Sun 20 Jun 08:55:07.435029 2021
Authorization
''ఏమి మనిషో? ఏమో? భార్య చనిపోయిన దుఃఖం అస్సలు ఆ కళ్ళల్లో కనపడనే కనపడటం లేదు. ఇంత మంది పలకరిస్తున్నా మౌనం తప్ప ఎలా చనిపోయిందో చెప్పటం లేదు. ఇలాంటి మనిషిని మేము ఎక్కడా చూడలేదు'' ఆ రోజు ఉదయం చనిపోయిన వరలక్ష్మిని చూడటానికి వచ్చిన వాళ్ళందరూ అనుకుంటూ ఉన్నారు. వరలక్ష్మి వయసు 70 ఏళ్ళు. ఆమె భర్త సుబ్బారావుకు 75 సంవత్సరాలు. సుబ్బారావు చాలా గంభీరమైన మనిషి. కొడుకులు కోడళ్ళు మనవళ్ళు, మనుమరాళ్ళతో కలిసి వాళ్ళిద్దరూ ఉంటున్నారు.. ఆ రోజు ఉదయం గుండెపోటుతో హఠాత్తుగా వరలక్ష్మి చనిపోయింది.. సుబ్బారావు మౌనంగా ఇంటి వరండాలో చాలాసేపు కూర్చున్నాడు. లేచి అటూ, ఇటూ తిరిగాడు... చూసేవాళ్ళకు సుబ్బారావులో వరలక్ష్మి పోయిన దుఃఖం ఏ కోశానా కనిపించటం లేదు. వాళ్ళ కూతుర్లు ఇద్దరూ దూరంలో ఉన్నారు. వాళ్ళు వచ్చేసరికి సాయంత్రం నాలుగు గంటలు అయ్యింది. కూతుర్లను చూడగానే దుఃఖం కట్టలు తెంచుకున్నది సుబ్బారావుకు. కూతుళ్ళను పట్టుకొని ''అమ్మా! మీ అమ్మ నన్ను వంటరివాడిని చేసి వెళ్ళిపోయింది...'' అంటూ ఒక్కసారిగా బావురుమన్నాడు.. అప్పటిదాకా రకరకాలుగా మాట్లాడినవాళ్ళు నిశ్చేష్టులై చూస్తుండిపోయారు. మన సమాజంలో ఇలా తమ భావాలను వ్యక్త పరచకుండా ఉండే మగవాళ్ళు చాలా మందే ఉన్నారు. తండ్రిలో కూడా తల్లి ఉన్నదన్నది వాస్తవం. జూన్ 20 'పిత దినోత్సవం' సందర్భంగా ఒక్కసారి కన్న బిడ్డల కోసం ఎన్నోపాట్లు పడుతున్న నాన్నలందరినీ తలుచుకుందాం.
ప్రపంచంలోని 193 దేశాలలో 52 దేశాలలో మాత్రమే 'ఫాదర్స్ డే' జరుపుకుంటున్నారు. చాలా దేశాలలో జూన్ మూడవ ఆదివారం నాడు ఫాదర్స్ డే గా జరుపుకుంటున్నారు. యూరప్ లాంటి కాథలిక్ దేశాల్లో మాత్రం మార్చి 19 సెయింట్ జోసెఫ్ డే నాడు జరుపుకుంటారు. అయితే 1908 లో వెస్ట్ వర్జీనియా చర్చ్‌లో మొదటిసారిగా ఫాదర్స్‌డే జరిగిందన్నది ఒక కథనం... అయితే..1910లో యు.యస్ లో జరిగిన మైనింగ్ ప్రమాదంలో 361 మంది చనిపోయారు. వారిని స్మరిస్తూ... 1910లో మొట్టమొదటిసారి సోనోరా స్మార్ట్ డాడ్ అనే మహిళ జూన్ మూడో ఆదివారం ఫాదర్స్‌డే జరుపుకోవాలని ప్రతిపాదించింది.. డాడ్ తన తలిదండ్రులకు ఆరవ సంతానం. తల్లి మరణించిన తరువాత ఆమె తండ్రి వాళ్ళ బాగోగులను చూసుకున్నాడనీ.. బిడ్డలను అపురూపంగా చూసుకునే తండ్రులు ఉన్నారనీ, ''మదర్స్ డే'' లాగా ''ఫాదర్స్ డే'' జరుపుకోవాలని వాదించింది. 1966లో అమెరికా అధ్యక్షుడు లిండన్ జూన్ మూడవ ఆదివారం ఫాదర్స్ డే గా ప్రకటించారు. అప్పటి నుంచీ ప్రతి సంవత్సరం జూన్ మూడో ఆదివారం నాడు ''ఫాదర్స్ డే'' జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోంది. 1972లో యు.యస్‌లో ఫాదర్స్‌డే ను జాతీయ సెలవు దినంగా ప్రకటించారు.
ప్రపంచంలోని 52 దేశాలలోని వివిధ ప్రాంతాలలో మార్చి నుంచి డిసెంబర్ దాకా ప్రతి సంవత్సరం ఫాదర్స్ డేను జరుపుకుంటూ ఉంటారు. మార్చి 14 ఇరాన్, మార్చి 19 బొలీవియా, ఇటలీ స్పెయిన్ పోర్చుగల్, హ్యాండర్స్, మే 8 సౌత్ కొరియా, జూన్ మొదటి ఆదివారం లిథుయేనియా, జూన్ రెండో ఆదివారం -ఆస్ట్రియా, బెల్జియం, ఈక్విడార్, జూన్ మూడో ఆదివారం ఆంటిగువా, కెనడా, బంగ్లాదేశ్, బల్గేరియా, బహ రూమ్, చిలీ, కొలంబియా, క్యూబా, సైప్రస్, ఫ్రాన్స్, గ్రీస్, గానా, హాంకాంగ్, ఇండియా, ఐర్లాండ్, జమైకా, జపాన్, మలేషియా, మెక్సికో, మాల్టా, నెథర్లాండ్స్, పాకిస్తాన్, పనామా, పరాగ్వే, పెరూ, ఫిలిపైన్స్, సింగపూర్, సెయింట్ విన్సెంట్, స్లోవేనియా, సౌత్ ఆఫ్రికా, శ్రీలంక, స్విట్జర్లాండ్, తుర్కీ, యునైటెడ్ కింగ్ డమ్, వెనిజులా, జింబాబ్వే... జూన్ 17-సాల్వడార్, గ్వాటెమాల, జూన్ 23 పోలెండ్, ఉగాండా, జులై రెండో వారం ఉరుగ్వే (సౌత్ అమెరికా), జులై చివరి వారం -డొమినికన్ రిపబ్లిక్, ఆగస్టు రెండో ఆదివారం బ్రెజిల్, ఆగస్టు 8 తైవాన్, చైనా, ఆగస్టు 24 అర్జెంటీనా, సెప్టెంబర్ మొదటి ఆదివారం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, న్యూ మూన్ ఆఫ్ సెప్టెంబర్ నేపాల్, అక్టోబర్ మొదటి ఆదివారం లక్సెంబర్గ్, నవంబర్ రెండో ఆదివారం ఫిన్లాండ్, నార్వే, స్వీడన్, ఎస్టోనియా, డిసెంబర్ 5 -థాయిలాండ్ ...! ఇలా జరుపుకుంటున్నారు.
గతం లేకుండా వర్తమానం ఉండదు... వర్తమానం లేకుండా భవిష్యత్తు ఉండదు.. గత చరిత్రను మనం గమనిస్తే .. మానవ వికాసం చెందటానికి జీవ పరిణామక్రమం మానవుడు మానవ దశకు చేరుకోవటానికి ఎన్నో లక్షల సంవత్సరాలు పట్టింది. శ్రమ చేయటం ద్వారా మానవుడు ప్రకతిపై విజయాన్ని సాధిస్తూ వచ్చాడు. ఆదిమ సమాజంలో ధైర్య సాహసాలకు, సామర్ధ్యాలకూ పురుషునితో సమాన స్థాయిలో స్త్రీలు ఉన్నారు. నాగరిక సమాజం స్త్రీలను అబలలుగా చేసింది. ఇక వివాహ వ్యవస్థకు వస్తే వ్యక్తి ప్రాముఖ్యత లేకుండా గుంపు పెంపుదల కోసం జరిగిన ఆనాటి పెళ్ళిళ్ళను ఎంగెల్స్ గుంపు పెళ్ళిళ్ళు అని అన్నారు. క్రమంగా కుటుంబ వ్యవస్థలో వివాహ పద్ధతిలో అనేక మార్పులు వచ్చాయి. స్తీ పురుషుల మధ్య పని విభజన జరిగింది. ఆహారం, ఆయుధాలు, పశువుల పెంపకంలలో పురుషుడు ముఖ్య భూమిక వహించాడు. ఉత్పత్తి అనేది మొత్తం సమాజ ప్రయోజనాల కోసమే కాకుండా కుటుంబ ఆస్తిగా మారిపోయే క్రమంలో మాతస్వామ్యం నుండి పితస్వామ్యం దిశగా సమాజం మారుతూ వచ్చింది. స్త్రీ పురుషుల మధ్య శ్రమ విభజన జరిగింది. స్త్రీ కి ఇంటిలోపల పని బాధ్యత మాత్రమే ఉంది. క్రమంగా స్త్రీకి ఇంతకుముందు ఉన్న గౌరవం, ప్రాధాన్యతా తగ్గింది.. ఉత్పత్తి నుంచి స్త్రీని వేరు చేసి స్త్రీని నాలుగు గోడల మధ్య బంధించి ఉంచటం వలన స్త్రీకి సమాజంలో పురుషునితో పాటు సమాన స్థానము ఇవ్వటం జరగలేదు. పురుషుడు ఉత్పత్తిలో ప్రముఖ స్థానం వహించటం వలన కుటుంబం పై పురుషుని ఏకాధిపత్యం మొదలయ్యింది. సామూహిక రతి నుంచి బయట పడటానికి ఒకే కుటుంబ వ్యవస్థకు తలొగ్గింది స్త్రీ... చరిత్రలో ప్రాచీన కాలం నుండీ బహుభార్యత్వం ఉన్నది. ఒకే వివాహం అన్నది కేవలం స్త్రీల పట్ల కఠినంగా అమలు పరిచారు.
పితస్వామిక వ్యవస్థ స్థిరపడింది. మాత వారసత్వం నుండి పితవారసత్వంలోకి మారే క్రమంలో మహిళలను కుటుంబంలో పూర్తిగా దోపిడీకి గురిచేశారు. మగవాడు తను కన్న పిల్లలకు తన ఇంటి పేరే పెట్టాలనుకున్నాడు. మహిళలు తమ తిండి, బట్ట, ఇతర అవసరాల కోసం పూర్తిగా మగవాడిపై ఆధార పడవలసి వచ్చింది. ఈ క్రమంలో కుటుంబంలో తండ్రి పాత్ర ఒక విధంగా నిర్దేశించబడింది. తండ్రి ఎలా ఉండాలి ? తండ్రి గంభీరమైన స్వభావం కలవాడు... కఠినుడు... పిల్లలతో కఠినంగా వ్యవహరిస్తూ ఉంటాడు... అతి క్రమశిక్షణతో పిల్లలను పెంచుతాడు. పిల్లలతో ఎటువంటి మానసిక అనుబంధాన్ని కలిగి ఉండడు... ఈ రకమైన లక్షణాలు పితస్వామ్య వ్యవస్థలో తండ్రికి ఆపాదించబడ్డాయి... వాస్తవానికి తండ్రులు అంత కఠినులా? బతకటానికి ఆక్సిజెన్ ఎంత అవసరమో? కుటుంబానికి పురుషుడు అంతే అవసరం అన్నాడో మహానుభావుడు. కుటుంబానికి తల్లి ఎంత అవసరమో? తండ్రి అంతే అవసరం..!
ఇక మన దేశంలో... జూన్ మూడో ఆదివారాన్ని మనం గత కొంత కాలంగా ''పిత దినోత్సవం''గా జరుపుకుంటున్నాం. ఇతర దేశాల కుటుంబ వ్యవస్థల మధ్య మన దేశ కుటుంబ వ్యవస్థ మధ్య చాలా అంతరం ఉన్నదన్నది మనకందరకూ విధితమే. పిత దినోత్సవాన్ని గురించి మాట్లాడుకోవటానికి ముందుగా కొన్ని విషయాలను మననం చేసుకుందాం...
సమాజం లో స్త్రీలకు, పురుషులకూ ఉన్న స్థానాలను అర్థం చేసుకో వలసిన అవుసరం ఎంతైనా ఉన్నది. ఇప్పటికీ ప్రతి విషయం లోనూ చిన్నతనం నుండీ ఆడపిల్లలకు పరిమితులున్నాయి. ''ఆవశ్యకతను గురించిన చైతన్యమే స్వాతంత్రం'' అంటాడు ఏంగిల్స్ ...
సమాజంలో విలువలు
సాధారణంగా వాస్తవ విషయాలకూ, విలువలతో కూడుకున్న విషయాలకూ చాలా వ్యత్యాసం ఉంటుంది. విలువలు అన్న పదానికి అర్థం... సమయాన్నీ, కాలాన్నీ, స్థలాన్నీ బట్టి మారుతూ ఉంటుంది. పితస్వామిక సంస్కతిలో తీవ్రమైన అణచివేత, అసమానతలూ ఉంటాయి. చరిత్రలో స్త్రీ సంస్కరణోద్యమాలు అనేకం జరిగాయి... ఈ క్రమంలో పురుషుని పాత్ర కూడా మారుతూ వచ్చింది. బాధ్యతలను పంచుకోవటం, కుటుంబసభ్యుల పట్ల సౌమ్యమైన.. సరళమైన స్వభావాన్ని కలిగి ఉండటం ఇవన్నీ పురుషుని జీవితంలోనూ భాగమయ్యాయి.
నాగరికతను గురించి విశ్లేషిస్తూ ఏంగిల్స్ ఇలా అన్నారు ''సామాజిక వికాసమే నాగరికత'' నాగరిక సమాజం అంటే ఆదర్శవంతమైన స్వార్ధరహిత ఉన్నత సమాజం... పితస్వామ్యానికి ప్రాధాన్యతనిచ్చే సమాజంలో ఉన్నతత్వం బదులుగా స్వార్ధం పెరుగుతుంది. నాగరిక సమాజంలో స్త్రీల పై పురుషుల పెత్తనం మరింతగా పెరిగింది. కుటుంబం మీద కూడా ప్రభావాన్ని చూపుతోంది.. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలుండేవి. పెదనాన్నలు, పెద్దమ్మలు బాబాయిలు, పిన్నులు, అమ్మమ్మలు, నానమ్మలు ఇలా కుటుంబంలో పెద్దా, చిన్నా అందరూ ఉండేవారు... పిల్లల బాగోగుల బాధ్యతలు ఉమ్మడిగా ఉండేవి. నేటి చిన్న కుటుంబాలలో ఈ వెసులుబాటు చాలా తక్కువగా ఉంది. దానికి తోడు మనది పూర్తి స్థాయిలో ఉన్న పెట్టుబడిదారీ సమాజం కాదు. బానిస, భూస్వామ్య, వలస వ్యవస్థల తాలూకు ప్రభావాలు కుటుంబాలపై తమ ప్రభావాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. ప్రపంచీకరణ తర్వాత కుటుంబ వ్యవస్థలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. మధ్య తరగతి నిమ్న మధ్య తరగతి కుటుంబాలలోని స్త్రీలు సైతం తమ కుటుంబ పోషణ కోసం అధికంగా శ్రమించవలసి వస్తోంది.. బానిస, భూస్వామ్య సమాజాల లాగానే పెట్టుబడి దారుడు కూడా శ్రమను కారుచౌకగా దోచుకోవటానికి స్త్రీలను ప్రోత్సహిస్తాడన్నది జగమెరిగిన సత్యం.. పురుషుని పరిస్థితి దీనికి భిన్నంగా ఏమాత్రం లేదు. దోపిడీ రూపం మారిందే తప్ప దోపిడీ మారలేదు అన్నది సుస్పష్టం.. కుటుంబాలలో దారుణమైన వైవిధ్యాలు, వైరుధ్యాలు ఉన్న మాట వాస్తవం.. నేటి ఆధునిక కాలంలో కుటుంబంలో తండ్రి పాత్ర అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.. పిల్లల పెంపకంలో తల్లితో పాటు తండ్రి కూడా ప్రముఖ పాత్రను పోషించవలసి వస్తోంది. కుటుంబ బాధ్యతలు సమానంగా మోయవలసి వస్తోంది. పురుషులలో ఎంతో మార్పు వస్తోంది ఒకప్పటిలా చాలా మంది లేరు. మారుతున్న కాలానికి తగినట్టుగా వాళ్ళూ మారుతున్నారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం.
తండ్రిని స్ఫూర్తిగా తీసుకొని ఎదిగిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈ సమాజంలో ఆడపిల్లలను మొగపిల్లలతో సమానంగా పెంచిన తండ్రులున్నారు.
రండి... నాన్నల గొప్పతనాన్ని నలుదిక్కులా చాటుదాం... అతని త్యాగాలను కీర్తిస్తూ ధన్యవాదాలు తెలుపుదాం...!
- కవిని ఆలూరి
సెల్: 9701605623