సినీవనిలో రెబల్ ''జీవితంలో ముందుకు సాగిపోవాలంటే డబ్బు చాలా ముఖ్యం. ఆ డబ్బును సంపాదించడానికి మనం అనుసరించే దారులు ఏవి అన్నది మనం ఎంచుకోవడంలోనే ఉంది'' అనంటారు నటి నీనాగుప్తా. సినిమా రంగంలోనే కాదు- భారతీయ సమాజంలోనే ఒక రెబల్ విమెన్ నీనాగుప్తా. వెస్టిండీస్ క్రికెటర్ వివిన్ రిచర్డ్స్‌తో ఆమె సహజీవనం, 'మసాబా' జననం, అన్నీ సంచలనాలే.
1959 జూన్ 4న ఢిల్లీలో జన్మించిన నీనా గుప్తా తండ్రి ఆర్.ఎన్.గుప్తా, తల్లి శకుంతలా గుప్తా. హిమాచల్ ప్రదేశ్‌లోని లారెన్ స్కూల్లో విద్యాభ్యాసం చేసింది. మాస్టర్ డిగ్రీ (సంస్కృతం) తీసుకోగానే ఎన్.ఎస్.డి.లో చేరి నటనలో శిక్షణ పొందింది. వీటన్నింటికీ మించి ఆమెకు చిన్నప్పటి నుండి సినిమాల పిచ్చి ఉండేది. హీరో హీరోయిన్లను చూసి వారిని అనుకరించేది. తను అలా నటిగా రూపొందాలనేది ఆమె కోరిక.
నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో యాక్టింగ్ కోర్సు పూర్తవగానే (1982), ఢిల్లీ నుండి బొంబాయి బయలు దేరింది. చిన్న చిన్న వేషాలతో ప్రారంభించి టీవీ సీరియల్స్‌లో నటించడం రాయడం డైరెక్ట్ చేయడం దాకా ఎదిగింది. నిజంగా కూడా ఆమె ఒక రెబల్‌గా ప్రవర్తించేది. ఆ మనస్తత్వమే ఆమెను వెస్ట్ ఇండీస్ ప్రఖ్యాత క్రికెటర్ వివిన్ రిచర్డ్స్‌తో రిలేషన్షిప్ కలిగి ఉండేదాకా తీసుకెళ్లిందామెను.
1987లో రిలయన్స్ వరల్డ్ కప్ రాజస్తాన్‌లోని జైపూర్ లోమాచ్ జరుగుతోంది. నీనా కూడా అక్కడే షూటింగులో ఉంది. ఆమెకు క్రికెట్ కన్నా అప్పటికే వివిన్ రిచర్డ్స్ అంటే చచ్చేంత అభిమానం. వెళ్ళి పరిచయం చేసుకున్నది. మాటలు కలిసాయి. ఆ తరువాత మనసులు కూడా కలిశాయి. ప్రేమకు దారి తీసింది. అతని భార్యా పిల్లల గురించి నీనా అడగలేదు. అతను చెప్పనూ లేదు. పెళ్ళికి అతీతంగా వారి బంధం బలపడింది. ఏది ఏమైనా రిచర్డ్స్ బిడ్డకు తల్లి కావాలనుకుంది నీనా.
1988ల నాడు ఇదొక సంచలన నిర్ణయం. 'నేనొక బిడ్డకు తల్లిని కావాలనుకుంటున్నాను. కాని నాకు పెళ్లి చేసుకోవాలని లేదు' అని తన తల్లిదండ్రులతో చెప్పడం ఒక రకంగా అనితర సాధ్యమైన సాహసం. నేనొంటరిగానే ఆ బిడ్డను పోషించు కుంటానని తల్లిదండ్రులను ఒప్పించింది. ఫలితంగా 'మసాబా' కు తల్లయింది. భారతదేశంలోనే అత్యంత ధైర్యసాహసం కలిగిన స్త్రీగా వార్తల్లోకెక్కింది. 1980 దశకంలో వివిన్ రిచర్డ్స్ - నీనా గుప్తాల వార్తలు గుప్పుమన్నవి. అప్పటికే వివాహితుడైన రిచర్డ్స్ నీనాతో రిలేషన్షిప్ పెంచుకోవడం సంచలనమైంది. 1989 నవంబరు 2న 'మసాబా' పుట్టింది.
పెళ్ళి కాకుండానే తల్లి కావడం, పైగా సినీనటి. దాంతో పత్రికల వారికి కావలసినంత మసాలా దొరికినట్లైంది. ఈ పాపకు తండ్రి ఎవరు? అని రకరకాలుగా పత్రికలలో పతాక శీర్శికలు. ఐతే వివాహ బంధం పట్ల నీనాకేమీ వ్యతిరేకత లేదు. కానీ ''జీవితంలో ఏవీ అనుకున్నట్లుగా జరగవు. ఆయా సమయాలు, ఆవేశాలూ మన నిర్ణయాలను ప్రభావితం చేస్తాయనం''టారామె.
1990లో వివిన్ రిచర్డ్స్ తిరిగి స్వదేశం వెళ్లిపోయాడు. ఇక్కడ మసాబా గుప్తా చదువు పూర్తవగానే 20వ ఏట తన తండ్రి వివిన్ రిచర్డ్స్‌తో పూర్తి అనుబంధాన్ని పునరుద్ధరించుకుంది. ఆమె టెన్నీస్ ప్లేయర్ కావాలని చిన్నపుడు అనుకుంది. కాని డాన్స్ నేర్చుకుంది. తల్లి కాదనడంతో చివరికి ఫ్యాషన్ డిజైనర్‌గా స్థిరపడింది. అయితే 2015లో సినీ దర్శకుడు మధు మంతెనను వివాహం చేసుకుంది. కానీ వారి వివాహ బంధం ఎందుకో నిలువలేదు. 2019లో వారిరువురు విడాకులు తీసుకున్నారు. విచిత్రమే మిటంటే అంతకుముందు 2018లోనే నీనా తన 50వ యేట పెండ్లి చేసుకుంది. బాల్యంలో కొంత కాలం తండ్రి వద్ద గడ పడం వల్ల మసాబాకు వివిన్ భార్య సంతానంతో కూడా మంచి అనుబంధమే ఏర్పడింది.
మసాబాను పెళ్లి చేసుకున్న ఈ మధు మంతెన ఎవరో కాదు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మకు కజిన్ అవుతాడు. హైదరాబాద్‌లో పుట్టాడు. బొంబాయిలో సినీ నిర్మాత. అనురాగ్ కశ్యప్, వికాస్ బెహల్, విక్రమాదిత్యలతో కలిసి పాంటమ్ ఫిలింస్ నెలకొల్పి లుటేరా, హసీతో ఫసి, క్వీన్, అగ్లీ, ఎన్‌హెచ్- 10, బాంబే వెల్వెట్, హైజాక్, మన్ మర్జియా, సూపర్ - 30, చిత్రాలు తీశాడు. స్వయంగా కార్తీక్ (తెలుగు), గజిని, రక్త చరిత్ర - 1, 2, ఝటాహీ సహీ, మౌసమ్ (2011) చిత్రాలు నిర్మించాడు. ఈ చిత్రాలకు పలు జాతీయ అవార్డులు అందుకున్నాడు కూడా. రాంగోపాల్ వర్మ ప్రొడక్షన్ హౌజ్ 'ఫ్యాక్టరీ'ని కూడా మధు మంతెననే చూస్తున్నాడు.
నీనాగుప్తా 1982లో ముంబై వస్తూనే సాత్ సాధ్ (1982) చిత్రంలో తొలి సారిగా నటించింది. అయితే గాంధీ చిత్రంలో 'ఆభా'గా నటించి అంతర్జాతీయంగా అందరినీ ఆకర్షించింది. 1985లో నీనా గుప్తా డి.డి.లో ఖాందాన్ ధారావాహికను డైరెక్ట్ చేయడం ఆ రోజుల్లో గొప్ప విషయం. ఆ తరువాత చాలా టి.వి. సీరియల్స్‌లో ఆమె నటించింది. సంచికా కార్యక్రమాలను సమర్పించింది కూడా.
అప్పటిదాకా ఒక మోస్తరు పాత్రలు పోషిస్తున్న నీనా గుప్తాకు 'చోళీకే పీచే క్యా హై' పాటతో ఒక్క సారిగా అవకాశాలు వరస కట్టాయి. పాట వివాదాస్పదమైంది. మాధురీదీక్షిత్ ఏ స్థాయిలో స్టార్‌గా ఎదిగిందో ఈ పాటతో నీనాకు మంచి వేషాలు వరుస కట్టాయి.
హైదరాబాదులో ఆడపిల్లలను అమ్మే కథాంశంపై సాగర్ సర్వది తీసిన 'బాజార్లోనూ, శ్యాంబెనగళ్ 'మండీ'లోనూ నీనా గుప్తా నటించింది. ఆమె నటించిన 'బాజార్ సీతారాం' 1993లో ఉత్తమ తొలి నాన్ ఫీచర్ ఫిలింగా జాతీయ అవార్డు అందుకున్నది. 'బధాయీ హౌ(2018), కామెడీ చిత్రంలో నీనా గుప్తా నటన హిమాలయ శృంగంపై నిలుస్తుంది. నడి వయసులో గర్భం ధరించిన మహిళగా నటించిందామె. పలువురు విమర్శకులు, మేధావులు ప్రశంసించిన నటన ఆమెది. ఫిలింఫేర్, స్క్రీన్, బి.ఎఫ్.జె.ఏ అవార్డులు ఇందుకు ఆమెను వరించాయి.
టెలివిజన్‌పై 'యాత్ర', భారత్ ఏక్ ఖోజ్, శ్రీమాన్ శ్రీమతి, సాత్ ఫేరే, సాంస్, సలోనీ కా సఫర్, చిట్టీ, జస్సీ జైసీ కోయీ నహీ సీరియల్స్ నటించారామె. ఇంకా సాంస్, సాక్షి, క్యూం హౌతా హై ప్యార్ సీరియల్స్‌కు దర్శకత్వం వహించి చాలా కార్యక్రమాలకు సమన్వయ కర్తగా టి.వి. తెరపై కనిపించారు.
తన టెలివిజన్ ప్రస్థానం గురించి ఆమె ''ఖాందాన్' సీరియల్‌తో టివీ నటిగా అవతారమెత్తాను. సినిమా వేషాలకు పనికి రానని అన్నపుడు చిన్ని తెరకు మారడం తెలివైన పనే అనుకుంటాను. మెదటి సీరియల్‌తోనే నా దశ తిరిగింది. తరువాత 'బునియాద్', 'దానే అనార్ కె', 'పాల్ చిన్', 'కస్మే వాదే', 'సిస్కీ', 'సాత్ ఫేరే' లాంటి చాలా సీరియల్స్‌లో నటించాను. 'దర్ద్', 'గుమ్ నామ్', 'సాంస్' వంటి మెగా సీరియళ్ళకు దర్శకత్వం వహించాను. నా సీరియల్స్‌తో రేటింగ్స్ పెంచుకున్న ఛానెళ్ళు చాలానే ఉన్నాయ''నంటారామె.
నీనా గుప్తా వ్యక్తిగత జీవితం నిరంతరం సంచలనాలతో సాగింది. రిచర్డ్స్‌తో పదేళ్ళ రిలేషన్‌షిప్‌కు ముగింపు పలికిన తరువాత నటులు అలోక్‌నాథ్, పండిట్ జఫ్రాజ్ కుమారుడు సారంగదేవ్తో కొంతకాలం సన్నిహితంగా మెలిగినప్పటికీ తన యాభైయ్యవ ఏట పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నదామె. ఢిల్లీకి చెందిన వివేక్ మెహ్ర అనే చార్టెడ్ అకౌంటెంట్‌తో 2002లో ఏర్పడిన పరిచయం ఆరేళ్ల సహ జీవనం తరువాత 2008లో వివాహంగా మారింది. ఇదే విషయాన్ని కూతురుకి తనెందుకు వివాహం చేసుకుంటున్నానో వివరంగా చెప్పింది. 'పెళ్లి చాలా ముఖ్యమైనది జీవితంలో.. సమాజంలో మనగలగాలంటే, గౌరవ మర్యాదలు దూరం కాకుండా ఉండటానికి పెళ్లి తప్పనిసరని ఒప్పించాను. మసాబా సంతోషంగా అంగీకరించింది' అనంటారెమె. అయితే ఆ మధ్య నీనా సోషల్ మీడియాలో అమ్మాయిలకు ఓ సలహా ఇచ్చారు. 'ఎప్పుడైనా సరే పెళ్లయిన వాడి ప్రేమలో మాత్రం పడవద్దని.'
ఇటీవల నీనా గుప్తా నటించిన చిత్రాలు బధా యీహౌ, పంగా, సుమంగళ్ జాద్దా సావధాన్. వ్యక్తిగతంగా స్ట్రాంగ్ విమన్ కావడం వలననే సినిమాలలో నెగెటివ్ రోల్స్ బాగా చేగలిగాననే నీనా లాక్డౌన్ లో ''సచ్ కహూ తో'' అనే పుస్తకం రాశారు. ''సినిమాల్లో అవకాశాలు రాకపోతే నేను తాజ్ హౌటల్లో వెయిటర్ గానైనా పని చేయ డానికి సిద్ధం. కానీ ఆత్మ గౌరవాన్ని మాత్రం చంపుకుని ఓ మెట్టు కిందికి దిగలేను'' అని దఢంగా చెబుతుంది నీనా.
హిందీ చిత్ర పరిశ్రమలో కమర్షియల్, న్యూవేవ్ పారలల్ చిత్రాలలో విభిన్న పాత్రలు పోషిస్తున్న నీనా గుప్తా సంద ర్భం వచ్చినపుడు షబానా ఆజ్మీ, స్మితా పాటిల్, దీప్తినావల్ వంటి తారలకు ఏమాత్రం తీసి పోని నటనను ఆవిష్కరించ గలదు.
నటిగా మారవలసి వచ్చింది : నీనాగుప్తా
''డబ్బు జీవితంలో చాలా ముఖ్యమని నాకు చాలా ఆలస్యం గా తెలిసి వచ్చింది. అయితే ఆ డబ్బు సంపాదించడానికి వ్యాపారం, తప్పుడు దారులు అనేవి ఎవరు చెబుతారు? నాకు నచ్చింది మీకు నచ్చకపోవచ్చు. మీకు నచ్చింది నాకు నచ్చక పోవచ్చు. నేను బాంబేకి ఢిల్లీ నుండి వచ్చినపుడు నాకిక్కడో స్నేహితుడుండేవాడు. అతడు నాకు కొంత సాయం చేస్తాడనే నమ్మకం ఉండేది. పైగా నేనపుడు చాలా పిరికిదాన్ని కూడా. వచ్చాక చాలా సందర్భాలలో డబ్బులుండేవి కాదు. టి.వి, శాటిలైట్ ఏవీ లేనపుడు సినిమాల్లో అవకాశాలుండేవి కావు.
అయితే పృథ్వీ థియేటర్స్‌లో రాజ్ కక్కడ్ అని ఒకాయన ఉండేవారు. ఆయన యాడ్ ఫిలింస్ చేసేవారు. తన యాడ్స్‌లో ఏదైనా క్లోబప్ ఇస్తే 500 రూపాయలు ఇచ్చేవారు. అలా జరిగిపోయేది. ఆయనదే పృథ్వీ కెఫే ఉండేది. అందులో నేను వంట కూడా చేయడం, ఇంటర్ వెల్‌లో తోడుండేదాన్ని. అలా చేయడం వల్ల నాకు రాత్రి భోజనం ఉచితంగా దొరికేది. అయితే ముందుగా నా ఫ్రెండ్ ఉన్నాడని చెప్పాను కదా. అతను తన సిగరెట్‌కి డబ్బులు నన్నడిగే వాడు. ఒకరోజు అతనేమన్నాడంటే నవ్వుతూ 'నువ్వు బొంబాయి వచ్చింది ఇందుకా. వేయిటర్ గిరి కోసమా?' అన్నాడు. అయినా సరే నేనైతే నిన్ను డబ్బులడగడం లేదు కదా! నీవేమో నీ సిగరెట్ డబ్బుల కోసం నన్నడుగుతున్నావు. ''నేనే నయం కదా'' అన్నాను. అంటే ఎదుటి వారు మనలను ఏ విధంగా అర్థం చేసుకుంటారనేది దీంతో నాకర్థమైంది.
అయితే ఇన్ని చేదు అనుభవాలు ఎదురైనా నేను నా ఆత్మాభి మానాన్ని కోల్పోలేదు. దారి కూడా తప్పలేదు. అయితే దారి తప్పే అవకాశం ఉండేది కూడా. కానీ మా అమ్మ ఎప్పుడూ ఒక్కమాట అనేది 'చదువే పనికి వస్తుందనేది. నేను సంస్కృతంలో ఎం.ఫిల్. చేశాను. నీ నేపథ్యం, నీ చదువే నిన్ను తయారు చేస్తుందని నాకు తెలుసు. అందుకే డ్రగ్స్, మద్యం వంటి వాటికి చేరువ కాలేదు. ఎందుకంటే నాకు నా స్వంతమైనటువంటి లక్ష్యాలున్నాయి. నేను ఏం చేసినా నా మనసు చెప్పినట్లే చేశాను. నా దగ్గర రూపాయి కూడా లేనపుడు చీపురు పట్టి ఉడ్చేపని చేయగలను. కానీ దారి తప్పను. ఒక్కోసారి బాధ కలుగుతుండేది. చాలా మంచి అవకాశాలు, పాత్రలు నన్ను కాదని వేరే వారికి ఎంపిక చేసేవారు. చాలా బాధ కలిగేది.
నేను ఏ స్నేహమైనా, అనుబంధాన్నైనా, నాకు నేను గానే కొనసాగించాను. మొదట్లో నేను ఢిల్లీ నుండి వచ్చాను. నేను ''ఇలా చేశాను. అలా చేశాను'' అని అందరూ అన్నారు. విన్ రిచర్డ్స్‌తో ప్రేమ, 'మసాబా' పుట్టడం కూడా జరిగిపోయింది. ఈ పరిస్థితు లలో కూడా నా కుటుంబంలో ఉన్న అనుబంధం చెక్కు చెదరలేదు. అప్పుడు కూడా నేను ఒక్క ఫోన్ చేస్తే చాలు. నన్ను దగ్గరకి తీసు కుని ప్రేమిస్తారంతా. అలా ఒక బలమైన అనుబంధం ఉండింది. అసలు మా అమ్మ చిన్నపుడు నన్ను తిట్టేది. కొట్టేది కూడా. వాటన్నింటితో నేను మానస ికంగా దృఢంగా తయారయ్యాను. అందుకే చాలా గడ్డు పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొన్నాను.
మరోవైపు సినిమా అవకాశాలు కూడా అంత ఆశావహంగా లేవు. అందుకే ప్రతి మూడు నెల్లకొకసారి తిరిగి ఢిల్లీ వెళదామని పించేది. కానీ వెళ్లలేదు. కాని నా తల్లిదండ్రుల నుండి బలమైన మద్దతు ఉండేది. అందుకే నేనె ప్పుడు తిరిగివెళ్లినా వాళ్లింటి తలుపులు తెరిచే ఉండేవి నా కోసం. నిజానికి నేనెప్పుడూ నటిని కావాలనుకోలేదు. నేను సంస్కృతంలో ఎం.ఫిల్ చేసి ఉన్నాను. తర్వాత పిహెచ్డీలో స్టేజ్ టెక్నిక్స్ ఇన్ సాంస్కృత్ డ్రామా సబ్జెక్టుతో చేరాను. ఎం.ఏ. ఎం.ఫిల్లో చేరాను. అయితే నేను పరిశోధన చేయాలనుకున్న అంశం హరప్పా మొహంజోదారో లిపి గురించి కూలంకషంగా పరిశోధన చేయాలని. కాని భగవంతుడు ఏం అనుకుంటే అదే జరుగుతుంది కదా! నటిగా మారవలసి వచ్చింది.
'ఖల్ నాయక్'లోని 'చోలీ కే పీఛే క్యా హై' పాటలో మొదట నేను నటించాలనుకోలేదు. సుభాష్ జీ పిలిచి అడిగితే మొదట నేను కాదన్నాను. ఎందుకంటే నేనో నటిని. పాట కూడా నాది కాదు. మొత్తం పాటలో నాలుగవ వంతు మాత్రం నాపై చిత్రీకరణ జరుగుతుంది. పాట మొత్తం మాధురిది. చేయనన్నాను. ఇదంతా నా మిత్రుడు సతీష్ కౌశిక్ ద్వారా చెప్పి పంపాను. నాకు సుభాష్ ఘై ఎదురుగా ఇవన్నీ చెప్పే ధైర్యం లేదు. ఒక నటికి డాన్సింగ్ రోల్ ఏమిటనే కోపం కూడా వచ్చింది. కానీ ఘారు నన్ను మళ్లీ పిలిచారు. వెళ్లాను. పాటను మళ్లీ వినిపించారు.
'చూడు నీనా ఈ పాట చేయడం వల్ల నీకెలాంటి నష్టం జరగదు. నీకు మంచిపేరు వస్తుంది. పాట చాలా హిట్టైతుంది. నువ్వు చేయాలి డాన్స్ అంటూ కన్విన్స్ చేశారు. ఆ తరువాత అందరికీ తెలి సిందే పాటకు ఎంత పేరు వచ్చిందో. షూటింగ్ చేసినపుడు పాట బాగుందని పించింది. అంతపెద్ద డైరెక్టర్ ఘై అంచనా నిజమైంది.
అందరూ నన్ను అడుగు తుంటారు నాకు మా అమ్మా నాన్నల ప్రేమ పట్ల ప్రగాఢమైన గౌరవముంది. వారిద్దరు వారిలాగే ఉండిపోయారు. తమ కమిట్ మెంటును, ప్రేమను దూరం చేసుకోలేదు. నా ఎనిమిదవ ఏట నుండి 14ఏండ్ల వయసు దాక హాలీడేస్ అన్నీ నాన్న వద్దనే గడిపాను. కాంమెంట్రీలతో బిజీగా ఉన్నప్పటికీ ఆయన ఎక్కడకెళితే అక్కడికి నేను అమ్మ వెళ్ళే వాళ్ళం. అమ్మ నా గురించి చాలా సంఘర్షణకు గురైంది. నా బర్త్ సర్టిఫికేట్ పై తండ్రి ఎవరో తెలుసుకునేందుకు జర్నలిస్టులు చూపిన అత్యుత్సాహం బాధించినా భరించింది. అందరూ నా స్ధానికతను గురించి నన్నూ అడుగుతుంటారు. వారికి నేను చెప్పేదొకటే. మా తాత గారిది బెనారస్. అమ్మది ఢిల్లీ. అమ్మమ్మది లాహౌర్ నా తండ్రిది కరేబియన్. నా దష్టి అంతా వీటిపైన లేదు. నేను ప్రపంచాన్ని చూస్తున్నాను. ఐనా ఇండో-కరేబియన్ గర్ల్ అనిపించుకోవడానికి నేనేమీ సిగ్గుపడను.
- మసాబాగుప్తా
- హెచ్. రమేష్‌బాబు, 7780736386
Sat 05 Jun 20:42:49.955906 2021