చూస్తున్నారు.
ఈ కంపెనీలు తమ తొలగింపునకు వ్యతిరేకంగా కార్మికులు సంఘటితం కాకుండా నిరోధించటానికి వేల కోట్ల డాలర్లను వెచ్చించటం చూస్తే వారి ప్రధాన లక్ష్యం తాత్కాలిక లాభాలు మాత్రమే కాదని, కార్మికవర్గం ఐక్యం కాకుండా చూడటం ద్వారా శాశ్వత ప్రయోజనాలు పొందుటమేనని మనకు అర్ధం అవుతుంది.
యునైటెడ్ కింగ్డమ్లో మూడు దశాబ్దాల తరువాత 2022 లో రైల్వే మరియు టెలికాం రంగ కార్మికులు మొదటిసారిగా దేశవ్యాప్త సమ్మెలకు దిగారు. బ్రిటీష్ ట్రాన్స్‌పోర్టు యూనియన్ ఆర్.ఎం.టి. 2022 జూన్ నుండి పొదుపు ప్రణాళికలకు వ్యతిరేకంగా మరియు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ రైల్వే, బస్సు మరియు మెట్రో డ్రైవర్లు మూడు రోజుల పాటు చారిత్రాత్మకమైన జాతీయ సమ్మెలో ఉన్నారు. ఈ సమ్మె ప్రభావంతో విద్య, ఆరోగ్యం, ఓడరేవులు మొదలైన అనేక ఇతర రంగాలకు వ్యాపించింది.
2022 నవంబర్ 9న గ్రీస్ భారీ సార్వత్రిక సమ్మెను చవిచూసింది. దీనికి ముందు కూడా అనేక రంగాలలో విజయవంతమైన సమ్మెలు జరిగాయి. వేతనాలు, పించన్ల పెరుగుదల, చౌక విద్యుత్, ఇంధనం, ఆహారం, పన్నుల రద్దు, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలనే డిమాండ్లతో దేశవ్యాప్తంగా భారీ ర్యాలీలు జరిగాయి. ఈ సమ్మెకు సామాన్య ప్రజల నుండి విశేష స్పందన లభించింది.
ధరల పెరుగుదలను భర్తీ చేసేందుకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఫ్రాన్స్ కార్మికులు 2022లో దేశవ్యాప్త సమ్మెలో పాల్గొన్నారు. ఇటలీ కార్మికులు ధరలు పెరుగుదల మరియు వారి హక్కులపై దాడులకు వ్యతిరేకంగా 2022 డిశంబర్ 2న భారీ ప్రదర్శన నిర్వహించారు.
2022లో అమెరికాలో కార్మికుల సమ్మెతో వెల్లువెత్తింది. సెప్టెంబర్ 2022 మధ్యలో సుమారు 15వేల మంది నర్సులు సమ్మెకు దిగారు. ఇది యు.ఎస్. చరిత్రలోనే అతిపెద్ద ప్రైవేటురంగ నర్సింగ్ సిబ్బంది సమ్మె. ఒక లక్షమందికి పైగా రైల్ రోడ్ కార్మికులు 'వేతనంతో కూడిన అనారోగ్య సెలవు' ఇవ్వాలనే డిమాండ్‌తో డిశంబర్ 9న సమ్మె బాటపట్టారు. న్యూయార్క్ టైమ్స్ జర్నలిస్టులు, ఇతర ఉద్యోగులు డిశంబర్ 8న సమ్మె చేశారు. 2022 జనవరి - సెప్టెంబర్ మధ్య యు.ఎస్.ఎ లో ఎక్కువ సమ్మెలు జరిగాయి. ఈ సమ్మెల్లో పాల్గొన్న కార్మికుల సంఖ్య కూడా బాగా పెరిగింది.
ఐరోపాలోని జర్మనీ, బెల్జియం, స్విట్జర్లాండ్, సైప్రస్, ఆస్ట్రియా, చెక్ రిపబ్లిక్, హంగరీ మరియు మెల్గోనాలో, ఆఫ్రికాలోని ట్యూలీషియా, గినియా, దక్షిణాఫ్రికా, కెన్వా, సూడాన్ మరియు సెంట్రల్ ఆఫ్రికన్ ప్రాంతంలో, లాటిన్ అమెరికాలోని ఈక్వెడార్ మరియు అర్జెంటీనాలలో కూడా ఇలాంటి కార్మికవర్గ నిరసనలు జరిగాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కార్మికులు ఇప్పుడు తమ హక్కులను సాధించుకోవటానికి, తమ పని పరిస్థితులను కాపాడుకోవటానికి పోరాడుతున్నారన్న విషయాన్ని ఇది తెలియజేస్తుంది. ఈ పోరాటాలు సామాన్య ప్రజల సమస్యలను కూడా లేవనెత్తటంతో యూనియన్లు, వారి పోరాటాల పట్ల ప్రజల ఆమోదం పెరగటానికి దోహదపడ్డాయి. 2022 ఆగస్టులో విడుదలైన ఒక సర్వే నివేదిక ప్రకారం 71% మంది అమెరికన్లు ఇప్పుడు యూనియన్లను ఆమోదిస్తున్నారని చెప్పారు. ఇది గత 57 సం||లలో నమోదైన అత్యధిక ఆమోద రేటు, యూనియన్స్‌లో లేని కార్మికులలో 42% మంది సంఘంలో సభ్యులు కావాలని కోరుకుంటున్నారు.
మన దేశంలో కూడా లక్షలాదిమంది కార్మికులు, సామాన్య ప్రజలు ధరలు పెరుగుదల, వేతనాలు, పని పరిస్థితులు, ప్రాధమిక కార్మిక సంఘ మరియు కార్యాలయ హక్కులు మొదలగు సమస్యలు, డిమాండ్లు లేవనెత్తుతూ ఇటీవల భారీ సంఖ్యలో భారీ పోరాటాలు నిర్వహించారు. 2022 మార్చి 28, 29 - రెండు రోజుల సార్వత్రిక సమ్మె అతి పెద్ద సమ్మె. సామాన్య ప్రజల నుండి కూడా విస్తృత మద్దతు లభించింది. అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది. 2023 ఏప్రిల్ 5న లక్షలాది మందితో ఢిల్లీలో కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ ర్యాలీ జరిగింది. 1990ల నుండి శాసిస్తున్న నయా ఉదారవాద విధానాల ప్రభావంపై కార్మికులు, సామాన్య ప్రజానీకంతో పెరుగుతున్న ఆగ్రహాన్ని ఇది ప్రతిబింబిస్తుంది.
పాలకవర్గాలు తమ వద్ద ఉన్న అన్ని వనరులను, ప్రభుత్వ యంత్రాంగాన్ని వినియోగించి భౌతికదారులకు దిగుతున్నప్పటికీ సుమారు అన్ని దేశాల్లోని కార్మికులు తమ పోరాటాలను ధైర్యంతో, దృఢ సంకల్పంతో కొనసాగిస్తున్నారు. ఇది ఈ కాలంలో ఒక ప్రత్యేకమైన విషయం.
భారతదేశం : మితవాద కార్పొరేట్ మతతత్వ ప్రభుత్వ హయాంలో మన దేశంలోని కార్మికవర్గం, సామాన్య ప్రజలు ఇతర పెట్టుబడిదారీ దేశాల్లోని చాలా మంది మాదిరిగానే ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ అసమానత నివేదిక 2022 ప్రకారం 2021లో భారతదేశ మహిళా కార్మిక ఆదాయం వాటా 18% ప్రపంచంలోనే ఇది అత్యల్పం. భారత ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2020-21లో శ్రామిక శక్తిలో మహిళలు 25.1% మాత్రమే. 2004-2005లో 42.7% గా ఉండేది.
కేంద్ర బిజెపి పాలనలో కార్పొరేట్లకు మరిన్ని లాభాలు అందించే క్రమంలో కార్మికవర్గం యొక్క హక్కులపై దాడికి పూనుకుంది. ప్రస్తుతం ఉన్న 29 కార్మిక చట్టాలు రద్దు చేయబడ్డాయి. ఎన్ని పరిమితులు, లోపాలు ఉన్నప్పటికీ ఈ చట్టాలు కార్మికులకు కొన్ని హక్కులు, ప్రయోజనాలు, సౌకర్యాలు అందించాయి. వాటిలో చాలా వరకు ఇప్పుడు లేవు. మిగిలినవి బలహీనపరచబడ్డాయి. వాటి స్ధానంలో వేతనాల కోడ్ 2019, పారిశ్రామిక సంబంధాల కోడ్ 2020, వృత్తిపర భద్రత, ఆరోగ్యం మరియు పని పరిస్థితుల కోడ్ 2020, సామాజిక భద్రత కోడ్ 2020 మొదలైన నాలుగు లేబర్ కోడ్లు వచ్చాయి. కార్మికులు ఎదుర్కొంటున్న బానిస పరిస్థితులను సంస్థాగతం చేయటం, పని పరిస్థితులు, పని గంటలు, కనీస వేతనం, మొదలైన చట్టబద్ధమైన హక్కులను సంపూర్ణంగా తొలగించటం, తద్వారా పాలకవర్గ అనుయాయుల లక్ష్యాలను సులభతరం చేయటం ఈ కోడ్ల ముఖ్య ఉద్దేశ్యం. దీనికి అదనంగా డిఫెన్స్ సర్వీస్ అండ్ మెయింటెనెన్స్ చట్టం (ఇడిఎస్‌ఎ) చేర్చబడింది. దాని ప్రకారం ఏ రంగంలోనైనా సాధారణ ట్రేడ్ యూనియన్ ఆందోళనలను నిషేధించటానికి లేదా పరిమితం చేయటానికి ప్రభుత్వానికి అధికారం వుంది. ఏ రకమైన ట్రేడ్ యూనియన్ కార్యక్రమం అయినా ప్రేరణపూరిత చర్యగా పరిగణింపబడుతుంది. ముఖ్యంగా విద్యుత్, నౌకాశ్రయం, పెట్రోలియం, రవాణా, ఉక్కు, బొగ్గు మొదలైన అన్ని ప్రధాన మౌలిక సదుపాయాల రంగాలు దీనివల్ల ప్రభావితమవుతాయి. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సంస్థలో విధులు నిర్వహిస్తున్న ఆర్టిజన్స్, అన్‌మెన్డ్, పీస్‌రేట్ కార్మికులు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం సమ్మె పిలుపునివ్వగా, సమ్మె చేస్తే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని యాజమాన్యం ప్రకటించింది. ఇడిఎస్‌ఎ ప్రభావం ఎలా ఉంటుందనే దానికి ఇది ఒక తాజా ప్రత్యక్ష ఉదాహరణ.
కాంట్రాక్ట్ కార్మికులు : కాంట్రాక్టు లేబర్ సిస్టమ్ అనేది నేటి ఉపాధి సంబంధాలలో ఉన్న అత్యంత ప్రముఖమైన రూపం. ఇప్పుడు ఉత్పత్తి స్వభావంతో సంబంధం లేకుండా అన్ని పనుల్లో కాంట్రాక్టు పద్ధతి జొరబడింది. పర్మినెంట్ కార్మికుల ఉనికి ప్రస్ఫుటంగా తగ్గించబడింది. కొన్నిపరిశ్రమలలో అయితే మొత్తం శ్రామికశక్తిలో 10% కంటే తక్కువ వున్నారు. పర్మినెంట్, కాంట్రాక్ట్, క్యాజువల్ మరియు ట్రైనీలు/ అప్రెంటిస్‌లు అనే వేరువేరు పేర్లతో, వీరంతా వివిధ విభాగాల్లో పని చేస్తున్నప్పటికీ వారి వేతనాలలో, పని పరిస్థితులలో మరియు సంఘ హక్కు విషయంలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. మన ఆర్ధిక వ్యవస్థలో ముఖ్యంగా, తయారీ రంగం పతనంలో ఉంది. ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు పాలకవర్గం కార్మికులపై భారం మోపుతోంది.
మారుతున్న యజమాని కార్మిక సంబంధాలు : నయా ఉదారవాద సంస్కరణలకు ముందు ఆర్ధిక వ్యవస్థ అభివృద్ధికి, ఉపాధి కల్పనకు వ్యవసాయం మరియు తయారీ రంగాల పాత్ర ఎక్కువగా ఉండగా, సేవా రంగం పాత్ర పరిమితంగా ఉండేది. ఆర్ధిక సంస్కరణల అమలు తర్వాత సేవారంగం ముఖ్యపాత్ర వహిస్తోంది. అదే సందర్భంలో భారత ఆర్ధిక వ్యవస్థలో ఉపాధి కల్పనకు కూడా ఇది ప్రధాన వనరుగా మారింది. సర్వీస్ ప్రొవైడింగ్ సంస్థలు ఇబ్బడిముబ్బడిగా పుట్టుకొచ్చాయి. ఓలా, ఊబర్, స్విగ్గీ, జొమాటో, అర్బన్ క్లాప్ మొదలైన వివిధ సర్వీసులు అందించే సంస్థల్లో లక్షలాది యువత పని చేస్తున్నారు. వీరికి యాజమాన్యంతో ప్రత్యక్ష సంబంధం ఉండదు. ఎటువంటి కార్మిక చట్టాలు, సామాజిక భద్రత వర్తించట్లేదు. ఫలితంగా దారుణంగా దోపిడీకి గురి చేయబడుతున్నారు.
వలస కార్మికులు : కరోనా సమయంలో తమ స్వంత ప్రాంతాలకు తరలి వెళ్లేందుకు కట్టుబట్టలతో, కాలినడకన బారులు తీరిన వలస కార్మికుల పరిస్థితి దేశ ప్రజానీకాన్ని కలవరపరిచింది. గతంలోనూ అంతర్జాతీయ, అంతరాష్ట్ర, అంతర్ జిల్లా వలసలు ఉన్నప్పటికీ గత రెండు దశాబ్దాల కాలంలో ఉపాధి అవకాశాలు తగ్గటంతో వలస కార్మికుల సంఖ్య బాగా పెరిగింది. 'అంతర్ రాష్ట్ర వలస కార్మికుల రెగ్యులేషన్ చట్టం ఉన్నప్పటికీ దీనిని అమలు చేయటంలో ప్రభుత్వాలు, యాజమాన్యాలు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నాయి. వలస కార్మికులు ఆర్ధిక దోపిడీతో పాటు సామాజికంగా, రాజకీయంగా కూడా వివక్షకు, దాడులకు, దౌర్జన్యాలకు గురవుతున్నారు. ఫలితంగా తీవ్ర శారీరక, మానసిక అనారోగ్యాల బారిన పడుతున్నారు. అంతర్ రాష్ట్ర వలస కార్మికులలో సగానికి పైగా మహిళలు ఉన్నారు. వీరిలో అత్యధికులు ఇంటిపనివారు గాను, నిర్మాణ పనిలోను, ఇటుక బట్టీలు, వ్యవసాయ రంగంలోను పని చేస్తున్నారు. వలస కూలీలుగా వివక్షతతో పాటు వీరు మహిళలుగా లైంగిక వివక్షతను కూడా ఎదుర్కొంటున్నారు. లైంగిక వేధింపులు బారిన పడుతున్నారు.
'రెండిటికీ చెడ్డ రేవడి' (నఘర్కా, నఘాటికా) చందంగా వలస కార్మికులను అటు స్వంత రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, ఇటు వలస వచ్చిన రాష్ట్రంలో ప్రభుత్వాలు కాని పట్టించుకోవట్లేదు.
వలస కార్మికుల కోసం సామాజిక భద్రతా పథకాన్ని అమలుచేసిన మొదటి భారతీయ రాష్ట్రం కేరళ. అంతర్రాష్ట్ర వలస కార్మికుల సంక్షేమం పట్ల రాష్ట్రానికి వున్న శ్రద్ధ వారి పనితీరులో ప్రతిఫలిస్తోంది. కరోనా సమయంలో కేరళ రాష్ట్ర ప్రభుత్వం వారిని 'వలస కార్మికులు' కాదని 'అతిధి కార్మికులుగా' నామకరణం చేయటమే కాక అదే రీతిలో వారిని ఆదరించింది. అన్ని వసతులు, సదుపాయాలు కల్పించి అక్కున చేర్చుకుంది.
స్కీం వర్కర్లు : అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, ఆషా, జాతీయ ఆరోగ్య మిషన్, సర్వశిక్షా అభియాన్, ఐకెపి, కస్తూర్బా, ఛైల్డ్ లేబర్, స్వచ్ఛ కార్మిక మొదలైన వివిధ పథకాలలో దేశంలో సుమారు కోటి మంది, తెలంగాణ రాష్ట్రంలో మూడు లక్షల మంది కార్మికులు పని చేస్తున్నారు. వీరిలో 90% మంది మహిళలే.
వీరు పేద ప్రజలకు సంక్షేమ పథకాలు, పౌష్టికాహారం, విద్య, వైద్యం తదితర సేవలను అందిస్తున్నారు. ఈ స్కీం వర్కర్లందరినీ కార్మికులుగా గుర్తించాలని, 45వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సిఫారసు చేసింది. ఈ సిఫారసును అమలు చేయాలని అనేక సంవత్సరాలుగా కార్మికులు పోరాడుతున్నారు. అయినా కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఖాతరు చేయటం లేదు. పైగా ఏడాదికేడాది కేటాయింపులు తగ్గిస్తోంది. ఈ పథకాలను ప్రైవేటుపరం చేయాలని ప్రణాళిక రచిస్తోంది. కార్పొరేట్లకు కోట్ల రూపాయలు సబ్సిడీలు ఇస్తూ, రుణమాఫీలు చేస్తూ కార్మికుల, సామాన్య ప్రజల న్యాయమైన డిమాండ్లను పెడచెవిన పెడుతోంది.
కార్మికవర్గం నేడు చేస్తున్న వారానికి 48 సం|| పని స్ధానంలో 35 గంటలు మాత్రమే ఉండాలని ప్రపంచ కార్మిక సంఘాల సమాఖ్య ఇచ్చిన పిలుపు మేరకు అనేక దేశాలలోని కార్మిక సంఘాలు పోరాడుతున్నాయి. ఆధునిక యంత్రాలు, కంప్యూటర్లు, రోబోలు ప్రవేశించిన నేటి కాలంలో తక్కువ పనితో ఎక్కువ ఉత్పత్తి జరుగుతోంది. నిజానికి చట్ట ప్రకారం 8 గంటల పని అన్న మాటే గాని నేడు ఇంచుమించు అన్ని రంగాలలో కార్మికులు, ఉద్యోగులు అనధికారికంగా 10-12 గంటలు పని చేస్తున్నారు. మరీ ముఖ్యంగా కరోనా అనంతరం 'వర్క్ ఫ్రం హోమ్' తప్పనిసరి అయిన పరిస్థితుల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులకు నిర్ణీత సమయం లేకుండా పోయింది. తమిళనాడు రాష్ట్రం ఇటీవల ఫ్యాక్టరీల చట్టం, 1948 కి సవరణ చేస్తూ 8 గంటలకు బదులు 12 గంటల పనిని చట్టబద్ధం చేస్తూ రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు పాస్ చేసింది. రాబోయే రోజుల్లో మరిన్ని రాష్ట్రాలు ఇదే దారిలో నడిచేందుకు ఆస్కారం వుంది.
ముగింపు : 133 ఏళ్ళ మేడే చరిత్ర ప్రపంచ దేశాలలోని కార్మికవర్గానికి స్ఫూర్తిని, చైతన్యాన్ని, పోరాట మార్గాన్ని ఇచ్చింది. వీటన్నింటి ఫలితంగా కార్మికులు 8 గంటల పనితో పాటు అనేక చట్టాలు, సౌకర్యాలు తెచ్చుకోగలిగారు. నేడు చరిత్ర పునరావృతమవుతోంది. పెట్టుబడిదారీ విధానం విజృంభించటంతో ప్రపంచ వ్యాప్తంగా కార్పొరేట్ అనుకూల ప్రభుత్వాలు కార్మికుల హక్కులను నిర్మూలించి, వారి ఐక్యతపై దెబ్బకొట్టటానికి, తద్వారా తమ లాభాలను మరింత పెంచుకోవటానికి నిరంతరం ప్రయత్నిస్తున్నాయి.
అయితే ప్రతీ చర్యకు ప్రతిచర్య వుంటుంది. 'ప్రపంచ కార్మికులారా ఏకం కండి' అనే నినాదం మరలా నలుదిశలా మార్మోగుతోంది. అమెరికా, బ్రిటన్ వంటి పెట్టుబడిదారీ దేశాలు మొదలుకొని అన్ని దేశాలలో కార్మికవర్గం తమ హక్కులు, డిమాండ్ల సాధనకు పోరాడుతోంది. తమ పోరాటంలో సామాన్య ప్రజానీకాన్ని సైతం భాగస్వాములను చేస్తోంది. 2022 సంవత్సరంలో విశ్వవ్యాపితంగా జరిగిన పోరాటాలే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యాలు.
ఈ రగులుతున్న చైతన్యాన్ని దిశానిర్దేశం జేసి, సరైన మార్గంలో నడిపించటం కార్మిక సంఘాల కర్తవ్యం. వారితో భుజం కలిపి నడవటం సకల జనావళి బాధ్యత.
- పద్మశ్రీ, 9490098687
Sun 30 Apr 05:43:30.516124 2023