Sat 12 Jun 20:06:37.501716 2021
Authorization
- విరించి విరివింటి
ఎంబిబిఎస్, పీజీ
క్లినికల్ కార్డియాక్ ఫిజీషియన్
కరోనా రెండో వేవ్ తగ్గుతోందనే ఆనందం ఒకవైపు మొదలవగానే మూడో వేవ్ ముసురు కొస్తుందనే వార్త మరో వైపు నుంచి ఆందోళన కలిగిస్తోంది. మూడో వేవ్ నిజంగానే వస్తోందా లేక ఇది ఊహాజనితమైనదా అనే విషయం పక్కకి పెడితే రెండు వేవ్‌లు ముగిశాక, గత సంవత్సరంన్నరగా కరోనా వలన దేశం ఎంతో మందిని కోల్పోయాక, తప్పకుండా మన ఆరోగ్య వ్యవస్థను అందులోని లోపాలనూ గుర్తించి సరి చేసుకోవాలనే స్పహ పెరిగ వలసిన తరుణం ఆసన్నమైంది.
ఏప్రిల్‌లో సెకండ్ వేవ్ వచ్చే సమయానికి ముందు మన దేశం ఏ మాత్రం సన్నద్ధంగా లేకపోవడం వలన మనం చెల్లించిన భారీ మూల్యం ఏమిటో అందరికీ తెలుసిందే. కనీసం దీని దష్ట్యా ఐనా మూడో వేవ్ వస్తుందనే ఊహైనా మన ఆరోగ్య వ్యవస్థలో కదలిక తెస్తుందని విప్లవాత్మకమైన మార్పులు తెస్తుందనీ మనం ఆశించాలి. మూడో వేవ్ అని మాత్రమే కాక ఇకపై భవిష్యత్తులో ఏ ఆరోగ్య విపత్తు వచ్చినా సన్నద్ధంగా ఉండగలిగేంటటువంటి పటిష్ఠమైన ప్రజారోగ్య వ్యవస్థను మనం నిర్మించుకోవాలి. దానికి ప్రభుత్వ బడ్జెట్ లలో ఆరోగ్య కేటాయింపుల దగ్గరి నుంచి ప్రజలలో ఆరోగ్యం పట్ల చైతన్యం తీసుకువచ్చే దాకా సాగాలి. రైల్వే బడ్జెట్ లాగా ఆరోగ్య బడ్జెట్ ని ప్రత్యేకంగా ప్రవేశ పెట్టగలిగిన నాడు, మొత్తం బడ్జెట్ లో కనీసం ఎనిమిది నుంచి పదిశాతానికి ఆరోగ్య శాఖకు కేటాయింపులు పెంచినపుడు మాత్రమే చెతికిలబడ్డ మన ఆరోగ్య వ్యవస్థ కుదుటపడే అవకాశం కనిపిస్తోంది.
ఐతే నిజంగానే మూడో వేవ్ ముంచుకొచ్చే ప్రమాదమూ లేకపోలేదు. మూడోవేవ్‌ను కట్టడి చేయగలగడంలో మన సన్నద్ధత ఎంత వరకు ఉన్నది అన్నది ఈ సందర్భంగా అతి ముఖ్యమైన అంశం కాబోతున్నది. మూడో వేవ్ రాబోతున్నదనే ఊహ లాగానే అది పిల్లలలో ఎక్కువగా రాబోతున్నదనే ఊహ కూడా ఒకటి ఉంది. ఇవి ఊహాత్మకమే ఐనా వీటిని సరైన రీతిలో అర్థం చేసుకోవలసి ఉన్నది. అర్థం చేసుకోకపోవడం వలన ఈ ఊహలే నిజమయ్యే ప్రమాదమూ ఉంది. ఏ ఎపిడె మిక్ నైనా కట్టడి చేయడంలో ''ఎపిడెమిక్ సంబంధిత ప్రవర్తన'' అనేది ఒకటి ఉంటుంది. ఆ ఎపిడెమిక్ సంభవించిన కాలంలో ప్రజలు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి, ప్రభుత్వాలు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి అనేదే ఆ నియమావళి. మొదటి వేవ్ ముగిసిన తర్వాత ప్రజలుగా మనంగానీ ప్రభుత్వాలుగానీ ''కరోనా సంబంధిత ప్రవర్తన''కు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేకపోవడం వలననే సెకండ్ వేవ్ మనమీద విరుచుకుపడి ఇంతటి నష్టాన్ని కలుగజేసింది. ఈ సెకండ్ వేవ్ నుంచి మనం పాఠాలు నేర్చుకోవలసింది ఎంతో ఉంది. కొన్ని విషయాలు తెలియక పోవడం వలన తప్పు చేయడమన్నది సాధారణ విషయమే ఐనప్పటికీ తెలిసి తప్పుచేయడం, చేసిన తప్పులనుంచి కొత్త పాఠాలు నేర్చుకొని మనల్ని మనం సరి చేసుకోకపోవడం దారుణమైన విషయాలౌతాయి. ఈ నేపథ్యంలో మూడో వేవ్ వచ్చేలోపల మనం మన తప్పులనుంచి పాఠాలు నేర్చుకుని సరి చేసుకోవలసిన సమయం వచ్చేసింది.
ముఖ్యంగా వాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడం వలన మూడో వేవ్ ను రాకుండగానే అరికట్టవచ్చు. మనవంటి పెద్ద దేశాలకు జనాభా ఎక్కువగా ఉండటం అన్నది సమస్యగా, బలహీనతగా కనబడినా హ్యూమన్ రిసోర్స్ పరంగా చూసుకుంటే అదే మనకు పరిష్కారమూ, బలమూ కూడా. వాక్సినేషన్ ప్రక్రియకు అందుకే పెద్ద దేశం పెద్ద జనాభా వంటి సాకులు కుంటిసాకులే ఔతాయి. ఇంత మ్యాన్ పవర్ ఉన్న దేశం ప్రపంచంలో మరోటి ఉండదేమో. మన వనరులను వినియోగించుకుంటూ మనం వాక్సినేషన్ ప్రక్రియను శరవేగంగా పూర్తిచేయవచ్చు. పద్దెనిమిది సంవత్సరాల పైబడిన వారికందరికీ వాక్సిన్ ఈయగలిగితే వారినుంచి మరొకరికి కరోనా వ్యాప్తి జరిగే అవకాశం తగ్గుతుంది. చైనాలో మూడు సంవత్సరాల పైబడిన పిల్లలకు కూడా వాక్సినేషన్ చేసే దిశగా అనుమతులున్నాయి. మూడేళ్ళ పిల్లలకు సైతం వాక్సినేషన్ చేస్తున్న ఏకైక దేశం కూడా చైనాయే. అమెరికా, కెనెడా సింగపూర్, వంటి దేశాలలో పన్నెండు సంవత్సరాల పైబడిన వారికి ఇస్తున్నారు.యురోపియన్ కమీషన్ కూడా పన్నెండేళ్ళ పైబడిన పిల్లలకు వాక్సిన్ ఇచ్చేందుకు అనుమతిచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ పిల్లలకు కరోనా వాక్సిన్ పై ఎలాంటి రికమెండేషన్ లు చేయకపోవడంలో కూడా అర్థముంది. మొదటి రెండు వేవ్ లలో కూడా చాలామంది పిల్లలకు కరోనా సోకింది కానీ ఎవరిలో పెద్దగా లక్షణాలు కనబడింది లేదు. అందుకే పిల్లల్లో టెస్టులు చేసి కేసులను గుర్తించడం కూడా పెద్దగా జరగలేదు. కొంత మంది పిల్లల్లో స్వల్పమైన లక్షణాలు కనబడ్డాయి. చాలా తక్కువ మంది పిల్లల్లో మాత్రమే ''మల్టి సిస్టమ్ ఇన్‌ఫ్లామేటరీ కండీషన్'' అనే తీవ్రమైన కనబడింది. కానీ సకాలంలో చికిత్స అందిన అటువంటి పిల్లలు కూడా కరోనా నుండి బయటపడ్డారు. ఇటువంటి పరిస్థితుల్లో మూడో వేవ్ లో పిల్లలలో కరోనా వచ్చినా ఇదే తీరుగా దాదాపుగా లక్షణాలు లేకుండగానే ఉండే అవకాశం ఉంది తప్ప వారికి మాత్రమే వస్తుంది వారికి మాత్రమే తీవ్రమైన జబ్బు వస్తుంది అనడంలో ఎలాంటి సైంటిఫిక్ ఎవిడెన్సూ లేదన్నది వాస్తవం. ఐతే రోజురోజుకీ మనదేశంలో పౌష్టికాహార లోపాలుగల పిల్లల శాతం పెరుగుతోందన్నది కూడా ఈ సందర్భంగా గుర్తించ వలసిన అంశం. పౌష్టికాహార లోపం పిల్లలలో రోగనిరోధక వ్యవస్థను ప్రభావితం చేసి వారిని త్వరగా ఇన్ఫెక్షన్ల బారిన పడేలా చేస్తుంది. తద్వారా కరోనా కావచ్చు మరే ఇతర జబ్బైనా కావొచ్చు పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని వెంటనే సరిచేయలేకపోతే ప్రమాద ఘంటికలు మోగినట్టే.
పెద్దలలో మాత్రమే వాక్సి నేషన్ జరగడం వలన పిల్లల్లో వాక్సి నేషన్ ప్రక్రియ మొదలు కాక పోవడం వలన ఈ సారి కరోనా పాజి టివ్ కేసులు పిల్లల్లోనే బయటపడే అవకాశం ఎక్కువగా ఉంది. పిల్లల నుండి వాక్సినేషన్ వేసుకోని పెద్దలకు సులువుగా పాకుతుంది కూడా. మూడో వేవ్ కనుక వస్తే బహుశా మనం ఇటువంటి పరిస్థితినే చూడవచ్చు. స్వల్ప లక్షణాలు గల పిల్లలు, వారినుంచి సోకి తీవ్ర లక్షణాలలోకి పోతున్న వాక్సినేషన్ జరగని పెద్దలు. అందుకే మనం పెద్దలలో సరైన తీరులో వాక్సినేషన్ వేగవంతంగా చేయగలిగితే వారిలో జబ్బును అరికట్టగలగడమూ, వారిని తీవ్రమైన జబ్బుబారిన పడకుండా చేయడమే కాకుండా పిల్లల్లో కూడా కరోనా రాకుండా నివారించగలిగానట్టు ఔతుంది. దీనినే ''కకూన్ ఎఫెక్ట్'' అంటారు. అంటే ఉదాహరణకు ఒక ఇంట్లో ఉండే పెద్దవారందరూ వాక్సిన్ వేసుకుని ఉన్నారనుకుందాం..అపుడు వాళ్ళకు వేరే వాళ్ళనుండి కరోనా వచ్చే అవకాశం తగ్గిపోవడం వలన ఇంట్లో ఉండే పిల్లలకు కూడా వ్యాధి సోకే అవకాశం తగ్గిపోతుంది. ఆ రకంగా వాళ్ళు రక్షణ పొందుతారు. అందుకే పెద్దలందరూ వాక్సినేషన్ చేసుకోగలగడమొక్కటే దీనికి పరిష్కారం. ఐతే వాక్సినేషన్ ప్రక్రియ నెలల తరబడి జరపడం వలన పెద్దగా ప్రయోజనమూ ఉండదు. మనదేశంలో ఒకవైపు కేసులు పెరుగుతున్న సమయంలో వాక్సినేషన్ ప్రక్రియ మాస్ గ్యాదరింగ్ రూపంలో మరిన్ని కేసులు పెరగడానికే దోహద పడింది. వాక్సినేషన్ వేసుకోవడానికి లైన్లో నిలబడి కరోనా బారిన పడినవారు కోకొల్లలుగా ఉన్నారు. ఒకదశలో వాక్సిన్ వేసుకుంటే కరోనా వస్తుందేమో అనేంతదాకా పోయింది. ప్రస్తుతం రెండో వేవ్ తగ్గుతున్న తరుణంలో వాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయగలిగితే చాలా మెరుగైన ఫలితాలు ఉంటాయి. అంతే కాకుండా ఎంత పెద్ద వాక్సిన్ డ్రైవ్ లను కొనసాగించినా ''కరోనా సంబంధిత ప్రవర్తన'' ను ఎవరూ మీరకుండా కఠిన చర్యలు తీసుకోవలసిన అవసరమూ ఉంది.
అలాగే ప్రభుత్వాలు కూడా రాబోయే ఒకటి రెండు సంవత్సరాలు పెద్ద ఎత్తున ప్రజలు హాజరుకావలసిన అన్ని కార్యక్రమాలనూ రద్దు చేయాలి. ప్రచార సభలు,రోడ్ షోలూ లేకుండానే ఎన్నికలు జరిపే దిశగా ఆలోచించాలి. అమెరికా తరహాలో ప్రత్యర్థుల మధ్య డిబేట్లు జరిపి ప్రజలు ఎవరికి ఓటేయాలో తేల్చుకునే వ్యవస్థ రావాలి. అంతేకాకుండా ప్రజలు కూడా సెకండ్ వేవ్ ముగిశాక కొంత పరిస్థితులు మెరుగవ్వగానే అంతా బాగానే ఉందని ''కరోనా సంబంధిత ప్రవర్తనను ఎట్టి పరిస్థితుల్లో వదిలివేయకూడదు. వాక్సినేషన్ ప్రక్రియ పూర్తయిన కొన్ని దేశాలలో మాస్కు కూడా వాడటం లేదని మనకు వార్తలు వస్తున్నా ఆ దేశాల చారలను చూసి మనం వాతలు పెట్టుకోనవసరం లేదు. మూడో వేవ్ రాకున్నా మరో రెండు సంవత్సరాల పాటు మనం మాస్కు వాడటం, ఫిజికల్ డిస్టాన్సుని పాటించడం, చేతులు సబ్బుతో కడుక్కోవడం, జనావాసాలలో పరిశుభ్రత, ఆహారపానీయాదుల విషయంలో పరిశుభ్రతను పాటించడం వంటివి చేస్తూనే ఉండాలి. వీటిపై నిర్లక్యం వహించకుండా సరైన రీతిలో ప్రజలలో అవగాహనను కలిగించాలి. రాబోయే కాలం పాండమిక్ ల కాలం కాబట్టి ఆరోగ్యం పట్ల మన దక్పథాలు మారేలా ప్రభుత్వాలు చర్యలూ తీసుకోవాలి. జాతీయ బడ్జెట్ లో పెద్ద ఎత్తున ఆరోగ్య శాఖలకు నిధులు కేటాయించగలిగితే ఆరోగ్యం సామాన్య ప్రజలను చేరడం సాధ్యమౌతుంది. ఉత్తమ చికిత్స ఫలితాల (Best Treatment Results) ను సాధించడం కోసం సకాలంలో ఆరోగ్య సర్వీసు లను ఉపయోగించగలగడమే ''ఆరోగ్య సర్వీసుల లభ్యత (Access to health services)''కు నిర్వచనంగా మనం చెప్పుకోవచ్చు. అలా చూస్తే ఇప్పటి ప్రభుత్వ ప్రైవేటు ఆరోగ్య సర్వీసుల ద్వారా నిజంగా ఉత్తమ చికిత్స ఫలితాలను పొందగలగుతున్నామా?. అది కూడా సకాలంలో పొంద గలుగుతున్నామా?. వంటి ప్రశ్నలు వేసుకుని వాటిని కషితో సాధించుకో గలిగితే ఒక్క కరోనాయే కాదు మునుముందు ఎటువంటి ఆరోగ్య విపత్తు వచ్చినా మనం సులువుగా బయటపడగలుగుతాం. Access to health services విషయంలో మన దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక, సామాజిక, సాంస్కతిక సమస్యలపై పెద్ద ఎత్తున చర్చలు జరగాలి. జిల్లా కేంద్రాలకూ మండల కేంద్రాలకూ కూడా ఆరోగ్య వికేంద్రీకరణ జరిగి టెర్షియరీ మెడికల్ సర్వీసులు అక్కడ కూడా లభింపజేసే దిశగా అడుగులు వేయాలి. మూడో వేవ్ తరుముకొస్తుందన్న హైపోథెటికల్ సందర్భాన్ని మనం ఒక అవకాశంగా తీసుకుని మన ఆరోగ్య వ్యవస్థను మనమే బాగు చేసేందుకు కషి చేయాలి. ఆ సమయం ఆసన్నమైంది కూడా.
చాలా మందికి ఏ వాక్సిన్ ఐతే బాగుంటుందనే అనుమానాలున్నాయి. ఐతే ఇప్పటిదాకా వస్తున్న డాటా ఆధారంగా అన్ని వాక్సిన్లు బాగా పని చేస్తున్నాయనేది వాస్తవం. అందుకే ఎలాంటి అనుమానాలకు తావీయకుండా అందుబాటులో ఉండే వాక్సిన్లను వేసుకోవడం మంచి పని.
కొందరు వాక్సిన్ వేసుకున్నాక కూడా యాంటిబాడీలు రాలేదని వాపోతుండటమూ చూస్తున్నాం. ఐతే అటువంటి వాళ్ళు గుర్తించవలసిన విషయం ఏమంటే వాక్సిన్ల పని ఆ వైరస్ కు వ్యతిరేకంగా యాంటీ బాడీలు ఏర్పరచటమే కాకుండా, మెమోరీ కణాలను ఏర్పరచడం కూడా అనేది.
యాంటీబాడీలు తగినన్ని ఏర్పడకపోయినా ఏమీ పర్వాలేదు. వాక్సిన్ లో ఉండే వైరల్ యాంటీజన్ ని గుర్తు పెట్టుకునే B Lymphocytes దాదాపు మన శరీరంలో ఉంటాయి. ఒక్కో వాక్సిన్ కొంతకాలం పాటు ఈ రక్తకణాలలో మెమోరీని కలిగించగలుగుతాయి. కరోనా వాక్సిన్లు ఎంతకాలం పాటు ఈ మెమోరీ కణాలను ఉంచగలవో ఇప్పట్లో చెప్పలేం. కానీ మనకున్న గత అనుభవాల దష్ట్యా ఒకసారి కరోనా వాక్సిన్ వేసుకున్న తర్వాత ఎపుడు కరోనా ఇన్ఫెక్షన్ వచ్చినా శరీరంలోని మెమోరీ బీ లింఫోసైట్స్ వెంటనే తగినన్ని యాంటీబాడీలను తయారు చేస్తాయి. కాబట్టి యాంటిబాడీలు వస్తేనే వాక్సిన్ పనిచేస్తుందనే అపోహ అనవసరం.
ఇంకొందరు వాక్సిన్ రెండు డోసులు వేసుకున్నాక కూడా కరోనా వస్తోంది కదా అని అడుగుతున్నారు. వాక్సిన్ వేసుకున్నాక కరోనా ఇన్ఫెక్షన్ రావడాన్ని బ్రేక్ థ్రూ ఇన్ఫెక్షన్ అంటారు. ఐతే వీళ్ళందరూ వాక్సిన్ అందించిన రక్షణ వలన చాలా తక్కువ లక్షణాలతో కోలుకుంటారు. ఇలాంటి బ్రేక్‌థ్రూ కరోనా ఇన్ఫెక్షన్ లు వచ్చిన వారిలో lung involvement తో కూడిన న్యూమోనియా కూడా దాదాపుగా ఉండటం లేదని ఈ సెకండ్‌వేవ్‌లో ఎన్నో సీటీస్కాన్లు పరిశీలిం చిన రేడియాలజిస్టులు చెబుతున్నారు. కనుక ఒకవేళ వాక్సినేషన్ ప్రక్రియ ముగిసి నెలదాటిన తర్వాత కరోనా సోకిన వారిలో కరోనా కేవలం తక్కువ తీవ్రతగల జలుబు గొంతు నొప్పిలాగా వచ్చిపోయే అవకాశం ఉంది.