- డా||వి.ఆర్.శర్మ, 9177887749
ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ రెండవ తేదీని ''పిల్లల పుస్తక దినోత్సవం''గా జరుపుకుంటారు. బాల సాహిత్య వేత్తగా పిల్లలకోసం నూట అరవై ఎనిమిది కథలు రాసి, బాల సాహిత్యానికి మరెంతో అమూల్యమైన సేవచేసిన ''హాన్స్ క్రిస్టియన్ ఏండర్సన్'' పుట్టిన రోజు సందర్భంగా ఈ పండుగను ప్రపంచ వ్యాప్తంగా పిల్లల సాహిత్య ప్రేమికులు ఎంతో ఇష్టంగా నిర్వహించుకుంటారు.
ఈ బాలల పుస్తక దినోత్సవం సందర్భంగా ఏండర్సన్ గురించి కొన్ని విషయాలు ఈనాటి పిల్లలకోసం చెప్పుకుందాం. 1805-1875 మధ్య జీవించిన ఏండర్సన్ డెన్మార్క్ దేశానికి చెందిన రచయిత. అతణ్ణి తెలుగులో ఏండర్సన్ అనీ, ఆండర్సన్ అనీ రెండు రకాలుగా పిలుస్తున్నారు. అతడు పిల్లలకోసం రాసిన అనేక కథల సంపుటాలు నూట ఇరవై అయిదుకు పైగా భాషల్లోకి అనువాదమయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక దేశాల పిల్లలకు అవి అందుబాటులోకి వచ్చాయి. ఏండర్సన్ 1805లో డెన్మార్క్ లోని 'ఓడెన్స్' అనే ఓ చిన్న కుగ్రామంలో పుట్టాడు. వాళ్ళది అతి పేద కుంటుంబం. అతని తండ్రి చెప్పులు కుట్టేవాడు. తల్లి బట్టలు ఉతికే పని చేసేది. ఆ తండ్రి ఆరోగ్యం ఏమీ బాగుండేది కాదు. ఆయన అండర్సన్ పదకొండో ఏటనే మరణించాడు. కానీ బతికి ఉన్న రోజుల్లో ప్రతిరోజూ, రాత్రి పడుకునేటప్పుడు ఆయన ఏండర్సన్కు కథలు చెప్పేవాడు. అలా చిన్నతనం నుంచే ఏండర్సన్కు కథలపట్ల ఎంతో ఇష్టం ఏర్పడింది. తండ్రి చనిపోయిన తరువాత అతని నాయనమ్మ ఆ పిల్లాడికి రాత్రుళ్ళు పడుకునే వేళ కథలు చెప్పడం కొనసాగించింది.
కొందరు సహృదయుల సహకారంతో ఏండర్సన్ విశ్వవిద్యాలయంలో చదువుకోగలిగాడు. ఆయన ''టేల్స్ టోల్డ్ ఫర్ చిడ్ల్రన్'' అనే పేరుతో నాలుగు కథల సంపుటాలు ముద్రించాడు. ఆ కథల సంపుటాలు ఆయనకు ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి. ఆయన చిన్న పిల్లలకోసం 168కి పైగా కథలు రాశాడు. మాలాంటి వాళ్ళం చిన్నతనంలో చదువుకున్న 'రాజుగారి కొత్తబట్టలు' కథ ఆయన రాసిందే.
ఆయన తన కథల్లో రాసిన 'సాగర కన్య' విగ్రహాన్ని ఆయన గౌరవార్థం కోపెన్ హేగన్ ఓడరేవులో నెలకొల్పారు. ఆయన పేరుతో బాల సాహిత్యంలో అత్యున్నత అవార్డును డెనార్క్ ప్రభుత్వం ఇస్తున్నది. అది 'హాన్స్ అండర్సన్ బాల సాహిత్య అవార్డు'.
మన తెలుగులో కూడా ఆయన కథలు మొదట 'బాలానందం' ప్రచురణలుగా రెండు సంపుటాలుగా వచ్చాయి. వాటిని ఊట్ల కొండయ్య అనువాదం చేశారు. ప్రఖ్యాత చిత్రకారులు బాపు వాటికి బొమ్మలు వేశారు. ఆండర్సన్ కథలు పేరుతో పీకాక్ క్లాసిక్స్, హైదరాబాద్ వారు 2008లో వేశారు. వారు వేసిన నాలుగవ ముద్రణ 2016లో వచ్చింది. ఈ పుస్తకంలో ఉన్న కథలను మాడభూషి కృష్ణ ప్రసాద్ గారు తెలుగు అనువాదం చేశారు.
మంచి పుస్తకం వారు కూడా ఏండర్సన్ కథలను తెలుగు అనువాదంగా 'ఎగిరే పెట్టె-ఏండర్సన్ కథలు' అనే పుస్తక రూపంలో 2017లోనూ, 2020లోనూ ప్రచురించారు. ఇవి ఊట్ల కొండయ్యగారు అనువదించిన కథలు. వీటిలో ప్రఖ్యాత చిత్రకారులు బాపు వేసిన బొమ్మలు ఉన్నాయి. ఇలా ఏండర్సన్ కథల పుస్తకాలు తెలుగులో కూడా ఇప్పుడు దొరుకుతున్నాయి. కనుక ఈనాటి పిల్లలు వాటిని చదివి బోలెడు మంచి కథలను తెలుసుకోవచ్చు.
ఏండర్సన్ పిల్లలకోసం ప్రపంచ బాల సాహిత్యానికి చేసిన అమూల్యమైన సేవకు కృతజ్ఞతగా ఆయనమీద ప్రేమతో 'ద ఇంటర్నేషనల్ బోర్డ్ ఆన్ బుక్స్ ఫర్ యంగ్ పీపుల్' (ఐ బి బి వై), అనే స్వచ్ఛంద సంస్థవారి ఆధ్వర్యంలో ప్రపంచ బాలల పుస్తక దినోత్సవం జరుగుతుంది. బాలల పుస్తకాలకు సంబంధించిన అనేక కార్యక్రమాలు జరుగుతాయి. అంతర్జాతీయ స్థాయిలో ఎందరో బాలసాహిత్య రచయితలనూ, బాలసాహిత్య పుస్తకాలనూ, బాలల్నీ అంతర్జాలం ద్వారా కలపడానికి ఈ సంస్థ ఓ పెద్ద వారధిలా పనిచేస్తున్నది. వీళ్ళు ప్రపంచ వ్యాప్తంగా బాలల్లో పుస్తక పఠనం పట్ల ఆసక్తిని కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. పిల్లల్నే కాదు పిల్లలతోబాటు యువకులనూ, పెద్దవాళ్ళను కూడా బాల సాహిత్యంవైపు ఆకర్షించే విధంగా, వాళ్ళల్లో పుస్తకాలు చదవడం పట్ల ఆసక్తి కలిగించే విధంగా, వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు.
అంతర్జాతీయ పిల్లల పుస్తకదినోత్సవం సందర్భంగా ప్రపంచంలో అనేకచోట్ల పాఠశాలల్లో, గ్రంథాలయాల్లో పిల్లల్ని పుస్తకాలతో కలిపే ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. అనేక స్వచ్ఛంద సంస్థలు, సాహిత్య సంస్థలు, ప్రచురణ సంస్థలు, తల్లిదండ్రులు, ప్రభుత్వాలు, వ్యక్తులు తమతమ పరిధుల్లో రకరకాల కార్యక్రమాలు చేపడుతున్నారు. బాల సాహిత్య రచయితలు తమ పుస్తకాలను ఈ సందర్భంగా ప్రత్యక్షంగానూ, అంతర్జాలంలోనూ ఆవిష్కరిస్తున్నారు.
ఈ ప్రపంచ పిల్లల పుస్తక దినోత్సవ సందర్భంగా మన తెలుగు బాలసాహిత్యాన్ని గురించి, పిల్లల పుస్తకాల గురించి కొన్ని విషయాలు చెప్పుకుందాం. ఆధునిక యుగంలో తెలుగులో బాలసాహిత్యం ఆరంభమైన నాటినుంచి 1980 దశకం వరకూ తెలుగు బాలసాహిత్యంలో ఎంతో అమూల్యమైన కృషి జరిగింది. 1976లో తెలుగు పిల్లల కోసం ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమీ ఏర్పడింది. ఇదే మన దేశంలో ఏర్పడ్డ మొట్ట మొదటి బాలల ఎకాడమీ. 1977 ఫిబ్రవరిలో 'ఆంధ్రప్రదేశ్ బాలల మహాసభలు' హైదరాబాద్‌లో కేశవ మెమోరియల్ హైస్కూల్లో జరిగాయి. ఆ సందర్భంగా బాల సాహిత్యానికి సంబంధించిన అమూల్యమైన వ్యాసాలతో ప్రత్యేక సంచికను కూడా ప్రచురించారు. ఆ సంచికలో దాదాపు అంతవరకు నడిచిన మన బాలసాహిత్య చరిత్రంతా కనబడుతుంది. ఎనభైల తరువాత నెలకొన్న పరిస్థితులవల్ల తెలుగు బాలసాహిత్య ప్రభ క్రమంగా మసకబారింది.
ఐతే, మళ్ళీ ఈ దశాబ్దంలో బాలసాహిత్య రంగం గతంలో ఎన్నడూ లేని విధంగా చిగురులువేసి, పిందెలు పూలూ, ఫలాలూ కాస్తున్నది. గతంలో బాలసాహిత్య రంగంలో ఎందరో ఆరితేరిన సాహిత్యవేత్తలు పిల్లల కోసం రాస్తే, ఈ దశాబ్దంలో కొత్తగా ఎందరో పెద్దలూ, పిల్లలూ... ముఖ్యంగా, విద్యార్థులు బాల సాహిత్యాన్ని రాస్తున్నారు. గత పదేళ్ళ కాలంలోనే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు నాలుగువందల పిల్లల పుస్తకాలు వచ్చినట్టు.. వాటిని సేకరిస్తున్న బాల సాహిత్యవేత్త గరిపెల్లి అశోక్ చెప్తున్నారు. ఒక వైపు ఈతరం పిల్లలు పుస్తక పఠనానికి దూరమయ్యే సామాజిక పరిస్థితులు పెరుగుతున్న ఈ కాలంలో, పిల్లల్ని పుస్తక పఠనానికీ, సాహిత్య రచనలకూ దగ్గర చేయడానికి తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి జిల్లాలోనూ పిల్లల సాహిత్య ప్రేమికులు ఎందరో అమూల్యమైన కృషి చేస్తున్నారు. పిల్లలతో వివిధ ప్రక్రియల్లో రాయించడం, వాటిని పుస్తకాల రూపంలో అచ్చువేయించి వెలుగులోకి తేవడం చేస్తున్నారు. సాహిత్య అకాడమీలూ, ప్రభుత్వాలూ, విశ్వవిద్యాలయాలూ, స్వచ్ఛంద, సాహిత్య సంస్థలూ పిల్లల రచనలకు బహుమతులు, అవార్డులు అందజేస్తూ ప్రోత్సహిస్తున్నాయి. ఈనాటి పిల్లలు తాము రాసిన పుస్తకాల ద్వారా స్కాలర్ షిప్పులూ, జాతీయ స్థాయి గుర్తింపులూ, బహుమతులూ, అవార్డులూ పొందుతున్నారు.
రంగినేని సుజాతా మోహన్ రావు స్మారక ట్రస్టు, చింతోజు బ్రహ్మయ్య ట్రస్టు, మాడభూషి రంగాచారి స్మారక ట్రస్టు, సుగుణ సాహితి, పెందోట సాహితీ సంస్థ, బాల గోకులం, అపురూప బాల సాహిత్య పురస్కారాలు, వేదగిరి రాంబాబు బాల సాహిత్య పురస్కారాలు (సింహప్రసాద్ సాహితీ సమితి), శకుంతలా జైనీ స్మారక బాలసాహిత్య పురస్కారం, పెండెం జగదీశ్వర్ జాతీయ బాల సాహిత్య పురస్కారం, బాల సాహిత్య పరిషత్, జాతీయ సాహిత్య పరిషత్ సిద్దపేట బాల సాహిత్య పురస్కారం, సుగుణ సాహితీ బాల కథా పురస్కారం, వాసాల నర్సయ్య బాల సాహిత్య పురస్కారం, ఉరిమి ఫౌండేషన్, సాహితీ కౌముది, అక్షర సేద్యం, పిల్లల లోకం, మన లైబ్రరీ, లీలావతి దవే బాలల సైన్స్ ఫిక్షన్ కథల పురస్కారం, విఠాల లలిత బాలల సైన్స్ ఫిక్షన్ నవలా పురస్కారం వంటివి మరెన్నో తెలంగాణలో బాలసాహిత్యాన్ని ప్రోత్సహిస్తున్నాయి. వీటిలో కొన్ని సంస్థలు బాల సాహిత్య కార్యశాలలు కూడా నిర్వహిస్తూ, బాలల పుస్తకాలు ప్రచురిస్తూ, అవార్డులూ, బహుమతులూ ఇస్తూ, బాల సాహిత్యాన్ని ప్రోత్సహిస్తున్నాయి.
2018లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు బడి పిల్లలు రాసిన కథల పుస్తకానికి ఆర్థిక సహాయం అందజేయడం ఒక కొత్త చరిత్రేనని చెప్పాలి. 'బంగారు నెలవంకలు' అనే పేరుతో ఆ పుస్తకాన్ని ''తెలంగాణ బాల సాహిత్య పరిషత్తు'' ప్రచురించింది. ఓ ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుకుంటున్న పిల్లవాడు ఆ పుస్తకంలో రాసిన కథను మహారాష్ట్రలో తెలుగు ద్వితీయ భాషగా ఉన్న ఎనిమిదవ తరగతి పాఠ్యపుస్తకంలో పాఠ్యాంశంగా చేర్చడం మరొక కొత్త చరిత్ర.
తెలంగాణ సాహిత్య అకాడమీ బడి పిల్లలకు సన్నిహితం కావడం కూడా బాలసాహిత్య రంగంలో గతంలో ఎన్నడూ జరగని కొత్త చరిత్రే. తెలంగాణ సాహిత్య అకాడమీ చొరవతో, ఆలోచనతో, విద్యాశాఖ, సర్వశిక్షా అభియాన్ల సహకారంతో 'రీడ్' కార్యక్రమంలో భాగంగా, 2022లో మార్చ్ 24 తేదీన తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా, అన్ని పాఠశాలల్లో లక్షలమంది పిల్లలు కథలు రాశారు. బాలసాహిత్య చరిత్రలో ఇదో అద్భుతమనే చెప్పాలి! అలా పిల్లలు రాసిన కథల్ని కొన్ని పాఠశాలలు పుస్తకాలుగా ప్రచురించాయి. వాటికి బొమ్మలు కూడా పిల్లలే వేశారు. ఆనాడు పిల్లలు రాసిన కథల్లోంచి 'వెయ్యి కథలతో' సాహిత్య అకాడమీ ప్రచురించబోతున్న పిల్లల కథల పుస్తకం కూడా తెలుగు బాల సాహిత్యానికి నిస్సందేహంగా అమూల్యమైన కానుకే ఔతుంది. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ సారస్వత పరిషత్తు వంటివి కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా పాఠశాలల పిల్లల పుస్తక రచనలకోసం విభిన్నమైన కార్యక్రమాలు చేపడుతున్నాయి. యన్బిటి వారు పిల్లల పుస్తకాలకు సంబంధించిన అనువాద శిబిరాలను రెండు తెలుగు రాష్ట్రాలో నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలోని ఉత్తునూర్‌లో నిర్వహించిన రెండు రోజుల అనువాద శిబిరంలో వసంతరావ్ దేశ్‌పాండే లాంటి ప్రసిద్ధ రచయితలు కూడా పాల్గొని పిల్లల పుస్తకాలను అనువదించారు. యన్బిటీ వారు, సిబిటీ వారు అనేక భాషలలోని పిల్లల పుస్తకాలను అనువాదాలుగా, ఆకర్శణీయమైన ముద్రణతో అందిస్తున్నారు.
అలాగే జాతీయ స్థాయిలో సంవత్సర కాలానికి పైగా పిల్లలే నిర్వహించుకున్న 'బాలానందం' జూమ్ పిల్లల సృజనాత్మక కార్యశాల ప్రత్యేకమైంది. వికారాబాద్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లాల ఉపాధ్యాయ శిక్షణా కేంద్రాలు కూడా కరోనా కాలంలో బాలసాహిత్య సృజన గురించిన జూమ్ కార్యక్రమాలు నిర్వహించారు. మరెన్నో సాహిత్య, బాలసాహిత్య సంస్థలు కరోనా వంటి గడ్డుకాలంలో కూడా జూమ్‌లో తెలుగు బాలసాహిత్య రచనకు చెందిన కార్యశాలలు, రచనల పోటీలు నిర్వహిస్తూ, అమూల్యమైన సేవచేశాయి.
వేదకుమార్ గారి నిర్వహణలో 'బాల చెలిమి' తరఫున తెలంగాణలోని అన్ని ఉమ్మడి జిల్లాల పిల్లలు రాసిన కథలు, పిల్లల కోసం పెద్దలు రాసిన కథలు పుస్తకాలుగా వచ్చాయి. 'బాల చెలిమి ముచ్చట్లు' బాలసాహిత్య వేత్తలకు, బాలసాహిత్య సృజనకు సంబంధించిన అనేక మెళుకువలు, అనుభవాలు తెలియజెప్పింది. తెలంగాణలోని ఎన్నో చోట్ల 'బాల చెలిమి గ్రంథాలయాలు' నిర్వహిస్తున్నారు. తెలంగాణ గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో జరిగే గ్రంథాలయ వారోత్సవాల్లో పిల్లల్ని పుస్తకాల్ని దగ్గరచేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. నూతనంగా నిర్మించిన, నిర్మిస్తున్న గ్రంథాలయాల్లో పిల్లలకోసం ప్రత్యేక విభాగాలు ఏర్పరిచి, వాటిలో పిల్లల పుస్తకాలు ఉంచుతున్నారు.
'మంచి పుస్తకం'-'తానా' వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న బాలసాహిత్య కథలు, నవలల పోటీల్లో బహుమతి పొందిన ఎన్నో మంచి పుస్తకాలు వచ్చాయి. వాటిలో పిల్లలు రాసిన పుస్తకాలు కూడా ఉన్నాయి. కొన్నిటికి బొమ్మలు కూడా పిల్లలే వేశారు. మంచి పుస్తకం వారు ప్రధానంగా పిల్లల పుస్తకాల ప్రచురణకే ప్రాధాన్యత నిస్తున్నారు. అనేక భారతీయ భాషలనుంచి పిల్లల పుస్తకాలు అనువాదాలుగా తెస్తున్నారు. నవతెలంగాణ, నవచేతన, పీకాక్స్ క్లాసిక్స్ ఇంకా ఎన్నో ప్రసిద్ధ ప్రచురణ సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన ఎన్నో మంచి పుస్తకాలను అనువాదాలుగా కూడా ప్రచురించారు; ప్రచురిస్తున్నారు. తెలుగులోనే కాకుండా ఇంగ్లీషు హిందీ భాషల్లోకూడా పిల్లలు రాస్తున్న పుస్తకాలు వస్తున్నాయి.
కాకినాడలో పెద్దఎత్తున నిర్వహిస్తున్న క్రియ పిల్లల పండుగలో కానీ, అక్కడి వివిధ నగరాల్లో జరుగుతున్న బాలోత్సవాల్లో కానీ పిల్లలతో కథలు, కవితలు కూడా రాయిస్తున్నారు. తెలంగాణలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్న బాలోత్సవాల్లో పిల్లలతో కథలు చెప్పిస్తున్నారు, రాయిస్తున్నారు. అదే చోట నవతెలంగాణ పుస్తక కేంద్రంవారు పిల్లలకోసం ప్రత్యేకమైన పిల్లల పుస్తక విభాగాన్ని కూడా కొన్ని సంవత్సరాలు నడిపారు. వేసవిలో పిల్లల సృజనాత్మక రచనల క్యాంపులు వారం రోజుల పాటు కొన్ని సంవత్సరాలు నడిపారు. జహీరాబాద్‌లో డాక్టర్ విజయలక్ష్మి గారు ఇటీవలే సుమారు పదహారు వందలమంది బడిపిల్లలతో కథలు, కవితలు రాయించే కార్యక్రమాలు నిర్వహించారు. ఆ సందర్భంగా అనేక విలువైన పిల్లల పుస్తకాలు ప్రదర్శనకు ఉంచారు.
పిల్లల్లో పుస్తకాల పట్ల అభిరుచి, ఆకర్షణ, ఆసక్తి కలిగించేలా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పుస్తక మేళాల్లో పిల్లల కోసం రకరకాల బాలసాహిత్య సృజనాత్మక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఆ వేదికల మీద పిల్లలు రాసిన పుస్తకాలు, పిల్లల కోసం పెద్దలు రాసిన పుస్తకాలు ఆవిష్కరిస్తున్నారు.
హైదరాబాద్‌లో మొన్నటి 2022లో జరిగిన పుస్తక మేళాలో 'తెలంగాణ స్టేట్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్' ఆధ్వర్యంలో ఏర్పడిన 'ఎమర్జింగ్ రైటర్స్' అనే వ్యవస్థ ద్వారా ఆ విద్యాసంస్థల విద్యార్థులు రాసిన పదిహేడు పుస్తకాలను ఒకే రోజు, ఒకే వేదికమీద ఆవిష్కరించారు. అధికార అనధికార ప్రముఖులు, నాయకులు, మంత్రులు ఎందరో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ దశాబ్దంన్నర కాలంలో పిల్లల సాహిత్య సంస్థలూ, వేదికలూ ఎన్నో కొత్తగా ప్రారంభమై పనిచేస్తున్నాయి. విశ్వవిద్యాలయాల్లో బాల సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో పరిశోధనలు చేస్తున్నారు. వాటిలో కొన్ని పుస్తకాలుగా కూడా వెలుగులోకి వచ్చాయి. తెలుగులో ప్రసిద్ధులైన రచయితలు కూడా బాలసాహిత్య రచనలకు తగిన సూచనలూ సలహాలూ ఇస్తున్నారు. పిల్లలకోసం తాము కూడా కథలూ, నవలలూ రాస్తున్నారు. సుమారు ఏడు దశాబ్దాల బాలసాహిత్యంతో అత్యంత సన్నిహితంగా ఉండి, అనేక మంది గత కాలపు బాలసాహితీ వేత్తలతో, చందమామ వంటి పత్రికలతో సన్నిహితంగా పనిచేసిన వారున్నారు. వారే ఈనాటికీ బాల సాహిత్యంలో వందలాది కథలూ, వందలాది పుస్తకాలూ రాసి, మ్యాజిక్‌తో బాల సాహిత్యాన్ని కలిపి, పుస్తకాల పట్ల పిల్లల్లో ఇష్టాన్ని కలిగిస్తున్న చొక్కాపు వెంకట రమణ; నేటి పరిస్థితులకు తగినట్టుగా కథల్ని, గేయాల్ని ఎన్నో పిల్లల పుస్తకాల్నీ పిల్లలకు అందిస్తున్న భూపాల్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి సీనియర్లు. వారు ఇప్పటికీ బాలల పుస్తకాలకోసం అవిరామంగా కృషిచేస్తున్నారు.
''పెద్దల సాహిత్యంలో పిల్లలకు పనికి వచ్చేదంతా పిల్లల సాహిత్యంగా చలామణి కావడం మన సంప్రదాయం. మనం ఈరోజు బాలసాహిత్యం గురించి పాశ్చాత్యుల అభిప్రాయాలను అరువు తెచ్చుకొని లాభం లేదు'' అన్నారు కొడవటిగంటి. ''ఇంచు మించు ఇరవై ఏళ్ళుగా సాహిత్యంతో నాకు గల సంబంధాన్ని బట్టి బాలసాహిత్యం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అన్న అభిప్రాయాలు కొన్ని ఏర్పరచుకొన్నాను. కొంత కాలమయ్యాక వాటికి కాలదోషం పట్టవచ్చు'' అని కూడా అన్నారు.
నీతులైనా, సాహిత్య వస్తువులైనా కాలానుగుణంగా మారుతుంటాయి. కనుక ఈనాటి పిల్లల అభిరుచులకూ, అవసరాలకూ తగినట్టుగా ఈనాటి బాలసాహిత్యంలో వస్తువు విషయంలోనూ, భాష విషయంలోనూ కొత్త మార్పులు వస్తున్నాయి. పిల్లలు కథలు, కవితలే కాకుండా యాత్రా చరిత్రలు, స్వగతాలు, ఇతిహాస పాత్రలపై విశ్లేషణలూ రాస్తున్నారు. పెద్దల సహకారంతో అవి పుస్తకాలుగా వస్తున్నాయి. పిల్లల నాటికల పుస్తకాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. గతకాలపు ప్రసిద్ధులైన రచయితలు పిల్లలకోసం రాసిన నాటికలతో బాలల నాటికలు నవచేతనవాళ్ళు ప్రచురించారు. అమృతలత 'చుక్కల లోకం చుట్టొద్దాం', కాసర్ల నరేశ్ రావ్ 'జై విజ్ఞాన్' లాంటి వర్తమాన వాస్తవికత ప్రతిఫలించే నాటికల పుస్తకాలే కాక, మరికొన్ని పిల్లల నాటికల పుస్తకాలు వచ్చాయి. బాల సాహిత్యానికి సంబంధించిన విలువైన వ్యాసాలతో సాహిత్య అకాడమీ ఇటీవల ప్రచురించిన 'పునాస' పత్రిక పరిశోధక విద్యార్థులకు ఉపయోగపడే ఓ కరదీపికలా ఉంది. దానితో బాటు పత్తిపాక మోహన్ ప్రచురించిన 'జయహౌ బాల సాహిత్యం' వ్యాసాల పుస్తకం కూడా ఈనాటి బాల సాహిత్య పరిశోధకులకు పనికివచ్చే మంచి పుస్తకం. వారు రచించిన 'గాంధీతాత' పిల్లల గేయాల పుస్తకానికి ఈ సంవత్సరం కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య అవార్డు వచ్చింది. వర్తమాన బాలసాహిత్య పుస్తకాల విషయాల గురించి ఇదంతా ఓ విహంగావలోకనం మాత్రమే. ఈ నాటి పిల్లల సాహిత్యం, పిల్లల పుస్తకాలకు సంబంధించిన సంక్షిప్త సమాచారమే.
ఈ పిల్లల పుస్తక దినోత్సవ సందర్భంగా చేయదగిన పనుల గురించి కూడా మాట్లాడుకుందాం. ప్రపంచ పిల్లల పుస్తక దినోత్సవాన్ని పాఠశాలల్లో, నగరాల్లో, గ్రామాల్లో-పిల్లలు ఉన్న ప్రతీచోటా పండుగలా జరుపుకోవాలి. పిల్లలను పుస్తకాలకు దగ్గర చేసే రకరకాల కార్యక్రమాలు జరగాలి. అంతేకాదు గతకాలంలో మన తెలుగు పిల్లలకు ఉన్న బాలసాహిత్య అవసరాన్ని గుర్తించి, దాని ఆరంభ, వికాసాలకు కృషి చేసిన వెంకట పార్వతీశ్వర కవులు, కందుకూరి వీరేశలింగం, గిడుగు సీతాపతి, గురజాడ, చింతా దీక్షితులు వంటి వారితో మొదలుపెట్టి, ఆకాశవాణి ద్వారా బాలల వికాసానికి కృషి చేసిన న్యాయపతి రాఘవరావు, న్యాయపతి కామేశ్వరి, పిల్లలకోసం చక్కని రచనలు చేసిన పొట్లపల్లి రామారావు, దాశరథి, సినారె, యశోదారెడ్డి, నందగిరి ఇందిరాదేవి, వంటి వారందరి పుట్టిన రోజులను బాల సాహిత్య ఉత్సవాలుగా నిర్వహించుకోవాలి. వారు బాల సాహిత్యానికి చేసిన సేవలను, పిల్లలకోసం రాసిన పుస్తకాలను ఈ-తరం వారికి పరిచయం చేయాలి. పిల్లలకు అందుబాటులోకి తేవాలి. ఆనాడు పిల్లల సాహిత్యం కోసం వివిధ రంగాల్లో, వివిధ రూపాల్లో జరిగిన అద్భుతమైన పనులను తెలియజేయాలి. చందమామ, బాల, బాలమిత్ర, బొమ్మరిల్లు వంటి పత్రికలను గురించి చెప్పాలి; చూపించాలి. ఈనాడు తెలుగులో పిల్లలకోసం వస్తున్న 'మొలక' నాని, చెకుముకి వంటి పత్రికలనన్నిటినీ పిల్లలకు పరిచయం చేయాలి.
అలాగే మన బాలసాహిత్యం మొదలైన తొలినాళ్ళలో అనువాదాలుగా వచ్చిన ప్రపంచ ప్రసిద్ధ పుస్తకాలు.. టామ్సాయర్, హకల్ బెరీఫిన్, కాంచన ద్వీపం, రిప్‌వాన్ వింకిల్, గలీవర్ సాహస యాత్రలు, యూసోపు కథలు, టాల్‌స్టారు పిల్లల కథలు, ఆస్కార్‌వైల్డ్ పిల్లల కథలు, రాబిన్ సన్ క్రూసో, సోవియట్ పిల్లల పుస్తకాల గురించి చెప్పాలి. ఏండర్సన్ కథల పుస్తకాలను, దేశ దేశాల పిల్లల జానపదకథల పుస్తకాలను అందుబాటులో ఉంచాలి. అలాగే, భారతీయ భాషల్లో అద్భుతమైన బాలసాహిత్యాన్ని రచించిన రవీంద్రనాథ్ ఠాకూర్, ప్రేమ్‌చంద్, సత్యజిత్‌రే, గిజూభారు, చిత్త ప్రసాద్ వంటి వారి రచనల పుస్తకాలను నేటి పిల్లలకు పరిచయం చేయాలి. రొమిల్లా థాఫర్, రస్కిన్ బాండ్, అనుష్క రవిశంకర్, మాధురీ పురంధరే, కమలా బాసిన్ వంటి వందలాది బాలసాహిత్య రచయితల పుస్తకాలను, వాటి అనువాదాల పుస్తకాలను పిల్లలకు అందుబాటులోకి తేవాలి. పిల్లలకోసం మన తెలుగువాళ్ళు బాపు, రమణల వంటివారు రాసిన ఆనాటి పుస్తకాల నుంచి, ఈనాడు బాల సాహిత్యం రాస్తున్న బాల సాహితీవేత్తలు తమ పుస్తకాలు పాఠశాలలకు, పిల్లల లైబ్రరీలకు, పిల్లలకు ఉచితంగా అందించే ఔదార్యాన్ని, బాధ్యతను కనబర్చాలి.
ప్రపంచ పిల్లల పుస్తక దినోత్సవాన్ని జరుపుకోవడంతో బాటు మన బాల సాహిత్య నిర్మాతల జయంతులను పాఠశాలల్లో నిర్వహించుకునే ఏర్పాట్లు ప్రభుత్వాలు చేయాలి. కనీసం నెలకు ఒక రోజైనా పిల్లలు పుస్తకాలతో దోస్తీచేస్తూ, సంతోష సంబరాలతో పుస్తకాల పండుగలు నిర్వహించుకోగలగాలి. సీనియర్ బాల సాహితీవేత్తలతో బాటుగా, ఈనాటి బాల సాహితీ వేత్తలను పాఠశాలలకు ఆహ్వానించి, పిల్లలను వారితో కలిపి మాట్లాడుకోనివ్వాలి. వారి అనుభవాలను వినాలి. అనేక మంచి పుస్తకాలను చదువుకునే వాతావరణం కల్పించాలి. పాఠశాలల్లో అలమరాల్లో మగ్గిపోతున్న పిల్లల పుస్తకాలు వారానికి ఓ సారైనా ఉపయోగించుకుని, వాటి ద్వారా ఆనందం, స్ఫూర్తీ పొందాలి. నగరాల్లో అపార్ట్‌మెంటుల్లో ఉంటున్న పిల్లలకోసం ఆయా భవనాల్లో తప్పనిసరిగా ఓ పిల్లల లైబ్రరీ ఉండేలా పెద్దలు ప్రయత్నించాలి.
ప్రతి ఊరిలో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో బాలలకోసం సాహిత్య వేదికలో, సంస్థలో ఏర్పాటుచేయడానికి ఉపాధ్యాయులూ, సాహిత్య అభిమానులూ పూనుకోవాలి. ఆదిలాబాద్ జిల్లాలో కూర అనే చిన్న గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్న పోరెడ్డి అశోక్, వారి శ్రీమతి కలిసి తమ ఇంట్లోనే పిల్లలకోసం ఓ గ్రంథాలయం నడుపుతున్నారని టీవీల్లో చూశాం. అలాగే కాసర్ల నరేష్ రావు నిజామాబాద్‌లో తన ఇంట్లో పిల్లలకోసం ఓ గ్రంథాలయాన్ని నడుపుతున్నారు. ఇవి నాకు తెలిసింది మాత్రమే. ఇంకా ఇలా పిల్లల గ్రంథాలయాలు నడుపుతూ పిల్లలకు పుస్తకాల స్నేహం కలిగిస్తున్న వాళ్ళు ఉండొచ్చు.
ఇలాంటి పండుగల సందర్భంలో పిల్లలకు వారి వారి వయస్సులకు తగిన విధంగా ఉండే పిల్లల పుస్తకాలను బహుమతులుగా ఇవ్వాలి. పిల్లల్ని వారి ఆలోచనలూ, అనుభవాలూ, ఊహలూ, కల్పనలూ వివిధ సాహిత్య ప్రక్రియల్లో రాసేలా ప్రోత్సహించాలి. వాటిని తల్లిదండ్రులు చిన్న చిన్న పుస్తకాలుగా వెలుగులోకి తేవాలి. నేటి బాలలే భావి పౌరులని కేవలం మాటలకూ, నినాదాలకే పరిమితం కాకుండా, ఇలాంటి పనులు సాకారం చేయగలిగితే పిల్లల భాషానైపుణ్యాలు వికసిస్తాయి. వారికి మంచీచెడు విచక్షణ అలవడుతుంది. లోకజ్ఞానం, లోకరీతులూ తెలుస్తాయి. నైతిక విలువలు నేర్చుకుంటారు. ఆత్మ విశ్వాసం, ఆత్మగౌరవం పెరుగుతాయి. సమస్యల వేళ ధైర్యంగా నిలబడ గలుగుతారు. తార్కికంగా, శాస్త్రీయంగా ఆలోచించ గలుగుతారు. మంచి పుస్తకాలకు పిల్లలు చేరువైతే తెలుగు భాషకూ, పిల్లలకూ, భవిష్యత్తరాలకూ, సమాజానికీ, దేశానికీ, ఈ ప్రపంచానికీ తప్పకుండా అమూల్యమైన మేలు జరుగుతుంది. మానవ చరిత్ర పురోగమనంలో పుస్తకాల పాత్ర అత్యంత విలువైనదీ, అమూల్యమైనది! పిల్లల పుస్తకాల పండుగలు వర్ధిల్లాలి!!
తప్పనిసరిగా నిర్వహించాలి
బాలల పుస్తక దినోత్సవం ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా జరగాలి. అందుకు వీలు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలి. దీని ద్వారా పిల్లలని పుస్తకానికి దగ్గర చేయాలి. పుస్తక పఠనము, పుస్తక రచన పట్ల వారి అభిరుచిని పెంచాలి. పుస్తకాలు చదువుతూ, పుస్తకాలు రాయటం ద్వారా భాష మీద పట్టు ఏర్పడుతుంది. ఈ విధంగా చేయగలిగితే భాషను ముందుకు తీసుకువెళ్లే తరాన్ని తయారు చేసుకోగలుగుతాం. భాషను నిలబెట్టడానికి ఇంతకన్నా గొప్ప మార్గం, సాధనం లేదని నా అభిప్రాయం. తెలంగాణ సరస్వత పరిషత్తు ఈ దిశగా కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుంది.
- డా.జె.చెన్నయ్య,
ప్రధాన కార్యదర్శి- తెలంగాణ సారస్వత పరిషత్తు, హైదరాబాద్.
పుస్తకమే పిల్లల నేస్తం
ఎదుగుతున్న క్రమంలో బాల్యం నుండి తన చుట్టూ ఉన్న వ్యక్తులు, పరిసరాల వంటి అనేక ప్రభావాలు పడతాయి. అయితే అది ఒక వేళ పుస్తకం అయితే ఆ ప్రభావం కొన్ని తరాల వరకు వెలుగును పంచుద్ది. బాల్యంలో పిల్లలకు పుస్తకాన్ని నిజమైన నేస్తంగా చేరిస్తే అంతకు మించి మరొకటి ఉండదు. పిల్లలకు పుస్తకం నేస్తం కావాలి, అప్పుడే వికాసం, విజ్ఞానం, విద్య వారి సొంతం అవుతాయి.
- డా||పత్తిపాక మోహన్,తెలుగు సంపాదకులు, నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా
పుస్తకం మంచి మిత్రుడు పిల్లలకైనా, పెద్దలకైనా
గతంలో అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు బోలెడన్ని కథలు చెప్పేవారు. రాజుల కథలు, జానపద కథలు, పేదరాశి పెద్దమ్మ కథలు, పంచతంత్రం కథలు... ఇలా ఎన్నో కథలు చెప్పేవారు. పుస్తకాలను చదవడం ద్వారా పిల్లలు ఎన్నో కొత్త ప్రదేశాల గురించి, ప్రజల గురించి, జీవన వైవిధ్యం గురించి తెలుసుకుంటారు. మంచి - చెడుల మధ్య తేడా, ధైర్యంగా ఉండడం, సహనంగా వుండడం, మానవత్వం కల్గి వుండడం వంటి ఎన్నో విషయాలు పుస్తకాలు చదవడం వల్ల అలవడతాయి. ఇటీవలి కాలంలో కుటుంబాలు చిన్నవి అయిపోయి, న్యూక్లియర్ ఫ్యామిలీల్లో కథలు చెప్పే అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు లేకపోవడం, అమ్మానాన్నలు వృత్తుల్లో బిజీగా వుండడంతో పిల్లలు ఫోన్లు, ట్యాబ్‌లతో కాలక్షేపం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జహీరాబాద్‌లో 2008లో పిల్లల దగ్గరికి పుస్తకాలు తీసుకుపోవాలనే ఉద్దేశ్యంతో 'మన లైబ్రరీ' ప్రారంభించాం. పిల్లలకు ఆసక్తి కల్గించి, ప్రోత్సహించడం కోసం పిల్లలు రాసిన కథలతో జహీరాబాద్ పిల్లల కథలు - 1,2,3 పుస్తకాలు కూడా ప్రచురించాం.
ఈ మధ్య కాలంలో రెండు వారాలకొకసారి స్థానిక పార్కులో పచ్చని చెట్ల మధ్య రకరకాల కథల పుస్తకాలు పిల్లలకు అందుబాటులో వుంచి, వారు చదివేలా చేస్తున్నాం. పిల్లలు ఎంతో ఆసక్తిగా కథలు చదువుతున్నారు. చెప్తున్నారు. సృజనాత్మకంగా ఆలోచించడం, చక్కటి భాష ఉపయోగించడం కూడా ఈ కథలు చదివే పిల్లల్లో వృద్ధి చెందడం మేం గమనించాం. పిల్లలకు ఖరీదైన బట్టలు, ఆట వస్తువులు ఇవ్వడం కాకుండా ప్రతి ఒక్కరూ పుస్తకాలను బహుమతులుగా ఇవ్వడం జరగాలి. ప్రతి ఇంటిలోనూ తమకంటూ కొన్ని మంచి పుస్తకాలతో ఒక చిన్నపాటి లైబ్రరీ ఏర్పడితే, ప్రతి ఇల్లూ నందనవనమే - ప్రతి ఊరూ ఆనంద ప్రదేశమే.
- డా||విజయలక్ష్మి,వ్యవస్థాపకురాలు, మన లైబ్రరీ, జహీరాబాద్
చిన్నప్పటి నుండే..
చిన్నప్పటి నుండి పిల్లలకు భాషా సాహిత్యాల పట్ల అభిరుచి, ఆసక్తి కలిగించే ప్రయత్నం ట్రస్టు ద్వారా చేస్తున్నాం. వారిలోని సృజనాత్మక రచనలు వెలువరించే కృషిని ప్రోత్సాహిస్తూ, బాల ప్రతిభా పురస్కారాలు బడిపిల్లల రచనలకు ఇస్తున్నాం.
- చింతోజు బ్రహ్మయ్య ట్రస్ట్, ముస్తాబాద్
Sun 02 Apr 03:20:17.1978 2023