- లేదంటే జీవావరణ వినాశనమే
పునరుద్ధరణకు పదేళ్ళే...!!! అవును.. భూమాత పునరుద్దరణకు పదేళ్ళే వుంది. భూమిపై పర్యావరణం, ప్రకృతి వ్యవస్థల పునరుద్దరణకు పదేళ్ళ సమయం మాత్రమే వుంది. 2030 కల్లా ప్రకృతి వ్యవస్థల్ని పునరుద్ధరించాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది. అలా జరగని పక్షంలో ఏమవుతుంది? 2030 నాటికి అన్ని దేశాలూ పర్యావరణం పునరుద్దరణకు తగిన చర్యలు తీసుకోని పక్షంలో ఎప్పటికీ బాగు చేయలేనంత నష్టం జరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నానాటికీ పెరుగుతున్న పర్యావరణ విధ్వంసం సమస్త జీవకోటి వినాశనానికి కారణమవుతుందనీ, కరోనా లాంటి కల్లోలాలు అనేకం సంభవిస్తాయని అంచనా వేస్తున్నారు. అందుకే ఐక్యరాజ్యసమితి 2021 - 2030 దశాబ్దాన్ని ప్రకృతి వ్యవస్థల పునరుద్దణ దశాబ్దంగా ప్రకటించింది. 2021 జూన్ - 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం మొదలుకొని 2030 వరకు పర్యావరణ విధ్వంసాన్ని నిరోధించడం, ఆపడం, వెనక్కి తిప్పడం లక్ష్యంగా సభ్య దేశాలు పని చేయాలని పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి ఐక్యరాజ్యసమితి పర్యావరణ విభాగం, అంతర్జాతీయ ఆహార, వ్యవసాయ సంస్థ నాయకత్వం వహిస్తాయి.
ఏమిటి కారణం?
కేవలం 1990 నుంచి ఇప్పటి వరకు 420 మిలియన్ హెక్టార్ల అడవులు నరికివేతకు గురయ్యాయి. ప్రతి సంవత్సరం 10 మిలియన్ హెక్టార్ల అడవులు కనుమరుగవుతున్నాయి. అడవుల నరికివేత, భూమి ఇతర వినియోగం వల్ల హరిత గృహ వాయువుల విడుదల 11 శాతం పెరిగింది. 2021 - 30 మధ్య అడవుల పునరుద్దరణ జరిగితే 13 - 26 గిగా టన్నుల హరిత గృహ వాయువుల విడుదలను తగ్గించొచ్చని నిపుణుల అంచనా. అడవులతోపాటు సముద్రాలు, వ్యవసాయ భూమి, పర్వతాలు, గడ్డి భూములు లాంటి ప్రకృతి వ్యవస్థలు విధ్వంసానికి గురవుతున్నాయి. సహజ వనరులు కలుషితమవుతున్నాయి. భూగ్రహం నివాసయోగ్యం కాని స్థితికి చేరుకుంటున్నది. అందుకే ప్రకృతి వ్యవస్థల్ని త్వరితగతిన పునరుద్ధరించాలి. ఈ పునరుద్దరణలో అడవులు, వ్యవసాయ భూమి, చిత్తడి నేలలు, పట్టణాలు, సముద్రాలు, గడ్డి భూములు లాంటి వ్యవస్థలు కీలకమైనవి.
వ్యవసాయ భూమి
భూ ఉపరితలంపై వ్యవసాయ భూమి 1/3 వ వంతు ఆక్రమించాయి. మనిసి నాణ్యమైన జీవనానికి ఈ వ్యవస్థ అత్యంత ఆవశ్యకమైనది. ఇది ఆహారానికి, పశుగ్రాసం ఇవ్వడంతో పాటు పక్షలు, పురుగులు, కీటకాలు, గబ్బిలాలు, ఇతర అనేక జీవులకు కీలకమైనది. 20వ శతాబ్దంలో ప్రపంచ వ్యాప్తంగా జనాభా అనేక రెట్లు పెరగడంతో డిమాండ్‌కు తగ్గట్లుగా ఆహారాన్ని అందించాల్సిన అవసరం ఏర్పడింది. వ్యవసాయ భూమిని అధిక మార్లు, లోతుగా దున్నడం, ఒకే పంట సంస్కృతి, పురాతన సాగు సాంప్రదాయం, అధికమైన పశువుల కోసం మేత, వ్యవసాయ భూమి విస్తరణ కోసం అడవుల నరికివేత జరుగుతున్నది. నాణ్యమైన మృత్తికలు క్షయానికి గురికావడం, నేల కోతకు గురికావడం, ఎరువులు అధిక వినియోగం వల్ల నేల, నీరు కలుషితమవుతున్నది. నైట్రోజన్ కాలుష్యం ప్రమాదభరిత స్థాయికి చేరుకున్నది. అధికంగా పురుగు మందులు (క్రిమి సంహారకాలు) వాడడం వల్ల అడవి జంతువులు, కీటకాలు, పరాగ సంపర్కం జరిపే తేనెటీగలకు నష్టం వాటిల్లుతున్నది. జనాభాతో పాటు వ్యవసాయ భూమి విస్తరణ పెరుగుతున్నది. మొత్తం భూ ఉపరితలంపై వ్యవసాయ భూమి 12 శాతంగా ఉంది. గత 50 సంవత్సరాలలో 159 మిలియన్ హెక్టార్ల భూమి వ్యవసాయ భూమిగా మారింది. దీని ప్రభావం అడవులు, గడ్డి భూములు, నీటి వనరులపై పడుతున్నది. ఈ సమస్య నివారించాలంటే సుస్థిర వ్యవసాయ పద్ధతులు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రకృతి సహాయంతోనే ఉత్పత్తి పెంచడం, దున్నడం తగ్గించడం, సహజ ఎరువులు వాడటం, క్రిమిసంహారకాల వాడకం తగ్గించడం, పంట మార్పిడి పద్ధతులు అనుసరించడం, భిన్న పంటలకు ప్రాధాన్యత ఇవ్వడం, పశుపోషణతో కూడిన సమగ్ర వ్యవసాయ పద్ధతులు, సేంద్రియ కార్బన్ వాడటం లాంటి చర్యలు అమలు చేయడం ద్వారా పర్యావరణానికి నష్టం జరగని రీతిలో వ్యవసాయ పద్ధతులు అమలు చేయాల్సి ఉంది.
అడవులు
అడవులు, చెట్లు భూమిని మనిషికి నివాసయోగ్యంగా మలిచాయి. అడవులు పరిశుభ్రమైన గాలి నీరు అందిస్తాయి. అత్యధిక స్థాయిలో కార్బన్ నిల్వ చేసుకొని వాతావరణాన్ని మన జీవనానికి అనుకూలంగా మార్చాయి. అడవులు భూతాప నిరోధక వ్యవస్థగా పనిచేస్తున్నాయి. జీవ వైవిధ్యానికి అత్యున్నత నెలవులు. పెరుగుతున్న జనాభా వల్ల అడవులు ఒత్తిడికి గురవుతున్నాయి. పామాయిల్, సోయా అధిక పెంపకం, మాంసం కోసం జంతువుల పెంపకం అధికం కావడం వల్ల అడవులపై ప్రభావం చూపుతున్నది. దీంతో పాటు కలప, వంట చెరకు, ఇల్లు, రోడ్లు, ఆనకట్టలు, పరిశ్రమల నిర్మాణం కోసం అడవులు నరికివేస్తున్నారు. తీవ్రమైన వ్యవసాయ పద్ధతులు, కార్చిచ్చుల వల్ల అడవులు తగ్గుతున్నాయి. దీని వల్ల వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 31 శాతం అడవులున్నాయి. బ్రెజిల్, కెనడా, చైనా, రష్యా లాంటి దేశాల్లో మొత్తం భూభాగంలో అడవుల వాటా 50 శాతంకిపైనే. అడవులు 80 శాతం ఉభయ చరాలకు, 75 శాతం పక్షులకు, 68 శాతం క్షీరదాలు, 60 శాతం చెట్ల జాతులకు నివాసం. అడవుల పెంపకం 15 శాతం అదనంగా పెంచడం వల్ల కనుమరుగవుతున్న జీవజాతుల్లో 60 శాతం పునరుద్ధరించవచ్చు. పారిశ్రామిక విప్లవ అనంతరం భూమిపై పెరిగిన కార్బన్‌లో 30 శాతం అడవులే పీల్చుకుంటున్నాయి. అడవుల పెంపకంపై పెట్టే ఖర్చుకు 13 రెట్లు ప్రయోజనం ఉంటుంది. అడవులు అధనంగా 86 మిలియన్ల 'హరిత ఉద్యోగాలు' కల్పించగలవు. అందుకే అడవులను సంరక్షించడం, నరికివేత నివారించడం, అధనంగా అడవులు పెంచడం, అడవుల్లో కూడా స్థానిక భిన్న జాతుల చెట్లను పెంచడం ద్వారా పర్యావరణాన్ని పునరుద్ధరించవచ్చు.
మంచినీరు
ప్రకృతి వ్యవస్థ కోట్ల మంది ప్రజలకు ఆహారం, తాగునీరు అందిస్తున్నది. ఇది అనేక జంతువులు, మొక్కలకు నివాసంగా ఉన్నది. 1/3వ వంతు నీటి జాతులకు ఈ వ్యవస్థే నివాసం. కరువుల నుంచి రక్షిస్తున్నది. మంచినీటి ప్రకృతి వ్యవస్థలో సరస్సులు, చెరువులు, నదులు, చిత్తడి నేలలు ముఖ్యమైనవి. మంచినీటి చిత్తడి నేలలు అత్యధికంగా కార్బన్‌ను నిల్వ చేసుకుంటాయి. భూగ్రహంపై ఉన్న మొత్తం నీటిలో మంచి నీటి వాటా 1 శాతం కి లోపే. దాని విలువ మాత్రం కొన్ని ట్రిలియన్ డాలర్లకు పైనే. ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో 18 శాతం వాటా జల విద్యుత్‌దే. బ్రెజిల్, నార్వే, లావోస్ లాంటి దేశాల్లో జలవిద్యుత్ వాటా 90 శాతం. మొత్తం రవాణాలో జల రవాణా వాటా 8 శాతంగా ఉంది. మంచినీటి ప్రాంతాలు టూరిజంకు ఆకర్షణీయమైనవి. మొత్తం చేపల వినియోగంలో మంచినీటి నుండే 12 శాతం వస్తున్నది. అయితే రసాయనాలు, మురుగునీరు, ప్లాస్టిక్ వల్ల మంచినీరు కలుషితం అవుతున్నది. గత 300 సంవత్సరాల్లో 87 శాతం, గత 100 సంవత్సరాల్లో 50 శాతం మంచినీటి వనరులు ధ్వంసమయ్యాయి. అధికంగా చేపల వేట, వ్యవసాయ వినియోగం, విద్యుత్ ఉత్పత్తికి పారిశ్రామిక వాడకం, ఆనకట్టలు కట్టడం, ఇసుక మైనింగ్ వల్ల మంచినీటి ప్రకృతి వ్యవస్థకు తీవ్ర నష్టం జరుగుతున్నది. 1970 నుండి ఆనకట్టల సంఖ్య 7 రెట్లు పెరిగింది. 1900 - 1950 మధ్య మంచినీటి వాడకం ఆరు రెట్లు పెరిగింది. ఇది జనాభా పెరుగుదల రేటు కంటే 2 రెట్లు ఎక్కువ. భారత దేశం, చైనా లాంటి దేశాల్లో మంచినీటిలో నైట్రోజన్ కాలుష్యం పెరుగుతున్నది. అధిక వ్యవసాయ ఎరువుల వాడకమే దీనికి కారణం. కాలుష్యం వల్ల మంచినీటి జీవ వైవిధ్యం తగ్గుతున్నది. చేప జాతుల్లో 20 శాతం ప్రమాదం అంచున ఉన్నాయి. నదీ ప్రాంతాల్లో నివశిస్తున్నప్పటికీ 40 శాతం ప్రజలు నీటి ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. 2025 నాటికి మొత్తం ప్రపంచంలో 48 శాతం ప్రజలు నీటి ఒత్తిడి ఎదుర్కోనున్నారు. ప్రపంచంలో అత్యధిక మరణాలకు నీటి సంబంధ వ్యాధులే కారణం. 1970 - 2012 మధ్య 58 శాతం మంచినీటి జీవులు అంతమయ్యాయి. అందుకే మంచినీటి ప్రకృతి వ్యవస్థను పునరుద్ధరించి కాపాడుకోవాలి. మంచి నీటి నాణ్యతకు, సమర్థ నిర్వహణకు ప్రాధాన్యమివ్వాలి. వ్యర్థ నీటిని ముందే శుద్ధి చేయాలి. అధిక చేపల వేట, ఇసుక మైనింగ్ నియంత్రించాలి. నీటి పారుదలకు అడ్డం కాని రీతిలో ఆనకట్టల డిజైన్లు మార్చాలి. మంచినీటి ప్రకృతి వ్యవస్థను రక్షిత ప్రాంతాలుగా పరిగణించాలి. వ్యవసాయంలో నీటి వినియోగం తగ్గించాలి.
గడ్డి భూములు, పొదలు, సవాన్నాలు
ఇది పశుపోషణకు అత్యంత కీలకమైన పర్యావరణ వ్యవస్థ. భూ ఉపరితలంపై మంచు ప్రాంతాన్ని మినహాయించగా మిగిలిన భూభాగంలో 30 శాతం గడ్డి భూములు ఆక్రమించాయి. గడ్డి భూములపై ఆధారపడి 100 కోట్ల మంది ప్రజలు జీవిస్తున్నారు. మిలియన్ సంవత్సరాల క్రితం ఇవి మనిషి ఆవాసంగా గుర్తించబడ్డాయి. సింహాలు, రైనో లాంటి విభిన్న జంతు జాలం గడ్డి భూముల విశిష్టత. గడ్డిభూములు ప్రతి సంవత్సరం సగటున 1 గిగా టన్ను కార్బన్‌ను దాచుకోవడం ద్వారా పర్యావరణానికి సహకరిస్తున్నాయి. అయితే పెరుగుతున్న జనాభాకు నివాసాల కోసం, వ్యవసాయ భూమికోసం గడ్డి భూములపై ఒత్తిడి పెరుగుతున్నది. పశువుల మేత కోసం అతిఆ ఆధారపడటం వల్ల మృత్తికా క్షయం జరుగుతున్నది. ఈ ప్రకృతి వ్యవస్థను పునరుద్ధరించాలంటే గడ్డ భూముల్ని విస్తరించాలి. స్థానిక జాతుల గడ్డిని పెంచాలి.
పర్వతాలు
భూ ఉపరితలంపై 1/4వ వంతు జీవ వైవిద్యానికి పర్వతాలు కేంద్రాలుగా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా సగం మంది ప్రజలకు పర్వతాలే మంచినీటిని అందిస్తున్నాయి. పురాతన కాలం నుంచీ ఇవి సాంస్కృతిక వైవిద్యానికి నెలవులుగా ఉన్నాయి. పర్వతాలు వాతావరణం, గాలి నాణ్యతను నియంత్రిస్తాయి. స్థానిక ప్రజలకు ఆహారం, మందులు అందిస్తున్నాయి. పర్వతాలు అనేక లోహాలు, విలువైన సహజ వనరులకు కేంద్రాలు. అయితే వాతావరణ మార్పులు, మానవ జోక్యం వల్ల పర్వత పర్యావరణంలో తరుగుదల నమోదవుతున్నది. పర్వత ప్రాంతాల్లో చెట్లు నరకడం వల్ల క్రమక్షయానికి గురై కొండ చరియలు విరిగిపడటం వల్ల ప్రజలకు, ఆస్తులకు తీవ్ర నష్టం జరుగుతున్నది. పర్వత ప్రాంతాల్లో ఆనకట్టలు కట్టి నీటి ప్రవాహాన్ని నియంత్రించడం, మైనింగ్ పర్వతాలకు నష్టం చేస్తున్నది. ఈ వ్యవస్థను పునరుద్ధరించాలంటే పర్వత ప్రాంతాల్లో అడవుల నరికివేత నియంత్రించాలి. ఆనకట్టల డిజైన్ మార్పు చేయాలి. పర్యావరణానికి నష్టం చేసే మైనింగ్‌ను నివారించాలి. వైద్యానికి ఉపకరించే మూలికలనిచ్చే చెట్లను గుర్తించి పెంచాలి. పర్వత ప్రాంతాల్లో మానవ జోక్యం కాలుష్యానికి కారణమవుతున్నందున నివారించాలి.
సముద్రాలు, తీర ప్రాంతాలు
భూ గ్రహంపై 70 శాతం ప్రాంతాన్ని సముద్రాలు ఆక్రమించాయి. పాచి నుంచి తిమింగలాల వరకు లక్షల రకాల జీవ వైవిద్యానికి సముద్రాలు కేంద్రాలు. కోట్ల మంది ప్రజలకు, జీవులకు ఆహారాన్నంది స్తాయి. సముద్రాలు అత్యు న్నత ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలు. విస్తారమైన మత్స్య సంపదకు, టూరిజానికి ఇవి ప్రఖ్యాతి గాంచాయి. సముద్ర ప్రాంతాల్లో పడగపు దిబ్బలు ఏర్పడతాయి. భూమిపై వీటి వాటా 0.1 శాతం కానీ జీవ వైవిద్యంలో 25 శాతం కి కేంద్రాలుగా ఉన్నాయి. 100 కోట్ల మంది ప్రజలు సముద్ర పగడపు దిబ్బలపై ఆధార పడుతున్నారు. ఇప్పటికే భూతాపం, వాతావరణ మార్పుల వల్ల 50 శాతం పగడపు దిబ్బలు మునిగాయి. 2050 నాటికి 90 శాతం పగడపు దిబ్బలు కనుమరుగు కానున్నాయి. ప్రస్తుతం సముద్రాలు కాలుష్య కాసారాలుగా మారుతున్నాయి. మిలియన్ టన్నుల ప్లాస్టిక్ సముద్రాల్లోకి చేరి సముద్ర జంతువులకు హాని చేస్తున్నది. నివాసాలు, చేపల పెంపకం కోసం సముద్రాల అంచున ఉండే మడ అడవులు కొట్టివేస్తున్నారు. ఇవి తరిగి పోవడం వల్ల సహజ ఉత్పాతాల నుండి రక్షణ కరువవుతున్నది. అధిక చేపల వేట, వ్యర్థ నీటిని శుద్ధి చేయకుండానే విడుదల చేయడం, సముద్ర తీర పట్టణాలు, నగరాలు చెత్త, మురుగు నీటి నిర్వహణ సమర్థవంతంగా లేకపోవడం వల్ల సముద్రాలు కలుషితమవుతున్నాయి. సముద్ర ప్రకృతి వ్యవస్థను పునరుద్ధరించాలంటే సుస్థిర పద్ధతులు పాటించాలి. రసాయనాలు సముద్ర జలాల్లో కలవకుండా చేయడం, వ్యర్థ నీరు ముందే శుద్ధి చేయడం, చేపల వేటను నియంత్రించడం, పగడపు దిబ్బలు, మడ అడవులు, సముద్ర గడ్డి నిర్వహణ పద్ధతుల్ని పర్యావరణ సహితంగా మార్చడం లాంటి చర్యలు తీసుకోవాలి. చమురు, గ్యాస్ వెలికితీత వల్ల సముద్ర జీవ వైవిద్యానికి నష్టం జరగని రీతిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలి.
చిత్తడి, కుళ్ళి గట్టిపడిన నేలలు
ఈ ప్రకృతి వ్యవస్థ మొత్తం భూ ఉపరితలంపై 3 శాతం భూభాగాన్ని ఆక్రమించాయి. 180 దేశాల్లో ఈ నేలలకు ప్రాముఖ్యత ఉన్నది. ప్రధానంగా ఐరోపాలో జీవ వైవిద్యానికి ఈ నేలలు కేంద్రాలుగా ఉన్నాయి. అన్ని ప్రకృతి వ్యవస్థల్లోనూ అత్యధికంగా కార్బన్‌ను నిల్వ చేసుకునే కేంద్రాలు ఈ నేలలే. భూమిపై 30 శాతం కార్బన్ కుళ్ళి గడ్డకట్టిన నేలల్లోనే నిల్వ అవుతుంది. 550 బిలియన్ టన్నుల కార్బన్ ఈ నేలల్లో నిల్వ ఉన్నది. అడవుల కంటే రెండు రెట్లు కార్బన్‌ను నిల్వ చేసుకుంటాయి. అయితే 1800 సంవత్సరం తర్వాత ఈ నేలలు 20 శాతం తగ్గాయి. వ్యవసాయ భూములుగా మార్చడం, పరిశ్రమలు, నగరాల అభివృద్ధి, మైనింగ్, చమురు, గ్యాస్ ఉత్పత్తి, తగలబెట్టడం, పశువులు అతిగా మేయడం, నైట్రోజన్ కాలుష్యం వల్ల వీటి శాతం తగ్గుతున్నది. ఇవి వరదలు, భూమి కోతను నియంత్రించడానికి సహకరిస్తాయి. వాతావరణ మార్పులపై విజయం సాధించాలంటే ఈ నేలల్ని పునరుద్ధరించాలి. ఎండిన నేలల్ని మళ్ళీ చిత్తడి నేల లుగా మార్చాలి. ఈ నేలలు ఇతర అవసరాలకు వాడకుండా నియంత్రించాలి. అనేక జంతువులకు ఆవాసాలుగా ఉన్న ఈ నేలలు తరిగిపోవడం వల్ల జంతు సంబంధ వ్యాధులు పెరుగుతాయి. అందుకే చిత్తడి, కుళ్ళి గట్టిపడిన నేలల్ని త్వరితగతిన పునరుద్ధరించాలి.
పర్యావరణ దినోత్సవం
పర్యావరణ సమస్యల తీవ్రత గురించి అవగాహన లేని, చదవలేని వారికి అర్థమయ్యేలా ప్రచారం చేసి, సమస్య పరిష్కారంలో వారిని భాగస్వాములుగా చేసే లక్ష్యంతో ఐక్యరాజ్య సమితి 1974 నుండి ప్రతి సంవత్సరం జూన్ 5న 'ప్రపంచ పర్యావరణ దినోత్సవం' నిర్వహిస్తున్నది. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. 2021 'పర్యావరణ దినోత్సవం' అధికారిక కార్యక్రమాన్ని పాకిస్తాన్ నిర్వహిస్తున్నది.
ఈ సంవత్సరం నేపథ్యం ''ప్రకృతి వ్యవస్థల్ని పునరుద్ధరిద్దాం! (=వర్‌శీతీవ వషశీరyర్‌వఎ)'' దీంతో పాటు ఐక్య రాజ్య సమితి 2021 జూన్ 5 నుండి 2030 దశాబ్దాన్ని ''ప్రకృతి వ్యవస్థ పునరుద్దరణ దశాబ్దం''గా ప్రకటించింది.
సుస్థిర అభివృద్ధి - లక్ష్యాలు
పర్యావరణానికి నష్టం జరగకుంగా ప్రస్తుత తరం తమ అవసరాల్ని సమర్థవంతంగా తీర్చుకుంటూనే, భావితరానికి సహజ వనరుల్ని బదలాయిస్తూ జరిగే అభివృద్ధే సుస్థిర అభివృద్ధి. దీని కోసం ఐక్యరాజ్యసమితి 2015 సెప్టెంబరులో 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్ని నిర్దేశించింది. 2030 నాటికి ఈ లక్ష్యాలు సాధించాలని సభ్య దేశౄలకు సూచించింది. 17 లక్ష్యాల్లో 169 ఉప లక్ష్యాలు ఉన్నాయి. 17 లక్ష్యాల్లో 15, 169 ఉపలక్ష్యాల్లో 92 పర్యావరణంతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్నాయి. అంటే పర్యావరణ అభివృద్ధి జరగకుండా విశ్వ అభివృద్ధి సాధ్యం కాదని అర్థం చేసుకోవచ్చు. పేదరికం నిర్మూలన, నాణ్యమైన విద్య, రక్షిత మంచినీరు, భూమిపై జీవం వీటిలో ముఖ్య లక్ష్యాలు.
- ఆర్.విక్రమ్‌రెడ్డి
సేవ్ ఎన్విరాన్‌మెంట్ క్లబ్, తెలంగాణ
Sat 29 May 21:31:08.365435 2021