Sat 15 Apr 23:34:31.89845 2023
Authorization
నేడు తెలుగు నాటకరంగ దినోత్సవం. తెలుగు వారంతా నాటకాన్ని తలుచుకుని నటించి ప్రదర్శించి తిలకించి పులకించి పోయేరోజు. సభలు, సమావేశాలు, సదస్సులు, నాటక ప్రదర్శనలు జరుగుతాయి. అనేక విషయాలపై చర్చలు కొనసాగుతాయి.
ఈ నేపథ్యంలో నాటకరంగ పురోభివృద్ధి గురించి మనం ఒక సమగ్ర విచారణ చేసి సత్వర చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
తెలుగు నాటకరంగం రెండు తెలుగు రాష్ట్రాలలో ఉత్కృష్టమైన చరిత కలిగి వినూత్న నాటక సంపదతో పరిడవిల్లుతుంది. ఎన్ని ఆటు పోట్లున్నా మధ్యలో నీరు ఇంకి పోయినా జీవనది తన అస్తిత్వాన్ని ఎలా కోల్పోదో, తెలుగు నాటకం అప్పుడప్పుడూ ఎదురయ్యే ఒడిదుడుకుల్ని తట్టుకుంటూ నిర్వీర్యం చేసే పరిస్థితులను దాటుకుంటూ ఆ జీవనదిలా ముందుకు సాగుతుంది. అందుకు నిదర్శనం నేడు తెలుగు రాష్ట్రాలలో పోటానుపోటీలుగా ప్రదర్శింపబడుతున్న నాటికలు.
నాటకరంగంలో తెరముందు నటీనటులు నటిస్తే తెరవెనుక దర్శకుడి ప్రతిభ, సెట్టింగులు, లైటింగ్ డిజైనింగ్, మైకుల ఏర్పాటు తదితర సౌండ్ ఎఫెక్ట్స్ ఇలా ఎన్నో అంశాలు దాగి ఉన్నాయి. వారందరి సమిష్టి కృషితోనే నాటకం అద్భుతంగా ప్రదర్శించబడి పలువురి మన్ననలను అందుకుంటుంది. నాటకం ఒక అధ్యయనంగా మారాలంటే నటశిక్షణాలయాలు మాత్రమే ఉంటే సరిపోదు.
నాటకరంగానికి ప్రత్యేకమైన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి. తెలుగు, ఉస్మానియా, కేంద్రీయ తదితర విశ్వవిద్యాలయాలలో రంగస్థల కళలశాఖ ఒక విభాగం మాత్రమే. అలా కాకుండా ప్రత్యేకమయిన నాటకరంగ విశ్వ విద్యాలయం ఏర్పాటు చేసుకుని అక్కడ సంపూర్ణంగా నాటక సంబంధ విభాగాలు ఉండాలి. ఉదాహరణకు దర్శకత్వం, రచన, పరిశోధన, నటశిక్షణ, సెట్టింగులు, ప్రచారం, ఇతర భాషల నాటకాలు, పరిశోధన, ప్రచురణ, నాటక గ్రంథాలయం, ప్రదర్శన ఆడిటోరియం ఇలా అన్నీ ఒక చోటే ఉండాలి. నాటకాన్ని అధ్యాపకులు బోధించాలి. కొత్త నటీనటులను తగిన శిక్షణతో తయారు చేయాలి. ఈ విశ్వవిద్యాలయంలో చదువుకుని సుశిక్షితులైన వారికి పిలిచి మరీ (కాంపస్ సెలక్షన్లా) అవకాశాలివ్వాలి.
నాటక విశ్వవిద్యాలయం తెలంగాణలో, ఆంధ్రాలో రెండుశాఖలుగా ఉండి సమన్వయంతో పని చేయాలి. దీనిలో నాటకరంగ నిష్ణాతులను నియమించాలి. ప్రస్తుత గ్రంథాలయం అన్ని పుస్తకాలు కలిపి ఉన్నట్లుగా కాకుండా ఒక పెద్ద గ్రంథాలయం బాదంగీర్ సాయి గారిలా కేవలం నాటక పుస్తకాలు మాత్రమే ఉండేలా, పలు ప్రాంతాల నించి పుస్తకాలు సేకరించి ఒకచోట చేర్చాలి. ఏ నాటక సమాచారమైనా ఈ విశ్వవిద్యాలయ గ్రంథాలయంలో అందుబాటులో ఉండాలి. అదే గ్రంథాలయంలో నాటకాలకు సంబంధించిన వీడియోలు డిజిటల్, ఆన్లైన్ సదుపాయాలతో అక్కడ విద్యార్థులు కూర్చుని బ్రౌజ్ చేసి రికార్డెడ్ నాటకాలను వీక్షించాలి.
నాటక సంబంధ సంగీతం కోసం ఒక విభాగం ఉండాలి. నాటకాలకు సంబంధించిన పాటలు, పద్యాలు, బాక్గ్రౌండ్ మ్యూజిక్‌లు ఈ విభాగంలో తయారవ్వాలి.
నాటక ప్రదర్శన ఎక్కువ, రచన తక్కువ కనుక ఎప్పటికప్పుడు నాటకాలను రచించి, ప్రతి నాటకాన్ని అక్షరీకరించి ఆన్లైన్ లోను ముద్రణలోను రికార్డు చేసి పెట్టాలి. ప్రసిద్ధ నాటకాలను సేకరించి సంకలనాలుగా ముద్రించి నిక్షిప్తం చేసే పని ఇప్పటికే మొదలైంది. కొన్ని పుస్తకాలు రూపొందాయి కూడా.
మహాత్మగాంధి స్వాతంత్య్ర ఉద్యమ నాయకుడిగా మనందరికీ తెలుసు. అంత గొప్ప నాయకుడిని ప్రభావితం చేసిన నాటకం సత్యహరిశ్చంద్ర. అదే విధంగా శ్రవణ కుమారుడి కథ. నాటకం వల్ల ప్రభావితుడైన టంగుటూరి ప్రకాశం గొప్ప నాయకుడయ్యాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో నాయకులు నాటకాలతో ప్రభావితం అయ్యారు. కవిత్వం, నాటకం సమాజంలో మార్పుకు ఎంతగానో దోహదం చేస్తాయి. నాటకాలు కన్నతల్లిలా మూలంగా అందరూ అంగీకరిస్తారు. ఆ మూలాన్ని కాపాడుకోవలిసిన అవసరం ఎంతైనా ఉంది. ఇదివరకటికంటే ఇప్పుడు నటన పట్ల యువత ఆసక్తితో ముందు కొస్తున్నారు. వారికి సరియైన మార్గనిర్దేశనం చేయాలి.
వీటన్నింటితో పాటు సమాజాన్ని అనేక సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. ఆత్మహత్యలు, అత్యాచారాలు, ఆడంబరాలు, వరకట్నాలు, నిరుద్యోగం, మద్యపానం తదితర అంశాలను సృజిస్తూ విస్తృతంగా నాటకాలు రచించి ప్రదర్శించాలి. అన్నిటి కన్నా ముఖ్యంగా అవినీతి పెరిగిపోయింది. అరాచకాలు జరుగుతున్నాయి. నైతిక విలువలు లేకుండా పోతున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని నాటకరంగం మరింత పటిష్టంగా నాటకాలతో ముందుకు రావాలి.
నాటక పరిషత్తులు పోటీలు ప్రదర్శనల ద్వారా ప్రోత్సహిస్తున్నా, బలమైన ప్రోత్సాహం ప్రభుత్వం నుంచి రావాలి. నాటక స్థాయిని పెంచాలి. అందుకు తగిన ఆర్థిక వనరులను సమకూర్చాలి.
పాఠశాల స్థాయి నుంచి పిల్లలకు నటనలో మెళుకువలను నేర్పించాలి. సబ్జెక్టులతో పాటు నటన చదువులో భాగం కావాలి. దీని వల్ల పిల్లలలో వత్తిడి తగ్గి ఆత్మహత్యలజోలికి వెళ్ళరు. సరైన నిర్ణయాలు తీసుకునే అలవాటు అవుతుంది. కళాశాలలలో నాటక ప్రదర్శన ఒక ప్రాజెక్ట్ వర్క్‌గా మారాలి. అప్పుడే నాటకం నలుదిశలా తమ జీవితాలలో భాగమవుతుంది.
ఈ మార్పుల ద్వారా కళాకారులకు జీవనోపాధి దొరుకుతుంది. నాటకాలాడే వారు అనే చులకన భావం నుంచి నాటకం వృత్తిగా చేస్తున్న వారుగా ఒక మర్యాదపూర్వక స్థాయి రావాలి. వీటన్నింటికి పై సూచనలు తగిన అవకాశాలు కలిగిస్తాయి. నాటకం మనందరిది. నాటకం మనకు ఊపిరి. ఆ నాటకానికి తగిన చేయూతను కలిసికట్టుగా ఇచ్చి మన నాటకం విశ్వవ్యాప్తం కావాలి.
(నేడు తెలుగు నాటక రంగ దినోత్సవం)
- డా|| సమ్మెట విజయ, 9989820215