అంతర్జాతీయ మహిళా దినోత్సవం శ్రామిక మహిళల పోరాట విజయ దినోత్సవం లేదా పోరాట స్ఫూర్తిని జ్ఞాపకం చేసుకునే రోజు. ఈ దినోత్సవం ఐక్యరాజ్యసమితి ప్రకటన తర్వాత ప్రభుత్వాలతో సహా అంతటా నిర్వహిస్తున్నారు. వారికి పోరాటంతో గాని కష్టం చేసే స్త్రీలతో గాని వారి హక్కుల ఉద్యమాలతో గాని పనిలేదు. దానిని ఒక వేడుకగా జరుపుకుంటున్నారు. సన్మానాలు, సభలు, దండలు, సాధికారిత ఊకదంపుడు వ్యక్తులుగా విజయ సోపానం అధిరోహించే వారికి అభినందనలు, ప్రభుత్వాల డాంబికాలు, హోటల్స్ ''స్త్రీలకు ప్రత్యేకం'' విభాగాలు, వస్తువుల ప్రత్యేకడిస్కౌంట్లు వగైరా, వగైరా.. ఇబ్బిడిముబ్బిడిగా కనపడతాయి. ఇక టివి ఛానల్సు వారికి ఉన్నట్టుండి గుర్తుకొస్తుంది ఓ నలుగుర్ని కూచోబెట్టి చర్చా నడిపేసి ఓహో అని జబ్బలు చరుచుకుంటారు.
ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం ప్రతీ ఏడాది ఒక పిలుపు నిస్తుంది. ఈ ఏడాది ''డిజిట్ ఆల్'' జెండర్ సమానత్వం కోసం సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధన అని పిలుపునిచ్చింది. అట్లాగే మరో వైపు మహిళా హక్కుల సంస్థలు 'సమతను ఆలింగనం చేసుకుందాం'' (ఎంబ్రౌస్ ఈక్విటి) అని పిలుపునిచ్చింది. ఇట్లాంటి 'ఫ్యాన్సీ' పిలుపులు ఇచ్చే తీరిక లేకుండా అణగారిన స్త్రీలతో పని చేసే సంఘాలు ట్రేడ్ యూనియన్లు మారిన కార్మిక చట్టాలతో, పడిపోతున్న ఉపాధి అవకాశాలతో స్త్రీలు బతికేదెట్లా అని ఆందోళనలో ఉన్నాయి.
ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం ప్రకటించిన డిజిటల్ సమానత్వం లేదా సమా నత్వం కోసం సాంకేతికతను ఉపయోగిం చడం అనేది మన దేశంలో జరుగు తాయా? జరిగేందుకు ఏమైనా చర్యలు ఉంటాయా? అనే ప్రశ్నలు లోతుగా పరిశీలించాలి.
సాధారణ స్త్రీలతో జరిగిన అనేక వర్క్ షాపుల్లో ఈ అంశం చర్చకు వచ్చింది. ప్రతిసారి ఆ స్త్రీలు మధ్య తరగతి గృహిణు లయినా, రోజువారీ కూలీలయినా, చిన్న రైతు కుటుంబాల వారయినా వారు అందరూ స్త్రీలు-పురుషులు యిద్దరికీ ఇంటర్నెట్, స్మార్ట్ఫోను సమానంగా అందుబాటులో ఉంది అని భావించారు. కొనుక్కోగలిగే వారెవరయినా వాటిని వినియో గించవచ్చన్నారు. కాని చర్చ లోతుకు పోయినకొద్దీ యింట్లో నెట్ ఎవరు వాడతారు ఎవరు నియంత్రిస్తారు అనేది అర్థం కాసాగింది. టెక్నాలజీ కూడా కొనుక్కో గలిగిన వారికే అందుతుందని వారు అర్థం చేసుకున్నారు.
ఇక్కడ గమనించాల్సిన అంశం ఇంటర్నెట్, కంప్యూటరు అందరికీ సమానంగా అవకాశాలిస్తుందనీ శ్రమబలంగా ఉండటం. టెక్నాలజీని దానంతట అదే ఒక సాధికార చిహ్నంగా భావించడం. ఈ భ్రమజాలం సృష్టించడంలో సామాజిక మాధ్యమాలు గణనీయమైన పాత్ర పోషిస్తున్నాయి,
'డిజిటల్ భారతం' ట్రిలియన్ డాలర్ల అవకాశాల తలుపులు తీయటం' అని ప్రభుత్వం 2016లో ప్రకటించినపుడు మన దేశంలో సైబర్ అక్షరాస్యత 10 శాతం కంటే తక్కువ. ప్రపంచ మార్కెట్ లోకి వేగంగా దూసుకెళ్తున్న మన ఆర్థిక వ్యవస్థే ఈ మార్కెట్లో పోటీపడే నైపుణ్యాలను ఈ దేశ ప్రజలకి అందునా నిచ్చెనలో అడుగు మెట్టుపైన నిలబడిన స్త్రీలకు ఎంతవరకు కలిగించారు? డిజిటల్ ప్రక్రియ అనేది ప్రజల పని పద్ధతిని మార్చివేస్తుంది. వీరేం సమాచారం పొందుతున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఏ రకం అయిన వినోదాన్ని ఆస్వాదిస్తున్నారు? అన్ని దూరిపోతాయి. ఒక్కమాటలో చెప్పాలంటే మన ప్రభుత్వం ఎడ్లబండి మన స్త్రీల ప్రయాణానికి కేటాయించి విమానంతో పోటీపడమంటున్నది.
స్థిర అభివృద్ధి లక్ష్యంగా 'డిజిటల్ ఇండియా' ప్రాజెక్టు ప్రారంభించి పౌరులకు సేవలు నేరుగా... కింది స్థాయి అధికార యంత్రాంగం అలసత్వం, లంచగొండితనం నివారించి మేలు చేస్తానన్నది. కాని ఇంటర్నెట్ సదుపాయాల కొరత, సైబర్ అక్షరాస్యత నైపుణ్యాలు లేకపోవడంతో అత్యధిక జనాభా ఈ డిజిటల్ ఇండియా నుంచి బయటకు నెట్టివేయబడింది. స్త్రీల అక్షరాస్యత పురుషుల కంటే అన్ని రాష్ట్రాల్లో తక్కువే. తెలంగాణ వంటి రాష్ట్రాల్లో మరీ తక్కువ - 58 శాతం. కాబట్టి డిజిటల్ సేవలు వాడుకునే సామర్థ్యం ఏర్పాటు చేయకుండా సేవల్ని ఆన్లైన్లో వినియోగించుకోండంటే... ఈ సామాన్య స్త్రీలకి సేవల్ని నిరాకరించడమే...
'భారత్ నెట్' కార్యక్రమం కింద అన్నీ గ్రామ పంచాయతీలకు సైబర్ నెట్ సౌకర్యం కల్పిస్తామని ప్రభుత్వం చెప్పింది. ఈ కార్యక్రమం ఒక్కసారి కూడా నిర్దేశిత లక్ష్యం అనుకున్న సమయానికి చేరలేకపోయింది. జాతీయ డిజిటల్ లిటరసీ మిషన్ 1.67 శాతం జనాభాకు మాత్రమే చేరగలిగింది. దానికి నిధుల కేటాయింపు లేక చావుబతుకుల్లో వుంది.
సైబర్ అక్షరాస్యత, డిజిటల్ నైపుణ్యాలు లేని అధిక సంఖ్యాక ప్రజలకు నెట్ ద్వారానే సేవలు అందిస్తామని చెప్పడం ద్వారా వారు పొందాల్సిన సేవలకు వారిని దూరం చేస్తున్నారు. రేపోమాపో నైపుణ్యాలు గల వారిపై వారు పూర్తిగా ఆధారపడాల్సి వస్తోంది. ప్రాథమిక సేవలకు కూడా వాళ్ళు అల్లాడే స్థితిని ఈ డిజిటల్ విప్లవం కలిగించింది. ఉదాహరణకు 2017 - 18ల్లో బొటనవేలి ముద్ర సరిపోతేనే రేషన్ ఇస్తామని ప్రకటించారు. ఇంటర్నెట్ వస్తుపోతూ దాగుడుమూతలాడే గ్రామీణ భారతంలో మారుమూల ప్రాంతాల్లో నెట్ కనెక్షను కోసం చెట్లెక్కి కూర్చున్న దృశ్యాలు మనం చూశాం. రేషను డీలరు చెట్టెక్కితే కనెక్టివిటీ వచ్చింది. మరి వేలిముద్ర వేయడానికి స్త్రీలూ, ముసలి ముతకా తేడా లేకుండా చెట్టెక్కాలా? (సాధారణంగా స్త్రీలే రేషను తెచ్చుకుంటారు) ఫలితంగా పేద రాష్ట్రాల్లో ఆకలి మరణాలు జరిగాక వేలిముద్ర కలవకపోయినా రేషను ఇవ్వాల్సిందేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
ఇపుడు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్‌కు ఓటిపి పద్ధతి పెట్టాయి. నెట్ పని చేయకపోయినా, ఫోనులో డేటా కొనుగోలు అయిపోయినా వారికి రేషను రాదు. ఒక రకంగా నెట్ సౌకర్యం అమ్మే కంపెనీలకు లాభం కోసం ఇటువంటి 'అకాల' నిర్ణయాలు ప్రభత్వుం తీసుకుంటున్నదా లేక ఏదో డిజిటలైజేషన్ పేరిట స్త్రీలకు తిండి దొరక్కుండా చేసే కుట్ర ఏమైనా జరుగుతున్నదా అనే అనుమానం వస్తే మనం ప్రభుత్వాన్ని బద్నాం చేసినందుకు ఊచలు లెక్కపెట్టాల్సి వుంటుందేమో!
కాని పెరిగిన / పెరుగుతున్న ధరలు స్త్రీల జీవితంపై వారి ఎడతెగని చాకిరిపై ఏ ప్రభావం చూపుతున్నాయో ఎవరికీ ఆసక్తి లేదు. గ్యాస్ సిలిండర్ ధర రూ.1200/- లకి చేరుకుంది. స్త్రీలు ఒక గ్యాసు సిలిండరు 8 నెలలు వాడటం అనే అద్భుతాలు సృష్టిస్తున్నారు. వారి చేతిలో మంత్ర దండం ఉందేమో అన్పిస్తుంది. ఆ మంత్ర దండం పేరు పొదుపు - చాకిరి. ప్రభుత్వం ఆడంబరంగా 'ఉజ్వల' మోజున కింద ఇచ్చిన సిలిండర్‌లో 85 శాతం రెండోసారి నింపుకోలేదు. కట్టెలు, పిడకలు వంటి పాత, ముతక వంటకి తిరిగి వెళ్ళారు. కట్టెలు తేవడానికి... చెట్లు, అడవుల కొరత ఏర్పడడంతో వారంలో రెండు సార్లు కనీసం 5 - 10 మైళ్ళు నడిచి వెళ్ళిరావల్సి వస్తున్నది. ఒంటరిగా వెళితే ప్రమాదం అనే భయంతో ఐదు, ఆరుగురు కల్సి వెళ్తున్నారు. పట్టణాల్లో నగరాల్లో కూడా పేద బస్తీల్లో రోడ్ల మీద పొయ్యిలు పెరిగాయి. ఈ స్త్రీలు కూడా బృందాలెగా వెళ్ళి.. కరెంటు వాళ్ళు కొట్టి పడేసిన చెట్ల కొమ్మలు సేకరించుకుంటున్నారు. కరెంటు వాళ్ళు అలసత్వంతో చెట్ల పైనే వదిలేసిన ఎండుకొమ్మల్ని కొక్కెంతో లాగి భాగ్యనగరంలో ఇద్దరు స్త్రీలు షాక్‌కి గురయ్యారు. ఈ హింసను చర్చించడం పట్ల ఎవరికీ ఆసక్తి లేదు.
''ఇల్లాలే ఇంటికి జీవనజ్యోతి' వంటి కాలం చెల్లిన భావాన్ని భుజాన్నేసుకున్న సనాతన ఛాందస వాదం హింస నుంచి రక్షణ కోసం ఇంట్లో వుండండి అనే నినాదం ఎత్తుకుంది. హింస అనేది నివారణలేని రుగ్మత. కాబట్టి ఇంట్లో వుండండి అంటున్నారు. వీరి దృష్టిలో హింస అంటే పురుషుడి వ్యక్తిగత ఆస్తి అయిన ఒకని శరీరాన్ని మరొకడు అపవిత్రవం చేసే లైంగిక హింస మాత్రమే. అంటే స్త్రీ అనుభవించే బాధ వేదన అవమానం చిత్రహింస వీటి వల్ల కాదు. లైంగిక దాడిపై ఇంత హాహాకారాలు... పురుషుడి సంతానం కనే పాత్ర అపవిత్రం అవుతుందని మాత్రమే. ఎన్ఎఫ్హెచ్ఎస్ 19 - 21 ప్రకారం మారిటల్ రేప్ 95 శాతం పెరిగింది. మారిటల్ రేప్ (భార్యకు ఇష్టం లేకున్నా భర్త అత్యాచారం చేయటం) నేరం కాదు. అది మన సంస్కృతి అని కేంద్ర మంత్రి పార్లమెంటులో ప్రకటించారు. అంటే పెళ్ళయినాక స్త్రీ శరీరాన్ని ఏమైనా చేయడానికి భర్తకు అధికారం ఉందనే 'మను' సూక్తాన్ని పునరుద్ఘాటించారు.
ఇవికాక స్త్రీలపై జరిగే లైంగిక దాడుల్లో 33 శాతం బాలలపై జరిగే లైంగిక హింసలో 41శాతం కుటుంబంలో రక్త సంబంధీకులే చేస్తారని డబ్ల్యూసిఆర్బి లెక్కలు చూస్తే తెలుస్తుంది. స్త్రీలపై జరిగే లైంగిక దాడుల్లో 93 శాతం బాలలపై జరిగే వాటిలో 96 శాతం తెలిసిన వారు / పరిచయస్తులే చేస్తున్నారు. ఇల్లు పరిసరాల్లో జరిగేవి 76 శాతం. అంటే ఇల్లు ఎంత సురక్షిత ప్రదేశమో అర్థం చేసుకోవచ్చు. కాని మూఢత్వానికి వాస్తవాలతో పనేంటి?
పెరిగిన ధరలు స్త్రీల ఇంటి చాకిరి భారాన్ని విపరీతంగాపెంచాయి. వారి ఆహార లభ్యతను తీవ్రంగా దెబ్బతీశాయి. ఫలితంగా అనారోగ్యం, రక్తహీనత విపరీతం అయ్యింది. స్త్రీలు ఇంట్లో చేసే జీతభత్యం లేని చాకిరి,.... వృద్ధులు పిల్లల సేవ... పనిభారం పెంచడమే కాదు స్త్రీలపై గృహహింసను కూడా పెంచి పోషి స్తున్నాయి. అక్యాఫామ్ అసమానవత్వ నివేదిక ప్రకారం నెలసరి జీతం పొందే స్త్రీలు 9.92 శాతానికి తగ్గి పోయారు. రాన్రాను మరింతగా ఇంటి పని సేవల భారం స్త్రీలపరం అవుతున్నది. ఇంటి పని పిల్లల, వృద్ధుల సేవ స్త్రీలే చేయాలి వారు ఇంటికే పరిమితం కావాలి అనే ప్రచారం పరోక్షంగా తీవ్ర ప్రభావం చూపుతున్నది. 'చదువుకున్న వధువు కావాలి కాని ఉద్యోగం చేయకుండా ఇంటి నిర్వహణ చేయాలి' అనే ప్రకటనలు 'వధువు కావాలి' కాలమ్స్‌లో తరుచుగా దర్శనమిస్తున్నాయి. యించుమించు ఇటువంటివి 19వ శతాబ్దపు అధమార్థంలో పేపర్లలో కన బడేవి. అంటే మత మౌఢ్యాన్ని తలకెక్కిం చుకున్న ఆధునిక పురుషస్వామ్యం 'పిల్లల భవిష్యత్తు' వంకన స్త్రీల రక్షణ వంకనా తిరిగి వారిని వంటింట్లోకి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నది.
ఈ నేపథ్యంలో కనీస మౌలిక హక్కులు సదుపాయాలు పొందలేని 60 కోట్ల స్త్రీలున్న దేశంలో శాస్త్ర సాంకేతికతను సమానత్వం కోసం వాడతారా? లేక వారిని బహిరంగ ప్రదేశాల నుంచి నెట్టేసి ఇళ్లకు పరిమితం చేసి బానిసలుగా మార్చడానికి... అసమానతలు హింస ప్రేరేపించడానికి సాధనాలుగా వాహ కాలుగా సాంకేతిక నైపుణ్యాల్ని వాడుతు న్నారా? అనేది అర్థం చేసుకోవాల్సిన అసలు అంశం.
రాజ్యాంగ అధికరణం 21 ప్రకారం ఇంటర్నెట్ సౌకర్యం పొందడం అది కూడా గోప్యత హక్కుతోపాటు, విద్యాహక్కులో భాగంగా పొందడం, ప్రాథమిక హక్కుని కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చి కూడా 4 ఏండ్లు అవుతున్నది. సైబర్ నేరాలు పెరిగాయి. స్త్రీలపై సైబర్ దాడులు ట్రోలింగులు పెరిగాయి తప్ప సమానత్వం కోసం సాంకేతికతను ఉపయోగిస్తున్న దాఖలాలు ఎక్కడా కనబడ్డంలేదు.
మరి అంతర్జాతీయ సంస్థలు ఇటువంటి పిలుపులు ఎందుకిస్తున్నాయి. కొత్తదనం కోసమా? అభివృద్ధి ఆ దశకి చేరిందని చెప్పడానికా? వాస్తవాలు మరుగున పెట్టడానికా? లేక సాంకేతికత ఇలా కూడా వాడండని ప్రభుత్వాలకు ఆభ్యర్థనా?
డిజిటల్ అంతరాలు
అందరి చేతిలో స్మార్ట్‌ఫోన్ కనబడుతున్నట్టే ఉంది. కాని డిజిటల్ అంతరాలు కూడా సామాజిక ఆర్థిక అంతరాల మాదిరిగానే అగాధాలుగా మారాయి. 67.6 శాతం కుటుంబాలు స్మార్ట్‌ఫోన్ వాడుతున్నాయి. 90 శాతం కుటుంబాలు ఏదో ఒక ఫోను వాడుతున్నాయి. స్మార్ట్ఫోను అందుబాటులో మొదటి ప్రాధాన్యత ఇంట్లో పురుషుడిదే... కేవలం 14.9 శాతం స్త్రీలు మాత్రమే నెట్ వాడుతున్నాయి. దీనిలో గ్రామీణ స్త్రీలు కేవలం 6 శాతం మాత్రమే.
అట్లాగే నెట్ దేనికి వాడుతున్నారనేది కూడా కీలకం. వినోద కాలక్షేపానికి, సామాజిక మాధ్యమాల వినిమయానికి వాడుతున్నారా లేక వారి ఆదాయాన్ని పెంచే సమాచారం కోసం లేదా వనరులు వినియోగించుకోవడానికి అవసరం అయిన సూచనలు, సేవల వినియోగం, సామాజిక సంబంధాలు, ఆర్థిక కార్యకలాపాలు వంటి వాటి కోసం వాడుతున్నారా అనేది చాలా కీలకం అయిన అంశం. ఎక్కువ మందికి నెట్ దీనికి వినియోగించాలనే పరిజ్ఞానం కూడా లేదు. 'నెట్ ఉంది. దానిలో సామాజిక మాధ్యమాలు, టివి కార్యక్రమాలు, పాటలు వగైరా చూస్తాము' అని ఈ గ్రామీణ స్త్రీలు చెప్పారు.
వారిలో 2 శాతం మంది నెట్‌ను నెట్ బ్యాంకింగ్‌ను అంటే చెల్లింపులకు ఇతర నగదు లావాదేవీలకు వాడుతున్నారు. అయితే అది సరిగా చేయడం చేతకాక ఆర్థికంగా నష్టపోయిన / పోతున్న వారే ఎక్కువ.
ఆన్లైన్ చదువులకు దూరంగా ఆడపిల్లలు
ఇక కోవిడ్ సందర్భంలో ఆన్లైన్ విద్యా ప్రారంభం అయ్యాక అసలు బడులు ఎత్తేసి ఆన్లైన్లోనే చదువు చెప్తామనే ప్రతిపాదన ఒకటి పరిశీలనలో ఉన్నదట... ఇంతకంటే దేశాన్ని ముంచేసే ఆలోచన మరేది ఉండబోదు. ఇది పేద పిల్లలను ముఖ్యంగా అమ్మాయిల్ని చదువుకి పూర్తిగా దూరంగా చేస్తుంది.
67.6 శాతం స్మార్ట్పోన్లు ఉన్నాగాని వాటిని విద్యకోసం పూర్తిగా వాడేది 27 శాతం మాత్రమే... అపుడపుడూ చదువు కోసం ఇచ్చేది 46 శాతం కాగా అసలు 26 శాతం మందికి ఇవి అందుబాటులో లేవు అంటే మొత్తంగా 59 శాతం మందికి ఆన్లైన్ విద్యకు అవసరం అయిన సాధనాలు అందుబాటులో లేవు. అట్లాగే తెలంగాణలో ఈ వినిమయం 43 శాతం అంటే బీహారులో ఇది 11.8 శాతం మాత్రమే.
కేవలం 8 శాతం గ్రామీణ బాలలు 25 శాతం పట్టణ ప్రాంత బాలలు క్రమం తప్పకుండా ఆన్లైన్ క్లాసులు పొందారు. అట్లాగే ఇంట్లో ఒకటే కంప్యూటర్ ఉన్నా, ఒక్కటే స్మార్ట్ఫోను ఉన్నా మొదటి ప్రాధాన్యత మగపిల్లవాడికేనని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అట్లాగే పట్టణాల్లో 57 శాతం గ్రామాల్లో 65 శాతం నెట్ అంతరాయం ఏర్పడుతూ ఉంది. అంటే పిల్లల చదువు ఆన్లైన్ చేస్తే వచ్చే తరం నిరక్షర భారతం అవుతుందన్న మాట.
అట్లాగే కోవిడ్ అనంతర పరిణామాలు జాగ్రత్తగా గమనిస్తే స్త్రీల జీవితాలు ఎంత దుర్భరంగా మారాయో అర్థం అవుతుంది. బాల్యవివాహాలు 27 శాతం పెరిగాయి. వరకట్న మరణాలు 35 శాతం స్త్రీలపై జరిగే నేరాలు 35.2 శాతం, స్త్రీలపై దాడులు 62.8 శాతం పెరిగాయి. ఇవన్నీ ప్రతి వారు చర్చించేవే... స్త్రీల సమస్యలు అనగానే స్త్రీలపై జరిగే హింస తప్పించి మరేమీ మాట్లాడరు. అదే సమస్య...
పెరుగుతున్న కుటుంబ హింస
అసమాన స్త్రీ పురుష సంబంధాలకు పితృస్వామ్య సామాజిక కట్టుబాట్లు కారణం అయితే .... ఇంటి పని స్త్రీల బాధ్యత అనే భావం కుటుంబ హింసను ప్రోత్సహిస్తున్నది. జీతభత్యం లేని ఇంటి చాకిరి, సేవలు కుటుంబ హింసకు మూలకారణం కాకపోవచ్చు కాని అది కుటుంబ హింసను సమర్థిస్తున్నది. ఆమోదిస్తున్నది. గ్రామీణ ప్రాంతాల్లో 5 గంటల 19 నిమిషాలు పట్టణాల్లో 2 గంటల 40 నిమిషాలు స్త్రీలు కేవలం సంరక్షణ సేవల కోసం వినియోగిస్తున్నారు.
అధికమైన వేతనం లేని శ్రమ అంటే అది ఇంటి చాకిరి అయినా సంరక్షణా సేవలయినా గాని అది స్త్రీల మౌలిక హక్కులయిన సమాన అవకాశాలు స్వేచ్ఛను ఉల్లఘించడమే అవుతుంది. యువతుల ఆకాంక్షలు అంతం లేని ఈ సేవల కింద సమాధి అవుతున్నాయి. ఈ చాకిరి ఈ సేవలే స్త్రీ జీవిత పరమార్థంగా ప్రచారం చేయటం వెనుక అంతులేని శ్రమదోపిడి వుంది. వృద్ధుల సంరక్షణా బాధ్యత, బిడ్డల సౌకర్యాలు కల్పించాల్సింది పని ప్రదేశాలు, కంపెనీలు, కార్ఖానాలు, కార్పొరేట్లు ప్రభుత్వాలు... కారనీ దీన్నంతా స్త్రీల వ్యక్తిగత బాధ్యతగా చేయటం వల్లనే ఉత్పాదక రంగంలో, వేతనశ్రమలో, శ్రమశక్తిలో స్త్రీల భాగస్వామ్యం తగ్గుతూ పోతున్నది. కనుక 2000 లల్లో 36 శాతంగా ఉన్నవారి భాగస్వామ్యం 9.92 శాతానికి పడిపోయింది. ప్రతి ఇంటి సంరక్షణకు 4 గంటలు ఇంటి పనికి మరొక 4 గంటలు అంటే ఉత్పాదక శ్రమలో చేసే 8 గంటలు కాక అదనంగా 8 గంటలు స్త్రీల శ్రమని నిర్ధాక్షిణ్యంగా ప్రభుత్వాలు, పని ప్రదేశాలు లూటీ చేస్తున్నాయి.
మరొక వైపు అది తమ పరమ కర్తవ్యం అని అది చేయకపోతే దండన విధించవచ్చని... దాన్ని భరించాలనే భావన నేటి స్త్రీలలో పాదుకొల్పడానికి ఆచార సాంప్రదాయాలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయి.
- దేవి, సాంస్కృతిక కార్యకర్త
Sun 05 Mar 02:54:17.447462 2023