సృజనను కూడా నియంత్రించాలనే ఆలోచన, ప్రశ్నలు తలెత్తకుండా చేసే యోచన, సత్యం ఎక్కడ చిత్రించబడుతుందోనన్న ఆందోళన, వాస్తవాలు ఎరుక పడతాయనే భయం, చైతన్యం పెరుగుతుందనే వణుకు కళలకు హద్దులు గీస్తోంది. స్వేచ్ఛలోనే సృజన రెక్కలు విప్పుతోంది. అలాంటి కళా సృజనను నియంత్రించే ప్రయత్నానికి తెర లేపిందది ప్రభుత్వం. ఇది ముమ్మాటికీ భావ ప్రకటనా స్వేచ్ఛను నిరోధిస్తుంది. దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం వుంది.
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కొత్తగా తీసుకొచ్చిన సినిమాటోగ్రఫీ సవరణ చట్టం 2021 ముసాయిదా సజనాత్మకతను, ప్రతిభను అణచివేసే విధంగా వుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతత్వంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్ట సవరణతో సినిమా వాళ్ల భావ ప్రకటన స్వేచ్ఛను హరించి వేయడమే కాకుండా వాళ్ల గొంతు నొక్కడమే అవుతుంది.
సినిమాటోగ్రఫీ చట్టం 1952యాక్ట్‌పై కేంద్ర ప్రభుత్వం సవరణలు తీసుకురాబోతోంది. దీంతో సినిమాలపై కత్తెర పెత్తనం కేంద్రం దగ్గర కూడా ఉండనుంది. 1952లో చేసిన సినిమాటోగ్రఫీ చట్టాన్ని సవరించాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం ఇందుకు 2013లో జస్టిస్ ముఖల్ ముగ్దల్ నేతత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. 2016లో శ్యామ్ బెనగల్ నేతత్వంలో మరో కమిటీని నియమించి సినిమా ప్రదర్శనలకు అవసరమైన ధ్రువీకరణపై అధ్యయనం చేయాల్సిందిగా సూచించగా, ఈ రెండు కమిటీలు తమ నివేదికను కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖకు సమర్పించాయి. ఈ కమిటీల నివేదికలను పరిశీలించిన కేంద్రం సినిమాటోగ్రఫీ చట్టం 2021 ముసాయిదా బిల్లును రూపొందించింది.
ముసాయిదా బిల్లులోరూపొందించిన అంశాలు
1. సవరణల ప్రతిపాదనలపై జులై 2వరకు అభిప్రాయాలను తెలపాలని కోరుతూ జూన్ 18న కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటన ఇచ్చింది. చట్టంలో సవరించాలని భావిస్తున్న ప్రతిపాదనలు అందులో వివరించింది. జారీ చేసిన ధ్రువపత్రాలను పునఃపరిశీలించాలని కేంద్రీయ చలన చిత్ర ధ్రువీకరణ సంస్థ ఛైర్మన్‌ను ఆదేశించే అధికారం కేంద్రానికి ఉండేలా చట్టాలను సవరిస్తామని ప్రతిపాదించింది. సినిమా ప్రదర్శనలకు జారీ చేసే యు, ఏ, యుఏ, ఎస్ సర్టిఫికెట్లతో పాటు యూఏ సర్టిఫికెట్‌కు అదనంగా మరిన్ని మార్పులను ప్రతిపాదించింది.
2. యూఏ సర్టిఫికెట్ 1983లో చేసిన సవరణలకు అనుగుణంగా ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి మార్పులు చేయలేదు. తల్లిదండ్రుల అనుమతితో 12 ఏళ్ల లోపు వారు సినిమా చూసే అవకాశం ఆ సర్టిఫికేట్ ఇస్తుంది. అయితే దీనికి మార్పులు చేసి 7 ఏళ్లు, 13 ఏళ్లు, 16 ఏళ్లు పైబడిన వారు చూసేలా.. మూడు విభాగాలుగా విభజించింది కొత్త సవరణ.
3. సర్టిఫికేషన్ కాలపరిమితి 10 ఏళ్లు చెల్లుబాటు ఉండగా. ఉత్తర్వుల ద్వారా ఆ కాలపరిమితిని రద్దు చేశారు. దానికి అవసరమైన చట్ట సవరణలను చేయనున్నట్లు తెలిపింది.
4. పైరసీ వల్ల సినీపరిశ్రమ తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో దీనికి అడ్డుకట్ట వేయడానికి ఇప్పటి వరకు సరైన చట్టం లేదని గ్రహించారు. సినిమా పైరసీకి పాల్పడితే కనిష్ఠంగా 3 నెలలు, గరిష్ఠంగా 3 ఏళ్ల జైలుశిక్షతోపాటు రూ.3 లక్షల జరిమానా విధించనున్నారు. సినిమా నిర్మాణ వ్యయంలో 5 శాతం డబ్బును జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది.
గత జూన్ నెల 18వ తేదీన సినిమాటోగ్రఫీ 2021 చట్టానికి సవరణలు ప్రతిపాదించిన కేంద్రం, 1952 నాటి చట్టానికి మార్పులు చేసి తొలుత గత యేడాది ఫిబ్రవరి 12వ తేదీన రాజ్యసభలో ప్రవేశపెట్టింది. ఆ తర్వాత గతనెలలో లోక్‌సభ ఆమోదించగా, రాష్ట్రపతి సంతకంతో ఈ బిల్లు చట్టంగా రూపొందింది. ఈ చట్టంలో కొత్తగా చేసిన సవరణల ప్రకారం, ఒక చిత్రానికి కేంద్ర సెన్సార్ బోర్డు సెన్సార్ చేసి సర్టిఫికెట్ మంజూరు చేసిన తర్వాత కేంద్రం మళ్ళీ సెన్సార్ చేయాలని కోరే అవకాశం ఉంది. అంటే, ఇంతకాలం స్వతంత్రంగా వ్యవహరిస్తూ వచ్చిన సెన్సార్ బోర్డు కంటే కేంద్రానికి పూర్తి అధికారం ఉంటుంది. అదేసమయంలో ఒక చిత్రంలోని సన్నివేశాలు లేదా కథని కాపీ కొట్టినట్టయితే జైలు శిక్షతో పాటు అపరాధం విధించవచ్చు. ఇలాంటి అనేక నిబంధనలు ఈ కొత్త చట్టంతో అమల్లోకి వచ్చాయి.
వాక్స్వాతంత్య్రాన్ని హరించేలా
సినిమాటోగ్రాఫ్ చట్టానికి తాజా సవరణ తన రాజకీయ ప్రయోజనాలకు హానికరమని భావించే సినిమాలను అణిచి వేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి అధికారాన్ని ఇస్తుంది. మరీ ముఖ్యంగా, ఈ జోక్యాలు భారతదేశంలో మూవీ మేకింగ్‌కు ఆర్థికంగా ప్రత్యక్షంగా హాని కలిగిస్తాయి ఎందుకంటే సినిమా ఆదాయాలు థియేట్రికల్ విడుదలలపై ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. ఒక సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాతే ఆ చిత్ర నిర్మాతకు వారి పెట్టుబడికి రాబడి లభిస్తుంది. సినిమా విడుదలలో ఆలస్యం అవ్వడం వల్ల నిర్మాతకు గణనీయమైన నష్టం జరుగుతుంది. అయితే, ఈ కొత్త చట్టంపై కేంద్ర సమాచార, ప్రచార మంత్రిత్వ శాఖ మాత్రం మరోలా చెబుతోంది. దొంగతనంగా సినిమాలు విడుదల చేయడానికి అడ్డుకట్ట వేయవచ్చని.. కేంద్రానికి, చిత్ర పరిశ్రమకు ఏర్పడే భారీ నష్టాన్ని నివారించవ్చని ఇలాంటి ప్రతి కూల అంశాలన్నింటిని గాడిలో పెట్టవచ్చని వాదిస్తోంది. దేశ భద్రతను దెబ్బ తీయడంతో పాటుగా శాంతి భద్రతలకు విఘాతం కల్గించే చిత్రాలను నిరోదించేందుకు అని చెప్తుంది. కానీ, సినీ పరిశ్రమకు చెందిన వారు మాత్రం ఈ చట్టం వాక్ స్వాతంత్య్రాన్ని హరించేలా ఉందని వాపోతున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా గుర్తింపు పొంది, అనేక అంతర్జాయతీ వేదికలపై గొప్ప గౌరవ మర్యాదలు పొందుతున్న భారత్, స్వదేశీయంగా మాత్రం వాక్స్వాతంత్య్రపు హక్కును హరించేలా చట్టాలు చేస్తూ సర్వాధికార ప్రభుత్వంగా నడుచుకుంటోందని వారు ఆరోపిస్తున్నారు.
కేంద్రం ఏమంటోంది?
సినిమా ప్రదర్శనల ధ్రువీకరణ పత్రం జారీ విషయంలో అధికారాలు ప్రస్తుత చట్టంలో సెక్షన్ 6లో ఉండేవి. 2000 సంవత్సరంలో కర్ణాటక హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఒకసారి సినిమా సర్టిఫికేట్ జారీ చేశాక ఆ తర్వాత కేంద్రం జోక్యం చేసుకోరాదని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించింది. అదే సందర్భంలో కేంద్రం జోక్యం చేసుకోవాలంటే దానికి తగిన చట్టాలు ఉండాలని అభిప్రాయపడింది. ఐతే.. ఈ కొత్త చట్టంపై కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ స్పందించింది. ఈ కొత్త చట్టంతో దొంగతనంగా సినిమాలు రిలీజ్ చేయకుండా అడ్డుకోవ చ్చన్నారు. పైరసీ చేసినవాళ్లను చట్టం ప్రకారం శిక్షించవచ్చని చెప్పుకొచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్‌కు, సినీ పరిశ్రమకు ఏర్పడే భారీ నష్టాలను దీంతో భర్తీ చేసుకొని గాడిలో పెట్టవచ్చన్నారు. అలాగే దేశ సార్వభౌమత్వాన్ని, భద్రతను దెబ్బతీయడంతోపాటు శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా సినిమాలు ఉంటున్నాయంటూ తరుచూ కేంద్రానికి ఫిర్యాదులు వస్తున్నాయని, దేశసార్వభౌమత్వం, విదేశాలతో స్నేహపూర్వక సంబంధాలు, అంతర్గత భద్రత విషయంలో భావప్రకటన స్వేచ్ఛకు సహేతుక ఆంక్షలు ఉండొచ్చునని రాజ్యాంగం స్పష్టం చేస్తోందని కేంద్రం చెబుతోంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని సినిమాటోగ్రఫీ చట్టంలో సవరణలు చేస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో దీన్ని ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తోంది. అయితే దీనిపై నిరసన గళం ఎత్తారు కొందరు సినీ ప్రముఖులు.
చట్ట సవరణపై సినీ వర్గాల అభ్యంతరం
సినిమాటోగ్రఫీ చట్టం-1952ను సవరిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై భారతీయ చిత్ర పరిశ్రమ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ సినిమాటోగ్రఫీ సవరణ చట్టంపై బాలీవుడ్‌తో పాటు కోలీవుడ్ పరిశ్రమలకు చెందిన అనేక మంది దర్శకులు, నటీనటులు తీవ్రంగా మండి పడుతున్నారు. ప్రజలను రక్షించడం కోసం చట్టం ఉండాలి గాని వారి గొంతు నొక్కడం కోసం కాదంటున్నారు. బాలీవుడ్‌కు చెందిన అనురాగ్ కశ్యప్, నందితాదాస్, ఫర్హాన్ అఖ్తర్, తమిళ దర్శకుడు వెట్రిమారన్‌తో పాటు 1400 మందికిపైగా సినీ ప్రముఖులు తమ నిరసనను తెలుపుతూ కేంద్రానికి లేఖ రాశారు. ఒక చిత్రాన్ని సెన్సార్ చేసిన తర్వాత మళ్ళీ సెన్సార్ చేయాలని ఆదేశించే అధికారం కేంద్రానికి ఉండటం అనేది వాక్స్వాత్రంత్యపు హక్కును హరించేదిగా ఉందని పలువురు హీరోలు, దర్శకనిర్మాతలు ఆందోళన వ్యక్తంచేశారు.
ఈ నేపథ్యంలో తమిళ నిర్మాతల సంఘం అధ్యక్షుడు మురళి, నటుడు కార్తి, నటి, దర్శకురాలు రేవతి తదితరులు స్టాలిన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. దీంతో ముఖ్యమంత్రి స్టాలిన్ మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి సినిమాటోగ్రఫీ సవరణ చట్టం గురించి చర్చించి. చట్ట సవరణను వ్యతిరేకిస్తూ తీర్మానం చేశారు. అదే విషయాన్ని కేంద్రమంత్రి కి లేఖ రాశారు.సినిమా ప్రదర్శనలకు కేంద్రీయ చలన చిత్ర ధ్రువీకరణ సంస్థ (సి.బి.ఎఫ్.సి) జారీ చేసే ధ్రువపత్రాల అధికారం. కేంద్రం అధీనంలోకి తీసుకుంటూ చట్టాన్ని రూపొందించాలన్న నిర్ణయం సరి కాదని, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మన్ననలు అందుకుంటున్న భారత దేశంలో వాక్ స్వాతంత్రపు హక్కు హరించేలా ఈ చట్టం ఉందంటున్నారు. పైగా ఈ సవరణలు కోర్టు తీర్పులకు వ్యతిరేకం అన్నారు. అందువల్ల వెంటనే ఈ చట్టాన్ని వీలైనంత తొందరలోనే ఉపసంహరించుకోవాలని సినీ ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు. ఇది భావప్రకటన స్వేచ్ఛను హరించడమేనని బాలీవుడ్‌కు చెందిన అనురాగ్ కశ్యప్, ఫర్హాన్ అఖ్తర్, నందితా దాస్, షబానా అజ్మీ, ఆమీర్ ఖాన్, తమిళ డైరెక్టర్ వెట్రిమారన్ నటులు కమలహాసన్, సూర్య, కార్తీ, విశాల్, రేవతితో పాటు ప్రకాష్ రాజ్, రాంగోపాల్ వర్మ లాంటి వారు అభిప్రాయపడుతున్నారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా వీరు తమ నిరసన గళాన్ని ట్విట్టర్ వేదికగా తెలుపుతు, సోషల్ మీడియా వేదికగా యుద్ధమే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం సినిమాటోగ్రఫీ చట్టంలో ఎలాంటి మార్పులు చేయనుంది అనేది ఆసక్తికరంగా మారింది.
సవరణలపై అభిప్రాయాలు కోరుతూ నోటిఫికేషన్
సినిమాటోగ్రాఫ్ చట్టం, 1952 యాక్ట్‌లో ఈ ప్రతిపాదిత సవరణలపై అభిప్రాయాలు కోరుతూ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ గత నెలలో ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. సినిమాలను వర్గీకరించే విధానంలో అనేక సవరణలు సూచించిన, ముఖ్యంగా మూడు సవరణలు ఆక్షేపణీయంగా ఉండడం సినిమా వాళ్ళ వ్యతిరేకతకి కారణమయ్యింది. మొదట, ప్రతిపాదిత సవరణలు భారతదేశంలోని చిత్రాలపై కేంద్ర ప్రభుత్వానికి మరింత నియంత్రణను ఇవ్వనున్నాయి. ఇది సజనాత్మక స్వేచ్ఛకు ముప్పు కలిగిస్తుంది. రెండవది, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సిబిఎఫ్‌సి) కోసం ఒక బలమైన యంత్రాంగాన్ని కలిగి ఉన్నటువంటి సెన్సార్ బోర్డ్ సెన్సార్ చేసి సర్టిఫికెట్ మంజూరు చేసిన తర్వాత కేంద్రం మళ్ళీ సెన్సార్ చేయాలని కోరే అవకాశం ఉంది. అంటే, ఇంతకాలం స్వతంత్రంగా వ్యవహరిస్తూ వచ్చిన సెన్సార్ బోర్డు కంటే కేంద్రానికి పూర్తి అధికారం ఉంటుంది. ఇదిలావుంటే, భారతదేశంలో సెన్సార్ ప్రక్రియ ఇతర దేశాల కంటే చాలా కఠినమైనది అని శ్యామ్ బెనెగల్ కమిటీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ 2016 నివేదిక ప్రకారం. సిబిఎఫ్‌సి పాత్రను ఫిల్మ్ వర్గీకరణకు పరిమితం చేయాలని, ఇది సెన్సార్ బోర్డుగా పనిచేయకూడదని కూడా సిఫారసు కూడా చేసింది. ఇక మూడవది, ప్రభుత్వం చట్ట సవరణకు సంప్రదింపులు జరపడం కోసం తగిన సమయాన్ని ఇవ్వకపోవడంతో పాటు ప్రతిపాదిత మార్పులు సిబిఎఫ్‌సి సంస్కరణలపై నిపుణుల రెండు కమిటీల నివేదికల సూచనలను విస్మరించి, నోటిఫికేషన్ జారీ చేసిన 14 రోజుల్లోగా ఐ అండ్ బి మంత్రిత్వ శాఖ అభిప్రాయాలను, సూచనలను కోరడం విమర్శలకు దారితీసింది.
మారిన సెన్సార్ బోర్డ్ నిబంధనలు
ఈ కొత్త చట్టం ప్రకారం ఒక సినిమాకు కేంద్ర సెన్సార్ బోర్డ్ సెన్సార్ చేసి సర్టిఫికేట్ జారీ చేసిన తర్వాత ఎవరైనా ఈ సినిమాపై ఫిర్యాదు చేస్తే.. కేంద్రం మళ్లీ సెన్సార్ చేయమని కోరవచ్చు. దీంతో ఇప్పటి వరకు స్వతంత్య్ర వ్యవస్థగా ఉన్న సెన్సార్ బోర్డ్ పై ఇక కేంద్ర ప్రభుత్వం పెత్తనం పెరుగుతోందనే ఆరోపణలున్నాయి. అంతేకాదు ఒక సినిమాలోని సన్నివేశాలు లేదా కథని కాపీ కొట్టినట్టు తేలితే.. జైలు శిక్షతో పాటు అపరాధం విధించవచ్చు. ఇలాంటి నిబంధనలు ఈ కొత్త చట్టంతో అమల్లోకి వచ్చాయి. సినిమా సెన్సార్ సర్టిఫికెట్ జారీలో సవరణలు చేయాలని భావించిన కేంద్రం ఆదిశగా సన్నాహలు మొదలుపెట్టింది. అవసరమైతే సినిమా సెన్సార్ సర్టిఫికెట్ పున:పరిశీలన కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండేలా చట్ట సవరణ చేస్తూ బిల్లును రూపొందించింది. దీంతో కేంద్ర నిర్ణయం పట్ల యావత్ సినీపరిశ్రమ నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
-పొన్నం రవిచంద్ర, 9440077499
సీనియర్ జర్నలిస్టు, సినీ విమర్శకులు
Sun 11 Jul 07:34:56.645127 2021