భారత విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన స్వతంత్రం సిద్ధించిన ప్రారంభంలో పాలకులకున్నది. దానికను గుణంగానే విద్యా కమీషన్లు వేసారు. విద్యా కమీషన్ల గొప్ప ఆలోచనలు. 80వ దశకం వరకు కొంతమేర కొనసాగాయి. నగరాలు, పట్టణాల్లో కొన్ని మిషనరీ స్కూళ్ళు మినహాయిస్తే అన్ని ప్రాంతాల్లో కామన్ స్కూల్ విధానం పేరు చెప్పకున్నా ఆ విధానం కొనసాగింది. సరళీకృత ఆర్థిక విధానాల ప్రవేశం ఫలితంగా భారత దేశములో రెండు రకాల విద్యా విధానం అంకురార్పణ జరిగింది. ప్రభుత్వాలు విద్యను అందించడములో ద్వంద్వ విధానాన్ని కొనసాగిస్తూ క్రమంగా బాధ్యతల నుంచి తప్పుగానే చూడడం మూలంగా అదే పేదవాడి బడి, పెట్టుబడి బడి స్పష్టమైన విభజన విద్యలో కొనసాగుతూ వస్తున్నది. స్కిల్ లేబర్ తయారి కేంద్రాలుగా ప్రభుత్వ బడులు, డబ్బున్నవాడి విజ్ఞాన కేంద్రాలుగా ప్రైవేటు విద్యాసంస్థలు విలసిల్లుతున్నవి ప్రభుత్వాలు పేదల బడులకు కంటి తుడుపుగా గతంలోని జిడిపిలో 2 శాతం, 3శాతం, ప్రస్తుత సంవత్సరం 4శాతం కేటాయించారు. అరకొర వసతులతో ప్రభుత్వ విద్యారంగం కొనసాగుతున్నది. విద్యారంగంలో ఖాళీల భర్తీ చేయరు. మౌలిక వసతుల లేమి. పేదలు విద్యను అందుకోలేని అంతరం పెరిగింది.
పేద తల్లిదండ్రులకు విద్యపట్ల మక్కువ పెరిగింది. పేద కుటుంబాల పిల్లలు ఉన్నత చదువులో రాణిస్తున్నారు. ఇలాంటి సమయములో పాఠశాల విద్యను, ఉన్నత విద్యను ప్రైవేటు, కార్పొరేటుకు ధారా దత్తం చేయటం వలన పేద పిల్లలు విద్యను అందుకోలేని స్థితిలో డ్రాపవుట్స్‌గా పాఠశాలలకు దూరమౌ తున్నారు. కరోనా వ్యాప్తి ప్రారంభంలో రద్దీ వ్యాపార సంస్థలు అయిన బార్లు, హౌటళ్ళు, సినిమా హాళ్ళు మొదటగా మూసివేయలేదు. పిల్లల చదువుల గురించి, వారి భవిష్యత్ జీవితాన్ని ప్రభుత్వం కనీసం ఆలోచించకుండ పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలు మూతపడి సంవత్సరంన్నర అవుతున్నది. కరోనా కారణంగా విద్యారంగం కుంటుపడింది.
ప్రభుత్వ చర్యలు
కోవిడ్-19 నిబంధనలు పాటించి విద్యార్థులకు చదువును నేర్పాలనే ఆలోచన చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యను పూర్తిగా బందు పెట్టింది. విద్యార్థులకు విద్యను నేర్పడంలో వీలైనన్ని మార్గాలు వెతకలేక పోయాయి. కనీసం ఆలోచన కూడా చేయలేదు. యునెస్కో అన్న మాటల్లో ''విద్యా సంస్థలు మూత వేసే ఆలోచన ఇంత ముందుగా కాకుండా చివరగా ఆలోచిస్తే బాగుండేది'' అని ప్రస్తావించింది.
ప్రభుత్వ పాఠశా లలు, అందులోని తరగతి గదులు సువిశా లంగా ఉన్నాయి. ఫిజికల్ డిస్టెన్సింగ్ పాటించడానికి అనువైన స్థలాలుగా ఉన్నాయి. ప్రైవేటు పాఠశాలల్లో ఇలాంటి పరిస్థితి లేకుండా ఇరుకైన గదులుంటాయి. అయినా పాఠశాలలు నడపడానికి అవకాశమున్న మార్గాలన్నింటినీ వెతికి పాఠశాలలను ప్రారంభించే ఏర్పాటు ప్రభుత్వాలు చేయలేదు. పాఠశాలలకు అదనపు నిధులు కేటాయించలేదు. ప్రతి రోజు పాఠశాలకు హెల్త్ వర్కర్‌ను పంపించలేకపోయారు. వాష్‌రూంల పరిశుభ్రత, ఆవరణ పరిశుభ్రతకు స్కావెంజర్ పోస్టులు గత సంవత్సరం నిధులు మంజూరు చేయలేదు. ప్రతి పాఠశాలకు కొవిడ్ అదనపు నిధుల కేటాయింపులేదు. ఉపాధ్యా యులకు వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ చేయలేదు. విద్యారంగ నిపుణులతో, ఉపాధ్యాయ సంఘాలతో ఆలోచించి పాఠశాలలు ప్రారంభించే ప్రయత్నం ప్రభుత్వం కనీసం చేయలేదు. ప్రభుత్వాలు ప్రైవేటు ఒత్తిడికి లోనై పాఠశాలల ప్రారంభాన్ని విరమించుకున్నట్లు కనబడు తున్నది. పిల్లలకు అందించే మధ్యాహ్న భోజనం, ఉపకార వేతనాలు, హాస్టల్ మెస్‌లు, కొవిడ్ నిబంధనలకు కేటాయించే అదనపు నిధులు, బట్టలు, పుస్తకాలు సంబంధించి ఖర్చులు తగ్గుతాయనే ఆలోచన ప్రభుత్వం చేసింది. అనవసరపు ప్రయాస అనుకునే ప్రభుత్వాలు విద్య పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించలేక పోయాయి.
ఆన్‌లైన్ తరగతులు టిశాట్, దూరదర్శన్‌లో ప్రసారం చేసారు. 90శాతం మంది పిల్లలకు ఇంటర్‌నెట్ సౌకర్యం లేదు. 40శాతం పేదల పిల్లల దగ్గర టచ్ ఫోన్స్ లేవు. 15శాతం కుటుంబాలకు టివిలు లేవు. లేని వారికి ప్రభుత్వం ఇప్పించే ప్రయత్నం చేయ లేదు. ప్రభుత్వ వ్యవహారము చూస్తే బాధ్యతను నెరవేర్చి నట్లు చేసి చేతులు దులుపు కున్నది. ఆన్‌లైన్ ప్రసారం చేయటంలో కూడ చిత్తశుద్ధిని కనబరచలేక పోయింది. ఆన్‌లైన్ బోధన గత సం|| శూన్యమే.
ఉపాధ్యాయుల పాట్లు
పట్టణ వాసం గడుపుతున్న ఉపాధ్యాయులు పని స్థలంలో లేరు. బస్సులు, ఆటోల్లో పనిచేసే ప్రాంతానికి ప్రయణం చేయాలి. కరోనా భయం అందరిలాగే ఉపాధ్యాయుల్లో కూడా ఎక్కువగా ఉన్నది. ఏప్రిల్, మే మాసంలో పాఠశాల మరియు ఎన్నికల డ్యూటీలు చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 250 మంది ఉపాధ్యాయులు కరోనా బారినపడి విలువైన ప్రాణాలను బలివ్వవలసి వచ్చింది.
ఉపాధ్యాయులు గ్రామాల్లోని విద్యార్థుల పర్యవేక్షణలో వెళ్ళినప్పుడు 90శాతం మంది విద్యార్థులు పొలాల్లో పనికి వెళ్ళే వారు. సంబంధిత విద్యార్థికి ఫోన్ చేస్తే తండ్రి, అన్న దగ్గర ఫోన్ ఉంటుంది. పిల్లలు లేని పాఠశాలలను ఉపాధ్యాయులు వెలితిగా భావిస్తున్నారు. ఉపాధ్యాయులు పొలాల దగ్గరకు వెళ్ళితే పిల్లలు పత్తి చేలో, విత్తనాలు నాటే పనిలోనో, చెత్త తీయటంలోనో, పశువులు, జీవాల కాపరులుగానో ఉంటున్నారు. ఉపాధ్యాయులు నిస్సహాయ స్థితిలో వెనుదిరుగు తున్నారు. పిల్లలు పాడవుతున్నారనే ఆవేదనతో ప్రత్యక్ష బోధన చేస్తున్న ఉపాధ్యాయులు కూడ ఉన్నారు.
ఉపాధ్యాయులు ఆన్‌లైన్ తరగతుల నిర్వహణ పాఠశాల నుండి నిర్వహి స్తున్నారు. హాజరైన పిల్లల్లో కొందరిని విచారించగా అర్థం కాలేదనే సమాధానం చురుకైన విద్యార్థుల నుండి వస్తుంది. ఉపాధ్యాయుడు ఒక పాఠశాలలోని 10వ తరగతి 140 మంది విద్యార్థులను విచారించగా ఇద్దరు అమ్మాయిలు-15 రోజులు ఒక అమ్మాయి 30 రోజుల పాఠం విన్నట్లు తేలింది. ఈ ఉదా హరణ ద్వారా ఆన్‌లైన్ తరగతుల పరిస్థితి ఎంత ధారుణంగా ఉందో అర్థమౌతుంది. ప్రత్యక్ష బోధనే పరమావధిగా ఉపాధ్యాయులు భావిస్తున్నారు.
తల్లిదండ్రుల ఆవేదన ఫలించలేదు
తల్లిదండ్రులు అందరు ఒకే స్థాయిలో లేరు. పిల్లలకు బోధన అందడం లేదనే ఆవేదన అందరిలో ఒకటే, కానీ పొలం పని, కూలిపని చేసుకునే తల్లి దండ్రి ఆలోచన చదువు సాగడం లేదని, పిల్లవాడి చదువు పాడవుతుందనే బాధ ఓ పక్క ఉన్నా, తన ఆర్థిక వెసులుబాటుకు వారే పిల్లలను పనిలో ఉపయో గించుకుంటున్నారు. పిల్లలకు టచ్‌ఫోన్ కొనివ్వలేని ఆర్థిక స్థోమత వారిది. బడి ఉంటే బాగుండు అనే తపన మనసు నిండా ఉంటుంది. కరోనా భయం ఈ తల్లిదండ్రుల్లో తక్కువే. పిల్లలకు మాలాంటి చదువులేని దీనమైన బ్రతుకు వద్దనుకుంటున్నారు.
పట్టణాలు, నగరాల్లోని తల్లిదండ్రులు పిల్లలకు టచ్ ఫోన్స్ టివీలు అందుబాటులో ఉన్నా... ఆన్‌లైన్ తరగతులు వినలేక పోతున్నారు. పిల్లల పట్ల ఈ తల్లిదండ్రులకు నిఘా అసలే ఉండదు. ఉద్యోగులు, వ్యాపారులు, కూలీలైన తల్లిదండ్రుల పిల్లలు నిఘాలేక టచ్ ఫోన్‌లో పక్కదారులు తొక్కి సైబర్ నేరగాళ్ళ చేతిలో చిక్కుకొని వందలు, వేల మంది విద్యార్థినీలు చదువు, డబ్బు పాడు చేసుకుంటున్నారు. దేశంలో, రాష్ట్రంలోని మెట్రో నగరాల్లో వందలాది ఫిర్యాదులు ఇలాంటివి అందుతున్నాయి.
పాఠశాలలు నడవాలనే కోరికనిండుగా ఉన్నా, మరోపక్క కరోనా వైరస్ భయం తల్లిదండ్రులను వెంటాడుతున్నది. ఆన్‌లైన్ పాఠాల పేరుతో పిల్లలు పెడ ధోరణులు అవలంభి స్తున్నారని ఒకవైపు ఆందోళన చెందుతూనే, తప్పని స్థితిలో టచ్ ఫోన్ తల్లిదండ్రులు అప్ప చెప్పుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో ఆన్‌లైన్ తరగతులను అంగీకరి స్తున్నారు. ఇరుకు గదుల్లో సంసారాన్ని సాగిస్తున్న తల్లిదండ్రులు పిల్లల ఆన్‌లైన్ తరగతులకు తగాదాలు పడుతున్నారు.
పాఠశాలలు లేకపోతే పిల్లలు ఆనందంగా ఉంటారా?
నగరంలోని పిల్లలకు ఆటలు పాటలు సరదాలు కరోనా కాలంలో తక్కువైనాయి. ఎటూ వెళ్ళలేక (బంధుత్వాలు) చిన్నారుల్లో ఆందోళనలు పెరిగాయి. స్నేహితుల బంధాలు తెగాయి. మానసిక వికాసం కుంటు పడుతున్నది. బద్దకం పెరిగింది. కేవలం హైద్రాబాదులోనే కరోనా కారణంగా 10 వేల మంది పిల్లలు బాలకార్మికులుగా మారారు.
పేద విద్యార్థులకు పాఠశాల విద్యారంగంలో విద్యా బోధనతో పాటు మధ్యాహ్న భోజనం కరువైంది. అరకొర జీవనం సాగిస్తున్న పేద తల్లిదండ్రుల పిల్లలు పొలాల్లో, హౌటళ్ళలో, పట్టణాల్లో కార్మికులుగా మారిపోయారు. ఉన్నత చదువులు చదువుచున్న విద్యార్థులను యూనివర్సిటీ హాస్టళ్ళ నుండి ప్రభుత్వాలు తరిమేసాయి. వారు తల్లిదండ్రులకు భారంగా మారారు.
పిల్లలను ఉపాధ్యాయుడు తరచు అడిగే ప్రశ్నలకు కొందరు విద్యార్థులకు పాఠశాల ఇష్టం లేకపోవచ్చు. కానీ బాలలకు పాఠశాల వినోద కేంద్రం. బాల్యాన్ని అనుభవించే సరైన చోటు పాఠశాలనే. అయినా పిల్లలు పేద తల్లిదండ్రుల మాట కాదనలేక పొలం పనిలో, కూలి పనిలో, పశువుల కాపారులుగా ఉంటున్నారు. వలస జీవితాన్ని అనుభవిస్తున్నారు. బాల్యంలోనే కార్మికులుగా మారుతున్నారు. తల్లిదండ్రుల భారాన్ని దింపుకోవ టానికి మైనర్ బాలికలను 13 సం||లు నుండి 17 సం||ల మధ్య వయస్సు పిల్లలకు బాల్య వివాహాలు చేస్తున్నారు. 2020-21 కరోనా కాలంలో 693 అధికారిక కేసులు నమోదు అయ్యాయి. కరోనా కాలంలో వేలల్లో పెళ్ళిళ్ళు జరిగాయి. ఎదురు చెప్పలేని పిల్లలు విధిలేక పెళ్ళికి అంగీకరిస్తున్నారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికలపై అత్యాచారాలు పెరిగాయి. అక్రమ శారీరక సంబంధాలు, ఆడ, మగ పిల్లల్లో అధికమయ్యాయి. సెల్‌ఫోన్‌లో అవాంఛిత చిత్రాలకు బానిసలుగా మారటం, దొమ్మీలు సైబర్ నేరాల ద్వారా ఆర్థిక అవసరాలు తీర్చుకుంటున్నారు. కరోనా కాలంలో కొందరు పిల్లలు శాశ్వత కార్మికుడుగా మారిపోయారు. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారారు.
కరోనా సమయంలో మాఫియాలు (కమీషన్ ఏజెంట్లు) మంచి అదనుగా చేసుకొని చీకటి వ్యాపారం కొనసాగిస్తున్నారు. నగరంలో గాజుల పరిశ్రమ, హౌటళ్ళు, వ్యర్థాల సేకరణకు, యాచనకు పిల్లలను ఉపయోగిస్తున్నారు. ఇటుక బట్టీిలు, దాబా లలో రాత్రిపూట కార్మికులుగా పని చేయించుకుంటున్నారు. సరైన ఆహారం, నిద్ర, బట్టలు లేక దారుణ పరిస్థితుల్లోకి నెట్టబడ్డారు. అక్రమ రవాణా మాఫియా వలన 73,138 బాలలు అదృశ్యమైనారు. బాలల అక్రమ రవాణా కరోనా కాలంలో 75 వేల నుండి లక్షదాకా పెరిగినట్లు నివేదికలు చెప్తున్నాయి.
కరోనా కారణంగా ఒకటిన్నర సంవత్సర కాలంగా బాలల చదువు, బాల్యం వారి భవిష్యత్ జీవితం చిధ్రమైనట్లు స్పష్టం గానే కనబడుతున్నది. వైరస్‌కు ఇప్పట్లో అంతం కనిపంచడం లేదు. పిల్లల చదువు గురించి ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించటం లేదు. పాఠశాలలను మూసివేత ఆలోచన మాత్రమే చేసాయి. ఆన్‌లైన్ బోధన ఏ స్థాయి పిల్లలకైనా ఆమోదయోగ్యంగా కనిపించడం లేదు. ఆఫ్‌లైన్‌లో పాఠశాలలు ప్రారంభించడానికి ప్రభుత్వం అన్ని మార్గాలను వెతకాలి. కరోనా మొదటి, రెండవ దశలో జరిగిన విద్యానష్టం, ఆర్థిక లోటు అపారమైనది. విద్య నిలుపుదల దేశ భవిషత్ అభివృద్ధికి ఆటంకంగా మారనుంది.
ప్రభుత్వాలు తక్షణం విద్యానిపుణులు, మేధావులతో సమాలోచనలు చేయాలి. పాండమిక్‌లో విద్యకు అదనపు బడ్జెట్ కేటాయించాలి. తల్లిదండ్రులకు విశ్వాసాన్ని కలిగించే స్థాయిలో కోవిడ్ జాగ్రత్తలు, సంబంధిత ఏర్పాట్లు చేయాలి. కొవిడ్ నిబంధనలకు సరిపడని భవనాల నుండి పాఠశాలలను మార్చాలి. విశాలమైన గదులు, హాళ్ళు అందుబాటులో ఉన్న వాటిని పాఠశాలలుగా ఎంచుకోవాలి. బోధనా సిబ్బందిని పెంచాలి. ప్రతి గ్రామవాడలలో మినీ గ్రూపు పాఠశాలలు ఏర్పాటు చేయాలి. ఉన్న తరగతి గదులను భౌతిక దూరాన్ని పాటించి నడుపగలిగే సంఖ్యను మాత్రమే ప్రతిరోజు పాఠశాలకు పిల్లలను రప్పించాలి.
పాఠశాలలపై ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలి. గ్రామాల్లో పిల్లలకు గ్రామంలోనే బోధన, వాడలో పిల్లలకు వాడలోనే బోధన జరగాలి. ప్రైవేటు పిల్లలలాగే ప్రభుత్వ పాఠశాల పిల్లలకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయాలి. ఆన్‌లైన్ బోధన తప్పనిసరైనపుడు పర్యవేక్షకుల సమక్షములోనే బోధన జరగాలి. ప్రభుత్వమే ప్రత్యేకంగా పర్యవేక్షకులను నియమించాలి. ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల టీచర్లనందరిని విద్యకు ఉపయోగించుకోవాలి.
ప్రత్యేక జాగ్రత్తలు
ప్రతి బోధనా స్థలంలో థర్మల్ గన్స్, శానిటైజర్, మాస్క్‌లు, భౌతిక దూరాన్ని పాటించేందుకు ఆరోగ్య కార్యకర్తల పర్యవేక్షణ అవసరము. సంబంధిత మందులు అందుబాటులో ఉంచాలి. అత్యవసరానికి ఐసోలేషన్ గది అందుబాటులో ఉంచాలి. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు పౌష్టికాహారాన్నిచ్చి కాపాడే బాధ్యత ప్రభుత్వానిదే. ప్రభుత్వ పాఠశాలల్లో మూడు పూటలు ఉదయం, సాయంత్రం స్నాక్స్ (సిరి ధాన్యాలు, గుడ్లు, పండ్లు, ఇతర అల్పహారం ఏర్పాటు) మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలి. తల్లిదండ్రులే గురువులుగా మారి పిల్లల్లో మానసిక, శారీరక దృఢత్వాన్ని పెంచాలి. ఉపాధ్యాయులందరికీ వ్యాక్సిన్ వేయాలి. ప్రతి పాఠశాలలో స్కావేంజర్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. అరికట్టాలి. భయపెట్టించడం కన్నా భద్రత కల్పించే బాద్యతను ప్రభుత్వాలు గుర్తించాలి. కరోనా కారణంగా పిల్లల మరణాలు మన దేశంలో కేవలం 0.2 మాత్రమే. అందుకోసం పాఠశాలలు ఆఫ్‌లైన్ పద్ధతిలో నిర్వహించటం అంత ప్రమాదకరంగా కనిపించడంలేదు. విద్యార్థులు ఎక్కువ ఉన్న పాఠశాలల్లో షిప్ట్ సిస్టం తరగతులు నిర్వహించాలి. ఆన్‌లైన్ తరగతులే శరణ్యం అయినప్పుడు ప్రతి విద్యార్థికి సెల్ ఫోన్, డాటా, నెట్ సౌకర్యం ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి. విద్యను నేర్పడంలో కోర్టులకు సమాధానం చెప్పలేని దయనీయస్థితిలో ప్రభుత్వాలు ఉండకూడదు. కరోనా నష్టం కన్న చదువు నేర్పలేని నష్టం అపారమైనది. దీని నివారణ బాధ్యత పాలకులదే.
- కె.జంగయ్య
ఉపాధ్యాయ సంఘ నాయకులు
Sun 27 Jun 02:47:59.248019 2021