- టి. శశికళ
ఈ నల్లని రాళ్లలో... ఏ కన్నులు దాగెనో ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెనో ...అన్నాడో కవి...
కఠిన శిలను కనికరం లేకుండా తొలిచేస్తే ఇదిగో ఇలా సుకుమార సుందర శిల్పాంగనీలు చెక్కు
చెదర కుండా చిక్కుతాయి... మనం చూస్తున్న ఈ నూనె నునుపు శిల్పాలు రామప్ప గుడిలోనివే...
హైటెక్ యుగంలో కూడా రాతిని ఇంత కోమలంగా మలచడం సాధ్యం కాదేమో...
అలాంటిది ఎనిమిది వందల ఏండ్ల క్రితమే ఈ ఆలయంలో నునుపైన నూనె తేలే బుగ్గలను
శిల్పి ఎలా చెక్క గలిగారో ....
రామప్ప దేవాలయం చూడటం అంటే ఒక ఆధ్యాత్మికం కాదు... వైజ్ఞానికం... రామప్ప దేవాలయం ఒక విజ్ఞాన భాండాగారం... కేవలం శిల్పకల గురించే కాదు...నాట్యం గురించి, వాయిద్యాల గురించి ఆ కాలపు ఆహార్యం గురించి తెలుసు కోవడం... చారిత్రక కట్టడాలు... కట్టించిన రాజుల పేరు మీదనో రాజ వంశస్థుల పేరు మీదనో...ఆ ఆలయంలో కొలువైన దేవుడి పేరు మీదనో శాశ్వతంగా ఉండిపోతాయి... కాని ఈ ఆలయం రామప్ప గుడి నిర్మించిన శిల్పిపేరు మీద చిరస్థాయిగా చరిత్రలోకి ఎక్కింది....
ఆలయ నిర్మాణం...
కాకతీయ చక్రవర్తి గణపతిదేవుని వద్ద సైన్యాధ్యక్షుడిగా పనిచేసిన రేచర్ల రుద్రుడు 1213వ సంవత్సరంలో రామప్ప ఆలయాన్ని నిర్మించారు. దాదాపు నలభై ఏండ్ల పాటు
నిర్మాణ పనులు సాగాయి. రామప్ప అనే శిల్పి ఆలయాన్ని నిర్మించారు. ప్రధాన గుడితో పాటు అనుబందంగా కామేశ్వర, కాటేశ్వర, త్రికూట, త్రిపురాలయం వంటి 20 అనుబంధ ఆలయాలు నిర్మించారు.కాకతీయుల సామ్రాజ్యంలో ఎన్నో అద్భుత ఆలయాల నిర్మాణం జరిగినా రామప్ప ఎంతో ప్రత్యేకమైనది. ఆలయం నిర్మాణంలో ఎక్కువగా ఎర్ర ఇసుకరాయిని వినియోగించారు. కీలకమైన ద్వార బంధాలు, స్తంభాలు, పైకప్పు, మదనిక, నాగనిక శిల్పాలు, నంది విగ్రహం, గర్భాలయంలోని శివలింగాలకు మాత్రం అత్యంత కఠినమైన బ్లాక్ డోలరైట్ (నల్లశానపు) రాయిని వాడారు. కాకతీయుల సామ్రాజ్యం పతనం తరువాత 1323లో ఈ ఆలయం మూతపడింది తరువాత 600 ఏండ్లకు నిజాం ప్రభుత్వ హయాంలో 1911లో గుడికి మరమ్మతులు చేశారు.
ఇసుకపై ఈ గుడి నిర్మించారు.
పునాది లేకుండా నేరుగా ఇసుకపై ఈ గుడి నిర్మించారు. నేల నుంచి ఆరు అడు గులు ఎత్తున్న నక్షత్రాకార మండపంపై ప్రధాన ఆలయాన్ని నిర్మిం చారు. వాన నీళ్లు ఐదారు అడుగుల దూరం పడేలా పైకప్పులో ప్రత్యేకంగా రాతిచూరు ఏర్పాటు చేశారు. దాని అంచుల్లో ఉన్న ప్రత్యేక నగిషీల మీదుగా వాన నీళ్లు దూరంగా పడతాయి. ఈ ఆలయ ఆసక్తికర విషయం ఏమిటంటే ఆలయ గోపుర నిర్మాణంలో వినియోగించిన ఇటుకలు ఎంతో తేలికగా, నీటిపై తేలియాడే విధంగా ఉంటాయి. గర్భ గుడిలో నాలుగు నల్లరాతి స్థంబాలను ఏర్పాటు చేశారు.వీటి మీద సూర్యకిరణాలు పడి గర్భగుడిలోకి నేరుగా వెలుతురు పడుతుంది. గర్భగుడిలో పగలంతా వెలుతురుగా ఉంటుంది. గర్భాలయ ప్రవేశానికి పక్కనే గోడకు చెక్కిన వేణుగోపాలస్వామి విగ్రహాన్ని సున్నితంగా మీటితే సప్తస్వరాలు వినిపిస్తాయి.
ఆలయంలో ఉన్న భారీ రాతి స్తంభాలు, మదనిక, నాగనిక శిల్పాలు అద్దం వంటి నునుపుతో ఉంటాయి. ఎలాంటి యంత్రాలు లేని ఆ కాలంలో రాళ్లను అద్దాల్లా చెక్కడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ముఖ్యంగా రంగ మండపం మధ్యనున్న నాలుగు స్తంభాలు, దూలాలు, కప్పు రాళ్లలో అద్దం చూసినట్టుగా మన ప్రతిబింబం కనిపిస్తుంది.
ఇక్కడ ఆగేయ స్తంభంపై అశ్వపాదం, నాట్యగణపతి, శృంగార భంగి మలో ఉన్న దంపతులు, సైనికుడు అతని భార్య, నాట్య గత్తెల చిత్రాలున్నాయి. నైరుతి స్తంభంపై నాట్యగత్తెలు, రతీ మన్మథ, సాగరమథనం దృశ్యాలు, వాయవ్య స్తంభంపై గోపికా వస్త్రాపహరణం, నాటగాళ్లు, ఈశాన్య స్తంభంపై నగిషీలు కనిపిస్తాయి. దూలాలపై శివ కల్యాణ సుందరమూర్తి, బ్రహ్మవిష్ణువుల మధ్య నటరాజు, ఏకాదశ రుద్రులు, త్రిపుర సంహార మూర్తి, నందీశ్వర, బ్రహ్మ, విష్ణు దిక్పాలకులు, సప్త ఋషులు, గజాసుర సంహారమూర్తి, అమృత కలశానికి అటూ ఇటూ దేవతామూర్తులు వంటి చిత్రాలు ఉన్నాయి.
ఆలయ గోడలపై ఓ శిల్పం విదేశీ వస్త్రధా రణతో చిత్రంగా కనిపిస్తుంది. ఆ కాలంలో వచ్చిన విదేశీ పర్యాటకుల వేషధారణ ఆధారంగా ఆ శిల్పాన్ని చెక్కారన్న అభిప్రాయం ఉంది. హైహీల్స్‌ను పోలిన చెప్పులు ధరించిన ఓ యువతి శిల్పం, తల వెంట్రుకలను మలిచిన తీరు, చెవులకు పెద్దసైజు దిద్దులు అబ్బురపరుస్తాయి. గర్భ గుడిలో ఉన్న స్థంబాలు మొత్తం ఒక్కో స్తంభానికి ఉన్న మొత్తం అద్భుత శిల్పకళా విన్యాసం మనల్ని ఆశ్చర్య పరుస్తుంది. ఈ శిల్పరీతిలో అంచనాలకు అందని అద్భుతాలు ఉంటాయి. ఆలయ నిర్మాణకాలాం నాటి సంస్కృతిక సంప్ర దాయాలకు నిలువుటద్దం ఈ శిల్ప శాసనాలు.
భారీ గండ శిలల శిల్పాలు, నగిషీలను వాడినందున మరింత బరువు పడకూడదని.. ప్రపంచంలో ఎక్కడా లేనట్టుగా నీటిపై తేలే ఇటుకలను గోపుర నిర్మాణంలో వాడారు. ఆలయ నిర్మాణానికి ఆనాడు ఉపయోగించిన సాంకేతికత నిజంగా ప్రతి ఒక్కరినీ అబ్బురపరుస్తుంది. ఈ గుడి నిర్మాణం సాంకేతికతను ''శాండ్ బాక్స్ టెక్నిక్'' అంటారు. గుడిని ప్రధానంగా ఎర్ర ఇసుకరాయి (రెడిష్ శాండ్ స్టోన్)తో నిర్మించారు. బయటి భాగాల్లో నల్లరాయి వాడారు.
శాండ్‌బాక్స్ టెక్నాలజీతో...
ఉమ్మడి వరంగల్ జిల్లాలో నల్లరేగడి నేలలు ఎక్కువగా ఉన్నందున ఎక్కువ బరువు వుండే రాతి నిర్మాణాలు ఈ నేలలో తట్టుకోలేవు. అందుకే నేల స్వభావాన్ని దృష్టిలో పెట్టుకొని కాకతీయుల కాలం నాటి శిల్పులు ప్రత్యేకంగా ఇంజనీరింగ్ నైపుణ్యం ప్రదర్శించారు. దీన్నే నేటి ఇంజనీర్లు 'శాండ్ బాక్స్ టెక్నాలజీ'గా పిలుస్తున్నారు. ఆలయం నిర్మాణ స్థలంలో 3 మీటర్ల లోతు పునాది తవ్వి అందులో పూర్తిగా ఇసుకను నింపారు. ఈ ఇసుక ఎప్పుడూ తడిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ తరువాత ఇసుకపై రాళ్ళను పేర్చుకుంటూ పోయి నక్షత్రాకార మండంపై నిర్మించారు భూకంపాలు సంభ వించినప్పుడు ఆలయ నిర్మాణం దెబ్బతినకుండా ఇది దోహదపడు తుందని చెబు తారు.. భూకంపాలను తట్టు కునేలా దీన్ని నిర్మించడం విశేషం.. ఇటీవల వేయి స్తంభాల గుడి పునర్ నిర్మాణం కోసం ఆలయ పునాదు తొలగించినపుడు ఈ టెక్నాలజీ బయటపడింది.
నీటిలో తేలియాడే ఇటుకలు
నేల స్వభావాన్ని బట్టి ఆలయ బరువును తగ్గించేందుకు అత్యంత తేలికైన ఇటుకలను తయారు చేశారు. సాధారణ నిర్మాణంలో వాడే మట్టి ఇటుకలకు 2.2. సాంద్రత ఉంటుంది. రామప్ప గోపురానికి వాడిన ఇటుకలు 0.8 సాంద్రత కలిగి ఉంటాయి. అందుకే ఇవి తక్కువ బరువు ఉండి నీళ్ళలో తేలుతాయి. బంకమట్టి, తుమ్మ చెక్క, కరక్కాయ తొక్కలు, వట్టివేళ్లు, ఊక తదితరాల
మిశ్రమాన్ని పోత పోసి కాల్చి ఈ ఇటుకలను తయారు చేశారు. కప్పు వరకు రాతితో నిర్మించి మూడంతస్తుల శిఖరాన్ని ఇటుకలతో కట్టారు. ఇలాంటి ఇటుకలతో దేశంలో మరెక్కడా నిర్మాణాలు లేవని చరిత్రకాలు చెబుతున్నారు.
ఆకట్టుకునే మదనికలు
రామప్ప గుడి నలువైపులా ఉన్న మదనికలు శిల్పాలు (నాగిని శిల్పాలు) చూపరులను ఎంతో ఆకట్టుకుంటాయి. వీటిని నల్ల గ్రానైట్ రాయిపై చెక్కారు. ఆలయం లోపల నాట్య మంటపం ఆనాటి శిల్ప కళా వైభవానికి నిదర్శనం, స్తంభాల నుంచి పైకప్పు మధ్యలో ఉన్న నల్లరాతిలో చెక్కిన నాట్య భంగిమలు... మండపం పైకప్పు లోపలి భాగంలో చెక్కిన సూక్ష్మ శిల్పాలు, బయటి గోడలపైనా, స్తంభాలపైనా ఉన్న వివిధ శిల్పాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుం టాయి. నల్లరాయి, ఎర్ర ఇసుక ఇటుకల మేళవింపు ఈ గుడి. గర్భగుడి ముందుండే మండపంలో అద్భుత శిల్పకళ ఉంటుంది.
శిల్పాల నుంచి నాట్యం పుట్టింది!
ఈ గుడిపై ఉండే శిల్ప భంగిమలను ఆధారం చేసుకుని అంతరిం చిపోయిన పేరిణి శివతాండవం అనే నృత్యాన్ని తిరిగి పునరుద్ధరించారు నట రాజ రామకష్ణ. జాయప సేనాని రాసిన నృత్య రత్నావళిలోని కొన్ని భంగిమలు కూడా ఈ గుడిపై శిల్పాలుగా చెక్కారు.
ఆశ్చర్యపరిచే శిల్పకళ
ఆలయం శిల్పకారుల యొక్క సంపూర్ణ పనితనాన్ని మన కండ్లకు కడుతుంది. ఆనాటి కాలాన్ని సందర్శకులకు పరిచయం చేస్తుంది. గోడల నుంచి స్తంభాల వరకూ ఎక్కడ చూసినా హిందూ పురాణాలకు సంబంధించి అనేక ఘట్టాలను తెలియజేసే రమణీయమైన శిల్పాలు కనిపిస్తాయి. ఇవి ఎన్నో గాధలను తెలియజేస్తాయి. క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ నిర్మాణాల్లో ప్రతి అణువు అద్భుతంగా అని పిస్తుంది. కాకతీయుల శిల్ప కళాభిమానానికి ఇవి తార్కాణాలు. ఆలయం లో 9 అడుగుల ఎత్తు గల గర్భగుడి లోపల శివలింగాన్ని ఏర్పాటు చేశారు.
నంది విగ్రహం
ఇక్కడ ఆలయానికి ఎదురుగా ఒక పెద్ద నంది విగ్రహం ఉంటుంది. నల్లని రాతితో చెక్కబడిన ఈ నంది విగ్రహం సందర్శకులను ఎల్లప్పుడూ ఆశ్చర్యపరుస్తుంది. ఈ నందికి గొప్ప ప్రత్యేకత ఉంది. ఈ నంది ముందు నిలుచిని ఎటువైపు చూసిన అది మనల్నే చూసినట్టుగా ఉంటుంది. శిలతో కూడా హావభావాలు పలికించ గలిగే నైపుణ్యం ఆనాటి శిల్పులది. యజమాని ఆజ్ఞ కోసం ఎదు రుచూస్తున్నట్టుగా ఒక్క పిలుపుకే లేచి నిలుచునే విధంగా ఒక కాలు లేపి కూర్చున్న ట్టుగా శిల్పులు అద్భుతంగా మలిచారు. అంతే కాదు. మెడలో ఆభరణాలు, సగం ఇసుకలో కూరుకుపోయి నట్టు మెడ గంట రాతితో చేసిన తీరు ఎంతో అద్భుతం... ఎంత వర్ణించించిన ఇంకా మిగిలే ఉంటుంది. అంత అపురూప శిల్పకలా సౌందర్యం దీని సొత్తు...
శాసనానికో మండపం
ప్రతి గుడి నిర్మాణానికీ కొన్ని శాసనాలు ఉంటాయి. వాటిలో కొన్ని పాడవుతుంటాయి. అయితే ఈ గుడికి సంబంధించిన శాసనం పాడవకుండా, ప్రత్యేకంగా ఆలయ ప్రాంగణంలో ఆ శాసనం కోసమే ఒక మండపం కట్టించారు. ఈ శిలా శానంలో ఆలయ నిర్మాణ కాలం నాటి చారిత్రక విశేషాలను వివరించారు. ''నేను ఎవరికైనా శత్రువును కావొచ్చు. కానీ ఈ ఆలయం కాదు. దీన్ని ధ్వంసం చేయొద్దు'' అని ... రామప్ప దేవాలయ నిర్మాత రేచర్ల రుద్రుడు ఆలయ శాసనంలో రాసుకున్న మాటలివి. నిజంగా ఆయన రాసుకున్న మాటలు అక్షరసత్యం. ఇప్పుడు మనం వాడుతున్నామనే అత్యాధునిక సాంకేతికత... అసలేమాత్రం అందుబాటులో లేని కాకతీయుల కాలంలో ఇంతటి మహోన్నత శిల్పకళా వైభవం తీర్చిదిద్దారు. అందుకే రామప్ప దేవాలయం ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు అందుకున్నది.
వారసత్వ సంపదల జాబితాలో చోటు
తెలుగు వారంతా ఆనందపడే తరుణమిది. ఏండ్ల నాటి చారిత్రక సంపదకు దక్కిన అపార గౌరవమిది. రామప్పకు ప్రపంచ వారసత్వ సంపదల జాబితాలో చోటు దక్కిన అపూర్వ సందర్భమిది. దేశవ్యాప్తంగా ఎన్ని కట్టడాలున్నా... రామప్పకే ఈ ఖ్యాతి దక్కిందంటే...ఆ నిర్మాణం...ఎన్ని ప్రత్యేకతల సమాహారమో అర్థం చేసుకోవచ్చు. యునెస్కో బృందం ఈ ప్రాంతాన్ని సందర్శించిన నాటి నుంచి ఇప్పటి వరకు ఈ అంశంపై ఎంతో మేధోమథనం జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలూ...ఈ గుర్తింపు వచ్చేలా చొరవ చూపాయి. ఈ కట్టడంలోని ప్రత్యేక తలను, విశేషాలను వివరిస్తూ... పలు నివేదికలూ అందించాయి. కరోనా కారణంగా ఈ ప్రక్రియంతా కాస్త ఆలస్యమైనా...చివరకు అందరి అంచనాలు, ఆశలను నిజం చేస్తూ అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన తొలి కట్టడంగా రామప్ప పేరు చరిత్ర పుటల్లో నిలిచిపోనుంది. కాకతీయ శిల్ప కళావైభవం ఖండాంతరాలు దాటనుంది
యునెస్కో గుర్తింపు
2020కి వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా ఆమోద ముద్ర
కాకతీయుల శిల్ప కళ ఉట్టిపడే ఈ ప్రాచీన ఆలయానికి ప్రపంచ స్థాయి గుర్తింపు దక్కింది. 2020 ఏడాదికి గాను వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తిస్తున్నట్టు యునెస్కో ప్రకటించింది. ఇటీవల చైనాలోని పుజౌ వేదికగా ఆన్‌లైన్‌లో జరిగిన 44వ వరల్డ్ హెరిటేజ్ కమిటీ మీటింగ్ ఉత్కంఠంగా సాగిన ఓటింగ్‌లో రామప్ప నెగ్గింది. ప్రపంచ దేశాలోని ఎన్నో చారిత్రక కట్టడాలతో పోటీ పడి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది.
దౌత్య పద్ధతిలో 'రామప్ప'కు గుర్తింపు
వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశంలో రూల్ 22.7ను ప్రయోగించి రామప్పను నామినేషన్లలో పరిగణనలోకి తీసుకునేలా రష్యా సహకరించింది. రష్యాకు ఇథియోపియా, ఒమన్, బ్రెజిల్, ఈజిప్ట్, స్పెయిన్, థాయిలాండ్, హంగేరి, సౌదీ అరేబియా, దక్షిణ ఆఫ్రికా తదితర దేశాలు మద్దతు తెలిపాయి. వారసత్వ జాబితాలో చేర్చేందుకు నార్వే వ్యతిరేకించినా రష్యా సహా 17 దేశాల ఆమోద ముద్ర వేయడంతో రామప్పకు ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. ఇప్పటి వరకు 167 దేశాల నుంచి 1,121 కట్టడాలు జాబితాలో ఉన్నాయి.
దేశంలో ఇప్పటి వరకు 38
దేశం నుంచి 1983లో తొలిసారి అజంతా, ఎల్లోరా, ఆగ్ర, పోర్‌్‌ట, తాజ్‌మహల్‌కు యునెస్కో గుర్తింపు లభించింవది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 38 ప్రదేశాలు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ జాబితాలో చేరాయి. 39వది గా రామప్ప యునెస్కో గుర్తింపు పొందింది.
పర్యాటకపరం అభివృద్ధి...
రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా రావడంతో పర్యాటకపరంగా ఎంతో ప్రాధాన్యత సమకూరనుంది. వందల ఏండ్లనాటి ఆలయాన్ని పరిరక్షించడంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలు అభివద్ధి చెందే అవకాశం ఉంటుంది. వ్యాపార రంగం అభివృద్ధి అవుతుంది. అక్కడి చుట్టు పక్కల వారికి ఉపాది దొరికే అశకాం ఉంటుంది. అయితే ప్రస్తుతం రామప్పకు సగటున నెలకు దేశీయ పర్యాటకులు 25 వేల మంది, విదేశీయులు 20 మంది వస్తున్నారు. ఇకపై లక్షల్లో వచ్చే అవకాశం ఉంది. దీన్ని వల్ల అక్కడ కాలుష్యం పెరగకుండా ప్రభుత్వం, ఆలయ కమిటీ సిబ్బంది చర్యలు తీసుకోవాలి.
Sun 01 Aug 05:18:57.932195 2021