Sun 19 Mar 04:00:27.411134 2023
Authorization
మంచి చెడుల కలయిక జీవితం. నాకు ఒక రోజు ఉంటుంది అన్న నమ్మకం జీవితం. అదే.. అదే మనిషిని నడిపే ఒక గొప్ప చోదకం..! అదే ఉగాది పర్వం.
ఉగాది ఒక రిజల్యూషన్..!
ఉగాది ఒక సొల్యూషన్ ...!
ఉగాది మొత్తం పైన ఒక కాలిక్యులేషన్..!
ఉగాది పండుగ ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమినాడు వస్తుంది.ఉగాది పండుగను తెలుగు సంవత్సరాది అని కూడా అంటారు
ఈ పండుగను తెలుగువారు చాంద్రమానాన్ని అనుసరించి నూతన సంవత్సరముగా జరుపుకుంటారు. ఈ పండుగను కేవలం తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా బెంగాల్, కేరళ, పంజాబ్, మహారాష్ట్ర, అస్సాం రాష్ట్రాలలోను జరుపుకుంటారు.
ఉగస్య ఆది అనేదే ఉగాది. ''ఉగ'' అనగా నక్షత్ర గమనం. 'ఉగాది'. అనగా ప్రపంచం జన్మ ఆయుష్షులకు మొదటిరోజు కనుక ఉగాది అయింది. ఇంకొకవిధంగా చెప్పాలంటే, 'యుగం' అనగా రెండు లేక జంట అని కూడా అర్ధం. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయసంయుతం 'యుగం' కాగా, ఆ యుగానికి ఆది యుగాది అయింది.
''మనిషిని నడిపే ఇంధనం ఆశ''
రేపు బాగుంటది అనే ఒక నమ్మకం మనిషిని నడిపిస్తుంది. ఆశ అనేదే లేకుంటే ..ఒక్క అడుగు కూడా ముందుకు పడదు.
Let your faith be bigger than your fear
తండ్రి చేయి పట్టుకుని ..సరియైన మారంలో
నడిపిస్తాడు.. తప్పటడుగుల దశలో ...!
అలాగే ..ప్రతి పనిలోనూ.. సరి ఏది, ఏది సరికాదు అన్నది ఎరుక పరుస్తూ..ఉంటాడు.
జీవన యానంలో చిక్కులు ఎదురవుతాయి. అది సహజం, ఆ ముడులను ఎలా విప్పాలో చెప్పేది అనుభవం లేదా నేర్పరితనం.
మంచి చెడుల కలయిక జీవితం. నాకు ఒక రోజు ఉంటుంది అన్న నమ్మకం జీవితం. అదే.. అదే మనిషిని నడిపే ఒక గొప్ప చోదకం..! అదే ఉగాది పర్వం.
ఉగాది ఒక రిజల్యూషన్..!
ఉగాది ఒక సొల్యూషన్ ...!
ఉగాది మొత్తం పైన ఒక కాలిక్యులేషన్..!
ఎండాకాలం ఆరంభం లో వచ్చే ఉగాది..! శిశిరంలోని ఆకురాలు కాలం, వసంత మాసపు ఆగమనం, నవనవోన్మేషమైన ప్రకతి శోభ, ఎల కోయిల కూజితం, లేమావి చిగురులు, ఎటు చూసినా సతత హరితం... మామిడి పిందెలు, వేప చిగురులు, బండ్ల కెత్తిన చెరుకు పంటలు, కొత్త బెల్లపు కుతకుత ఉడుకుల నుండి వచ్చే కమ్మదనం...
ఉగాది సంప్రదాయాను సారంగా రైతులను గౌరవించే వేడుకగా చెప్పడం జరిగింది.
రైతులతో పాటుగా తెలుగు వారు ప్రతిఒక్కరు కూడా తమదిగా భావించే పండుగ ఉగాది-పర్వదినం. అన్నం పెట్టే రైతన్నను ఆదరించడం, అతనికి ఊతమివ్వడం అంటే మన జీవితాన్ని మనం కాపాడుకోవడం అన్నమాట..! ఉగాది పర్వంలోని మరో పరమార్థం ఇది కూడా ...! ప్రతీ తెలుగు ఇంట్లో ఒక సంబరం, కొత్త పనులకు కోటి ఆశలతో శ్రీకారం చుడతారు.
ఉగాది పచ్చడి ఈ పండుగలోని ప్రత్యేకత. మానవ జీవనం లోని అన్ని కోణాలకు సాధృశ్యమానం ఈ ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనం - తీపి (మధురం), పులుపు (ఆమ్లం), ఉప్పు (లవణం), కారం (కటు), చేదు (తిక్త), వగరు (కషాయం) అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది.
పంచాంగాన్ని విశ్వసించే సంప్రదాయులు పంచాంగ శ్రవణం చేస్తారు. ఆ సంవత్సరంలోని మంచి చెడులను, కందాయ ఫలాలను, ఆదాయ ఫలాయాలను, స్ధూలంగా తమ భావిజీవిత క్రమం ఊహిస్తూ దాని కనుగుణమైన నిర్ణయాలు తీసుకోవటానికి ఇష్టత చూపుతారు. ఇలా ఉగాది పండుగను జరుపుకుంటారు. తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం, ఈ ఐదు భాగముల కలయికే పంచాంగం. పంచ అంటే ఐదు, అంగం అంటే భాగం. పంచాంగములు రెండు రకములు. చాంద్రమాన పంచాంగం (చంద్రుని సంచరణతో అనుసంధానమైనది), సూర్యమాన పంచాంగం (సూర్యుని సంచరణతో అనుసంధానమైనది). ఈ పంచాంగ శ్రవణం.
ఊరించే ఊరగాయలకు శ్రీకారం
మామిడికాయల సీజన్ మొదలవడంతో ఉగాది పండుగలో ముందుగా లేత మామిడి కాయముక్కలు వాడతారు. ఆ తరువాత ఊరగాయలు పెట్టడం మొదలెడతారు. వర్షాకాలం, చలికాలంలో ఉపయోగించుకోవడానికి వీలుగా మామిళ్ళను, ఇతర కాయలను ఎండబెట్టి, ఊరవేస్తారు. మామిడి కాయ పచ్చళ్ళు తెలుగువారి ఇండ్లలో ప్రత్యేకమైనవి. సంవత్సరం అంతా నిలువ ఉండేలా ఊరగాయలు చేయడంలో మన తెలుగు మహిళలది అందెవేసిన చెయ్యి. దానిలో ప్రత్యేకంగా చెప్పుకోవలసినది 'ఆవకాయ'.
మాగాయ. ''మాగాయ మహత్తరి అది వేస్తే అడ్డవిస్తరి'' అంటారు. భోజనంలో ఒక్క ఆవకాయ ముక్క, మజ్జిగ ఉంటే చాలు అనుకునే వారు మన ప్రాంతాలలో కోకొల్లలు.
ఇతర ప్రాంతాల వారి ఉగాది
పాత ఒక రోత కొత్త ఒక వింత ఎవరికైనా..
అలాగే సంవత్సర ఆరంభం అన్ని ప్రాంతాలకు ఉంటుంది. ఉగాది అన్నీ రాష్ట్రాలలో వివిధ పేర్లతో పిలువబడుతుంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉగాది అనీ, కర్ణాటకలో యుగాది అనీ, విశేషంగా మహారాష్ట్రలో 'గుడిపాడ్వా' పేరుతో పిలుస్తారు. తమిళులు 'పుత్తాండు' అనే పేరుతో, మలయాళీలు 'విషు' అనే పేరుతోను, సిక్కులు 'వైశాఖీ' గానూ, బెంగాలీలు 'పొరులా బైశాఖ్' గానూ జరుపుకుంటారు. వారివారి సంప్రదాయాలకు అనుగుణంగా నూతన సంవత్సరంగా ఈ రోజును జరుపుకోవడం అన్ని ప్రాంతాలలో ఉంది.
సాహితీ ప్రపంచంలో ఉగాది
సాహితీ ప్రియులకు ఉగాది కవిసమ్మేళనములపైన మక్కువ ఎక్కవ. ఈ రోజు ఏ కొత్త పని ప్రారంభించినా దిగ్విజయంగా సంవత్సరం అంతా సాగుతుందనే నమ్మకానికి బలంగా అక్షర ప్రేమికులు అందరూ.. ఎన్నో కవి సమ్మేళనములను నిర్వహిస్తూ.. రకరకాలుగా తమ భావ పరంపరను కవితా రూపంలో వినిపిస్తుంటారు. కొత్త సంవత్సరానికి కొత్త ఆకాంక్షలతో కవులు స్వాగతం పలుకుతారు. వెళ్ళిపోయిన సంవత్సరం ఏ విధమైన అనుభవాలనిచ్చిందో నెమరు వేసుకుని, వచ్చే సంవత్సరం శుభాలు జరగాలని కోరుకుంటారు. ఉగాది రోజు సానుకూల దృక్పథంతో గీతాలు ఆలపిస్తారు.
తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రములలో ప్రభుత్వాలు కూడా కవి సమ్మేళనాలు నిర్వహించడం ముదావహం..! సామూహిక సందడికి ఇదో సందర్భం. తమ తమ భావాలను పంచుకునే వేడుక కూడా.
ఉగాది అంటే... కేవలం ఏదో వండుకు తిని కొత్త బట్టలు కట్టుకోవడం కాదు. ఉగాది జీవిత సారాన్ని, జీవితంలోని అన్ని పార్శ్వాలను ఎరుకపరుస్తూ.. ప్రకృతితో అనుసంధానం చేస్తుంది. రైతును గౌరవిస్తుంది. కోకిల గానాన్ని ఆశ్వదించమంటుంది. వేప కూడా అనివార్యమని చెబుతుంది. ప్రకృతిలో వచ్చే మార్పులకనుగుణంగా మనుషులు ఎలా మలసుకోవాలో ఎరుకపరిచే పండుగ ఇది.
రాహు కేతు గ్రహాలంటే భయపడడం కాదు.. నీ భవిష్యత్తు ఎడల నీకు ముందు చూపు, చక్కని ప్రణాళిక, నిబద్దత అవసరమని చెబుతుంది. ఏలినాటి శని అంటే.. నీ బద్దకాన్ని విడిచి కార్యోన్ముఖుడివి కమ్మని హెచ్చరిస్తుంది. దృఢ నిశ్చయం నీదైతే ఏ గ్రహం ఏమీ చేయదని చెబుతూ... నీకు బతుకు బాటను చూపిన వారి ఎడల కృతజ్ఞత కలిగి ఉండమని ఉపదేశిస్తుంది. తల్లి మొదటి గురువు, తండ్రి దైవంతో సమానం వారిని గౌరవించు అని చెబుతుంది. గ్రహబాధల పరిహారాలనే పేరుతో ఇలా మంచిని సూచిస్తుంది.
మొత్తమ్మీద ''కామ్ మే పరమాత్మా హై''
''కృషియే ఖుషి'' అని చెబుతుంది ఉగాది.
ఇదే ఉగాది పరమార్థం. మన భవిష్యత్తును మనమే తీర్చిదిద్దుకోవలసి వుంది. అందుకు కావలసింది సరైన ఆలోచన, పట్టుదలతో కూడిన ఆచరణ.
- రమాదేవి కులకర్ణి, 8985613123